- మోదుగు పువ్వు
ఉద్దండులు అడవిని వీడారు
కలిసిరాని కాలం అన్నారు
ఆయుధమే అప్పగించాం
సిద్ధాంతం సజీవం అన్నారు
రాజ్యం విధించిన గడువు తీరిపోయింది
రాజ్యాంగమే చేతుల్లోకి వాలింది
ఇక అంతా ప్రజాస్వామ్యమేనని నమ్మ బలికింది
చదువుకుంది లేదు
కాసింది మేకలు
పోలియో అవిటితనం పైగా అమ్మాయి
అయితేనేం సిద్ధాంతాన్ని నమ్మింది
అడవి బాట పట్టింది
అంచెలంచెలుగా ఎదిగింది
నమ్ముకున్నది తనని తాను
వంచించటం చేతకాదు
దారితప్పుటకు దారులు వెతుక్కోలేదు
మాటలు నేర్చుకోలేదు వక్ర భాష్యాలకు
నేర్చుకున్నదల్లా జనం కోసం అడుగులేయటమే!
చావును ముద్దాడాలనుకుంది
లొంగి పోనని తెగేసి చెప్పింది
పోయే నాడెలా వెళ్ళిందో దాన్ని
కోసమే ఆరాట పడింది చివరంటా
సహచరుడినెలా చంపారో అలాగే చంపమంది
నేను నియమించిన వాళ్ళు చంపబడ్డాక
నేను లొంగిపోతే నేను మనిషినే కాదన్నది !
బలమైన మనోస్థైర్యం ఆమె సొంతం!
చిత్రహింసల చావుని ఆహ్వానించిన
మోదుగు పూవా! ఎర్రెర్రని దండాలమ్మా భాగ్య!!
నీ ప్రస్థానం ఆగదు! ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు!
అదొక నిరంతర అధ్యయనం! పలు అధ్యాయాలు ఇంకా మిగిలే ఉన్నాయి!!
2. ఫోర్త్ సిటీ
హైదరాబాద్ గరీబ్ కి
కూడు గూడు గుడ్డ నిచ్చింది
గల్లీ గల్లీ ల విభిన్న సంస్కృతి భిన్న రుచుల సంగమం!
అందరినీ అక్కున చేర్చుకుంది
బతుకునిచ్చింది బతకనిచ్చింది
సికింద్రాబాద్ సిరులనిచ్చింది
సైనిక పటాలాల స్థావరం అయ్యింది
నాణ్యమైన విద్యనందించింది
ఉపాధి అవకాశాలకు మెరుగులు దిద్దింది
పరిశ్రమలు రెండింటినీ దాటి వూరి చివరిదాకా వచ్చాయ్
డబ్బుతో భూమిని చెరబట్టవచ్చని రాజ్యం భావించాక
సైబరాబాద్ నాటకం మొదలైంది
గుట్టలు చదునయ్యాయి కబ్జాల పర్వం మొదలైంది
నిజాం భూములన్నీ కొత్త రూపు దాల్చాయి
అడ్డికి పావుశేరు చందాన పెట్టుబడికి నేలను అప్పగించారు
ఇక ఇప్పుడు మరో మాయాజాలం తెరపైకి
ఫోర్త్ సిటీ లో ముప్పై వేల ఎకరాలకి రెక్కలు
ఎదిగేది ఎవడు కోల్పోయేది ఎవడు
ప్రచారార్భాటాల తెరలు తీయగా ఒకటి రెండు మూడు మొదలు
ఒంట్లు లెక్కపెట్టే లోపు స్వాహా!
జై కొట్టే నిషా యువత!
ప్రశ్నని సహించని రాజ్యం!
పడకేసిన ప్రజాస్వామ్యం లేచేసరికి దారి ఆగమ్యగోచరం!!
నిధులన్నీ గుమ్ములు నిండగా గుంపులు గుంపులుగా రాజ్య బినామీల స్వైర విహారం!!
దిక్కు తోచని రైతు
కొరవడిన నాణ్యమైన విద్య
ఉపాధి అందని యువత
రోగానికి దొరకని మందు
మందుకి బానిసైన కష్ట జీవి
నల్ల త్రాచుల్లాంటి రహదార్లు ఫోర్త్ సిటీ వైపు
అదే అభివృద్ధి కి గీటురాయంటూ ఊకదంపుడు మాటలు!!
3. నాగరికత
మానవ పరిణామ క్రమంలో
ఎన్నెన్నో మలుపులు
నేల నీరు గాలి చుట్టూ తిరుగుతూ
ఆవాసయోగ్యం గా మలుచుకునే ప్రక్రియలో
మనిషి ముందున్నాడు!
ఎవడో నాశనం చేస్తే కుంగిపోయేది కాదది!!
ఒక మనిషి పోవచ్చు!
కానీ ఏదో మూలన ఎవరో ఒకరు ఉద్భవిస్తూనే వుంటాడు!
శిథిలాల కింద మరుగై పోదేది
వెలికితీస్తే చరిత్ర కి పునాదౌతది!
అణువణువూ నేలకోసం పరితపించే స్థైర్యం
నిలబెడుతుంది నాగరికతను!!
తెల్ల తెంపరితనం హెచ్చరికనుకుంటుందేమో?!
నాలుగు పదుల రోజుల్లో అందంగా పాడే నైటింగేల్ డ్రోన్ల తో విరుచుకు పడుతుంటే గద్దలు నివ్వెరపోయిన దైన్యంలో
పుట్టిన చేతకాని తనమది!!
రేయి పగలు వనరుల ధ్వంసమే ఎజెండా!
ఎవడి వనరును ఎవడు కబళిస్తున్నాడు
పశ్చిమాసియా పై నజర్ ఏ తీరాలకు
రాజరికం పోయి ప్రజాస్వామ్యం పుస్తకాల్లో కులుకుతుంది
ఎన్నెన్నో సమితులు బుట్టదాఖలైన చందం వర్తమానం!
ఆయుధాల వ్యాపారి కి దిమ్మతిరిగే జవాబు
ఆ నాగరికత లోని జొరాస్ట్రియనిజం నేర్పిందే!
మంచి చెడు మధ్య పోరాటంలో
ఏ నాగరికత లేని అనాగరికుణ్ణి చరిత్ర క్షమించదులే!!




