కె.పి అశోక్ కుమార్ (1956) జననం – ప్రాథమిక విద్యాభ్యాసం మచ్చ బొల్లారం., సికింద్రాబాద్. ఇంటర్ వరకు బొల్లారంలో చదివి బికాం సర్దార్ పటేల్ కాలేజ్, సికింద్రాబాద్ లో చేరారు. ఉస్మానియాలో ఆర్కియాలజీ, ఆంధ్రసారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో గ్రంథాలయ సమాచార శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదటి ఐదు సంవత్సరాలు స్పెషల్ టీచర్ గా పని చేశారు. తర్వాత సాంకేతిక విద్యాశాఖలో గ్రంథపాలకుడిగా ఎంపికై, హైదరాబాద్ లోని పాలిటెక్నిక్ లలో 25 ఏళ్లుగా పనిచేసి 2014లో పదవీ విరమణ చేశారు. 2014 – 19 వరకు పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత కొంతకాలం తెలంగాణ సాహిత్య అకాడమీకి కన్సల్టెంట్ గా, ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నారు.
సాహిత్యం, సినిమాలు అభిమాన వ్యాపకాలు.
” హాలీవుడ్ సినిమా, కథావలోకనం, తెలుగులో మారుపేరు రచయితలు, కథావిష్కారం, తెలుగు నవల ప్రయోగవైవిద్యం, అనగనగా ఒక సినిమా, తెలుగు సాహిత్యంలో బిసి నవల” అనే పుస్తకాలను వెలువరించారు.” దళిత గీతాలు, ఎనిమిదవ అడుగు, జాంబ పురాణం, నోబుల్ కవిత్వం, కథ 2017, అంపశయ్య నవీన్ కథలు, జాతశ్రీ కథలు, వివేచన, ముకుంద రామారావు అభినందన సంచిక” అనే పది పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. వందలాది వ్యాసాలు, వెయ్యి కి పైగా హాలీవుడ్ సమీక్షలు, దాదాపు మూడువేల పుస్తక సమీక్షలు చేసి రికార్డు సృష్టించారు. తెలంగాణ కథా సాహిత్యం మీద ప్రత్యేకంగా విమర్శనాత్మక వ్యాసాలు రాస్తున్నారు. అందులో భాగంగా ” తొలితరం తెలంగాణ కథకులు- కథనరీతులు” , ” మలితరం తెలంగాణ కథకులు- కథనరీతులు” తీసుకు వచ్చారు. త్వరలో “తెలుగు నాటక విమర్శ”,” పరంపర”( సాహిత్య వ్యాసాలు), “ప్రముఖుల పరిచయ వ్యాసాలు” పుస్తక రూపంలో రానున్నాయి.
*
‘మాట్లాడే పుస్తకాలు’ శీర్షికన ఈ సంచికలో.. ఇలా వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు..
*
1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి.
జవాబు: నా ఆరవయేట, మూడవ తరగతి (1961) చదువుతున్నప్పుడు క్లాసులో వెంకట్రావు అనే మిత్రుడు చందమామ తెచ్చి చదువుకుంటున్నాడు. పక్కనే ఉన్న నేను ఆ పుస్తకం లోని బొమ్మలు చూసి బతిమిలాడి తీసుకున్నాను. రంగుల్లో ఉన్న బొమ్మలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. వరుసగా చదువుకుంటూ పోతే అర్థం కాలే. ఈ సంగతి మా మిత్రుడికి చెబితే ఒక మొట్టికాయ వేసి ముందు ఎడమవైపు ఉన్న భాగాన్ని చదువు. ఆ తర్వాత కుడి వైపు ఉన్న భాగాన్ని చదవమని చెప్పాడు. బిగ్గరగా కాకుండా లోపల లోపల ఎలా చదవాలో నేర్పించాడు. ఆ పుస్తకం కావాలని బతిమాలగా మరుసటి రోజు తెచ్చివ్వాలని చెప్పాడు. ఇంటికి పోయి నా పనులన్నీ పక్కనపెట్టి ఒక్క ఊపులో చదివేశా. వాడినే బ్రతిమాలి ఇంకా ఏమైనా పుస్తకాలు ఇమ్మని అడిగా. వాళ్ళ నాన్నగారు రైల్వేలో పని చేసేవారు. వారి లైబ్రరీలో డిటెక్టివ్ పుస్తకాలు పుంఖాను పుంఖాలుగా ఉండేవి. ఆయన వారానికి రెండు డిటెక్టివ్ లు తెచ్చేవాడు. ఒకసారి వెంకట్రావు “ప్రతిక్షణం ప్రాణగండం” అనే డిటెక్టివ్ తెచ్చాడు. రచయిత ఎవరో జ్ఞాపకం లేదు. వాడు ఇంటికి ఇవ్వనంటే ఇంటర్వెల్, అన్నం బెల్ కు కూడా ఇంటికి పోకుండా స్కూల్లోనే ఉండి చదివేశా. అదే నా మొదటి డిటెక్టివ్ పుస్తకం. మెల్లగా వెంకట్రావును మచ్చిక చేసుకుని వరుసగా డిటెక్టివ్ లు చదవడం ప్రారంభించా.
మాకు కిరాణా షాప్ ఉండేది. సాయంత్రం రద్దీగా ఉండటంతో మా నాన్నకు సహాయంగా దుకాణంలో కూర్చోవలసి వచ్చేది. వస్తువులను జోకడం (తూచడం) ,పొట్లాలు కట్టడం, లెక్కలు వేయడం, కిరోసిన్ పోసే పని కూడా నాదే. ఆటలాడటానికి వెలితే వెతికి పట్టుకొచ్చి నాలుగు తన్ని దుకాణంలో కూర్చోబెట్టేవారు. దాంతో ఆటలకు, తిరగడాలకు దూరమయ్యాను. ఆంధ్రప్రభ, రీడర్స్ డైజెస్ట్ ,భవాన్స్ జర్నల్ లాంటి పత్రికలతో పాటు అప్పుడప్పుడు చినిగిపోయిన పుస్తకాలు కూడా చిత్తుకాయితాలుగా మాకు అమ్మేవారు. మాకు అవి పొట్లాలు కట్టడానికి పనికివచ్చేవి. మా నాన్నగారు సరుకులు తేవడానికి వెళ్లినప్పుడు దుకాణంలో నేను కూర్చోవలసి వచ్చేది. నేను మొదటి నుండి హైపర్ యాక్టివ్ గా ఉండేవాన్ని. గిరాకీ లేకపోతే బోర్ కొట్టేది. ఎక్కడికి కదలడానికి వీలు లేదాయె. నా సీటు వెనకాల ఉండే చిత్తు కాగితాలలో నుండి ఆంధ్రప్రభ వారపత్రిక తీశాను. అందులో సినిమా ప్రభ శీర్షికన కొత్త సినిమాల షూటింగ్ వివరాలతో పాటు, ఆ సినిమా తాలూకు సంభాషణలను ఇచ్చేవారు. నేను ఆసక్తిగా చదివేవాడిని. చివరికి పాలుబోక ఉత్తరాల నుండి మొదలుకొని కొత్త పుస్తకాల వరకు మ్యాగజైన్ క్షుణ్ణంగా చదివేవాడిని అట్లా పత్రికలు చదవడం అలవాటైంది.
నాలుగవ తరగతి నుండి నవలలు చదవడం ప్రారంభమైంది.
1965లో మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఆల్వాల్ శాఖా గ్రంధాలయాన్ని తెరిచారు. మెంబర్ షిప్ తీసుకుంటే పుస్తకాలు ఇస్తారని తెలిసి వెళ్లాను. ఐదు రూపాయలకు కార్డు ఇస్తారు .కార్డు మీద ఒక పుస్తకాన్ని ఇష్యూ చేస్తారు. నేను మా దుకాణంలోంచి ఐదు రూపాయలు ఎత్తుకొచ్చి మెంబర్ను అవుతాను అంటే ఆ లైబ్రరియన్ ఒప్పుకోలేదు. పొట్టిగా చెడ్డీ వేసుకొని ఉన్న చిన్న పిల్లవాడిగా భావించి, మీ పెద్దవాళ్లను తీసుకొస్తేనే మెంబర్షిప్ ఇస్తానని పేచి పెట్టాడు. మా బస్తీలో బేవార్స్ గా తిరిగే ఒక చిన్న సైజు రౌడీని బతిమాలితే వాడు వచ్చి లైబ్రేరియన్ ని బెదిరించి నాకు మెంబర్షిప్ ఇప్పించాడు. దాంతో కార్డు మీద ఒక పుస్తకం తీసుకోవడం- స్కూల్ కు వెళ్లడం, దుకాణంలో పనిచేసుకుంటూనే చదివి, మార్చుకోవడానికి రెండు రోజులకొకసారి లైబ్రరీకి వెళ్లేవాడిని. విసుక్కునే స్థితి నుండి లైబ్రేరియన్ భయపడే స్థితికి వచ్చాడు, నా వేగం చూసి. తెలివైన విద్యార్థిగా నన్ను చేరదీసిన మా తెలుగు పండిత్ రామాచారి సార్ స్కూల్ లైబ్రరీ ఇంచార్జ్ కూడా. ఎప్పుడు ఆయన వెంట తిరిగి విసిగించి, వేధించి మొత్తానికి మా స్కూల్ లైబ్రరీ నంతా చదివేశా. నాలాంటి అభిరుచి కలిగిన మిత్రులు ఏర్పడటంతో పుస్తకాలను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా పుస్తకాలను సేకరించి చదవగలిగాను.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ కింద, ఎదుట, దిగువన అద్దె గ్రంథాలయాలు ఉండేవి. ఇంట్లో తెలియకుండా రోజు సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల లోపు సైకిల్ కాంచి తొక్కుకుంటూ, సికింద్రాబాద్ వచ్చి రెండు డిటెక్టివ్ పుస్తకాలను తీసుకుని పోయేవాడిని. రోజుకు ఆరు పైసలు చొప్పున దానికి అద్దె. ప్రతిరోజు సైకిల్ మీద వెళ్లి పుస్తకాలు మార్చుకునేవాడిని.
1970లో బియ్యం వ్యాపారి కొడుకు బి. యాదగిరి స్నేహంతో కొత్త కొత్త డిటెక్టివ్ పుస్తకాలు చదివేవాడిని. అతనే వెంటపడి కాలేజీకి వెళతావు, ఇంగ్లీష్ నేర్చుకో అని ముందుగా కామిక్స్ పరిచయం చేశాడు. టార్జాన్, మాండ్రెక్స్ కామిక్స్ ను డిక్షనరీ సహాయంతో ఎలా చదువుకోవాలో చూపించాడు. తర్వాత జేమ్స్ హార్డీ చేజ్, నిక్ కాటన్ డిటెక్టివ్ లు రెండు మూడు చదివించాడు. డిక్షనరీ సహాయంతో చదవడం, చాలా సమయం తీసుకోవడంతో విసుగొచ్చి వదిలేసాను.
1973లో పరిచయమైన మిత్రుడు మొగుళ్ళ సంజీవరెడ్డి విస్తృతంగా చదివేవాడు. నాకు రాహుల్ సాంకృత్యాయన్ ను మొదటిసారిగా పరిచయం చేశాడు. అనువాద నవలల గొప్పతనం చెప్పాడు. సాహిత్యాన్ని టైంపాస్ గా కాదు. ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి చదవాలని చెప్పేవాడు. చరిత్ర, సామాజిక శాస్త్రాలు, జనరల్ బుక్స్ కూడా చదవాలని చెప్పడంతో అవన్నీ చదువుతూ నేను విస్తృత పాఠకుడిగా తయారయ్యాను.
1973లో బీకాం చదవడానికి సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో చేరాను .సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ఎదురుగా ఉన్న సుభాష్ చంద్రబోస్ పార్క్, పార్క్ మధ్యలో ఉన్న భవనంలో సికింద్రాబాద్ శాఖా గ్రంధాలయం ఉండేది. అందులో మెంబర్ గా చేరా. అక్కడి లైబ్రేరియన్ టి. యాదగిరి తో ఏర్పడిన స్నేహం వల్ల నాకు కావలసిన పుస్తకాలను వివిధ శాఖ గ్రంథాలయాలనుండి తెప్పించి ఇప్పించేవాడు.
నేను చదివిన కాలేజీ గ్రంథాలయాలు ,యూనివర్సిటీ గ్రంథాలయాలను- హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని శాఖా గ్రంథాలయాల్లో మెంబర్గా చేరి చాలా పుస్తకాలను చదివేయగలిగాను. కొత్త పుస్తకాల కోసం అద్దె లైబ్రరీల నుండి తెచ్చుకునే వాడిని. పఠనాసక్తి కలిగిన మిత్రుల నుండి పుస్తకాలను మార్పిడి ద్వారా, నాకు తెలియని వాటిని సేకరించుకొని మరి చదివేవాడిని.
2. మీరు పుస్తకాలను ఎంపిక చేసుకునే పద్ధతి.. సేకరించే విధానము.. భద్రపరిచే పద్ధతులు….
జవాబు: నేను రెగ్యులర్ రీడర్ ని కాబట్టి, ఎవరు ఎలా రాస్తారో తెలుసు కాబట్టి, వాటి ఆధారంగా ఎంపిక చేసుకుంటాను. పుస్తకాల సమీక్షలు కూడా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి .
కొత్త పుస్తకాల కోసమే నేను పుస్తక సమీక్షకుడిగా మారాను. అలా పత్రికల నుండి వచ్చే పుస్తకాలు, కాంప్లిమెంటరీ కాపీలు, డిస్కౌంట్ సేల్స్, ఫుట్ పాత్ మీద వెతికి పట్టుకోవడం చేస్తుంటాను. ఇప్పుడు ఆన్లైన్లో, టెలిగ్రామ్ లో కూడా వెతికి పిడిఎఫ్ లు సేకరించి తీరుబడిగా చదువుకుంటాను.
పుస్తకాలన్నింటినీ నేను ప్రత్యేకంగా చేయించుకున్న బుక్ సెల్ఫ్ లలో ప్రక్రియల పరంగా విభజించి పెట్టుకుంటాను. అందులోంచి పుస్తకాలను తీసేటప్పుడు గాని, అదనంగా చేర్చే టప్పుడు గానీ ఆ రాక్ నంతా సర్దుతుంటాను. ఆర్నెల్లకొకసారి పుస్తకాలని దులిపే కార్యక్రమం పెట్టుకుంటాను. పుస్తకాల వెనుక నాఫ్తాలిన్ ఉండలు వేస్తాను. వాటి ఘాటుకు సిల్వర్ ఫిష్ కానీ, చెదలు కానీ ,బొద్దింకలు గాని రాలేవు.
3. మీరు చదవాలనుకుని చదవలేకపోయిన లేదా సేకరించాలనుకుని సేకరించలేకపోయినా పుస్తకాల గురించి….
జవాబు: దాదాపుగా లేవనే చెప్పాలి.
4. ఎంతో ఇష్టమైన, మీరు పోగొట్టుకున్న పుస్తకాల గురించి…..
జవాబు: చాలా పుస్తకాలను చదివిస్తామని మిత్రులు తీసుకెళ్లి మళ్ళీ ఇవ్వరు. నా దగ్గర ఉన్న అరుదైన పుస్తకాలను రీసెర్చ్ స్కాలర్స్ కు ఇచ్చి పోగొట్టుకున్నాను. అందుకని ఇప్పుడు ఎవరిని రానివ్వడం లేదు. ముఖ్యంగా బంకింబాబు వ్రాసిన” శ్రీకృష్ణ చరిత్ర” అనువాద గ్రంధం, కుందుర్తి సంకలనం చేసిన “ఆధునిక కవిత” నేను చదవకుండానే ఇతరులకు ఇచ్చి పోగొట్టుకున్నాను. అలాగే నేను అపురూపంగా చూసుకునే ఆలూరి బైరాగి కథల సంపుటి “దివ్య భవనం”( 1951) నమ్మి ఒక మిత్రుడికిచ్చి పోగొట్టుకున్నాను. వీటి గురించి తలచుకున్నప్పుడల్లా బాధ వేస్తుంది.
5. మీకు ప్రాణ సమానమైన పుస్తకాల గురించి…
జవాబు: వాటన్నింటిని అపురూపంగా దాచుకుంటాను
6. ఏ సమయంలో ఎలా ఎక్కడ మీరు పుస్తకాలను చదివే పద్ధతుల గురించి …
జవాబు: ఏమాత్రం ఖాళీ దొరికినా చదువుకోవడమే. పుస్తకాలు చదవడం కోసమే కొన్నేళ్లపాటు లోకల్ రైళ్లలో ప్రయాణం చేశాను. ఇప్పుడు బస్సుల్లో కూడా చదువుకుంటాను. బస్ స్టాండ్ల లో, ఆసుపత్రిలలో, ఆఫీసులలో వెయిటింగ్ లో ఉండేటప్పుడు – అలాగే ప్రయాణాలలో కూడా చదువుకుంటాను. ఎప్పుడూ నా వెంట ఉండే బ్యాగులో పుస్తకం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఖాళీ దొరికినా చదువుకుంటాను.
7. మీరు మీ జీవితంలో పుస్తకాలను చదవడం వల్ల వచ్చిన మార్పుల గురించి….
జవాబు: పుస్తకాలు చదవడం వల్ల అమాయకత్వం, భోళాతనం పోయి లోకజ్ఞానం అలవడింది. అవకాశవాదం, మోసకారితనాలను దగ్గరకు రానివ్వలేదు. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు అతీతంగా మసులుకున్నాను. ప్రజల పట్ల ముఖ్యంగా పేదలు, అసహాయుల పట్ల సానుభూతితో పాటు సహాయపడే గుణం అలవడింది. ఒక మనిషిగా నిలదొక్కుకోవడానికి పుస్తకాలే నాకు సహకరించాయి.




