పిట్టలు పాడుతూనే ఉంటాయి
రాలిపోయిన ఆకుల నునులేత స్పర్శను తలచుకునో
చెట్లను మోళ్లను చేసిన వడగళ్ల వానల జ్ఞాపకాలతోనో
దుఃఖమో ఆనందమో దుమారమో ఆహ్లాదమో
పిట్టలు పాడకుండా ఉండలేవు
పాడుతూనే ఉంటాయి
కళ్ల ముందరి సుడిగాలికీ మండుటెండకూ
వేలాది పిట్టలు నేలరాలినా
చూస్తుండగానే ఖాకీ వేటగాళ్లు
అడవి అడవి మీదంతా జల్లెడ కప్పి
కొన్ని పిట్టల్ని కాల్చికూల్చి
కొన్ని పిట్టల్ని పట్టి పంజరాల్లో పెట్టినా
పంజరాల పిట్టలు వేటగాడి మాటలే పాడుతున్నా
కొన్ని పిట్టలు అంతే, ఇంకా పాడుతూనే ఉన్నాయి
ఎక్కడో కురిసిన తొలికారు చినుకులకు
ఇక్కడి మట్టి పరిమళిస్తున్నప్పుడు
ఆనందంతో కిలకిలలాడిన పిట్టలు
ఇంతకాలం అణగారిన గడ్డిపోచలు
లేచినిలిచి పిడికిళ్లెత్తినప్పుడు
గాలిలో కిచకిచల నినాదాల్ని ఎగరేసిన పిట్టలు
దిక్కుదిక్కులా ఎర్రెర్రని పూలు వికసిస్తున్నప్పుడు
పాటల ఊరేగింపులు తీసిన పిట్టలు
శిశిరం మూసుకొచ్చి, గ్రీష్మం మండిపోయి
నేల ఎడారి అయిపోతున్నప్పుడూ
పాటలు ఆపని పిట్టలు
మూర్ఖత్వం అంటావేమో
పాట పిట్టల సహజాతం కదా, జీవితం కదా
పాట ఆగినా, పాటలో అపస్వరం పలికినా
పిట్ట జీవం కోల్పోయినట్టే
గతమూ వర్తమానమూ భవిష్యత్తూ
కలగలిసిన చరిత్ర సారం పిట్ట పాట
(మే 30, 2026)
Related