జైలు కథలు అనగానే నాకు ఎప్పుడో స్వతంత్ర సమయంలోనో, తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనో వెలువడిన కథలు అవ్వొచ్చు అనే ఆలోచన ఉండేది. మొదటిసారి బి. అనూరాధ గారి పుస్తకం హజారీబాగ్ జైలు కథలు చదివినప్పుడు “ఓహో నేను పుట్టిన తర్వాత కూడా జైలు కథలు వచ్చాయి, అవి నా కాలానికి సంబంధించిన జైలు కథలే” అనే అంశం మెదలగానే ఒకింత ఆశ్చర్యం మరో వైపు జైలు కథల్లోని పాత్రల జీవితాలు విస్మయానికి గురిచేశాయి. రచయిత్రి అనూరాధతో నాకు వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఆమె కథల్లోనే ఒక గంభీరమైన వ్యక్తిత్వంగా నా మనసులో ముద్రించుకుపోయారు. హజారీబాగ్ జైలు కథలు పుస్తకం గురించి నేను మరోసారి రాస్తాను కానీ, అనూరాధ రాసిన ఇంకో కథా సంపుటి “అవ్వునా నువ్వు దళిత్ వా” పుస్తకం గురించి ముందు మాట్లాడాలి. అయితే అన్నిటికంటే ముందు, రచయిత్రి బి. అనూరాధ ఒక రాజకీయ రచయిత్రిగా నన్ను చాలా ఆకట్టుకున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆమె కథల్లో రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలే కథలైన సందర్భాలూ ఉంటాయి. ఒక్కమాటలో ఆమె కథల్లో జీవితం ఉంటుంది. ఆ జీవితాలను చదివాక మనమూ రాజకీయీకరించబడితే ఆమె తప్పు కాదది!
ఒక జర్నలిస్టుగా నా స్టోరీస్ ఎక్కువగా దళితుల జీవితాల చుట్టూ, అప్పుడప్పుడూ ఆదివాసుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నా వృత్తిలో భాగంగానే మారుతున్న కాలానికి అనుగుణంగా కులం అనే అంశం ఎన్ని రకాలుగా రూపాంతరం చెందింది అనేది తెలుస్తూ వచ్చింది. అయితే బయటి సమాజంలో కులం తాలూకు అనుభవాలు చాలా సాధారణమైన అనుభవాలుగానే మిగులుతాయి. కానీ జైల్లో కులం ఎలా పనిచేస్తుంది అనే అంశం నన్ను
బి. అనూరాధ పుస్తకాలను చదవడానికి ప్రేరేపించింది. ఈ పుస్తకం విషయానికి వస్తే, 19 కథల సమాహారమైన ఈ పుస్తకం రచయిత్రి జీవితంలోని సంఘటనలుగా మనం అర్థం చేసుకోవాలి. నేను ఈ రివ్యూతో స్పాయిలర్ గా ముద్ర వేసుకోదలచులేను. కేవలం కొన్ని కథల గురించి, అదీ పైపైన మాత్రమే ప్రస్తావిస్తాను. పుస్తకం చదివి పూర్తి కథల సారాన్ని అనుభవం చేసుకోవాల్సిన బాధ్యత మీదే!
బలమైన మహిళా పాత్రలు కలిగిన అవ్వునా నువ్వు దళిత్ వా పుస్తకం మొదటి కథ నుంచే సమాజంలోని కులం అనే మానసిక రోగం ప్రభావం మొదలవుతుంది. కుక్క బతుకే నయమా? అనే ఈ కథ మొదలవ్వడమే నాలో ఒక ప్రశ్నను రేకెత్తించింది. ఒక దళిత ఇంట్లోంచి పంచధార అరువు తీసుకుంటే లేని కులం, అదే దళిత పిల్ల, తమ ఇంట్లో ఈ అడుగుపెట్టేసరికి గుర్తొచ్చేస్తుంది. సుబ్బలక్ష్మి అనే పాత్ర కుక్కని తరిమినట్టు బేబీని తరిమినప్పుడు… నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. బేబీని బామ్మ నుంచి కాపాడాలి అనే సదుద్దేశంతో సుబ్బలక్ష్మి బేబీని కుక్కతో పోల్చినా… అరే ఇంట్లోకి కుక్క వచ్చినా భరించే మనుషులు ఒక దళిత పిల్ల వస్తే భరించలేకపోతారు అనేది లోపలి మనిషిని తొలిచేసే మరో ప్రశ్న!
నిజానికి ఇలాంటి చేదు ఘటనలు ఏదో ఒక రూపంలో దాదాపు ప్రతీ దళిత వ్యక్తికీ అనుభవంలోకి వచ్చే ఉంటాయి. అయితే చిన్నప్పుడే ఇలాంటి వివక్షలు ఎదురవడం వలన చిన్న మనసుల్లో ఏర్పడే గందరగోళం, న్యూనతా భావం, మొదలైన ప్రతికూల భావాలు చిన్నారుల మనసులను తీవ్రంగా బాధించడమే కాక, వారి జీవితంపై అత్యంత దుష్ప్రభావం చూపిస్తాయి.
ప్రతిసారీ కుల వివక్ష అనేది డైరెక్ట్ అటాక్ గానో, ముఖం మీద లాగి పెట్టి కొట్టినట్టుగానో మాత్రమే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు పొగుడుతున్నట్టుగానే ఉంటూ వివక్ష భావాలను వెళ్లగక్కడం అనేది మరో విధమైన పైత్యం. అలాంటివి రచయిత్రి ఈ కథల్లో పెట్టగలిగింది. ముఖ్యంగా టైటిల్ స్టోరీ అయిన “అవ్వునా? నువ్వు దళిత్ వా” అనే కథ ఈ కోణంలోకే వస్తుంది. రచయిత్రి కుటుంబ నేపథ్యం వలనో, తన డ్రెస్సింగ్ సెన్స్ వలనో, తన పుస్తక పఠనం వలనో, తన మేధో సంపత్తి వలనో జీవితంలో ఎన్నోసార్లు తను “అవ్వునా? నువు దళిత్ వా?” అనే ప్రశ్న ఎదుర్కొంది.
అంటే ఈ సమాజం దృష్టిలో దళితులు అయితే ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదు, తెల్లటి బట్టల్లో అసలే ఉండకూడదు, ఎక్కువగా చదువుకోవద్దు, మంచి లోకజ్ఞానం కలిగి, అన్నిట్లో చురుగ్గా, ప్రతిభతో ఉండకూడదు. ఒకవేళ ఇలా ఎవరైనా దళితులు ఉన్నారంటే… ఈ సమాజం వెంటనే వాళ్లను బ్రాహ్మణీకరించబడిన దళితులుగా లేబుల్ చేసి, కొత్త రకమైన వివక్షను చూపిస్తుంది. వాళ్ళ ఆశ్చర్యంలో “అసలు దళితులు ఇలా ఉండొచ్చా? నువు ఇలా ఉన్నానంటే నీ పుట్టుక వెనుక ఏదో ఉంది” అనే ఒక అనుమానం అంతర్లీనంగా ఉంటుంది. సమాజం దళితులను బలహీనులుగా, బానిసలుగా తప్ప నాగరీకులుగా ఊహించుకోవడానికి సిద్ధపడదు. అలాంటి దళితులు ఎదురైనా వాళ్లను సహించదు. అందుకే ఈ సమాజం దళితులకు భాష, కట్టుబొట్టును నిర్ణయించి ఆ గిరిదాటి బయటకు రాకుండా చుట్టూ కులం కట్టుబాట్ల ఉచ్చు బిగిస్తూ ఉంటుంది. నిజానికి “నువు బ్రాహ్మణీకరించబడ్డ దళిత్” అనే మాట రచయిత్రిని కూడా తీవ్రమైన కోపానికి దారి తీస్తుంది. దానికి సమాధానంగా మనం రచయిత్రి ఆలోచనని అర్థం చేసుకోవచ్చు. ఏ బ్రాహ్మణ భావజాలం మీద అయితే తిరుగుబాటు చేస్తున్నామో ఆ భావజాలాన్ని అంటగట్టి, పొగడ్త రూపంలో వివక్షను ముఖాన చల్లుతారు.
దాదాపు తన కథల్లో రచయిత్రి దృష్టికోణం మహిళ కేంద్రంగా ఉంది. అది కులం గురించి చెప్పినా, జైలు జీవితంలో మహిళలపై జులుం గురించి చెప్పినా, చట్టం తెలియని అమాయకత్వంతో జీవితాన్ని అగాధంలో పడేసుకున్న తెలియనితనం గురించి చెప్పినా స్త్రీ కోణంలో కథను నెరేట్ చేయటంలో రచయిత్రి నిబద్ధత మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రాజ్యం చేస్తున్న ఆగడాలను కూడా మహిళా కేంద్రంగా చూపడం నాకు బాగా నచ్చింది. ఇదే పుస్తకంలో మూడు కథలను నేను ఇక్కడ ప్రస్తావిస్తాను.
రాజ్యం అంటే ప్రస్తుతం బీజేపీ, 12 ఏళ్ల క్రితం ఎన్నో ఊరింపులతో, పదిహేను లక్షల పైసా లాలూచీ కలిగించి సామాన్యుడికి ఆశల రెక్కలు తొడిగి అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన వైఖరిని చాయ్ వాలీ కథలో చూడొచ్చు. “చాయ్ అమ్ముకునేవాడిని, నేను సాధారణ మనిషిని” అంటూ… “ఒక్కో మెట్టు ఎదుగుతూ రాజకీయాల్లోకి వచ్చాను” అంటూ సామాన్యులను ఆకట్టుకునే ప్రయత్నంలో మోడీ విసిరిన మాటల మాయాజాలంలో ఒక చాయ్ వాలీగా చిట్టెమ్మ ట్రాప్ అయిపోయింది. ‘నాలాగే చాయ్ అమ్మి పైకి వచ్చాను అన్నాడు కదా… నాలాంటి సామాన్య దిగువ మధ్యతరగతి సమస్యలకు పరిష్కారం ఇస్తాడు’ అనుకున్న చిట్టెమ్మ జీవితాన్ని మోడీ సర్కార్ రాత్రికి రాత్రి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఎలా చిన్నాభిన్నం చేసిందో ఈ కథలో చూడొచ్చు. చాయ్ అమ్మిన వాడి చేతిలో దేశాన్ని పెట్టిన మొదలు ఇప్పటి దాకా సామాన్యుడి జీవితం చితికిపోయిన సందర్భాలు మన మనసులో మెదులుతాయి ఈ కథ చదువుతుంటే. అప్పుడు మన చుట్టూ ఉన్న చిట్టెమ్మలు మన కళ్ళ ముందు కదలాడతారు.
భక్తుల్లో అంధ భక్తుల రూటే సెపరేటు! ఇంతకీ అంధ భక్తుల ఎవరయా అంటే గుడ్డిగా దేన్నైనా అనుసరించేవాళ్ళు అనే విషయం అర్థమవ్వాలి, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ అర్థాన్ని మారుస్తూ, బీజేపీ పార్టీ స్వయంగా అంధ భక్తుల ఫ్యాక్టరీగా మారిపోయి, అంధ భక్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త నిర్వచనాన్ని ఇచ్చుకుంది! ‘అనగనగా ఒక అంధ భక్తుడు’ అనే కథలో రమేష్ అనే ఒక అంధ భక్తుడి గురించి చదివాక రాజ్యం చేసే కుట్రలు, ప్రజలపై ఆ కుట్రల ప్రభావాలు అర్థం అవుతాయి. నేనొక చోట చదివాను… ‘ప్రజలను మూర్ఖులను చేయడమే రాజ్యం పని, ప్రజలు చైతన్యవంతమైతే, ప్రభుత్వాల ఆగడాలు సాగవు’ నిజమే! అందుకే కదా బీజేపీ రమేశ్ లాంటి వాళ్లను తయారుచేసింది! మతం, రాజకీయం కలిపికొట్టి మనుషుల రక్తం పీల్చడం, సమాజంలోని శాంతిభద్రతలను కాలరాయడం అనేవి ఈ రాజ్యం లక్ష్యాలు! ఇలా చేస్తేనే దాని వాటి పబ్బం గడిచేది!
చలిచీమలు అనే కథ చదువుతుంటే నా బ్రెయిన్ లో కేంద్ర మంత్రి అమిత్ షా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో పాటు ప్రొఫెసర్ జీ. సాయిబాబా మెదిలారు. మేధావులు పుస్తకాలు రాసినా, ఉపన్యాసం ఇచ్చినా, చిన్న ఆర్టికల్ రాసినా, ఆఖరికి సామాన్యులతో మాట్లాడినా అది ఉగ్రవాదచర్యగానే చూస్తుంది రాజ్యం. బీజేపీ అయితే ఇక మేధావులు ప్రేమ లేఖలు రాయడాన్ని కూడా దేశద్రోహం కిందనే జమ కడుతుంది అనే విషయాన్ని ఈ కథ చెబుతుంది. ఈ కథలో నాకొక వాక్యం బాగా ఇష్టం…
“ప్రేమగా ఉత్తరాలు రాసుకోవడం కూడా ప్రమాదకరం అని నాకు ఇప్పటి దాకా తెలియదు!”
ఆ వాక్యం చదివాక నాకు అనిపించింది… ‘విప్లవం అన్నా ప్రేమ అన్నా ఈ రాజ్యానికి ఎంత కళ్ళ మంటో కదా!’
జీవన మాధుర్యం, అందమె ఆనందమా అనే రెండు కథలూ ప్రత్యేకమైన విషయంపై చర్చ పెడతాయి. అసలు అందానికి నిర్వచనం ఏంటి? అందానికి కొలమానాలను నిర్ణయించింది ఎవరు? ఇంతకీ గౌరవాన్ని అందానికి ముడిపెట్టింది ఎవరు? కాస్మెటిక్స్ అడ్వర్టైజ్మెంట్ పెంచుతున్న మానసిక రోగాల గురించి, తీస్తున్న ప్రాణాల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? సమాజం విస్మరించిన పెద్ద విషయం ఈ మార్కెట్ మాయాజాలంలో బ్యూటీ స్టాండర్డ్స్ చేస్తున్న విధ్వంసం అనేది నేను బలంగా నమ్ముతాను. ఒక మోస్తరు అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉన్న అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే సమాజం పెట్టే శీల పరీక్ష గురించి బహుశా మనం ఎప్పుడూ ఆలోచించలేదు!
ఈ రోజుల్లో స్త్రీ పురుష బాధ్యతల్లో చాలా ప్రోగ్రెస్ వచ్చింది, అబ్బాయిలు కూడా వంట చేస్తున్నారు అని మాట్లాడుకుంటాం కానీ ఇంకా ఈ ఇంటి పనుల వ్యవహారాల్లో పురుషుల బాధ్యత విషయం ఎటూ తేలని అంశంగానే ఉంది. మగాడు ఒక పూట వంట చేస్తే ఆహా ఓహో అనే సమాజం, అదే ఆడది రోజూ గొడ్డు చాకిరీ చేసినా ఆమె బాధ్యతగా చూస్తుంది తప్ప ఆమె శ్రమను గౌరవించదు! ఆ మాటకొస్తే, ఏ ఇంట్లో అయితే మగాడు ఇంట్లోపనులు చేస్తాడో ఆ ఇంటి మహిళను చాలా ప్రోగ్రెసివ్ మహిళలు కూడా విలన్ గా చూస్తారు. ఆ పురుషుడిపై జాలి చూపిస్తారు! ప్రోగ్రెసివ్ సంఘాల్లో కూడా ఉండే ఈ గుణాన్ని రచయిత్రి బాగా ఎత్తిచూపింది! ఇక్కడ నేను మనువాదాన్ని గుర్తుచేస్తాను! సరే, ఇతర మతాలు కూడా మీరు గుర్తుచేసుకోవాలి అది మీ బాధ్యత! ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కి… అంటే మహిళల్లో అంతర్లీనంగా పాతుకుపోయిన పురుషాధిపత్య ధోరణి, మహిళను తానే ఒక బాధితురాలు అనే విషయాన్ని మర్చిపోయేంతగా ప్రభావితం చేసింది. అందుకేనేమో ఆడదానికి ఆడదే శత్రువు అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది!
బి. అనూరాధ కథల్లో ఎన్నో వాక్యాలు, వాటిలోతుల్లోని భావాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. తను భాగం అయిన ప్రగతిశీల రాజకీయాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను, ఆధిపత్య వర్గ, కుల, పురుషాధిక్య భావాలను ఎక్స్పోజ్ చేయడం రచయిత్రి నిజాయితీకి నిదర్శనం. ప్రివిలేజెస్, ప్రివిలేజ్ స్టాండర్డ్స్ అనేవి వర్గాన్ని బట్టి, కులాన్ని బట్టి ఎలా మారతాయి అనే అంశాలను కూడా ఈ కథలు ఎత్తిపడతాయి! కాబట్టి చివరగా నేను చెప్పేదేంటి అంటే… చదవాల్సిన పుస్తకాలను మిస్ అయితే చాలా కోల్పోతాం! Happy Reading!
ఇట్లు
విప్లవశ్రీ




