ఈసారి రికార్డు స్థాయిలో వేసవి ఎండలు జనాన్ని ఫ్రై చేసి పడేశాయి. వాన చినుకు కోసం రైతులే కాదు, చిత్తడిని విసుక్కునే నగరవాసులూ ఎదురుచూశారు. జూన్ వచ్చింది, పోయింది కానీ ఆశించిన వర్షం కురవలేదు. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమవుతాయని, సగటు వర్షపాతం తగ్గే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization- WMO), భారత వాతావరణ శాఖ (India Meteorological Organization- IMO) చెప్పినట్లుగానే జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడ్డాయి, దీని ప్రభావంతో రుతుపవనాలకు అంతరాయం ఏర్పడి, వర్షపాతం తగ్గుతుందని వాతావరణ నిపుణులు ప్రకటించాక ‘ఎన్ నినో’ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. రాయలసీమ వంటి ప్రాంతాల ప్రజలకు అడపా దడపా వర్షాలు ఫెయిలై కరువులు రావడం మామూలే. వలసలూ అలవాటే. కానీ ఈ ఎన్ నినో ఏమిటి కొత్తగా, అంటే ఇది కొత్తదేం కాదు, ఇదొక సహజ వాతవరణ సరళి (Climate Pattern). అంటే భూ వాతావరణంలో ఎల్ నినో రావడం సాధారణమే. కానీ ఇప్పుడు దీన్ని సాధారణంగా తీసుకోడానికి లేదు. ఎలాగంటే మనకు ఎండలు, వేడి వాతావరణం సహజం. కానీ ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయన్న వాస్తవం పక్కన పెట్టడానికి లేదు. “వాతావరణం మారలేదు, మనమే మారాము” అని ప్రధాన మంత్రే కామెంట్ చేసినా దాన్ని ఎవరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే పర్యావరణ విధ్వంసం నిజం, వాతావరణ మార్పు నిజం. ఇది జనం కామన్సెన్స్లో భాగమైంది.
వాతావరణ మార్పుకు, ఎల్ నినోకు సంబంధం ఏమిటి అనే విషయానికి ముందు అసలు ఎల్ నినో అంటే ఏమిటో తెలుసుకుందాం.
ఎల్ నినో అంటే స్పానిష్ భాషలో “చిన్న పిల్లవాడు” అని అర్థం. 1600వ దశకంలో దక్షిణ అమెరికా పసిఫిక్ తీరంలోని జాలర్లు మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించారు. కొన్నేళ్లకొకసారి సముద్రపు నీరు వేడెక్కడం, దానివల్ల మత్స్య పరిశ్రమకు అంతరాయం కలగడం, భారీ వర్షాలు, తుఫానులు రావడం వారు గమనించారు. ఇది క్రిస్మస్ కాలంలో వస్తుంది గనక, బాల ఏసును దృష్టిలో పెట్టుకుని దానికి చిన్నారి బాలుడు అని పేరు పెట్టారు.
సైన్స్ పరంగా చెప్పాలంటే ఎల్ నినో అనేది ఉష్ణమండల (Tropical) పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఒక సహజమైన వాతావరణ చక్రం. ఉష్ణ మండలం అంటే భూమధ్యరేఖకు ఇరువైపులా విస్తరించి ఉన్న అత్యంత వేడిగా ఉండే భూభాగం. సముద్ర జలాలు అసాధారణంగా ఎందుకు వేడెక్కుతాయి అంటే దానికి కారణం ట్రేడ్ విండ్స్ (వ్యాపార పవనాలు) బలహీనపడడం. ట్రేడ్ విండ్స్ అనేవి ఉత్తరార్థగోళంలో ఈశాన్యం నుండి, దక్షిణార్థగోళంలో ఆగ్నేయం నుండి భూమధ్యరేఖ వైపు వీచే నిరంతర, స్థిరమైన తూర్పు గాలులు. ఇవి భూగోళవ్యాప్తంగా వాతావరణ ప్రసరణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ఎల్ నినో ఒక సహజ వాతావరణ చక్రం అని ఎందుకంటున్నామంటే, ఇది ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది.
సాధారణ పరిస్థితులలో, ట్రేడ్ విండ్స్ వెచ్చని ఉపరితల నీటిని పసిఫిక్ మహాసముద్రం మీదుగా పశ్చిమ దిశగా ఆసియా, ఆస్ట్రేలియా వైపు నెడతాయి. ఎల్ నినో సంఘటన సమయంలో, ఈ పవనాలు బలహీనపడతాయి. ఫలితంగా, వెచ్చని నీరు తూర్పు దిశగా అమెరికా ఖండాల పశ్చిమ తీరం వైపు మళ్లుతుంది, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రసరణ (Atmospheric Circulation), వాతావరణ సరళి (Climate Pattern) మారుతుంది.
ఎల్ నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఇండియాలోని కొన్ని ప్రాంతాలతో పాటు కరీబియన్ దీవులు, మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాలలో వర్షాలు బాగా తగ్గిపోయి కరవు పరిస్థితులు రావచ్చు. దీనికి విరుద్ధంగా పెరూ, ఈక్వెడార్, తూర్పు ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాల్లో సాధారణం కంటే భారీగా వర్షాలు కురవచ్చు. ఒక వైపు అతివృష్టి, ఇంకోవైపు అనావృష్టి అన్నమాట. ఈ రెండూ వ్యవసాయాన్ని బాగా దెబ్బతీస్తాయి.
పర్యావరణ విధ్వంసం – ఎల్ నినో:
ఎల్ నినో వల్ల సహజంగా వచ్చే అనావృష్టికి పర్యావరణ విధ్వంసం తోడైతే అది మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి విధ్వంసం వల్ల భూమి వేడెక్కుతుంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో ఎల్ నినో వస్తే, అది రికార్డు స్థాయిలో వేడి పుట్టిస్తుంది. ఇది కొన్ని ప్రాంతాలలో కరువులు, కార్చిచ్చులను తీవ్రతరం చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం, వరదలను పెంచుతుంది. అంతే కాదు, ఎల్ నినో సంవత్సరాలు తరచుగా అధిక ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలతో ముడిపడి ఉంటాయి. ఎందుకంటే అదనపు సముద్ర వేడి వాతావరణంలోకి బదిలీ అవుతుంది.
ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం, 1960కి ముందు ఎల్ నినో కారణంగా ఏర్పడే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇప్పుడు నమోదవుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పోలిస్తే 10 శాతం మేర పెరుగుదల కనపడుతున్నది. ఇదంతా ప్రకృతి విధ్వంసంతో ముడిపడిన వాతావరణ మార్పు వల్లనే అన్నది నిర్వివాదాంశం.
ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కునే ఎటువంటి ప్రణాళికలు మన ప్రభుత్వాల వద్ద లేవు. ముఖ్యంగా వ్యవసాయం, నీటి లభ్యత, ప్రజారోగ్యం పట్ల ఎన్నడూ శ్రద్ధ లేదు. చర్చంతా పంట నష్టపరిహారం చుట్టూ జరిగి చివరికి అది కూడా అరకొరగా అమలవుతుంది. ఎల్ నినో అని వాతావరణ శాఖ హెచ్చరించాక అప్పటికప్పుడు చేసే హడావిడి పనికిరాదు. (అదైనా కనపడుతుందా అన్నది వేరే సంగతి) దీనికి దీర్ఘకాలిక ప్రణాళిక, ఆచరణ అవసరం. ముఖ్యంగా నీటి వనరులను కాపాడటం, పెంపొందించడం, అడవులను సంరక్షించడం, సముద్రతీరాలను, సహజ వనరులను కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. అది చేయగలిగితే ఎల్ నినోను తప్పించలేకపోయినా ఎదుర్కోగలం. అయితే వీటిలో దేనికి కూడా ఇప్పుడున్న అభివృద్ధి నమూనాలో పాలకులు సిద్ధంకారు. పర్యావరణంపై అవగాహణ, ప్రకృతిని సంరక్షించుకోవాలనే చైతన్యం సమాజంలో పెంపొందాలి. ప్రజలవైపు నుండి ఒత్తిడి లేకపోతే పాలకులు కనీసం ఇటువంటి చర్చకు కూడా సిద్ధం కారు.




