ఇవాళ యూరప్ నిప్పుల కొలిమిగా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, సుదీర్ఘమైన హీట్‌వేవ్  (వడగాల్పులు) కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన ఈ వేడి..  ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రజలను కష్టాల పాలు  చేస్తున్నది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి రాత్రిని నమోదు చేయగా..,  బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు జూన్ నెలలో ఆల్-టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు చ‌వి చూశాయి. ఎండ వేడికి పలుచోట్ల కాంక్రీట్ స్లాబ్‌లు పగుళ్లు పడుతున్నాయి. రైల్వే పట్టాలు క‌రిగిపోయి దెబ్బతినడం.. రోడ్లు బీటలు బారడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎండలతో యూరప్ దేశాలలో 6000  మందికి పైగా మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) వెల్లడించింది. అయితే, దీనికి మానవ తప్పిదాలే అసలు కారణమని వాతావరణ శాస్త్ర వేత్తలు తేల్చి చెప్తున్నారు.

            మానవ చర్యలతో కలిగిన వాతావరణ మార్పులతోనే యూరప్ ఖండం గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కుతున్నదని గుర్తించారు. ఈ హీట్‌వేవ్స్ వాతావరణంలో సంభవిస్తున్న ఒక ప్రమాదకరమైన వాతావరణ మార్పునకు సంకేతమని పేర్కొంటున్నారు. 2026 మే చివరి నుండి, ఐరోపా తీవ్రమైన వడగాలుల బారిన పడింది. బెల్జియం, చెకియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, హంగరీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోలాండ్, రొమేనియా, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో ఉష్ణోగ్రతలు ఎన్న‌డూ చూడ‌ని గ‌రిష్ట స్థాయికి చేరాయి. మొదటి వడగాలుల ఉధృతి మే 24న ప్రారంభమైంది. సాధారణం కంటే 10-15 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలతో అనేక మరణాలు సంభవించాయి. పశ్చిమ ఐరోపా అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఫ్రాన్స్, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

            జూన్ నెలలోనే ఈ స్థాయిలో రికార్డులు బద్దలు కావడానికి వాతావరణంలో ఏర్పడిన ‘హీట్ డోమ్‌’ ప్రభావం ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వాతావరణ వ్యవస్థలో వేడి గాలి పైకి పోకుండా వాతావరణం కిందికి నొక్కి ఉంచుతుంది. అధిక పీడన వ్యవస్థ ఒక కుండపై మూతలా పనిచేసి, వేడి గాలిని నిర్దిష్ట ప్రాంతంలో బంధిస్తుంది. అది భూమిని తాకినప్పుడు మరింతగా సంకోచించి విపరీతంగా వేడెక్కుతుంది. ఈ ప్రక్రియ వల్ల మేఘాలు ఏర్పడే అవకాశం లేకపోవడంతో, తీవ్రమైన సూర్యరశ్మి నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలను  అసాధారణ స్థాయికి పెంచేస్తుంది. వాతావరణ మార్పుల వల్లే ఈ విపత్తు సంభవిస్తోందని, మానవ కార్యకలాపాల వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు, గ్రీన్‌హౌస్ వాయువులు ఈ తరహా తీవ్రమైన వేడిగాలులు ఏర్పడటానికి ముఖ్య కారకాలుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

 ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఐరోపా అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా మారింది. పారిశ్రామిక పూర్వ స్థాయిలతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. జెట్ స్ట్రీమ్ వాయు ప్రవాహాలు కొన్నిసార్లు బలహీనపడి, ఒకే ప్రాంతంలో వాతావరణ వ్యవస్థలు ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. దీనివల్ల వేడి చాలా రోజుల పాటు అక్కడే నిలిచిపోతుంది. ఒకప్పుడు ‘తరానికి ఒకసారి’ వచ్చే ఇలాంటి వడగాలులు.. ఇప్పుడు ఏటా వస్తున్నాయని డబ్య్లుహెచ్ఓ అధినేత టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

            చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖండాన్ని అతలాకుతలం చేస్తున్న భీకర ‘హీట్‌వేవ్’ అక్కడి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది.  పలు దేశాల్లో భానుడి భగభగలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటేయడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దశాబ్దాల కాలం నాటి ఉష్ణోగ్రతల రికార్డులన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. డెన్మార్క్ లో ఏకంగా 1874 నాటి రికార్డు బద్ధలైంది. దాదాపు 150 ఏండ్ల తర్వాత ఇప్పుడే అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.  స్విట్ౙర్లాండ్‌లో 38.8 డిగ్రీలు, చెక్ రిపబ్లిక్‌లో 40.8 డిగ్రీలతో ఆల్‌టైమ్ రికార్డులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో జూన్ నెలలో చరిత్రలోనే అత్యధికంగా 37.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. జర్మనీ, స్లోవేకియా, పోలాండ్, ఫ్రాన్స్, రొమేనియా, సెర్బియా వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. 

            ఎప్పుడూ చల్లటి వాతావరణానికి అలవాటుపడిన ఈ దేశాలు ఇప్పుడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, ప్రభుత్వాలు అత్యవసర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కొన్ని  దేశాల్లో 41 డిగ్రీలకే ప్లాస్టిక్ కరిగిపోతుంది. కారణం ఏంటంటే? ఈసారి ఐరోపా ఖండంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయి. బెల్‌గ్రేడ్, బుకారెస్ట్ వంటి నగరాల్లో 37 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. ప్రస్తుతం ఈ వేడి తరంగం బాల్కన్స్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ వైపు విస్తరిస్తున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీవ్ర ఎండలకు వడగాలులు తోడవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఈ వేడి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆసుపత్రుల్లో హీట్‌స్ట్రోక్, డిహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయి. ఐరోపా దేశాల్లో సాధారణంగా చల్లటి వాతావరణమే ఉంటుంది. అక్కడ ఇలాంటి తీవ్ర ఎండలు చాలా అరుదుగా వస్తాయి. అందువల్ల శరీరం ఒక్కసారిగా ఆ వేడిని తట్టుకోలేకపోతుంది.

            చల్లగా ఉండే యూరప్ ఖండం ఇప్పుడు ఓవెన్‌లా ఎందుకు మండుతోంది? గ్లోబల్ క్లైమేట్ హాట్‌స్పాట్ గా మారడం వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏంటి? ఈ అకాల వసంతకాలపు వాతావరణానికి కారణం ‘హీట్‌డోమ్’. ఉత్తర ఆఫ్రికా నుండి వస్తున్న ఈ బలమైన, నెమ్మదిగా కదిలే అధిక పీడన వాతావరణ వ్యవస్థ  మరుగుతున్న నీటి కుండపై మూతలాగా, ఐరోపాపై వేడి గాలిని బంధిస్తోంది. మధ్యధరా సముద్రం ప్రపంచ మహాసముద్రాల సగటు కంటే చాలా ఎక్కువ రేటుతో వేడెక్కుతోంది. వేసవి ప్రారంభంలో, ఈ సముద్రం ఒక భారీ ఉష్ణ నిధిలా పనిచేస్తుంది. ఇది దక్షిణ యూరప్ తీర దేశాలను చల్లబరచడానికి బదులుగా, చుట్టుపక్కల గాలిలోకి విపరీతమైన వేడిని విడుదల చేస్తుంది. ఇది రాత్రి వేళల్లో కూడా వాతావరణం చల్లబడకుండా అడ్డుకుంటూ స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలలో హీట్‌వేవ్‌లను మరింత తీవ్రతరం చేస్తోంది. నార్త్ అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వెచ్చని సముద్ర ఉపరితలం.. గతంలో పశ్చిమ యూరప్‌ను చల్లబరిచే చల్లని సముద్ర గాలులను రానివ్వకుండా అడ్డుకుంటోంది. ప్రపంచ స్థాయిలో, శక్తివంతమైన ఎల్‌నినో చక్రం వాతావరణంలో మిగిల్చిన అదనపు వేడి కూడా ఈ ప్రాంతీయ ఉష్ణోగ్రతలు ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టడానికి కార‌న‌మ‌వుతుంది.

            యూరప్‌లో గరిష్ట స్థాయిలో నమోదవుతున్న ఎండలకు అక్కడి భౌగోళిక పరిస్థితులు కూడా ఒక కారణం. ఎందుకంటే ఉష్ణోగ్రతల తీవ్రత భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. దీంతో పాటు ఇళ్ల నిర్మాణ శైలి, గాలిలో తేమ, పట్టణ వాతావరణ పరిస్థితులు టెంపరేచర్ ను ప్రభావితం చేస్తాయంటున్నారు. ఐరోపా ఖండంపై సూర్యరశ్మి పడే విధానం భారత్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇండియాలో సూర్యరశ్మి నడినెత్తి నుంచి ప్రసరిస్తుంది. ఐరోపాతో పోల్చితే భారత్‌లో పగటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఇండియాలో రేడియేషన్ అధికంగా ఉంటుంది. అదే యూరప్‌లో ఒక యాంగిల్‌లో పడుతుంది. అంతేకాకుండా, అక్కడ సమ్మర్‌లో పగటి సమయం ఎక్కువగా ఉండటం వల్ల వేడి ఎక్కువ సమయం ప్రభావం చూపుతుంది. ఐరోపా నగరాల్లో పగటి సమయమే 15 నుంచి 17 గంటల పాటు ఉంటుంది. దాంతో రోడ్లు, భవనాలు, పేవ్‌మెంట్లు సౌరశక్తిని గణనీయంగా శోషించుకుంటాయి. ఫలితంగా అధిక సమయం వేడి ఉంటుంది.  యాంగిల్‌లో సూర్యరశ్మి పడటం, సూర్యుడు దగ్గరగా ఉండటం వల్ల యూరప్‌లో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.

            జూన్ 17న రెండవ మరింత తీవ్రమైన వడగాలుల ఉధృతి ప్రారంభమైంది. ఫ్రాన్స్ లో 1947లో కొలతలు ప్రారంభమైనప్పటి నుండి జూన్ 23 దేశంలో అత్యంత వేడి రోజు అని మెటియో ఫ్రాన్స్ తెలిపింది. ఆ రోజు పిస్సోస్‌లో ఉష్ణోగ్రతలు 44.3 డిగ్రీల సెల్సియస్, బోర్డోలో 42.1 డిగ్రీల సెల్సియస్  చేరుకున్నాయి. జూన్ 26న, ప్రపంచ వాతావరణ సంస్థ రాబోయే రెండు వారాల్లో పశ్చిమ, మధ్య దక్షిణ ఐరోపాలోని అనేక ప్రాంతాలపై ఈ వడగాలుల ఉధృతి ప్రభావం చూపుతుందని, వేడి తీవ్రత బాల్కన్‌ల వైపు మళ్లే అవకాశం ఉందని తెలిపింది. 

            మనిషి శరీరం తాను నివసించే వాతావరణానికి అనుగుణంగా మారుతుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించే వారిలో చెమట త్వరగా పడుతుంది. ఆ చెమట ఆవిరై శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అలాగే రక్తప్రసరణ వ్యవస్థ కూడా వేడి పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తుంది. అయితే ఐరోపా ప్రజలు ఎక్కువగా చల్లటి వాతావరణంలో జీవిస్తారు. అందువల్ల వారి శరీరం తీవ్రమైన వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని అంత వేగంగా అభివృద్ధి చేసుకోలేదు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగితే హీట్‌స్ట్రెస్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు త్వరగా తలెత్తుతాయి. ఉష్ణోగ్రతతో పాటు గాలిలో తేమ కూడా మనకు వేడి ఎలా ప్ర‌భావితం చేస్తుందో నిర్ణయిస్తుంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వేసవిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో చెమట త్వరగా ఆవిరికాక శరీరానికి మరింత వేడి అనిపిస్తుంది. అయినప్పటికీ, ఇక్కడి ప్రజలు ఆ పరిస్థితులకు అలవాటుపడిన కారణంగా వాటిని తట్టుకోగలుగుతారు. ఐరోపాలో కొన్ని ప్రాంతాల్లో వేడి, పొడి గాలులు కలిసి శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిస్తాయి. దీనివల్ల డీహైడ్రేషన్, హీట్ ఎగ్జార్షన్ ప్రమాదం పెరుగుతుంది.

            భారత్‌లో చాలా ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ కండీషనర్లు సాధారణంగా ఉంటాయి. అయితే యూరప్‌లో చాలామంది ఇళ్లను చలిని తట్టుకునే విధంగా నిర్మిస్తారు. గోడలు మందంగా ఉండటం, వేడిని బయటకు వెళ్లనివ్వని ఇన్సులేషన్ ఉండటం వల్ల వేసవిలో ఇళ్లలోనే వేడి ఎక్కువ  ఉంటుంది. చాలాచోట్ల ఎయిర్ కండీషనర్లు కూడా ఉండవు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. పెద్ద నగరాల్లో కాంక్రీట్ భవనాలు, రోడ్లు, వాహనాల కాలుష్యం వల్ల ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ ఏర్పడుతుంది. పగలు గ్రహించిన వేడిని భవనాలు, రోడ్లు రాత్రిపూట కూడా విడుదల చేస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉంటాయి. దీంతో రాత్రివేళల్లో కూడా ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం… ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఐరోపాలో వేడి తరంగాలు మరింత తీవ్రంగా నమోదవుతున్నాయి. గతంలో అరుదుగా కనిపించిన 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఇప్పుడు ప్రతి వేసవిలో నమోదవుతున్నాయి. ఇది భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

            జర్మనీలో జూన్ నెల చివరలో సంభవించిన తీవ్ర వేడిగాలుల ప్రభావంతో 5,000కు పైగా  మరణాలు నమోదైనట్లు ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. ఫెడరల్ గణాంక కార్యాలయం డెసాటిస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, జూన్ నెలలోని చివరి పూర్తి వారంలో నమోదైన మరణాల సంఖ్య 2022-2025 మధ్యకాలపు అదే వారాల మధ్యస్థ మరణాల కంటే 5,486 అధికంగా ఉంది. ఆ వారంలో దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు కొనసాగగా, ఉష్ణోగ్రతలు 41.7 డిగ్రీల సెల్సియస్ (107.1 డిగ్రీల ఫారెన్‌హీట్)కు చేరుకున్నాయి. ఇప్పుడు “యూరప్ ఖండం సగటు కంటే రెండింతలు వేగంగా వేడెక్కుతోంది. ఈ ధోరణి మరింత పెరుగుతోంది. ఉద్గారాలను వెంటనే తగ్గించకపోతే  ఈ రోజు మనం చూస్తున్న హీట్‌వేవ్‌లే భవిష్యత్తులో సాధారణ వేసవి కాలాలుగా మారుతాయి” అని కొపర్నికస్ క్లైమోటికల్ సర్వీసస్ ప్రకటించింది.  గ్రిడ్‌లు కుప్పకూలుతున్న వేళ.. ఈ సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటికీ ఒక హెచ్చరిక. సంపద కానీ, అత్యాధునిక సాంకేతికత కానీ ప్రకృతి సృష్టంచే థర్మోడైనమిక్ శక్తుల ముందు నిలవలేవు.

ముగింపు :

            శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతోనే వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ప్రస్తుతం యూరప్ వ్యాప్తంగా నమోదవుతున్న విపరీతమైన ఉష్ణోగ్రతలు… చరిత్రలోనే అత్యంత తీవ్రమైన జూన్ నెల వడగాల్పులుగా ఉన్నాయి. 5 దశాబ్దాల క్రితం ఇలాంటి భీకర పరిస్థితులు తలెత్తడం అసాధ్యం అని ‘వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్’ శాస్త్రవేత్తల బృందం ఓ నివేదికలో స్పష్టం చేసింది. బొగ్గు, చమురు, గ్యాస్ లాంటి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా దహనం చేయడం వల్ల పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కాలంతో పోలిస్తే భూమి ఇప్పటికే 1.4 డిగ్రీల సెల్సియస్ అదనంగా వేడెక్కింది. దీనివల్లే వడగాలులు లాంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు సంభవిస్తున్నాయి. భూతాపాన్ని నియంత్రించకుంటే మున్ముందు మరిన్ని ఘోరాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు. “ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ నమూనా పెద్ద వింతేమీ కాదు, కానీ అందులో నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అత్యంత అసాధారణం. మానవ తప్పిదాల వల్ల వాతావరణం కలుషితం కాకపోతే ఇంతటి వేడి ఉండేదేమి కాదు అని వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్ కోఫౌండర్ ఫ్రెడరికే ఒట్టో వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇంతకు మించిన ఉష్ణోగ్రతలను, వినాశనాన్ని అడ్డుకోవాలంటే… శిలాజ ఇంధనాల వాడకాన్ని తక్షణమే, వేగంగా తగ్గించడం ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తల నివేదిక చెప్పింది.

Leave a Reply