అడివంటుకున్నది
విద్యార్థి కొలిమంటుకున్నది
యువభారతదేశం ఇపుడొక నిప్పుగుండం

మీ పోలీసు ఉద్యోగభత్యం
భద్రంగా ఉండనీ, మీకు ఇంక్రిమెంట్లు రానీ
లక్షలాదిబిడ్డలు
అడిగిందే తప్పయితే
మీరు చేసిందేమిటి తండ్రీ
సిగ్గనిపించని ఉద్యోగవిధులా? వెనక నిధులా?

వాళ్ళకెవడో డబ్బులిచ్చాడట?
తెలియని గవర్నమెంటు దేనికి? ద్రోహి ఎక్కడ? ద్రోహమెక్కడ?
వాళ్ళంతా విదేశీపోషకులైతే
స్వదేశీయంత్రాంగం పెనునిద్దురలో వుందా?
హైద్రాబాద్ నుంచి బువ్వ పంపిస్తే
ఖిలిస్తాన్ లీడర్ కైంకర్యమా?
ఇంత గొప్ప ఇంటలిజెన్సా మీది

పేర్లపట్టీలు లేకుంట పోలీసులెవరు?
అసలు డ్రెస్సు, అడ్రస్సులేని గూండాల మీకు ఆసరా?
ఇంత పిరికోల్లకెందుకురా పదవులు?
రాజీనామాలడిగారు కదా చెయ్యండి
పోలీసులంటే ఆడ, మగతనాలు మరిచి
చదువుకునే పిల్లల ఉసురు తీయడానికేనా?
ఏడ మీ ఉద్యోగం? ఏడ మీ మనిషితనం?
ఎందుకురా బానిసలకొక బానిసగా బతుకుతెరువు?

తెరువు కండ్లు, చూడు దేశం?
నిజమేందో, నిష్టూరమేందో
భయమేందో, సత్యమేందో?
చావు భయం తెలియని తరం
వెనుకడుగెరుగని యువతరం

అడుగెస్తే భయమేస్తే
దాచుకో అధికారపు విషపడగలవెనక
నువ్వు బతికుండేదనుక
గెలిస్తే యువతరమే
నిలిస్తే యువతరమే
తెస్తే యువతరమే కొత్తతరం
దమ్ముంటే నిలబడు
చరిత్రలో ఎవరుంటారో
జంతర్ మంతర్ కాలచక్రమే చెప్తుంది
-
23.07.26

One thought on “తగులబడుతున్నది దేశం

  1. ఈ నిరసన సమయం లో అతి దారుణమైన దూషణలు, అసభ్యంగా ప్రవర్తించిన వారి గురించి కూడా చెబితే బాగుంటుంది కదా. విద్యార్థులు, యువత ఉద్వేగాలను రెచ్చగొట్టి అరాచకం చేసే దేశ వ్యతిరేక శక్తుల ఉచ్చులో పడకూడదు. ఇలాంటి రచనలు ఈ సమయంలో వ్రాయడం సరికాదు.

    విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది.

Leave a Reply