అలా రోడ్డు మీద వెళుతుంటానా..
ఏదో ఒక మలుపులో పోలీసు కనిపిస్తాడు
పెదాలు బిగబట్టి పలకరిస్తా
అలా మార్కెట్కు వెళుతుంటానా..
ముఖం లేని ఆకారాలు ఎదురుపడతాయి
అప్రయత్నంగా తప్పుకొంటా..
నా పైకి మేఘం వంగి చూస్తుంది
నిటారుగా నిలబడ్డానా లేదా అని..
దాటి వచ్చేస్తాను..
నా మీదుగా నది పారుతుంది
ఏదో అనబోతుంది
దాటి వచ్చేస్తాను
అలా రోడ్డు మీద వెళుతుంటానా..
నలుగురు పిల్లలు చేతులకు
సంకెళ్లతో నన్ను దాటిపోతారు
తలపై నాలుగు రెక్కలు
టపటప కొట్టుకుంటాయి
వింజామరలా..? కాదనుకుంటా..
టపటప.. ఏదో వికారం..జిగట
టపటప.. మార్కెట్లో దొర్లిపోయిన కూరల తట్ట..
కాలు మెలి పడిందనుకుంటా
టపటప.. కొట్లు కట్టేసి గుంపు ఎటోకటు
కథలూ కాకరకాయలా..
ఎవరి మీదకో దూసుకెళ్తున్న తూటా
ఎవరో నెడితే... తోసేస్తే ..పక్కకు లాగేస్తే..
1001వ సారి జీవితానికి మొక్కి రోడ్డెక్కుతా..
ఎవరు కనిపించినా ఈసారి
పలకరించడానికి పెదాలను
మరింత బిగించాలనే నిశ్చయంతో
అలా రోడ్డు మీద వెళుతుంటానా....




