రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి
ధర్నా, 29 ఆగస్ట్, ఇందిరా పార్క్ వద్ద, హైదరాబాద్. ఉదయం 10 గం. నుండి
ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా !
ప్రభుత్వాలు ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగం కల్పించిన సంక్షేమ విధానాలను విస్మరిస్తూ, కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారు. ఈ క్రమంలో మన దేశంలో ఐదు-ఆరు దశాబ్దాలుగా ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కుల కోసం బలమైన పోరాటాలకు ప్రధానంగా అడవులు, అడవి చుట్టూ ఉన్న మైదాన ప్రాంతాలు కేంద్రంగా మారాయి. నిర్దిష్ట రాజకీయ దృక్పథంతోనే ఆ ఉద్యమాలు కొనసాగాయి. లక్షలాది ఆదివాసీలు ‘జల్, జంగల్, జమీన్, ఆత్మ గౌరవం’ కోసం పోరాడుతున్నారు. ఆ ఉద్యమాలపై తీవ్రమైన అణచివేత నిరంతరాయంగా కొనసాగుతున్నది.
దేశంలో శ్రమదోపిడికి వ్యతిరేకంగా కులమత విద్వేషాలు లేని సమాజాన్ని నెలకొల్పడం కోసం నేటికీ అనేక రాజకీయ పోరాటాలు కొనసాగుతున్నాయి. పలు రకాల రాజకీయ సిద్ధాంతాలు పునాదిగా అవి కొనసాగుతున్నాయి. ఆ రాజకీయాల ప్రభావం వలన వ్యక్తిగత స్వార్థాలు లేకుండా సామాజిక ప్రయోజనాల కోసం, మార్పు కోసం అనేక మంది ఉద్యమకారులు రాజకీయ కార్యకర్తలు ఇప్పటికే వేలాదిగా ప్రాణత్యాగాలు చేసి ఉన్నారు. అంతే కాక ఇటువంటి రాజకీయ పార్టీలు, సంస్థలకు, మావోయిస్టు పార్టీకి చెందిన వేలాది రాజకీయ కార్యకర్తలు దేశంలో జైళ్ళలో మగ్గుతున్నారు.
సామాజిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేయడమే కాకుండా, వాటికి అనుకూలంగా రచనలు చేస్తూ, సాంస్కృతిక కార్యకలాపాలు చేస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ, కోర్టులో న్యాయ పోరాటాలు చేస్తూ, మీడియాలో వార్తలు రాస్తూ… ప్రజానుకూలంగా తమ పాత్రను నిర్వర్తిస్తున్న ఉద్యమకారులు, రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, లాయర్లు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామికవాదులు, తదితరులపై కూడా పోలీసులు ఊపా కేసులు పెట్టి జైళ్ళలో బంధిస్తున్నారు. లేదా ఏళ్ళ తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరందరూ రాజకీయ ఖైదీలే.
సమాజంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత నిర్వర్తించడంలో పూర్తిగా సఫలం కాలేరు. కాని కొద్ది మంది మాత్రం సామాజిక ప్రయోజనాలే తమ ప్రయోజనాలుగా భావించి ప్రజల కోసం ఉద్యమిస్తారు, ఆందోళన చేస్తారు. వారు ఏదో ఒక పార్టీతో సమీకృతం కూడా అవుతారు. తమ స్వప్రయోజనం కోసం కాకుండా సామాజిక ప్రయోజనం కోసం పోరాడిన వాళ్ళందరినీ కూడా రాజకీయ ఖైదీలుగానే మనం గుర్తించాలి. ఇప్ప్పుడున్న రాజకీయాలకు ఉద్యమిస్తున్న రాజకీయాలకు బలమైన వైరుధ్యం ఉండవచ్చు అయినంత మాత్రాన వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ ఖైదీలు కాకపోరు.
దేశంలో మైనార్టీ మతస్థులు ప్రధానంగా ముస్లిం, క్రిస్టియన్లపై అమానవీయ అణచివేత దశాబ్దాలుగా కొనసాగుతున్నది. దానికి అయోధ్య, గుజరాత్, ముజఫర్నగర్, ఒరిస్సా, కంధమాల్ లాంటివి పెద్ద ఉదాహరణలు. చిన్న చిన్న హత్యాకాండలకు లెక్కలేదు, మీడియా కూడా ప్రాధాన్యాత ఇవ్వకుండా వెనక్కి నెట్టేస్తున్నారు. ఆ దురాగతాలను వ్యతిరేకిస్తున్నందుకు అరెస్టు చేసిన, అక్రమంగా ఊపా కేసులు నమోదు చేసిన ముస్లిం మైనార్టీ ఖైదీలనందరిని కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది.
దేశవ్యాప్తంగానూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎంతో మంది మావోయిస్టులనే ఆరోపణలతో జైళ్ళలో మగ్గుతున్నారు. కొందరు ఏళ్ళ తరబడి విచారణ ఖైదీలుగానే ఉంటున్నారు. బెయిలుపై విడుదల చాలా కష్టంగా మారింది.
ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల డీజీపీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర్రలలో మావోయిస్టు ఉద్యమం ఇక ఏమీ మిగలలేదనీ, ముగిసిపోయిందనీ ప్రకటించి ఉన్నారు. ఆ స్థితిలో గత ఏడాది కాలంగా ఉద్యమం వీడి బయటకు వచ్చిన వందలాది మంది మావోయిస్టు నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు తీసివేయకపోయినా అరెస్టు చేయకుండా ఇళ్లకు పంపించివేసింది. కానీ ఆ మావోయిస్టు ఉద్యమానికి సహకరించారనే కారణంతో, లేదా ఆ ఉద్యమంలో పని చేశారనే కారణంతో వందలాది సాధారణ కార్యకర్తలు మాత్రం విచారణ ఖైదీలుగా ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు. ఇందులో 90 శాతం మంది ఆదివాసులే. వాళ్ళందరినీ ఇప్పటికీ ప్రభుత్వం జైళ్లలోనే ఉంచడం ఎలా న్యాయం అవుతుంది? మావోయిస్టు ఉద్యమం ముగిసిందని పార్లమెంటులో హోంమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు జైళ్ళలో ఉన్న వారిని ఆ కేసులన్నింటినీ రద్దు చేసి వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో 90 శాతం రాజకీయ ఖైదీలు ఆదివాసీలే:
మావోయిస్టులనే ఆరోపణలతో తెలంగాణలో సుమారు 50 మంది జైళ్ళలో ఉన్నారు. హైదరాబాద్ జైళ్ళలో 30 మంది, ఖమ్మం జైల్లో 10 మంది దాకా ఉన్నారు. వీరిలో ఐదారుగురు తప్ప మిగిలిన అందరూ ఆదివాసీలు. ఇందులో ఐదుగురు బాలికలు, ఒక బాలుడు మైనర్లు. కోర్టు ఈ మైనర్లకు కూడా బెయిల్ నిరాకరించింది. ఆదివాసీలు కావడం వల్ల వీరిలో చాలా మందికి ములాకాత్ పెట్టడానికి కూడా కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ నుండి రాలేకపోతున్నారు. వీళ్ళలో చాలా మందికి తెలుగు రాకపోవడం వల్ల అదనపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జైలు అధికారుల చిన్నచూపుకు, దాష్టీకానికి గురవుతున్నారు.
ఈ రాజకీయ ఖైదీలలో కొందరు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఉదాహరణకు మూల దేవేందర్ రెడ్డి (60 ఏళ్ళకు పైబడిన వాడు) కి దాదాపుగా రెండు కళ్ళు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈయన జగదల్పూర్ జైల్లో ఉన్నాడు. చంచల్గూడ జైల్లో ఉన్న కర్తమ్ జోగా పక్షవాతంతో బాధపడుతూ కదలలేని స్థితిలో జైలు ఆసుపత్రిలోనే విచారణ ఖైదీగా ఉన్నాడు. గంగాధర్ రావు 75 ఏళ్ళకు పైబడిన వాడు. నాలుగేళ్లకు పైగా ఎటువంటి విచారణ లేకుండా జైలులో ఉన్నాడు. శివారెడ్డి 12 ఏళ్లుగా విచారణ ఖైదీగా ఎటువంటి విచారణ లేకుండా ఉన్నాడు. పూవర్తి గ్రామానికి చెందిన అడ్మాల్కు సంబంధించిన దస్తావేజులు జిల్లాల పునర్విభజన సమయంలో మిస్ప్లేస్ చేసినందుకు దొరకక 12 ఏళ్లుగా జైలులో ఉన్నాడు. కమల మూడేళ్లుగా, రజిత నాలుగేళ్లుగా చంచల్గూడ మహిళా జైల్లో ఉన్నారు. మిగిలిన వారందరూ ఏడాదిగా జైల్లో ఉన్నారు. ఈ కాలంలోనే మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు రామచంద్రారెడ్డి అంత్యక్రియల సందర్భంలో పురుగులు పడిన శవాన్ని చూసి భావోద్వేగానికి గురై అమిత్ షాను విమర్శించిన నేరానికి ‘భారత్ బచావో’ నాయకుడు, ఇరవై ఏళ్ళుగా అనాధ ఆశ్రమం నడుపుతున్న ఇన్నయ్యను ఎన్ఐఏ ఉపా కింద అక్రమ కేసు బనాయించి జైలుపాలు చేసింది. ఆయన జైలులో ఉన్న కాలంలోనే ఆయన తల్లి, తండ్రి ఇరువురూ మరణించారు. ఆయన కూడా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా బెయిలు ఇవ్వడం లేదు. మరో మావోయిస్టు నాయకుడు, మహారాష్ట్రకు చెందిన సంజయ్ దీపక్ రావు కూడా గత మూడేళ్లకు పైగా విచారణ ఖైదీగానే చంచల్గూడ జైల్లో ఉన్నాడు.
విశాఖపట్నం జైల్లో 10 మంది ఉన్నారు. రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు తదితర ఆంధ్ర జైళ్ళలో 50 మంది దాకా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ళలో ఉన్న వాళ్ళు కూడా 90 శాతం ఆదివాసీలే. ఇందులో సాకే కళావతి విశాఖపట్నం జైల్లో ఏడు ఏళ్లుగా ఉంది. ఈమెపై 55 అక్రమ కేసులు మోపారు. కొర్రా నాగేశ్వరరావుపై 40 కేసులు, వంతల రామకృష్ణపై 45 కేసులు, మర్రి వలసపై 25 కేసులు, కొర్ర సింగ్రుపై 20 కేసులు మోపారు. వీరంతా నాలుగు, అయిదేళ్లుగా జైల్లో ఉన్నారు. పాంగి నాగన్న ఆరేళ్ళుగా జైల్లో ఉన్నాడు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన మరెంతో మంది ఇతర రాష్ట్రాల జైళ్ళలో ఉన్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్, భోపాల్, సాగర్ జైళ్ళలో శిక్షపడిన ఖైదీలుగా ఐదుగురు 17 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. వీరందరూ కూడా దాదాపు ఇన్ని ఏళ్లుగా ఎటువంటి ములాకాత్లు కూడా లేకుండా ఉన్నారు. జీవితకాలపు శిక్ష పడిన అనేక మంది ఇతర ఖైదీలను అవే జైళ్ల నుండి 14 ఏళ్ల తరువాత సెంటెన్స్ రివ్యూ బోర్డ్ సిఫారసుతో ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది. కానీ వీరిని మాత్రం విడుదల చేయలేదు. జబల్పూర్ జైల్లోనే అశోక్ రెడ్డి, ఆయన భార్య కుమారి పొట్టాయి నాలుగేళ్లుగా విచారణ ఖైదీలుగా ఉన్నారు.
జగదల్పూర్ మహిళా జైల్లో 108 ఖైదీలు ఉండగా తెలుగువాళ్ళైన పద్మ, శిరీష తప్ప మిగిలిన వారందరూ ఆదివాసీలే. 2007 నుండి 2017 వరకు జైల్లో గడిపి తీవ్ర అనారోగ్యం పాలైన బెల్లాల పద్మ మళ్ళీ గత మూడేళ్ళుగా అక్రమ కేసులో జగదల్పూర్ జైల్లో ఉంది. ఆమెతో పాటే శిరీష, దుడ్డు ప్రభాకర్లు కూడా అదే అక్రమ కేసులో అక్కడి జైల్లోనే ఉన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన పౌరహక్కుల సంఘం నాయకుడు పోగుల రాజేశంను కూడా మూడేళ్ళుగా జగదల్పూర్ జైల్లో నిర్బంధించి ఉంచారు. కనీసం అతని కూతురు చనిపోయినప్పుడు కూడా బెయిల్ ఇవ్వలేదు. వీరికి బెయిలు రావడం లేదు, విచారణ జరగడం లేదు.
భువనేశ్వర్ జైల్లో ఉన్న దున్నా కేశవరావు వాస్తవానికి 2011లో ఆంధ్రప్రదేశ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అయినా ఆయనను ఒడిశా తీసుకెళ్లి 50 కేసులు పెట్టారు. గత 15 ఏళ్లుగా ఆయన విచారణ ఖైదీగానే జైల్లో ఉన్నాడు. దుబాసి శంకర్ ఐదేళ్లుగా అదే జైల్లో ఉన్నాడు. ఇతని ఆరోగ్యం సరిగ్గా లేదు, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
ఇట్లా సుదీర్ఘ కాలంగా జైల్లో ఉండటం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యాల పీడితులుగా బయటకు వస్తారు. ప్రజా ఉద్యమాలు సాపేక్షికంగా బలహీనపడటంతో జైళ్ళలో ఖైదీలపై నిర్బంధం, అణచివేతలు కూడా పెరిగాయి. ములాకాత్ల విషయంలో, పుస్తకాలు ఖైదీలకు ఇవ్వడం విషయంలో అనేక ఆంక్షలు విధించి వేధిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఒంటిరి సెల్స్లో వేసి అణచివేతకు గురి చేస్తున్నారు. ఖైదీలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఇచ్చే బడ్జెట్లో కూడా చాలా కోత విధించడం వల్ల మందులు, చికిత్స విషయంలో కూడా ఖైదీలందరూ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఇట్లా జైళ్ళలో ఉన్న వాళ్ళే కాకుండా, తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 2019-2020లలో ఎంతో మంది టీచర్లు, లాయర్లు, విలేకర్లు, సామాజిక కార్యకర్తలపై బూటకపు కేసులు మోపి ఒక్కో కేసులో 100 నుండి 150 మందిని ఇరికించారు. 2017లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో 10 మందిపై, చెర్ల పోలీస్ స్టేషన్లో 105 మందిపై, హైదరాబాద్ ఎల్బినగర్లో 94 మందిపై, 2020లో తాడ్వాయి పోలీస్ స్టేషన్లో 152 మందిపై, 2020లో వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో 114 మందిపై, 2021లో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఆరుగురిపై, ములుగు పి.ఎస్.లో 59 మంది పై ఉపా కేసులు నమోదు చేశారు. మొత్తం 230 మంది ఈ కేసులలో ఉన్నారు. ఈ కేసులన్నీ ఉపా చట్టం కింద పెట్టారు. వారిలో ఎంతో మంది ఆరేడేళ్లుగా కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అన్నీ అక్రమ కేసులైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కేసులను తొలగించలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో బనాయించిన కేసులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎత్తివేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యల పైన ఉద్యమించిన వారి పైన కూడా కేసులు అక్రమంగా బనాయించారు. వాటిని కూడా ఇప్పటివరకు ఎత్తివేయలేదు. ముస్లిం మైనార్టీ వర్గాలవారి పైన అనేక రకాల అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారు. నిజామాబాద్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు చెందిన 17 మంది ముస్లిం ఖైదీలు 2022 నుండి ఊపా కేసులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. వీరి మీద కూడా కుట్ర కేసు తప్ప ఏ హింసాత్మక చర్య చేసిన ఆరోపణలు లేవు.
పైన పేర్కొన్నవి కొన్ని వివరాలు మాత్రమే. ఛత్తీస్గఢ్ జైళ్ళలో దాదాపు 1200 మంది, ఝార్ఖండ్ జైళ్ళలో సుమారు 1000 మంది, ఇంకా ఒడిశా, యూపీ, బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా ఎంతో మంది మావోయిస్టులు అనే ఆరోపణతో జైళ్ళలో ఉన్నారు. బీమాకోరేగామ్ కేసులో అక్రమంగా ఇరికించబడ్డ ప్రజా న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ ఎనిమిదేళ్లుగా అన్యాయంగా, అక్రమంగా బెయిల్ లేకుండా ఇప్పటికీ జైల్లో మగ్గుతున్నాడు. ఢిల్లీ, యూపీ, ముంబయి జైళ్ళలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ‘అర్బన్ నక్సలైట్లు’ అనే ఆరోపణను ఎదుర్కొంటున్న ‘ప్రిజనర్స్ ఆఫ్ కాన్సియన్స్’ (అంటే వారి భావాల కారణంగా నిర్బంధించబడిన వాళ్ళు). ఒమర్ ఖలీద్, శార్జిల్ ఇమామ్ వంటి వారు విచారణ, బెయిల్ లేకుండా ఆరేళ్ళుగా జైల్లో ఉన్నారు.
కోర్టులు వరవర రావు, రాణి సత్యనారాయణ (కిరణ్), సాదనాల రామకృష్ణ, పారు పటేల్ వంటి వారిని ముంబయి, కొల్కత్తాలు దాటిపోరాదని అన్యాయమైన ఆంక్షలు విధించడం వల్ల బెయిల్ వచ్చి విడుదలైనా ఎన్నో ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలతో తమ వాళ్ళకు దూరంగా ఉండాల్సి వస్తోంది. వీరు తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నారు.
ఒకవైపు మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసిందంటూనే మరొకవైపు అవే కేసులలో ఉన్న సాధారణ కార్యకర్తలను, సానుభూతిపరులను ఇంకా కేసులతో సతాయిస్తూ, కొత్త కేసులు మోపుతూ జైళ్లలోనే నిర్బంధించడం ఎలా ప్రజాస్వామికం అవుతుంది?
ఈ మధ్యే కోర్టు చైతన్య మహిళా సంఘం నాయకులు శిల్ప, దేవేంద్ర, స్వప్నలకు అక్రమంగా బనాయించిన కేసులో 5 ఏళ్ళ శిక్ష విధించింది. దీనిలో స్వప్నకు మూడేండ్ల పసి బాలుడు ఉన్నాడు. శిక్ష పడ్డ తరువాత నిర్దాక్షిణ్యంగా తల్లీబిడ్డలను వేరు చేసి తల్లిని జైలుకు పంపించారు. ఇది ఏ విధంగా న్యాయం? అక్రమ కేసులో అన్యాయ తీర్పుతో మానవ సంబంధాలపట్ల ఇంత నిర్దాక్షిణ్యతను పాటించడం ఎలా న్యాయం అవుతుందో మనం ఆలోచించాలి.
కాబట్టి ఈ అక్రమ అన్యాయ ఉపా కేసు నిర్బంధాలకు వ్యతిరేకంగా మనందరం గొంతెత్తి వారి విడుదలకై ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంలో బలంగా డిమాండ్ చేయడం అవసరం.
దానితో పాటు ఆంధ్రప్రదేశ్తో సహా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది.
అందుకోసం ఆగస్ట్ 29 వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గం. నుండి సా. 3 గం. వరకు ధర్నా జరుగుతుంది. పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
- జైలులో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.
- ప్రజాసంఘాల నాయకులపై, మేధావులపై, ముస్లిం మైనారిటీ రాజకీయ ఖైదీలపై పెట్టిన అక్రమ ఉపా (UAPA) కేసులన్నింటినీ ఎత్తివేయాలి.
- తెలంగాణ ఉద్యమకారుల పైన నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.
- ఉపా (UAPA) చట్టాన్ని రద్దు చేయాలి.
ధర్నా
అధ్యక్షత : ప్రొ॥ లక్ష్మణ్ గడ్డం, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
ప్రొ॥ హరగోపాల్, కన్వీనర్, రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక
ప్రొ॥ మాడభూషి శ్రీధర్
కూనంనేని సాంబశివరావు, సిపిఐ ఎంఎల్ఏ
ప్రొ॥ కోదండరాం, ఎంఎల్సి
గుమ్మడి నర్సయ్య, మాజీ ఎంఎల్ఏ
జె. జాన్ వెస్లీ, సిపిఎం, రాష్ట్ర కార్యదర్శి
ప్రొ॥ అన్వర్ ఖాన్
ప్రొ॥ కొండా నాగేశ్వర రావు, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, ఓ.యు.
నందిగం కృష్ణారావు, రచయిత, సీనియర్ కౌన్సిల్
సాదినేని వెంకటేశ్వర రావు, సిపిఐఎంల్ న్యూ డెమోక్రసి
జానకి రాములు, ఆరఎస్పి కార్యదర్శి
ప్రసాద్, సిపిఐఎంఎల్
మామిండ్ల రమేష్ రాజా, సిపిఐఎంల్ లిబరేషన్
షేక్ షావలి, సిపిఐఎంఎల్, సిపి
సంధ్య, పిఒడబ్ల్యూ, జాతీయ నాయకురాలు
విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక
వి. రఘునాధ్, సీనియర్ కౌన్సిల్, హైకోర్టు
ఎ. దశరధ్, అడ్వకేట్
విజయ్, సిపిఐఎంఎల్ చంద్రన్న
శ్రీహరి, తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం
రమణాల లక్ష్మయ్య, తుడుం దెబ్బ
మహమ్మద్ లతీఫ్ ఖాన్, సిఎలఎంసి
డాక్టర్ ఉస్మాన్, ఎపిసిఆర్
ఆర్. మహాదేవన్, అడ్వకేట్, సుప్రీం కోర్టు
ఎన్. నారాయణ రావు, పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి
డి. సురేష్ కుమార్, భారత ప్రజా న్యాయవాదుల సంఘం
బూరం అభినవ్, కుల నిర్మూలన పోరాట సమితి
పద్మ కుమారి, అమరుల బంధు మిత్రుల సంఘం
జ్యోతి, చైతన్య మహిళా సంఘం
సజయ, సామాజిక కార్యకర్త
జాన్, ప్రజా కళా మండలి
రాజు, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం
రాచమోని నాగభూషణం, తెలంగాణ ప్రజాఫ్రంట్
జక్కుల వెంకటయ్య, తెలంగాణ రైతాంగ సమితి
రివేర, విప్లవ రచయితల సంఘం
ఆజాద్, అధ్యక్షులు, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్, ఓ.యు
మాలతి (ఖాతారామంద్రారెడ్డి సహచరి)
రజిత, అడ్వకేట్
భరద్వాజ్, పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక
ప్రజా కళామండలి, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
- రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక




