స్వేచ్ఛా భారత రాజ్యాంగ భావనలపై ప్రముఖ మేధావులు రాసిన పదకొండు చిన్న వ్యాసాల పరంపరలో చివరి పుస్తకాన్ని రాసేందుకు ఆనంద్ తేల్తుంబ్డేను ఆహ్వానించడం సముచితమని మేము భావించాము. ఆయన భారతదేశపు అత్యంత గౌరవనీయ మేధావులలో ఒకరు. ఇటీవలే ‘మనస్సాక్షి’ ఖైదీ (prisoner of conscience) గా ఆయన జైలు జీవితం అనుభవించారు. మేము తీసుకు వచ్చిన ఈ పుస్తక పరంపరలో రాజ్యాంగాన్ని నాయకులు ఎలా ఊహించారు, ఎలా చర్చించారు, ఎలా రచించారు అనే అంశాలను మేము పరిశీలించాము. అలాగే లౌకికత్వం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగ దృక్పథాన్ని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సమాఖ్య వ్యవస్థ, శాస్త్రీయ దృక్పథం వంటి మూల ప్రతిజ్ఞలను కూడా విశ్లేషించాము.
భారతదేశంలోని అత్యంత అణగారిన ప్రజలు రాజ్యాంగం నుండి ఏం ఆశించారు; గౌరవప్రదమైన, ఆశాజనకమైన జీవితం కోసం వారు తమ హక్కులను పొందడంలో ఇది ఎంతవరకు తోడ్పడింది అనే అంశాలపై స్పందించమని మేము తేల్తుంబ్డేను కోరాము.
ఆయన చేసిన నిర్ధారణలు చాలా తీవ్రంగా, ఘాటుగా, రాజీ లేకుండా ఉండి మనల్ని లోతుగా ఆలోచింపజేస్తాయి.
పీఠికలో ఉన్న ఆశయాలకు, ప్రస్తుత భారతదేశ వాస్తవాలకు మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉందని తేల్తుంబ్డే అభిప్రాయపడతాడు. “స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. ఆర్థిక అసమానతలు వలస పాలన కాలం నాటి కంటే ఇప్పుడు మరీ దారుణంగా ఉన్నాయి. హిందుత్వ ఉద్యమం వల్ల పెరుగుతున్న మత విద్వేషం, కుల అహంకారం సౌభ్రాతృత్వాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఇప్పటికీ అందడం లేదు. మన ప్రజాస్వామ్య పునాదులే ప్రమాదకరంగా బలహీనపడ్డట్లు అనిపిస్తున్నాయి.”
రాజ్యాంగాన్ని కూల్చివేసి, హిందూ రాష్ట్రంగా మార్చేందుకు హిందుత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, దాని ఉనికికే ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో రాజ్యాంగాన్ని నిర్మాణాత్మకంగా విమర్శించడానికి మనం వెనకడుగు వేయకూడదని తేల్తుంబ్డే వాదించాడు. హిందూ రాష్ట్రం అనేది భారతదేశానికి అతిపెద్ద విపత్తు అని అంబేద్కర్ లాగే ఆయన కూడా బలంగా నమ్ముతాడు. మితవాద శక్తుల విమర్శలకు భిన్నంగా, ఆయన పీఠికలోని విముక్తి వాగ్దానాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి వాటిని సమర్థిస్తారు. అయితే రాజ్యాంగం ఈ విలువలను ఇస్తామని మాట ఇచ్చి, అందించడంలో విఫలమైందని ఆయన భావిస్తాడు. “అవును, రాజ్యాంగంలో లోపాలు ఉన్నాయి… కానీ నిజమైన ప్రజాస్వామ్య, ప్రజానుకూల ప్రత్యామ్నాయాన్ని నిర్మించకుండా దీన్ని కూల్చివేయడం అంటే, న్యాయం కోసం పోరాడేందుకు మిగిలి ఉన్న చివరి చట్టపరమైన, నైతిక వ్యవస్థను నాశనం చేయడమే అవుతుంది” అని ఆయన ధైర్యంగా చెబుతాడు.
రాజ్యాంగానికి ఘోరమైన ద్రోహం దళితుల విషయంలోనే జరిగింది
తేల్తుంబ్డే తన పుస్తకంలో ప్రధానంగా దళితులపై దృష్టి సారించారు. వేల ఏళ్లుగా కుల వ్యవస్థ వీరికి అన్యాయం చేసింది. వీరికి విద్యను, గౌరవప్రదమైన పనులను దూరం చేసింది. అయితే ఆయన విశ్లేషణలు భారత గణతంత్రంలోని అణచివేతకు గురైన, అట్టడుగున ఉన్న అన్ని వర్గాలకు వర్తిస్తాయి.
భారతీయులందరిలో బహుశా దళితులే రాజ్యాంగంతో అత్యంత ఎక్కువ భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్నారని తేల్తుంబ్డే గుర్తించారు. వందల ఏళ్ల కుల బంధనాల నుండి తమ విముక్తి కోసం పోరాటాలు నడిపినందుకు తాము అమితంగా గౌరవించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించడం దీనికి కారణం.
అయినప్పటికీ, ఇతరులందరికంటే ఎక్కువగా దళితులకు ఇచ్చిన విముక్తి వాగ్దానాన్ని నెరవేర్చడంలో రాజ్యాంగం ఘోరంగా విఫలమైందని ఆయన భావిస్తాడు. రాజ్యాంగం ఒక చిన్న దళిత మధ్యతరగతి వర్గం పుట్టుకకు తోడ్పడింది. కానీ ఈ చిన్న వర్గం, మిగిలిన అధిక సంఖ్యాక దళితులతో కేవలం “చరిత్రను” మాత్రమే పంచుకుంటుంది తప్ప “ప్రస్తుత స్థితిని” కాదు. మెజారిటీ దళితులు ఇప్పటికీ కుల వివక్షను, అణచివేతను భరిస్తూనే ఉన్నారు. వారి జీవితాలు “దుఃఖం, నిరాశతో నిండిన వాస్తవంలో” ఉన్నాయి.
దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలను కలిపితే, భారతదేశ జనాభాలో దళితులు నాలుగో వంతు ఉంటారని ఆయన ఎత్తిచూపారు. వీరి సంఖ్య 32 కోట్లకు పైగా ఉంది. ప్రపంచంలో వీరిని ఒక “దేశం”గా పరిగణిస్తే, ఇది మూడవ అతిపెద్ద దేశం అవుతుంది. భూమిపై అత్యల్ప జనాభా కలిగిన 150 దేశాల మొత్తం జనాభా కంటే వీరి సంఖ్య ఎక్కువ. అయితే, దేశవ్యాప్తంగా వీరు చెల్లాచెదురుగా ఉండటం వల్ల, ముస్లింల లాగేవీరు ఎక్కడా సంఖ్యాపరంగా మెజారిటీగా ఉండలేకపోతున్నారు.
బ్రిటిష్ పాలనే కులాన్ని సృష్టించిందనే కొందరు హిందుత్వ మేధావుల వాదనను తేల్తుంబ్డే తిరస్కరించారు. వలస పాలన కులాన్ని మౌలికంగా మార్చిందని ఆయన అంటారు. బ్రిటిష్ వారి కంటే ముందు కులం అనేది ప్రాంతీయంగా, మారుతూ ఉండే వ్యవస్థ. బ్రిటిష్ వారు కులాలను లెక్కించడం, నమోదు చేయడం మొదలుపెట్టారు. అర్జున్ అప్పదురై మాటల్లో చెప్పాలంటే, ఇది కులాన్ని వివరించడమే కాకుండా, దాన్ని ఒక కఠినమైన, అధికారికమైన, వ్యవస్థీకృత నిచ్చెనమెట్ల శ్రేణిగా మార్చింది. అంతకుముందు సందర్భాన్ని బట్టి మారుతూ ఉండే కులాల సరిహద్దులను ఇది శాశ్వతం చేసింది. ఈ వలసవాద విధానం నేటికీ భారతదేశ సామాజిక, రాజకీయ జీవితంలో కనిపిస్తోందని తేల్తుంబ్డే పేర్కొన్నారు.
అదే సమయంలో, వలస పాలన దళితులకు హిందూ రాజ్యాల కఠినమైన కుల చట్రం వెలుపల కొన్ని విముక్తి మార్గాలను కూడా చూపింది. సైన్యం, రైల్వే వంటి విభాగాల్లో తొలిసారిగా వారికి కులంతో సంబంధం లేని ఉద్యోగాలు లభించాయి. దీనివల్ల వారు విద్యను, స్థిరమైన ఉపాధిని పొందగలిగారు. బాబాసాహెబ్ స్వయంగా బ్రిటిష్ మిలిటరీ సైనికుడి కుమారుడు.
గాంధీజీ వచ్చే వరకు, ఇంగ్లీష్ చదువుకున్న ఉన్నత వర్గాలు, భూస్వాములు, పెట్టుబడిదారుల ఆధిపత్యంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ కుల సంస్కరణలు, అంటరానితనం, మహిళల స్థితిగతులపై దృష్టి పెట్టలేదని తేల్తుంబ్డే గుర్తు చేశారు. ఆ తర్వాత వితంతు వివాహం, బాల్య వివాహాల నిరోధం వంటి మితవాద సంస్కరణలకు చోటు కల్పించింది. అంటరానితనం నిర్మూలన గురించి కూడా మాట్లాడినప్పటికీ, కుల నిర్మూలన గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. 1916 నుండి అంటరానితనంపై పోరాటాన్ని కాంగ్రెస్ అజెండాలో ప్రధానాంశంగా మార్చింది మహాత్మా గాంధీనే. దళితుల ఆలయ ప్రవేశం కోసం ఆయన చేసిన ఉద్యమం గొప్ప ప్రభావాన్ని చూపింది.
గాంధీజీ విధానంలో ఒక పరిమితి ఉంది. అంటరానితనాన్ని ఆయన, కాంగ్రెస్ ఒక నైతిక సమస్యగా చూశారు. సవర్ణ హిందువులు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సామాజిక పాపంగా భావించారు. కానీ దీన్ని రాజకీయ పరిష్కారాలు అవసరమైన ఒక వ్యవస్థీకృత అన్యాయంగా గుర్తించలేదు. ఇది అంబేద్కర్ కోరిన ‘ప్రత్యేక నియోజకవర్గాల’ డిమాండ్‌కు అడ్డుపడింది. ప్రత్యేక నియోజకవర్గాలు హిందూ ఐక్యతను దెబ్బతీస్తాయని, ముస్లిం లీగ్ కూడా ఇలాంటి డిమాండ్లే చేసేలా ప్రోత్సహిస్తాయని భావించి గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. దీని ఫలితంగా 1932లో ‘పూనా ఒప్పందం’ జరిగింది. ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా, సాధారణ ఓటర్ల జాబితాలోనే దళితులకు ‘రిజర్వ్ డ్ స్థానాలు’ ఇచ్చేలా రాజీ కుదిరింది. దీనిపై అంబేద్కర్ అసంతృప్తి చెందాడు. ముస్లింల లాగే దళితులు కూడా సవర్ణ హిందువుల నుండి వేరుగా ఉన్న ఒక ప్రత్యేక సమూహమని ఆయన నమ్మాడు. ప్రత్యేక నియోజకవర్గాలు మాత్రమే వారి రాజకీయ, సామాజిక ప్రయోజనాలను కాపాడగలవని ఆయన భావించాడు. దీని తర్వాత గాంధీజీ ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని కొనసాగించాడు. ఇది సనాతన హిందువులకు కోపం తెప్పించింది. అయితే ఇది దళితుల రాజకీయ సాధికారతకు సంబంధించిన ఉద్యమంగా మాత్రం మారలేదు.
రాజ్యాంగం అంటరానితనాన్ని రూపుమాపింది కానీ కులాన్ని కాదు
దళితుల కోసం చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన ఏర్పాట్లలో ప్రధాన లోపం ఏమిటంటే — అది కుల నిర్మూలన కంటే అంటరానితనం తొలగింపుపైనే మళ్లీ దృష్టి పెట్టిందని తేల్తుంబ్డే భావిస్తున్నాడు. రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువగా అగ్రవర్ణాల వారు, విదేశాల్లో చదువుకున్న ఉన్నత వర్గాలు, భూస్వాములు, పెట్టుబడిదారులే ఉన్నారు. కార్మికులు, రైతులు, ముఖ్యంగా దళితులు, ఆదివాసీల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. దళితుడైన డాక్టర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన నాయకత్వంలో దళితుల సమానత్వం కోసం అనేక నిబంధనలు రాజ్యాంగంలో చేరాయి. అంటరానితనం, వెట్టిచాకిరీపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు వంటివి అందులో ఉన్నాయి. అయితే, 1930లలో అంబేద్కర్ ఎంత బలంగా వాదించినప్పటికీ, రాజ్యాంగం కులాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించలేదు, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను కల్పించలేదు.
రాజ్యాంగ పరిషత్తు చర్చల్లో కొందరు సభ్యులు కుల ఆధారిత రిజర్వేషన్లను వ్యతిరేకించారు. ఇవి ఉదారవాద ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధమనీ, సామాజిక విభజనను పెంచుతాయనీ వారు వాదించారు. అయితే, దీనికి భిన్నమైన వాదన నెగ్గింది. రిజర్వేషన్ల వంటి నిర్మాణాత్మక జోక్యం లేకుండా కేవలం చట్టపరమైన సమానత్వం ఇస్తే.. పాతుకుపోయిన కుల అంతరాలను తొలగించడం సాధ్యం కాదని మెజారిటీ సభ్యులు భావించారు.
అంటరానితనాన్ని రాజ్యాంగ విరుద్ధమని, శిక్షార్హమైన నేరమని ప్రకటించే తీర్మానాన్ని పరిషత్తు ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, అసలు సమస్య అయిన కులాన్ని వదిలేసి అంటరానితనాన్ని ఎలా నిర్మూలిస్తారని కొందరు సభ్యులు ప్రశ్నించారు. ఇది బాబాసాహెబ్, గాంధీజీ మధ్య ఉన్న మౌలిక విభేదాన్ని గుర్తుకు తెచ్చింది. గాంధీజీ అంటరానితనాన్ని కుల వ్యవస్థలోని ఒక లోపంగా చూశారు. కానీ బాబాసాహెబ్, అంటరానితనం అనేది కుల వ్యవస్థలో అంతర్భాగమనీ, కుల వ్యవస్థ హిందూ మతంలో అంతర్భాగమనీ నొక్కి చెప్పాడు. అందుకే కులాన్ని అంతం చేయకుండా అంటరానితనాన్ని అంతం చేయడం సాధ్యం కాదని ఆయన వాదించాడు.
మతువా తెగ (మొదటి దళిత సంస్కరణ ఉద్యమం) స్థాపకుడు హరిచంద్ ఠాకూర్ మునిమనుమడు ప్రమథ రంజన్ ఠాకూర్ అసెంబ్లీలో ఇలా వాదించాడు: “కుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించకుండా అంటరానితనాన్ని ఎలా తొలగిస్తారో నాకు అర్థం కావడం లేదు. అంటరానితనం అనేది కేవలం ఒక వ్యాధి లక్షణం మాత్రమే, ఆ వ్యాధి పేరే కుల వ్యవస్థ… మనం కుల వ్యవస్థను పూర్తిగా తొలగించనంత వరకు, అంటరానితనం సమస్యను పైపైన పరిష్కరించడం వల్ల ఉపయోగం లేదు.”
మరికొందరు సభ్యులు కూడా ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, తన జీవితమంతా కుల నిర్మూలన కోసం పోరాడిన అంబేద్కర్, ఈ చర్చ సమయంలో రాజ్యాంగ పరిషత్తులో మౌనంగా ఉన్న విషయాన్ని తేల్తుంబ్డే ఎత్తిచూపుతాడు. దీన్ని ఆయన ఒక “వ్యూహాత్మక రాజీ”గా అభివర్ణించారు.
కొద్దిమంది అసమ్మతి స్వరాలను పక్కన పెట్టి, అంటరానితనాన్ని రద్దు చేస్తూ, దాన్ని నేరంగా పరిగణిస్తూ రాజ్యాంగ పరిషత్తు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీని ఫలితంగా ఆర్టికల్ 17 రూపొందింది. అది ఇలా చెబుతుంది: “అంటరానితనం రద్దు అయ్యింది. దానిని ఏ రూపంలో పాటించడమైనా నిషేధం. అంటరానితనం వల్ల కలిగే ఏ రకమైన అశక్తతనైనా అమలు చేయడం చట్టప్రకారం శిక్షార్హమైన నేరం.” ముసాయిదా కమిటీలోని ఇద్దరు మహిళా సభ్యుల్లో ఒకరైన హంసా మెహతా దీనిని “మనం చేసిన గొప్ప కార్యం” అని, “భవిష్యత్ తరాలు దీనిని చూసి చాలా గర్విస్తాయి” అని కొనియాడారు.
అంటరానితనాన్ని నిర్మూలించడంలో భారత్ విఫలమవడం “ముందే ఊహించగలిగిన వైఫల్యమా”?
నేటి భారతదేశంలో అంటరానితనం, కుల వివక్ష, దాడులు ఇంకా కొనసాగుతుండటాన్ని చూపుతూ.. ఇదంతా “ముందే ఊహించిన వైఫల్యం” అని తేల్తుంబ్డే అంటాడు. “స్వతంత్ర భారతదేశంలో కులం ఇలాగే కొనసాగుతుందని రాజ్యాంగ పరిషత్తులోని సుమారు 300 మంది మేధావులు ఎందుకు ఊహించలేకపోయారు?” అని ఆయన ప్రశ్నించారు. అంటరానితనం అనేది ఒక నైతిక వక్రీకరణ మాత్రమేనని, అది హిందూ మతంలో అంతర్భాగం కాదని గాంధీజీ భావించేవారు. ఆయన వర్ణ వ్యవస్థను సమర్థించేవారు. ఐతే అది పుట్టుకతోనే నిర్ణయమయ్యే దానిగా ఉండకూడదని గాంధీ అభిప్రాయం. (జీవిత చరమాంకంలో గాంధీజీ కుల వివక్షను మరింత నేరుగా వ్యతిరేకించాడు). అయితే, ఆధునికవాదిగా చెప్పుకునే జవహర్లాల్ నెహ్రూ కుల వ్యవస్థను మరింత బలంగా ఎందుకు వ్యతిరేకించలేదు? ఆయన కులాన్ని ఒక సామాజిక రుగ్మతగా గుర్తించి, దానికి బదులుగా శాస్త్రీయ దృక్పథం, హేతువాదం కావాలని పిలుపునిచ్చాడు. అయినప్పటికీ, రాజకీయంగా ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉండవచ్చని తేల్తుంబ్డే అభిప్రాయడతాడు. హిందూ జీవన విధానంలో కులం అత్యంత కీలకమైన పునాది అనీ, దాన్ని నేరుగా తాకితే కొత్తగా ఏర్పడిన గణతంత్రం అస్థిరపడవచ్చనీ నెహ్రూ భయపడి ఉండవచ్చు. అలాగే, కాంగ్రెస్ నాయకత్వంలోని ఒక పెద్ద వర్గం సామాజికంగా సంప్రదాయవాదులు, కుల నిచ్చెనమెట్ల శ్రేణిని నమ్మే వారు కావడం కూడా దీనికి కారణం కావచ్చు.
కులాన్ని రద్దు చేస్తే తమకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఎక్కడ పోతాయోనని చాలా మంది దళిత నాయకులు ఆందోళన చెందడం ఒక విచిత్రమైన పరిస్థితి అని తేల్తుంబ్డే పేర్కొన్నాడు. కొత్త గణతంత్రంలో కులం, వర్గంతో కలిసిపోయి మరింత బలపడింది. తక్కువ కులాలు గ్రామీణ శ్రామికవర్గంగా మారారు. అప్పటి శూద్రులు ధనిక రైతు వర్గంగా ఎదిగారు. వీరు “ఆర్థిక శక్తిని కూడగట్టుకోవడమే కాకుండా, బ్రాహ్మణవాద భావజాలాన్ని తమ భుజాలమీదికి ఎత్తుకొని పాత అగ్రవర్ణ భూస్వాముల స్థానాన్ని ఆక్రమించి, దళితులపై పెత్తనం చెలాయించడం, వారిని హింసించడం మొదలుపెట్టారు.” దీనివల్ల అప్పుడప్పుడు దారుణమైన మారణకాండలు జరిగాయని ఆయన పేర్కొన్నాడు. రాజ్యాంగం అధికారికంగా హక్కులను కల్పించినప్పటికీ, కుల వ్యవస్థను కూల్చివేయడంలో అది విఫలమైంది. దీనివల్ల హింస, వివక్ష అదుపు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాక చేతులతో మలమూత్రాలు ఎత్తడం (Manual scavenging), వెట్టిచాకిరీ వంటి అత్యంత హేయమైన వివక్షలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఆర్టికల్ 17 ఉన్నప్పటికీ, అంటరానితనం దైనందిన జీవితంలో పాతుకుపోయి ఉందని తేల్తుంబ్డే ముగించారు. రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది కానీ కులాన్ని రద్దు చేయలేదు. దీనివల్ల కుల ఆధారిత అసమానతలు, వివక్ష, హింసను పోషించే సామాజిక వ్యవస్థలు అలాగే ఉండిపోయాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ వ్యవస్థలుకూడా కుల వివక్షతో, ద్వేషంతో నిండి ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. కేసులు నమోదు చేయకపోవడం, నేర తీవ్రతను తగ్గించడం, విచారణలో జాప్యం చేయడం, అగ్రవర్ణ నిందితులపై సానుభూతి చూపడం వంటివి కేవలం పొరపాట్లు కావు; కులం బలంగా ఉన్నప్పుడు ఇవి అనివార్యంగా జరుగుతాయి.
“ప్రభుత్వ యంత్రాంగం కూడా నిచ్చెనమెట్ల కులవ్యవస్థను నమ్మే వారి ఆలోచనా విధానంతో ఉన్నప్పుడు, రాజ్యాంగ రక్షణలు దళితులకు పెద్దగా ఊరటనివ్వవు. కుల వ్యవస్థ అలాగే ఉన్నందువల్ల చట్టపరమైన నిషేధాలు విఫలం అయ్యాయి” అని ఆయన వివరించారు.
ప్రస్తుత బీజేపీ హిందుత్వ పాలనలో ఇది మరింత ముదిరిందని ఆయన అన్నారు. “పునరుజ్జీవన హిందూ జాతీయవాదం సాంప్రదాయ సామాజిక వ్యవస్థను కీర్తిస్తుంది. ఇది కుల నిచ్చెనమెట్ల వ్యవస్థకు ఒక సైద్ధాంతిక మద్దతును ఇస్తోంది. కుల గుర్తులను ప్రదర్శించడం, దేవాలయాల్లో, గ్రామాల్లో వేరుగా ఉంచడం, కులాలవారీ జన సమీకరణలు విస్తృతమయ్యాయి. సోషల్ మీడియా వీటిని మరింత పెంచింది. ప్రభుత్వం కూడా ఆధిపత్య కులాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటూ, నిందితులకు రక్షణ కల్పిస్తోంది.”
దీని ఫలితంగా, కులం మునుపటి కంటే ఇప్పుడు మరింత స్పష్టంగా, దూకుడుగా, సామాజిక ఆమోదంతో కనిపిస్తోందని తేల్తుంబ్డే నమోదు చేశారు. “నేటి భారతదేశం మునుపటి కంటే ఎక్కువగా కులమయమైంది” అని ఆయన బలంగా చెబుతున్నారు. ఈ విధంగా సామాజిక వాస్తవాల వల్ల, ప్రభుత్వ కుమ్మక్కు వల్ల రాజ్యాంగ ఆశయాలు నిరంతరం నీరుగారిపోతున్నాయి.
రాజకీయ ప్రాతినిధ్యం దళితుల సాధికారతకు పెద్దగా తోడ్పడలేదు
దళితులకు కల్పించిన రాజకీయ రిజర్వేషన్లు ఆశించినంత ఫలితాలను అందివ్వలేదని తేల్తుంబ్డే అంచనా. రాజకీయ రిజర్వేషన్లు కేవలం ప్రాతినిధ్యాన్ని పెంచుతాయి తప్ప, వాస్తవ సాధికారతను అందించవు అనేది ప్రపంచవ్యాప్త అనుభవం; భారతదేశంలో కూడా అదే జరుగుతోంది. భారతదేశ ఎన్నికల వ్యవస్థలో దళితుల కోసం కేటాయించిన నియోజకవర్గాల్లో కూడా వారు మెజారిటీగా ఉండటం చాలా అరుదు. దీనివల్ల ఎన్నికల అవసరాల కోసం వారు ఇతర కులాలతో పొత్తులు పెట్టుకోవాల్సి వస్తోంది. రిజర్వేషన్ స్థానాలను మారుస్తూ ఉండటం (రొటేషన్) వల్ల నాయకులు స్వల్పకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీల అనుబంధాలు జవాబుదారీతనాన్ని మరింత తగ్గిస్తున్నాయి; ఫలితంగా నాయకుల విధేయత సొంత సమాజంకంటే ఎక్కువగా రాజకీయ పార్టీల పట్ల ఉంటోంది. డబ్బు, ప్రభావం ఉన్న వారి ద్వారా అధికారాన్ని పొందడానికి దళిత అభ్యర్థులు మధ్యవర్తులపై, బ్రోకర్లపై, పార్టీ కార్యకర్తలపై ఆధారపడుతున్నారు. దీనివల్ల చాలా మంది దళితులకు ఈ ప్రాతినిధ్యం అర్థరహితంగా మారుతోంది. మొత్తంమీద, రాజకీయ రిజర్వేషన్లు ఉన్నంత మాత్రానే అవి దళిత అనుకూల విధానాలు రావడానికి దారితీయలేదని పరిశోధనలు చెబుతున్నాయని తేల్తుంబ్డే మనకు వివరిస్తున్నారు.
మరింత దారుణమైన విషయం ఏమిటంటే, రాజకీయ రిజర్వేషన్లు దళిత నాయకత్వాన్ని “వశపరుచుకోవడానికి” (domestication) దారితీశాయని ఆయన అంటారు. కుల అధికారాన్ని ఎదిరించడానికి బదులు, దళిత నాయకత్వం ఆ అధికారంలోనే కలిసిపోయింది. దళిత విముక్తి జరగకుండానే, దళిత ఉన్నత వర్గాలు పుట్టుకురావడానికి రాజకీయ రిజర్వేషన్లు దోహదపడ్డాయి అని ఆయన ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చాడు. అలాగే, ‘ఫస్ట్-పాస్ట్-ద-పోస్ట్’ (ఎక్కువ ఓట్లు వచ్చిన వారే విజేత) ఎన్నికల వ్యవస్థలో రిజర్వేషన్లు అనేవి సమాజ సాధికారత కోసం కాకుండా, రాజకీయ, సామాజిక, ఆర్థిక అధికారం ఉన్న వారి మద్దతు పొందే సాధనాలుగా మారిపోయాయి.
‘ఫస్ట్-పాస్ట్-ద-పోస్ట్’ పద్ధతికి బదులుగా, ఓట్ల శాతం ఆధారంగా మాత్రమే ఉండే ‘నిష్పత్తి ప్రాతినిధ్య పద్ధతి’ (proportional representation) చిన్న లేదా చెల్లాచెదురుగా ఉన్న సమూహాల అణచివేతను అడ్డుకుంటుందని ఆయన నమ్ముతాడు. ఇది కుల, సామాజిక గుర్తింపు బృందాలను రాజకీయ ప్రయోజన బృందాలుగా మార్చడానికి సహాయపడుతుంది. గుర్తింపు ఆధారిత రిజర్వేషన్ల అవసరం తగ్గుతూ ఉంటే, అది క్రమంగా కుల నిర్మూలన ఆశయానికి తోడ్పడుతుంది. చట్టబద్ధమైన మద్దతు అవసరమయ్యే రిజర్వేషన్ల మాదిరిగా కాకుండా, నిష్పత్తి ప్రాతినిధ్య పద్ధతి సహజంగానే మైనారిటీల భాగస్వామ్యాన్ని పెంచుతుంది.
విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో కుల కోటాలు
విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో కుల కోటాల ప్రభావాలను తేల్తుంబ్డే నిశితంగా పరిశీలించారు. శతాబ్దాల తరబడి కుల వివక్షకు గురై, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే అవకాశాల నుండి వంచితులవడమే కాకుండా కనీస చదువులు కూడా చదువుకోవడానికి అనుమతి లేని ప్రజలకు ‘పరిహార న్యాయం’ (reparative justice) అందించాలని రాజ్యాంగ పరిషత్తు చర్చల్లో స్వయంగా డాక్టర్ అంబేద్కరే బలంగా వాదించాడు. దళితులు పరిపాలనలో, రాజకీయాల్లోకి ప్రవేశించి తమ హక్కులను కాపాడుకోవడానికి రిజర్వేషన్లు అత్యవసరమని ఆయన భావించాడు.
మిగిలిన సభ్యులు కూడా ఆయనను సమర్థించారు. కే. సంతానం మాట్లాడుతూ.. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేది వారికి ఇస్తున్న ‘అవకాశం’ కాదు, శతాబ్దాల అణచివేతకు, అవమానాలకు ఇస్తున్న ‘పరిహారం’ అని అన్నారు. రాజ్యాంగ రక్షణలు లేకపోతే ఆధిపత్య కులాలు అవకాశాలన్నింటినీ చేజిక్కించుకుంటాయని కే.ఎం. మున్షీ హెచ్చరించారు. ఆదివాసీ తెగల తరపున మాట్లాడిన జైపాల్ సింగ్.. “రిజర్వేషన్లు లేకపోతే వారు మిగతా భారతదేశంతో ఎప్పటికీ పోటీ పడలేరు” అని అప్పుడే చెప్పారు. చదువు అనేది సామాజిక అభివృద్ధికి కీలకమని, రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయమే తప్ప దానం కాదని ఆర్.కె. సిద్ధ్వా పేర్కొన్నారు.
అయితే, రిజర్వేషన్ల వల్ల ప్రతిభ (merit), పనితీరు దెబ్బతింటాయని కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాటి ఈ వాదనలను మనం కొన్ని దశాబ్దాల అనంతరం కూడా వింటున్నాం. “సామాజిక న్యాయం కోసం ప్రతిభాపాటవాలను బలి ఇవ్వకూడదు” అని హెచ్.వి. కామత్ అన్నాడు. చట్టం ముందు సమానత్వం, ప్రతిభ మాత్రమే ముఖ్యం అని ఆర్.వి. ధులేకర్ వాదించారు. అయినప్పటికీ, అంతిమంగా రాజ్యాంగ పరిషత్తు రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4), 335 ద్వారా వీటికి అవకాశం కల్పించింది.
వీటి ప్రభావాన్ని అంచనా వేస్తూ.. రాజ్యాంగంలోని ఇతర అంశాల కంటే విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ల విధానాలే దళితుల ఆర్థిక స్థితిగతులను నేరుగా ప్రభావితం చేశాయని తేల్తుంబ్డే గమనించాడు. రాజకీయ రిజర్వేషన్ల కంటే ఇవే సమాజంలో సమానత్వాన్ని పెంచడానికి తోడ్పడ్డాయి. దళితులకు శతాబ్దాలుగా మూసుకుపోయిన ఆర్థిక ద్వారాలు వీటి వల్ల తెరుచుకున్నాయి. అనేక పరిమితులు ఉన్నప్పటికీ, దళితులు తమకు నిషిద్ధమైన వృత్తుల్లోకి ప్రవేశించగలిగారు. ఇది వారి ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా, సామాజిక అంతరాలను కూడా తగ్గించింది.
అయితే, రిజర్వేషన్లను “వెనుకబాటుతనానికి” పరిష్కారంగా చూడటం వల్ల.. దళితులు పుట్టుకతోనే తక్కువ అనే అపార్థం కలుగుతోందని తేల్తుంబ్డే అభిప్రాయపడ్డారు. దళితులు సానుభూతికి అర్హులే కానీ హక్కులకు కాదనే కుల వివక్షాపూరిత ఆలోచనలను ఇది బలపరుస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రభుత్వం వీరికి అనవసర ప్రాధాన్యత ఇస్తోందనే తప్పుడు ప్రచారానికి ఇది తావిస్తోంది. దీనివల్ల దళితులు కూడా తమను తాము తక్కువగా చూసుకునే ప్రమాదం ఉంది. “సామాజిక న్యాయం కోసం తెచ్చిన ఈ విధానం.. సామాజిక లోపానికి ఒక గుర్తుగా మారుతోంది” అని ఆయన అంటాడు.
విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లను విమర్శించే వారికి తేల్తుంబ్డే ఒక గొప్ప సామాజిక సత్యాన్ని చెప్పారు. దళితులలో ఏదో లోపం ఉండటం వల్ల రిజర్వేషన్లు రాలేదు; సమానత్వాన్ని అంగీకరించని భారత సమాజంలోని లోపాల వల్లే ఇవి అవసరమయ్యాయి. భారత సమాజం సమానత్వం అనే భావనకు ఇప్పటికీ వ్యతిరేకమే. రిజర్వేషన్లు అనేవి దళితుల వెనుకబాటుతనానికి ఇచ్చే పరిహారం మాత్రమే కాదు, సమాజంలోని లోపాలను, కులాల పట్ల ఉన్న పూర్వాభిప్రాయాలను, వివక్షను సరిదిద్దే చర్యలు. “దళితులు మిగిలిన సమాజాన్ని అందుకోవడం కాదు; సమాజమే తన కుల వివక్షను వదిలి ఆధునిక, సమానత్వ భావాలను స్వీకరించాలి.” రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వం ఒక మైనారిటీ వర్గానికి అనవసర సాయం చేయడం లేదు, అన్యాయంగా ప్రవర్తించిన మెజారిటీ వర్గాన్ని క్రమశిక్షణలో పెడుతోంది.
దళితులు విద్యా, ఉద్యోగాలలో పురోగతి సాహించడం ఆధిపత్య కులాలలో అసూయకు, కోపానికి దారితీస్తోంది. ఇది తరచుగా ‘కొత్తగా రంగంలోకి వస్తున్న’ దళితులపై దాడులకు కారణమవుతోంది. రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వారు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను కూడా తేల్తుంబ్డే సున్నితంగా వివరించారు. వీరు మధ్యతరగతి సమాజంలోకి వెళ్లినా, కుల వివక్ష వల్ల అక్కడ పరాయివారిలాగే ఉంటున్నారు. అదే సమయంలో, తమ సొంత కుల ప్రజల కంటే మెరుగైన స్థితిలో ఉండటం వల్ల వారితోనూ పూర్తి స్థాయిలో కలవలేకపోతున్నారు.
ఇది వారి మానసిక స్థితి పై తీవ్రమైన ప్రభావాన్ని వేస్తున్నది. దీని వల్ల నిరంతర ఆందోళన (chronic anxiety), అస్తిత్వ ఘర్షణ (identity dissonance), విజయాలు సాధించినప్పటికీ తనలో తాను తక్కువ అనే భావన (sense of inadequacy) ఉంటాయి… ఇది వారిలో లోతుగా నాటుకుపోయిన ఆత్మన్యూనతా భావాన్ని (inferiority complex) ప్రతిబింబిస్తుంది, తద్వారా వారు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించలేకపోతున్నారు.
ఇది వారిలో ఆందోళనను, తక్కువ భావనను కలిగిస్తోంది.
అంతేకాకుండా, రిజర్వేషన్లు కులాన్ని నిర్మూలించడానికి బదులు, దాన్ని ‘పరిహారపు చట్రంలో’ మరింత బలపరిచాయని తేల్తుంబ్డే అంటాడు. ఇది వివిధ కులాల మధ్య హక్కుల కోసం పోటీని పెంచి, కుల అస్తిత్వాలను పునరుత్పత్తి చేసి, కుల ఉద్రిక్తతలను పెంచింది.
స్వాతంత్ర్య సమయంలో ఉన్న విద్యా అసమానతలు ఇప్పుడు మరింత పెరిగాయి. అందరికీ సమాన విద్యను అందించే ‘ఉమ్మడి విద్యా విధానాన్ని’ (కామన్ స్కూల్ సిస్టమ్)ను తీసుకురావడంలో భారతదేశం విఫలమైంది. విద్య అనేది ప్రజాస్వామ్య ఆశయాలకు అనుగుణంగా కాక సామాజిక హోదా ఆధారంగానే అందుతోంది. విద్యా రంగంపై ప్రభుత్వం చేసే ఖర్చు జీడీపీలో 6 శాతం ఉండాల్సిన చోట 3 శాతం వద్దే ఆగిపోయింది.
దీనివల్ల దళితులు విద్యాపరంగా వెనుకబడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఎదిగిన ధనిక కులాల పిల్లలు (ప్రస్తుతం భూములను కలిగి ఉన్న శూద్ర కులాల వారితో సహా) ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తుంటే, వసతులు లేని ప్రభుత్వ స్కూళ్లు దళిత పిల్లలకే పరిమితమవుతున్నాయి. “దళిత పిల్లలు నాణ్యత లేని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చిక్కుకుపోతున్నారు. ధనికులు అవకాశాలను కొనుక్కుంటున్నారు, దళితులు పేదరికాన్ని వారసత్వంగా పొందుతున్నారు.” ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంవి కేవలం అగ్రవర్ణ ధనికులకే అందుతున్నాయి. ఉన్నత విద్య పై ప్రైవేట్ కాలేజీల ఆధిపత్యం పెరుగుతోంది. వాటిలో రిజర్వేషన్లు లేవు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఖరీదైన ప్రైవేట్ విద్యే ఆధిపత్యం చెలాయించడం వల్ల రాజ్యాంగ రక్షణలు దళితులకు ఉన్నా లేనివాటిగానే మారిపోయాయి. దీనివల్ల దళిత విద్యార్థులు ప్రమాణాలు లేని విద్యాసంస్థలకే పరిమితమైపోయారు. ఇది దళిత విద్యార్థుల భవిష్యత్తును, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు “అపరిమితమైన అపవాదును మోపుతూ, అతి తక్కువ ప్రయోజనాలను అందించాయని” తేల్తుంబ్డే విశ్లేషించాడు. రిజర్వేషన్లు వర్తించే ప్రభుత్వ రంగం భారతదేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో కేవలం 4 శాతం మాత్రమే ఉంది. దీనితో పోలిస్తే చైనాలో 32 శాతం, ఉత్తర దేశాలలో 15 నుండి 25 శాతం వరకు ఉంది. ఈ లెక్కల ప్రకారం, కోటాల వల్ల కేవలం 0.6 శాతం ఎస్సీలకు, అంతకంటే తక్కువ శాతం ఎస్టీలకు మాత్రమే ప్రయోజనం కలుగుతోందని ఆయన అంచనా వేశారు. ఈ స్వల్ప మద్దతుకే దళితులు “అతి గారాబం పొందుతున్న వారనీ”, ప్రభుత్వ దానంపై ఆధారపడేవారనీ అవమానాలను, నిందలను ఎదుర్కోవాల్సి వస్తోంది. రిజర్వేషన్లు పొందిన అతి కొద్దిమంది దళితులు కూడా పని ప్రదేశాలలో శత్రుపూరితమైన, వివక్షతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వారు కీలకమైన నిర్వహణ, నిర్ణయాధికార బాధ్యతలకు దూరంగా, తక్కువ ప్రాధాన్యత ఉన్న పనులకే పరిమితమవుతున్నారు. ఇది ప్రభుత్వ రంగాన్ని “దళిత ఆకాంక్షల స్మశానం”గా మారుస్తోందని ఆయన అంటారు.
సాంప్రదాయకంగా అగ్రవర్ణాల గుత్తాధిపత్యంలో ఉన్న విద్యా సంస్థల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దళితులను ఫ్యాకల్టీగా నియమించుకోవడానికి ఈ సంస్థలు తీవ్రంగా నిరాకరిస్తున్నాయి. వారిని సమానులుగా చూడకుండా, “మేధోపరంగా అనధికారికంగా ప్రవేశించినవారిగా” పరిగణిస్తున్నాయి. 2019 గణాంకాల ప్రకారం, నలభై కేంద్ర విశ్వవిద్యాలయాలలో కేవలం 3.47 శాతం మంది ప్రొఫెసర్లు, 0.7 శాతం మంది అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రమే ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన వారు. అలాగే 2021లో ఐఐటీలలో కేవలం 1.68 శాతం, ఐఐఎంలలో కేవలం 0.23 శాతం మాత్రమే ఎస్సీ/ఎస్టీ ఫ్యాకల్టీ ఉన్నారు.
భారత లౌకికవాదం కులాన్ని ఎలా ‘రాజ్యాంగబద్ధం’ చేసింది
భారత రాజ్యాంగ పునాది అయిన “లౌకికవాదాన్ని” (secularism) కుల వివక్షను, నిచ్చెనమెట్ల వ్యవస్థను బలపరిచేలా ఎట్లా వ్యాఖ్యానించి అమలు చేశారో వివరించే విభాగం ఈ పుస్తకంలో చాలా ముఖ్యమైనది. తేల్తుంబ్డే ప్రకారం, భారత లౌకికవాదం కులానికి ఉన్న మతపరమైన మూలాలను ఎప్పుడూ ఎదిరించలేదు. దానికి బదులుగా, కుల ఆధారిత వ్యక్తిగత చట్టాల (personal laws) ద్వారా, ఆలయ ప్రవేశ నిషేధానికి సంబంధించిన విధానాలను సంస్కరించకపోవడం ద్వారా, ఆచారపరమైన పవిత్రత పేరుతో సాగే పద్ధతులను నిషేధించకపోవడం ద్వారా కులాన్ని “రాజ్యాంగబద్ధం” చేసింది. దీనివల్ల “లౌకిక దేశం అని పిలవబడే భారత్, సామాజిక అధికారాన్ని మతానికే వదిలివేసింది”.
ఒక దళిత వ్యక్తి కుల వివక్ష నుండి తప్పించుకోవడానికి సమానత్వాన్ని ఎక్కువగా పాటించే క్రైస్తవం లేదా ఇస్లాం వంటి మతాలకు మారాలనుకుంటే, రాజ్యాంగం వారికి రిజర్వేషన్లు అందకుండా అడ్డుకుంటోంది. రాజ్యాంగం దళితులను హిందూ మత చట్రంలోనే బంధించి ఉంచుతోంది. “తమ అణచివేతను సమర్థించే మత గుర్తింపు నుండి తప్పించుకోవడానికి దళితులకు రాజ్యాంగపరమైన మార్గం ఏదీ లేదు” అని ఆయన అంటారు.
కుల నిర్మూలన లేకుండా సాగే లౌకికవాదం, అది ఏ నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థను అధిగమిస్తానని చెప్పిందో దాన్నే మళ్లీ బలపరిచిందని ఆయన అంటారు.
హక్కులను ఉల్లంఘించే అధికారులకు శిక్ష నుండి మినహాయింపు ఉండటం (impunity) – ఒక తీవ్రమైన లోపం
సామాజిక న్యాయాన్ని అందించే ప్రాథమిక హక్కులను రాజ్యాంగం కల్పించినప్పటికీ, అదే సమయంలో ప్రభుత్వ అధికారులకు శిక్ష నుండి మినహాయింపు కల్పించడం ఒక తీవ్రమైన లోపం అని ఆయన ఎత్తిచూపారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పోలీసులు, భద్రతా దళాలు, న్యాయమూర్తులు పౌరుల హక్కులను కాపాడటంలో విఫలమైనప్పుడు మాత్రమే కాదు హక్కులను ఉల్లంఘించినప్పుడు కూడా వారిపై క్రమశిక్షణ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చట్టం కాపాడుతోంది. ఈ చట్టపరమైన కవచం ఉండటం వల్ల ప్రభుత్వం హక్కులను కాపాడాల్సిన తన విధుల్లో విఫలమైనప్పుడు మాత్రమే కాకుండా, కుల, మత, వర్గ పక్షపాతంతో హక్కులను కాలరాసినప్పుడు కూడా అధికారులకు రక్షణగా నిలుస్తోంది.
శిక్ష నుండి ఈ మినహాయింపు వల్ల దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, అసమ్మతివాదులకు రాజ్యాంగ రక్షణ లేకుండా పోతోంది. అంటే కస్టడీలో హింస, అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు కూడా సరైన న్యాయం జరగడం లేదు. అధికారులకు ఈ రక్షణ ఉండటం వల్ల దళితులు, ఆదివాసీలు, ముస్లింల విషయంలో ఇది నిరంతరం చిత్రహింసలకు, నిర్బంధానికి, వారి ఉనికిని తుడిచిపెట్టే చర్యలకు దారితీస్తోంది. విచారణ లేదా బెయిల్ లేకుండా వ్యక్తులను నిర్బంధించే అధికారం (తేల్తుంబ్డేను కూడా ఇలాగే నిర్బంధించారు) రాజ్యాంగం చేసిన అతిపెద్ద తప్పు అని ఆయన పేర్కొన్నారు.
“స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం అనే ఆశయాలు ఇంకా సుదూర స్వప్నాలుగానే మిగిలిపోయాయి. వీటిని రాజ్యపు శత్రువులు కాదు, రాజ్యమే వంచించింది” అని ఆయన ముగించారు. ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం పాలకులకిచ్చే శిక్షా మినహాయింపుపై మనగడ సాగించలేదు. దేశం పేరుతో అధికారం చలాయించే వారిని ఖచ్చితంగా జవాబుదారులుగా నిలబెట్టేలా చేసేందుకు తగిన బలాన్ని అది కలిగి ఉండాలి.
ముందున్న మార్గం – ఐక్య రాజకీయ పోరాటం
రాజ్యాంగం ఇప్పుడున్న దానికంటే భిన్నంగా ఉండే అవకాశం లేదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అది ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను చట్టం రూపంలో పొందుపరిచిన పత్రం. “రాజ్యాంగం సమాజం కంటే ఉన్నత స్థానంలో ఉండదు; అది అధికారం ఉన్నవారి రాజకీయ ఇష్టాన్నే ప్రతిబింబిస్తుంది” అని ఆయన అంటాడు.
రాజ్యాంగం నిజంగా దళితుల ప్రయోజనాల కోసం పనిచేయాలంటే, పాలక వర్గాలు స్పందించేలా దళితులు తమ రాజకీయాలను తీర్చిదిద్దుకోవాలి. “దీనికి అద్భుత పరిష్కారాలు ఏవీ లేవు—కేవలం సామూహిక రాజకీయ పోరాటం ద్వారా మాత్రమే ఇది సాధ్యం.”
పీఠిక
భారతదేశంలోని అన్ని సామాజిక వర్గాల కంటే దళితులకు, భారత రాజ్యాంగానికి మధ్య ఉన్న బంధం అత్యంత బలమైనది. ఈ లోతైన అనుబంధాన్ని దళితులు, సమాజంలోని ఇతరులు వేర్వేరు కోణాల్లో చూస్తారు. దళితులకు రాజ్యాంగం అంటే ఒక గొప్ప భావోద్వేగం. దీనికి ప్రధాన కారణం తమ విముక్తి కోసం పని చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనికి రూపశిల్పి కావడం. దీనికి విరుద్ధంగా, దళిత వ్యతిరేక ఆలోచనలు ఉన్నవారు రాజ్యాంగాన్ని కేవలం దళితులకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించే పత్రంగా భావిస్తారు.
అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. రాజ్యాంగ వాగ్దానాలు దళితుల విషయంలో విఫలమైనంతగా మరే ఇతర విషయంలోనూ కాలేదు. రాజ్యాంగ రక్షణలు, రిజర్వేషన్లు ఒక చిన్న దళిత మధ్యతరగతి వర్గం ఏర్పడటానికి సహాయపడ్డాయి. కానీ ఈ వర్గం ఒక రకమైన సందిగ్ధ స్థితిలో ఉండిపోయింది. కుల వివక్ష కారణంగా వీరు అటు ప్రధాన స్రవంతి భారతీయ మధ్యతరగతిలో చేరలేకపోతున్నారు. మరో వైపు ఏ ఇతర సాధారణ దళిత ప్రజలతో తాము ఉమ్మడిగా గతాన్ని పంచుకున్నారో వారితో వర్తమానాన్ని పంచుకోలేక వారికి దూరంగా ఉంటున్నారు. ఈ వర్గంలోని కొందరు విదేశాలకు వెళ్లి కుల అణచివేతను, అంబేద్కర్ వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. కానీ వీరు కేవలం పైకి కనిపించే కొద్ది భాగం మాత్రమే. దీని కింద మెజారిటీ దళితుల జీవితాలను కుదిపేస్తున్న ఆకలి, బాధలు, వేదనలు అలాగే ఉన్నాయి. ఈ మధ్యతరగతి సాధించిన విజయాలు మెజారిటీ దళితులు ఎదుర్కొంటున్న వివక్షను, దోపిడీని కప్పివేయడమే ఒక వైచిత్రి. వారి పురోగతి ముఖ్యమైనదే అయినప్పటికీ, అది ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది: రాజ్యాంగం దళితులకు ఇచ్చిన విముక్తి వాగ్దానాన్ని నిజంగా నెరవేర్చిందా? దురదృష్టవశాత్తు, దీనికి సమాధానం ‘లేదు’ అని స్పష్టంగా వినిపిస్తోంది.
రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, దానిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన పది పుస్తకాల సిరీస్‌లో ఇది చివరిది. రాజ్యాంగం తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుందా? అని అడగడానికి డెబ్బై ఐదు ఏళ్ల సమయం సరిపోతుంది. ఈ సిరీస్‌లోని మునుపటి పుస్తకాలను రాసిన మేధావులు కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగ లక్ష్యాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య వ్యత్యాసం ఉందని వారు అంగీకరించారు. కానీ, వారు ఆ తప్పును రాజ్యాంగానికి కాకుండా, దానిని అమలు చేసే వ్యక్తులకు ఆపాదించారు. అంబేద్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక గొప్ప రాజ్యాంగం కూడా చెడ్డ వ్యక్తుల చేతుల్లో ఉంటే విఫలమవుతుందనీ అదే సమయంలో, లోపాలున్న రాజ్యాంగం కూడా మంచి నాయకుల చేతుల్లో గొప్పగా పనిచేస్తుందని ఆయన తరచుగా చెప్పేవారు. ఆయన దృష్టిలో అసలు ఉండాల్సింది “రాజ్యాంగ నైతికత” (Constitutional Morality). గ్రీకుల చరిత్ర రచనకు ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ చరిత్రకారుడు జార్జ్ గ్రోట్ నుండి ఆయన ఈ పదాన్ని తీసుకున్నారు1.
అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ విలువల పట్ల, దాని స్ఫూర్తి పట్ల గాఢమైన గౌరవంతో మసులుకోకపోతే, ఎన్ని చట్టాలు ఉన్నా ఎటువంటి మార్పూ రాదని అంబేద్కర్ నమ్మారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నైతికతను కేవలం నిబంధనలు పాటించడం కంటే లోతైన అంశంగా చూశారు. అది రాజ్యాంగ స్ఫూర్తి పట్ల అందరికీ ఉండవలసిన ఉమ్మడి నిబద్ధత. అధికారంలో ఉన్నవారు, సామాన్య పౌరులు కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. ఇది కేవలం ఒక బాధ్యతగా కాకుండా, ఒక దృఢమైన విశ్వాసంగా ఉండాలి. ఇటువంటి నైతిక దిక్సూచి ఉంటేనే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, చట్టబద్ధ పాలనను కొనసాగించడం, మన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కాపాడుకోవడం సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారు. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన, తీవ్రమైన అసమానతలు ఉన్న దేశంలో ఈ రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవడం కేవలం ముఖ్యం మాత్రమే కాదు; అది అత్యవసరం. మనల్ని మనం పరిపాలించుకునే విధానం రాజ్యాంగంలోని విలువలను ప్రతిబింబించేదిగా ఉండాలని అంబేద్కర్ తరచుగా నొక్కి చెప్పేవారు. ఒకవేళ పాలకులు ఈ సూత్రాన్ని గౌరవించకపోతే, రాజ్యాంగం ఎంత బాగా రాసినప్పటికీ, దానిని కాపాడవలసిన వారే దానిని నీరుగారుస్తారని ఆయన ముందే హెచ్చరించారు. ఆయన ఇలా అన్నారు:
“రాజ్యాంగం రూపాన్ని మార్చకుండానే, కేవలం పరిపాలనా విధానాన్ని మార్చడం ద్వారా దానిని వక్రీకరించడం సాధ్యమే. అలా చేయడం ద్వారా రాజ్యాంగాన్ని దాని ఆశయాలకు విరుద్ధంగా మార్చవచ్చు2.”
పరిపాలనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని రాజ్యాంగం వివరించలేదు. అందుకే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ నైతికతను అలవర్చుకోవాలని డాక్టర్ అంబేద్కర్ పట్టుబట్టారు. ఆయన ఒక ప్రసిద్ధ హెచ్చరిక చేశారు: “భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ప్రాథమికంగా ప్రజాస్వామ్య విరుద్ధమైన భారతీయ నేల మీద వేసిన పైపూత (top-dressing) వంటిది3.” మరో మాటలో చెప్పాలంటే, ప్రజాస్వామ్యం అనేది భారత సమాజానికి సహజంగా వచ్చినది కాదు; దానిని మనం స్పృహతో నేర్చుకోవాలి, ఆచరించాలి, పెంచి పోషించాలి.
మన పాలకులు ఈ సవాలును కొద్దికాలంలోనే స్వీకరిస్తారనే నమ్మకం అంబేద్కర్ కు పెద్దగా ఉన్నట్లు అనిపించదు. ఇది మనల్ని ఒక కఠినమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది: రాజ్యాంగం తన గొప్ప వాగ్దానాలను నెరవేర్చడంలో చివరికి విఫలం కావచ్చని ఆయన ముందే ఊహించారా? దీనిని ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ, రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ఆశయాలను నేటి మన స్థితితో పోల్చి చూస్తే, ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ ప్రమాదంలో ఉంది. వలస పాలన కాలం కంటే ఇప్పుడు ఆర్థిక అసమానతలు దారుణంగా ఉన్నాయి. హిందుత్వ పునరుజ్జీవన ఉద్యమం వల్ల పెరుగుతున్న మత విద్వేషం, కుల స్పృహ కారణంగా సౌభ్రాతృత్వం ముక్కలైపోయింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఇంకా అందని ద్రాక్షగానే ఉన్నాయి. మన ప్రజాస్వామ్య పునాదులు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తోంది.
అయితే తేడా ఎక్కడ వచ్చింది? అధికారంలో ఉన్నవారిని వేలెత్తి చూపడం సులభం, కొంతవరకు ఆ విమర్శ సమంజసమే. కానీ నిజం అంతకంటే లోతుగా ఉంది. అధికారం కోసం ఆరాటపడే వారు స్వచ్ఛందంగా రాజ్యాంగ నైతికతను పాటిస్తారని ఆశించడం కేవలం అత్యాశే కావచ్చు. మనుషులు సహజంగానే సరైన పనులు చేసే ప్రవృత్తి కలిగి ఉంటే, మనకు అసలు రాజ్యాంగమే అవసరం ఉండేది కాదు. ఎంత స్వార్థపరులైన నాయకులనైనా నియంత్రణలో ఉంచే ఒక వ్యవస్థను నిర్మించడమే రాజ్యాంగం యొక్క అసలు ఉద్దేశ్యం.
రాజ్యాంగ నైతికత అనేది తనంతట తానుగా ఏర్పడేది కాదు-దానిని పెంపొందించుకోవాలి. ఈ పెంపొందించుకోవడం శూన్యంలో జరగదు. ఒక సమాజంగా మనం రాజ్యాంగంతో ఎంత తీవ్రంగా మమేకమవుతామనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. సంస్థలు చురుగ్గా ప్రోత్సహించకుండానే నైతికత ఏదోవిధంగా ఉద్భవిస్తుందని అనుకోవడం వెర్రితనం అవుతుంది. కేవలం పరిమితులు విధించడమే కాకుండా, అధికారాన్ని చెలాయించే వారి నైతిక అలవాట్లను తీర్చిదిద్దడం కూడా రాజ్యాంపు బాధ్యతే.
రాజ్యాంగాలు కేవలం సమాజ ప్రతిబింబాలని, వాటిని నడిపించే వ్యక్తులు ఎటువంటి వారనే దాన్ని బట్టి రాజ్యాంగాలు పనిచేస్తాయని కొంతమంది అంటుంటారు. కానీ ఈ దృక్పథం ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తోంది: సమాజాన్ని మార్చే శక్తి రాజ్యాంగానికి ఉంది. జవాబుదారీతనం, అధికార నియంత్రణలు, స్పష్టమైన న్యాయ దృక్పథంతో రూపొందించిన రాజ్యాంగం నిరంకుశ అధికారాన్ని అడ్డుకోగలదు. పాలకులను మరింత న్యాయబద్ధమైన ఫలితాల వైపు నడిపించగలదు. సృజనాత్మకతతో రూపొందించినప్పుడు, రాజ్యాంగం కేవలం ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా దానిని తిరిగి నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది సంస్థలను, సామాజిక నిబంధనలను సమానత్వం వైపు మళ్లిస్తుంది. విప్లవానికి నాంది పలకకపోయినా, సామాజిక మార్పుకు రాజ్యాంగం ఒక శక్తివంతమైన సాధనంగా నిలువగలుగుతుంది.
అయినా, రాజ్యాంగం ఏమి చేయగలదు లేదా ఏమి చేయాలి అనే పెద్ద తాత్విక ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నించలేదు. ఒక నిర్దిష్టమైన, అత్యవసరమైన పనికి మాత్రమే కట్టుబడి ఈ పుస్తకాన్ని రాసాను: భారత రాజ్యాంగం దళితుల కోసం వాస్తవంగా ఏమి చేసింది – లేదా ఏమి చేయడంలో విఫలమైంది అనే అంశాన్ని ఈ పుస్తకంలో పరిశీలించాను. రాజ్యాంగం ఇంకా ఏమి చేసి ఉండవచ్చు, ఎందుకు చేయలేదు అనే విషయాలను ఈ పుస్తకం సూటిగా చెప్పడానికి కూడా వెనుకాడలేదు.
ఉదారవాద ప్రజాస్వామిక విలువలపై ఆధారపడిన ఏ రాజ్యాంగమైనా, అత్యంత అణచివేతకు గురైన వారి కోణంలో చూసినప్పుడు విమర్శలను ఎదుర్కోక తప్పదు. రాజ్యాంగాలు శూన్యం నుండి పుట్టవు – అవి అప్పటి సమాజంలో అస్తిత్వంలో ఉన్న అధికార సంబంధాలను సూత్రబద్ధం చేస్తాయి. చట్టబద్ధత, ప్రజాస్వామ్యం అనే ముసుగులో అవి తరచుగా ఆధిపత్య వర్గాల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకే అండగా నిలుస్తాయి. గడిచిన డెబ్బై ఐదు ఏళ్లను గమనిస్తే చాలు: రాజ్యాంగ పాలనలో ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు కష్టాలు పడ్డారు అనేది ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ఈ పుస్తకంలో ఆరు అధ్యాయాలు ఉన్నాయి. మొదటి రెండు అధ్యాయాలు రాజ్యాంగంలో దళితుల కోసం చేసిన ప్రత్యేక నిబంధనల వెనుక ఉన్న చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని వివరిస్తాయి. తరువాతి మూడు అధ్యాయాలు ఈ నిబంధనలను నిశితంగా పరిశీలిస్తాయి. సామాజిక న్యాయం పేరుతో పాలక వర్గాలు వీటిని ఎలా చాకచక్యంగా వాడుకున్నాయో వివరిస్తాయి. ఆ తరువాతి అధ్యాయం దళితులకు నేరుగా సంబంధం లేకపోయినా, వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్న లౌకికవాదం, రాజ్యం జోక్యం చేసుకునే విధానాల వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. ముగింపు అధ్యాయం (Epilogue) రాజ్యాంగం దళితులకు విముక్తి లభిస్తుందనే ఒక శక్తివంతమైన భ్రమను ఎలా కల్పించిందో వివరిస్తుంది. దళితుల విముక్తిలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైనప్పటికీ, వారు దానికే అత్యంత బలమైన మద్దతుదారులుగా ఎలా మారారో ఈ అధ్యాయం చర్చిస్తుంది.
అధ్యాయాల జాబితా ఇలా ఉంది:
- దళితులు – జాతీయ రాజకీయాలు
- భారత రాజ్యాంగ రూపకల్పన
- అస్పృశ్యత నివారణ
- రాజకీయ ప్రాతినిధ్యంలో రిజర్వేషన్లు
- విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
- లౌకికవాదం – శిక్షా రాహిత్యానికి (Impunity) సంబంధించిన అంశాలు
దళితుల గౌరవం, సమానత్వం, న్యాయం కోసం రాజ్యాంగం ఇంకా ఎంతో చేయగలిగి ఉండేది, చేసి ఉండాలి అనే అచంచలమైన నమ్మకంతో ఈ పుస్తకాన్ని రాసాను. ప్రస్తుత వాతావరణంలో, రాజ్యాంగాన్ని తిరగరాయాలని లేదా మార్చాలని మితవాద ప్రతీఘాతకులు (హిందూత్వవాదులు- అను) ప్రయత్నిస్తున్న తరుణంలో, రాజ్యాంగంపై ఇటువంటి విమర్శనాత్మక విశ్లేషణను వారి అజెండాకు మద్దతుగా కొందరు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఈ పుస్తకం రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న విముక్తి వాగ్దానాలైన – స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం – వంటి విలువలకే కట్టుబడి ఉంది. ఒక మతస్వామ్య, జాతివాద హిందూ రాష్ట్రాన్ని స్థాపించడం ద్వారా పౌరాణిక గతాన్ని పునరుద్ధరించాలని చూస్తున్న మితవాదుల పథకాన్ని నిస్సందేహంగా ఈ పుస్తకం ఖండిస్తుంది. ఇది జాతీయ పునరుజ్జీవనం పేరుతో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని స్థిరపరిచే వెనుకబడిన ఆలోచన అని స్పష్టం చేస్తోంది. హిందూ రాష్ట్ర స్థాపన అనేది భారతదేశానికి జరిగే అతిపెద్ద విపత్తు అని అంబేద్కర్ చేసిన హెచ్చరికను నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను.
అవును, రాజ్యాంగంలో లోపాలు ఉన్నాయి – రాబోయే పేజీలు దీనిని నిరూపిస్తాయి. కానీ ఒక నిజమైన ప్రజాస్వామ్య, ప్రజానుకూల ప్రత్యామ్నాయాన్ని నిర్మించకుండా రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడం అంటే, న్యాయం కోసం పోరాడటానికి మిగిలి ఉన్న చివరి చట్టపరమైన, నైతిక వ్యవస్థను నాశనం చేయడమే అవుతుంది.




