“జీవితంలో పుస్తక పఠనం చాలా ముఖ్యం.”
1. నాకు ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క ఉండడం వల్ల అన్నయ్యల ద్వారా వారి స్నేహితుల ద్వారా నాకు దిన వార పత్రికలు చదవడం అలవాటయింది ఆంధ్రప్రభ వార పత్రిక మా అన్నయ్య తెప్పిస్తుండేవాడు. వాటిలో కార్టూన్ లు కథలు సీరియల్స్ ప్రముఖ రచయితలు రచయితలవి చదవడం అలవాటయింది. చిన్న వయసులోనే ఆ అలవాటు కొనసాగింది.
2. పుస్తకాలను చదవడం వల్ల మరిన్ని పుస్తకాల పరిచయము వాటి గురించిన అవగాహన కలుగుతూ ఉండేది ముఖ్యంగా నేను నేషనల్ బుక్ ట్రస్ట్ కావచ్చు సాహిత్య అకాడమీ కావచ్చు వాటి ప్రచురణలు అలాగే, వివిధ కవుల కధకుల సంపుటాల్ని సేకరించడం చదువుకోవడం, నా దగ్గరే అట్టి పెట్టుకోవడం అలాగే ప్రత్యేక సంచికలు స్మారక సంచికలు ఒక విషయం మీద సంకలించిన పుస్తకాలు ఇలా నా అభిరుచికి తగట్టు సాహిత్యంలోని వైవిధ్య భరితమైన రచనలను తెలుసుకుంటూ సేకరించి చదువుకోవడం జరిగేది. భద్రపరిచే విధానంలోనే కొంత నా లోపం ఉంది. చదివినవి అల్మరా ర్యాక్స్ లో ఉంచడం అవసరమైనప్పుడు ఒక దానికోసం చాలా సేపు వెతకడం అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఉన్న వాతావరణ దృష్ట్యా పుస్తకాలు భద్రంగానే ఉన్నాయి.
3.నేనెప్పుడూ మంచి పుస్తకాలను చదవాలనుకుంటాను. ప్రసిద్ధి కెక్కిన రచయితల సాహిత్యం, ఎవరిదైనా తప్పనిసరిగా చదవాలి అనుకున్నవి సేకరించి చదువుతుంటాను. ఇది చదవలేకపోయానే అనే బాధ ఎందుకు ఉండదంటే అలా చదవాల్సినవి, చదవలేకపోయినవి చాలానే ఉంటాయి కదా! ఆ అసంతృప్తి కంటే ఏది మనకు అందుబాటులో ఉందో వాటిలోనే ఎంచుకొని చదువుతూ ఉంటే అదే ఆనందంగా ఉంటుంది. పుస్తకాలు కొనడం సేకరించడం చిన్నప్పటినుంచే నాకు అలవాటు ఉంది. ముఖ్యంగా అప్పట్లో ఇప్పుడు నేషనల్ బుక్ ట్రస్ట్ లాంటిది దక్షిణ భారత సాహిత్యం ప్రచురించే సంస్థ ద్వారా మంచి రచనలు అలాగే అనువాద రచనలు కూడా చదవడం అలవాటయింది. ఒకరకంగా సాహిత్యంతో నాకున్న పరిచయమే కామర్స్ విద్యార్థిని నేను హిందీ సాహిత్యం, ఆ తర్వాత ఆసక్తి కొద్దీ ఉద్యోగా నిర్వహణకు సహాయపడే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశాను. సాహిత్యం పట్ల ఉండే ఆసక్తి వల్లనే అటు ఆంధ్ర యూనివర్సిటీలో పిజి చేసేటప్పుడు, తిరుపతిలో రాష్ట్రీయ విద్యాపీఠం- ఇప్పుడు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ లో పీజీ డిప్లమోలు సంస్కృతం ఇంగ్లీషు యోగ విజ్ఞాన్ టెంపుల్ కల్చర్ లో ఈవినింగ్ కోర్సులు చేశాను. అలా నాలుగు భాషల సాహిత్యంతో పరిచయము ఏర్పడింది. తెలుగు మీద అభిరుచితో చిన్నప్పటి నుంచి చదవడం వల్ల భాష మీద మక్కువ పట్టు సాధించడం వీలైంది. కథ నవల సాహిత్యం విమర్శ ఇలా ఏదైనా నాకు ఇష్టమైన అంశాలే
4. సేకరించి పెట్టుకున్న పుస్తకాలు చెదల వల్ల పాడైపోయిన రెండు సందర్భాల్లో నాకు ఎంతో దుఃఖాన్ని కలిగించిన సందర్భాలు. మొదటిసారి పీజీ చేస్తున్నప్పుడు నేను ఇంట్లో లేని సమయంలో తిరిగి వచ్చి చూసుకున్నప్పుడు ఆ పుస్తకాలు పాడై ఉండడం గమనించి ఎంతో బాధ కలిగింది. అలాగే మళ్లీ నా ఉద్యోగ విరమణకు ముందు విజయవాడలో ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని పుస్తకాలు చెదలు పట్టి పాడైపోయినాయి. నేను పుస్తకాల్ని సేకరించి అభిమానించి దాచుకున్న పుస్తకాలు అలా నష్టపోవడం ఎంతో బాధని కలిగించాయి.
5. ప్రఖ్యాత రచయిత రచయిత్రుల పుస్తకాలన్నీ నాకు ఎంతో ఇష్టమైన పుస్తకాలే! అలా చదివే క్రమంలో నాకు ఇష్టమైన రచయితల రచనలు చాలా పెద్ద లిస్టే అవుతుంది.
6.ఏ కొద్ది మందినో చెప్పి, గుర్తు లేకపోవడం చేత మరికొందరిని చెప్పకపోవడం అది కూడా నాకు ఇష్టం ఉండదు. తెలుగులో ఎంతోమంది రచయితల కథలు నవలలు కవుల కవితా సంపుటాలు సంకలనాలు కొత్తవీ పాతవి చదవడం ద్వారా నా లోక పరిజ్ఞానం నా పఠనాభిలాష, జిజ్ఞాస తీర్చుకోవడానికి ఎంతగానో సహకరించాయి. జీవితానుభవంతో పాటు పుస్తక పఠనానుభవం కూడా జీవితంలో ఒక అవిభాజ్యమైన భాగం అయిపోయింది. నేను ఆకాశవాణిలో ఉద్యోగించడం వల్ల ఎందరో రచయితలు కవులు సాహిత్యకారులు విమర్శకులు వివిధ వృత్తుల్లో నిష్ణాతులైన వారితో చక్కని సంబంధ బాంధవ్యాలు ఉండటం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడం నేర్చుకోవడం జరిగింది.
ఆ స్థాయి వ్యక్తులతో మాట్లాడాలి అంటే మనం కూడా ఎంతో కొంత ఆ రంగంలో కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం తగిన గౌరవాన్ని పొందుతాం. ఆ వ్యక్తులతో ఆ స్థాయిలో సంభాషించ గలిగిన తృప్తి మనకూ వారికి కూడా ఉంటుంది పరోక్షంగా అది మానసిక ఎదుగుదల పరిణతికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని భావిస్తూ వచ్చాను. అది యదార్థం.
6. నా ఉద్యోగ సమయంలో నాకు చదవడానికి రాయడానికి ఎక్కువ సమయం ఉండేది కాదు. ఆకాశవాణి స్టూడియోస్ లో రికార్డింగ్ ఎడిటింగ్ వగైరాలతో, అలాగే బయట జరిగే కార్యక్రమాలకు వెళ్లి రికార్డ్ చేసి తీసుకువచ్చి వాటిని తయారు చేసి, శ్రోతలకు అందించడంలో నాకు ఫీల్డ్ అనుభవం చాలా తృప్తిని ఇచ్చేది. అందువల్ల ఒకరకంగా కుటుంబానికి అవసరాలకు మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ మిగతా సమయం ఉద్యోగ ధర్మ నిర్వహణలోనూ, నా అభిరుచి తగిన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం జరిగింది.
సాహిత్య సభల్లో పెద్దవాళ్ల ప్రసంగాలు వినడం, వక్తగా నాకు కూడా భాగస్వామ్యం కల్పించినప్పుడు అప్పటివరకు నాకున్న పరిజ్ఞానమే కాకుండా దాన్ని అప్డేట్ చేసుకుని ప్రసంగిస్తూ లేదా అడిగిన వారికి రచనలు చేస్తూ వచ్చాను. సాహిత్యంలో కథ నవల నాటకం నా అభిమాన విషయాలు అన్నాను కదా! నాటకం మీద అభిరుచి చిన్నప్పుడే స్కూలు కళాశాల రోజుల నుంచి రంగస్థలంకి
పరిచయం చేసింది. అది అలా యూనివర్సిటీ స్థాయి వరకు సాగింది. ఆ తర్వాత నా మొదటి నిజామాబాద్ ఉద్యోగం లో ఎనిమిది సంవత్సరాలు పాటు నాటక రంగంలో పనిచేశాను. ఆకాశవాణిలో యూపియస్సీ డైరెక్ట్ డ్రామా విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ గా చేరిన తర్వాత ప్రత్యక్షంగా నాటకాలు వేసే తీరుబడి రిహార్సల్స్ కి అటెండ్ అయ్యే అవకాశం లేనందువల్ల,శ్రవ్య నాటికలు నాటకాలు ప్రొడ్యూస్ చేస్తూ,వాయిస్ ఇస్తూ సమీక్షకుడిగా విశ్లేషకుడిగా విమర్శకుడిగా
గుణ నిర్ణేతగా నాటక రంగానికి అంటి పెట్టుకున్నాను. 1980లో నా పీజీ పూర్తయ్యే ముందు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి 70 రోజుల రెసిడెన్షియల్ శిక్షణ శిబిరం, ఆ క్రమంలో ఆ తరువాత కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బెంగుళూరు రీజినల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అలాగే మరికొన్ని వర్క్ షాప్స్ అటెండ్ అవుతూ నా నాటక పరిజ్ఞానాన్ని, శిక్షణనుంచి బోధన స్థాయికి తీసుకు వెళ్లాను. అలా ఎన్నో నాటక పరిషత్తులకు గుణనిర్ణేతగా వ్యవహరించాను. ముఖ్యంగా మూడుసార్లు నంది నాటకోత్సవాల్లో బాలల నాటికలు యువతరం నాటికలు పెద్దల నాటికలు నాటకాలు ఈ విభాగాల్లో గుణ నిర్ణేతగా పనిచేశాను. అయితే నేను పుట్టిన గుడివాడ పౌరాణిక నాటకాలకు ప్రసిద్ధి చెందింది. అయినా నేను మాత్రం సాంఘిక నాటకాల వైపే మొగ్గు చూపుతూ వచ్చాను. నా ఉద్యోగ విరమణ తర్వాత 2016లో చదవడానికి రాయడానికి ఎక్కువ సమయం కేటాయించి( 1986 లో మొట్టమొదటిసారిగా నేను రెండు కవితా సంపుటాలు వేశాను. *అక్షరాలు నా ఆనవాళ్లు* *ప్రకృతి నేపథ్యంలో* అని. మళ్లీ ఉద్యోగ విరమణ తర్వాత నాకు హిందీ పాటల సాహిత్యంతో పరిచయం ఉండడం వల్ల *చాంద్ ఫిర్ నికలా* అనే 100 హిందీ సినిమా పాటలకు వివరణాత్మకమైన వ్యాఖ్యాన విశ్లేషణ, క్యూ ఆర్ కోడ్ తో ఆ పాట వెంటనే
చూడగలిగేలా ప్రచురణ చేశాను. తరువాత “స్యాహికే రంగ్* అనే యూపీ కి చెందిన అభిషేక్ సింహ్ కవితా సంపుటిని అనువదించి *సిరా రంగులు* అని రాశాను. దీనిని సమీక్షిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ మలయవాసిని గారు *అను నాదం* అనే శీర్షికతో ముందుమాట రాశారు. ఆ తర్వాత నాటక సమీక్షలు 2016 నుంచి 2025 వరకు నేను చూసిన తెలుగు సాంఘిక నాటకాలు నాటికలు, అలాగే వివిధ భాషల జాతీయస్థాయి నాటికల్ని చూసి సమీక్షలుగా రాసిన పుస్తకాలు *రంగవీక్షణం* *రంగ విపంచిక అని. అలాగే కరోనా కాలంలో వార్తల్లోని విషయాలను చదివి, ఛాయాచిత్రాలను గమనించి నా భావోద్వేగాలను చిత్ర కవితలుగా *దృశ్యం విత్తై మొలకెత్తితే* అనే కవితా సంపుటిని కూడా వెలువరించాను.
అందుచేత ఇప్పుడు నా సమయం అంతా చదవడం రాయడం సమీక్షల కోసం చదవడం రాయడంలో కాలాన్ని వెచ్చిస్తున్నాను. ఈ వ్యాపకం నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనంతో ఉన్న అనుబంధం, అనురక్తే ఈ స్థాయికి తీసుకువచ్చింది అని భావిస్తున్నాను.
రేడియోలో హిందీ పాటలు వింటూ పనులు చేసుకోవడం,చదవడం, లేదా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పుస్తక పఠనం నేను చేస్తూ ఉంటాను. దానికి ఒక నిర్దిష్ట సమయం అంటూ లేదు. తెల్లవారుజామున మెలకువ వస్తే అప్పుడు, లేదా నిద్రపోయే వరకు చదువుకోవడం రాసుకోవడం కొనసాగుతూ ఉంది.
7. పుస్తక పఠనం నాకు మంచి చెడ్డలను తెలుసుకునే అవకాశం కలిగించింది. ఆ అనుభవం పెద్దలతో నేరుగా మాట్లాడటం, విశ్లేషణ చేయడం నేర్పింది. పుస్తకాలు చదవడం వల్ల నా కార్యశైలి, ఉద్యోగ నిర్వహణ తీరు పై ఎంతో ప్రభావం చూపింది. లోకం తీరును అర్థం చేసుకోవడం, మంచికి దోహదపడటం చెడుకు దూరంగా ఉండడం నేను మోసపోయినా సహాయం చేయడం అనేది సాటి మనిషిగా నా కర్తవ్యంగా భావించి డబ్బును పోగొట్టుకున్నానన్న దుఃఖం నుంచి చాలా సులభంగా బయటపడగలిగాను. పుస్తకాలు చదవడం వల్ల నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకూ, ఇప్పుడు తిరుపతిలో ఉండడం చేత వివిధ ప్రాజెక్టులలో గానీ, వారి ఉద్యోగుల శిక్షణ అకాడమీలో టీచింగ్ ఫ్యాకల్టీ గా , శిక్షణా శిబిరాలలో విద్యార్థులకు బోధించడానికి, ఏ వయసుకు తగిన వారి కి ఆ వయసు తగ్గట్టు వివేచన, వివేకం కల్పించడానికి పుస్తక పఠనం నాకు ఎంతగానో తోడ్పడుతోంది. అలాగే ముఖ్యంగా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్ని చదవడం వాటిని రేడియో ద్వారా శ్రోతలకు పరిచయం చేశాను గతంలో. రేడియోలో ప్రసారమైన ఆ పుస్తక పరిచయాలు విని విశాలాంధ్ర లాంటి పుస్తకాలయాలకు వెళ్లి ఆ పుస్తకం గురించి అడిగి కొని
తీసుకొని వెళ్ళినట్లుగా కూడా అక్కడి సిబ్బంది నాకు చెప్పినప్పుడు ఎంతో సంతోషం కలిగేది. పుస్తక పఠనంతో ఎంతో వైవిధ్యవంతమైన జీవితాన్ని, మనః ప్రవృత్తులు తెలుసుకోవడం ద్వారా వ్యక్తిగతమైన కష్టనష్టాలు బాధలు ఇవి నన్ను పెద్దగా బాధించలేదు. ఉన్నంతలో ఆనందంగా జీవించడం నేర్పింది. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో నేను ప్రారంభించిన *కథాయాత్ర* లో ఇప్పటికీ ప్రతిరోజూ ఒక కథ ఆడియో పెడుతూ ఉంటాను. 250 మంది గల ఆ సమూహం ఎక్స్ క్లూజివ్ గా కథా పఠనంతో పాటు నా రచనలు అలాగే సమూహ సభ్యులు తెలుసుకోదగిన సాహిత్య విజ్ఞాన పరమైన అంశాలను కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను.
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ వాళ్లు నిర్వహించే యూత్ ఫెస్టివల్ లో డ్రామా విభాగంలో గుణ నిర్ణేతగా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల్లో జరిగే పోటీలకు నేను గుణ నిర్ణేతగా వెళ్లడం, నా పుస్తక పఠన పరిజ్ఞానంతో నా మాట తీరు, నా ప్రవర్తన పదుగురి ప్రశంసలు, గుర్తింపుకి నోచుకోవడం అనేది భాషా పరిజ్ఞానం వల్లనే అని గట్టిగా నమ్ముతున్నాను.
నా క్రెడిట్స్ కొన్ని పుస్తక పఠనానికే చెందుతాయని కృతజ్ఞతా భావంతో చెబుతున్నాను.
(ఆకుల మల్లేశ్వరరావు @ ఆల్ ఇండియా రేడియో: కృష్ణాజిల్లా, గుడివాడ స్వస్థలం.నంది నాటక ప్రాథమిక పరిశీలకుడిగా, తుది ఎంపిక జ్యూరీ సభ్యుడిగా, నార్త్ వెస్ట్ యూనిఫెస్ట్ 23-24 జ్యూరీ సభ్యునిగా, సౌత్ ఇండియా సైన్స్ డ్రామా కాంపిటి పానెల్ జడ్జిగా పనిచేసిన అనుభవం వారిది. ఆల్ ఇండియా రేడియోలో సుదీర్ఘకాలం పనిచేసి ప్రోగ్రాం హెడ్ గా 2016 లో పదవీ విరమణ చెందారు.
కవిగా అనువాదకుడిగా పలు రచనలు చేశారు. అనేక నాటక పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
అక్షరాలు నా ఆనవాళ్ళు. ప్రకృతి నేపథ్యంలో, దృశ్యం విత్తై మొలకెత్తితే (కవితా సంపుటాలు) వెన్నెల మల్లియలు (నా జీవనయానం), చాంద్ ఫిర్ నికలా (మధుర గీతాలకు మనసు పలికిన మాటలు సిరా రంగులు (అభిషేక్ సింహ్ IAS హిందీ కవితలకు అనువాదం), రంగవీక్షణం వీరి రచనలు.
మంచి కథలను ఎంపిక చేసుకొని తన గాత్రంతో పరిచయం చేస్తూ, అందరికీ వినిపిస్తున్నారు. చాలామంది పాఠకులకు శ్రోతలకు చాలా మంచి కథలు తన ద్వారా అందుతున్నాయి.)




