ఈ సమీక్ష రాస్తున్నప్పుడు రూపేశ్ భార్య ఇప్షా శతాక్షిని రూపేశ్ ఎంత కాలంగా జైల్లో ఉన్నాడు అని అడిగాను. ఇప్షా వెంటనే, “4 సంవత్సరాల 3 నెలల 2 రోజులు” అన్నది. అది విని నేను నిశ్చేష్టుడినయ్యా. ఇప్షా వద్ద ప్రతి ఒక్క రోజుకు లెక్క ఉంది. ఇక రూపేశ్ దగ్గర నిమిషాల లెక్క లేకపోయినా, గంటల లెక్క కచ్చితంగా అయితే ఉండే ఉంటుంది.
రూపేశ్ ఈ ‘లెక్కను’ గతేడాది ప్రచురితమైన తన కవితా సంకలనం “సలాఖోం సే ఝాంకతీ కవితా” (కటకటాల నుండి తొంగిచూస్తున్న కవిత) లో అద్భుతంగా కళ్ళకు కట్టారు. ఈ సంకలంలోని కవితలన్నీ జైలు లోపలే రాసాడు. అందువల్ల ఇవి ప్రశాంతంగా కూర్చుని కవితా శిల్పాన్ని దిద్దుకుంటూ, మలుచుకుంటూ, ప్రచురించే ముందు స్నేహితుల సలహాలు తీసుకునే రకం కవితలు కావు.
నా సొంత జైలు అనుభవం ద్వారా కూడా నేను చెప్పగలను. జైల్లో మెదడులోనో, కాగితం మీదో కవిత మొదటి లైన్ పడగానే, “ఈ కవితను జైలు అధికారుల దాడుల (జప్తీ) నుండి ఎలా కాపాడుకోవాలి? దీన్ని జైలు బయటకు సురక్షిత౦గా ఎలా చేర్చాలి?” అనే ప్రశ్న ఉంటుంది. అందుకే ఈ సంకలంలోని కవితలను రూపేశ్ పడిన ఆ సంఘర్షణ నుండి వేరు చేసి చూడలేము. ఈ కవితలు ఈరోజు మన మధ్య ఊపిరి పీల్చుకుంటున్నాయంటే ఆ సంఘర్షణే కారణం. సరిగ్గా ఈ కారణంగానే రూపేశ్ భగత్ సింగ్‌తో పాటు జూలియస్ ఫ్యూజిక్ను కూడా గుర్తు చేసుకుంటాడు-
సరిగ్గా ఒకరాత్రి
కలలోకి వచ్చాడు భగత్ సింగ్
ఆయనతో పాటు జూలియస్ ఫ్యూజిక్ కూడా ఉన్నాడు
ఆయన నాతో ఏమీ అనలేదు
కేవలం నాతో కరచాలనం చేసి వెళ్ళిపోయారు…….
మీకు బహుశా గుర్తుండే ఉంటుంది; జూలియస్ ఫ్యూజిక్ టాయిలెట్ పేపర్ మీద తన జైలు డైరీ “రక్తాక్షరాలు ” (1) ” రాసి, ఎంతో ప్రాణాపాయాన్ని లెక్కచేయక దాన్ని జైలు వెలుపలకు ‘స్మగ్లింగ్’ చేశాడు.
రూపేశ్ ఒక నిబద్ధత కలిగిన కవి. ఈ సంకలంలోని మొదటి కవితలోనే రూపేశ్ తన నిబద్ధత జాబితాను ముందుంచి, పాఠకులకు తన పరిచయం ఇస్తూ ఇలా రాస్తారు-
నేను ప్రేమించాను,
అడవులను, పర్వతాలను
అక్కడ నివసించే ఆదివాసీలను
మూలవాసీలను
నేను ప్రేమించాను,
అన్యాయానికి వ్యతిరేకంగా
పోరాడుతున్న యోధులను
శోషణ, దమనకాండకు వ్యతిరేకంగా
లేస్తున్న గొంతులను…
కవి చెప్పిన ఈ పరిచయం ద్వారా, ఆయన బందీ కావడానికి కారణాలు కూడా పాఠకులకు అర్థమవుతాయి. అయితే కవిత ఈ పరిచయంతోనే ముగిసిపోదు; ఈ ప్రకటనతో ముగుస్తుంది.
…కానీ బహుశా వారు మర్చిపోయారు
ప్రేమికులకు నిర్బంధమంటే లెక్కలేదు.
విప్లవ కవి వరవరరావు లాగే, విప్లవాత్మక భవిష్యత్తుపై అచంచలమైన నమ్మకం ఉన్న కవి మాత్రమే ఇలాంటి ప్రకటన చేయగలడు. వరవరరావు కూడా తన ఒక కవితలో ఇలా ప్రకటిస్తారు-
…ప్రేమికులు ఎక్కడైతే కలుసుకుంటారో
నేడో రేపో
అక్కడ వాళ్లు దీపాలను ఆర్పేయగలరు
కానీ చంద్రుడిని మాత్రం ఎప్పటికీ తుడిచివేయలేరు…
రూపేశ్ వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఆయన క్షేత్రస్థాయి రిపోర్ట్లు చాలాకాలంగా ప్రభుత్వ కంట్లో నలుసుగా మారాయి. అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. ఆయన ఏమాత్రం చలించలేదు. అలాంటి ఒక ముఖ్యమైన రిపోర్ట్ “ఏ ఒక ఆదివాసీ హత్యను జార్ఖండ్ పోలీసులు వేడుకగా జరుపుకుంటున్నారా?” ఇదే ‘ది వైర్’ లో వచ్చి౦ది(2). త్వరలోనే రూపేశ్‌కు ఆయన చేసిన ఈ క్షేత్రస్థాయి, నిజాయితీ గల జర్నలిజానికి ప్రభుత్వం తగిన ‘బహుమతి’ ఇచ్చింది. ఆయనపై మొత్తం 5 కేసులు బనాయించారు; అన్నీ UAPA చట్టం కిందవే. ఈ బహుమతి ఇస్తే రూపేశ్ జర్నలిజానికి కళ్ళెం వేయవచ్చని ప్రభుత్వం భావించింది. కానీ రూపేశ్ జైలులో కూడా తన వృత్తిని విడిచిపెట్టలేదు(3). కాకపోతే దానికి రూపం కవితగా మారింది. ఆయన రాసిన ఈ కవితను చూడండి-
పనిష్మెంట్ సెల్ గేటుకు
తాళం ఎప్పుడూ తీయరు
ఎనిమిదిన్నర x ఏడు అడుగుల గది
అదే మీ మొత్తం లోకం!
ఒక మూలన మరుగుదొడ్డి,
అందులో ఒక నల్లా.
శుబ్రం చేసుకోవాలా?
స్నానం చేయాలా?
దాహం తీర్చు కోవాలా?
మరుగుదొడ్డిలోని నల్లాలో
మురికి నీళ్లే అన్ని౦టికీ!
ఇలాగే మరో కవితలోని పంక్తులను చూద్దా౦.
నువ్వు రోజంతా మొబైల్, వాట్సాప్ అంటావు
మామూలు 5 వేలు ఇవ్వాలి
ఇది బీహార్ ఆదర్శవంతమైన జైలు (4), తెలుసా?
ఇక్కడ ప్రతి రకమైన ఆట జరుగుతుంది
జైలు లోపల జరుగుతున్న వాస్తవాలను వెలికి తీసే ఈ జర్నలిజమే కవితల రూపంలో మన కళ్ళల్లో వేలుపెట్టి నిజాలను చూసేలా బలవంతపెడుతుంది. దాంతో భారతదేశంలో ‘స్వాతంత్ర్యం’ వచ్చిన తర్వాత అసలు మార్పు ఏమిటి? మనల్ని ఆలోచించమని పురిగొల్పుతుంది. ఇదే సంకలంలోని మరో కవితలో రూపేశ్ స్పష్టమైన సమాధానం చూద్దాం.
నేటికీ జైళ్లలో ఏమీ మారలేదు
కేవలం మారిపోయాయి,
సూపరింటెండెంట్, జైలర్ల ముఖాలు మాత్రమే.
రూపేశ్ 2022 జూలై 17న రెండోసారి జైలుకు వెళ్ళాడు. అప్పుడు ఆయన కొడుకు అగ్రిమ్ వయసు కేవలం నాలుగన్నరేళ్ళు. రూపేశ్, ముఖ్యంగా అగ్రిమ్ ఈ దూరాన్ని ఎలా భరిస్తున్నారో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. రూపేశ్ అగ్రిమ్ మీద ఎన్నో భావోద్వేగభరితమైన కవితలు రాశారు. వాటిని చదివితే కళ్ళంటా నీళ్ళు వస్తాయి. అలాంటి ఒక కవితలోని దృశ్యాన్ని చూడండి.
నువ్వు ఇనుప గ్రిల్స్‌ను (5)
ఊపేస్తున్నప్పుడు
మన మధ్య దూరాలు చెరిగిపోవడానికి
నేను నా కన్నీళ్లను ఆపుకున్నాను
మీ అందరి దృష్టిలో
నేను బలహీనపడాలనుకోలేదు.
నా ప్రియమైన కుమారుడా!!
నువ్వు ధైర్యశాలిగా ఉండాలి
అన్ని కఠిన పరిస్థితులను ఎదుర్కొనాలి
ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది
ఆ రోజు తన నాన్నను కలవకుండా
ఏ కొడుకును కూడా ఆపలేరు
ఈ ప్రపంచపు ఏ జైలు గోడలు కూడా.
విప్లవ కవి వరవరరావు లాగే రూపేశ్ కూడా జైలులో తన తల్లిని ఎంతగానో గుర్తు చేసుకుంటారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన తన తల్లితో పాటు తన అత్తగారిని కూడా తన కన్నతల్లి లాగే అదే గాఢతతో, అనురాగంతో గుర్తుచేసుకుంటారు. పితృస్వామ్య సమాజ౦లో ఇది నిస్సందేహంగా ఒక మంచి విషయం. ఏ హిందీ కవి కూడా తన అత్తగారిపై కవిత రాసినట్లు నాకయితే గుర్తులేదు. రూపేశ్ తన అత్తగారి గురించి రాస్తూ కవిత చివరిలో ఇలా అంటారు.
…అందువల్ల నువ్వు మాటివ్వు
నీ ఈ కొడుకుకి
ఎలాంటి పరిస్థితి ఎదురైనా
నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావని.
బహుశా మీకు గుర్తుండే ఉంటుంది; రూపేశ్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయనతో పాటు నినాదాలు చేస్తున్న మహిళ రూపేశ్ అత్తగారు, ఇప్షా శతాక్షి అమ్మ గీతాశ్రీ గారే. ఈ కవిత, ఈ దృశ్యం ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు.
పేద, శ్రామిక ప్రజలను ప్రేమించిన నేరానికి రూపేశ్‌ను జైల్లో పెట్టారు. కానీ జైల్లో కూడా 90 శాతం మంది అదే పేద, శ్రామిక ప్రజలే ఉంటారు. ఫాదర్ స్టాన్ స్వామి మాటల్లో చెప్పాలంటే, జైలులో కూడా మానవతా పూలు పూస్తూనే ఉంటాయి. రూపేశ్ జైలు డైరీ ఖైద్ఖానె కా ఐనా (జైలు అద్దం) చదవాలి. కానీ ఈ ఒక్క కవిత ద్వారా జైలులో కూడా రూపేశ్ సామాన్య ఖైదీల సమస్యలతో తనను తాను భావోద్వేగ తలంలో ఎలా ముడిపెట్టుకుంటారో ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. ఈ పంక్తులను చూడండి.
…గత సంవత్సరం అందరూ
తమ పొలాలను దున్నుతున్నారు
పారలు పట్టుకుంటున్నారు
నారు పోస్తున్నారు
వారి ఇంటి మహిళలు
పొలంలో నాట్లు వేస్తున్నారు
కానీ ఈ సంవత్సరం
వారి స్థానంలో ఎవరుంటారు?
వ్యవసాయం ఎలా సాగుతుంది?
భారతదేశ మధ్య ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతాలలో సాగుతున్న విప్లవోద్యమంతో తన సైద్ధాంతిక నిబద్ధతను రూపేశ్ ఎప్పుడూ దాచుకోలేదు. తన జర్నలిజంలో ప్రభుత్వాలు ఈ విప్లవోద్యమంపై సాగిస్తున్న దారుణమైన అణచివేతను ఎప్పుడూ బయట పెడుతూనే చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన జైలు జీవితం గడుపుతున్న సమయంలోనే అమిత్ షా నేతృత్వంలో ఈ విప్లవోద్యమం తాత్కాలికంగా అణచివేయబడింది. అయినా, రూపేశ్ నిరాశ పడలేదు. ఇందులో కూడా ఆయన తనకోసం, తన సహచర కామ్రేడ్ల కోసం ఒక పనిని వెతికి తెచ్చుకుంటారు. దాన్ని కవితలో ఇలా వర్ణిస్తారు-
…భారతదేశ విప్లవకారులు
2025 సంవత్సరం నుండి పాఠాలు నేర్చుకుంటూనే
ఎప్పుడూ ముందుకు సాగాలి.
నిజానికి చరిత్రపై అవగాహన ఉన్న రూపేశ్ లాంటి వాళ్లకు తెలుసు- గెలుపు-ఓటముల పరంపరతోనే మానవాళి ముందుకు సాగుతుందని. ఇక్కడే వరవరరావు కవితలోని ఒక పంక్తి ఇట్టే గుర్తుకొస్తుంది.
యుద్ధాలు గెలుపోటములతో ముగిసిపోతాయి
కానీ పోరాటాలు మాత్రం
హృదయాలు కొట్టుకుంటున్నంత కాలం
సజీవంగానే ఉంటాయి.
ఈ శాశ్వత పోరాట స్పృహే రూపేశ్ కవితలకూ, స్వయంగా రూపేశ్ జీవితానికీ సారం. రూపేశ్ కవితలు ఆయన జీవిత పోరాటానికి వేరుగా లేవు. అవే ఆయన జీవిత పోరాటాల వ్యక్తీకరణ.
రూపేశ్ తన తదుపరి కవితా సంకలాన్ని జైలులో కాకుండా, తన భుజాలపై అగ్రిమ్ను కూర్చోబెట్టుకుని, తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని రాస్తారని ఆశిద్దాం. అక్కడ కవితలను ‘కవితల హంతకుల’ నుండి ఎలా రక్షించుకోవాలనే ఆందోళన ఆయనకు ఉండదు.(6)
అందమైన అలంకరణతో ఈ కవితా సంకలాన్ని ‘న్యూ వరల్డ్ పబ్లికేషన్స్’ ముద్రించింది.
ధర: 284/- రూపాయలు.
(ది వైర్ (హిందీ) లో వచ్చిన మనీష్ ఆజాద్ వ్యాసానికి విమల్ తెలుగు అనువాదం.)
పాద సూచికలు:
1 Julius Fucik రాసిన Notes from Gallows (The original Czech title was Reportáž, psaná na oprátce. –( Reportage Written Under the Noose ) రక్తాక్షరాలు గా వచ్చింది. అనువాదం సహవాసి చేసారు.
2 क्या आदिवासियों की हत्या पर जश्न मनाया जाना चाहिए? (Should the killing of Adivasis be celebrated?). the Wire (Hindi), 15.06.2017
3 ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రూపేష్ కుమార్ సింగ్ జార్ఖండ్‌లోని గిరిడీలో పారిశ్రామిక కాలుష్యం కారణంగా స్థానిక ఆదివాసీలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై నిరంతరం వార్తా కథనాలు రాశారు. కార్పొరేట్ శక్తులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఈ క్షేత్రస్థాయి పరిశోధనాత్మక జర్నలిజం కారణంగానే, 2022 జూలై 17న ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) మరియు పలు IPC సెక్షన్ల కింద ఆయన్ను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గతంలో ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ Pegasus టార్గెట్ లిస్ట్‌లో కూడా ఆయన ఫోన్ నంబర్లు ఉండడం గమనార్హం.. Patna లోని బేవుర్ జైలు ను “ఆదర్శ జైలుగా” ప్రభుత్వం పరిగణిస్తుంది. నిజానికి అవినీతి తాండవం ఆడుతూ ఉంటుంది. రూపేష్ కొద్దికాలం ఈ జైల్లో ఉన్నారు.. ఈ మొత్తం కాలంలో పాట్నా, గయా, భాగల్పూర్ ( బీహార్), సరయ్ కేలా (రూర్ఖండ్) జైళ్ళలో రూపేష్ ఉన్నారు. ప్రస్తుతం జుబ్బా సహానీ కేంద్ర కారాగారం ( భాగల్పూర్ ) లో ఉంటున్నారు. మొత్తం అయిదు కేసుల్లో ఇంకా రెండు కేసుల్లో బెయిలు దొరకాల్సి ఉంది.
4 జైల్లో ఉన్న బంధు మిత్రులను చూడడానికి ములాకాత్ కు వచ్చి నప్పుడు ఒక ఇనుప గ్రిల్ నుంచే మాట్లడుకోవాల్సి ఉంటుంది. బందీలను ఆత్మీయంగా స్పర్మించడానికి కూడా అవకాశం ఉండదు.
5 రూపేష్ గురించి UN bodies, CPJ ఇచ్చిన ప్రకటనలు, ఆయన గురించి రాసిన వ్యాసాలు ఈ లింక్ లో చూడొచ్చు. https://www.uscirf.gov/religious-prisoners-conscience/forb-victims-database/rupesh-singh
సోర్స్ : https://thewirehindi.com/340415/book-review-rupesh-kumar-singh-s-salakhon-se-jhankti-kavita/




