ఇజ్రాయెల్ చేసిన ఘోరమైన చర్యల వల్ల మాత్రమే కాదు, అది మనలోని భయంకరమైన రాక్షసత్వానికి కొట్టిపారేయలేని రుజువుగా నిలవడం వల్లనే అవార్డు పొందిన ఈ కొత్త చిత్రం మనల్ని మౌనంలో ముంచెత్తింది.

నేను ఇటీవల “నాజా” (NAZA) అనే డాక్యుమెంటరీని చూశాను. ఇందులో 24 మంది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు, సైనికులు, గత మూడేళ్లలో గాజాని ప్రపంచపటం నుండి క్రమబద్ధంగా ఎలా తుడిచిపెట్టేశారో వివరిస్తున్న చిత్రణ రికార్డ్ అయింది.

దాదాపు ప్రతి పాశ్చాత్య దేశ రాజధాని మౌనంగా ఉండటానికి ఎంచుకున్నా లేదా ఈ ఊచకోతలో చురుగ్గా సహకరించినా కూడా వారు ఈ పనిని చేశారు.

ఈ ఇంటర్వ్యూలను రాత్రి వేళ, సెంట్రల్ టెల్ అవివ్‌లోని ఒక భవనం పైకప్పుపైన చిత్రీకరించారు. పాల్గొన్న వారి ముఖాలు చీకటిలో కనబడడం లేదు. వెనుక భాగంలో లైట్లు వెలుగుతున్న అపార్ట్‌మెంట్లు; గుర్తించలేని వ్యక్తులు టీవీ చూడటం, ఉతికిన దుస్తులు ఆరేయడం, ఆఫీసులలో డెస్క్ వద్ద కూర్చోవడం లాంటి తమ పనుల్లో మునిగిపోవడం కనిపిస్తుంది.

వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రికార్డు స్థాయిలో 25 నిమిషాల పాటు నిలబడి చప్పట్లు కొట్టి ఈ సినిమాను ప్రశంసించారు. కానీ, నేను హాజరైన హౌస్‌ఫుల్ ప్రదర్శనలో మాత్రం ప్రేక్షకులు “నాజా” చిత్రాన్ని తీవ్రమైన నిర్ఘాంతపోయిన మౌనంతో చూసారు.

సినిమా చివర పేర్లు వచ్చాయి. థియేటర్‌లో లైట్లు వెలిగాయి. మేమందరం నిశ్శబ్దంగా బయటికి నడిచాము. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వచ్చిన స్పందన కంటే ఇదే అత్యంత సముచితమైన స్పందనగా అనిపించింది. అప్పటి నుండి, మన నిర్ఘాంతపోయిన ఆ మౌనం అసలు దేనికి సంకేతమా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను.

అది గాజాపై జరిగిన ఘోరకృత్యాలను చూసి కలిగిన దిగ్భ్రాంతా? నిజానికి కాదు. విధ్వంసానికి, సామూహిక హత్యలకు సంబంధించిన దృశ్యాలను అందులో పెద్దగా చూపించలేదు. దానికి మించిన నరమేధాన్ని మన ఫోన్‌లలో ప్రత్యక్ష ప్రసారాల్లో మనం ఇప్పటికే చాలా చూసాం.

ఇజ్రాయెల్ ప్రభుత్వమూ, ఆ ప్రభుత్వాన్ని అనుసరిస్తూ పాశ్చాత్య మీడియా చెబుతున్నట్లుగా — గాజాలో దాదాపు డెబ్భై అయిదువేల మంది మరణించారని, ఒక లక్షా డెబ్భై అయిదువేల మంది అంగవైకల్యానికి గురయ్యారనే అధికారిక లెక్కలను హమాస్ సృష్టించిన కల్పిత కథగా ఆ ఇంటర్వ్యూలో ఉన్న సైనికులెవరూ భావించకపోవడమే దానికి కారణమా?

వాస్తవానికి, నిజమైన మృతుల సంఖ్య అంతకంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని ఆ సైనిక వర్గాల నుండి బలమైన సంకేతం వచ్చింది.

నిర్దిష్ట పద్ధతిలో జరిగిన హత్యలు
ఇంటర్వ్యూ ఇచ్చే వారిలో చాలామందికి తమ చర్యలపైన ఎలాంటి స్వీయ-స్పృహ గానీ, పశ్చాత్తాపం గానీ లేకపోవడమే దానికి కారణమా? మునుపెన్నడూ లేని విధంగా, భారీ స్థాయిలో ఇళ్ళను ధ్వంసం చేయడానికి, పాలస్తీనియన్లను చంపడానికి లక్ష్యాలను ఎంచుకున్న ఇజ్రాయెల్ నూతన ఏఐ(కృత్రిమ మేధ) వ్యవస్థల సాంకేతిక అంశాల గురించి వారు చాలా పొడిగా – ఎంతో ఉదాసీనంగా మాట్లాడారు.

కెమెరా వెనుక చిత్రనిర్మాతలతో మాట్లాడిన 100 మందికి పైగా ఇజ్రాయెల్ సైనిక సిబ్బంది నుండి ఎంపిక చేసిన 24 మందిలో, పాలస్తీనియన్లను హత్య చేయడానికి తమ భాషలో ఒక “ఫ్యాక్టరీ”ని రూపొందించడంలో సహాయపడిన వారు కూడా ఉన్నారు.

మరికొందరు ఈ నిర్దిష్ట పద్ధతిలో నడిపారు. తమ స్వంత మాటల్లో చెప్పాలంటే, ఏదో “వీడియో గేమ్” ఆడుతున్నట్లుగా వారు నిర్దిష్ట పద్ధతిలో సహాయంతో హత్యలు చేశారు.

ఇంటర్వ్యూ చేసిన సైనికులు చెప్పినదాని ప్రకారం, హమాస్‌లో ఉన్నట్లు అనుమానం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి బదులుగా 20 నుండి 100 మందికి పైగా నాజా లను (వారి హోదా ఎంత చిన్నదైనప్పటికీ) చంపడానికి ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. (నాజా అంటే మహిళలు, పిల్లలతో సహా అక్కడ ఉన్న పాలస్తీనా పౌరులను సూచించే హీబ్రూ సంక్షిప్త రూపం).

2023 అక్టోబర్ లో ఇజ్రాయెల్‌పైన హమాస్ ఒక రోజు దాడి జరిపినప్పుడు, దాడి చేసిన సమూహంలో దాదాపు 30,000 మంది పోరాటయోధులు ఉన్నారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

అంతేకాకుండా, ఇజ్రాయెల్ –దాని ఏ ఐ వ్యవస్థలు – జనాభాలోని అత్యధిక భాగాన్ని హమాస్‌తో ముడిపెట్టాయి. గాజా ప్రభుత్వ రాజకీయ, అధికారిక, పరిపాలనా యంత్రాంగ విభాగాలలో పనిచేస్తున్నారనే ఏకైక కారణంతో పాఠశాల ఉపాధ్యాయులు మొదలుకొని వైద్యులు, నర్సుల వరకు పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు.

ఈ చిత్రంలో ఇంటర్వ్యూ చేసిన యోవల్ అబ్రహాం, ఈ లెక్కల గురించిన ఒక సరళమైన గమనికను ఇంటర్వ్యూ ఇచ్చిన ఒకరి ముందు ఉంచారు.

ఇజ్రాయెల్ అమలుచేసిన నాజా విధానం ప్రకారం – హమాస్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్క లక్ష్యం కోసం డజన్ల కొద్దీ పౌరుల మరణాలను అనుమతించడం – అంటే గాజాలోని దాదాపు ఇరవై లక్షల మంది నివాసితులలో దాదాపు ప్రతి ఒక్కరినీ అంగీకరించదగిన “అనుబంధ నష్టం”గానే పరిగణించారు.

ఆ ఇంటెలిజెన్స్ అధికారి ఈ ఆలోచన తనకు ఎప్పుడూ తట్టనట్లుగా కొద్దిసేపు ఆలోచించి, చివరికి ఒప్పుకున్నాడు.

ఇజ్రాయెల్ మానవ కవచాలు
అత్యధిక సంఖ్యలో పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయే తరుణంలో, హమాస్ అనుమానితులపైన దాడులు చేయాలన్న ఇజ్రాయెల్ నిర్ణయం పట్ల మనకున్న అసంతృప్తియేనా ఆ దిగ్భ్రాంతికరమైన నిశ్శబ్దానికి కారణం?

ఇజ్రాయెల్ తన ముఖ్యమైన ఏఐ ప్రోగ్రామ్‌లలో ఒకదానికి “నాన్న ఎక్కడ?” (“వేర్ ఈస్ డాడీ?”) అని పేరు పెట్టింది. ఎందుకంటే, ఫోన్ల లొకేషన్‌లను ట్రాక్ చేయడం, సంభాషణలను వినడం ద్వారా – అనుమానితులు పోరాటానికి దూరంగా, తమ కుటుంబాలతో ఇంట్లో ఉండే సమయాన్ని ఈ వ్యవస్థ ఖచ్చితంగా గుర్తించగలిగేది.

ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక అధికారి ఒక ఉదాహరణ చెప్పారు: ఒక 12 ఏళ్ల చిన్నారి తన తల్లికి ఫోన్ చేసి, “నాన్న ఇంటికి వచ్చారు, నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు?” అని అడిగింది. ఆ ఫోన్ సంభాషణలో వచ్చిన “నాన్న”; “తిరిగి రావడం” అనే పదాలు AI వ్యవస్థను అలర్ట్ చేయడానికి (పరిశీలనకు) సరిపోయాయి; అది వెంటనే అక్కడ సైనిక రక్షణ దాడికి పురికొల్పింది.

దాడి జరిగిన ఆ పరిధిలో ఉన్న పిల్లలను, పొరుగువారిని చంపే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులను రూపొందించారని ఆ అధికారి ఒప్పుకున్నాడు.

ఇంటర్వ్యూలో పాల్గొన్న, నిఘా నిర్వహణ విధుల్లో ఉన్న పలువురు, దాడికి అనుమతి ఇవ్వడానికి కొద్దిసేపటి ముందు అనుమానితుడి ఇంట్లో పిల్లల అరుపులు విన్నట్లు ఛెప్పారు. పేలుడు జరిగిన వెంటనే, ఆ పేలుడు ధాటికి ఛిద్రమైన లేదా తమ చుట్టూ ఉన్న ఛిద్రమైన శరీరాలను చూసి లేదా ఈ రెంటినీ చూసి దిగ్భ్రాంతి చెందిన పిల్లల కేకలు విన్నామని మరికొందరు ఛెప్పారు.

సినిమాలో ఒకానొక సన్నివేశంలో, కెమెరా ఇంటర్వ్యూల నుండి దృష్టి మళ్ళించి, టెల్ అవీవ్ నగర కేంద్రంలోని తళతళలాడే ఆకాశహర్మ్యాల నడుమ ఉన్న ఇజ్రాయెల్ సైనిక ప్రధాన కార్యాలయం, కిర్యాపైన కేంద్రీకరిస్తుంది.
యుద్ధ చట్టాల ప్రకారం, కిర్యా ఒక చట్టబద్ధమైన సైనిక లక్ష్యం కావచ్చు. కానీ అది ఉన్న ప్రదేశం, ఇజ్రాయెల్ లోని అతిపెద్ద నగర నివాసులను మానవ కవచాలుగా మార్చే ప్రమాదాన్ని ఉద్దేశపూర్వకంగా కలిగిస్తుంది.

యుద్ధ చట్టాల ప్రకారం, కిర్యా ఒక చెల్లుబాటు అయ్యే సైనిక లక్ష్యం కావచ్చు. దీని ఉన్న ప్రదేశం ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ యొక్క అతిపెద్ద నగరం యొక్క నివాసితులను మానవ కవచాలుగా మార్చే ప్రమాదాన్ని కలిగిస్తుంది.

దీనికి విరుద్ధంగా, తమ కుటుంబాలతో కలిసి ఇళ్లలో నిద్రిస్తున్న పాలస్తీనా మిలిటెంట్లు చట్టబద్ధమైన సైనిక లక్ష్యం కాదు. అయినప్పటికీ, “నాన్న ఎక్కడ?” అనే కార్యక్రమం, అంతర్జాతీయ చట్టాలను అత్యంత ఘోరంగా ఉల్లంఘిస్తూ, ఇజ్రాయెల్ పాలస్తీనా పిల్లలను భారీ స్థాయిలో మానవ కవచాలుగా మార్చడాన్ని సూచించింది.

‘కేవలం ఆదేశాలను పాటించాను’
గాజాలో ఇజ్రాయెల్ ఒక “జాతి నిర్మూలన”కు పాల్పడిందని, మొదటి నుంచీ తన లక్ష్యం, తనతో పనిచేసిన ప్రతి ఒక్కరి లక్ష్యం, సాధ్యమైనంత ఎక్కువ మంది పాలస్తీనియన్లను చంపడమేనని నిస్సంకోచంగా ఒప్పుకున్న ఆ సైనికుడి మాటలు వినడం వల్ల కలిగిన తీవ్ర అస్వస్థతే ఆ నిర్ఘాంతపోయిన మౌనానికి కారణమా?
అతని మాటల్లో చెప్పాలంటే, “వేలాది” మంది పాలస్తీనియన్ల హత్యలను పర్యవేక్షించడానికి అతను స్వయంగా ఇజ్రాయెల్ సైనిక ఏఐ వ్యవస్థలను ఉపయోగించాడు. తన సైనిక వృత్తిలోని ఈ కాలాన్ని అతను “పిచ్చిగా ఆనందించే సమయం” అని అభివర్ణించాడు.

అతని మాటల్లో చెప్పాలంటే, “వేలాది” మంది పాలస్తీనియన్ల హత్యలను పర్యవేక్షించడానికి అతను స్వయంగా ఇజ్రాయెల్ సైనిక AI వ్యవస్థలను ఉపయోగించాడు. తన సైనిక వృత్తిలోని ఈ కాలాన్ని అతను “అసాధారణంగా సరదాగా” ఉందని అభివర్ణించాడు.

పాలస్తీనియన్ల సామూహిక హత్యకు బాధ్యుడైన, ఇంటర్వ్యూ ఇచ్చిన మరో వ్యక్తి, తాను ఇజ్రాయెల్ కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటెలిజెన్స్ యూనిట్, 8200లో పనిచేయడమే కాకుండా, ఆ యూనిట్‌లోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉద్యోగాన్ని కూడా సంపాదించానని చెప్పాడు. ఆ స్వయంచాలక హత్యా యంత్రంలో తనకు లభించిన హోదాను చూసి ఇతర అధికారులు ఎంత అసూయపడ్డారో అతను గుర్తు చేసుకున్నాడు.

“నేను కేవలం ఆదేశాలను పాటించాను” అనే రకరకాల సాకులతో, గాజాకు చెందిన పదివేల మంది పిల్లల వధ; అంగవైకల్యంలో తమ భాగస్వామ్యాన్ని ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరూ సమర్థించుకుంటున్నారనే వాస్తవం పట్ల కలిగిన ఆ దిగ్భ్రాంతికరమైన నిశ్శబ్దం, మనకు కలిగిన అసహ్యానికి కారణమా? ఒక వ్యక్తి తనను తాను ఆ హత్యాకాండ యంత్రంలో ఒక ” చక్రంలో చిన్న వంటివాడిని ” అని చెప్పుకున్నాడు.

హోలోకాస్ట్ (యూదుల మారణహోమం) కారణంగా జర్మన్లను ద్వేషించేలా తాను పెరిగానని, అయితే నాజీలు చేసిన దానికి; తాను గాజాలో చేసిన దానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడానికి ఇప్పుడు తాను చాలా కష్టపడుతున్నానని ఒప్పుకున్న ఆ వ్యక్తి మాటలు విని కలిగిన తీవ్రమైన ఆందోళనే ఆ నిర్ఘాంతపోయిన మౌనానికి కారణమా?

గాజాలో AI (కృత్రిమ మేధ) ఉపయోగించి జరిపిన అవాంతరాలు లేని, నిర్దాక్షిణ్యమైన నిఘా చర్యలు, లక్ష్యాన్ని ఎంపిక చేయడం-అమలు చేయడం వంటివి ఇప్పటికే ఇంటికి చాలా దగ్గరగా అమలవుతున్నాయని ప్రేక్షకులు గుర్తించడం వల్లనే ఆ నిర్ఘాంతపోయిన మౌనం ఏర్పడిందా?

ఇజ్రాయెల్ యొక్క సంపూర్ణ నియంత్రణ, తప్పించుకోలేని నిఘా, నిర్దాక్షిణ్యమైన హత్యల కోసం AI వ్యవస్థను రూపొందించిన తెలివైన, వృత్తిపరమైన, విధేయులైన యువత నేడు మన కోసం కూడా అదే విధమైన స్వయంచాలక న్యాయమూర్తి, జ్యూరీ, మరణశిక్ష అమలు చేసే వ్యవస్థను రూపొందిస్తున్నారా?

మనం తెరపై చూస్తున్నది ఒక కొత్త రకమైన ఏఐ-ఆధారిత భద్రతా రాజ్యానికి ప్రాథమిక నమూనా. అది ఒక కనికరం లేని నిరంతరం పర్యవేక్షించే శోధనా వ్యవస్థ గా పనిచేస్తుంది; అందులో మనమందరం ఖైదీలం అవుతాం. పాలకులు పాలితులకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామ్య ప్రక్రియ కూడా పూర్తిగా కుప్పకూలిపోయే వ్యవస్థ ఇది.

అంతర్గత భయానకత
నా ఉద్దేశంలో, ప్రేక్షకుల దిగ్భ్రాంతికి ఈ కారణాలన్నీ ఒక ఎత్తైతే… “నాజా” మనల్ని మాటలు రాకుండా నోరెళ్లబెట్టేలా చేయడానికి అంతకంటే లోతైన కారణం మరొకటి ఉంది.

ఈ చిత్రం గాజాలోని స్పష్టమైన, కంటికి కనిపించే భయానకత గురించి కాదు – ఆ భీభత్సాన్ని గత మూడేళ్లుగా మనం మన స్క్రీన్లపై ఇప్పటికే చాలా చూశాం.
అది మరింత నిగూఢమైన, మనకు చాలా సన్నిహితమైన విషయానికి సంబంధించినది. ఇది మనలో ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉన్న భయానకతకు సంబంధించినది. జర్మన్-యూదు తత్వవేత్త హన్నా అరెంట్ “చెడుకు ఉండే సాధారణత్వం” అని పిలిచిన దానికి సంబంధించినది.
తెరపై కనిపించిన ఆ 24 మంది ఇజ్రాయెలీయులు – వారిలో ప్రతి ఒక్కరూ, తరచుగా నిర్లిప్తంగా, కొన్నిసార్లు కొంచెం గర్వంగా, తాము అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు – మన కొడుకు లేదా కూతురు, మన సోదరుడు లేదా సోదరి అయి ఉండవచ్చనే వాస్తవాన్ని గ్రహించినప్పుడు, మనం నిశ్చేష్టులయ్యామని నేను అనుకుంటున్నాను.
“వారు చేసినట్లే నేను కూడా చేసి ఉండేవాడినా? నా పిల్లలు అలా చేసి ఉండే వారా?” అని మనల్ని మనం ప్రశ్నించుకునే మన అంతరాత్మ స్వరాన్ని అణచివేయడానికే నాటి వెనిస్ ఫెస్టివల్‌లో ఆ చప్పట్లు కొట్టి ఉంటారని నాకు అనిపించింది.
“నాజా” చిత్రం మనల్ని మానసికంగా తీవ్రంగా దెబ్బతీయడానికి కారణం… ఇజ్రాయెల్, గాజాల గురించి మనకు ఇప్పటివరకు తెలియని లేదా అనుమానించని కొత్త విషయం ఏదో చెప్పిందని కాదు.

ఆ ప్రాంతంలోని పాలస్తీనియన్ జర్నలిస్టులు, ఇజ్రాయెల్ ఏఐ యంత్రాంగం చేత ఒక్కొక్కరుగా హతమవ్వడానికి ముందు – చరిత్రలో నమోదైన అతిపెద్ద మీడియా సిబ్బంది మారణహోమంలో – మనకు ప్రతిరోజూ ఆ జాతిహత్యకు సంబంధించిన సాక్ష్యాలను చూపించారు.
కాదు, ఈ సినిమా మనకు అంతకంటే అత్యంత సిగ్గుచేటైన విషయాన్ని చెబుతుంది. మన పాశ్చాత్య “నాగరికత” మూలస్తంభాలు దేనిపై ఆధారపడి ఉన్నాయో ఇది ఖచ్చితంగా చెబుతుంది.

నేటి పాశ్చాత్య దేశాల ముసుగులోని హోదా/సౌకర్యాలు… మనం ఎన్నడూ నిజంగా త్యజించని లేదా విడిచిపెట్టని దిగంబర, జాతి వివక్షతో కూడిన వలసవాదం — దురాశ, దోపిడీ, బానిసత్వం, నరమేధాల సుదీర్ఘ చరిత్రపై నిర్మించబడ్డాయి.

నేటి పాశ్చాత్య ఆధిక్యతలు, దురాశ, దోపిడీ, బానిసత్వం, జాతి నిర్మూలన వంటి నిస్సిగ్గు, జాత్యహంకార వలసవాద సుదీర్ఘ చరిత్రపైన నిర్మితమయ్యాయి – దానిని మనం ఎన్నడూ నిజంగా త్యజించలేదు లేదా విడిచిపెట్టలేదు.
బందీలుగా ఉన్న పాలస్తీనా ప్రజలపైన అంతులేని, హంతక ప్రయోగాలు చేస్తూ వలసవాదపు సాంకేతిక సామర్థ్యాన్ని పదును పెట్టడంలోనూ; ఈ క్రూరత్వంలో మన భాగస్వామ్యాన్ని మరుగుపరచడంలోనూ ఇజ్రాయెల్ మన కోసం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంది .

అందుకే ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధంలో మన నాయకులు అంత సులభంగా చేయి కలిపారు: బాంబులను సరఫరా చేయడం, గూఢచార సమాచారాన్ని అందించడం, దౌత్యపరమైన రక్షణ కల్పించడం, వారి ” అతిక్రమణలను ” సమర్థించడం, నిరసనలను అణచివేయడం వంటివి చేశారు.

ఇజ్రాయెల్ చేసిన ఘోరమైన దురాగతాల వల్ల మాత్రమే కాదు, అది మనలోని భయంకరమైన రాక్షసత్వానికి కొట్టిపారేయలేని రుజువుగా నిలుస్తుంది కాబట్టే “నాజా” సినిమా మనల్ని మౌనంగా ఉంచుతోంది. మన సమాజాలు ఇదంతా చూస్తూ ఊరుకున్నాయి, ఏమీ చేయలేదు. మనమందరం నేరస్థులమే.
.-
జోనాథన్ కుక్, బ్రిటిష్ రచయిత; యు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. గతంలో ఇజ్రాయెల్‌లోని నజరేత్‌లో నివసించిన ఈయన, ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణ గురించి రాస్తుంటారు.
తన ఇజ్రాయెల్ అరబ్ అయిన సాలీ అజామ్‌ను వివాహం చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ పౌరసత్వాన్ని పొందారు.

https://jonathancook.substack.com/p/naza-is-not-just-about-israel-and?r=6ztlz&utm_medium=ios

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply