ఝిరామ్‌లో శిక్ష పడిన ఆ పది మంది ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా జైలులో గడిపారు. బస్తర్‌లో శాంతి అంటే కేవలం సాయుధ ఘర్షణల ముగింపుకి మించిన అర్థం ఉండాలంటే, గతం నాటి వివాదానికి సంబంధించిన అత్యంత తిరుగులేని శిక్షను భవిష్యత్తులోకి తీసుకువెళ్లకూడదు.
2013 ఝీరామ్ లోయ దాడిలో పాత్ర వహించినందుకు గాను బస్తర్‌కు చెందిన పదిమంది ఆదివాసీలకు సెప్టెంబరు 16న జగదల్‌పూర్‌లోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టు వీరిని సెప్టెంబరు 5న దోషులుగా నిర్ధారించింది. వారిలో చాలామంది ఇప్పటికే దాదాపు 12 సంవత్సరాలు జైలులో గడిపారు. ఈ మరణశిక్షల ధృవీకరణ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పరిశీలనలో ఉంది.
2013 మే 25న, బస్తర్‌లో కాంగ్రెస్ కాన్వాయ్‌పైన మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేంద్ర కర్మ, నంద్ కుమార్ పటేల్, విద్యా చరణ్ శుక్లాతో పాటు భద్రతా సిబ్బంది సహా 27 మంది మరణించారు. మరో ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ దాడి ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు సంఘర్షణలో అత్యంత కీలకమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది; దీని చట్టపరమైన, రాజకీయ పరిణామాలు దశాబ్దానికి పైగా కొనసాగుతూనే ఉన్నాయి.
మరణశిక్ష పడిన పదిమంది ఆదివాసీలు: ప్రమీల మోడియం, చైతు లేకం అలియాస్ మున్నా, సుమిత్ర పునెమ్, ముక్కా మండావి, కవాసి కోసా అలియాస్ కొసరామ్, అయితా మడ్కం, మడ్కమి దేవా, జోగా మడ్కమి, బంజమి సన్నా అలియాస్ చమ్రూ మరియు మహాదేవ్ నాగ్. వీరందరూ బస్తర్ ప్రాంతానికి చెందినవారే. జోగా మడ్కమిని 2016 ఆగస్టులో, సుమిత్ర పునెమ్‌ను 2019 నవంబరులో అరెస్టు చేసారు; మిగిలిన వారు అంతకంటే ఎక్కువ కాలంగా కస్టడీలో ఉన్నారు. భారత శిక్షా స్మృతి (IPC), చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని నిబంధనల కింద కోర్టు వీరిని దోషులుగా నిర్ధారించింది.
కాబట్టి ఈ కేసు ఝీరామ్ సంఘటనలకు మాత్రమే పరిమితం కాకుండా దానికి మించిన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇప్పటికే ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపిన ఆదివాసీలకు భారతీయ చట్టాల ప్రకారం లభించే అత్యంత తిరుగులేని (మార్చలేని) శిక్షను విధించడం అంటే అర్థం ఏమిటి? అలాగే మావోయిస్టు ఘర్షణ ముగింపు దశకు చేరుకుందని ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఈ ప్రాంతంలో న్యాయం అనేది ఏ విధంగా ఉండాలి?
బస్తర్: శాంతి సమస్య
దశాబ్దాలుగా బస్తర్‌లోని దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక సంఘర్షణ నుండే ఝిరామ్ కేసు ఉద్భవించింది. ఈ సంఘర్షణ ఆ ప్రాంతంలో భారీ భద్రతా బలగాలను మోహరించడంతో పాటు, మావోయిస్టు సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదివాసులను అరెస్టు చేయడం, నిర్వాసిత్వం, సుదీర్ఘకాలం పాటు జైలులో బంధించడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయి. ఈ సుదీర్ఘ సంఘర్షణ కారణంగా తలెత్తిన కేసులలో, ప్రస్తుతం మరణశిక్ష అనుభవిస్తున్న పది మంది వ్యక్తులు ఈ నేరపూరిత న్యాయ వ్యవస్థలో సంవత్సరాల తరబడి గడిపారు.
మావోయిస్టు తిరుగుబాటు ముగింపు దశకు చేరుకుంటున్న ప్రాంతంగా ప్రభుత్వం ఇప్పుడు బస్తర్‌ను చిత్రీకరిస్తుండటంతో దీని ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతోంది. ఇది సాయుధ మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడాన్ని, లొంగిపోతున్న వారి సంఖ్య పెరగడాన్ని, ఒకప్పుడు మావోయిస్టులు ప్రాబల్యం చెలాయించిన ప్రాంతాల్లోకి రాజ్య ఉనికి విస్తరించడాన్ని సూచిస్తోంది. శాంతి, అభివృద్ధి, సాధారణ జీవితానికి తిరిగి రావడం వంటి అంశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ, సంఘర్షణ ముగింపు దశకు వస్తుంటే, ఆ వివాద సమయంలో ఏర్పడిన శిక్షాత్మక వ్యవస్థలు, కేసుల పరిస్థితి ఏమిటి?
ఝీరామ్ విషయంలో ఈ ప్రశ్న మరింత తీవ్రంగా ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం ఒకవైపు మావోయిస్టులను లొంగిపోయి సాధారణ పౌర జీవితంలోకి రావాలని ప్రోత్సహిస్తుంటే, మరొకవైపు పదిమంది ఆదివాసీలు నేరపూరిత న్యాయ వ్యవస్థలోనే ఉండిపోయి ఇప్పుడు మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. సాయుధ పోరాటం ముగియడమనేది కేవలం ఎదురుకాల్పులు (ఎన్‌కౌంటర్లు) లేదా లోంగుబాట్ల సంఖ్యతో మాత్రమే కొలవలేము. వివాదపు చట్టపరమైన చక్రబంధంలో ఇప్పటికే చిక్కుకున్న వారికి న్యాయం అంటే ఏమిటి అనే ప్రశ్నను కూడా ఇది లేవనెత్తాల్సి ఉంటుంది.
అయితే, సాయుధ పోరాటం ముగిసినంత మాత్రాన బస్తర్‌లో శాంతి చేకూరదు. భద్రతా దళాలు, అరెస్టులు, దీర్ఘకాలిక నేరారోపణల ద్వారా ఆదివాసీలు ప్రభుత్వంతో ఎదుర్కొన్న పరిస్థితులను, అలాగే సంవత్సరాల తరబడి సాగిన సంఘర్షణ వల్ల ఏర్పడిన కేసులు, సంస్థలను కూడా శాంతి పరిష్కరించాలి. సంఘర్షణను అంతం చేయాలనే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికే అందులో చిక్కుకున్న వారికి న్యాయం జరగడం అనేది శాంతిలో ఒక భాగంగా ఉండాలి.
ఝిరామ్ తర్వాత న్యాయం అంటే ఏమిటి
సెప్టెంబర్ 5న యూనియన్ ఆఫ్ ఇండియా (NIA) వర్సెస్ ప్రమీలా మోడియం- ఇతరులు, ప్రత్యేక కేసు (NIA) నెం. 03/2016 లో జగదల్‌పూర్‌లో, బస్తర్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో, ఆ దాడిలో పది మంది నిందితులు ఒకే రకమైన పాత్ర పోషించారని చెప్పలేదు. సమావేశాలకు హాజరు కావడం, ఆహారం, సామాగ్రిని ఏర్పాటు చేయడం, దాడి సన్నాహాలకు సహాయం చేయడం వంటి వివిధ రకాల ప్రమేయాన్ని వివరిస్తుంది. ఆ పది మంది తెలిసి దాడిలో పాల్గొన్నారని నిర్ధారించడానికి కోర్టు మాజీ మావోయిస్టు కార్యకర్తల వాంగ్మూలాలు, స్థానిక సాక్షులు, ఇతర సాక్ష్యాధారాలపైన ఆధారపడింది.
ప్రోసిక్యూషన్ సాక్షులలో కొందరు మావోయిస్టు సంస్థ మాజీ సభ్యులు, వారు తర్వాత లొంగిపోయారు. ఫిర్యాదుదారు లైనస్ కుజుర్‌తో సహా, గాయపడినవారు, దాడిని ప్రత్యక్షంగా చూసినవారు కోర్టులో నిందితులలో ఎవరినీ గుర్తించలేదని తీర్పులోనే నమోదు అయింది. ఝిరామ్ కేసులో నిందితుల నుండి ఎలాంటి ఆయుధాలు, పోరాట సాధనాలు ఏవీ స్వాధీనం చేసుకోలేదని కూడా అందులో నమోదు అయింది.
ప్రాసిక్యూషన్ ఇతర సాక్ష్యాలతో పాటు, మాజీ మావోయిస్టు సభ్యుల వాంగ్మూలాలపై ఆధారపడింది. మరియు వారి సాక్ష్యాలు నమ్మదగినవిగా కోర్టు భావించింది. కానీ పది మందికి మరణశిక్ష విధించినప్పుడు, వారికి వ్యతిరేకంగా ఉపయోగించిన సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ సాక్షులకు నిందితుల గురించి వాస్తవానికి ఏమి తెలుసు? వారి వాంగ్మూలాలకు మరెలాంటి సాక్ష్యాలు మద్దతు ఇచ్చాయి? అలాగే ఈ సాక్షులు స్వయంగా మావోయిస్టు సంస్థలో సభ్యులుగా ఉన్నారనే వాస్తవాన్ని కోర్టు ఎలా అంచనా వేసింది?
మావోయిస్టు గ్రూపులకు సహాయం చేయడానికి గ్రామస్థులను బలవంతం చేయవచ్చని కూడా తీర్పు గుర్తించింది. ప్రతీకార చర్యలకు భయపడి, వారిచేత ఆహారం అందించడం, సామాగ్రిని మోయడం లేదా ఇతర పనులు చేయించడం జరగవచ్చు. అటువంటి ఒత్తిడి గ్రామస్థులను మావోయిస్టు గ్రూపులకు సహాయం చేసేలా పురికొల్పగలదని కోర్టు అంగీకరించింది. అయినప్పటికీ, పది మంది నిందితులు తెలిసి దాడిలో పాల్గొన్నారని అది నిర్ధారించింది. కానీ, వారికి మరణశిక్ష విధించాలా వద్దా అని కోర్టు నిర్ణయిస్తున్నది కాబట్టి, ఈ పది మంది నిందితుల చర్యలను, పరిస్థితులను అంచనా వేసేటప్పుడు ఈ వాస్తవాన్ని ఎలా పరిగణనలోకి తీసుకున్నారనేదే ప్రశ్న.
ఈ దోష నిర్ధారణ కొంతవరకు ఐపిసి సెక్షన్ 149పై ఆధారపడి ఉంది. సరళమైన మాటలలో చెప్పాలంటే, ఒక చట్టవిరుద్ధమైన సమూహంలో సభ్యులుగా ఉన్నవారు ఆ సమూహ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే క్రమంలో చేసే నేరాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది; ఆ సమూహంలో ప్రతి ఒక్క చిన్న పనిని ఎవరు చేశారనేది స్పష్టంగా నిరూపించలేకపోయినా ఇది వర్తిస్తుంది. ఝీరామ్ కేసులో, ఈ దాడిలో పాల్గొన్న పెద్ద సమూహంలో సభ్యులుగా ఉన్నారనే కారణంతో పదిమంది నిందితులను ఈ హత్యలకు బాధ్యులుగా చేయడానికి కోర్టు ఈ నిబంధనను ఉపయోగించింది. కానీ కేవలం ఇది మాత్రమే ఈ పదిమందికి ఎందుకు మరణశిక్షే విధించాలి అనే ప్రశ్నకు సమాధానం కాలేదు.
ఒక తీవ్రమైన నేరానికి శిక్ష పడటం, ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలని నిర్ణయించడం అనేవి ఒకే విషయం కాదు. బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1980) కేసులో, సుప్రీం కోర్టు మరణశిక్షకు ఉన్న రాజ్యాంగబద్ధతను సమర్థించింది, కానీ యావజ్జీవ కారాగార శిక్ష నియమంగాను, మరణశిక్ష మినహాయింపుగా మాత్రమే ఉండాలని పేర్కొంది. యావజ్జీవ కారాగార శిక్ష విధించడం నిస్సందేహంగా అసాధ్యమైనప్పుడు మాత్రమే మరణశిక్ష విధించవచ్చనే “అరుదైన వాటిలోకెల్లా అరుదైన” ప్రమాణాన్ని అది నెలకొల్పింది. న్యాయమూర్తులు కేవలం నేరం జరిగిన పరిస్థితులనే కాకుండా, శిక్ష పడుతున్న వ్యక్తి పరిస్థితులను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.
ఝిరామ్‌లో, పది మందిని దోషులుగా నిర్ధారించిన పదకొండు రోజుల తర్వాత కోర్టు వారందరికీ మరణశిక్ష విధించింది. శిక్షా విచారణ సందర్భంగా, వారి గ్రామీణ నేపథ్యాలు, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, మారే అవకాశం, గ్రామీణ ప్రజలపై ఒత్తిడి తెచ్చి మావోయిస్టులతో సహకరించేలా చేయగల అవకాశం, వారు అప్పటికే దాదాపు పన్నెండేళ్లు నిర్బంధంలో గడిపిన సమయం వంటి అంశాలను వారి తరపు న్యాయవాదులు ప్రస్తావించారు.
న్యాయస్థానం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుంది, కానీ తీవ్రతను పెంచే పరిస్థితుల కంటే, తగ్గించే పరిస్థితులు బలంగా లేవని అభిప్రాయపడింది. వారు మారడానికి ఎలాంటి అవకాశం లేదని అభిప్రాయపడుతూ, ఈ కేసు “అరుదైన వాటిలోకెల్లా అరుదైనది” అని తేల్చింది. అయినప్పటికీ, అదే తీర్పు వేర్వేరు నిందితులకు వేర్వేరు రకాల ప్రమేయాన్ని వివరిస్తుంది. పది మందికీ ఒకే, అత్యంత మార్చలేని శిక్షను విధించే ముందు, న్యాయస్థానం ఆ తేడాలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చిందా లేదా అన్నదే ప్రశ్న.
భారతదేశంలో మరణశిక్ష పడిన ఖైదీల సామాజిక నేపథ్యం కూడా ఇక్కడ ముఖ్యమైనది. మరణశిక్ష పడిన ఖైదీలపై ప్రొజెక్ట్ 39A నిర్వహించిన 2016 అధ్యయనంలో, వారిలో 76% మంది వెనుకబడిన వర్గాలు లేదా మైనారిటీ మతాలకు చెందినవారని తేలింది. అలాగే 74.1% మంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని, 61.6% మంది సెకండరీ పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేదని ఆ సర్వే వెల్లడించింది. ఝీరామ్ కేసులో శిక్ష పడిన పదిమంది వ్యక్తులు బస్తర్‌కు చెందిన ఆదివాసీలే; పైగా వీరిలో మెజారిటీ ప్రజలు మరణశిక్ష పడటానికి ముందే ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారు.
ఈ మరణశిక్షల ధృవీకరణ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. 2000 నుండి 2015 మధ్య కాలంలో ట్రయల్ కోర్టులు విధించిన మరణశిక్షలపై ప్రొజెక్ట్ 39A జరిపిన మరో అధ్యయనంలో—అప్పీలు ప్రక్రియ తర్వాత కేవలం 4.9% మరణశిక్షలు మాత్రమే యథాతథంగా మిగిలాయని; మిగిలినవి యావజ్జీవ శిక్షగా మారడం గానీ లేదా నిందితులు నిర్దోషులుగా విడుదల కావడం గానీ జరిగిందని తేలింది.
మిగిలి ఉన్న ప్రశ్నలు
అయితే, ఝిరామ్ కేసుకు సంబంధించి న్యాయపరమైన కథ ఇంకా ముగియలేదు. 2020లో, ఈ దాడిలో తన తండ్రిని కోల్పోయిన జితేంద్ర ఉదయ్ ముద్లియార్, ఝిరామ్ వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని; సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు రాష్ట్ర పోలీసులకు దర్యాప్తు కొనసాగించడానికి అనుమతించింది; 2023లో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ వ్యాసం రాసే సమయానికి, ఆ విచారణ ద్వారా ఛార్జిషీట్‌ను దాఖలు చేయలేదు. కాబట్టి, పది మంది ఆదివాసులకు మరణశిక్ష విధించినప్పటికీ, ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందా లేదా అనే ప్రశ్న ఇంకా అపరిష్కృతంగానే మిగిలిపోయింది.
సంఘర్షణ సంబంధిత ఖైదీల విషయంలో ప్రభుత్వ వైఖరి కూడా మారడం ప్రారంభమైంది. 2026 జూలైలో, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి విజయ్ శర్మ, ప్రాణనష్టం జరగని మావోయిస్టు సంబంధిత కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులపై ఉన్న కేసులను సమీక్షించాలని; అర్హత ఉన్న కేసులను ఉపసంహరించుకుని, చట్టపరమైన ప్రక్రియ ద్వారా ఖైదీలను విడుదల చేయవచ్చో లేదో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పుడు సంఘర్షణ ముగిసిందని చెబుతూ, దాని నుండి తలెత్తిన కేసులను సమీక్షిస్తుంటే, ఇప్పటికీ నేరపూరిత న్యాయ వ్యవస్థలోనే ఉన్నవారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న అనివార్యమవుతుంది.
హైకోర్టు ఝీరామ్ కేసులోని మరణశిక్షలను రద్దు చేయాలి. అలాగే ఘర్షణల సంబంధిత ఆరోపణలతో ఏళ్ల తరబడి జైలు జీవితం గడుపుతున్న ఆదివాసీల కేసులను, ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రభుత్వం సమీక్షించాలి.
ఘర్షణల తర్వాతి కాలంలో అందించే న్యాయంలో మరణశిక్షకు ఏ మాత్రం స్థానం లేదు. ఝీరామ్ కేసులో శిక్ష పడిన పదిమంది వ్యక్తులు ఇప్పటికే కొన్నేళ్లుగా జైలులోనే గడిపారు. బస్తర్‌లో శాంతి అంటే కేవలం ఆయుధ పోరాటం ముగియడమే కాకుండా దానికి మించిన అర్థం ఉండాలంటే, గతం నాటి వివాదానికి సంబంధించిన అత్యంత తిరుగులేని మరణ శిక్షను భవిష్యత్తులోకి తీసుకువెళ్లకూడదు.

ఝిరామ్ కేసులో విధించిన మరణశిక్షలను హైకోర్టు రద్దు చేయాలి. సంఘర్షణ సంబంధిత ఆరోపణలపై ఏళ్ల తరబడి జైలులో గడిపిన ఆదివాసీల కేసులను, ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించాలి.
సంఘర్షణ అనంతరం జరిగే న్యాయంలో మరణశిక్షకు స్థానం లేదు. ఝిరామ్ కేసులో శిక్ష పడిన పది మంది ఇప్పటికే ఏళ్ల తరబడి జైలులో గడిపారు. బస్తర్‌లో శాంతి అంటే కేవలం సాయుధ ఘర్షణల ముగింపు కంటే ఎక్కువ అర్థం ఉండాలంటే, అది సంఘర్షణకు సంబంధించిన అత్యంత కోలుకోలేని శిక్షను భవిష్యత్తులోకి తీసుకువెళ్లకూడదు.

రాశి అగర్వాల్, న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, చట్టం-పరిపాలన అధ్యయన కేంద్రంలో పిహెచ్‌డి పరిశోధక విద్యార్థిని.
https://thewire.in/law/ten-adivasis-on-death-row-and-the-hollow-promise-of-peace-in-bastar
తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply