బ్రిటిష్ రాజ్యంలో షహీద్ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లను ఉరితీయడానికి చాలా కాలం ముందే, 16 సంవత్సరాల విప్లవకారుడు ఖుదీరామ్ బోస్‌ను 1908 ఆగస్టు 11 న ఉరికంబానికి ఎక్కించారు. ఆయన జ్ఞాపకార్థం బెంగాల్ అంతటా పాడే ” అమ్మా, నాకు ఒక్కసారి వీడ్కోలు ఇవ్వు, మళ్ళీ వస్తాను ” (ఏ బార్ బిదాయి దే మా, ఘురే ఆషీ) అనే పాట చివరి పంక్తుల్లో ఖుదీరామ్ బోస్ తన తల్లికి ఈ విధంగా భరోసా ఇస్తాడు: “కొంత కాలం తర్వాత నేను మళ్లీ జన్మిస్తాను, ఒకవేళ నన్ను గుర్తించలేకపోతే, నా గొంతుకపైన ఉన్న ఉరితాడు గుర్తును చూసి గుర్తుపట్టు”.

ఖుదీరామ్ బోస్ తన గొంతుకపైన ఉరిత్రాటి గుర్తుతో జన్మించాడా లేదా అనేది ఎవరూ చూడలేదు, కానీ బ్రిటీషర్ల తర్వాత మన దేశంలో బలహీనమైన ప్రజాస్వామ్యం ఆవిర్భవించింది; దాని గొంతుపైన బోలెడన్ని ఉరితాడు గుర్తులు ఉన్నాయని మనందరి ముందు స్పష్టంగా ఉంది. ఆ గుర్తులు మాత్రమే కాకుండా, వాటిపై రక్తపు తాజా మరకలు కూడా ఉన్నాయి.

నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ గణాంకాల ప్రకారం, 1947 నుండి ఇప్పటివరకు మొత్తం 752 మందిని ఉరితీసారు. ప్రస్తుతం మొత్తం 400 నుండి 500 మందికి పైగా మరణశిక్ష పడినవారి వరుసలో ఉన్నారు. అయితే 1947 తర్వాత మొత్తం 57 మందికి మాత్రమే ఉరిశిక్ష అమలు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మానవ హక్కుల సంఘం ‘పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్’ (పియుడిఆర్) ప్రకారం, 1953 నుండి 1963 మధ్య కేవలం ఒక దశాబ్దంలోనే భారతదేశంలోని 16 రాష్ట్రాల్లో మొత్తం 1,422 మందిని ఉరితీశారు.

ఈ వివరాల్లో ఏవి సరైనవైనప్పటికీ, భారతీయ ప్రజాస్వామ్యం బ్రిటిష్ పాలకులు నిర్మించిన మార్గంలోనే నడుస్తోందని, దాని గొంతుపై కూడా నెత్తుటి గాఢమైన, తాజా గుర్తులు ఉన్నాయనేది వాస్తవం. మధ్యమధ్యలో మరణశిక్షకు వ్యతిరేకంగా చర్చలు జరుగుతుంటాయి; కానీ భారత ప్రభుత్వం మాత్రం బ్రిటీషర్లు రూపొందించిన చట్టాలను, మార్గాన్ని విడనాడడం లేదు.

మరణశిక్షలపైన నిషేధం విధించే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2020 డిసెంబర్ 16 న ఆమోదించింది. అనుకూలంగా 123 దేశాలు ఓటు వేశాయి. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, అంటే మరణశిక్షకు మద్దతుగా అమెరికాతో పాటు భారతదేశంతో కూడా కలిసి మొత్తం 38 దేశాలు నిలిచాయి. భారతదేశంలో మరణశిక్షను రద్దు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్లు, చర్చలు జరుగుతున్నప్పటికీ, “అత్యంత ఘోరమైన” కేసులలో దీనిని అమలు చేయాలనే సాకుతో భారత ప్రభుత్వం దీనిని ఎత్తివేయకుండా మొండిపట్టుతో వ్యవహరిస్తోంది.

2013 నాటి ఝిరామ్ ఘాటీ దాడి కేసులో 10 మంది వ్యక్తులకు మరణశిక్ష విధించడంతో ప్రభుత్వ వర్గాలలో “న్యాయం జరిగింది” అనే ఆనందం వ్యక్తమైంది. అప్పటి నుండి మరణశిక్షపై చర్చ మరోసారి తీవ్రతరమైంది. కేవలం చర్చకు మాత్రమే పరిమితం చేయకుండా మరణశిక్షను పూర్తిగా రద్దు చేసే స్థాయికి తీసుకువెళ్లేలా నేను సభ్యురాలైన పియుడిఆర్ తో సహా మానవ హక్కుల సంఘాల తరఫున, ఈసారి ఈ చర్చను కేవలం చర్చల పరిధినుంచి ముందుకు తీసుకువెళ్లి మరణశిక్షను పూర్తిగా రద్దు చేసే స్థాయికి తీసుకువెళ్లేలా మన ప్రయత్నం ఉండాలి.
ఝిరామ్ ఘాటీ దాడి కేసులో మరణశిక్ష పడిన వారు దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చెందిన, అత్యంత వెనుకబడిన వర్గాలలోని, అత్యంత పేద ప్రజలు. ఈ 10 మందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారి పేర్లు: ప్రమీలా మోడియం, సుమిత్రా పునేమ్ మోడియం; చైతు లేకామ్, ముక్కా మండావి, కవాసి కోసా, ఆయతా మర్కామ్, మడకామి దేవా, జోగా మడకం, బంజామి సన్నా, మహాదేవ్ నాగ్. వీరికి మరణశిక్ష విధించిన న్యాయమూర్తి పేరు అజయ్ సింగ్ రాజ్‌పుత్; ఈ కేసును కోర్టులో వాదించిన ఏజెన్సీ – ఎన్.ఐ.ఏ.: ఈ కేసుకు సంబంధించిన ఈ మాత్రం సమాచారమే చాలా విషయాలను స్పష్టం చేస్తోంది.
ఈ ఘటన రాత్రి సమయంలో జరిగింది; ఇందులో 200-300 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది చీకటిలో దాడి చేశారు; ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు లేరు. తీర్పు రావడానికి ముందే, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈ కేసు గురించి అనుమానం వ్యక్తం చేస్తూ, ఝిరామ్ ఘాటీ మారణహోమం వెనుక ఉన్న కుట్రదారులను చేరుకోవడానికి ఎలాంటి పటిష్టమైన దర్యాప్తు జరగలేదని అన్నాడు. ఘటన తర్వాత డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ సిబ్బంది చెప్పిన దాన్ని బట్టి పోలీసులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అరెస్టు చేశారని బేలా భాటియా తన ఇంటర్వ్యూలో తెలిపారు.
అరెస్టు చేసిన వారిలో ఒక మహిళ తన బాల్యంలో సాంస్కృతిక సంస్థ ‘చేతన నాట్య మండలి’తో సంబంధం కలిగి ఉందని అరెస్టు చేశారు; ఆ గ్రామంలో జరిగుతున్న పెళ్లికి వచ్చిన ఒక యువకుడిని అరెస్టు చేశారు, ఒక మాజీ సర్పంచ్‌ను కూడా అరెస్టు చేశారు. 200 నుండి 300 మంది పాల్గొన్న ఈ దాడిలో ఈ 10 మందే దాడికి కుట్ర పన్నారని విచారణ సమయంలో కూడా రుజువు కాలేదు. అరెస్టయిన ఈ వ్యక్తులు మరణశిక్ష పడకముందే ఎలాంటి బెయిల్ లేకుండా 13 సంవత్సరాలుగా జైలులో ఉన్నారు; రాబోయే సంవత్సరాలను వారు మరణశిక్ష ఒత్తిడితో కూడిన యాతనలో గడుపుతారు, ఇదంతా వారి పట్ల జరిగిన ఒక నేరమే.
బస్తర్‌లో ఆదివాసీల అరెస్టులలో 99 శాతం ఇలాగే బూటకమైనవని, తమ కేసును తాము వాదించుకోవడం మాట అటుంచితే, కనీసం దానిని అర్థం చేసుకోలేక వారు సంవత్సరాల తరబడి జైళ్లలోనే మగ్గిపోతుంటారని బేలా భాటియా చెబుతున్నారు. అయితే ఇక్కడ మనం ఈ అందరికీ తెలిసిన బూటకపు అరెస్టుల గురించి కాకుండా, మరణశిక్ష గురించి మాట్లాడదాం.

ఏ సామాజిక వ్యవస్థలోనైనా మరణశిక్ష అనేదే ఉండకూడదు. దీనికి ప్రధానంగా మూడు ముఖ్యమైన సాంకేతిక, సైద్ధాంతిక, రాజకీయపర కారణాలు ఉన్నాయి. ముందుగా మనం సాంకేతిక కారణాల గురించి మాట్లాడదాం.

మరణశిక్షకు వ్యతిరేకంగా సాంకేతిక కోణం
“వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు” అనేది న్యాయ సూత్రం. ఇలా చెప్పడంలో అర్థం ఏమిటంటే, న్యాయస్థాన ప్రక్రియలో మానవ తప్పిదాలు కూడా జరగవచ్చు, కాబట్టి ఏ నిర్దోషికి కూడా శిక్ష పడకుండా చూసుకోవాలి. మరి ఆ శిక్ష ఒకవేళ మరణశిక్ష అయితే? అప్పుడు ఈ మానవ తప్పిదాలను ఏమాత్రం విస్మరించలేము; ఎందుకంటే మరణించిన తర్వాత ఎవరూ తిరిగి బతికి రాలేరు.
న్యాయ వ్యవస్థలో అవినీతి పెరిగే కొద్దీ, మానవ తప్పిదాలు కాస్తా ఉద్దేశపూర్వక కుట్రలుగా మారడం ప్రారంభిస్తాయి. ధనం, అధికార బలంతో శక్తిమంతులు సాక్ష్యాలను సృష్టించగలరు; నాశనం చేయగలరు. కేవలం వకీలును మాత్రమే కాదు, న్యాయమూర్తిని కూడా కొనుగోలు చేయగలరు; ఒత్తిడి తేగలరు. ఇక ఒక పక్షం ప్రభుత్వమే అయినప్పుడు, దాని ఒత్తిడి తీవ్రతను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇటువంటి న్యాయ వ్యవస్థలో మరణశిక్షను ఆమోదించి, కొనసాగించడం వల్ల, దుర్బల, పేద ప్రజలను సులభంగా దోషులుగా నిర్ధారించగలగడమే కాకుండా వారు నేరుగా మరణశిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ ప్రచురించిన ‘డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం, మరణశిక్ష పొందిన వారిలో 74.1% మంది వెనుకబడిన ఆర్థిక వర్గాల నుండి వస్తున్నవారే. ఇక మిగిలినవారు, భారతదేశంలోని బ్రాహ్మణవాద, హిందూత్వవాద ఫాసిస్టు స్వభావ కారణంగా ముస్లిములు, దళితులు, లేదా ఆదివాసీలు.
అమెరికా గణాంకాల ప్రకారం, అమెరికాలో 1973 నుండి ఇప్పటివరకు మరణశిక్ష పడిన 200 మందిని ఉన్నత న్యాయస్థానం నిర్దోషులుగా గుర్తించి విడుదల చేసింది. వీరిలో కొందరిని వారు మరణించిన తర్వాత నిర్దోషులుగా ప్రకటించారు. మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ బతకడం కూడా ఒక నరకయాతనే. అమెరికాలో ఈ వేచి ఉండే సరాసరి సమయం 11 సంవత్సరాలుగా ఉంది; కొన్ని చోట్ల ఇది 17 సంవత్సరాలుగా కూడా ఉంటోంది.
ఏదైనా ఒక కేసులో మరణశిక్ష విధించేటప్పుడు న్యాయమూర్తి వాస్తవానికి ఈ న్యాయపరమైన లోపాలను, మానవ తప్పిదాలను విస్మరిస్తాడు. అంతేకాకుండా చాలాసార్లు తన సొంత మానసిక భావజాలం కూడా ఇందులో తీవ్రమైన పాత్ర పోషిస్తుంది. నియంతృత్వం వైపు అడుగులు వేస్తున్న ఈ కాలంలో, నిర్దోషే తనను తాను నిరూపించుకోవాల్సిన భారాన్ని మోపుతూ, చట్టం కింద వ్యక్తిని అణచివేసే ఇటువంటి చట్టాలను తీసుకువస్తున్నారు.
మరణశిక్షను కొనసాగించడం అంటే, చట్టాలన్నీ పరిపూర్ణంగా రూపుదిద్దుకున్నాయని, దేశంలోని న్యాయవ్యవస్థ అత్యంత పరిపూర్ణమైన పద్ధతిలో పనిచేస్తోందని అంగీకరించినట్లే. అయితే ఏ సాధారణ మానవుడూ ఈ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధ పడలేడు. అందువల్ల ఇటువంటి సామాజిక వ్యవస్థలో మరణశిక్షను ఏమాత్రం ఆమోదించకూడదు.
ఝిరామ్ ఘాటీ తీర్పులో న్యాయమూర్తి మరణశిక్ష విధించినప్పటికీ, ఈ తీర్పును ధృవీకరించడం కోసం హైకోర్టుకు వెళ్లాలని చెప్పిన తీరును బట్టి చూస్తే, ఆయనపై ఏదో ఒక ఒత్తిడి పనిచేస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఒత్తిడిని అర్థం చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. మావోయిజాన్ని అంతం చేస్తున్నట్లు “కనిపించడం” ప్రస్తుత ప్రభుత్వ అజెండాలో ఒక ముఖ్యమైన భాగం.

మరణశిక్ష రద్దుకు సంబంధించిన సైద్ధాంతిక అంశం
మరణశిక్షను తిరస్కరించడానికి రెండవ కారణం సిద్ధాంతపరమైనది. మరొక విధంగా చెప్పాలంటే, ఏదైనా ప్రజాస్వామిక వ్యవస్థ సిద్ధాంతపరంగా మరణశిక్షను వ్యతిరేకించి తీరాలి.
భారతదేశంతో సహా ప్రతి ప్రజాస్వామిక దేశం కూడా తన చట్టాలు ప్రతీకారం తీర్చుకునేవి కాదనీ, సంస్కరించేవి అని నమ్ముతుంది. అంటే చట్టానికి ఉండే ఒక ముఖ్య ఉద్దేశ్యం నేరానికి పాల్పడిన వ్యక్తిలో మార్పు తీసుకురావడమే కానీ, వ్యవస్థాగతమైన ప్రతీకారం తీర్చుకోవడం కాదు. భారతదేశంలో జైళ్ల పేర్ల ముందు ఇదే కారణం వల్ల “సంస్కరణ మందిరాలు” అని రాస్తారు.
ప్రతీకారం తీర్చుకోవడం అనేది మానవీయ విలువలు అభివృద్ధి చెందని అనాగరిక, వెనుకబడిన సమాజపు లక్షణం. కానీ శిక్షను “సంస్కరించేది” అని అంగీకరించిన తర్వాత కూడా మరణశిక్షను కొనసాగించడం అంటే ఆ సమాజపు మానవీయ విలువలు ఇంకా వెనుకబడిన భూస్వామ్య వ్యవస్థ కాలంలోనే ఆగిపోయాయని ఆ వ్యవస్థ గురించి తానే స్వయంగా వ్యాఖ్యానించినట్లు అవుతుంది.
వాస్తవం ఏమిటంటే, మరణశిక్ష అనేది ఆ ఆగిపోయిన, వెనుకబడిన మానవీయ విలువలు కలిగిన సమాజాన్ని మరింత వెనుకబడినదిగానూ, హింసాత్మకమైనదిగానూ మారుస్తుంది. ఏదైనా అత్యంత ఘోరమైన నేర సంఘటన జరిగినప్పుడు ప్రజలు నిరసన ప్రదర్శనలలో మరణశిక్షను డిమాండ్ చేసినప్పుడు, అది ఆ సంఘటన పట్ల వారి కోపాన్ని వ్యక్తపరచడం మాత్రమే కాదు, ఒక వ్యక్తి హత్యను కోరుకునే వారి మనసులు ఎంత హింసాత్మకంగా మారాయో కూడా నిరూపిస్తుంది.
ఎప్పుడైతే ప్రజలు ఎవరికైనా మరణశిక్ష విధించినప్పుడు లేదా ఉరితీసినప్పుడు సంబరాలు చేసుకుంటారో (అఫ్జల్ గురును ఉరితీసినప్పుడు ఎలా చేశారో, ఝిరామ్ ఘాటీ తీర్పు సమయంలో చాలా మంది ఎలా చేశారో), వాస్తవానికి అది ఆ సమాజంలోని ఎందరో వ్యక్తుల మనసులు ఒక హత్య చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తుంది. వారి మనసులు ఇంకా మానవీయ సంవేదనల ఉన్నత స్థాయికి చేరుకోలేదని ఇది చూపుతుంది. అటువంటి ఎందరో వ్యక్తుల మనసులు కలసి ఒక సమాజాన్ని నిర్మించినప్పుడు, ఆ సమాజం ఒక హింసాత్మక సమాజంగా మారుతుంది.

అటువంటి సమాజంలో హత్యల ఘటనలు, అత్యంత ఘోరమైన హత్యల ఘటనలు ఆగకుండా పెరుగుతూనే ఉంటాయి. వ్యవస్థ మరణశిక్షలను వేస్తూనే ఉంటుంది, మరోవైపు అత్యంత ఘోరమైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అధికార వ్యవస్థ సమాజాన్ని మానవీయంగా మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం మాట అటుంచి, దానిని మరింత క్రూరంగా మార్చే విధానాలను రూపొందిస్తూ, అమలు చేస్తూ వస్తోంది. అందులో ఈ మరణశిక్ష కూడా ఒకటి.
హింసాత్మక, క్రూరమైన సమాజంలో ఒక వ్యక్తికి మరణశిక్ష విధించడం ఆ వ్యక్తికి జరిగే పెద్ద అన్యాయం కాబట్టి సిద్ధాంతపరంగా ఎవరికీ మరణశిక్ష విధించకూడదు. ఏ వ్యక్తి అయినా, లేదా అపరాధ మనస్తత్వం గల వ్యక్తి అయినా ఒంటరిగా రూపుదిద్దుకోడు; అతని చుట్టూ ఉన్న సమాజంలోనే అతను తయారవుతాడు. ఆ సమాజానికి దానికంటూ కొన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రభావాలు ఉంటాయి.
మహిళల పట్ల హేయమైన దృక్పథం ఉన్న సమాజంలో అత్యాచారాలకు పాల్పడే మగాళ్లే పుడతారు; మతపరమైన, కులపరమైన మూకదాడులు (లించింగ్‌లు) సాధారణమైపోయిన సమాజంలో హంతకులే పుడతారు; ప్రభుత్వ అణచివేత అంతులేకుండా ఉన్న సమాజంలో వ్యతిరేకులు; తిరుగుబాటుదారులే పుడతారు. సమాజంలో పితృస్వామ్యం మహిళల బ్రతుకును కష్టతరం చేసినప్పుడు, మహిళలు కూడా తమను తాము రక్షించుకోవడానికి చట్టం దృష్టిలో నేరంగా పరిగణించే అనేక పనులను చేయాల్సి వస్తుంది.
అయితే న్యాయమూర్తి ఏదైనా నేరంపైన ఒక వ్యక్తికి శిక్షను ఖరారు చేసేటప్పుడు, ఆ వ్యక్తి నేరం చేయడానికి కారణమైన సామాజిక, ఆర్థిక పరిస్థితులపైన దృష్టి పెట్టకుండా కేవలం ఆ వ్యక్తిపైనే దృష్టి పెడతాడు. ఇది అసంపూర్ణ న్యాయం. ఇందులో ప్రతిసారీ సామాజిక వ్యవస్థను నిర్దోషిగా వదిలేస్తారు; ఆ వ్యవస్థకు శిక్ష విధించే లేదా దానిని సంస్కరించే ఎలాంటి తీర్పునూ ఇవ్వరు. అటువంటి హింసాత్మక, భూస్వామ్య, పితృస్వామ్య, మతపరమైన, కులపరమైన అసహనాన్ని కలిగి ఉండి, నేరాన్ని ఆరాధించే అధికారం ఉన్నంతవరకు, మరణశిక్ష విధించడం అనేది దానికదే ఒక పెద్ద నేరం అవుతుంది. ఈ సమాజ వ్యవస్థ అదే పనిని నిరంతరం చేస్తూనే ఉంది.
మరణశిక్ష – రాజకీయ కోణం
మరణశిక్ష అనేది వాస్తవానికి అత్యంత ఘోరమైన నేరాలను చేసినవారిని శిక్షించడం కోసం రూపొందించలేదు. ఎందుకంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడే నేరస్థులు పార్లమెంటులోనే కూర్చున్నారు. మరణశిక్ష అనేది నిజానికి తమ వ్యతిరేకులను అంతం చేయడానికే సృష్టించారు. బ్రూనో నుండి స్పార్టకస్ వరకు, భారతదేశంలో మంగళ్ పాండే, ఖుదీరామ్ బోస్, సిద్ధూ-కానూ, బిర్సా ముండా, వీర్ నారాయణ్ సింగ్, అష్ఫాకుల్లా, రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లు, కయ్యూర్ విప్లవకారులు నలుగురు, స్వతంత్ర భారతదేశంలో భూమయ్య, కిష్టా గౌడ్ మొదలుకొని మక్బూల్ భట్, అఫ్జల్ గురు వరకు, అలాగే ఝిరామ్ ఘాటీకి చెందిన 10 మంది ఆదివాసీల (వీరికి ఇటీవల మరణశిక్ష విధించారు) వరకు మరణశిక్షతో సత్కరించబడిన వారందరూ అధికార వ్యవస్థకు రాజకీయ వ్యతిరేకులుగా ఉన్నవారే.
వాస్తవానికి ఇప్పటివరకు ఉన్న అధికార వ్యవస్థ తన అధికారాన్ని కాపాడుకోవడానికి, తన రాజకీయ వ్యతిరేకులను అంతం చేయడానికి హత్యకు చట్టపరమైన ముసుగు తగిలించడానికే ఉరిశిక్ష కోసం చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఉరిశిక్ష అనేది నిజానికి వ్యవస్థను వ్యతిరేకించే వారిపైన ప్రభుత్వ ఆధిపత్యాన్ని ప్రకటించడమే. ఇది సమాజంలో శాంతిభద్రతలను కాపాడటానికి కనిపెట్టిన చట్టపరమైన వ్యవస్థ కాదు, వ్యతిరేకులకు బుద్ధి చెప్పడానికి అధికారానికి ఉన్న రాజకీయ అహంకారానికి ప్రతీక.
కాని వాస్తవం ఏమిటంటే, సమాజ ఆవిర్భావం నుంచి అది మారుతూనే ఉంది. దాని స్థబ్ధతను తుడిచిపెట్టే వ్యక్తులు సమాజంలో ఎప్పుడూ పుడుతూనే ఉన్నారు; అందుకే సమాజం ముందుకు సాగుతోంది. పైన పేర్కొన్న ఉరిశిక్షకు గురైనవారి పేర్లన్నింటినీ చదవండి; వీరు ఎదైనా సాధారణ నేరం చేయడం వల్ల కాదు; సమాజాన్ని ముందుకు నడిపించే మార్గాన్ని చూపినవారే. మరణశిక్షను తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించాలంటే, ఇది సమాజం నుండి నేరాన్ని అంతం చేయకపోగా ఇప్పటివరకు సమాజానికి మార్గదర్శకత్వాన్నందించిన నాయకత్వ శక్తులనే అంతం చేసింది.
ఈ శిక్షను విధించడం అంటే, ప్రజల జీవితాలపైన అంతిమ హక్కు రాజ్యానిదే అని ప్రభుత్వ అధికారం ప్రకటించడమే. ఈ ఆలోచనే స్వయంగా ప్రజాస్వామిక భావనకు వ్యతిరేకంగా ఉంది. ఏ రాజ్య వ్యవస్థకూ ఈ శక్తి ఉండకూడదు.
భూమయ్య, కిష్టా గౌడ్‌ల ఉరిశిక్షపైన విప్లవ కవి వరవర రావు రాసిన తన డైరీ “ఎబాలిష్ డెత్ పెనాల్టీ” (మరణశిక్షను రద్దు చేయండి) లో: “చట్టం పేరుతో తన అత్యంత నిబద్ధత గల అసమ్మతివాదిని (కమిటెడ్ డిసెంటర్) హత్య చేసే సమాజం ఎలాంటిది?” అని ప్రశ్నిస్తారు. ఝిరామ్ ఘాటీలో 10 మంది ఆదివాసీలకు విధించిన మరణశిక్ష తీర్పు, వారు రాజ్యానికి నిబద్ధత గల అసమ్మతివాదులు (“కమిటెడ్ డిసెంటర్లు”) అనే భావనపైనే ఆధారపడి ఇవ్వడం జరిగింది. నిబద్ధత గల అసమ్మతివాదులు అవడంతో పాటు, వారు భారతదేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చెందినవారు, ఆదివాసీలు; అత్యంత పేదవారు అనే అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి.
ఝిరామ్ ఘాటీ కేసులోని 10 మంది ఆదివాసీల మరణశిక్షకు వ్యతిరేకంగా, అలాగే ప్రజాస్వామిక గొంతుకపైన పడిన ఉరిత్రాటి గుర్తులను తొలగించడానికి, దీనిపై మళ్లీ పడుతున్న రక్తపు మరకలను అడ్డుకోవడానికి అందరూ ముందుకు రావాల్సిందే; లేకపోతే ఈ గుర్తులు; మరకలే ఒక రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గొంతు నులిమి చంపేస్తాయి.
తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply