పాలస్తీనా చిత్రకారుడు స్లిమాన్ మన్సూర్

స్లిమాన్ మన్సూర్ (1947-2026) ఆధునిక పాలస్తీనా కళలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఆయన కళా రూపాలు  పాలస్తీనా అస్తిత్వానికి, ప్రతిఘటనకు బలమైన చిహ్నాలు.  79 ఏళ్ల వయస్సులో ఆయన ఆక్రమిత తూర్పు జెరూసలేంలో, 2026 ఆగస్టు 24న, అల్ మకాస్సెడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మన్సూర్ 1947 లో జన్మించారు.  తన బాల్యాన్ని తాను పుట్టిన బీర్‌జైట్ పచ్చని కొండలు, పొలాల మధ్య గడిపారు. ఆ తర్వాత తన యవ్వన౦లొ  బెత్లహేమ్, జెరూసలేంలో గడిపారు. ఈ అనుభవాలు ఆయన చిత్రాలపై గొప్ప ముద్ర వేశాయి. ముఖ్యంగా 1967 లో వెస్ట్ బ్యాంక్ జెరూసలేం, ఆక్రమణ తర్వాత, పాలస్తీనాలో క్రమంగా కోల్పోతున్న భావనను తీవ్రతరం చేశాయి.

మన్సూర్ ప్రసిద్ధ చిత్రకారుడు, శిల్పి, రచయిత, కార్టూనిస్ట్. మన్సూర్ తన సుదీర్ఘ కళా జీవితంలో విభిన్న మాధ్యమాలను ఉపయోగించారు. తన స్వదేశంలో నిర్వాసితుడిగా ఎదుర్కొన్న అనుభవాలకు, పాలస్తీనా జాతీయ ఉద్యమంలో జరిగిన పరిణామాలకు అనుగుణంగా ఆయన కళా రూపాలు మారుతూ వచ్చాయి. మన్సూర్, కళాకారులు వెరా తమారి, తైసీర్ బరకాత్, నబీల్ అనానీలతో కలిసి న్యూ విజన్స్ ఉద్యమాన్ని 1987లో స్థాపించారు. మొదటి ఇంతిఫాదాకు (1987- 1993) ప్రతిస్పందనగా ఈ ఉద్యమం  జ‌రిగింది.  ఇజ్రాయెల్ కళా సామగ్రిని బహిష్కరించి, వాటి స్థానంలో కాఫీ, హెన్నా, మట్టి వంటి స్థానిక సహజ పదార్థాలను ఉపయోగించాలని ఈ ఉద్యమం కళాకారులకు పిలుపునిచ్చింది. అనేక సంస్కృతుల్లో, మతాల్లో మానవ జీవితానికి పునాదిగా భావించే మట్టి, అదే సమయంలో పాలస్తీనా నేలలోని భాగం కూడా కావడంతో, మన్సూర్‌కు అత్యంత ఇష్టమైన కళా సాధనంగా మారింది. ఆయ‌న మట్టిని ఉపయోగించి  సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన పాలస్తీనా సంస్కృతిని వేడుకగా ఆవిష్కరించే ప్రతీకలను సృష్టించారు. అదే సమయంలో, పాలస్తీనీయులు తమ నేలతో వేళ్లూనుకున్న బంధాన్ని, పాలస్తీనా రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో ఖండిత (fragmentation) స్థితిని   కూడా  చిత్రించారు. మట్టి ఎండిపోతున్న కొద్దీ ఏర్పడే పగుళ్లలో ఈ పాలస్తీనా జాతి ప్రతిధ్వనిస్తుందని భావించారు.

మన్సూర్ జెరూసలేంలోని బెజాలెల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్‌లో ఫైన్ ఆర్ట్స్ అభ్యసించారు. వృత్తిపరంగా కార్టూనిస్ట్‌గా పనిచేశారు.  ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ వ్యవస్థాపక బోర్డు సభ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు. అల్-ఖుద్స్ విశ్వవిద్యాలయం 2000-2014 మధ్య, ఇంకా అనేక పాలస్తీనా సాంస్కృతిక, విద్యా సంస్థల్లో ఆయన దృశ్య కళలను బోధించారు.

స్లిమాన్ మన్సూర్ కళ, దాదాపు ఒక శతాబ్ద కాలంగా ఆక్రమణలో జీవిస్తున్న ప్రజల ఆశలను, వాస్తవ జీవితాన్ని ఎంతో నేర్పుగా ప్రతిబింబిస్తుంది. 1970ల ప్రారంభం నుంచి పాలస్తీనా ప్రజల ఒంటరితనాన్ని, నిర్వాసితత్వాన్ని, మొత్తంగా సామాజిక జీవితాన్ని   తన అనుభవాల నుంచి చిత్రాలుగా, ప్ర‌తీక‌లుగా మ‌లిచి వ్య‌క్తం చేశారు. పాల‌స్తీనా సామాజిక జీవితంలో, ఆ నేల‌లో  వేళ్లూనుకుని పాల‌స్తీనా విముక్తి భావ‌న‌ల‌ను త‌న క‌ళ ద్వారా అందించారు.  త‌ద్వారా  పాలస్తీనా పోరాటానికి ప్రత్యేకమైన దృశ్య ప్రతీకల భాషను రూపొందించారు. “జమల్ అల్ మహామెల్” లేదా “కష్టాల ఒంటె”, “భారాల ఒంటె” వంటి చిత్రాల్లో పాల‌స్తీనా జీవ‌న భారాన్ని దృశ్యీక‌రించారు.  వాటిలో ఆయ‌న తన భుజాలపై పాలస్తీనీయులందరూ కోరుకునే జెరూసలేంను   భారంగా మోస్తూ కనిపిస్తాడు. ఈ చిత్రాలు పోస్టర్లు, కార్డులు, స్టిక్కర్లుగా ముద్రించబడ్డాయి. ఆయ‌న కళాఖండాలను, పోస్టర్లను తరచూ స్వాధీనం చేసుకుని, ప్రదర్శనలను, కళా ప్రదర్శనశాలలను   ఇజ్రాయెల్ సైనిక అధికారులు మూసివేసేవారు. వారికి ఈ చిత్రాలు  ప్రత్యక్ష సవాలుగా మారాయి. అయినా ఈ చిత్రాలు  విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి.

మన్సూర్ సుప్ర‌సిద్ధ చిత్రాల్లో  1973 నాటి   ది కేమెల్ ఆఫ్ హార్డ్‌షిప్స్ ఒకటి. ఇందులో  జెరూసలేం నగరాన్ని భారంగా   మోస్తూ వంగి ఉన్న ఒక వృద్ధ పాలస్తీనా వ్యక్తి ఉంటాడు.  అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ రచన ఒక కళాత్మక, జాతీయ చిహ్నంగా మారింది.  పెద్ద కన్ను ఆకారంలో జ‌రూస‌లేం న‌గ‌ర  భారాన్ని ఇందులో ఆయ‌న చిత్రించారు.  దాని లోపల డోమ్ ఆఫ్ ది రాక్ కనిపిస్తుంది.

మన్సూర్ ప్రతి కళాఖండం  విముక్తి రాజకీయాలలో అంత‌ర్భాగంగా అమ‌రి ఉంటుంది.   1980లలో రమల్లాలో స్లిమాన్ మన్సూర్, తన ఇద్దరు సహచరులు నబీల్ అనానీ, ఇసామ్ బదర్‌లతో కలిసి అరెస్టయ్యారు. పాలస్తీనా జెండాలోని రంగులను తమ చిత్రాల్లో ఉపయోగించడమే వారి నేరం. ఆ తర్వాత, అప్పటి ఇజ్రాయెలీ పోలీసు అధికారి తన కళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని మన్సూర్‌ను ఒప్పించడానికి ప్రయత్నించాడు.

ఆ విష‌యాల‌ను మన్సూర్ ఇలా గుర్తుచేసుకున్నారు.  అప్పుడు “అతను మాతో ఇలా అన్నాడు. మీరు పూలను, నగ్న చిత్రాలను ఎందుకు గీయరు? అవి చాలా అందంగా ఉంటాయి. అలాంటి చిత్రాన్ని నేను మీ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు కూడా.”  అని.  కానీ మన్సూర్ కళను సంపూర్ణంగా పాలస్తీనా విముక్తి కే అంకితం చేశారు.

పాలస్తీనా జీవితం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల నుంచి ఉద్భవించిన ప్రతీకలను ఉపయోగిస్తూ, మన్సూర్ పాలస్తీనీయుల సంకల్పాన్ని, తమ నేలతో వారికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తనదైన ప్రత్యేక శైలిలో చిత్రిస్తారు. ఆయన కళాఖండాలు కళ కూడా ప్రతిఘటనకు ఒక రూపం కాగలదనే భావనకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. నారింజ చెట్ల ద్వారా ఆయన 1948 నక్బాలో కోల్పోయిన భూమిని సూచిస్తారు. ఆలివ్ చెట్ల ద్వారా 1967లో ఆక్రమించబడిన భూమిని సూచిస్తారు. సాంప్రదాయిక ఎంబ్రాయిడరీ దుస్తులు ధరించిన మహిళల ద్వారా పాలస్తీనా భూమిని, పాలస్తీనా విప్లవాన్ని సూచిస్తారు. పాలస్తీనా ప్రకృతి దృశ్యాలను, రాతితో నిర్మించిన మెట్లలాంటి వ్యవసాయ భూములను చిత్రించడం ద్వారా ఆ నేలపై పాలస్తీనా రైతులు వేసిన ముద్రను సూచిస్తారు. జెరూసలేం చిత్రాలను, మెరిసిపోతున్న డోమ్ ఆఫ్ ది రాక్‌ను చిత్రించడం ద్వారా పాలస్తీనా మాతృభూమిని, తిరిగి స్వదేశానికి చేరుకోవాలనే కలను ప్రతిబింబిస్తారు.

మన్సూర్ క‌ళ‌ పాలస్తీనా సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలలో పాతుకుపోయిన చిహ్నాలపై ఎక్కువగా ఆధారపడింది. గ్రామీణ జీవితం, పాలస్తీనా మహిళలు, సాంప్రదాయ ఎంబ్రాయిడరీలను ఆయన చిత్రించారు. మన్సూర్ కళను ప్రతిఘటనా పోరాటంగా చూశారు. అనడోలు అనే ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాలస్తీనియన్లకు వారి భూమితో ఉన్న అనుబంధాన్ని, దానిని రక్షించాలనే వారి పట్టుదలను, పాలస్తీనా అందాన్ని తన పని ద్వారా చూపించడానికి ప్రయత్నించానని ఆయన చెప్పారు.

ఈ చిత్రాల వెనక ఉన్న సాంస్కృతిక భావాన్ని ఒకసారి మన్సూర్ వివరించారు. ఆ భావాన్ని అరబిక్ లో సుమూద్ అంటారు. దీనికి ఇంగ్లీషులో అర్థం ‘స్థైర్యం’, ‘అచంచలమైన నిలకడ’,” అని మన్సూర్ వివరించారు. “నా దృష్టిలో ‘సుమూద్’ అంటే మనం ఎవరో మరచిపోకుండా ఉండటం. మన విముక్తి కోసం నిరంతరం పోరాడటం. ఈ నేలపై మనం జీవించాలంటే రెండవ శ్రేణి ప్రజలుగా జీవించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్లకు లొంగిపోకపోవడం. ప్రధానంగా ఇజ్రాయెల్ మన నుండి కోరుకునేది అదే. ఈ నేలపై పాలకులు తామేనని మనం అంగీకరించాలని అది కోరుకుంటోంది.   నేను దానికి అంగీకరించను. దానికి వ్యతిరేకంగా నేను పోరాడతాను. క్లుప్తంగా చెప్పాలంటే అదే ‘సుమూద్’ అర్థం.

ఓడిపోతున్న పాలస్తీనులకు కలలెందుకు? కళలెందుకు?

భయంకరమైన నరసంహారాన్ని ఎదుర్కొంటూ, పాలస్తీనా నామ మాత్రం కూడా ఒకరాజ్యం గా మనగలిగే పరిస్థితి లేని నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తూ మన్సూర్‌ అన్నారు:

‘‘నాకు ఆశ ఉంది. పాలస్తీనియన్లకు ఎప్పుడూ ఆశ ఉంటుంది. మా వైఖరి న్యాయమైనదని మేము విశ్వసిస్తున్నాం. ఈ నేలలో మా వేర్లు ప్రాచీన చరిత్రలోనే పాతుకుపోయి ఉన్నాయని ప్రజలకు తెలుసు. మమ్మల్ని పాలస్తీనా నుంచి తొలగించడానికి జియోనిస్టులు చెప్పే ‘దేవుడు ఈ భూమిని వారికి ఇచ్చాడు’ అనే వాదన ఏమాత్రం నమ్మదగినది కాదు. పాలస్తీనియన్లకే కాదు, ప్రపంచంలోని చాలా మందికి, ముఖ్యంగా యువతకు, అది ఆమోదయోగ్యం కాదు. ఇంతకంటే భయంకరమైన ఎన్నో ఆక్రమణలను మేము ఎదుర్కొన్నాం. కానీ ఆక్రమణదారులంతా చివరికి ఈ నేలను విడిచిపెట్టారు’ ’ .

కళల గురించి ఆయ‌న ఇలా అన్నారు: ‘‘కళే మా జీవనస్థితి. మీకు మాతృభూమి లేకుండా చేసినప్పుడు, మీ ఉనికినే నిరాకరించినప్పుడు, ‘మేమిక్కడ ఉన్నాం. ఈ నేలతో మా వేర్లు ఎంతో లోతుగా పెనవేసుకుని ఉన్నాయి’ అని చెప్పడానికి కళ ఒక మార్గమవుతుంది. నిలువ నీడ లేనివారికి కళే ఒక ఇల్లవుతుంది.”

ఈ చిత్రాల ద్వారా, మన్సూర్ పాలస్తీనా ప్రతిఘటనా దృశ్యాలకు  గుర్తింపును రూపొందించడంలో సహాయపడ్డారు. పాలస్తీనా జాతికి జరిగిన అన్యాయాన్ని మరచిపోకుండా జ్ఞాపకశక్తిని కాపాడటానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పాలస్తీనా సమస్యను తెలియజేయడానికి కళను ఒక సాధనంగా ఉపయోగించారు.

సంపన్నమైన, వివిధ కోణాలున్న తన కళా సృష్టి ద్వారా పాలస్తీనా జాతీయ దృశ్య గుర్తింపును రూపొందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, పాలస్తీనాలో కళా ఉద్యమాన్ని నిర్మించడంలో కూడా మన్సూర్ గొప్ప కృషి చేశారు. 1973లో ఆయన లీగ్ ఆఫ్ పాలస్తీనియన్ ఆర్టిస్ట్స్‌ను సహస్థాపించారు. అనేక సంవత్సరాలు ఆ సంస్థకు నాయకత్వం వహించారు. 1994లో ఆయన జెరూసలేంలో అల్-వాసితి ఆర్ట్ సెంటర్‌ను సహస్థాపించారు. ప్రవాసంలో ఉన్న పాలస్తీనా కళాకారులకు, అంతర్జాతీయ కళాకారులకు మధ్య వంతెన నిర్మించడం, పాలస్తీనాలో కళల ను నమోదు చేసి సంరక్షించడం ఈ కేంద్రం లక్ష్యాలు.

స్లిమన్ మన్సూర్ తన కళాఖండాలను జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనల్లో ప్రదర్శించారు. వాటిలో 1987లో పారిస్‌లోని ఇన్‌స్టిట్యూట్ డు మొండ్ అరబ్‌లో జరిగిన ప్రారంభ ప్రదర్శన, 1990లో న్యూయార్క్‌లోని అదర్ మ్యూజియంలో జరిగిన “ఆక్రమణ మరియు ప్రతిఘటన”, 1995లో షార్జాలో జరిగిన షార్జా బియన్నాలే, 1997లో అమ్మాన్‌లోని దారత్ అల్ ఫునున్‌లో జరిగిన “ఏడుగురు పాలస్తీనా కళాకారులు”, 2003లో హ్యూస్టన్‌లోని స్టేషన్ మ్యూజియం ఆఫ్ కాంటెంపరరీ ఆర్ట్‌లో జరిగిన “మేడ్ ఇన్ పాలస్తీన్”, 2011లో దుబాయ్‌లోని మీమ్ గ్యాలరీలో జరిగిన “ఆర్ట్ పాలస్తీన్”, 2021లో సెంటర్ పాంపిడూతో కలిసి లూవ్ర్ అబుదాబిలో నిర్వహించిన “అబ్స్ట్రాక్షన్ అండ్ కాలిగ్రఫీ, విశ్వజనీన భాష వైపు” వంటి ప్రదర్శనలు ఉన్నాయి. 1998లో మన్సూర్ దృశ్య కళల విభాగంలో పాలస్తీనా పురస్కారాన్ని, ఏడవ కైరో బియన్నాలేలో గ్రాండ్ నైల్ పురస్కారాన్ని అందుకున్నారు. 2019లో పాలస్తీనా, అరబ్ సంస్కృతులను అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకువచ్చిన కృషికి ఆయనకు యునెస్కో-షార్జా అరబ్ సంస్కృతి పురస్కారం లభించింది.

తన దశాబ్దాల సుదీర్ఘ వృత్తిజీవితంలో, ఆయన రోమ్ ప్రైజ్, యునెస్కో అవార్డు, అల్లాహ్ క్రియేటర్స్ కోసం నైల్ అవార్డు, ప్లాస్టిక్ ఆర్ట్స్ కోసం పాలస్తీనా ప్రైజ్‌తో సహా అనేక స్థానిక, అంతర్జాతీయ గౌరవాలను అందుకున్నారు.

(మూలం డైలీ సబా, స్లిమాన్ మన్సూర్ వెబ్ సైట్, అల్-జజీరా)

Leave a Reply