ఇతర భాషల్లో పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కానీ తెలుగులో సైన్సును ప్రమోట్ చేసే రచనలు మొదటి నుంచి కూడా చాలా తక్కువ. దాని విలువ చాలా మందికి స్పష్టంగా తెలియక పోవటం చేత రచయితలు అటువైపు దృష్టి సారించలేకపోయారు. విజ్ఞాన శాస్త్రాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెందిన వాళ్ళు రాయగలిగే వాళ్ళు కాకపోవడం మూలంగా రాయలేకపోయారు. ఈ రెండు కారణాల వల్ల సైన్సు రచనలు ఎక్కువగా మనకు అందుబాటులో లేకుండా పోయాయి. సహజంగానే భారతీయులలో సైన్సు మీద కంటే నాన్ సైన్సు మీదనే దృష్టి ఎక్కువ. ఈ విషయం కూడా ఈ రంగంలో రచనల కొరతకు కారణమై ఉంటుంది. గతంలో తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన కొందరు ఈ రంగంలో కృషి చేశారు. మహీధర నళినీ మోహన్, నండూరి రామమోహన్ రావు, కొడవటిగంటి కుటుంబరావు లాంటి వాళ్ళు చేసిన కృషి మామూలుది కాదు. ఇప్పుడు కూడా జనవిజ్ఞాన వేదికకు చెందిన వారు కొందరు సైన్సును ప్రజల్లోకి తీసుకొని పోవటానికి సహకరించే కొన్ని రచనలు చేశారు. కానీ వీళ్ళ ప్రధాన రంగం మూఢనమ్మకాల నిర్మూలన కావటం మూలంగా వాల్ల రచనలు ఎక్కువగా అదే తరానికి పరిమితం కావాల్సి వచ్చింది. పాపులర్ సైన్సు రచనల్లాంటివి ఇప్పుడు రావటం లేదు. మన నిత్య జీవితంలో సైన్సు ఎలాంటి అవిభాజ్యమైన అంశమో సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో వివరిస్తూ చేస్తున్న రచనలు కూడా నేడు కరువయ్యాయి. ఈ కొరతను కొంచెం పాత రచనలయినా సరే చదివి తీర్చుకోవటంలో తప్పులేదు. “బాలగోపాల్ సైన్స్ వ్యాసాలు” అటువంటి విలువైన పుస్తకం.
దీనిని ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ వారు 2015లో మొదటిసారిగా ప్రచురించారు. ఇది 28 పేజీలతో వచ్చిన చిన్న పుస్తకం. ఇందులో నాలుగు వ్యాసాలున్నాయి. ఇది చిన్న పుస్తకమే కానీ పాఠకులకు ఇది చేయగల దోహదం పెద్దది. బాలగోపాల్ తన జీవితంలో సైన్సును గురించి రాసింది ఈ నాలుగు వ్యాసాలే. బాలగోపాల్ లాంటి వ్యక్తి సైన్సును గురించి ఎలా ఆలోచించాడో, ఏం చెప్పాడో తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనేం మామూలు వ్యక్తి కాదు. మానవ హక్కుల ఉద్యమం దగ్గరినుంచి, మార్క్సిజం దాకా ఆయన అడుగుపెట్టని రంగం కానీ మాట్లాడని అంశం కానీ లేదు. ఏ విషయం మీదనైనా శాస్త్రీయంగా, సాధికారంగా మాట్లాడగల దిట్ట ఆయన. అటువంటి వ్యక్తి సైన్సు గురించి ఏం చెప్పినా అది సమాజానికి ఎంతో అక్కరకు వచ్చేది అయి ఉంటుంది. ఈ పుస్తకం చదివిన వారికి దాని విలువేమిటో అర్థమవుతుంది. సైన్సును పక్కన పెట్టి మతాన్ని నెత్తిన పెట్టుకుంటున్న ప్రభుత్వాల ఏలుబడిలో ఇలాంటి పుస్తకాలు ఒక ఉద్యమంలాంటి పాత్రను నిర్వహిస్తాయని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ సంకలనంలోని మొదటి వ్యాసం “మానవ నాగరికత అభివృద్ధి క్రమంలో విజ్ఞాన శాస్త్రం పాత్ర”. ఇది 1981 లో ఒక సభలో బాలగోపాల్ చేసిన ప్రసంగానికి వ్యాసరూపం. ఇందులో మొదటి పేరా ఇలా ఉంటుంది.
“ఒక విషయాన్ని పరిశీలించేటప్పుడు దాని సారాంశంలోని వైరుధ్యాలను-అంటే ఆ విషయానికి అంతర్గతమైన వైరుధ్యాలను-అర్థం చేసుకోవాలని, అదే సరైన గతితార్కిక దృక్పథమని లెనిన్ అన్నాడు. మానవ నాగరికత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అంశం విజ్ఞాన విస్తరణ. ఈ విజ్ఞాన విస్తరణకు అంతర్గతమైన ప్రధాన వైరుధ్యం విజ్ఞాన శాస్త్రానికి, మౌఢ్యానికి వున్న వైరుధ్యం. ఈ వైరుధ్యాన్ని, దాని చారిత్రక పరిణామక్రమాన్ని అర్ధం చేసుకుంటే మానవ నాగరికత అభివృద్ధి క్రమంలో విజ్ఞాన శాస్త్రం నిర్వహించిన పాత్ర ఏమిటో అర్థమవుతుంది”. వ్యాసం మొత్తాన్ని సరైన క్రమంలో అర్థం చేసుకోవడానికి ఈ నాలుగు వాక్యాలు బాగా పనిచేస్తాయి. ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలందాకా మనిషి అవగాహనలో విజ్ఞాన శాస్త్రం ఎలా వుందో, ఎలా పరిణితి సాధించిందో సరళంగా, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఈ వ్యాసంలో వివరించారు రచయిత. ఇందులో చరిత్రపరంగా చూసినా, విజ్ఞాన శాస్త్ర పరంగా చూసినా కొన్ని ఆశ్చర్యంగొలిపే, భారత దేశానికి గర్వకారణంగా నిలువగలిగే కొన్ని నిజాలను ఉటంకించటం జరిగింది. “ప్రాచీన భారత వైద్యవిజ్ఞానం ఆనాటి పాశ్చాత్య వైద్య విజ్ఞానం కంటే పరిణతి చెందిందని దేవీ ప్రసాద్ చటోపాధ్యాయ వంటి పరిశోధకులు చూపించా”రనటం గానీ, “శాతవాహన కాలంలోనే ఆంధ్ర ప్రాంతం నుండి విదేశాలకు పట్టు ఎగుమతి జరిగింద”నటం గానీ ఆసక్తిని కలిగిస్తాయి. ఈ వ్యాసంలో విజ్ఞాన శాస్త్రం నేపథ్యంలో చాలా విలువైన ప్రతిపాదనలు కనిపిస్తాయి. మార్క్సిస్టు దృక్పథం నుంచి విజ్ఞాన శాస్త్రాన్ని పరిశీలించే సరళికి నమూనాలాంటి వ్యాసం ఇది.
రెండవ వ్యాసం “గ్రహణాలకథ” .డా:మహీధర నళినీమోహన్ రాసిన ‘గ్రహణాల కథ’ అనే పుస్తకానికి రాసిన సమీక్షనే ఈ వ్యాసం. ఇది మొత్తంగా గ్రహణాలను గురించి చర్చించిన వ్యాసం. విషయం గ్రహణాలదే అయినప్పటికీ దాని చరిత్రను వివరిస్తూ, రచయిత అవగాహనలోని పరిమితులను, చెప్పే పధ్ధతిలోని లోటుపాట్లను నిర్మొహమాటంగా చర్చించిన వ్యాసం ఇది.
మూడవది “సైన్స్ గురించి రాజకీయంగా ఆలోచించటం నేర్చుకోవాలి” అన్న వ్యాసం. ఇది కొడవటిగంటి కుటుంబరావు గారి “సైన్స్ వ్యాసాలు” అన్న పుస్తకానికి బాలగోపాల్ రాసిన ముందుమాట. ఇందులో కూడా అమూల్యమైన ప్రతిపాదనలున్నాయి. చర్చించిన సమాచారం కోణంలో మొదటి వ్యాసం లాగానే ఈ వ్యాసం కూడా చాలా విలువైనది. ఇందులో వర్తమాన భారత దేశంలో శాస్త్ర సాంకేతిక ప్రగతి ఎలా ఉందో, దానికి గల కారణాలేంటో స్పష్టంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదగ్గర విజ్ఞాన శాస్త్రం సర్వాంగాలతో వికసించకపోవటానికి ఇక్కడ అగ్రవర్ణ భావజాలం పనిచేసిన తీరును సందర్భోచితంగా ప్రస్తావనకు తెచ్చారు. ఈ నేపథ్యంలోనే “సైన్టిస్టులలో అధిక శాతం కులం రీత్యాను, ఆలోచనల్లోనూ బ్రాహ్మణులు కాగా, కులం రీత్యా బ్రాహ్మణులు కాని వారు కూడా ఆలోచనలలో బ్రాహ్మణులే”అంటారు బాలగోపాల్. ఆయన మాటలను రుజువు చేస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు నేడు రాకెట్ నమూనాలను వేంకటేశ్వర విగ్రహం పాదాల దగ్గర పెట్టటాన్ని గమనిస్తున్నాం. ఇటీవల కాలంలో శాస్త్రీయ భావజాలం అడుగంటి మునుపెన్నడూ లేని కొత్త కొత్త మూఢనమ్మకాలు ఎలా పురుడు పోసుకుంటున్నాయో సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ శాస్త్ర సాంకేతిక రంగాలలో రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే మనదేశం మాత్రం ఇంకా తాటాకులను తిరగేస్తూ కష్టపడుతోంది. “అభిప్రాయాలకు ప్రమాణాన్ని జీవితంలో కాక పూర్వ శాస్త్రాలలోనూ, శ్రుతులలోనూ వెతుక్కోవటం బ్రాహ్మణ సాంప్రదాయ ప్రముఖ లక్షణ” మన్నారు బాలగోపాల్. బహుశా! ఈ సాంప్రదాయం కారణంగానే మనకు విజ్ఞానశాస్త్రాల పట్ల ఒక చిన్నచూపు కలిగి మనం వెనుకబడి పోవటానికి కారణమై ఉంటుంది. లేకపోతే ఇంత జనాభా కలిగిన దేశంలో సర్ సి. వి. రామన్ తరువాత సైన్సులో ఇప్పటిదాకా ఒక్క నోబెల్ బహుమతి కూడా రాకపోవడానికి కారణమేమై ఉంటుంది?
ఈ సంకలనంలో చివరి వ్యాసం “లెక్కల బోధనలో సృజనకు స్థానం”. ఇది నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాసిన “పిల్లల భాషలో అల్జీబ్రా” అనే పుస్తకానికి రాసిన సమీక్ష. ఇది పిల్లలకు మనం నేర్పే గణితం గురించిన అన్ని విషయాలను చర్చించింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉండే సమాచారం ఈ వ్యాసంలో ఉంది. గణితం పట్ల ఇప్పటికే మనకున్న అభిప్రాయాలను సవరిస్తుందీ వ్యాసం. గణితం విద్యార్థుల పట్ల ఎట్లా అమానవీయమైన అంశంగా మారిందో, దానికి కారణాలేమిటో, దానిని ఎలా అధిగమించవచ్చో సూచనప్రాయంగా ఇందులో చర్చించారు రచయిత. గణితం పట్ల ఆసక్తి ఉన్న వారికి కొత్త ఆలోచనలు పుట్టేలా చేయగల సమాచారం ఇందులో ఉంది.
మొత్తంగా చూస్తే నాలుగు వ్యాసాల చిన్న పుస్తకమే అయినా ఇందులో చర్చించిన విషయాలు అమూల్యమైనవి. గతానికంటే ఇప్పుడే ఎక్కువగా అవసరమైనవి.”సైన్స్ అంటే ఏమిటో మనదేశంలో సైన్స్ చదువుకున్నవాళ్లకు సహితం తెలీదు” అంటారు బాలగోపాల్. సైన్స్ చదువుకున్నవాళ్లకు, చదువుకోనివాళ్లకు అసలు సైన్స్ అంటే ఏమిటో తెలియజెప్పే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. సైన్సు పట్ల ప్రగతిశీల దృక్పథం కలిగిన మేధావి చేసిన ఆలోచనలు ఎట్లా ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. ఏది సైన్సు అవుతుందో, ఏది నాన్ సైన్సు అవుతుందో గ్రహించాలంటే తప్పకుండా ఈ పుస్తకం చదివి తీరాలి. నేడు మనలో చాలామందికి ఇంగిత జ్ఞానం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. దానిని తిరిగి సాధించాలంటే ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతో ఉంది.
-తోకల రాజేశం




