2026 సెప్టెంబర్ 8
రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా జంతర్ మంతర్ వద్ద కనిపించిన కులాతీత యువజన ఐక్యతను చీల్చివేయవచ్చు. ఇది నిజమైన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కొరత అనే అసలు సంక్షేమాన్ని అలాగే ఉంచి, బీజేపీకి ఒక ఉపయోగకరమైన కొత్త విభజన రేఖను అందిస్తుంది.
జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఉద్యమంపైన నేను మొదట్లో సందేహాలను వ్యక్తపరిచినప్పటికీ, ఆ ఉద్యమాన్ని విజయవంతమైన ముగింపువైపుకు నడిపిన తీరు నాకు అమితమైన ఆనందాన్ని కలిగించింది. యువతలోని స్వచ్ఛమైన స్పందన నాయకులను విస్మయపరిచింది; సంప్రదాయాలను పక్కన పెట్టింది; మర్యాదలను విస్మరించింది; పోలీసుల భయానక వాతావరణాన్ని ధిక్కరించింది; అన్నింటికంటే మించి గత 12 సంవత్సరాలుగా దేశాన్ని కమ్మేసిన దట్టమైన భయపు మేఘాలను చీల్చివేసింది.
దీని విజయం ఒక మంత్రి రాజీనామా చేయడానికే పరిమితం కాలేదు; 1.4 బిలియన్ల ప్రజల ఈ దేశాన్ని పిరికిపందల దేశంగా మార్చి, తాను మాత్రం జయించలేని శక్తిగా భావించిన మోదీ ప్రభుత్వాన్ని అణచివేయడంలో కూడా ఉంది. అంతకంటే ముఖ్యంగా, చారిత్రకంగా ఈ దేశాన్ని పీడిస్తూ, దీని పురోగతికి ప్రధాన అడ్డంకులుగా మారిన కుల, వర్గ, జెండర్, మత, జాతి, భాష, ఇతర గుర్తింపులన్నింటినీ ఇది అధిగమించడమే ఇది సాధించిన గొప్ప విజయంగా నేను భావిస్తాను.
జంతర్ మంతర్ దగ్గర అంబేడ్కర్ ప్లకార్డులు, “జై భీమ్” నినాదాలు విపరీతంగా కనిపించినప్పటికీ, జెన్ జీ వాటిని కుల తటస్థమైనవిగా పరిగణించి, గుర్తింపులను అధిగమించే ఒక స్ఫూర్తిదాయకమైన విధానాన్ని ప్రదర్శించింది. ప్రజల సమస్యల చుట్టూ నడిచే ఏ ఉద్యమమైనా అందరికీ చెందుతుందని, దాని వైవిధ్యమే దాని విజయానికి అసలైన భరోసానిస్తుందని నిరసనకారులు లోతైన అవగాహనను కనబరిచారు.
అందువల్ల, రిజర్వేషన్లను రద్దు చేయాలని పిలుపునిస్తూ, బహిరంగంగా కులతత్వ ఛాయలతో కూడిన మరొక ఉద్యమం అదే జంతర్ మంతర్ గడ్డపైనుంచి, అది కూడా అంతకుముందు జరిగిన నిరసన ఉద్యమం అపూర్వ విజయం సాధించిన తరుణంలోనే పుట్టుకొస్తుందని నేను కనీసం ఊహించలేదు. దీన్ని కొందరి నిరసనకారులే ప్రారంభించడం నమ్మశక్యం కాని విషయంగా ఉంది.
దీన్ని ఆ ఉద్యమ వైవిధ్యంలో భాగంగా సర్దుబాటు చేసుకోవడానికి వీలుండేదేమో, కానీ ప్రభుత్వ నుండి దానికి లభించిన స్పందన, ప్రస్తుత ప్రభుత్వానికి చెందిన కొన్ని ప్రసిద్ధ సైద్ధాంతిక అనుబంధ సంస్థల బహిరంగ మద్దతుతో కలిసి, దాని స్వచ్ఛతపైన తీవ్రమైన అనుమానాలను కలిగిస్తోంది.
‘రిజర్వేషన్లను తొలగించండి’ ఉద్యమం
సీజేపీ నిరసనల సమయంలో, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హర్ష్ దూబే అనే నీట్ యువ ఆశావహుడు రిజర్వేషన్ ప్రశ్నను లేవనెత్తడానికి టెలివిజన్ చర్చలు, సోషల్ మీడియా చర్చలలో కనిపించడం ప్రారంభించాడు. పరీక్షల్లో పోటీపడే విద్యార్థుల అవకాశాలను రిజర్వేషన్ వ్యవస్థ ప్రభావితం చేస్తోందని, ఆ వ్యవస్థలో మార్పులు రావాలని అతని వాదన సారాంశం. ఈ వాదనలో కొత్తదనమేమీ లేదు. సీజేపీ విజయ వేడుకల సమయంలో, దూబే “రిజర్వేషన్ హటావో ఆందోళన్” (ఆర్ హెచ్ ఏ) పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీని ప్రారంభించాడు. ఇది డిజిటల్‌గా సమీకరించినన యువత ఆగ్రహ అలలపై సాగి, జూలై 28 నాటికి 5.6 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది.
ఆసక్తికరమైన విషయమేమంటే, అతను తన పేజీకి “రిజర్వేషన్లను రద్దు చేయండి” అని పేరు పెట్టినప్పటికీ, ఆగస్టు ప్రారంభంలో ‘న్యూస్‌లాండ్రీ’ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైఖరికి విరుద్ధంగా, తాను రిజర్వేషన్ల తక్షణ రద్దును డిమాండ్ చేయడం లేదని, వ్యవస్థలో మార్పులు కావాలని కోరుకుంటున్నానని దూబే తెలిపాడు.
ఆ తర్వాత కొంతకాలానికి, దూబే తన ‘ఆర్ హెచ్ఏ’ సోషల్ మీడియా ప్రచార నిర్వహణలో ఎక్కువ భాగం అనురాధ తివారీ, అజీత్ భారతి, నేహా దాస్‌లకు అప్పగించాడని సమాచారం. వీరు అనుభవజ్ఞులైన రిజర్వేషన్ వ్యతిరేక / జనరల్ కేటగిరీ కార్యకర్తలుగా పేరుగాంచారు. అక్కడి నుంచి ఆ ఉద్యమం మరింత తీవ్రతను సంతరించుకుంది. కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు కావాలని; అధికారిక గుర్తింపుగా కులాన్ని ఉపయోగించడం నిలిపివేయాలని; దానికి బదులుగా ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆ ఉద్యమం వాదించింది. కుల లేదా మతంతో సంబంధం లేకుండా దివ్యాంగులు, అనాథలు, అమరవీరుల పిల్లలు, ఆర్థికంగా పేదలైన ప్రజలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరింది. ఈ మార్పులు చేసినప్పటికీ, ఆ డిమాండ్లలో ప్రత్యేకించి కొత్తదనమేమీ లేదు.
అయినప్పటికీ, ప్రభుత్వ, విద్యాసంస్థల దరఖాస్తులలో కుల గుర్తింపును ముగించాలని పిలుపునిచ్చినప్పుడు; “ఒక దేశం, ఒక గుర్తింపు” అనే నినాదాన్ని ఉపయోగించినప్పుడు, అది సంఘ్-బీజేపీ సైద్ధాంతిక భావజాలపు స్పష్టమైన ముద్రను అనుకోకుండా బయటపెట్టింది. ఇది “రిజర్వేషన్ల సంస్కరణ” నుండి కుల వ్యవస్థాగత గుర్తింపునకు వ్యతిరేకంగా సాగే మరింత విస్తృతమైన సవాలు వైపు జరిగిన ఒక గొప్ప సైద్ధాంతిక మార్పు.
ఆగస్టు 21 న, ఆర్ హెచ్ ఏ’ పిలుపు మేరకు, రణ్‌వీర్ సేన, కర్ణి సేన, అఖిల భారత క్షత్రియ మహాసభ, స్వామి ఆనంద్ స్వరూప్ నేతృత్వంలోని కాళీ సేనతో సహా సాంప్రదాయ అగ్రవర్ణ, మితవాద సమూహాల ద్వారా నేరుగా సమీకృతమైన విద్యార్థులు, రైతులు, గృహిణులు, వ్యాపారవేత్తలు, ఇతర వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుల ఆధారిత రిజర్వేషన్ల సంస్కరణ/రద్దు; సానుకూల ప్రయోజనాల కోసం ఆర్థిక ప్రాతిపదిక; యూజీసీ ఈక్విటీ నిబంధనలలో మార్పులు; ఆర్థికంగా బలహీన వర్గాలకు మెరుగైన ప్రయోజనాలు; రిజర్వేషన్ల చరిత్ర, ప్రభావాలపైన ఒక శ్వేతపత్రం ; పాల్గొనేవారిలో కొంతమందిపైన ఉన్న ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని రద్దు చేయడం మొదలైనవి వారి డిమాండ్లు.
జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. 500 మంది వరకు రామ్‌లీలా మైదాన్‌లో ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించారు. అయితే నిరసనకారులు కదలడానికి నిరాకరించారు. చివరకు పోలీసు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నాయి. ఆ ఘర్షణ ఆ ప్రచారానికి మరోసారి భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టింది.
ఆర్ హెచ్ఎ తనను తాను రాజకీయాలతో సంబంధం లేనిదిగా ప్రకటించుకుంటూ, రిజర్వేషన్ వ్యవస్థను మార్చడంలో బీజేపీ విఫలమవడంపైన నిరాశ వ్యక్తం చేసినప్పటికీ, అక్కడ విపరీతంగా కనిపించిన కాషాయ ప్రభావాన్ని విస్మరించలేము. ఇది విస్తృత హిందూత్వ ప్రాజెక్ట్ తో ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా బయటపెట్టినట్లు అనిపించింది.
నిరసనలు నిలిచిపోవడంతో ప్రభుత్వంపైన ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ ఆగస్టు 27న, కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రతినిధులైన హర్ష్ దూబే, రణ్ బహదూర్ సింగ్ చౌహాన్, మృత్యుంజయ పాఠక్‌లను కలుసుకున్నారు. ఆ సమావేశం సౌహార్దభరితంగా జరిగిందని, వారిని మళ్లీ కలుస్తానని నడ్డా తెలిపారు.
ప్రభుత్వం మొదట సీజేపీ ఉద్యమాన్ని అపవిత్రం చేయడానికి ప్రయత్నించిందని గమనించాలి—వారిని “వైరస్”, “తుక్‌డే గ్యాంగ్”, ఉగ్రవాద గ్రూపుల “బి-టీమ్” అని పిలిచింది—తర్వాత పోలీసుల ద్వారా వారిని ఎదుర్కొంది, చివరకు ఒక రాజకీయ మార్గాన్ని తెరిచింది. సోనమ్ వాంగ్‌చుక్, ముగ్గురు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యకర్తలు మూడు వారాలకు పైగా నిరాహార దీక్ష చేసిన తర్వాత, నిరసనకారులు ఢిల్లీ పోలీసుల నిరంతర దౌర్జన్యాలను ఎదుర్కొన్న తర్వాత, సీజేపీ పార్లమెంటు మార్చ్‌తో సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఏర్పడిన తర్వాతే నడ్డా సీజేపీ నాయకులను కలుసుకున్నారు. అప్పటి వరకు ఆ ఉద్యమాన్ని కించపరచడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది.
అయినప్పటికీ, ఆర్ హెచ్ఎ ఉద్యమ ప్రతి కోణమూ విప్పారడం ప్రత్యేకంగా బీజేపీకే ప్రయోజనం చేకూర్చేలా కనిపిస్తోంది. ఇది గుర్తింపు రాజకీయాల నుండి పెద్దఎత్తున దూరంగా ఉన్న యువజన నియోజకవర్గాన్ని విభజించే అవకాశం ఉంది. ఆర్ హెచ్ఎ స్వయంగా సీజేపీ ఉద్యమంలోని కొంతమంది నిరసనకారుల ద్వారానే ప్రారంభమైంది. రిజర్వేషన్లపైన సమస్యలను సృష్టించడం ఎప్పుడూ అనుకూల-వ్యతిరేక భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. జంతర్ మంతర్ వద్ద వారి నిరసన నిరూపించినట్లుగా, ఆర్ హెచ్ఎ అనేక హిందూత్వ-ఆధారిత సంస్థల నుండి సులభంగా మద్దతును పొందింది. బీజేపీ బహిరంగంగా ఆర్ హెచ్ఎ నుండి దూరం జరగవచ్చు కానీ దానికి నిశ్శబ్దంగా మద్దతు ఇవ్వగలదు. కులం ఎప్పుడూ ఒక సంభావ్య విభజన కారకం; సిజెపి లాంటి అదే పర్యావరణ వ్యవస్థ నుండి వచ్చిన వ్యక్తుల ద్వారా అధునాతన మార్గాలను ఉపయోగిస్తారు. తుది విశ్లేషణలో, ఆర్ హెచ్ఎ ప్రకరణ ద్వారా ప్రయోజనం పొందే ఏకైక శక్తి బీజేపీ మాత్రమే.
తప్పుదారి పట్టించే డిమాండ్లు
దూబే స్వయం విరుద్ధ ప్రకటనలను పక్కన పెడితే, జంతర్ మంతర్ వద్ద ఆర్ హెచ్ఎ వినిపించిన డిమాండ్లు అవగాహన లేనివిగా, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. ‘ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్, 2016’ ప్రకారం, బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు (సాధారణంగా 40% లేదా అంతకంటే ఎక్కువ ధృవీకరించబడిన వైకల్యం) ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలో కనీసం 4 శాతం; ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలలో కనీసం 5 శాతం సీట్లను ఇప్పటికే రిజర్వేషన్ కింద కేటాయించారు.
అమరవీరుల పిల్లలకు రిజర్వేషన్ కల్పించాలనేది ఆర్ హెచ్ఎ చేసిన మరొక డిమాండ్. వారికంటూ ప్రత్యేకంగా రిజర్వేషన్లు లేనప్పటికీ, యుద్ధంలో వీరమరణం పొందిన రక్షణ సిబ్బంది వార్డులు/ఆశ్రితుల కోసం, అలాగే విధుల్లో ప్రాణాలు కోల్పోయిన సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది కోసం అనేక ప్రత్యేక కోటాలు, ప్రాధాన్యతలు, రాయితీలు, సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ వైద్య, దంత వైద్య సీట్లను రక్షణ సిబ్బంది వార్డుల కోసం రిజర్వ్ చేసింది. ఇందులో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంతతి/వితంతువులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. దివ్యాంగులైన మాజీ సైనికులు, యుద్ధంలో మరణించిన సిబ్బంది ఆశ్రితుల కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలోని మాజీ సైనికోద్యోగుల రిజర్వేషన్‌లో4.5 శాతం కేటాయింపు ఉంది. సాయుధ బలగాలు, అనేక రాష్ట్రాలు కూడా యుద్ధ బాధితులు, మాజీ సైనికుల వార్డులకు నిర్దిష్ట విద్యా, ఉపాధి ప్రయోజనాలను అందిస్తున్నాయి.
అనాథలకోసం చేసే డిమాండ్ విషయానికి వస్తే, ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద వారు ఆర్థిక ప్రాతిపదికన అర్హత సాధించవచ్చు.
అయితే, ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని రద్దు చేయాలనే విచిత్రమైన డిమాండ్‌కు రిజర్వేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు, అందువల్ల ఇది ఎస్సీ, ఎస్టీలకు అందుబాటులో ఉన్న రక్షణపైన లోతైన వ్యతిరేకతను బట్టబయలు చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్ల పరిధికి వెలుపల ఉన్నవారి కోసం మాత్రమే ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన, సుప్రీంకోర్టు సమర్థించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అగ్రవర్ణ జనాభాకు అనుకూలంగా ఉండే సంభావ్య పక్షపాతాన్ని కలిగి ఉంది. ఇది పేద ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వ్యక్తులను ఏకపక్షంగా తన పరిధి నుండి మినహాయించింది. అంతేకాకుండా, కుల కూర్పులో ఉన్న వాస్తవిక అంచనాలను ఉపయోగిస్తే—లేదా బీహార్ కుల సర్వేను ప్రామాణికంగా తీసుకుంటే—రిజర్వేషన్ శాతానికి, జనాభా శాతానికి మధ్య గల నిష్పత్తి, ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ జనాభాకు గణనీయంగా అధిక జనసాంద్రత కలిగిన భద్రతని అందించగలదని సూచిస్తుంది.
తగ్గుతున్న రిజర్వేషన్ల పరిధి
ఉన్న రిజర్వేషన్ల ఉప-వర్గీకరణపైన వివాదాలు కావచ్చు; రిజర్వేషన్లు లేని వర్గాల నుండి రిజర్వేషన్ల డిమాండ్లు కావచ్చు; లేదా ఆర్ హెచ్ఎ లాగా రిజర్వేషన్ల సంస్కరణ/రద్దు డిమాండ్లు కావచ్చు—ఈ రిజర్వేషన్-సంబంధిత గొడవలేవీ కూడా ఉద్యోగాలలో లేదా ఉన్నత విద్యలో రిజర్వేషన్లకు కేటాయించాల్సిన అవకాశాలు తగ్గిపోవడాన్ని ప్రశ్నించకపోవడం గమనార్హం. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో రెగ్యులర్ ఉద్యోగాలు 2014-15 నాటికి 12.91 లక్షల నుండి 2024-25 నాటికి 7.84 లక్షలకు పడిపోయాయి; అంటే 5.07 లక్షలు లేదా 40 శాతం తగ్గిపోయాయి. ఈ కొరత వల్ల కలిగే ఇబ్బంది రిజర్వుడు వర్గాలతో సహా అందరినీ ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, ఎవరూ ఈ సమస్యను లేవనెత్తడం లేదు. మనం నయా ఉదారవాద సంస్కరణలను స్వీకరించినప్పటి నుండి ఉపాధి నిర్మాణం మారుతూ వస్తోంది. రెగ్యులర్ జీతాల ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్, రోజువారీ ఉపాధి క్రమంగా పెరుగుతోంది. అదే కేంద్ర పబ్లిక్ రంగ సంస్థలలో, మొత్తం ఉపాధిలో రెగ్యులర్ జీతాల ఉద్యోగాల వాటా 2014-15లో 81 శాతం నుండి 2024-25 నాటికి 50.81 శాతానికి పడిపోయింది.
రిజర్వేషన్ల అనుకూలదారులు, వ్యతిరేకులు ఇద్దరూ ఈ సమస్యలను ఎప్పటికీ లేవనెత్తరు, ఎందుకంటే వారు పైస్థాయిని లక్ష్యంగా చేసుకుంటారు. వారి డిమాండ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా, తోటి పౌరులు, పక్కవారి మీదకే నిర్దేశించబడతాయి.
—
ఆనంద్ తేల్తుంబ్డే ఒక పౌర హక్కుల కార్యకర్త; 30కి పైగా పుస్తకాల రచయిత. ఆయన పెట్రోనెట్ ఇండియా లిమిటెడ్ పూర్వ సీఈఓ; ఐఐటి ఖరగ్‌పూర్, గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
తెలుగు: పద్మ కొండిపర్తి
https://frontline.thehindu.com/the-nation/reservation-hatao-andolan-caste-reservation-bjp-youth/article71410040.ece




