పల్లవి:
ఊరూర వెలిసారురన్నో…
భూ బకాసురుల గుంపురన్నో…
బీదోడు బతికితే భయమంటూ
భూములన్నీ మింగేస్తారురన్నో!
లేచి రా… ఎదిరించరా…
నీ హక్కుకోసం గర్జించరా!
ఈభూమి మన అమ్మలాంటిది రా
తరాల
రక్తంతో కాపాడుకున్నదిరా!!

చరణం 1:
బలం లేదంటే బలిచేస్తారురా
పేదోడ్ని చూసి పండుగ చేసుకుంటారురా
తాతల పత్రాలు చూపిస్తారురా
తరతరాల చెమటను దోచేస్తారురా!
రాత్రికిరాత్రే సరిహద్దు మార్చి
నిన్ను నీ నేలకే పరాయివాడ్ని చేసి
ఊరంతా మాదేనంటూ
ఉచ్చులెన్నో వేస్తారురన్నో!

చరణం 2:
దీనుల ఇళ్లు… పొలాలపై కన్నేసి
దేవుని మాన్యాలూ దోచేస్తారురా
వాగుల్ని, వంకల్ని మింగేస్తూ
వేల కోట్ల రాజులై తిరుగుతారురా!
ఖబరిస్తానైనా… ఖరీదైన స్థలమైనా…
ప్లాట్ల మాఫియా పేరిట
కబ్జాల రాజ్యం నడిపిస్తారురా
కన్నీటి గాధలు రాస్తారురా!
చరణం 3:
అన్నదమ్ముల మధ్య అగ్గి రాజేసి
తల్లి పిల్లల్ని వీధికొదిలేలా చేసి
ధనబలం మదంతో రెచ్చిపోయి
దౌర్జన్యాలే ధర్మమంటారురా!
ఎదురు నిలిస్తే కేసులంటారు
నిజం మాట్లాడితే బెదిరిస్తారు
కానీ ప్రజా గళం మోగిందంటే
పర్వతాలైనా కూలిపోతాయిరా!
చరణం 4:
రాజకీయ నాయకులతో కుమ్మక్కై
ప్రభుత్వ భూముల్ని మింగేస్తారురా
చెరువుల గుండెల్లో కాంక్రీట్ పోసి
ప్రకృతినే చంపేస్తారురా!
పోలీసు… రెవెన్యూ కుమ్మక్కై
నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తారురా
కోర్టుల చుట్టూ తిప్పిస్తారురా
న్యాయం కోసం రక్తం కార్పిస్తారురా!

అవి భూ తిమింగలాలురన్నో…
అవి పేదోడి ప్రాణాల శత్రువులరన్నో…
ఒక్కటై నిలిస్తే జయమురన్నో…
ప్రజాశక్తే అసలైన అగ్నిరన్నో!!
లేచి రా… పోరాడరా…
నీ నేల కోసం నిలబడరా!!
భూమి కోసం గళమెత్తే
ప్రతి మనిషీ వీరుడురా!!!

Leave a Reply