ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 నాటికి కాగ్ నివేదిక ప్రాప్తికి 38 చెక్కెర కర్మాగారాలు పనిచేస్తున్నాయి. అందులో 11 సహకార రంగంలోనూ, 3 ప్రభుత్వ జాయింట్వెంచర్లోనూ, 24 ప్రైవేట్ రంగంలోనూ ఉన్నాయి. తదుపరి 2014లో రాష్ట్ర విభజన తర్వాత సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలు సంక్షోభంలో చిక్కుకొని 8 సహకార చెక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. 2004లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస సహకార చక్కెర కర్మగారం మూతపడి, దానిని బెంగళూరుకి చెందిన ఒక ప్రైవేటు కంపెనీకి అమ్మేశారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు ప్రాప్తికి 29 చెక్కెర కర్మాగారాలలో ఐదు మాత్రమే ఆ సీజన్లో క్రషింగ్ చేశాయి. మిగిలిన 24 చెక్కర కర్మాగారాలు ఆ సీజన్లో పంచదార ఉత్పత్తిని నిలుపుదల చేశాయి. పై పరిస్థితులు మనకు తెలియజేస్తున్నదేమంటే, “ఆంధ్రప్రదేశ్లో చెక్కర కర్మాగారాలు సంక్షోభంలో కూరుకుపోయాయి.”
ఇక 2024 లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2026 — 27 ఆర్థిక సంవత్సరానికి గాను గతం లో మూతపడిన 8 సహకార చెక్కర కర్మాగారాలను లిక్విడేషన్ చేస్తూ ఇటీవల 250 జీవోను జారీ చేశారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వు ప్రాప్తికి ఈ ఎనిమిది మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలు అమ్మగా వచ్చిన డబ్బులను ఏపీఐడీసీ, ఆప్కాబ్, డిసిసిబి మొదలగు ఆర్థిక సంస్థల వద్ద అవి తీసుకున్న రుణాలను తీర్చడానికి, కార్మికులకు బకాయిపడిన వేతనాలను, రైతులకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించడానికి ఈ డబ్బులను వినియోగించాలని పేర్కొన్నారు. ఈ 8 మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలలో భీమసింగిలోని శ్రీ విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్స్, దార్లపూడి కి చెందిన ఏటికొప్పాక కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ సొసైటీ, పాయికరావుపేట కి చెందిన తాండవ కోఆపరేటివ్ షుగర్స్, గాజుల మండ్యం కి చెందిన శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ షుగర్స్, చిత్తూరుకు చెందిన చిత్తూరు కో-ఆపరేటివ్ షుగర్స్, నెల్లూరుకు చెందిన కోవూరు కో-ఆపరేటివ్ షుగర్స్, తుమ్మపాలకి చెందిన అనకాపల్లి వివి రమణ కోఆపరేటివ్ షుగర్స్, జంపనికి చెందిన ఎన్.వి.ఆర్ –ఏ. డి. ఆర్ కోఆపరేటివ్ షుగర్స్ ఉన్నాయి.
సహకార చక్కెర కర్మాగారాలు అమ్మకానికి ప్రధాన కారణాలు:-
- రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు చక్కెర కర్మాగారాలను ప్రోత్సహించడం.
- 2011 – 12 కాగ్ నివేదిక ప్రాప్తికి ఇవి సుమారుగా 430 కోట్ల రూపాయలు అప్పులలో కూరుకు పోవడం, వాటిపై అధిక వడ్డీలను ఆయా ఆర్థిక సంస్థలకు చెల్లించలేకపోవడం.
- పాత యంత్రాల వలన ఉత్పత్తి రికవరీ శాతం తగ్గిపోవడం.
- ఇంధనం, విద్యుత్ ఖర్చులు, మరమ్మతుల ఖర్చులు పెరిగిపోవడం.
- రైతులకు బకాయిలను, కార్మికులకు వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం.
- సహకార చక్కెర కర్మాగారాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం సరిపడినంతగా చేయకపోవడం.
పై కారణాల వలన రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమ్మివేసి సహకార రంగంలో చక్కెర కర్మాగారాలకు స్వస్తి పలుకుదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చర్య అత్యంత విచారకరం.
ప్రైవేటు రంగంలో చక్కెర కర్మాగారాల సంక్షోభానికి కారణాలు:-
సహకార రంగంలో చక్కెర కర్మాగారాలకు మంగళం పాడిన పాలకులు, ప్రైవేటు రంగంలో చక్కెర కర్మాగారాలను ప్రోత్సహించినప్పటికీ ప్రైవేటు కంపెనీల కు ఆశించినంత లాభాలు రావడంలేదని వారు చెబుతున్నారు.
అందుకు ప్రధాన కారణాలు:- - రైతులకు పంట ఖర్చులు పెరిగిపోయి, వారు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపడం వలన చెరుకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా చెక్కర కర్మాగారాలకు సరిపడినంత చెరుకు సరఫరా జరగడం లేదు.
- కర్మాగారాలకు ఉత్పత్తి వ్యయం పెరిగింది. అందుకు అనుగుణంగా పంచదార ధర పెరగకపోవడం ఒక కారణంగా వారు చెబుతున్నారు.
- చక్కెర కర్మాగారాలపై మితిమీరిన రాజకీయ జోక్యం పెరిగింది.
- బగాసస్, విద్యుత్, మొలాసిస్, ఇథనాల్ మొదలగు సెకండరీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం సరిగా లేకపోవడం వలన ప్రైవేటు కంపెనీలు ఆశించిన లాభాలు రావడంలేదని చెబుతున్నారు.
పై కారణాలకు చక్కటి ఉదాహరణగా 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో జిఎంఆర్ సంస్థకి చెందిన సంకిలిలోని వరలక్ష్మి షుగర్స్ ఈ సీజన్ కి ఉత్పత్తిని నిలుపుదల చేస్తూ ప్రకటించింది. ఫలితంగా చెరుకు రైతులు, కార్మికులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.
పై విషయాలన్నీ మనకు తెలియచెబుతున్నదేమంటే, “అటు సహకార చక్కెర కర్మాగారాలు అమ్మకానికి గురి కావడం, ఇటు ప్రైవేట్ రంగ చక్కెర కర్మాగారాలు సరిగా పనిచేయక పోవడం గానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక, పాలనాపరమైన లోపభూయిష్టమైన విధానాలే ఇందుకు కారణం.” మరో వైపు ప్రైవేటు పెట్టుబడిదారుల మితిమీరిన లాభాకాంక్ష చక్కెర కర్మాగారాలను లే ఆఫ్ చేయడానికి దారితీస్తున్నాయి. ఈ సంక్షోభం కారణంగా చెరుకు రైతులు ఇబ్బందులకు గురి కావడం, అందులో పని చేస్తున్న కార్మికులు ఉపాధిని కోల్పోవడం జరుగుతున్నది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఇటు రైతాంగం, అటు కార్మిక వర్గం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణ చేపట్టవలసిన అవసరం ఉన్నది.
- పేడాడ కృష్ణారావు, జిల్లా కన్వీనర్,
ప్రజాసంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.




