ఏర్రెర్రని ఆకుపచ్చ
జీడి మామిడి ఉద్దాన వనంలో…
వంశధార మహేంద్ర తనయ ప్రవాహపు నదీ తీరాల నడుమ…
పంచాది పాణిగ్రహిల ఆశయాల కలలతో..
యవ్వనపు కలలనీ నిద్రపుచ్చుతూ..
ఆశయాల ఆకాశాన్ని ముద్దాడుతూ…
కాంతివంతమైన రోజులని ఎలా మరవగలను.. కామ్రేడ్..

రండిరో కూలన్న సంఘం పెడదాము
సంగతేంది చూద్దాము అని ఎలుగెత్తి పాడుతూ
ఉద్దానాన్ని చుట్టుముట్టి ఊగిపోయిన రోజులు కదా అవి..!!
నిన్ను తలచుకోవడమంటే..
ఆ కాలాన్ని విప్లవోద్యమాన్ని స్ఫూరించుకోవడమే కదా..!!
నీ అమరత్వానికి 27 ఏళ్లు ఈ 27 ఏళ్లుగా..
నీవు లేవు కానీ..
నీవు ఎంచుకున్న మార్గం..
మహోన్నతంగా మహోదృతంగా.. సాగిన కాలం..
భౌతికంగా నువ్వు లేకపోయినా.. నీ ఆశయం
ఆకాశపు అంచుల మీద నిలబెట్టింది.. నడిచిన కాలంలో…
తూలిన సందర్భాలు ఉన్నాయి…
ఓడిన సందర్భాలు ఉన్నాయి…
కానీ దిగజారిపోలేదు కామ్రేడ్..

అహంకారమో..??
ఆత్మవిశ్వాసమూ!.. శత్రువు ఏమనుకున్నా గాని…
నక్సల్బరి ప్రేమలో
ఎంత పరిమళమో కదా కామ్రేడ్… కానీ ఈ కగార్ సమయంలో..
నీ నా సహచరులంతా కనుమరుగైపోయిన ఈ సమయములో… ఇప్పుడు
ఇప్పుడు చాలా దుఃఖ భరితంగా ఉంది బాలు..
ఇప్పుడు ఏదో తెలియని ఓంటరితనం వెంటాడుతుంది బాలు..

నిలువెత్తు శూన్యం
నిలువునా ఆవరించినప్పుడల్లా నీ రూపమే కాదు
నీ నా సహచరులంతా కనిపిస్తున్నారు బాలు.
ఒక్కరా ఇద్దరా..??
ఎంతటి మానవీయమైన ప్రేమికులు..
అత్యంత అద్భుతమైన మనుషులు,..
కళ్ళ ముందే ఒరిగిపోయిన ఈ కాలంలో…
నువ్వు పంచిన పరిమళమంతా అంతరించిపోతున్న ఈ కాలంలో…
కళ్ళలో కన్నీళ్లలో…
కలలో… అంతా మీరే మీరే
ఇంకా ఈ గుండె ఆగిపోలేదు ఎందుకో!
వేదనగా ఉంది బాలు.. గుండె బరువై నీ చేరువై..
గుండెలవసేలా ఏడ్వాలనుంది బాలు..

Leave a Reply