కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అత్యంత మారుమూల  ప్రాంతమైన సిర్పూర్ నియోజకవర్గంలో 90 వ దశకంలో నెలకొల్పిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ద్వారా వేలాదిమంది పేద దళిత విద్యార్థులు చదువుకున్నారు. నాగార్జునసాగర్ లో ఉన్న సర్వేల్ గురుకుల పాఠశాలతో సమానమైన సిర్పూర్ గురుకుల పాఠశాలలో  ఫౌండేషన్ విద్య వేలాదిమంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో చదివేందుకు తోడ్పడింది. సివిల్ సర్వీసుల్లో, ఐఐటీ,ఎన్ ఐటి, వర్సిటీలలో చేరేలా ఉపయోగపడింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలలో పుట్టిన పేద దళిత విద్యార్థులు ఇక్కడ పాఠశాలలో సీటు పొంది భోజనం, వసతి, చదువు అన్ని ఉచితంగా పొందుతూ తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అంతేకాకుండా ఐఏఎస్ అధికారులుగా ,ఇంజనీర్లుగ, డాక్టర్లుగా, విద్యార్థి నాయకులుగా  సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాలలో రాణిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా తమ సత్తా చాటారు . జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడి విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. మరికొంత మందికి  ఉద్యోగాలు రాకపోయినా కనీస మానవీయ విలువలు పాటిస్తూ బహుజన సమాజం పట్ల ఆదరణ ప్రేమాభిమానాలు చూపిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ గౌరవప్రదమైన హుందాతనం, మంచితనం, సేవా దృక్పథం విద్యార్థులు ఇక్కడి నుంచే నేర్చుకున్నారనేది వాస్తవం.

ఆధునిక యుగంలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో చదివే  విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలలో అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న తరుణంలో గురుకుల పాఠశాల విద్యార్థులు కూడా ఆ  సాంకేతికతను అందుకుని ముందుకెళ్ళే ఉద్దేశంలో భాగంగా 2015 నుంచి గురుకులాలలో ప్రారంభమైన స్కిల్ క్యాంపెయిన్, విద్యార్థులకు వివిధ రంగాలలో నైపుణ్యాలకు సంబంధించి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తుకు బాటలు చూపింది . ఆ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం పూట ఇంగ్లీషు భాష నేర్పేందుకు ఈ ప్లస్ క్లబ్, క్విజ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల శిక్షణ, వ్యాస రచన, ప్రసంగం, వ్యాఖ్యాతలుగా గా శిక్షణ, ఇంగ్లీష్ కౌన్సిల్, సెలవుల్లో ప్రత్యేక క్యాంపు లతో శిక్షణ  నోట్ పుస్తకాలు చివర, మొదటి పేజీలో మహనీయుల చరిత్ర, కెరీర్ గైడెన్స్ ముద్రణ ఇలా ఒకటి కాదు వందల సంస్కరణలు విద్యార్థుల జీవితాలలో గెంతు లాంటి మార్పులు తెచ్చినవి. గురుకుల విద్యార్థులు ఇంగ్లీషు లో రాయడం చదవడం మాట్లాడడం నేర్చుకున్నారు. కంప్యూటర్ ఆపరేట్ చేయడం ద్వారా తమ సత్తా చాటారు. అన్ని రంగాల్లో  విద్యార్థులు అత్యంత ప్రతిభావంతంగా ముందుకొచ్చారు. వారిలో నైపుణ్యాలు మరింత మెరుగు పడడం  జరుగుతూ వచ్చింది.

అంతటి సహకారం అందించిన పాఠశాలలు తమ తదుపరి తరాలకు మరింత గొప్పగా అందుబాటులో ఉండాలని నేడు పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అట్లాంటి గొప్ప విద్యాలయం నేడు శిథిలావస్థకు చేరిన తరుణంలో పూర్వ విద్యార్థులుగా తల్లి లాంటి విద్యాలయానికి ఈ దుస్థితి రావడంతో బాధపడుతున్నారు. ఈ పాఠశాలను పునరుద్ధరించి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా గురుకులాలలో భాగంగా ఇక్కడ స్కూలు మరియు కళాశాలను ఆధునిక హంగులతో కేజీ టు పీజీ వరకు ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు.

సిర్పూర్ డెబ్బై ఎకరాలలో విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు , డార్మెటరీ, డైనింగ్ హాల్, ఆటస్థలం, కంప్యూటర్ ల్యాబ్ ఇతర ల్యాబ్ లను నిర్మించడానికి చాలా అనువైన ప్రదేశంగా ఉంది. కానీ గత 15 ఏళ్లుగా పాలకులు ఈ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తూ రోజు రోజుకూ ఈ పాఠశాల  పరిస్థితిని దిగజార్చారు. తెలంగాణ ఏర్పాటు కంటే ముందు రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు నిర్లక్ష్యానికి గురికాబడ్డది వాస్తవం. తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా అదే పరిస్థితి భవనాల నిర్మాణ విషయంలో కొనసాగింది. నూతన భవనాలు మంజూరు చేయకుండానే వందలాది నూతన గురుకులాలను మంజూరు చేయడం, ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగించడంతో వాటి ఖర్చులకే, అద్దెల రూపంలో వేల కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతూ వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అద్దెల రూపంలో ఖర్చు చేస్తున్న ఈ ప్రజాధనాన్ని శాశ్వత బిల్డింగులు కట్టడానికి ఉపయోగించాలని  విద్యార్థులుగా డిమాండ్ చేస్తున్నారు‌.

ఇప్పటికే అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. అక్టోబర్ 17 నాడు  నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను నిరుద్యోగులకు స్కిల్ ట్రైనింగ్ పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఘటన ఇటీవల కాలంలో బయటపడింది. ఈ సంఘటనలో ప్రజా ప్రతినిధులతో పాటు సీనియర్ ఐఏఎస్ లు భాగం కావడంతో విద్యార్థులకు చెందాల్సిన సొమ్ము పక్కదారి పట్టింది. ఇలాంటి అవినీతి నిత్యం జరుగుతోంది. ఇలా వేల కోట్ల రూపాయలను కొల్లగొడుతూ దుర్వినియోగం చేస్తున్నటువంటి నిందితులను కఠినంగా శిక్షించి, ఆ ప్రజాధనాన్ని రికవరీ చేసి రాష్ట్రవ్యాప్తంగా శిధిలావస్థలో ఉన్న సిరిపూర్ లాంటి గురుకులాల పునర్నిర్మాణానికై ఉపయోగించాలి.

సమాజంలో అందరికీ నాణ్యమైన ఉచిత సమాన విద్య అందాలి. కానీ గ్రామీణ ప్రాంతాలలోని దళిత బహుజనులలో కుటుంబాలలో ఉన్న నిరక్షరాస్యత, వెనుక బాటుతనాన్ని ఉపయోగించుకొని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను అందించే బాధ్యత నుంచి పక్కకు తొలుగుతున్నాయి. విద్యను వ్యాపార సరుకుగా మార్చడం, నాణ్యమైన విద్య ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో మాత్రమే అందేలా ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేయడంతో, కేవలం గురుకులాలే పేదలకు ఎంతో కొంత నాణ్యమైన విద్య అందించే బడులుగా మిగిలాయి. వీటిలో చదివిన వారినుండి రెండు మూడు దశాబ్దాలుగా దళిత సమాజం నుంచి ఒక నూతన మేధో వర్గం ఆవిర్భవించింది. అది కేవలం సాంఘిక సంక్షేమ గురుకులాలలో జరుగుతున్న విద్యా బోధనతో అనేది గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాలయాలను మరింత నిర్లక్ష్యం చేసి దళిత సమాజం నుంచి  విద్యార్థి  రంగాన్ని ఉన్నతవిద్యలోకి రాకుండా అడ్డుకునే కుట్రలు ఇందులో దాగి ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు కుహనా మేధావుల ద్వారా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులలో కుటుంబ బాంధవ్యాలు కొరవడు తున్నాయని, మానవ విలువలు ఉండటం లేదని నమ్మించేలా ప్రకటనలు చేయిస్తూ మరోవైపు ఈ గురుకులాలనే మొత్తంగా తొలగించాలని, సంక్షేమ హాస్టళ్లను మూసివేయాలని కుట్రలకు పాల్పడు తున్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న అధిక ధరలు నిత్యావసరాల రేట్లు పేదల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో గురుకులాలు తొలగిస్తే పేదరికం ఉన్న కుటుంబాలలో  విద్యార్థులను మళ్ళీ పనికి పంపించే పరిస్థితి ఉంటుందే తప్పితే వారికి విద్య అందే పరిస్థితి ఉండదు. ఇది బడి బయట విద్యార్థుల సంఖ్యను పెంచడం అవుతుంది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన ‘పే బాక్ టూ సొసైటీ’ నినాదాన్ని నేడు అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గురుకులాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు తక్షణ అవసరంగా తమ బాధ్యతను నిర్వహిస్తూ గురుకులాల పునర్నిర్మాణానికి తమకు తోచిన విధంగా కృషి చేయాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయాలి. నేడు దేశంలో ధనికులకు ప్రైవేట్ కార్పొరేటు విద్య ద్వారాలు తెరుచుకొని ఉంటాయి కానీ పేదలకు ఆ అవకాశం లేదు. సమాజంలో మెజార్టీ బహుజనులైన సబ్బండ వర్గాల విద్యార్థులకు  నాణ్యమైన విద్య అందాలంటే అందరికీ సమానమైన” కామన్ స్కూల్ ” పాలసీని అంతటా అమలు చేయాలి. అందుకై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ బడులలో చదివిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు , సభ్య సమాజం కృషి చేయాలి. గురుకులాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను అభివృద్ధి చేయాలని కోరాలి. గురుకులాలు మరియు బయటి పాఠశాలల్లో కూడా సమానంగా అన్ని రకాల బోధనా సదుపాయాలు, భోజనం, వసతి, ఆధునిక తరగతి గదులు కల్పించాలని అందరికీ నాణ్యమైన విద్యకై మనమంతా కలిసి పోరాడాలి.

  • కోట ఆనంద్, విద్యార్థి నాయకుడు

8712352122

Leave a Reply