ఒకప్పుడు స్త్రీ భుజాల పై వస్త్రం ఉండకూడదని చట్టాలు చేసిన సమాజం, నేడు ఆమె ఏ బట్టలు వేసుకోవాలో చెప్పుతుంది, మారింది కాలం మాత్రమే అణిచివేత కాదు.

చరిత్రను మనం ఎక్కువగా రాజులు, యుద్ధాలు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్న విషయాలకే పుస్తకాల్లో స్థానం ఉంటుంది.

 కానీ ఒక స్త్రీ తన శరీరాన్ని తన ఇష్టానుసారం కప్పుకోవడానికి కూడా పోరాడాల్సి వచ్చిన చరిత్ర గురించి ఎంతమందికి తెలుసు? ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భుజాల పై బట్టలను వేసుకోవాలంటే రక్తం చిందించాల్సి వచ్చిందనే విషయం ఎంతమంది చదివారు?

అలాంటి చరిత్రను చూపించిన నవల అలల కాలం. తమిళ రచయిత మొగిలై రాజపాండియన్ రాసిన ఈ నవల భారతీయ సమాజపు లోతుల్లో దాగి ఉన్న కులాధిపత్యం, పురుషాధిపత్యం, మతం, అధికారం అనే విషయలా గురించి రాసింది.

నాడార్ మహిళలు పైవస్త్రం వేసుకోవాలనే ఆంక్ష ఒక వస్త్ర నిషేధం మాత్రమే కాదు. వారి శరీరాల పై వారికి హక్కు లేదని, వారి గౌరవానికి విలువ లేదని  చెప్పే అది ఒక రాజకీయ ప్రకటన. “నువ్వు నాకంటే తక్కువవాడివి” అని ఒక వర్గం మరో వర్గాని తోకెసిన వివక్ష. ఒక మనిషిని అవమానించడానికి అతని శరీరాన్నే లక్ష్యంగా చేసుకోవడం ఒక కారణం. స్త్రీ శరీరం అప్పుడు ఇప్పుడు సమాజానికి వస్తువుగానే మారింది.

పొన్నాయి పాత్ర కేవలం ఒక మహిళగా కాదు. ఆమె శరీరాన్ని కప్పుకోవాలనుకోవడం వెనుక ఒక పెద్ద ఆత్మగౌరవ పోరాటం ఉంది. ఆమె వేసుకున్న రవిక కేవలం బట్ట కాదు. శతాబ్దాలుగా నిషేధించిన  గుర్తు. అందుకే ఆమె భుజాలపై ఉన్న వస్త్రం సమాజం భరించలేకపోతుంది. ఒక మహిళ తనను తాను గౌరవించుకోవడం అధికారం మీద తిరుగుబాటుగా కనిపిచింది.

ముత్తయ్యలో మనిషిని మనిషిగా చూడాలనే తపన. భద్రకాళిలో  ఎప్పుడు అవమానాన్ని అనుభవించిన జీవితాల అలసట. సుడలైయండిలో ఒక అణగారిన వర్గం కల కనిపిస్తాయి. పెళ్లికొడుకుగా బండిపై కూర్చోవాలనే చిన్న కోరిక కూడా వ్యవస్థకు నేరంగా కనిపించడం ఈ దేశంలో సమానత్వం ఎంత ప్రమాదంలో ఉందో చూపిస్తుంది.

ఇక్కడ మతమార్పిడి కీలక అంశం ఇక్కడ మతం మారడం అనేది కేవలం దేవుణ్ణి మార్చుకోవడం కాదు. అవమానాన్ని వదిలించుకోవాలి, మనిషిగా గుర్తింపు పొందాలి అనే ఆకాంక్ష. ఆకలి కంటే ఆత్మగౌరవం గొప్పది. 

ఇక్కడే ఒక ప్రశ్న ఎదురవుతుంది. నిజంగా మనం ఎంత మారాం? నేడు మహిళలు పై బట్టలు ధరించవచ్చు. చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేయవచ్చు. కానీ ఆమె బట్టల పై మాట్లాడే సమాజం ఇంకా ఉంది. ఆమె శరీరాన్ని తన ఇష్టానుసారం చూసే హక్కు సమాజానికి ఉందని భావించే మనుషులు ఉన్నారు . ఒకప్పుడు చట్టాలు చేసిన పని, ఇప్పుడు సామాజిక ఒత్తిడి చేస్తోంది.

అందుకే అలల కాలం గతాన్ని మాత్రమే చెప్పదు. వర్తమానాన్ని కూడా ప్రశ్నిస్తుంది. కులం, జెండర్, అధికారం అనే మూడు జోనర్లు ఇప్పటికీ ఎలా పనిచేస్తున్నాయో గుర్తు చేస్తుంది.

రాజుల కోసం కట్టిన కోటలు శిథిలాలయ్యాయి. ఆ చరిత్ర పుస్తకాలలో మిగిలిపోయాయి. కానీ ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాలు మాత్రం ఇంకా సజీవంగా ఉన్నాయి. ఎందుకంటే అవి అధికారాన్ని కాపాడుకోవడానికి జరిగిన యుద్ధాలు కాదు మనిషిగా కాపాడుకోవడానికి జరిగిన యుద్ధాలు.

అందుకే అలల కాలం, ఒక కాలపు అణిచివేతకు అద్దం. ఒక స్త్రీ భుజాల పై బట్టను ధరించే హక్కు కోసం ప్రారంభమైన పోరాటం, చివరికి మనిషిగా గుర్తించాలి అనే హక్కు కోసం జరిగిన పోరాటం.

నేడు మనం స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ హక్కుల వెనుక ఎంత అవమానం, ఎంత తిరుగుబాటు ఉందో అలల కాలం చూపిస్తుంది.

ఈ పుస్తకం అవమానాన్ని ఎదురించి నిలబడిన మహిళల కన్నీళ్ల కలల సముద్రం.

పుస్తకం :  అలల కాలం

రచయిత : ముగిలై రాజపాండియన్ ( తమిళం )

 తెలుగు అనువాదం డా॥ ఎస్. కార్తీక్

ప్రచురణ : ఎన్నెలపిట్ట

Leave a Reply