కులం లేదు
అంతా ఒక్కటే
రండి రండి
అసెంబ్లీ కి
వినండి కనండి మాటలు చేతలు
నరనరాన ఆధిపత్య అహంకారం
జూలు విదిల్చిన క్షణంలో
దొర్లే మాటలు
వినరాని మాటలు పటపట
అచ్చోట లేని వ్యక్తిని
దూషించే చేష్టలు
తిట్లన్నీ ఆమె చుట్టే పరిభ్రమించే సంఘంలో
వ్రాయలేని అవమానాలు
చొక్కాలిప్పి అంగాంగ ప్రదర్శనలు
సానుభూతి రాలదు
తిట్లే తిట్లు సమాజం ప్రత్యక్ష వీక్షణం
దళితులపై దాష్టీకం
అనాదిగా
ఏ పదవిలో ఉన్నా చిన్న చూపే
ఉన్నత చదువులు చదివినా హేళన
ఈ సంఘం ఇంకెన్ని అరాచకాలు చూడాలో
కుల వివక్ష బాధిస్తోంది!
అది చావదు! చావనీయరు!
గెలిచినోడు రాడు
ఓటేసినోడు నవ్వుతున్నాడు
గర్వం నిలువెల్లా
జీతం కోసం ఓ సంతకం ఆర్నెళ్ళకో మారు
ప్రజాస్వామ్యం తల దించుకుంది
ఒక రోజు చావు డప్పు కొట్టి వదిలితే
ఆధిపత్య పోకడ ఆగదు
నిరంతరం డప్పులు మోగుతూనే ఉండాలి !
గద్దె దక్కదని గుండెల్లో దడ పుడుతూనే వుండాలి!




