రాజస్థాన్‌లోని దంగావాస్ దళిత మారణకాండ కేసులో నిందితులైన 40 మందిని నిర్దోషుల విడుదల

2026 ఆగస్టు 10

2015 డాంగావాస్ హింస: 40 మంది నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టిన రాజస్థాన్ ప్రత్యేక కోర్టు

2015 నాటి డాంగావాస్ హింస తీవ్రమైన “ఘోరమైన” దాడి అని గుర్తించినప్పటికీ, రాజస్థాన్ ప్రత్యేక కోర్టు నిందితులైన 40 మందినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఐదుగురు దళితులతో సహా ఆరుగురి మరణానికి ఎవరు బాధ్యులో ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడానికి పోలీసులు, సిబిఐ దర్యాప్తులోని తీవ్ర లోపాలే కారణమని కోర్టు వేలెత్తి చూపింది.

ఆరుగురు, అందులో ఐదుగురు దళితులు, దారుణంగా హత్యకు గురైన, డాంగావాస్ మారణకాండ జరిగిన పదకొండేళ్ల తర్వాత, దర్యాప్తులో, విచారణలో ఉన్న తీవ్రమైన లోపాలను ఎత్తిచూపుతూ మేర్తాలోని ప్రత్యేక కోర్టు నిందితులైన 40 మందినీ విడుదల చేసింది.


షెడ్యూల్డ్ కులాలు- షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద దాఖలైన కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు, 2015 మే 14 నాడు ఈ హింసాత్మక ఘటన జరిగిందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేస్తూ, ఈ హత్యలలో ఫలానా నిందితుడి ప్రమేయం ఉందని ఎటువంటి అనుమానానికి తావులేకుండా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది.

ఈ తీర్పు బాధితుల కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, ఒక వేదనాభరితమైన ప్రశ్నకు దారితీసింది: నిందితులైన 40 మందినీ నిర్దోషులుగా విడిచిపెడితే, తమ కుటుంబ సభ్యులను చంపింది ఎవరు మరి?

జరిగిన ఘటనలో ఉన్న నిందితులు  40 మందినీ ఏ ఒక్క సాక్షి కూడా పూర్తిగా గుర్తించలేదని కోర్టు గమనించింది. నిందితులుగా పేర్కొన్న ఆ గుంపులో తమకు కొద్దిమంది మాత్రమే తెలుసని పలువురు సాక్షులు అంగీకరించారు.

ఘటన జరిగిన 21 రోజుల తర్వాత సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సంఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే అక్కడ ఎలాంటి ఆయుధాలను రికవరీ చేసే అవకాశం లేకుండా పోయిందని కోర్టు పేర్కొంది.

దాడిలో ఉపయోగించినట్లు ఆరోపిస్తున్న ట్రాక్టర్లను జప్తు చేయడంలో కానీ, వాటికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించడంలో కానీ దర్యాప్తు అధికారులు విఫలమయ్యారు.

జప్తు చేసిన కొన్ని ఆయుధాలపైన మానవ రక్తం ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలు తేల్చినప్పటికీ, ఆ రక్తం మరణించినవారిదేనని లేదా గాయపడిన బాధితులదేనని దర్యాప్తు అధికారులు నిరూపించలేకపోయారు.

అంతేకాకుండా, రెండు వర్గాలలో ఏ వర్గం ముందుగా హింసను ప్రారంభించిందో స్పష్టత రాలేదని; ఆత్మరక్షణ కోసమే దాడి చేయాల్సి వచ్చిందన్న నిందితుల వాదనను ప్రాసిక్యూషన్ ఎటువంటి అనుమానానికి తావులేకుండా తిరస్కరించలేకపోయిందని కోర్టు పేర్కొంది.

కాబట్టి, నిందితులకు శిక్ష పడటానికి చట్టపరంగా అవసరమైన తగిన ఆధారాలు ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని కోర్టు తేల్చింది.

ఆరుగురి మృతి, 11 మందికి గాయాలు

వ్యవసాయ భూమికి సంబంధించి 5 దశాబ్దాలుగా నడుస్తున్న వివాదం కారణంగా 2015 మే 14నాడు నాగౌర్ జిల్లాలోని డాంగావాస్ గ్రామంలో ఈ హింసాత్మక ఘటన చెలరేగింది.

సిబిఐ  ఛార్జ్‌ షీట్ ప్రకారం, వివాదాస్పద భూమి వద్ద గుమిగూడిన దళిత మేఘవాల్ వర్గానికి చెందిన ప్రజలపైకి ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లపై వచ్చిన దాదాపు 200 మంది గుంపు దాడికి పాల్పడింది.

ఈ దాడిలో రత్నారామ్, పంచారామ్, గణేష్‌రామ్, పోకర్‌రామ్, గణపత్‌రామ్ అనే ఐదుగురు దళితులు మరణించారు. దళితుడేతరుడైన రాంపాల్ గోస్వామి అనే మరొక వ్యక్తి కూడా తుపాకీ గుళ్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన మరో 11 మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

1961లో దళిత రైతు బస్తారామ్ మేఘవాల్‌కి కేటాయించిన 23 బీఘాల భూమికి సంబంధించి ఈ వివాదం నడుస్తోంది. ఆ తర్వాత ఈ భూమి యాజమాన్య హక్కులు ఆయన పెంపుడు కుమారుడైన రత్నారామ్‌కు బదిలీ అయ్యాయి.

రత్నారామ్ ఆ భూమిని తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పెరిగాయని, అది చివరికి ఈ దారుణమైన దాడికి దారితీసిందని సిబిఐ ఆరోపించింది.

ఈ ఘటనకు సంబంధించి తదనంతరం 40 మందిపై సిబిఐ ఛార్జ్‌ షీట్ దాఖలు చేసింది.

అయితే, 11 ఏళ్ల విచారణ తర్వాత, నిందితులలో ఎవరికీ ఈ హింసాత్మక ఘటనతో ఉన్న సంబంధాన్ని నేర నిరూపణకు సరిపోయే ఆధారాలతో ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని కోర్టు తేల్చింది.

‘ఎవరూ దోషులు కాకపోతే, మరి నా కుటుంబాన్ని చంపిందెవరు?’

ఈ తీర్పు అర్జున్‌రామ్ మేఘవాల్‌కి తన తండ్రిని, బంధువులను కోల్పోయిన నాటి చేదు జ్ఞాపకాలను, మానసిక వేదనను మళ్లీ గుర్తుచేసింది.

ఈ దాడిలో మరణించిన వారిలో ఆయన తండ్రి రత్నారామ్ కూడా ఉన్నారు. అర్జున్‌రామ్ కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.

తీర్పు వెలువడిన తర్వాత అర్జున్‌రామ్ మాట్లాడుతూ.. తన తండ్రి మరణానికి, తన బంధువుల హత్యలకు బాధ్యులైన వారికి శిక్ష పడుతుందని తాను ఆశించానని అన్నారు.

తాను ఈ హత్యలను కళ్లారా చూశానని, మరి అలాంటప్పుడు నిందితులు ఎలా నిర్దోషులుగా విడుదలయ్యారో తనకు అర్థం కావడం లేదని అర్జున్‌రామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ తీర్పును రాజస్థాన్ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు ఆయన కుటుంబం తెలిపింది.

పరిశోధన/దర్యాప్తు మొదటి నుంచి లోపభూయిష్టంగా జరిగిందని బాధితుల తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం అన్సారీ చెప్పారు.

ఎఫ్.ఐ.ఆర్ లో ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్న పేర్లను పోలీసులు చేర్చలేదని, ఆ తర్వాత వేరే పేర్లను చేర్చారని, దీనివల్ల ప్రాసిక్యూషన్ వాదనలో పరస్పర విరుద్ధమైన అంశాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు.

సామూహిక హింసకు గురైన కేసుల్లో కూడా దళితులకు న్యాయం జరగడం ఎంత కష్టమో ఈ నిర్దోషుల విడుదల నిరూపిస్తోందని దళిత హక్కుల కార్యకర్త భన్వర్ మేఘవంశీ వ్యాఖ్యానించారు.

సిబిఐ దర్యాప్తు జరిపినప్పటికీ కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడం న్యాయ వ్యవస్థపైన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆయన అన్నారు. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయాలని ఆయన రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు.

రాజకీయ దుమారం

ఈ తీర్పుపై రాష్ట్రంలోని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 “ఏం జరిగినా అది తీవ్ర అన్యాయమే. ఇన్ని ప్రాణాలు పోయాయి, ఇక్కడ ఖచ్చితంగా నేరస్తుడు ఉండే ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఎవరూ చంపలేదు అని అనడం ఎలా సాధ్యమవుతుంది?” అని రాజస్థాన్‌లోని సీకర్ నియోజకవర్గ సిపిఐ(ఎం) పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) అమ్రా రామ్ అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. “న్యాయం అందించడమే కోర్టు పని. కోర్టు ఇచ్చిన తీర్పు దాని నిర్ణయం కావొచ్చు, అది ఏదైనా కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం మాత్రం కాదు.” అని పేర్కొన్నారు.

“కోర్టు తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. బాధితుల కుటుంబం తరఫున ప్రభుత్వం ఈ ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

“ఏది ఏమైనప్పటికీ, బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి” అని సీకర్ ఎంపీ స్పష్టం చేశారు.

భారత్ ఆదివాసీ పార్టీకి చెందిన బన్స్వారా ఎంపీ రాజ్‌కుమార్ రావత్ మాట్లాడుతూ.. డాంగావాస్ దారణకాండలో నిందితులైన 40 మందినీ నిర్దోషులుగా విడిచిపెట్టడం అనేది దర్యాప్తు తీరుపైన, అలాగే బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడంలో న్యాయ వ్యవస్థ విఫలమవడంపైన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు.

“ఒక సామూహిక దాడిలో సహా ఆరుగురు, అందులో ఐదుగురు దళితులు దారుణంగా హత్యకు గురయ్యారు. కానీ 11 ఏళ్ల దర్యాప్తు, విచారణ తర్వాత కూడా ఒక్కరిని కూడా బాధ్యులుగా తేల్చలేదు. దర్యాప్తు ఎలా జరిగిందనే దానిపై, అలాగే బాధితుల కుటుంబాలకు ఇన్ని సంవత్సరాలుగా న్యాయం ఎందుకు దక్కలేదనే దానిపై ఇది అత్యంత తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది” అని రావత్ అన్నారు.

“రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ఈ తీర్పును రాజస్థాన్ హైకోర్టులో సమర్థవంతంగా సవాలు చేసేలా చూడాలి. బాధితుల కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూడాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

నగీనా ఎంపీ, ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ తీర్పును తీవ్రంగా విమర్శించారు. దళితులపై జరుగుతున్న హింసకు సంబంధించి న్యాయం మరియు జవాబుదారీతనంపై ఈ తీర్పు మరిన్ని పెద్ద ఆందోళనలను పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు.

“ఈ కేసు కేవలం ఒక కుటుంబానికి సంబంధించినది మాత్రమే కాదు, ఈ నిర్దోషుల విడుదల నిర్ణయం ఆ ప్రాంతంలోని దళితులలో అభద్రతా భావాన్ని మరింత పెంచే అవకాశం ఉంది” అని ఆజాద్ అన్నారు.

బీహార్‌లో 1997లో జరిగిన లక్ష్మణ్‌పూర్ బాతే దారణకాండతో ఆయన దీనిని పోల్చారు. అక్కడ మహిళలు, పిల్లలతో సహా 58 మంది దళితులు హత్యకు గురైనప్పటికీ, చివరికి నిందితులందరూ విడుదలయ్యారని ఆయన గుర్తుచేశారు.

“సామూహిక హింసకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు లేనప్పుడు, బాధితులు న్యాయ వ్యవస్థను ఎలా నమ్మగలరనే ప్రశ్నను ఈ డాంగావాస్ తీర్పు మరోసారి లేవనెత్తింది” అని ఆజాద్ అన్నారు.

రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాలని బాధితుల కుటుంబం తీసుకున్న నిర్ణయానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ కేసును నిష్పాక్షికంగా విచారించాలని డిమాండ్ చేశారు.

డాంగావాస్ నిర్దోషుల విడుదలను సవాలు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం, సిబిఐలను కోరిన పీయూసిఎల్

2015 నాటి డాంగావాస్ దళితుల హత్యల కేసులో 40 మంది నిందితుల విడుదలను సవాలు చేస్తూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించాలని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL), రాజస్థాన్ విభాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు సిబిఐ ని కోరింది.

ఈ హింసను “రాజస్థాన్‌లో దళితులపై జరిగిన అత్యంత భయంకరమైన సామూహిక దాడి ఘటనలలో ఒకటి” అని పేర్కొంటూ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పీయూసిఎల్ స్పందించింది. భూ వివాదం సమయంలో మేఘవాల్ వర్గం ప్రజలపై దాడులు చేయడం, ఇళ్లను ధ్వంసం చేయడం, మహిళలపై వేధింపులకు పాల్పడటం, కుల వివక్షతో కూడిన దూషణలు చేయడం; ఐదుగురిని చంపడం వంటి గురైన తీవ్రమైన ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయని పీయూసిఎల్ పేర్కొంది.

సిబిఐ దర్యాప్తు జరిపి, విచారణ (ట్రయల్) సమయంలో ఆధారాలు సమర్పించినప్పటికీ నిందితులు విడుదల కావడం అనేది, వ్యవస్థీకృత కుల హింస కేసులలో బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడంలో నేరపూరిత న్యాయ వ్యవస్థ సమర్థతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని పీయూసిఎల్ జాతీయ అధ్యక్షురాలు కవితా శ్రీవాత్సవ్ అన్నారు. కుల ఆధారిత హింసకు గురైన బాధితులకు న్యాయం పొందడం ఎంత కష్టమో ఈ తీర్పు ఒక “ఆందోళనకరమైన సందేశాన్ని” ఇస్తోందని ఆమె పేర్కొన్నారు.

https://maktoobmedia.com/post?id=116167&slug=it-could-be-anything-but-justice-acquittal-of-all-40-accused-in-rajasthans-dangawas-dalit-massacre-sparks-outrage

  • అనువాదం : కె. పద్మ  

Leave a Reply