సామ్రాజ్యవాద యుగంలో దేశాల మ‌ధ్య యుద్ధాలు సరిహద్ధుల మధ్య జరిగే సైనిక ఘర్షణలు కేవలం ఆధిప‌త్యం కోస‌మే కాదు. ప్రతి యుద్ధం వెనుక ఒక ఆర్థిక ప్రయోజనం, మార్కెట్ ఆధిపత్యం, వనరుల దోపిడీ దాగి ఉంటుంది. ప్రపంచ దేశాల మార్కెట్లపై, సహజ వనరులపై ఆధిపత్యం సాధించడానికి సామ్రా జ్యవాద దేశం పరాయి దేశంపై ఆక్రమణ యుద్ధం చేస్తుంది. అందువల్లనే లెనిన్ ‘సామ్రాజ్యవాదం అంటే నే యుద్ధం’ అన్నాడు. యుద్ధం అనేది అకస్మాత్తుగా జరిగేది కాదు. పెట్టుబడిదారీ విధానం విస్తరణలో అది ఒక భాగం. మార్కెట్లు స్తంభించిపోయినప్పుడు ‘పెట్టుబడి’ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటుంది. ఆ సంద ర్భంలో కార్పొరేట్ సంస్థలు, వాటి వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసం రాజ్యాలు  ఉమ్మడిగానే యుద్ధాలకు పూనుకుంటాయి. రాజ్యం, పెట్టుబడి, మీడియా, సాంకేతికత అన్నీ కలిసి సైనిక, పారిశ్రామిక, సాంకేతిక సముదాయాన్ని నిర్మిస్తాయి. ఇవన్నీ కలిసి యుద్ధాన్ని ఖ‌రారు చేస్తాయి. ప్రజలకు యుద్ధం అంటే మరణం. కానీ, పెట్టుబడికి అది లాభం. రాజ్యానికి అది నియంత్రణ సాధనం.

          పశ్చిమాసియా ప్రాంతం దశాబ్ధాలుగా ప్రపంచ భౌగోళిక-రాజకీయాలకు ముఖ్య వేదికలలో ఒకటిగా నిలుస్తున్నది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, భద్రతలో పశ్చిమాసియా అత్యంత కీలకమైన భౌగోళిక రాజకీయ స్థానం కలిగి ఉంది. అగ్రరాజ్యాలను అమితంగా ఆకర్షించే విస్తారమైన చమురు నిల్వలు, అంత ర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన జలసంధులు (హోర్ముజ్, బాల్ అల్ మాండెబ్, సూయజ్) వంటి అంతర్జాతీయ సముద్ర జలమార్గాలు ఈ ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యతను చేకూరుస్తున్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలను కలిపే కూడలిలో ఉన్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కేంద్రంగా ఉన్నాయి. వీటిలో హోర్ముజ్ మ‌రీ కీల‌క‌మైన‌ది. దీనికి తోడు మక్కా, మదీనా, కర్బలా, మషాద్, జెరూసలేం వంటి పవిత్రమైన మతవిశ్వాస కేంద్రాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రపంచంలోని ప్రధాన మతాలైన ఇస్లాం, క్రైస్తవం, జూడాయిజం(యూదు) ఈ ప్రాంతంలోనే ఉద్భవించాయి. వీటన్నింటి కారణంగా, పశ్చిమాసియా నిరంతరం విభిన్న శక్తుల వ్యూహ ప్రతి వ్యూహాలకు కార్యరంగంగా మారుతున్న ది. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నేపథ్యంలో ఇరాన్-అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరాన్ చమురు వనరులపై  అమెరికా ఆధిపత్యం కోల్పోయింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్ధాలుగా ప్రాక్సీ యుద్ధం నడుస్తుండగా, 2024 నుండి ప్రత్యక్ష సైనిక దాడులు జరుగుతున్నాయి. పశ్చిమ దేశాల చమురుపై ఆధిపత్యం ఉంటేనే ప్రపంచ ఆధిపత్యం చలాయించవచ్చు.

          ప్రపంచ దేశాల సహజ వనరులు, మార్కెట్లపై ఆధిపత్యం కోసం ద్రవ్య పెట్టుబడి, సామ్రాజ్యవాదం నిరంతరం పాటుపడుతాయి. 2008లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం తరువాత అమెరికా ఆర్థిక వ్యవస్థ  పెను సంక్షోభం దిశగా పయనిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు, డాలర్ ఆధిపత్యం క్రమాను గత క్షీణత, ప్రపంచీకరణ నేపథ్యంలో అమెరికా నుంచి అనేక భారీ పరిశ్రమలు చైనా, భారత్ వంటి దేశాల కు తరలి వెళ్లాయి. ఫలితంగా ఉత్పత్తి తగ్గి, ఉపాధి దెబ్బతిన్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సేవారంగం వైపు మళ్లింది. ప్రస్తుతం జిడిపి ని మించిన అప్పుతో రుణ ఊబిలో కూరుకుపోయింది. అమెరికా ప్రపంచ ఆధిప త్యానికి చైనా సవాళుగా నిలుస్తున్న‌ది. మొత్తానికి ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఒక క్లిష్టమైన కాలపరీక్షను ఎదుర్కొంటున్న‌ది. 21వ శతాబ్దంలో పశ్చిమాసియాలోని భౌగోళిక రాజకీయ నిర్మాణం, వ్యూహ త్మక కూటములపై చైనా, అమెరికా మధ్య ఆర్థిక సాంకేతిక పోటీ ప్రభావం పెరుగుతోంది. అమెరికా ప్రయోజ నాలకు ముప్పుగా భావించే చైనాకు ఇరాన్ నుండి చమురు, సహజ వాయువుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి, లేదా కనీసం నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం ఈ యుద్ధాన్ని ప్రారంభించింది.

          ఈ భౌగోళిక రాజకీయ వాస్తవాల వెలుగులో అమెరికా, రష్యా, ఇరాన్, వెనిజులా నుండి చమురు, గ్యాస్ ను పొందకుండా చైనా, భారత్‌లను నిరోధించడం ద్వారా, ఆ దేశాలను ఆర్థిక, ద్రవ్య గందరగోళంలో పడవేయాలని అమెరికా చూస్తోంది.  చైనా యొక్క ఇంధన “జీవనాధారాన్ని” అడ్డుకోవడానికి, తద్వారా దాని భౌగోళిక రాజకీయ ఎదుగుదలను నిరోధించడానికి వాషింగ్టన్ ఉద్దేశపూర్వకంగానే ఇరాన్‌పై యుద్ధానికి పూనుకుంది.  ఇరాన్ ఎగుమతి చేసే చమురులో సుమారు 90 శాతం చైనాకు వెళ్తుంది, పర్షియన్ గల్ఫ్ దేశాలు ఉత్పత్తి చేసి, హోర్ముజ్  జలసంధి గుండా వెళ్లే చమురులో 37.7 శాతం చైనాకు వెళుతుంది. అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా భావించే దేశాలకు చమురు, సహజ వాయువుల ప్రవాహాన్ని అడ్డుకోవ డానికి అమెరికా ప్రభుత్వం ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. అమెరికా యుద్ధకర్తలు “ఇరాన్ ఆర్థిక వ్యవస్థ… అమెరికా ఆర్థిక వ్యవస్థతో సన్నిహితంగా ఉండాలని, దాని ఎగుమతి ఆదాయాలు, ద్రవ్య నిల్వలు యూఎస్ ట్రెజరీ బాండ్లు, యూఎస్ కార్పొరేట్ సెక్యూరిటీలన్ని డాలర్ల రూపంలో ఉండాలని” కోరుకుంటున్నారు.

వెనిజులా అధ్యక్షుడు మదురోను జనవరి 3న అపహరించిన తర్వాత, ఇరాన్‌లో పాలన మార్పు అనేది సులభంగా సాధించగల తదుపరి లక్ష్యమని ట్రంప్ భావించాడు. అయితే దానికి మొదటి కారణం ఇరాన్ అణు బాంబును తయారు చేసే స్థాయికి చేరుకోవడమైతే, మరోటి ఆ దేశంలోని ప్రజలు అక్కడి ప్రభుత్వా నికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టడం. ఈ రెండు కారణాలపై ట్రంప్ ఇజ్రాయెల్‌తో కలిసి ఫిబ్రవరి 28న ఆపరేషన్ ‘ఎపిక్ ప్యూరీ’ పేరుతో ఇరాన్‌పై దాడులు ప్రారంభించాడు. యుద్ధం ప్రారంభిం చిన మొదటిరోజే  సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు అనేక మంది ఇతర ఇరాన్ ముఖ్య నేత‌ల‌ను, అధికారులను హత్య చేశాడు. ఇరాన్ కొద్ది రోజుల్లోనే కుప్పకూలుతుందని అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ యంత్రాంగం భావించింది.  కానీ ఖమేనీ హత్య తర్వాత ఇరాన్‌లో జాతీయవాదం పెరిగింది. ఇప్పుడు ప్రపంచం ఇరాన్ యొక్క అద్భుతమైన పునరుద్ధరణ శక్తిని, ప్రతిఘటనను చూస్తోంది. ఇరాన్ క్షిపణులు, హోర్ముజ్ మాస్టర్ స్ట్రోక్, పాలన మార్పు కుట్రను విఫలం చేయడమే కాకుండా, అమెరికాను అవమాన కరమైన రీతిలో వెనక్కి తగ్గేలా చేశాయి. మరోవైపు ఇరాన్  వందలాది డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయె ల్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అమెరికా సైనిక స్థావరాల పైకి ప్రయోగిస్తూ అమెరికాను ప్ర‌తిఘ‌టిస్తున్న‌ది. అమెరికా య‌ద్ధాన్ని త‌న‌దైన ప‌ద్ధ‌తిలో ఇరాన్ ఎదుర్కొంటున్న‌ది.

          అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో వేల సంఖ్య‌లో పౌర మరణాలు సంభవించాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు ధ్వంస‌మ‌య్యాయి. ఇరాన్ అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఇరాన్ సైనిక, పౌర, మౌలిక సదుపాయాల లక్ష్యాలపై ‘24,000కు పైగా దాడులు’ జరిగాయి.యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, కనీసం 3,375 మంది ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒక బాలికల పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 176 మంది విద్యార్థినులు విషాదకరంగా మరణించారు. ఇప్పటివరకు 26 వేల మందికి పైగా గాయపడ్డారని అదే వర్గాలు నివేదిస్తున్నాయి. దీంతో మొత్తం పశ్చిమా సియా అంతటా పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సైనిక సామ ర్థ్యం క్షీణించింది. పశ్చిమాసియాలో ఆ దేశ అనుచర శక్తులూ బలహీనపడ్డాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అయితే టెహ్రాన్‌లోని ప్రస్తుత పాలకవర్గం రాజకీయంగా బలోపేతమైన‌ది. ఇరాన్ భవిష్య త్తుపై చట్టబద్ధంగా చర్చలు జరపగల భాగస్వామిగా గుర్తింపును పొందింది.

          పొంచి ఉన్న ‘అణు ముప్పు’ను తప్పించడానికే ఇరాన్‌పై సమరశంఖం పూరించినట్లు ట్రంప్ 2025 జూన్‌లో చెప్పుకొచ్చాడు. కానీ, టెహ్రాన్ అణుబాంబులు తయారుచేస్తున్నట్లు ఆధారాలేవీ లేవని అంతర్జా తీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ స్వయంగా తేల్చి చెప్పారు. వాస్తవానికి కయ్యానికి కాలుదు వ్వడంలో ట్రంప్ లెక్కలు వేరే ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో తమ ప్రయోజనాలకు విఘాతకరంగా మారిన ఇరాన్‌లోని ఖమేనీ మతరాజ్యాన్ని కూల్చి, తమ అనుకూల ప్రభుత్వాన్ని కొలువుదీర్చడానికే ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధానికి దిగాడు. పోరులో తొలిరోజే ఖమేనీతో పాటు కీలక నేతలను అంతమొం దించిన దరిమిలా టెహ్రాన్‌ను తేలిగ్గా లొంగదీసుకోవచ్చునని ట్రంప్ భావించాడు. కానీ, దశాబ్ధాలుగా సంప్రదాయేతర యుద్ధతంత్రంలో ఆరితేరిన ఇరాన్-గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలపై భీకర దాడులు జరిపి అగ్రరాజ్యాధిపతిని ఇరాన్‌ అడకత్తెరలోకి నెట్టింది. ఇరాన్, హోర్ముజ్ జలసంధిపై తన వ్యూహాత్మక పట్టును అస్త్రంగా మలచుకుని ప్రపంచ రాజకీయ చదరంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఏడాది కాలంలో ట్రంప్ 7 దేశాలపై  సైనిక దాడులు నిర్వహించడం, వెనిజులా అధ్యక్షుడిని ఆయన నివాసం నుంచి నిర్బంధించి అమెరికాకు తీసుకుపోయాడు. దాంతో యావత్ పశ్చిమ ప్రాంతంపై తన ఆధిక్యాన్ని బహిరంగంగా ప్రదర్శించడం వంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నాడు. ట్రంప్ తన ఇష్ట ప్రకారం తోచినట్లు చేసుకుపోతున్నాడా లేక మారుతున్న ప్రపంచంలో పతనమైపోతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని తమ పెత్తనం ఎక్కడ చేజారిపోతుందోనన్న భయంతో ఇవి చేస్తున్నాడా అన్న ప్రశ్నలు ఉత్ప‌న్న‌మవుతున్నాయి.

          ఇరాన్‌కు ఈ యుద్ధం దాని ఉనికి, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం సాగించే పోరాటం. ప్రారంభంలో ఎదురుదెబ్బ తగిలినా, ఐఆర్‌జిసి (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్) ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగం త్వరగా పునర్వ్యవస్థీకరించుకుని తమ ప్రతిఘటనను ప్రారంభించాయి. ఇరాన్ తన తక్కువ ధర డ్రోన్‌ల ద్వారా అధునాతన క్షిపణి శక్తి ద్వారా యుద్ధంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇజ్రాయెల్‌పై నిరంతర క్షిపణి దాడులు చేయడం ద్వారా, అది ఇజ్రాయెల్ అధునాతన సైనిక వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చింది. ఈ నిరంతర దాడుల ఫలితంగా, ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ బలహీనపడిన్నట్లు కనిపిస్తోంది. గల్ఫ్ లోని అమెరికా ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇర‌న్ దాడుల‌లో గల్ఫ్ ప్రాంతంలోని ఎనిమిది దేశాల్లోని 15 అమెరికా సైనిక కేంద్రాలలో కనీసం 228 మౌలిక సదుపాయాలు, పరికరాలు ధ్వంసమయ్యా యని చెబుతున్నారు. వీటిలో అనేక ఖరీదైన రాడార్ వ్యవస్థలు, సైనిక విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధోన్మాద దాడులకు పాల్పడిన అమెరికా అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. పశ్చిమాసియాలో తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టేసిన అమెరికా ఇప్పుడు తాను తీసిన గోతిలో తానే పడ్డ చందంగా భారీస్థాయిలో ఆర్థిక నష్టాలను చవిచూస్తోంది. ఇరాన్‌తో యుద్ధం కోసం ఇప్పటివరకు 29 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు పెంటగాన్ బడ్జెట్ అధికారి చెప్పాడు. 

          అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల అధునాత సాంకేతిక సైనిక వ్యవస్థలను ఎదుర్కొనేందుకు ఇరాన్ తక్కువ ఖర్చుతో భారీ సంఖ్యలో తయారుచేసిన‌ డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించడం ద్వారా అత్యాధుని క రక్షణ వ్యవస్థలను అధిగమించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఉదాహరణకు ‘షాహెద్ 136’ అనే ఆత్మాహుతి డ్రోన్ ధర సుమారు 20 వేల నుంచి 50 వేల డాలర్ల మధ్య ఉండగా, అలాంటి డ్రోన్లను అడ్డుకు నే పేట్రియట్ క్షిపణి ఒక్కదానికి దాదాపు 4 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ భారీ వ్యయ వ్యత్యాసమే ఇరాన్ అసమాన యుద్ధ వ్యూహానికి మూలాధారం. యుద్ధ వ్యూహాన్ని బలోపేతం చేసే మరో అంశం ఇరాన్ నిర్మించిన భూగర్భ ‘మిస్సైల్ నగరాలు’, పర్వతాల లోపల భారీ సొరంగ మార్గాలతో నిర్మించిన ఈ సదుపాయాల్లో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, ఇంధన నిల్వలు, ప్రయోగ వేదికలు  నిర్మించి ఉంచింది. గట్టి కాంక్రీటుతో నిర్మించిన ఈ నిర్మాణాలు నిరంతర వైమానిక దాడులు జరిగినా కూడా ప్రతీకార దాడుల సామర్థ్యాన్ని నిలబెట్టుకునేలా ఉన్నాయి.

          మేక్ అమెరికా గ్రేట్ అగైన్, యుద్ధాలకు దిగను, జరుగుతున్న యుద్ధాలను ఆపిస్తాను అంటూ డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. అలా ఎన్నికైన తరువాత అమెరికా సామ్రాజ్యవా దపు ముసుగును ట్రంప్ చించి పారేసాడు. సామ్రాజ్యవాదమంటేనే దోపిడీ ముఠా, బందిపోటు, హైపర్ సామ్రాజ్యవాదమని నిరూపించాడు. చెప్పింది చేయను, చెప్పేది కూడా చేయను. చేసేది ఏమిటో అసలు ప్రజలకు చెప్పను. స్వతంత్ర దేశమేదైనా, దానిపై మా కన్ను పడితే, అది కావాల‌నిపిస్తే, అది మా సొంతం కావాల్సిందే! ఆ దేశ నాయకుడెవడైనా మాకు తలొగ్గాల్సిందే! మేం చెప్పింది చేయాల్సిందే! మా కాలి చెప్పు క్రింద అణిగి మణిగి ఉండాల్సిందే! లేదంటే వెనిజులా అధ్యక్షుడు మధురో, అతని సతీమణిలకు పట్టినగతే పడుతుందని అన్ని దేశాల‌కు తెలియ‌జెప్పాడు. మ‌రో రూపంలో హెచ్చ‌రించాడు. అన్ని అంతర్జా తీయ నియమాలను కాలదన్నాడు. ఆ క్ర‌మంలో ట్రంప్ ప్ర‌గ‌ల్బాలు, గూండాగిరి మాట‌లకు లెక్క‌లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కెనడా ఒక రాష్ట్రం అన్నాడు. గ్రీన్లాండ్స్ దేశం మాదే అని రంకెలు వేశాడు. ఇప్పుడు క్యూబాను ఆక్రమించుకుంటాన‌ని ప్ర‌క‌టిస్తున్నాడు.

          అమెరికాలోని యూదు ధనిక వర్గ ఇజ్రాయిలీ ముఠా, నెతన్యాహు కలిసి పశ్చిమాసియాలో ఆ దేశాల భూభాగాలను, వనరులను  సామ్రాజ్యవాద దురాక్రమణ ద్వారా సొంతం చేసుకుని అక్కడి అపార ఇంధన సంపత్తిని దోపిడీ చేస్తున్నారు. ఆ భూభాగాలను సొంతం చేసుకుని విశాల యూదు సామ్రాజ్యం స్థాపించ డం ఇజ్రాయెల్ లక్ష్యం అంటూ నెతన్యాహు ప్రకటిస్తున్నాడు. ఈ లక్ష్యం నెరవేర్చుకోవడానికి అది  ఇజ్రాయెల్ ఎంత‌కైనా తెగిస్తుంది. ఈ తెగింపుకు తోడుగా అమెరికా. పశ్చిమాసియాలో  డాలర్ పెత్తనాన్ని,  సైనిక నియంతృత్వాన్ని  చెలాయిస్తూన్న‌ది. ఇజ్రాయెల్ అమెరికాకు మేజర్ మిలటరీ పార్టనర్‌గా ఉంటూ గల్ఫ్ దేశాలన్నిటినీ అతలాకుతలం చేస్తున్న‌ది. అమెరికా అండదండలతో జాతి సంహార చర్యలు చేపడుతూ పశ్చిమాసియా నాయకత్వాన్ని సైనిక గూఢచర్య సాంకేతికత నుపయోగిస్తూ, మెరుపు దాడులతో అంతమొందిస్తున్న‌ది.

          దశాబ్ధాలుగా, అమెరికా తన సైనిక, ఆర్థిక, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ద్వారా ప్రపంచ వాణిజ్యంపై అదుపును కొనసాగించింది. కానీ ఇప్పుడు, ఆ ఏకపక్ష ఆధిపత్యం తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. అనేక దేశాలు ఇప్పుడు “పెట్రోడాలర్” వ్యవస్థకు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. ఈ యుద్ధం- అమెరికా, యూరప్‌ల మధ్య ఉన్న విబేధాలను మరింత తీవ్రతరం చేసింది. ‘నాటో’లో విబేధాలు తీవ్రమై, ఇది రాబోయే రోజుల్లో పాశ్చాత్య కూటమి ఐక్యతను బలహీనపరిచే ప‌రిస్థితులున్నాయి. మరోవైపు  చైనా రష్యాలు సంయుక్తంగా ఇరాన్‌కు అధునాతన రక్షణ పరికరాలు, నిఘా సమాచారం, ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్ టెక్నాలజీ, రాకెట్ ఇంధనానికి అవసరమైన రసాయనాలను అందించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన మద్దతును కూడా అందిస్తున్నాయి. మ‌రో వైపు, యుద్ధం సాగుతున్నకొద్దీ, అమెరికా లో ప్రజల అసంతృప్తి పెరిగింది. విద్యార్థులు, కార్మిక సంఘాలు, యుద్ధ వ్యతిరేక బృదాలు, ప్రగతిశీల మేధావులు వివిధ నగరాల్లో యుద్ధ‌వ్య‌తిరేక‌ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. “ఆరోగ్యం, విద్య కోసం మా డబ్బు- యుద్ధానికి కాదు” వంటి నినాదాలతో వీధులు మార్మోగుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక వ్యయంలో కోత అమెరికాలోని శ్రామిక ప్రజలపై ప్రభావం చూపుతున్నందున, ఈ యుద్ధానికి దేశీయంగా వ్యతిరేకత తీవ్రమవుతోంది.

          యుద్ధం ద్వారా ఇరాన్‌ను దెబ్బతీయడంలో అమెరికా నిర్దేశించుకున్న ప్రధాన ఏడు సైనిక, రాజకీయ లక్ష్యాలు నెరవేరలేదని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అమెరికా విదేశాంగ విధా నానికి గట్టి ఎదురుదెబ్బ. అధికార మార్పిడి విఫలం.. ఇరాన్ ప్రధాన నాయకత్వం అంతమైతే ఇరాన్ పాలనా యంత్రాంగం పూర్తిగా కుప్పకూలుతుందని అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది. కానీ, ఇరాన్ తన రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ ద్వారా అతి తక్కువ కాలంలోనే నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకు ని పాలనను స్థిరపరుచుకున్న‌ది. ఈ యుద్ధ ఫలితం అమెరికా కంటే ఇరాన్‌కు ఎక్కువ అనుకూలంగా ఉండవచ్చని ఇప్పుడు స్పష్టమవుతోంది. కొంతమంది విశ్లేషకులు ఈ యుద్ధాన్ని అమెరికాకు ఒక “సూయజ్ ఘట్టం”గా అభివర్ణిస్తున్నారు. 1957లో సూయజ్ వివాదం ప్రపంచంలో బ్రిటన్ ఆధిపత్యానికి ఎలా ముగింపు పలికిందో, అలాగే నేటి ఇరాన్ వివాదం అమెరికా ప్రపంచ ఆధిపత్యానికి ముగింపును సూచిస్తోందని అంటున్నారు. మరోవైపు అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం అధిక ద్రవ్యో ల్బణం, పెరిగిన వాణిజ్య సుంకాలు (టారిఫ్‌లు), తగ్గిన ఉద్యోగ అవకాశాలు, అంతర్జాతీయ‌ యుద్ధాల (ఇరాన్ వంటి వాటి) కారణంగా ఏర్పడిన అదనపు భారం వల్ల ఉత్పన్నమైంది. తాజా పరిస్థితుల్లో తయారీ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోవడం, స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) మందగించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారాయి.

          ఇరాన్ లో ఆ దేశ‌ పాలకులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకుని ప్రజా తిరుగుబాటు తీసుకురావాలని అమెరికా భావించింది. అయితే ఓ అమెరికా బాంబు పొరపాటున మినాబ్ నగరంలోని బాలికల పాఠశాల సమీపంలో పడి అనేకమంది విద్యార్థినులు మరణించడం ఇరాన్ జనాభాలో తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది. అంతర్గత సమస్యలను పక్కనపెట్టి ఇరాన్ పౌరులంతా తమ దేశ సార్వభౌ మత్వాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వానికి అండగా నిలవడంతో అమెరికా అనుకున్న తిరుగుబాటు సాధ్య పడలేదు. ఈ పరిణామాలు ఇరానియన్లలో జాతీయ భావాన్ని మరింత బలోపేతం చేశాయి. అమెరికా రక్షణ వ్యూహాలు ఇరాన్ ప్రజలను ప్రభుత్వం వైపు ఆకర్షించేలా చేయడంతో, దేశంలో ఇస్లామిక్ పాలకుల అధికా రం మరింత స్థిరపడింది. చివరకు ఏ యాజమాన్యాన్ని కూలదోయాలని అమెరికా భావించిందో, అదే ప్రభుత్వ ప్రతినిధులతో శాంతి చర్చ‌లు జరిపి ఒప్పందం కుదుర్చుకోవాల్సి రావడం ట్రంప్ యంత్రాం గానికి పెద్ద వ్యూహాత్మక ఓటమి.

          ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఆశించిన లక్ష్యాలలో ఏదీ సాధ్యం కాలేదు.  ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడం,  క్షిపణి వ్యవస్థను నాశనం చేయడం, భూగర్భ మిసైల్ నగరాలు ధ్వంసం చేయడం సాధ్యం కాలేదు. అయితే  హోర్ముజ్ జలసంధిపై పట్టు దౌత్య చర్యల ద్వారానే జలసంధి పునరుద్ధరణ, యురేనియం నిల్వలు సురక్షితం, మరో 60 రోజుల వాయిదా సైనికపరంగా సురక్షితమైన ఇరాన్ క్షిపణి నగరాలు  కాపాడుకోవ‌టం ఇరాన్ విజ‌యం.  దాదాపు 900 భారీ వైమానిక దాడుల ద్వారా ఇరాన్ యుద్ధ సంపత్తిని నాశన చేయవచ్చని భావించినప్పటికీ.. ఇరాన్‌కు చెందిన భూగర్భ క్షిపణి తయారీ శ్రేణులు సురక్షితంగా రక్షించబడ్డాయి. వీటిని దెబ్బతీయడంలో అమెరికా వైమానిక దాడులు విఫలమయ్యాయి. ఇరాన్‌లోని యురేనియం నిల్వలను నియంత్రించడంలో లేదా అడ్డుకోవడంలో శ్వేతసౌధానికి ఎలాంటి ముందంజ లభించలేదు. హోర్ముజ్ సంక్షోభం నుంచి ఆయుధ సంపత్తి సంరక్షణ వరకు అన్నిటా ఇరాన్ పట్టు బిగించింది. ఫలితంగా ఈ యుద్ధం ఖచ్చితమైన ఏకపక్ష విజయంగా కంటే, అలసటతో కుదిరిన రాజీ మార్గంగా మిగిలిపోయింది. రెండు దేశాల మధ్య పెరిగిన సైనిక ఘర్షణ భవిష్యత్ అంతర్జాతీయ వ్యూహాలకు కొత్త దిశను చూపించనుంది.

          ఇరాన్ దాడుల సమయంలో గల్ఫ్ దేశాలకు పరోక్షంగా భారీ ఆర్థిక, మౌలిక వసతుల నష్టం వాటిల్లిం ది. దీంతో అమెరికా కల్పించే రక్షణ వలయం తమ ప్రయోజనాలను పూర్తిగా రక్షించలేదనే నిర్ధారణకు గల్ఫ్ దేశాలు వచ్చాయి. తద్వారా ఖతార్ లాంటి గల్ఫ్ దేశాలే ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తులుగా మారాల్సి వచ్చింది.  పదిహేను వారాల ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ తర్వాత, డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో పద్నాలుగు సూత్రాల ‘శాంతి ఒప్పందంపై సంతకం చేసి ‘ఆపరేషన్ ఎపిక్ రిట్రీట్’ను ప్రారంభించారు. అయితే, ఇది ఇంకా అవగాహన ఒప్పందం యొక్క ముసాయిదా మాత్ర మే, తుది ఒప్పందంపై అరవై రోజుల తర్వాత సంతకం చేస్తారు. అయితే,  ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి అంగీకరించడం లేదు. అణు పర్యవేక్షణ విషయంలో ఐఎఇఎ తనిఖీల నిలిపివేత అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి తీవ్రమైన రాజకీయ దెబ్బ. సంవత్సరాల తరబడి “అణ్వాయుధ ముప్పు” అని ప్రచారం చేసిన పాశ్చాత్య మీడియా కథనాలకు అమెరికా చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారింది. 

           ‘ఇరాన్ ఎన్నడూ యుద్ధంలో గెలవలేదు. చర్చల్లో ఓడిపోలేదు’ అని ట్రంప్ ఒకప్పుడు వ్యాఖ్యానిం చాడు. తాజా ఒప్పందం దాన్ని నిజం చేస్తోంది. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం చేసే యుద్ధాలు, కుదిరే ఒప్పందాలు నాయకుల సొంత ప్రచారానికి ఉపయోగపడతాయే తప్ప ప్రజల ప్రయోజనాలకు మాత్రం కాదు. ఆయన కోరుకున్నట్లే ఒప్పందం కుదుర్చుకున్నారు. మరోవైపు తన మనుగడను కాపాడుకోవాలని ఇరాన్ నాయకత్వం కోరుకుంది. లెబనాన్‌లో ఇష్టారాజ్యంగా వ్యవహరించాలనీ, అక్కడ హిజ్బొల్లా పని పట్టాలని నెతన్యాహూ కోరుకున్నాడు. తాజా ఒప్పందం తనకేమీ పగ్గాలు వేయడం లేదు. కాబట్టి, తాను అనుకున్నట్లు వ్యవహరించే స్వేచ్ఛ నెతన్యాహు త‌న‌కున్న‌ట్లు భావించే అవ‌కాశం ఉన్న‌ది.

          నిజానికి, ఇరాన్ విషయం అట్లుంచి పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సిద్ధించాలంటే తప్పనిసరిగా జరగవలసినవి రెండున్నాయి. ఒకటి, స్వతంత్ర పాలస్తీనా దేశం సృష్టికావటం. రెండు, గ్రేటర్ ఇజ్రాయెల్ అంటూ పాలస్తీనాతో పాటు వివిధ అరబ్ దేశాల భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించకుండా నిరోధిం చటం. ఈ రెండు నెరవేరనంత వరకు, ప్రస్తుతానికి ఇరాన్ సమస్య శాంతించినా, దీర్ఘకాలిక సమస్య కొనసాగుతూనే ఉంటుంది. ఇరాన్ చమురు, గ్యాస్ నిల్వలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలనే అమెరికా చిరకాలపు వ్యూహాన్ని విర‌మించుకోవటం కూడా అంతే అవసరం. వాస్తవానికి ఈ వివిధ అంశాలన్నింటి మధ్య పరస్పర సంబంధం ఉంది. అందువల్లనే అమెరికా, ఇజ్రాయెల్ కలిసికట్టుగా యుద్ధం మొదలు పెట్టాయి. పాలస్తీనా నుంచి ప్రజలందరినీ వెళ్లగొట్టి ఆక్రమించి, అక్కడ రిసార్టులు నిర్మిస్తామని వీరిద్దరూ పదేపదే ప్రకటనలు చేయటం చెప్తున్నదేమిటంటే.. ఆ ప్రాంతాన్ని క‌బ‌లిస్తామ‌నే క‌దా. అలాంట‌ప్పుడు శాంతి ఎలా సాధ్య‌మ‌వుతుంది?

          ఇది ఇరాన్ ఒంటరి విజయం మాత్రమే కాదు. రష్యా, చైనా పూర్తి దౌత్య మద్దతు, గ్లోబల్ సౌత్ దేశాల మౌన అనుమతి ఈ ఒప్పందానికి వెన్నుముక అయ్యాయి. అమెరికా ఆధిపత్య క్రమం బీటలు వారుతున్న సంకేతాలు గత దశాబ్దంగా కనిపిస్తున్నా, ఇరాన్ ఘనత వాటిని బహిరంగంగా చూపించింది. శాంతి ఒప్పం దం కార్యరూపం దాల్చాలంటే, అవగాహన ఒప్పందంలోని అనేక అంశాలు తక్షణమే అమలులోకి రావాలి. లెబనాన్‌తో సహా అన్ని యుద్ధ క్షేత్రాల‌లో కాల్పుల విరమణ జ‌ర‌గాలి. అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. ఇరాన్ నుండి అమెరికా సాయుధ దళాలను ఉపసంహరించుకోవాలి.హోర్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛాయుత అంతర్జాతీయ రాకపోకలు, ఇరాన్ నుండి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి, సంబంధిత బ్యాంకింగ్, రవాణా సేవలకు మినహాయింపులు, ఇరాన్ స్తంభింపజేసిన నిధులను విడుదల చేయడం వంటివి జ‌ర‌గాలి.

          సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధం, ఆంక్షలు, సైనిక దురాక్రమణ మార్గాన్ని అనుసరిస్తోందని ఇరాన్ యుద్ధం మనకు మరోసారి రుజువుచేసింది. అయితే, ఈ ప్రక్రియతో పాటు, సామ్రాజ్యవాద వ్యవస్థలోని అంతర్గత వైరుధ్యాలు కూడా తీవ్రమవుతున్నాయి. ప్రపంచ రాజకీయాలను కేవలం ఒక సామ్రాజ్యవాద శక్తి పతనం, మరొక సామ్రాజ్య వాద శక్తి ఆవిర్భావంగా మాత్రమే చూడకూడదు. రష్యా, చైనా, లేదా ఇరాన్ వంటి శక్తులు అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నప్పటికీ, అవి తమ పాలక వర్గాల ప్రయోజనాలకే ప్రాతినిధ్యం వహిస్తాయి. కాబట్టి, రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాల దిశను నిర్దేశించేది- కేవలం దేశాల మధ్య యుద్ధం మాత్రమే కాదని, అంతర్జాతీయ కార్మికవర్గ పోరాటమే దీనిని నిర్దేశిస్తుందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడు ఇరాన్ నుంచి అమెరికా వెనుకడుగు వేయడంతో, ఇక ఇజ్రాయెల్ ఆగడాలను ప్రపంచం అరికట్టవలసిన అవ‌స‌రం ఉన్న‌ది.

Leave a Reply