అవును… మీరందరూ వినాలి. నేనెలా చనిపోయానో నేను మీకందరికీ చెప్పి తీరాలి. నా కథ మీకు వింతగా కనిపించవచ్చు పోనీ ఒఠ్ఠి చోద్యంగానూ అనిపించవచ్చు. నాలాంటి స్త్రీల కథలు ఎవరు రాస్తారో తెలీదు కానీ ఒకవేళ రాస్తే మాటుకు రాసిన వాళ్ళని కూడా మీరు తెగడతారు. ఒఠ్ఠి బలుపు… బూతూ రాస్తుందీవిడ అని ఆమెను పాపం మనస్తాపానికి గురి కూడా చేయవచ్చును మీరంతటి వాళ్లే సుమా! ఇంతకీ నేనెలా పోయానో మీకు చెప్పాలి. ఈవిడేదో మళ్ళా ఒక పురుషుడ్నో… అంటే భర్తని విలన్‌గా నిలబెడ్తుందని మీరనవచ్చు కానీ నా కథలో ఇది నిజమే. అవును మరి నిండు నూరేళ్లు కాకపోయినా ఇంకో ఇరవై ఐదేళ్లయినా బతకాల్సిన నేను అదాటున నలభై తొమ్మిదేళ్లకే పుటుక్కున పోయానంటే… కారణం మోహన్రావే… అంటే నా భర్తే. ఇక ఇక్కడి నుంచి నేను నా భర్త, మొగుడు, మా ఆయనా, అనను. మోహన్రావనే అంటా. అవును… నేను చనిపోయాను మోహన్రావు బతికిపోయాడు. ఒక రకంగా మోహన్రావు బతికి ఉంటానికి నన్ను చంపేసాడనుకోండి. అదిగో మళ్లీ మీరు అంటున్నారు చూడండి ఇద్దరు పిల్లలు పుట్టీ.. పెరిగి.. పెద్ద చదువులు చదివేస్కుని అమెరికాలో మంచి ఉద్యోగాలు చేస్కుంటూ లక్షలు సంపాదిస్తూ ఉన్నాక… ఇంత కాలం ఇక్కడ ఇండియాలో ఆయన వ్యాపారవూ పుంజుకున్నాక… కాపురం చేసేసాక ఇప్పుడెందుకు ఇలా చంపుతాడూ? అదీ అతగాడికి భార్యతో ఇంకా అంతవుసరం ఉన్నాక అని మీకందరికీ తెగ డౌట్లు వచ్చేస్తుండచ్చు. అయితే నేను చెప్పేది వినండి మరి…

నేను వేళ కాని వేళ… కాలం కాని కాలంలో చచ్చాను. అదీ నా పిల్లలు నా దగ్గర లేనప్పుడు… నిజంగా దేహంతో చచ్చిపోయే ముందు కూడా చాలాసార్లు చచ్చిపోయాను అది వేరే సంగతనుకోండి. నాకు చాలా చిన్నప్పుడే బహుశ పదిహేనేళ్ళకి పెళ్ళైంది నా కన్నా పదేళ్ళ పెద్దైన మోహన్రావుతో. ఒద్దు ఒద్దంటే పదో తరగతి మాన్పించి పెళ్ళి చేసేసారు. తొలి రాత్రి జరిగిన అత్యాచారం ప్రతి రాత్రి జరిగింది. ఒప్పుకోకపోతే అత్యాచారమే మీరు రేపంటారేమో బహుశా…! ఆ నొప్పుల్లోంచి కన్నీళ్ళ లోంచే ముగ్గురు పిల్లలు ఇరవై లోపు పుట్టేసారు. మగ పిల్లాడు పుట్టే దాక ఇద్దరు ఆడపిల్లల్ని కనాల్సి వచ్చింది. మధ్యలో రెండు సార్లు గర్భస్రావాలు అయిపోయాయి. రెండేళ్లకి చిన్న పాప జ్వరం వచ్చి చనిపోయింది. మా మోహన్రావుకు పూజా స్టోర్‌ ఉంది. అందులోనే ఆయుర్వేద మందుల దుకాణవూ ఉంది. పట్నంలో చాలా పెద్ద షాపని, అక్కడ దొరకని పూజ సామాగ్రి పెళ్లిలు, ఉపనయనాలు పూజలు, వ్రతాలు, నోములు ఒహటేవిటి అన్నింటికీ మోహన్రావు దుకాణమే పెట్టింది పేరు… మూలికల మందులకైతే మోహన్రావు దుకాణం చాలా ప్రసిద్ధి…. అమ్మకాల పెంపకానికి కుక్క పడ్డంత కష్టం పడేవాడు. టిఫిను చేసి వెళాÊళడంటే మధ్యాహ్నం, రాత్రి అక్కడే పంపాలి భోజన కేరీర్లు. టీలు ఫ్లాస్కులో పోసి పంపాలి. వాటితో పాటు పండ్లూ, డ్రైఫ్రూట్స్‌, పెసర మొలకలు, తాంబూలం కూడాను. సచ్చినా బయట తినడు గాక తినడు. జ్వరం వచ్చినా, నెలసరి, గర్భం`గర్భస్రావం ఏఁవీ లేదు పాక్కుంటూ, డేక్కుంటూ, వణుకుతూ, దగ్గుతూ, ఏడుస్తూ… ఎక్కిళ్లు పడుతూ, అతగాడికి వంట చేసి పెట్టాల్సిందే… వాళ్ళమ్మని కూడా ఇలానే వాళ్ళ నాన్న సతాయించేవాడుట… ఆయన తర్వాత కొడుకు తల్లినీ… నన్నూ వంటలో ఏకంగా వేపుకు తినేసే వాడు. పైగా రుచి మారటానికి వీల్లేదు. మారిందా కంచం విసిరి కొట్టటమే. ఒకసారి ఉప్పు తక్కువైందని ఏకంగా కోసుగా ఉన్న కొత్త కంచాన్ని నా మొఖాన్న విసిరి కొట్టాడు. గడ్డం మీద గాటుపడి  పెదవి చిట్లింది. రక్తం ధారలు కట్టేసింది మూడోపాప కడుపులో ఉన్నదప్పుడు. తను భయంతో ఒణికిపోతూ ఏడ్చేసింది. అత్తయ్య గారు నిర్ఘాంతపోయి ముందున గబుక్కున పసుపు అద్దేసింది… తర్వాత కొడుకు వైపు తిరిగి శివంగిలా మీద పడి చెంపలు పగలగొట్టి, వీపు మీద పిడిగుద్దులు గుద్దేసింది ‘దరిద్రుడా… ఎంతలా జాగ్రత్త పడ్డానురా మీ నాన్న పోలిక రావద్దనీ… కానీ ఆయనలాగే పశువులా మారావు కదరా ఛీ… ఇంకోసారి చేతులేసావా ఛీరేస్తాను’’ అని కొడుకుని తోసేసి తనను గబగబా డాక్టరు దగ్గర్కి లాక్కెళ్ళింది. డాక్టరు తనను చూసి ‘‘ఏమ్మా కుక్క కరిచిందా?’’ అన్నాడు ఖంగారుగా తను కాదంటూనే ఉంది పిల్లాడు విసిరిన గ్లాసు తగిలిందని చెప్తూనే ఉంది. అత్తయ్య వెంఠనే ఆపి ‘‘అవును డాక్టరు గారూ మనిషి రూపాన్న ఉన్న కుక్కే కరిచింది’’ అంది కోపంగా. డాక్టర్‌ వెంఠనే డ్రెస్సింగు మొదలెట్టేసి టీటీ ఇంజెక్షన్‌ ఇస్తూ ‘‘ఊర కుక్కూ… ఇంటి కుక్కా, ఇంటి కుక్క అయితే వాక్సీన్లు వేయించారా?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే తనే ఆపి ‘‘కాదండీ మా ఆయన కంచం విసిరాడు’ అంది. డాక్టరు నిర్ఘాంతపోతూ అత్తయ్య వైపు చూసాడా… మరి… అత్తయ్య ముఖం నిండా, మెడ మీదా, గడ్డం మీదా ఎన్ని గాట్లో మరి మామయ్య గారు ఎంతలా వేధించి ఉంటారో… అమ్మో… మరి మీరూ చూసారుగా… మగాడే అదే మొగుడెప్పుడూ ప్రతి స్త్రీ జీవితంలో విలనేనా అని మీరు తెగ ప్రశ్నలు వేసేస్తారు కదా… అంటే కొద్దో గొప్పో కొద్ది గొప్పగానో… ఇంకొద్ది కోసుగానో విలనే!… మెత్తగా నవ్వుతూనే విలనీతనం చేసే మొగుళ్ళుండరా మరి… ఉంటారు. అలాగే రక్తాలు కారేలా కొట్టే మొగుళ్ళు… వంటింట్లోనూ… పడకటింట్లోనూ ఉంటారు మరి. అలా మోహన్రావు విలనీతనానికి నేను… జగన్నాధరావు అదే మా మామయ్య గారి విలనీతనానికి మా అత్తయ్యగారూ బలైపోయాము. మామయ్య పోయినప్పుడైతే అత్తయ్య అసలు ఏడవనే లేదు. పెరట్లో పారిజాతం కొమ్మ కింద రాలిన పూలేరుతూ.. వాసన పీలుస్తూ తీరిగ్గా కూర్చుంది. నాకపుడు ఏదో అర్థం అయిపోయింది. అవును మరి చచ్చేలా కొట్టే మొగుళ్లు చనిపోతే హమ్మయ్య అనిపించదూ ఏ భార్యకైనా? ఏ మాటకామాటే చెప్పుకోవాలి సుమా… మా అత్తయ్య గారికి మామయ్య పీడ ఒదిలినందుకు నేనూ తెగ సంతోషపడ్డాను లోలోపల ఎంత పాపమని మీరనుకున్నా సరే… ఇక నేనెట్టా చచ్చానో చెబుతున్నా కదూ… మధ్య మధ్యలో ప్రశ్నలేసేసి టాపిక్‌ డైవర్ట్‌ కానివ్వబాకండి మరి… సరే… జీవితం అంతా అలానే గడిచిపోయింది కొడుకు నుంచి నన్ను కాపాడుకున్న మా అత్తయ్య కాలం చేసిన్నాడు గుండె పగిలేలా ఏడ్చాను కాదూ… నా కన్నతల్లి పోయినప్పుడెంత ఏడ్చానో అంతకంటే ఎక్కువగా… అమ్మకి నా మొఖం మీద, ఒంటి మీద దెబ్బలు చూపించి ఏడ్చినా సర్దుకుపోమ్మా అనేది, సర్ది చెప్పేది. కానీ అత్తయ్యలా.. కాదు కొడుకుని ఎగబడి ఎగబడి తన్నేది… నన్ను కొట్టకుండా కాపాడుకునేది. మామయ్యతో ఎంత భరించీ… భరించీ కొడుకుని తన్నే తెగువలోకి వచ్చి

ఉంటుందో చెప్పండి? మెల్లిగా నేనూ రాయిలా మారిపోయానండి… నిజం వంటింట్లో కుక్కర్‌లా… మిక్సీలా, ఫ్రిడ్జిలా, వాషింగ మెషీన్‌లా మారిపోయాను. మోహన్రావు దృష్టిలో నా విలువ అంతే. తల్లి నుంచి కాకండా తండ్రి నుంచే నేర్చుకున్నాడాయె మరి. మంచివాడి కంటే చెడ్డవాడిగా ఉంటం చాలా సులభం కదా… సిగ్గు పాపభీతి రెండూ వదిలేస్తే సరి. ఇక ఇదిట్లా ఉందా… పిల్లలు పెద్దగవుతున్నారు. మోహన్రావు ఏమాత్రం మారలేదు అతని భోజనం, భోగం రెండూ ప్రపంచం మునిగిపోయినా కావాల్సిందే. దానికే అతగాడు నన్ను పెళ్ళాడిరది. బహుశా అందరూ మగాళ్ళు అంతేనేమో… తనకి వంట చేసి పెట్టని… తనతో పడుకోని ఆడదాన్ని పెళ్ళి చేస్కుంటాడూ… ఒకవేళ పెళ్ళి చేస్కున్నా భరిస్తాడూ చెప్పండి కాస్త? ఆడది పుట్టిందే అందుకు… ఇక మా మోహన్రావు అలా బాగా ముదిరిపోయాడు. అతను మీట నొక్కితే ఒండిపెట్టాలి, పండి పెట్టాలి అంతే. నాకు మెదడే కాదు నోరు కూడా లేకుండా చేసేసాడు. ఎంతసేపూ నా మీద అరుస్తూ, కొడుతూ ఇంట్లో వస్తువులు విసిరేస్తూ భీభస్తం చేస్తూ అడవిలో భల్లూకంలా ఉండే నాన్నని పిల్లలు అసహ్యించుకోసాగారు. నాకెలా మోహన్రావులో మంచి భర్త కనపడలేదో వాళ్ళకి అతనిలో మంచి నాన్న కనపడ్డం మానేసాడు. పిల్లలతో కూడా ఏనాడూ మృదువుగా లేడు మరి నన్ను కొడుతున్నప్పుడు అడ్డం పడే పిల్లల్ని కూడా కొట్టేవాడు. ఇట్టా ఎలా తయారయ్యాడో ఈ మనిషి… వాళ్ళ నాన్న కానీ ఉగ్గుపాలతో కాఠిన్యపు కారం పొడి యావన్నా కలిపి ఉంటాడా… ఏమో… సరే మళ్ళా నేనెలా చనిపోయానో చెప్పాలి కదా మీకు… మీకు కథలా చెబుతున్నాగా… కథ దిశ తప్పకూడదు మరి. ఇక పిల్లలు పెద్దగైపోయారు అంతా పై చదువులకి అమెరికా వెళ్ళి పోయారు. ‘బాగా చదువుకుని నిన్ను కూడా ఆమెరికా తీస్కెళ్ళి పోతామమ్మా ఈ రాక్షసుడి దగ్గిర నువ్వుండద్దు’ అనేవారు నా కొడుకు సాగర్‌, కూతురు సాత్విక. ఇద్దరికీ నేనంటే పంచ ప్రాణాలు. నాకు కూడా వాళ్ళే ప్రపంచం. నా కొద్ది ఆనందాన్ని అమ్మా, నాన్న, అత్తయ్యా తమతో తీస్కెళ్ళిపోయాక ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకున్నా వాళ్ళేం చేసినా… ఏం సాధించినా ఆనందమే నాకు. వాళ్ళ కోసమే బతికేది. సాత్విక పెళ్ళి, పురుడూ అమ్మో ఇవన్నీ ఉన్నాయిగా బోలెడు బాధ్యతలు… కన్నతల్లి మురిసిపోతూ చేసేవి? నేను తల్లిని లేకపోతే ఎట్టా… నేను పిల్లల కోసం నిండు నూరేళ్ళు బతకాలి అదిగో గోడమీద వేలాడుతున్న మా అత్తయ్య కాదంబరి

ఫోటో ఉంది చూసారూ… పక్క ఫోటోలో ఉన్న మామయ్య వైపు కోపంగా చూస్తూన్నట్లే ఉంది కదా! అలా వేలాడకూడదు నా ఫోటో కూడాను. అత్తయ్య ఫోటో పూలదండల మధ్య మొఖం నిండా మామయ్య అమె మొఖం మీద విసిరికొట్టిన చెంబులూ తపేళాలు… గ్లాసులు, స్పూనులు… అద్దం ముక్కలూ చేసిన మచ్చల గాట్లతో… పెదాల మీది ఒకింత నీరసపు నవ్వుతో.. ముఖం మీదే ఇన్ని గాట్లుంటే చీర చుట్టేసిన ఆ సున్నితమైన ఒంటి మీదెన్ని ఉండొచ్చు అచ్చం నాకు లాగా… ఖర్మ చచ్చాక కూడా అత్తయ్య దేహాన్ని కుళ్ళ బొడిచిన మామయ్య అనే మృగం ఫొటో పక్కనే పెట్టాలా అత్తయ్య ఫోటో?… అసలు బతికుంటే అత్తయ్య దీనికి ఒప్పుకునేదా అని… ఎలా ఉన్నాడు మామయ్య ఆ ఫోటోలో క్రూరమైన మృగం మొఖమూనూ ఆయనా… అచ్చం ఆయన కొడుకు మోహన్రావు మొఖం లాగా. అదే ఇంతకీ అత్తయ్య ఫోటో గురించి ఇక్కడ ఎందుకొచ్చిందీ అంటే… నా జీవితం మీద… నేను నిండు నూరేళ్లు బతకడం మీద నా ఆశా కోరికా మీకు చెబుతున్నాను కాదూ… కానీ నా దురదృష్టం, ఈ దుఃఖమూ… ఒత్తిడీ పెరిగిపోయి నాకు మాయదారి కీళ్ల నొప్పు… బీపీ రానే వచ్చాయి. ఒక రోజు కళ్ళు తిరిగి పడిపోయాను. పిల్లలు డాక్టరు దగ్గరికి తీస్కెళ్లారు పరీక్షలూ అన్నీ చేయించారు. ఎన్నో జాగ్రత్తలు తీస్కున్నారు. ఎంతో నీరసంగా ఉండేది. కీళ్లనొప్పులకు వాడే మందుల మూలాన్న… కళ్లు తిరగడం, వికారాలతో గిలగిలాడేదాన్ని. అయినా మోహన్రావుకు అన్నీ వేళకు రుచిగా చేసి పెట్టాలి… విచిత్రమేమంటే అతనకి షుగరు వచ్చింది. ఎంత బెంగడిపోయాడో… ఖంగారు పడిపోయాడు. డాక్టరు ఇచ్చిన డైట్‌ చార్ట్‌ వంటింటి గుమ్మంలోనికి… వంటింటి లోపల పొయ్యి పక్కనా… ఫ్రిడ్జి పక్కనా అంటించాడు. ఇంక వంటింటి నిండా ఆతని ఆర్గానిక్కు పప్పులు, బియ్యమూ, చిరుధాన్యాలు, గుమ్మడి, కర్బూజా విత్తనాలు… ఆయుర్వేదం మందులే. ఇక ఫ్రిడ్జి నిండా షుగరు తగ్గించే కూరగాయలు. పొద్దున్న మధ్యాహ్నం రాత్రీ ఈయనకు షుగరు పుడ్డు వండాలి. ఎన్ని గ్రాములు వండాలో, రాసి పెడతాడు. ఎలా చేయాలి.. పదులసార్లు చెప్పి.. చెప్పి గదిమి.. గదిమి చేయిస్తాడు. ‘ఏనాడూ.. నువ్వెలా ఉన్నావు ఒంట్లో కుశాలగా ఉందా? మందులు వాడుతున్నావా… అని అడిగడు కదా…

ఈ మోహన్రావుకి షుగరు డైటు చేసి చేసీ నాకూ షుగరు వచ్చేట్లుంది. అతనికి విడి వంట… మాకూ విడి వంట చేసీ చేసీ విసుగొచ్చేది. మధ్య మధ్యలో తట్టుకోలేనంతగా కీళ్ల నొప్పులూ… వాపులతో, బీపీతో కళ్లు తిరగడాలు. సరే… ఇహ నేను… ఎలా చచ్చానో చెప్పాలి కదా… ఇహ ఇదిలా ఉందా… ప్రపంచం అంతా కరోనా మహమ్మారి కమ్మేసింది.

మృత్యువు హాహాకారం చేస్తోంది. లోకం వణికిపోతోంది. మోహన్రావుని షాపుకి వెళ్ళొద్దని భయం భయంగానే చెప్పాను. పిల్లలతో కూడా చెప్పించాను అతని షాపుకి వచ్చే జనం పోయే జనం నాకు చచ్చేంత భయంగా ఉంది. అటు దేశం కాని దేశం అమెరికాలో ఉన్న నా పిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నా. ఇటు మోహన్రావుని బతిమిలాడుకుంటూనే ఉన్నా.

పిల్లలు నాకు జాగ్రత్తలు చెబుతున్నారు. సానిటైజర్లు, మాస్కులు ఆర్డర్‌ పెట్టేసారు. వాళ్ళ నాన్నకి రోజూ చెబుతున్నారు.

‘నీ ముఖం పిల్లల్ని పాడు చేయకు ఇంత మంచి పుడ్డు తింటున్నా బోల్డెంత ఇమ్యూనిటీ ఉంది నాకేం కాదు ఊర్కే నా వెంట పడబాకు’’ మహా చిరాకు పడ్డాడు మోహన్రావు నేనో, పిల్లలో చెప్పిన ప్రతీసారి… ‘మీకు ఇమ్యూనిటీ

ఉంది… నాకు… నాకే లేదు ఇమ్యూనిటీ పైగా కీళ్ల జబ్బు… బీపీ’’… బలహీనంగానే అన్నానో లేదో ‘‘తిని ఏడువు నువ్వు కూడా ఇమ్యూనిటీ కావాలంటే… నా వెంట పడమాకు’’ రంకె వేసినట్లే అరిచాడు… ఇలా రంకెలు, రంకెలుగా మా సంభాషణ చాలా సార్లు అయ్యింది. గుమ్మం బయట గేటు దగ్గరే బకెట్టు నిండా నీళ్ళు పెట్టాను. సబ్బూ, సానిటైజరూ… టవలూ, చెప్పులూ పెడతాను. ఆ పక్కనే బాత్రూము కూడా ఉంది. స్నానం చేసే ఇంట్లోకి రమ్మంటాను…. లేదా పిల్లలూ చెప్తారు ఉహూ… వినలేదు నాకేం కాదు… వెధవ సానిటైజర్లలో నా ఆరోగ్యం పాడవుతోంది. మాస్కులతోనే ఇన్ఫెక్షన్‌ వస్తుంది అనేవాడు. కొన్నిసార్లు దుకాణంలో వాడిన మాస్కుతో నేరుగా ఇంట్లోకి వచ్చేసేవాడు. ఇల్లంతా అవే బట్టలు… చెప్పులలతో తిరిగేవాడు. స్నానం చేయకుండానే నాకేం కాదు… ‘నాకేం కాదు నేను చాలా హెల్దీ’ అంటూ తిరిగేసేవాడు. ఒద్దు ఒద్దన్నా… కంఠశోషే తప్ప ఏమీ మిగల్లేదు.

ఇంతలో కరోనాతో బంధువుల్లో ముగ్గురు పోయారు. పక్కింటి వనజాక్షి భర్త పోయాడు. నా బాల్య స్నేహితురాలు పంకజం చనిపోయింది. నాలో వణుకు పెరిగిపోయింది. ఎంతో జాగ్రత్తగా ఉన్న మనుషులు వాళ్లంతా… జనం కుప్పలు కుప్పలుగా శవాలై పోతున్నారు… మనుషులు శవాల్లా కనపడుతున్నారు.

నా కూతురు సాత్విక రోజూ ఫోన్లు చేస్తూనే ఉంది. జాగ్రత్తలు చెబుతూనే ఉంది. హైదరాబాదులో దాని ఫ్రెండ్స్‌, బంధువులు కరోనాతో ఎలా పోయిందీ… మేం ఇద్దరం ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది చెబుతూనే ఉన్నారు. కొడుకు సాగర్‌, సాత్వికైతే చెబుతూ చెబుతూ ఫోన్లోనే ఏడ్చేస్తుంది. ‘నువ్వు తప్ప ఎవరున్నారే అమ్మా… నీకేం కానిచ్చుకోకే నాన్నకు చెబుతూనే ఉన్నానే’ అంటూ భోరున ఏడ్చేస్తుంది. దాని మాటలు ముందు ఏడుపుగా మొదలై.. దుఃఖంగా బ్రద్దలై వెక్కిళ్ళలోకి మారిపోతుంటుంది సంభాషణ చివరన… నేనూ అంతే… ‘ఏం వెధవ ఏడుపు… ఇప్పుడు ఎవరు సచ్చారనీ… నాకేం కాదు… ముందా ఏడుపు ఆపు’’ మోహన్రావు రంకె వేస్తాడు… అది విన్న నా కూతురు… ‘అమ్మా స్పీకర్‌ ఆన్‌ చెయ్యి’ అని నాకు చెప్పి… ‘నాన్నా నీకేం కాదు… సరే… కానీ అమ్మకి’ ఏం కాకూడదు… నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మకి అంటించకు… నీవల్ల అమ్మకి కరోనా వచ్చిందా నేనూర్కోను ఎంత సేపు నాకేం కాదు… నాకేం కాదంటావేంటి… నువ్వొక్కడివే ఉన్నావా.. అమ్మది ప్రాణం కాదా.. అమ్మ గురించి ఆలోచించవా నువ్వు అమ్మ చెప్పినట్లు విను… షాప్‌కెళ్ళడం మానెయ్యి. డబ్బు నేను అన్నయ్య పంపిస్తున్నాంగా. ‘సాత్వికే కాదు… సాగర్‌ కూడా ఫోన్లో అరుస్తారు… నాతో స్పీకర్‌ ఆన్‌ చేయించి మరీ… పాడు పీడై పోయింది ఇంతోటి మగాణ్ణి నాకు మీరా చెప్పేది నోర్లు మూస్కోండి…’ నాకేం కాదు అంటాడు మళ్ళా మోహన్రావు. నాకు నుంచి, నన్ను కూడా కలుపుకొని మనకు అనే దానికి ఎప్పుడొస్తాడీ మోహన్రవావు… అందుకే కాదూ… నన్ను తన నుంచి విడదీసి విడి ముక్కగా పెట్టినందుకే నాకు అతగాడు భర్త, మా ఆయన, మా వారు, మొగుడు అని కాకండా ఒఠ్ఠి మోహన్రావు అయినాడు… అతనికి అర్థం కాదు కానీ.. మీకీ పాటికే అర్థం కావాలి. ‘అమ్మా నువ్వు నాన్న బెడ్రూంలో పడుకోకు… దూరాన వేరే రూంలో మా రూంలో పడుకో’ పిల్లల సలహా… కానీ అది కూడా మోహన్రావు చేతిలోనే ఉంది. ‘నాకేం కాదు… నాకేం కాదు’ అంటూనే ఉన్నాడా. ఆ కాదు… కాదు కాస్తా అయ్యి కూర్చుంది.

మోహన్రావు… ఒళ్ళు కాలే జ్వరంతో నిద్ర లేచాడో రోజు… పెద్దగా మూల్గుతూ… గుండె గుభేలుమంది అనుకున్నంతా అయ్యింది. మోహన్రావుకి కరోనా వచ్చేసింది. కరోనా కంటే కూడా భయంకరమైన మోహన్రావుకే కరోనా వచ్చేసింది. అందుకు కరోనా కూడా భయపడిపోయి ఉంటుంది. సందేహాఁవే లేదిందులో. ఇంకేం… మొఖం ఎక్కడ పెట్టుకుంటాడు? నాకేం కాదు నుంచి… ‘నాకు త్వరగా తగ్గిపోతుంది’ లోకి దిగాడు. డాక్టర్‌ ఆసుపత్రిలోనో… ఇంట్లోనో క్వారంటైన్‌ అవమన్నాడు. ఆసుపత్రిలో ఖర్చవుతుందని ఫుడ్డుకి ఇబ్బందనీ చూడండీ మోహన్రావు దుర్మార్గం? ఇంట్లోనే ఉంటాన్నాడు. ‘‘నాన్నా ఎన్ని లక్షలన్నా పంపిస్తాం ఇప్పటికీ ఐదు లక్షలు వేసాం నీ అకౌంట్‌కి చేరిపో నాన్నా… డెల్టా వేవ్‌ చాలా సీరియస్‌…. నీకూ ప్రమాదమే ఆసుపత్రిలో నీకు ఎమర్జెన్సీ కేర్‌ దొరుకుతుంది. ఇంట్లో అమ్మ కూడా సేఫ్‌గా ఉంటుంది…’’ అని పిల్లలెంత మొత్తుకున్నా… ఏడుస్తూ వేడుకున్నా వింటేగా మోహన్రావు? పిల్లలు ఒణికిపోతున్నారు. నాన్నకు దూరంగా ఉండు మాస్క్‌ వేస్కునే తిరుగు. నాన్నని గదిలోంచి బయటకు రానీకు… కరోనా పిపిఇ వేస్కొని చేతులకి గ్లౌస్‌ వేస్కొని తలుపు కొద్దిగా తెరిచి ఫుడ్డు లోపల పెట్టు నువ్వు మాత్రం లోనకు వెళ్ళకు… నువ్వు వెంఠనే టెస్ట్‌ చేస్కో, పిల్లల ఆక్రందనలు వేడుకోళ్ళ మధ్య నాలుగు రోజులు గడిచిపోయాయి… నాకెందుకో నీరసం మొదలయ్యింది. ఈ లోపల నాలుగు రోజులు అయిపోయాయని మోహన్రావు ఒక రోజు దెయ్యంలా అదాటున బెడ్రూంలోంచి బయటకు వచ్చేసి కళ్ళు కళ్ళున దగ్గుతూ ఎర్రెర్రటి కళ్లు నులుముకుంటూ ఇంట్లో తిరగసాగాడు, దుర్మార్గుడు. నేను షాకయ్యాను ‘లోనికెళ్ళండి’ అని అరిచాను. వెంటనే పీపీయి వేసేసుకున్నాను. ‘ఏం కాదు తగ్గిపోయింది… నాకు గాలి కావాలి సచ్చిపోతున్నా ఎంత కాలం

ఉండాలీ ఇట్టా అయినా కరోనా లక్షణాలు నీకు ఒక్కటీ లేవుగా ఎందుకు ఖంగారు… చూడు నాకేవైనా అయ్యిందీ? నీకూ కాదు అంతే…’ అంటూ నిర్లక్ష్యంగా ఇంట్లో తోటలో తిరగసాగాడు దగ్గుతూనే. నేను వెంఠనే పిల్లలిద్దర్కీ వీడియో కాల్‌ చేసి చూపించాను. ఇద్దరూ ఆగ్రహంతో ఒణికిపోయి అరవసాగారు మోహన్రావు వింటేగా… ‘నాన్నా నువ్వు మనిషివేనా… నేరం చేస్తున్నావు… అమ్మకేమన్నా అవుతుంది ఏ లక్షణాలూ లేకుండా కూడా కరోనా వస్తుంది. అమ్మ గురించి ఆలోచించు ప్లీజ్‌ నాన్నా, దండం పెడతాను. ట్రావెల్‌ బాన్‌ ఉంది. లేకపోతే మేం వచ్చేవాళ్ళం. మొన్నే మా ఫ్రెండ్‌ వాళ్ళమ్మ ఏ లక్షణమూ లేకుండానే కరోనాతో చనిపోయింది… నాన్నా ప్లీస్‌… ప్లీస్‌… అమ్మ… అమ్మ… గురించి ఆలోచించు. నువ్వు గట్టెక్కితే కాదు నాన్న క్వారంటైన్‌ కాకుండా ఇల్లంతా కరోనా వైరస్‌తో నింపేసావు. ఇప్పుడు క్వారంటైన్‌ పూర్తి రోజులు కాకుండానే.. టెస్ట్‌ నెగటివ్‌ రాకుండానే ఇంట్లో తిరిగేస్తున్నావు. నీకెవరిచ్చారు ఈ హక్కు… అమ్మకీపాటికీ కరోనా వచ్చే ఉంటుంది. నాన్నా అమ్మకేమైనా అయితే నీ ముఖం చూడం… ఇంటికే రాము… నాన్నా…. అమ్మ… అమ్మ నాన్న… అమ్మ, పిల్లల ఏడ్పులు ఆక్రందనలు నిస్సహాయపు వేడుకోళ్ళు ఆగ్రహ ప్రకటనల మధ్య… మోహన్రావు నిశ్చింతగా తనకు తగ్గిందని తిరుగుతున్నాడు. నేను ఏడ్చా… చేతులు జోడిరచా… నా పిల్లల కోసవు నేను బతికి తీరాలన్నా… ఏడ్చా… చాలా ఏడ్చా… ఉహూ… మోహన్రావు వినలే. నేను పెరట్లోనే అతగాడ్ని తప్పించుకుంటూ తప్పించుకుంటూ బతకసాగాను. చెట్లకింద… షెడ్డులో మంచం వేస్కొని ఖంగారు… ఖంగారుగా వంట చేసేసి పెరట్లో కొచ్చేయడమే ఏం చేస్తా ఇక… ఇంట్లో నిలువెల్లా పీపీఇ వేస్కుని, భయం భయంగా తప్పించుకు తిరుగుతున్న నన్ను చూస్తూ ‘‘ఒఠ్ఠి పిరిగ్గొడ్డు’’ అని వెటకారంగా నవ్వుతాడు. దుర్మార్గుడు వినడు… ‘‘అమ్మా నవ్వు ఇల్లొదిలి వెళ్ళిపో… ఎక్కడికైనా పిన్ని వాళ్ళింటికో… మామయ్య ఇంటికో…’’ కొడుకు సాగర్‌. ఎట్టా రానిస్తారురా వాళ్ళైనా… మనింట్లో కరోనా వచ్చాక వెళ్ళటం కూడా అన్యాయం రా… మీ నాన్న చేస్తున్న పాపం నేను చేయలేనురా… మొన్న మీ మామయ్య కూడా చెప్పి చూసాడు. నాకు ఫుడ్డుకి కష్టం అన్నాట్ట’ నిస్సహాయంగా నేను. ఎక్కడికి వెళ్ళాలి? హాస్టల్‌కి వెళితే… నాకు కరోనా వచ్చిందేమో ఒక్క లక్షణం లేదు ఎందుకు టెస్టు అన్నాడు నిన్న… ఉన్నట్లుండి విరోచనాలు మొదలయ్యాయి. ఆ నీరసంలోనే మోహన్రావుకు వంట… టీలు… కషాయాలు సేవ… ‘అమ్మా ఫో… వెంఠనే టెస్ట్‌ చేయించుకో విరోచనాలు కూడా కరోనా లక్షణం అమ్మా ఇప్పుడు. అయినా నాన్నకొచ్చినట్లు ఎందుకు దాచాలి? నాన్నకి మందులు ఫోన్‌లో చెప్పిన బాబాయి గవర్నమెంట్‌ వాళ్ళకి చెప్పకుండా ఉంటాడా… అమ్మా వెళ్ళు చేయించుకో…

ఉండు నేను అరేంజ్‌ చేస్తా ఏంటమ్మా ఆయాస పడ్తున్నావు ఎందుకమ్మ ఊపిరాడట్లేదా నీకసలే బీపీ… అయ్యో అమ్మా వెళ్ళిపో…’ పిల్లలు పిల్లలు… నిస్సహాయంగా… ‘రోజుకి ముప్పై వేలట… వద్దు అమ్మకేం కాలేదు విరోచనాలే అవే తగ్గుతాయి. ఆయుర్వేదం మందు ఇస్తున్నా… ఒక్క రోజుకి ముప్పై వేలు పోసే ఆస్థిపరుణ్ణి కాదు. ఏంటీ నువ్వు పంపిన డబ్బు దాని మీద ఖర్చు చేయనా? అంత సీరియస్‌ కాదురా మీ అమ్మ… ఏవో కొన్ని విరోచనాలు మాత్రమే… అయినా మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే నాకు ఫుడ్డు ఎవరు చేసి పెడతారు… నా గురించేవన్నా ఆలోచన ఉందిట రా మీకూ? కొడుకు సాగర్‌తో ఎప్పుడూ ఇదే వాదన మోహన్రావుది.

విరోచనాలు ఎక్కువైనాయి… నీరసమూ ఎక్కువై పోయింది. అతగాడికి వంటా చేయలేకపోతున్నా… ఇది కాకండా ఒకనాటి రాత్రి ఈ నీచుడు మోహన్రావు ఏం చేసాడో తెలుసా మీకు?… చెప్పడానికే సిగ్గూ అసహ్యమూ వేస్తున్నాయి… ఒక రోజు రాత్రి నా మీద పడ్డాడు. ఒద్దు ఒద్దన్నా వినలేదు తోసేసినా ఉడుం పట్టు పట్టాడు… ‘ఏం కాదు… నేను బాగానే ఉన్నాను. నాకు కరోనా తగ్గిపోయింది… ఏం కాదు… రొప్పుతూ అంటున్నాడు మోహన్రావు. ‘ఒరె… ఒరే… నీచుడా… మోహన్రావూ… ఏం కానిది నీకురా నాకు కాదు… విరోచనాలతో… కీళ్లనొప్పులతో  సచ్చిపోతున్నారా తిండి పోవట్లేదు. ఒంట్లో నీరంతా పోతోంది… నీకు చేసి చేసి వంట్లో శక్తి నశించింది… అంతా అయ్యేది… నాకురా… నాశనం అయ్యేది నేనురా… ఎలా చెప్పినా… విన్నాడా మోహన్రావు ఊఁహు! తన పని కానిచ్చేసుకుని గదికి వెళ్ళిపోయాడు. నా మానాన్న నేను నిండా కప్పేస్కొని పిల్లల గదిలో పడుకుంటే… పిల్లల గది గొళ్ళం పెట్టేసుకోమన్నారు. ఆ వేళ ఎందుకో మరిచా… రోజూ రాత్రి తలుపు కొడతాడు అసహ్యంగా… నేను తీస్తేనా? తలుపు తన్నేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు నా ఖర్మకు వచ్చింది నీరసంలో గొళ్ళం మరిచా… అంతే భల్లూకంలా మీద పడ్డాడు. వాడికి నీర్శం ఎక్కడిదీ… ఎంత బలమో నేను పెట్టిన పత్యపు తిండి, పండ్లు, పాలు, తినీ తినీ తాగి తాగీ కరోనాలో కూడా బలుపూ, శక్తీ తగ్గలే… నా మీద పడితే బల్లలా చితికి పోయా… అతని కింద నీరంతా పోయి ఎండిన దేహమాయె నాది… పిల్లలకెలా చెప్పును ఈ పీడ… వాళ్ల రోగిష్టి తల్లి మీద వాళ్ల తండ్రి చేసిన నీచ అత్యాచారం గురించీ…?

అంతే తెల్లారి బాగా ఆయాసం వచ్చిందా… విరుచుకుపడిపోయా… పిల్లలతో మాట్లాడుతూనే వీడియో కాల్లో… ఇక తర్వాత ఒక ఆసుపత్రి కారిడార్‌లో స్ట్రెచర్‌ మీద తేలా… ఆక్సిజన్‌ పెట్టారు నాకు… ‘ఏవైంది ఏవైందీ…’ నర్సుని అడిగా… ‘కరోనా… కరోనా పాజిటివ్‌’ అంది. నిండా పీపీఇ లాంటి ముసుగులో ఉన్న నర్సు. దేవతలా కనిపించింది. నిర్ఘాంతపోయా… జ్వరం లేదు, దగ్గు లేదు… నీర్సం, విరోచనాలు తప్ప అంటూనే ఉన్నారు కాదూ పిల్లలు? విరోచనాలు కూడా కరోనా లక్షణం అనే… టెస్టు చేయించుకోమనే? ఈ మోహన్రావు నాకంటించేసాడు… భళ్ళుభళ్ళున దగ్గుతూ… ఇల్లంతా పిశాచంలా తిరుగుతూ… మృగంలా నా మీద పడి కోరిక తీర్చుకున్న మోహన్రావు వికృతంగా కళ్ళముందు ప్రత్యక్షమయ్యాడు. విపరీతమైన ఆగ్రహం వచ్చింది. పిల్లలు గుర్తుకు వచ్చారు దుఃఖం వచ్చేసింది. ‘అమ్మా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి మా కోసం.. మనమలు, మనమరాళ్ళను చూడాలి. నిన్ను బాగా చూస్కుంటాం అమ్మా… కష్టాలన్నీ తీరతాయే కరోనా అంటించుకోకు… నాన్నను దూరంగా ఉంచు ఎటన్నా పారిపో లేడీస్‌ హాస్టల్‌కి వెళ్ళు ప్రామిస్‌ చేయమ్మా నువ్వు బాగుంటానని… సముద్రాల కవతల

ఉన్నాం ఏం చేయగలం.. రాలేము అమ్మా… అమ్మా… పిల్లలకు నేను బతికే

ఉంటానని చేసిన ఒట్టు పూర్తిగా పోయింది. నాకు కరోనా వచ్చేసింది… బతుకుతానా తెగ రొప్పుతున్నా… పిల్లలు రాత్రంతా సిటీ జల్లెడ పట్టి ఈ ఆసుపత్రిలో పడక ఇప్పించారు. అదీ బయట కారిడార్‌లో ఓ గంట అయ్యాక ఐసీయూలో వేస్తారట… దుఃఖంలో ఇంకా ఆయాసం ఎక్కువ అవుతోంది. చచ్చిపోతానేమో… నా పిల్లలు… ముఖ్యం సాత్విక దానికి ఈ ఏడాది పెళ్ళి చేయాలనుకున్నా… సంబంధాలు చూస్తుండగానే ఎవర్నో ప్రేమించానని చెప్పింది. అబ్బాయి వాళ్ళింట్లో ఓకే అన్నారట… ఈ మోహన్రావే ఒప్పుకోవటంలా… ఆయనకి తన కులంలోనే కావాల్ట అల్లుడు. నేనూ… సాగర్‌ ఎస్‌ చెప్పేసాం… మోహన్రావే ముందుకు పోనివ్వట్లా… సరే… పోతానా నేను? నా ఫోటో అత్తయ్య ఫోటోలోలా ముఖం మీద మోహన్రావు విసిరిన టంబ్లర్‌ గాట్లతో సహా గోడమీదకి ఎక్కుతుందా… నా తర్వాత మోహన్రావు చచ్చాక.. చచ్చాక నా ఫోటోకి మాలేసి, బొట్లెట్టి అతని ఫోటో పక్కన పెడతారు గావాల్న… ఒద్దని చెప్పాలి. విడిగా వేరే ఎక్కడైనా పెట్టమని చెప్పాలి. చచ్చాక అయినా… అతగాడి పక్కన ఎందుకూ? దీపాలు పెడతాడు కామోసు… ససేమిరా ఒద్దనాలి. వాట్సప్‌ డీపీలో నా ఫోటో పెట్టుకుంటాడు. అదీ వద్దనాలి. ఇంకా నేను పోయాక నా దహన సంస్కారాలు మోహన్రావు వూర్లో కాకండా సిటీలోనే చేయమనాలి అతని ఊర్లో నేను బతికున్నంత కాలమూ ఎన్నో అవమానాలకి గురైన అతని ఊర్లో జరగడానికి వీల్లేదు బతుకెలాగూ గౌరవప్రదంగా బతకలేరు. చచ్చాకైనా నా శవాన్ని నేనే గౌరవించుకుంటా… అది పిల్లలకు వాట్సప్పులో ఎప్పుడో పెట్టేసా. ఏంటమ్మా ఈ రాతలు? అని పిల్లలు ఏడ్చేసారు కూడాను. ఇక చదవండి ముందు ముందు నేనెలా పోయానో… చుట్టూ ఇరవై ముప్పై సంఖ్యల్లో కరోనా పేషంట్లు దగ్గుతూ… మూల్గుతూ… ఏడుస్తూ పిల్లల్ని కలవరిస్తూ… నా వెన్నులో భయం… నన్ను ఐసీయులోనే ఉంచారు… చనిపోయిన ఇంకోర్ని తీస్కెళ్ళి పోతున్నారు… సిటీ అవతల సామూహిక ఖననాలు… దహనాలు… చేస్తున్నారట. కొంతమందిని ఎలక్ర్రిటక్‌ షాక్‌ పద్ధతిలో కాల్చేసి బూడిద కుటుంబ సభ్యులకు ఇస్తున్నారట… గుండెలు అవిసిపోతున్నాయి. నా ఆక్సిజన్‌ లెవల్స్‌ మరీ దారుణంగా అరవై ఐదుకి పడిపోయింది. కరోనా వల్ల నా ఊపిరితిత్తులు పాడైనాయి, ఇంట్లోనే. అందుకే అంత ఆయాసం… పిల్లలు అడుగుతూనే ఉన్నారు ‘ఎందుకమ్మా అంత ఆయాస పడ్తున్నావు’ అని. మోహన్రావుకి వచ్చినప్పుడే నాకు వచ్చి ఉంటుంది కానీ లక్షణాలు త్వరగా బయటపడలేదు. విరోచనాలు, నీరసమూ తప్ప… నిండా పీపీయి ముసుగుల్లో నర్సులు వస్తున్నారు. ట్రీట్మెంటు ఇస్తున్నారు… నిలువెల్లా తమని ముంచెత్తిన పీపీయి ముసుగుల్లో, చమట నీటి ధారల్లా చేతుల్లోంచి బయటకు కారుతున్నా… కోపం, దుఃఖం, అభద్రత భయం లాంటి అన్ని భావాల్ని నిగ్రహించుకుంటూ దేవతల్లా ట్రీట్మెంటు ఇస్తున్నారు. రెండు చేతులూ ఎత్తి ఆ దేవతలకు నాలాగే చాలా మంది దండం పెడ్తున్నారు. రెండో రోజు నా చేతికి ఫోన్‌ ఇచ్చారు…. నా పిల్లలు మాట్లాడారు… జాగ్రత్తలు… దుఃఖాలు దిగమింగుకోడాలు… భయాలు దాచి పెట్టుకోవడాలు.. భగవంతుణ్ణి ప్రార్థించడాలు… ఇంతే… ఇంకేముంది మాటరాక వేళ్ల సైగలతో మాట్లాడడాలు… కళ్ళతోనే పలకరింపులు ‘అమ్మా… ధైర్యంగా ఉండు నేను తీస్కెళ్ళిపోతా నిన్ను… మా దగ్గరే ఉందువు’ సాగర్‌ ఏడుస్తున్నాడు… నీర్శంగా నవ్వాను… వాడొచ్చే లోపల నేనుంటానా… అదిగో వాళ్ళతో కళ్ళతో మాట్లాడుతూనే ఉన్నానా… నా ఎదురుగా కరోనాతో చనిపోయిన యాభై ఏళ్ళ ఆడమనిషి శవాన్ని తీస్కెళుతున్నారు… ‘ఏంటమ్మా ఆ గొడవ… మమ్మల్ని చూడమ్మా’ అంటున్నారు పిల్లలు… నేనూ ఇలానే దిక్కు లేకుండా పోతానా… మోహన్రావు వీడియో కాల్లోకి వస్తే మొఖం తిప్పుకున్నా. అర్థం చేసుకున్న పిల్లలు కట్‌ చేసేసారు. నేనెలా చచ్చిపోయానో చెప్పే క్షణాలు వచ్చేసాయి.

…. మరునాడు నర్సు వచ్చి తినిపిస్తోంది… ‘కొద్దిగా ఫర్వాలేదు ఆక్సిజన్‌ సాట్యురేషన్‌ రేటు పెరిగింది నీ పిల్లలు అదృష్టవంతులు’ అంటోంది నర్సు చిన్నగా నవ్వుతూ. సంతోషంతో నా హృదయం ఎగిసి పడిరది…. హమ్మయ్య ఇక ఈ మోహన్రావు దగ్గర ఉండను గాక ఉండను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను… చక్కగా.. పాడైన నా ఆరోగ్యం బాగు చేసుకుంటాను. ఈ మోహన్రావు పర్మిషన్‌ ఎవరికి కావాల్ట? సాత్విక ప్రేమించిన అబ్బాయికిచ్చి పెళ్ళి చేసేస్తాను. మనుమలు, మనుమరాళ్ళతో సంతోషంగా ఆడుకుంటాను… కలలు కలలు ఒక్కసారి రంగు రంగుల పూల తోటలా నా ముందు ప్రత్యక్షమయ్యాయి… వెంఠనే పిల్లలకు వీడియో కాల్‌ చేసాను. సంతోషంగా నర్సు చెప్పిన విషయం చెప్పాను. పిల్లల ముఖాలు ఆనందంగా వికసించిపోయాయి. అమ్మా అంటూ గాల్లోకి ముద్దులు విసిరింది సాత్విక.

ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. కళ్ళు తెరిచి బతుకున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాను. రాత్రి ఎంత శుభవార్త చెప్పింది, నర్సు? వాళ్ళకే ఆశ్చర్యం నా ఊపిరితిత్తులు అరవై శాతం డామేజీ అయినా నేను కోలుకోవటం ఒక అద్భుతం అంటున్నారు డాక్టర్లు. నేను మళ్ళీ పిల్లల కలల్లో మునిగిపోయాను. చుట్టూ మృత్యుభయంతో నాలాగే ఉన్న చాలా మందిలో కొంత మంది చనిపోయి మాయం అవుతున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు. ఒక్కరూ బతకడం లేరు… నేను కోలుకుంటున్నట్లు చెప్పారు డాక్టర్లు. పిల్లలు డాక్టర్లతో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆ రాత్రి నాకు మళ్ళీ ఊపిరాడలేదు… ఏవో ఇంజక్షన్లు ఇస్తున్నారు… ఆక్సిజన్‌ పెట్టారు… అయినా ఆయాసం చాలా ఎక్కువైంది. నాకేదో అర్థం అవుతుంది. బాగైంది అని చెప్పిన శివలక్ష్మీ ఆ ఉదయమే చనిపోయింది. నాకూ అలానే చెప్పారు. కళ్ళు బైర్లు కమ్మాయి. ఊపిరాగుతున్నది. గుండెల్లో నొప్పొస్తోంది. కళ్ల ముందు సాగర్‌… సాత్వికలు కనిపిస్తున్నారు. వద్దు నేను బతకాలి… నర్సులు నన్ను ఎమర్జెన్సీకి హుఠాహుఠిన తీస్కెళుతున్నారు… నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నాను. లీలగా ఖాళీ అయిన శివలక్ష్మి బెడ్‌ నన్ను చూసి వింతగా నవ్వినట్లు కన్పించింది. బతికితే ముందు ఇంటికెళ్ళి మోహన్రావుని చంపేస్తాను?

` ` `

నన్ను ఆసుపత్రిలో చేర్పించమని పిల్లలు ఏడుస్తూ అడిగితే రోజూ ముప్పై వేలు పెట్టాలా వద్దన్నాడు.. తనకి ఫుడ్డుకి కష్టం అవుతుందన్నాడు ఈ నీచుడు! నేను బతుకుంటానా… ఏమో… బతుకుతానేమో?

కానీ నేను చనిపోయాను. ఎమర్జెన్సీలో శతధా ప్రయత్నించారు… నేను బతకలేదు.

నా దహన సంస్కారాలు అమెరికా నుంచి వీడియోలో చూస్తున్న నా పిల్లలు ఘోరంగా ఏడుస్తున్నారు… సాత్విక స్పృహ తప్పింది. సాగర్‌ దుఃఖంతో లుంగలు చుట్టుకుపోతున్నాడు. నా అస్థికలో… బూడిదో నా అన్నయ్యకి అప్పచెప్పారు. వాడు దాన్ని లాకర్‌లో పెట్టాడు. కరోనా తగ్గాక నా కొడుకు కాశీలో కలపాలి వాటిని! పిల్లలిద్దరూ తండ్రి నంబరు బ్లాక్‌ చేసారు. మాట్లాడరు అమ్మను నువ్వే చంపావని నువ్వొక హంతకుడివి అని, నిన్ను క్షమించలేమని ఒక మంచి తండ్రిగా… భర్తగా కూడా కాదు అసలు మనిషిగానే పనికి రావని మెసేజ్‌ పెట్టి బ్లాక్‌ చేసారు.

సంవత్సరం అయ్యాక సాగర్‌, సాత్విక నేరుగా మామయ్యతో వెళ్ళి నా అస్థికల్ని కాశీలో కలిపి వచ్చారు. ఈ తతంగం అంతా పూర్తయ్యేప్పటికి పిల్లలిద్దరూ ఎన్ని కన్నీళ్ళు కార్చారో కాశీలో ఉన్న నీళ్ళల్లో కలిసే కంటే ముందే వాళ్ళ కన్నీళ్ళలోనే నా అస్థికలు తడిసిపోయాయి. వాళ్ళు మోహన్రావుని కలవలేదు. వాళ్ళు నేరుగా మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. సంవత్సరీకం అక్కడే చేసారు. అద్గదీ.. అలా చనిపోయా నేను మోహన్రావప్పుడే నా ఫోటోకి దండేసేసాడు.. నా ఫోటో వాట్సాపు డీ.పీగా పెట్టేసుకున్నాడు సానుభూతి కోసం… కానీ నిజం తెలిసిన వాళ్ళు ఊంచుతున్నారు మోహన్రావు మీద. నేనే కాదు చాలా మంది భార్యలు ఇలా కరోనా వచ్చిన మొగుళ్ళ వలన చనిపోయారు. భార్యలకి హెచ్‌.ఐ.వీ. అంటించి చంపిన భర్తలు తెలుసు…

అది చాలా కామన్‌ కదా ఈ సమాజం దృష్టిలో. కానీ ఈ హెచ్‌ఐవీ చావులకి, హత్యలకి లెక్కలున్నాయి… శిక్షలు లేనట్లే. కరోనా చావులకు ఈ లెక్క లేదంతే… అంటు రోగం అంతే… అలానే చచ్చింది అతని భార్య అంటారే గానీ… మోహన్రావు లాగా కరోనా తగ్గకుండానే… క్వారంటైన్‌ కాకుండానే ఇల్లంతా ఖళ్ళు ఖళ్ళున దగ్గేస్తూ వైరస్‌ గాల్లోకి నా ఊపిర్లోకి వదిలేస్తూ నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా మితిమీరిన అహంకారఁవూ.. బలుపుతో అంటించడం మూలాన్న చనిపోయానంటే ఎవరైనా నమ్ముతారా. మీరే చెప్పండి? నా బిడ్డ స్నేహితురాలు తండ్రికి కరోనా వస్తే మేడెక్కి అక్కడే గదిలో తగ్గేదాకా రెండు వారాలున్నాట్ట. ఇద్దరాడ పిల్లల తండ్రి భార్యకు అంటకూడదని ఎంతో బాధ్యతగా జాగ్రత్తలు తీసుకున్నాట్ట. వీడు… ఈ మోహన్రావూ ఉన్నాడు ఎందుకూ… మీరే చెప్పండి… నేనన్యాయంగా చచ్చిపోయాను కదూ… చంపేసాడు కదూ మోహన్రావు? కొద్దిగా జాగ్రత్త తీస్కుని ఉంటే… నేను బతికే దాన్ని కదూ… మీరే చెప్పండి.. నాకెన్ని కలలున్నాయండీ… నా పిల్లలేం కావాలండీ… ఈ మోహన్రావేంటండీ నన్నిట్లా చంపేసాడేంటండీ… ఈ మోహన్రావున్నాడు చూడండీ…

Leave a Reply