భారతదేశంలో బూర్జువా ప్రజాస్వామ్యం తన ముసుగును పూర్తిగా తొలగించుకుని, నిరంకుశ ఫాసిస్టు నగ్న స్వరూపాన్ని ప్రదర్శిస్తున్న వేళ, పీడిత ప్రజల ప్రాథమిక హక్కులపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులను మనం నిశితంగా గమనించాల్సి ఉంది. ఓటు హక్కు అనేది పాలకులు పైన కూర్చుని ఉచితంగా ప్రసాదించిన దయాభిక్షో లేక ఐదేళ్లకు ఒకసారి బూర్జువా రాజకీయ పక్షాలు విసిరే కాగితపు ముక్కో కాదు. అది శతాబ్దాల పాటు సామ్రాజ్యవాదానికి, దోపిడీ భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా యావత్ భారత పీడిత ప్రజానీకం, శ్రామిక వర్గం రక్తం చిందించి, సుదీర్ఘంగా పోరాడి సాధించుకున్న హక్కు. మన రాజ్యాంగ పీఠిక ఆశించిన ‘సార్వత్రిక వయోజన ఓటు హక్కు’ యొక్క మూల ఉద్దేశం – సమాజంలో చిట్టచివరి పేదవాడికి కూడా రాజకీయ సమానత్వాన్ని కల్పించడం ద్వారా వారి గొంతును చట్టసభల్లో వినిపించడం. కానీ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్రోనీ క్యాపిటలిస్ట్-ఫాసిస్టు ప్రభుత్వం తమ అప్రతిహత అధికార విస్తరణ కోసం ఇప్పుడు సామాన్యుడి ప్రాథమిక ఉనికిపైనే దాడికి దిగుతూ, ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) అనే నయా ఉదారవాద కార్పొరేట్ ముసుగులో ఒక భయంకరమైన వర్గ విద్రోహానికి తెరలేపింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి పారదర్శకత లేకుండా శ్రమజీవుల, దళితుల, మైనారిటీల, ఆదివాసీల ఓట్లను ‘ఎలుకలు తిన్నట్లు’ ఏరిపారేస్తూ, తమకు అనుకూలమైన శక్తుల దొంగ ఓట్లను కృత్రిమంగా దట్టించడం ఈ పాలకుల ఏకైక వ్యూహంగా మారగా, ఈ నిరంకుశత్వానికి మన సర్వోన్నత ఎన్నికల సంఘం ఒక వినయపూర్వకమైన ఉపకరణంగా మారి పాలకుల పల్లకీ మోయడం వల్లే ఈ ప్రక్రియ కాస్తా నేడు ఓట్ల ప్రక్షాళన నుండి ప్రతిపక్ష ఓట్లను నిశ్శబ్దంగా నిర్మూలించే ఒక భయంకరమైన ‘డాక్యుమెంటరీ టెర్రరిజం’గా రూపాంతరం చెందింది.

ఈ సాంకేతిక టెర్రరిజం ఏ స్థాయిలో ఉందంటే, సాధారణంగా ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం ఒక సాధారణ ముసాయిదా పద్ధతిలో ఓటర్లను సరిచూసే సాంప్రదాయాన్ని పక్కనబెట్టి ఎన్నికలు రాగానే పాలకులకు ఓటర్ల జాబితాపై లేనిపోని ప్రేమ పుట్టుకొచ్చేలా చేస్తోంది. దీని ఫలితంగానే మరింత పకడ్బందీగా ఇళ్లల్లోకి దూరి ‘SIR’ పేరిట ముమ్మర వేట ప్రారంభిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని విపక్ష గ్రామాలు, బస్తీలు లేదా నిర్దిష్ట సామాజిక వర్గాలను అత్యంత చాకచక్యంగా ఐడెంటిఫై చేసి, వారి ఓట్లను గాలికొదిలేస్తూ, ఒక వ్యక్తి ఓటరా కాదా అని నిరూపించాల్సిన భారాన్ని పాలకులే తిరిగి సామాన్య పౌరుడిపైకి నెడుతూ భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు.వలస కార్మికులు, దినసరి కూలీలు కడుపు నింపుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్లిన సమయాన్ని చూసి, వారు ఇంట్లో లేరనే అత్యంత హాస్యాస్పదమైన నెపంతో ఓట్లను నిష్కారణంగా తొలగిస్తూ, వాడు అసలు దేశ పౌరుడే కాదనే ముద్ర వేస్తున్నారు. ఇలా క్షేత్ర స్థాయిలో పనిచేసే బూత్ లెవెల్ (BLO )అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి, తమకు అనుకూలంగా ఉండే దొంగ ఓటర్లను నకిలీ చిరునామాలతో అదే జాబితాలో దట్టించి ఎన్నికల ఫలితాలను ముందే ఫిక్స్ చేసేందుకు ఈ ‘SIR’ ప్రక్రియను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుండటం వల్లే, నేడు ఓటు హక్కు నిరూపణ కోసం తాతలు, ముత్తాతల కాలం నాటి పాత సర్టిఫికెట్లు చూపించాలంటూ అధికారులు జారీ చేస్తున్న అనాగరిక నిబంధనలు సమాజం ముందు వెలుగుచూస్తున్నాయి.

ఈ సర్టిఫికెట్ల వేధింపుల వెనుక ఉన్న పాలకుల మేధావితనాన్ని గమనిస్తే, భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో లేదా అణగారిన వర్గాల్లో దశాబ్దాల క్రితం, పుట్టిన తేదీలను నమోదు చేసే, కనీస వ్యవస్థలే లేవనే ప్రాథమిక జ్ఞానం కూడా ఈ పాలకులకు లేనట్లు నటిస్తున్నారు. అప్పట్లో భూస్వామ్య వ్యవస్థల దోపిడీ కారణంగా నెలకొన్న నిరక్షరాస్యత వల్ల ఉన్న పాత రికార్డుల్లోనూ పేర్లు, పుట్టిన తేదీలు తప్పు తప్పుగా నమోదయ్యాయనే నిజాన్ని దాచిపెట్టి, ఒకవేళ తాత ముత్తాతల కాలం నాటి ఆధారాలు లేకపోతే మనవడి ఓటు హక్కును రద్దు చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్య న్యాయమో పాలకులే సమాధానం చెప్పాలి. ఈ దోషాలను సరిదిద్దే మార్గం చూపించ కుండా సామాన్యులను గందరంగోళంలోకి నెట్టి, వారి రాజకీయ ఉనికిని నిలువునా తుడిచిపెట్టడమే అంతిమ లక్ష్యంగా సాగుతున్న ఈ కుట్రలోనే, ఓటరు అనుమతి లేకుండానే వ్యక్తిగత డేటాను అపహరించి సాగిస్తున్న ‘ప్రీ-ప్రింటెడ్ ఫామ్‌-7’ లాంటి భయంకరమైన సాక్ష్యాలు బయట పడుతున్నాయి. సాధారణంగా ఒక ఓటును తొలగించాలంటూ ఫామ్‌-7 సమర్పించే వ్యక్తి క్షేత్రస్థాయి ఆధారాలను స్వయంగా చేతితో రాసి ఇవ్వాల్సి ఉండగా, తెలంగాణలోని ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్ నియోజకవర్గాలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలలో ఓటర్ల ప్రమేయం లేకుండానే, అధికార పార్టీ కార్యాలయాల్లోనే కంప్యూటర్ల ద్వారా పూర్తి వివరాలను ప్రీ -ప్రింట్ చేసి సిద్ధం చేసిన వేలాది దొంగ ఫారాలను బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా సమర్పించి అక్రమంగా ఓట్లు తొలగిస్తుండటం, ఈ డిజిటల్ విద్రోహానికి తోడు ఎన్నికల సంఘం పౌరుల వ్యక్తిగత ‘EPIC’ డేటాబేస్‌ను ప్రైవేట్ టెక్నాలజీ కార్పొరేట్ సంస్థలకు లీక్ చేసి ఓటర్ల ప్రొఫైలింగ్ నిర్వహించడం చూస్తుంటే, ఈ మొత్తం దోపిడీ వెనుక ఎంతటి వ్యవస్థీకృత అధికారిక హస్తం ఉందో స్పష్టమవడమే కాకుండా, దీనికి బలం చేకూరుస్తూ ఈరోజు బయటపడుతున్న దేశవ్యాప్త అధికారిక లెక్కలు మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా గణాంకాలనే మనం నిశితంగా పరిశీలిస్తే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఏకంగా 73,39,334 ఓటర్ల పేర్లను జాబితా నుండి నిష్కారణంగా తొలగించి, దాదాపు 21.70% ఓట్లను నిలువునా ఊడ్చేశారు. ఇందులో అత్యధికంగా తొలగించబడిన ఓట్లలో సగానికి పైగా కేవలం మహిళల ఓట్లే కావడం పాలకుల మహిళా సెంటిమెంట్ వెనుక ఉన్న అసలు రంగును బయట పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 32.78% మంది పౌరుల ఓట్లను గాలికొదిలేయడం, పశ్చిమ బెంగాల్‌ లో 1.31 కోట్ల మంది ఓటర్లను ‘doubtful’గా మార్క్ చేసి గందరంగోళం సృష్టించడం, అంతకంటే దారుణంగా ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకంగా 2 కోట్లకు పైగా ఓట్లను నిలువునా మాయం చేయడం చూస్తుంటే ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, పద్ధతి ప్రకారం జరిగిన ఓట్ల దోపిడీ అని అర్థమవుతోంది. బీహార్ రాష్ట్రంలోనూ సుమారు 65 లక్షల మంది ఓటర్లను ఈ ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ (SIR) లో భాగంగా జాబితా నుండి తొలగించడమే కాకుండా, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే ‘డీ-డూప్లికేషన్ సాఫ్ట్‌వేర్’ను ఉద్దేశపూర్వకంగా వాడకుండా నిలిపివేసి, అక్కడ అధికార పార్టీకి అనుకూలంగా 14.35 లక్షల నకిలీ దొంగ ఓట్లను దట్టించడం, మరోవైపు దండకారణ్య పరీవాహక ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో కార్పొరేట్ శక్తులకు భూములను ధారాదత్తం చేయడానికి అడ్డుపడు తున్న ఆదివాసీల ఓట్లను అపహరించి బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘోరాలన్నీ రాజ్యాంగబద్ధమైన సంస్థల గొంతును చట్టాల ముసుగులో నిలువునా నొక్కడం వల్లే సాధ్యమయ్యాయనే చేదు నిజాన్ని మనం ఒప్పుకోక తప్పదు.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324(2) ప్రకారం స్వతంత్ర ఎన్నికల నిర్వహణ కోసం కమిషనర్ల నియామకాలకు సంబంధించి పార్లమెంటు ఒక పారదర్శకమైన చట్టాన్ని చేయాల్సి ఉంది. కానీ కొన్ని దశాబ్దాలుగా ఏ బూర్జువా ప్రభుత్వమూ అటువంటి పటిష్టమైన చట్టాన్ని చేయకుండా కేవలం పాలకుల జేబు సిఫార్సుల ఆధారంగానే తమకు నచ్చిన అధికారులను నియమించుకుంటూ రాగా, ఈ ఏకపక్ష నిరంకుశత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మార్చి 2023లో భారత సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. పార్లమెంటు కొత్త చట్టం చేసేంతవరకు ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని రక్షించడానికి ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, రాజ్యాంగ రక్షణ కవచం లాంటి ‘భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి’ (CJI) సభ్యులుగా ఉండే ఒక అత్యున్నత నిష్పాక్షిక కమిటీని ఏర్పాటు చేసి నియామకాల్లో పారదర్శకతకు పునాది వేసింది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ అధికార విస్తరణకు న్యాయవ్యవస్థ అడ్డు వస్తోందని గ్రహించి, ఆ చారిత్రాత్మక తీర్పును తుంగలో తొక్కుతూ “చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం, 2023″ను పార్లమెంటులో ఆమోదించుకుంది. ఈ నయా వివాదాస్పద చట్టం ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (CJI) కమిటీ నుండి ఉద్దేశపూర్వకంగా వెళ్లగొట్టి, ఆయన స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసే ఒక కేంద్ర మంత్రిని కూర్చోబెట్టడం ద్వారా కమిటీలో అధికార పక్షానికి 2:1 ఏకపక్ష మెజారిటీని కల్పించుకుంది. దీని ఫలితంగానే, పార్లమెంటులో వందకు పైగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి మరీ ఆమోదించుకున్న ఈ చట్టబద్ధమైన విద్రోహం ద్వారా, తమ జేబు సంస్థలా పనిచేస్తూ పాలకుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే జ్ఞానేష్ కుమార్ లాంటి నిరంకుశ అధికారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా కూర్చోబెట్టుకోవడం పాలకులకు సులువైంది. ఈ ఏకపక్ష నియామక కుట్ర వల్లే ఎన్నికల సంఘం లోపల ఉన్న తోటి కమిషనర్లు గత 10 నెలల్లో ఏకంగా 14 సార్లు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఇటీవల కోట్ల మంది ఓట్లు మాయ మవడంతో వచ్చిన నిరసనలకు భయపడి తిరిగి వారందరినీ ‘ఫామ్‌-6’ ద్వారా దరఖాస్తు చేసుకోమనడం పౌరులను నేరస్తులను చేసే కుట్ర కాదా అని మేధావులంతా ప్రశ్నిస్తున్నారు. ఈ దేశవ్యాప్త ఓట్ల హరణ కేవలం రాబోయే ఒక ఎన్నిక కోసం మాత్రమే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం దేశంపై బలవంతంగా రుద్దాలనుకుంటున్న ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (ఒకే దేశం – ఒకే ఎన్నిక) నిరంకుశ వ్యూహానికి ఒక ముందస్తు ప్రణాళిక అని స్పష్టమవుతున్న తరుణంలోనే, ఈ మొత్తం ప్రజాస్వామ్య హననానికి, వ్యవస్థల పతనానికి ‘ SIR ‘నిలువుటద్దంగా నిలుస్తుంది.

అందుకే ఈ కుట్రలన్నింటికీ కేంద్ర బిందువుగా మారి పాలకుల బినామీగా వ్యవహరిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయాలి, అలాగే అప్రజాస్వామికమైన ఈ ‘SIR’ ప్రక్రియను తక్షణమే రద్దు చేసి, సాంకేతిక , రాజకీయ కుట్రల కారణాల వల్ల అక్రమంగా తొలగించబడిన ప్రతి ఒక్క అర్హత కలిగిన ఓటరును వెంటనే ఎలాంటి షరతులు లేకుండా ఓటర్ల లిస్టులో తిరిగి చేర్చాలి. రాజ్యాంగ సంస్థల పవిత్రతను కాలరాస్తూ దేశంలో కోట్ల మంది పౌరుల రాజకీయ ఉనికిని దొంగిలించి ఇప్పటివరకు జరిపిన ఈ ఘోరమైన విద్రోహానికి, చారిత్రక తప్పిదాలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. ఈ వ్యవస్థీకృత రాజ్యాంగ విద్రోహాన్ని తిప్పికొట్టాల్సిన చారిత్రక బాధ్యత నేడు దేశంలోని అన్ని పీడిత వర్గాలపై ఉంది కాబట్టి, కేవలం ఒక అక్షర పోరాటానికో లేదా తాత్కాలిక నిరసనలకో ఈ పోరు పరిమితం కాకూడదు. పాలకుల అండ చూసుకుని పౌరుల ఉనికితో ఆడుకుంటున్న ఈ ఫాసిస్టు శక్తులపై విద్యార్థులు యువత దళితులు మైనారిటీలు ఆదివాసీలు శ్రామిక లోకమంతా ఒకే కంఠంతో ఏకతాటిపైకి రావాలి. హక్కుల హరణ సాగుతున్న చోట మౌనం వహించడం నిరంకుశత్వానికి లొంగిపోవడమే అవుతుంది. కాబట్టి, ప్రతి గ్రామం ప్రతి బస్తీ ఒక పోరాట క్షేత్రంగా మారి ఈ అప్రకటిత ఎమర్జెన్సీ నియంతృత్వాన్ని, కార్పొరేట్ తొత్తుల పాలనను కూకటివేళ్లతో పెకలించివేయడానికి ప్రతిఘటనే ఏకైక మార్గమని నమ్ముతూ పాలకుల కుట్రలపై తిరుగుబాటు జెండాను ఎగరేయాలి. యావత్ భారత పీడిత ప్రజానీకం ఒకే ఒక్క నినాదంతో ప్రజా క్షేత్రాన్ని కదిలించాలి. అదే ‘మోడీ హటావో – దేశ్ బచావో’, ఎందుకంటే తీవ్రమైన ప్రతిఘటన ద్వారానే మనకు విముక్తి, పదునైన తిరుగుబాటు ద్వారానే నిజమైన ప్రజాస్వామ్య రక్షణ సాధ్య మవుతాయి.

Leave a Reply