‘జీరం ఘాటి’ ఘటనలో స్థానిక కోర్టు పది మంది ఆదివాసిలకు మరణ శిక్ష విధించింది. సాధారణంగా అయితే పది మందికి ఒకే కేసులో మరణశిక్ష విధించినప్పుడు ఒక రకమైన హడావిడి, ప్రచారం మీడియాలో జరిగేది. కానీ ఈ కేసులో అలాంటివి తక్కువగా కనిపించాయి. మావోయిస్టు ఉద్యమం బలంగా ఉండి ఉంటే దీనికి స్పందన మరోలా ఉండేదమో!
2013 లో ఎలక్షన్ ప్రచారం ముగించుకుని వస్తున్న కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ పై పెద్ద ఎత్తున సాయుధ మావోయిస్టులు దాడి చేయడం వల్ల 29 మంది వరకు మరణించారు. ఇందులో సుమారు 300 మంది సాయుధ మావోయిస్టులు, వందలాది మంది స్థానిక ఆదివాసి ప్రజలు పాల్గొన్నారు అనేది పత్రికల కథనం. 2014 లో జీరం ఘటన జరిగిన చుట్టుపక్కల గ్రామాల నుండి పదకొండు మంది ఆదివాసులను ఎత్తుకెళ్ళి అరెస్టు చూపించారని అక్కడి హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. వారేమో పోలీసుల దృష్టిలో మావోయిస్టులు లేదా వారి సానుభూతి పరులు.
నిజానికి జీరం సంఘటనను ఎలా అర్ధం చేసుకోవాలి? జీరం సంఘటన జరిగిన కాలం ఛత్తీస్గఢ్ ఆదివాసీ సమాజానికి ఒక ప్రత్యేకమైన కాలం. 2005 లో మహేంద్ర కర్మ నాయకత్వంలో ‘శాంతి సేన’ పేరుతో సల్వాజుడుమ్’ ఏర్పాటు చేసిన కాలం. సల్వాజుడుమ్ అంటే ఒక ప్రవైటు సైన్యం. ఆదివాసి సమాజంలో ఒక సెక్షన్ ను లోబర్చుకుని వారి చేతికి ఆయుధాలు, అపరమితమైన అధికారాలు ఇచ్చారు. వీరు ఊళ్లకు ఊర్లు తగలబెట్టారు. దొరికిన మహిళలను దొరికినట్టు అత్యాచారం చేశారు. వందలాది మందిని క్యాంప్ లలో నిర్భందించారు. వీటిని తట్టుకోలేని వారు వలసలుగా పోగా, నేల మీద మమకారం ఉన్న కొద్ది మంది ఆ ప్రాంతంలోనే ఉండిపోయారు. ఆదివాసీ సమాజపు సంస్కృతి, జీవన విధానం అన్నిటినీ ధ్వంసం చేశారు. వీటన్నిటి మధ్య హింసను తట్టుకోలేని ప్రజలు విప్లవోద్యమం సహాయంతో ‘జుడుమ్’ మీద తిరుగుబాటు చేశారు. వారి మీద జరుగుతున్న హింసను నిలువరించేందుకు జరిగిన ప్రతిఘటన అది.
2005 లో మొదలైన ఈ హింసను అనేక రకాలుగా చూసిన వారున్నారు. కానీ ఈ దేశ ప్రజల మీద ప్రభుత్వం ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతుతో జరిగిన ఈ యుద్దంలో ప్రజలు తమ జీవితం కోసం కొట్లాడాల్సి వచ్చింది. ఆ కాలంలో కొద్దిపాటి చివరంచ్చుల్లో ఉన్న ప్రజాస్వామ్యం అనే జాగాలో కొద్ది మంది ప్రముఖులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అప్పుడు సుప్రీం కోర్టు ‘సల్వాజుడుం’ను రద్దు చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు చరిత్ర కావచ్చు. ప్రజస్వామ్యానికి సూచికగా దానిని చూసిన వారూ ఉన్నారు. కానీ తిరిగి అదే చరిత్ర వర్తమాన ఫాసిస్టు సందర్భంలో మరోలా వ్యాఖ్యానించబడింది. ఆ తీర్పులో భాగమైన జడ్జి సుదర్శన్ రెడ్డి గారికి అర్బన్ నక్సలైట్ అనే బిరుదును కేంద్ర హోమంత్రి పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ప్రభుత్వానికి, విప్లవోద్యమానికి చర్చలు జరిగి శాంతియుత వాతావరణం ఏర్పడాలి అని కోరిన వారిని నక్సలైట్ సానుభూతి పరులుగా ముద్రలు వేశారు.
మార్చి 31, 2026 పార్లమెంట్ వేదికగా కేంద్ర హోమంత్రి అమిత్ షా దేశంలో మావోయిస్టు పార్టీ అంతమైంది అని ప్రకటించాడు. ఆ ప్రకటన తరువాత కూడా హోమంత్రి, ప్రధానమంత్రి మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది అని అవకాశం ఉన్న ప్రతి చోటల్లా మాట్లాడుతూనే ఉన్నారు..
కానీ కేంద్ర హోమంత్రి ప్రకటించినట్టు కగార్ యుద్దం ముగిసిందా?
మావోయిస్టు రహిత బస్తర్ లో ఇప్పుడు మిగిలింది అభివృద్ది మాత్రమేనా?
వాస్తవంలో జరుగుతుంది ఏమిటి? మధ్యభారతంలో లేదా ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న సైనిక కూంబింగ్ లు, ఆదివాసీల మీద నిరంతర డ్రోన్ ల నిఘా ఇంకా అది అంతఃర్యుద్ద క్షేత్రంగానే కొనసాగుతుంది. గతంలో చేసుకున్న ఏం.ఓ.యూ ల అమలు జరపడం వేగవంతం చేస్తున్నారు. ఆదివాసిల పరిరక్షణ కోసం ఉన్న అన్నీ చట్టాలు, హక్కులూ అతిక్రమణ నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇవి స్థానిక ఆదివాసీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీని మీద ఆదివాసీల ఆందోళన పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు. దీని మీద ఆందోళన చేస్తున్న అనేక మంది ఆదివాసి నాయకులు ప్రస్తుతం ఊపా తదితర కేసుల్లో ఛత్తీస్గఢ్ జైళ్ళలో మగ్గుతున్నారు. గతం కంటే ఎక్కువ నిఘా పెరగడం వల్ల కూడా అక్కడ జరగుతున్న ఆందోళనలు బయటకు రావడం లేదు.
‘సల్వాజుడుం’ కాలానికి ఈనాటికీ ఏం మార్పులోచ్చాయి? నేడు ప్రభుత్వ బలగాలు మన దేశ ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ దేశ ప్రజల మీద దాడి చేస్తున్నాయి. ఇక్కడ బలగాలు అంటే కేవలం సైన్యం మాత్రమే కాదు. పరిపాలన శాఖలు, రాజ్యాంగ బద్ద సంస్థలు అన్నీ కూడా ఇందులో భాగమే. కగార్ యుద్ధం అసలు లక్ష్యం మావోయిస్టు రహిత భారత్ మాత్రమే కాదు. 2047 నాటికి ‘హిందూ రాష్ట్ర’ ను నిర్మించడం. ‘వికసిత్ భారత్’ పేరుతో కార్పొరేట్ దోపిడిని చట్టబద్దం చేయడం. దేశంలో రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలలో మోనోపోలిని నిర్మించడం. అందుకోసం అవసరమైన వ్యూహాలను అమలు చేయడం.
అందుకే మార్చి 31 వరకు సాయుధ మావోయిస్టు పార్టీ కేంద్రంగా జరిగిన చర్యల స్థానంలో ఇప్పుడు భావజాల రంగంలో దాడులు కొనసాగుతున్నాయి. సాంస్కృతిక రంగంలో హిందూత్వ భావజాలాన్ని కేంద్ర స్థానంలోకి తీసుకురావడం తద్వారా హిందూ రాష్ట్ర కలను సాకారం చేయడం దాని ముందు ఉన్న ప్రథమ లక్ష్యం. మొన్న ఆగస్టు 15 సందర్భంగా ఎర్రకోట మీద ప్రధాని నరేంద్ర మోడీ ‘ధిమాగి నక్సల్’ ప్రకటన ఇందులో భాగమే. మూడు సంవత్సరాల క్రితం అజిత్ దోవల్ చెప్పిన ‘పౌర సమాజం’ మీద యుద్ధంకు తాజా రూపం ఈ ప్రకటన. పట్టణ మావోయిస్టుల నుండి ధీమాగి నక్సల్ దాకా ప్రభుత్వం మేధో సమాజం మీద నేరుగా చేస్తున్న యుద్ధం ఇది. ఇంకో వైపు నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్ నుండి ఆపరేషన్ కగార్ దాకా అర్ధం చేసుకుంటే ఈ యుద్ధం విస్తృతి అర్ధం చేసుకోవచ్చు.
గత కొద్ది నెలలుగా న్యాయ స్థానాలు ఇస్తున్న తీర్పులను గమనిస్తే ఇది మరింత లోతుగా అర్ధం చేసుకోవచ్చు. ప్రొఫెసర్లు, పౌర ప్రజాస్వామిక మేధావులు, ప్రతిపక్ష పార్టీల మొదలు ఆదివాసీ ప్రజల దాకా న్యాయ స్థానాల వ్యవహార శైలి ఒకటే. అటీటూగా మినహాయింపులు ఉంటే ఉండవచ్చు కానీ ఇది రాజకీయ మోనోపోలికి దారి ఏర్పాటు చేయడం కోసం జరుగుతున్న ఒకానొక చర్య మాత్రమే. ‘చట్టబద్దం’గా సమాజాన్ని నిశబ్ధం చేయడం ఇప్పుటి రాజ్యం పనితీరు.
సెప్టెంబర్ 16 న జగదల్ పూర్ కోర్టు విధించిన మరణశిక్ష కూడా ఇందులో భాగమే. ఈ విచారణలో న్యాయ బద్ధత లేదు. ఎందుకంటే శిక్ష పడ్డ ఎవరికి కూడా సంఘటనతో ప్రత్యక్ష సంభందం ఉందని నిరూపణ కాలేదు. అలాగే అవసరమైన సాక్ష్యాలు కూడా ఎన్ఐఏ చూపించలేకపోయింది అని బాధితుల తరుపు న్యాయవాది అరవింద్ చౌదరి అన్నారు. అందుకే ఈ తీర్పు చట్టాలకు లోబడిన తీర్పు కాదు ఇది పూర్తిగా ఒక రాజకీయ తీర్పు.
‘సల్వాజుడుం’ కాలంలో జరిగినట్టే ఆదివాసీ ప్రజల జీవనం, సంస్కృతి విధ్వంసం ఇప్పుడు తిరిగి పునరావృతం అవుతున్నాయి. కానీ భవిష్యత్తు తిరిగి పునరావృతం అవుతాందా లేదా అన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న..




