రాసుకోండి!
నేనొక అరబ్బుని!
నా గుర్తింపు కార్డు నెంబరు యాభై వేలు!
మీకు తెలుసో లేదో!
నాకు ఎనిమిది మంది పిల్లలున్నారు!
తొమ్మిదవాడు కూడా
ఈ వేసవి తర్వాత వస్తాడు మరి!
వాడి రాక మీకు కోపం వస్తుందేమో ?
~~
సరే!రాసుకోండి!
నేనొక అరబ్బుని!
గనిలో తోటి కార్మికులతో కలిసి పని చేసే కష్టజీవిని!
~~
నా ఎనిమిది మంది పిల్లలకు రాళ్ళను నుజ్జు చేసి,
రొట్టెలు, బట్టలు, పుస్తకాలు సంపాదించి పెడతాను!
నేను మీ గుమ్మాల ముందు నిలబడి దీనంగా బిక్షం అడగను గాక అడగను!
మీ ఇళ్ళల్లోకి వచ్చి,
నన్ను నేను ఎన్నడూ అవమానించుకోను!
అందుకు మీరు నన్ను ద్వేషిస్తే నేనేం చేయలేను!
~~
ఇప్పుడిక ఇంకా రాసుకోండి !
మీకు తెలుసు కదా!
నేను ఒక అరబ్బునని ? నాకంటూ ఒక పేరైతే ఉంది!
కానీ నా పొట్ట నింపుకోవడానికి నాకంటూ ఒక నౌకరీ లేదు!
చూడండీ దుర్మార్గం?నాకు నా దేశంలోనే గుర్తింపు లేదు!
~~
ప్రజలు అత్యంత ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న నా దేశంలోనే నేనొక రోగిలా ఎంతో ఓపికతో ఉన్నాను!
~~.
మీరంతా ఏమనుకుంటున్నారు నన్నసలు?
కాలం పుట్టక ముందే, యుగాలు ప్రారంభం కాకముందే,
ఈ దేవదారు,ఆలివ్ చెట్లు పుట్టి పెరిగే కంటే ముందే,
నేల మీద గడ్డి మొలవక ముందే,
నా మూలాలు ఈ నా భూమ్మీద నువ్వూహించనంత లోతుకంటా పాతుకపోయాయని గుర్తుపెట్టుకో !
అదే నా గుర్తింపు !
~~
మా నాన్న గురించి నీకేం తెలుసు చెప్పు?
నాగలి దున్నే బీద రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు!
సంపన్నుడు కాడు !
ఇక మా తాత కూడా గౌరవనీయుడైన రైతే!
ఆయన అన్ని సౌకర్యాలతో, గొప్ప వంశంలో పుట్టలేదు!
కానీ నాకు చదువు నేర్పకముందే,
ఈ లోకాన్ని వెలిగించే సూర్యుడు సమస్త భూగోళమూ గర్వించేంత గొప్పవాడన్న నిజాన్ని చెబుతూ
సూర్యుణ్ణి కృతజ్ఞతతో గౌరవించడం ఎలానో నేర్పాడు!
~~.
ఇక నా ఇల్లంటారా? అందమైన ఆకుపచ్చని కొమ్మలు, వెదురుతో కట్టిన చౌకీదార్ గుడిసెలా అద్భుతంగా ఉంటుంది!
~~
ఇప్పుడు చెప్పండిక!
నా ఈ సీదా సాదా
హోదా మీకు సమ్మతమేనా?
నా దేశంలో నా పేరు చివర ఏ పదవీ లేదు మరి!
నాకంటూ ఒక ఉద్యోగమూ లేదు!
~~
నేనొక అచ్చమైన అరబ్బునని తెలుసు కదా!
ఇప్పుడిక స్పష్టంగా రాసుకోండి !
మాతో మీరేం చేశారో అదీ రాసుకోండి!
మీరు నా పూర్వీకుల పండ్ల తోటలను,
నేను నా పిల్లలతో కలిసి సాగు చేసిన భూమిని దౌర్జన్యంగా,కుట్రలు చేసి మరీ దోచుకున్నారు!
ఈ రాళ్లతో నిండిన బంజరు భూమి తప్ప మీరు మాకు ఏమీ మిగల్చలేదు!
పై నుంచి,ముందే చెప్పినట్లుగా ఈ క్రూర రాజ్యం మీరు మాకు వదిలిన ఈ బంజరు
భూమిని కూడా లాగేసుకుంటుందని విన్నాను?
~~
హూ!అలా జరిగే పక్షంలో,
మీరు రాసుకోబోయే పుస్తకపు మొదటి పేజీ పైభాగంలో ఇలా రాయండి!
నేను(మేము) ప్రజలను ద్వేషించను!
ఇతరుల ఆస్తిలోకి చొరబడను !
కానీ మా భూమిని దోచుకున్న దొంగల్లారా గుర్తు పెట్టుకోండి!
నాకు గనక ఆకలి వేసిందనుకోండి?
మా పూర్వీకుల,మా పిల్లల భూమిని దోచిన దోపిడీదారుల పచ్చి మాంసమే నా/మా ఆహారమవుతుంది! జాగ్రత్త! జాగ్రత్త! ఖబడ్దార్!
నా ఆకలి పట్ల,
నా ఆగ్రహం పట్ల జాగ్రత్తగా ఉండండి మరి!
(దశాబ్దాలుగా ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా ప్రజల మీద చేస్తున్న ఆక్రమణ,యుద్ధాన్ని, పాలస్తీనా జాతి హత్యాకాండని నిరసిస్తూ పాలస్తీనా కవి తమ గుర్తింపు కోసం రాసిన ఆగ్రహకవిత ఇది.)





Darvis.. sir
Expressed u r anger —needs revenge
But no end to this
Nice one
ఆగ్రహం కలంలో దుంకింది దున్నింది