రాయలసీమ గ్రామీణ సంస్కృతిలో పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. అవి కేవలం దేవతల ఆరాధనకో, ఆచారాల నిర్వహణకో పరిమితమైనవి కావు. కుటుంబ బంధాలను బలోపేతం చేయడం, ఊరి ప్రజలందరినీ ఒకచోట చేర్చడం, జానపద కళలను సజీవంగా ఉంచడం, సంతోషాలను సమిష్టిగా పంచుకోవడం వంటి అనేక సామాజిక ప్రయోజనాలను నెరవేరుస్తాయి. అలాంటి ప్రత్యేకతలను తనలో ఇముడ్చుకున్న పండుగే గౌరమ్మ పండుగ. ముఖ్యంగా వేదవతి, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి అనంతపురం జిల్లా పశ్చిమ ప్రాంతం, కర్నూలు పశ్చిమ ప్రాంతం, కర్ణాటకలోని బళ్లారి, తుమకూరు, చిత్రదుర్గ  ప్రాంతాల్లో ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

  దసరా పండుగ రోజున గౌరీదేవి మూర్తిని గ్రామంలోని ఒక చోట ప్రతిష్ఠించడంతో గౌరమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో గ్రామంలోని మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం మహిళలంతా గౌరీ మూర్తికి తంగేడు, గుమ్మడి,జిల్లేడు, చామంతి, మందారం, ఉమ్మెత్త, గన్నేరు పూలతో గౌరమ్మని అందంగా అలంకరించి ఆరాధిస్తూ, ఆటపాటలతో సందడి చేస్తారు. రోజంతా ఇంటి పనులు, వ్యవసాయ పనులు, ఇతర బాధ్యతలతో గడిపే మహిళలకు ఈ పండుగ ఒక ప్రత్యేకమైన విశ్రాంతి సమయంగా, తమ తోటి మహిళలతో కలిసి ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపే ఒక విశిష్ట వేడుకగా ఉంటుంది. సాయంత్రం కాగానే గౌరమ్మ ప్రతిష్టించిన ప్రదేశం మహిళల సందడితో కళకళలాడుతుంది. సంప్రదాయ పాటలు, సమూహ ఆటలు, హాస్య సంభాషణలు వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మారుస్తాయి. ఈ ఆటపాటల్లో వినోదంతో పాటు స్థానిక భాషా మాధుర్యం, జానపద సాహిత్యం, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాల ఆనవాళ్లు కనిపిస్తాయి. పుస్తకాల్లో నమోదు కాని ఎన్నో స్థానిక పాటలు, మాటలు, ఆచారాలు ఇలాంటి సందర్భాల్లోనే సజీవంగా కొనసాగుతాయి.

  గౌరమ్మ పండుగలో అత్యంత విశిష్టమైన అంశం ఆడపడుచుల భాగస్వామ్యం. వివాహం చేసుకుని ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లిన మహిళలు సైతం ఈ పండుగ కోసం తమ పుట్టింటి గ్రామాలకు రావడానికి ఆసక్తి చూపుతారు. ఇతర పండుగలకు హాజరు కాయలేకపోయినా, గౌరమ్మ పండుగకు మాత్రం తప్పకుండా రావాలనే భావన అనేక కుటుంబాల్లో కనిపిస్తుంది. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు. పుట్టింటితో ఉన్న అనుబంధాన్ని తిరిగి అనుభవించే సందర్భం. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం, బంధువులతో కబుర్లు చెప్పుకోవడం, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, కొత్త తరానికి సంప్రదాయాలను పరిచయం చేయడం వంటి అనేక భావోద్వేగ అనుభవాలకు ఈ పండుగ వేదికగా నిలుస్తుంది.

  వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఆడపడుచులంతా ఒకే గ్రామంలో కలుసుకోవడం వల్ల కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. అందుకే గౌరమ్మ పండుగను మహిళల ఆత్మీయ కలయికకు ప్రతీకగా రాయలసీమలో చూస్తారు.

  గౌరమ్మ ఉత్సవాల్లో ఐదవ రోజు అత్యంత సందడిగా సాగుతుంది. ఆ రోజు మహిళలంతా సంప్రదాయ దుస్తులతో ముస్తాబై గౌరమ్మ మూర్తిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఊరేగింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆటపాటలు, జానపద గీతాలు, ఉత్సాహభరితమైన కేరింతలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

  ఊరి వీధుల గుండా సాగిపోయే ఈ ఊరేగింపు మహిళల సమిష్టి భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. గౌరమ్మను సాగనంపే సందర్భంలో ఆనందం, ఆత్మీయత కలగలిసి కనిపిస్తాయి. చివరకు సమీపంలోని వాగు వద్ద గౌరీదేవి మూర్తిని నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమంతో ఐదు రోజుల ప్రధాన ఈ వేడుక ముగుస్తుంది.

  గౌరమ్మ నిమజ్జనంతో ఉత్సవాల ఉత్సాహం ముగిసిపోదు. ఆ రాత్రి కూడా మహిళలు ఉయ్యాల ఆటలు, పాటలతో సందడిగా గడుపుతారు. వరుసైన బంధువుల మధ్య చమత్కారంగా పాడే పాటలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బావమరదులు, ఇతర వరుస సంబంధాల మధ్య సరదా సంభాషణలు, హాస్యంతో కూడిన పాటలు వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

 కొప్పులో పులారమే

నర్సమ్మత కొప్పంత ఎర్రగాయనే       ||2||

 నడిచేటి నారాయనే

 మా మామ నిన్ను చూసి మనసాయనే  

 మా మామ నిన్ను చూసి మనసాయనే

  ఇలాంటి పాటలతో కనిపించే చమత్కారం, స్థానిక మాండలికం, బంధుత్వ సంబంధాల వ్యక్తీకరణ గ్రామీణ జానపద సంస్కృతిలోని ప్రత్యేకతను తెలియజేస్తాయి. కుటుంబ సంబంధాలను కేవలం గౌరవ మర్యాదలకే పరిమితం చేయకుండా, నవ్వులు, సరదా, ఆత్మీయతతో అనుభవించే అవకాశాన్ని ఇవి కల్పిస్తాయి. మహిళలు తమ దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను పక్కనపెట్టి, తోటి మహిళలతో కలిసి పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఆనందంగా గడపడం ఈ పండుగలో ముఖ్యమైన సామాజిక అంశం.

  గౌరమ్మ నిమజ్జనం జరిగిన మరుసటి రోజును స్థానికంగా ‘గొంతేమ్మ రొట్లు” అని పిలుస్తారు. ఈ రోజుకు పండుగలో చాలా ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఆడపడుచులు కలిసి విందు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. అలసంద వడలతో పాటు మటన్, చికెన్ వంటి మాంసాహార వంటకాలను పెద్ద ఎత్తున సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలతో కలిపి వడ్డించే మాంసాహార విందు ఈ రోజు ప్రత్యేక ఆకర్షణ. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకచోట చేరి వంటకాలను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటారు. ఎవరైనా కొన్ని సాధ్యం కానీ కోరికలు కోరుతున్నప్పుడు వాటిని “గొంతెమ్మ కోరికలు” అని అంటుంటారు. ఆ పదం ఈ పండుగ నేపథ్యంలో నుంచే పుట్టింది.

  రాయలసీమ గ్రామీణ ఆహార సంస్కృతిలో జొన్న రొట్టెలకు ప్రత్యేక స్థానం ఉంది. స్థానికంగా లభించే ధాన్యాలతో తయారయ్యే సంప్రదాయ ఆహారాన్ని మాంసాహార వంటకాలతో కలిపి విందుగా ఆస్వాదించడం ఈ ప్రాంతపు ఆహార అలవాట్లను ప్రతిబింబిస్తుంది. ‘గొంతేమ్మ రొట్లు’ సందర్భంగా నిర్వహించే విందులు కేవలం భోజనానికి సంబంధించినవి కావు. అవి బంధువుల మధ్య ఆత్మీయతను పెంపొందించే, పండుగ ఆనందాన్ని కొనసాగింపుగా సాగే సామూహిక సందర్భాలు.

  గౌరమ్మ పండుగలోని ఆటలు, పాటలు, ఊరేగింపులు, ఉయ్యాల ఆటలు, చమత్కార గీతాలు, సంప్రదాయ విందులు అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన గ్రామీణ సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తాయి. ముఖ్యంగా మహిళలు తరతరాలుగా కొనసాగిస్తున్న పాటలు, మాండలిక పదాలు, బంధుత్వ సంబంధాలపై ఆధారపడిన హాస్య సంప్రదాయాలు జానపద పరిశోధనకు విలువైన అంశాలు.

  అయితే ఈ సంప్రదాయాలు గ్రామాన్ని బట్టి కొంత మారవచ్చు. అందువల్ల గౌరమ్మ పండుగకు సంబంధించిన స్థానిక పాటలను, వాటి అర్థాలను, సాంప్రదాయాలను, మనం అక్షరబద్ధం చేస్తూ వాటిని  ప్రపంచానికి పరిచయం చేసినప్పుడే ఈ పండుగకు సంబంధించిన అసలైన ప్రాంతీయ ప్రత్యేకతలను భావితరాలకు అందించగలం.

  గౌరమ్మ పండుగ అంటే గౌరీదేవి ఆరాధనతో ప్రారంభమై, మహిళల ఆటపాటలు, ఆడపడుచుల ఆత్మీయ కలయిక, ఘనమైన ఊరేగింపు, నిమజ్జనం, ఉయ్యాల ఆటలు, ‘గొంతేమ్మ రొట్లు’ విందులతో కొనసాగుతున్న ఒక సమగ్ర గ్రామీణ సాంస్కృతిక వేడుక.

ఉమ్మడి అనంతపురం జిల్లా, కర్నూలు పశ్చిమ ప్రాంతం, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని కేవలం ఒక పండుగగా మాత్రమే చూడలేం. ఇది మహిళల భాగస్వామ్యానికి, కుటుంబ అనుబంధాలకు, జానపద కళలకు, ప్రాంతీయ ఆహార సంస్కృతికి ప్రతిబింబం. ఆధునిక జీవనశైలిలో అనేక సంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో, గౌరమ్మ పండుగ వంటి స్థానిక ఉత్సవాలను నమోదు చేయడం, వాటి విశిష్టతను ప్రచారం చేయడం, భావితరాలకు అందించడం రాయలసీమ విద్యావంతుల వేదికగా మా సాంస్కృతిక బాధ్యత.

  ఈ గౌరమ్మ పండుగ తెలంగాణలోని బతుకమ్మ పండుగతో కొంత పోలిక ఉన్నట్లు కనిపించిన ఇది పూర్తిగా రాయలసీమ సంస్కృతిలో ప్రతిబింబం. ఈ రెండు సాంస్కృతిక ఉత్సవాలలో చాలా ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి. గౌరమ్మ పండుగలో నిలిచేది దేవతా ఆరాధన మాత్రమే కాదు — ఆడపడుచుల అనుబంధం, ఊరి ఐక్యత, జానపద జీవన సౌందర్యం కూడా!

                                                                మొండి వెంకటేష్

                                                    రాయలసీమ విద్యావంతుల వేదిక

Leave a Reply