ఏం చేస్తున్నావు నువ్వు?
బాధతో కూడిన శబ్దాలు,
అసహ్యకరమైన టిప్పనిల మధ్య,
ఎప్పటికీ విడిగా కాకుండా సమూహాల్లోనే ఉంటూ
స్వంత కొడుకులకి ఇతరులను రంగు పేరుతో అసహ్యించుకోవడం నేర్పుతూ,
కూతుళ్ళని భయపెడుతూ,పిరికివాళ్ళుగా చేస్తూ ఉండడమేనా నీ పని?
~~
రాత్రి కోసం నిరీక్షిస్తూ
ముఖాలను దాచుకోవడానికి,
తెల్లని హుడీలు కప్పుకొని దొంగల్లా మాస్కులు వేసుకొని
పవిత్రమైన క్రీస్తు శిలువలని దహించడం!
ఇదేగా మీ ఘనకార్యం?
~~
అరే!ఇంకా ఏం వెర్రి కబుర్లు చెబుతావు నువ్వు మాకు?
“ప్రజలారా ఏమనుకుంటున్నారు నన్ను మీరంతా?
మీకు తెలీదు!
నేను జీసస్ కి పరమ భక్తుణ్ణి!
పూజలూ అవీ నిష్ఠగా చేస్తుంటాను, నాలో ఏ దుర్మార్గమూ లేదు !
నన్ను నమ్మండి!
అనే కదా!
కానీ నిజానికి నువ్వు చేసేది ఏంటి?
~~
అయినా నీ మాటలు ఎవరు నమ్ముతారు?
నలుగురు చిన్నారి ఆడపిల్లలను,
శ్రద్ధగా బైబిలు చదివే విద్యార్థులను లోపల పెట్టుకొని నువ్వు చర్చి లో కిరాతకంగా బాంబులు పేలుస్తుంటావు!
ఇదేనా చర్చి మీద నీ భక్తి?
~~
ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే,
అనుమతి లేని కొత్త చట్టాలను నీకోసం నువ్వే తయారు చేసుకుంటావు
~~
వాళ్ళు! నా జాతి మనుషులు,
ఆ బాధితులసలు ఏ ఆరోపణలూ చేయకూడదు!
నోరెత్తి ప్రశ్నించకూడదు!
ఎందుకంటే వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి,అజ్ఞానులు కాబట్టి!
రంగు తక్కువ మనుషులు కాబట్టి!
వాళ్ళు కనీసం కరువుతీరా కూడా ఏడవకూడదు !
ఇది తప్ప వాళ్ళకి ఇంకేమీ తెలీకూడదు!
~~
ఎంత హీనం అంటే,
నువ్వు నీ పద్నాలుగేళ్ల కూతుర్ని లైంగిక వేధింపులకు గురి చేయడం,
నాకు ఇంకా కనని పిల్లల కోసం మాత్రమే ఉన్నావంటూ,
నీ ఉనికికి అర్థం అంతేనని
భార్యని చచ్చేంత వరకూ బాదడం!
ఇదే కదా నువ్వు ?
~~
ఎంతలా అంటే నీకు కావలసినప్పుడల్లా నువ్వే పోలీస్ వైపోయి నలుపు రంగు మనుషులను తుపాకీతో కాల్చేయడం!
లేదా నువ్వే జ్యూరీ సభ్యుడవైపోయి, హంతకులను విడిపించే ఆదేశాలివ్వడం దాకా నీ ఆధిపత్యం,వివక్షా కొనసాగుతుందన్న మాట!
ఇదీ నీ జాత్యహంకార,పురుషాహంకార రాజ్య నీతి!
**
ఇంకా., ఇంకా చెప్పు నువ్వేం చేయగలవు?
ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగి ని
నౌఖరీ లోకి తీసుకోకుండా సతాయించగలవు!
కక్ష కట్టి అసలు కొలువు లోకే తీసుకోక పోవచ్చు కూడా!
~~
ఇక మీ వ్యక్తిగత జైళ్లలో అసలేం జరుగుతుంది?
ఓహ్! ఆ జీసస్ కే తెలుసు!
మా నల్ల జాతి పురుషులతో అక్కడ ఎంత కిరాతక మైన దారుణాలు జరుగుతాయో?
చెప్పలేనివి ఏమేం అవుతుంటాయో?
~~.
అవును కానీ ఇంతకీ అసలు జైళ్లు మీ వ్యక్తిగతమైనవిగా,
ప్రైవేటుగా ఎప్పుడు అయ్యాయి?
మీకేమైనా తెలుసా?
**
అసలు విషయం చెబుతా విను!
కొయోట్స్ ఉన్నారే?
వాళ్ళని కూడా చంపేయాలి!
ఎందుకంటే వాళ్ళు,
దీనాతి దీనమైన వలస దారుల మీద అచ్చం మానవ కుక్కల్లా మొరుగుతున్నారు!
~~
ఇంకా నువ్వు బానిస సంకెళ్ళు తెంచుకొని నీ ప్రియమైన మాతృభూమి ఆఫ్రికాకు వెళ్ళి పోవడానికి డబ్బులు దాచుకుంటున్నావనుకో,
వాళ్ళు నీ దగ్గరున్న సింహాలనీ చంపెయ్యాలిసిందే!
అలాగే నిన్ను కాదంటున్న నీ ప్రియురాలిని కూడా చంపెయ్యాలి !
వీరోచితంగా ఇన్నన్ని హత్యలు చేసినందుకు విర్రవీగుతూ గొప్పలు చెప్పుకుంటావు!
**
అసలు నువ్వు ఈ లోకాన్ని పళ్ళు లేని మొఖంతో,
నేలని తాకుతూ ఉండే పొడవుగా వేలాడే నీ గడ్డపు జుట్టుతో చూడాలి!
చూడు!
భూమి ఇక్కడ బొగ్గు గనులు సంపదతో తిరిగి మేము రావడం కోసం ఆశగా నిరీక్షిస్తూ ఉంది!
**
ఏం చేస్తాం?
చివరాఖరికి ఇదే వాస్తవం!
మాకు ఇవ్వడానికి మీ దగ్గర ఏముందని?
మీరు.. ఒక్క మీరే మిగిలి ఉన్నారు!
అలాగే మా ఈ నేలానూ!
ఇంకా ఎవరున్నారు? అవును!
వాళ్ళున్నారే,
ఆ తెల్లరంగుతో మిడిసి పడే వాళ్ళు!
కడాకి వాళ్ళు మాకిచ్చేది ఏంటో తెలుసా?
వాళ్ళ తెల్ల చర్మం!
అవును వాళ్ళ తెల్ల రంగు చర్మం!
కడాకి అదొక్కటే వాళ్ళ దగ్గర మిగిలి ఉంది మరి!
అదే మాకు ఇస్తారు!
ఎంత విషాదమూ, వికృతమూ ఇది?
ఎంత దుఃఖదాయకం ఇది?
మాకు ఇది అవసరమా?

(కొయోట్స్ – నిరుద్యోగ మెక్సికన్ లని, నల్ల జాతి మనుషులను అమెరికాకి డబ్బుతీసుకొని దొంగతనంగా రవాణా, మానవ ట్రాఫికింగ్ చేసే అమెరిక న్ లు)

Leave a Reply