జీరమ్ ఘటన చాలా భయంకరమైనది. 2013లో జరిగింది. అందులో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పాల్గొన్నారు. 250-300 లేదా ఇంకా ఎక్కువ మంది ఉండవచ్చు. వాస్తవంగా పేర్కొన్న వారి కంటే ఎక్కువ మంది మావోయిస్టులు ఇందులో పాల్గొని ఉండవచ్చు. ఆ సమయంలో, ఇందులో పాల్గొన్నవారు ఒరిస్సా నుండి వచ్చి ఉండవచ్చని కూడా అన్నారు. అందువల్ల, ఇందులో ఎవరు పాల్గొన్నారు, ఎవరు పాల్గొనలేదు అని చెప్పడం చాలా కష్టం. ఇది చాలా క్లిష్టమైన విషయం. ఈ మొత్తం ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. బస్తర్‌లో చాలా ఘటనలు జరుగుతుంటాయి. జీరమ్‌ఘాటి ఘటన వాటిలో ఒకటి. అది ఒక పెద్ద ఘటన అనేది వాస్తవం. ఒక రాజకీయ ఘటన కూడా. ఎందుకంటే ఇందులో కాంగ్రెస్, బీజేపీల ప్రమేయం కూడా ఉంది. ఇది ఒక రహస్యమైన ఘటన కూడా. ఈ ఘటనకు సంబంధించిన అసలు నిజం ఇంకా బయటకు రాలేదని నేను అనుకుంటున్నాను.
బస్తర్‌లో జరిగిన అనేక ఘటనలలో, ప్రభుత్వం ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తుంది, చాలా మందిని అరెస్టు చేసి జైలులో పెడుతుంది. ఆ తర్వాత ఒక కేసు నడుస్తుంది. తరచుగా ఏం జరుగుతుందంటే ఘటనకు దగ్గరగా ఉన్నవారిని మాత్రమే పట్టుకుంటారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలలో తరచుగా సామూహిక ప్రమేయం ఉంటుంది. తరచుగా రాత్రిపూట జరుగుతాయి. అందుకని మావోయిస్టులు ఎవరు అనేది తెలియదు. అందుకే అనుమానం ఆధారంగానే చాలా మందిని అరెస్టు చేస్తారు. వీరిలో, సుమారు 99% మంది నిర్దోషులుగా విడుదలైపోతారు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఉండదు.
కాబట్టి, ఆ స్త్రీ లేదా పురుషుడు పూర్తిగా నిర్దోషులు కావచ్చు, కానీ వాళ్ళు నక్సలిజం పేరుతో అనుభవించారు. గతంలో జిల్లా స్థాయిలో కేసులు ఆరు లేదా ఏడు సంవత్సరాల పాటు కొనసాగేవి. ఈ రోజుల్లో కేసులు తరచుగా మూడు సంవత్సరాల లోపల ముగిసిపోతున్నాయి.
ఈ కేసు విషయానికొస్తే? జీరమ్‌లో జరిగిన ఘటన చాలా తీవ్రమైనది. తాము ఏదో ఒకటి చేస్తున్నామని ప్రభుత్వమూ, పోలీసులూ చూపించాల్సి ఉంది.
అందుకని, వారు 2014లోనే వీలైనంత ఎక్కువ మంది నిందితులను, 11 మందిని పట్టుకున్నారు. వారిలో చాలామంది ఘటన జరిగిన సమీపంలోని, చాందావేటా, బద్రి గ్రామాలకు చెందినవారే. నేను ఈ రెండు గ్రామాలను ఉదాహరణగా ఇస్తున్నానంటే, అవి ఘటనకు సమీపంలో ఉన్నాయి. రెండవది, ఈ గ్రామాలకు చెందిన వారు గతంలో కూడా అనేక సంఘటనలకు సంబంధించి అరెస్టు చేశారు. వారిపైన విచారణలు జరిగాయి. నిర్దోషులుగా విడుదలయ్యారు కూడా. ఒకరిద్దరికి శిక్ష కూడా పడింది.
కాబట్టి, జిల్లా స్థాయిలో నేను ఇలా జరగడం చాలాసార్లు చూసాను. సాధారణ గ్రామస్తులు కొన్నిసార్లు అమాయకులే అయినా, రేషన్ షాపుకు వెళ్తుండగానో, ఆసుపత్రికి వెళ్తుండగానో, లేదా తన సొంత పని మీద వెళ్తుండగానో పట్టుకుంటారు. రెండవది, ఒకానొక సమయంలో నక్సలైట్లుగా ఉన్నవారు, వారు కింది స్థాయిలో సంఘం సభ్యులు అయివుండవచ్చు; బియ్యం లాంటి సరుకులు సేకరించినవాళ్లు కావచ్చు లేదా అంతర్గత వ్యక్తులు కూడా కావచ్చు; అంటే వారు దళంలోకి వెళ్లి, తిరిగి వచ్చినవాళ్లు. అలాంటి ఒకరిద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు తిరిగి వచ్చాక ఒకటి లేదా రెండు మూడు సంవత్సరాల తర్వాత, డిఆర్ జి ఏర్పడినప్పుడు; మనకు తెలిసినట్లుగా డిఆర్ జి అనేది లొంగిపోయిన వారితో ఏర్పాటు చేసిన బలగం. కాబట్టి ఫలానా వ్యక్తి మావోయిస్టు అని డిఆర్ జి గుర్తించింది. ఈ డిఆర్ జి సభ్యులు ఒకప్పుడు దళంలో ఉన్నవారు.
ఈ కేసులో ఇద్దరు డిఆర్ జి లు ఉన్నారు. అంతకు ముందు దళంలో ఉన్నవారు, సరిగ్గా ఈ టీమ్‌లో పనిచేసిన డిఆర్ జి జవాన్. మొదట దళంలో ఉండి, లొంగిపోయి, తరువాత డిఆర్ జి లో చేరినవాడు. అతను గుర్తించాడు. వారు చెప్పింది విన్న అధికారి తాను ఓ అమాయకుడిని పట్టుకున్నానని అనుకోడు. ఎందుకంటే నేడు డీఆర్జీగా ఉన్న వాళ్ళు చాలా ఏళ్ల క్రితం పార్టీలో ఉన్నారు. కొన్ని సార్లు ఈ డిఆర్ జి అతను రిక్రూట్ చేసుకున్నవాళ్ళు కూడా ఉంటారు. ఉండచ్చు కానీ అది గతంలో కదా.. ఆ తర్వాత వెళ్లిపోయాడు. అది నీకు తెలియదు. కాబట్టి ఈ రోజు అతన్ని గుర్తిస్తున్నాడు; అతను చెప్పినదాన్ని అధికారులు అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఒక అమాయకుడిని లేదా లొంగిపోయినవారిని మీరు పట్టుకున్నట్లవుతుంది. జీరమ్‌లో కూడా ఇద్దరు వ్యక్తులతో ఇలాంటిదే జరిగింది. మిగిలిన వారిలో కేట్ కళ్యాణ్ నివాసి; 2005-2010 దాకా చిక్పల్ గ్రామ సర్పంచ్‌గా ఉన్నాడు. అతను చిక్పాల్ గ్రామ సర్పంచ్ కూడా. “నేను సర్పంచ్‌గా కూడా చేసాను. నన్ను ఎందుకు పట్టుకున్నావు?” అని అడుగుతున్నాడు. ఒక తల్లి ఇక్కడికి వచ్చింది. నా కొడుకు ఫలానా ఊరిలో పెళ్లికి వెళ్లినప్పుడు పట్టుకెళ్లారు అని చెబుతోంది. ఈరోజు అతని భార్య, కొడుకులు అందరూ వచ్చారు. ఇప్పుడు శిక్ష పడిన వారిలో ఒక మహిళ మొదట వారి సాంస్కృతిక సంఘం, చైతన్య నాట్య మంచ్ లో పనిచేసేది. ఆమె చాలా చిన్నది. కేవలం ఒకటి, రెండు సంవత్సరాలు మాత్రమే లోపల ఉండి, బహుశా 2010లో తిరిగి బయటకు వచ్చేసింది. స్నానం చేయడానికని నదికి వెళ్ళిన ఆమెను, డిఆర్ జి పట్టుకున్నప్పుడు ఆమె ఒంటరిగా ఉంది. అంటే ఇలాంటి గాథలు ఉన్నాయి.
నేడు ఇచ్చిన తీర్పులో సెక్షను 147 కింద రెండు సంవత్సరాలు, 148 కింద 3 సంవత్సరాలు అని చెప్పాడు. ఏడు సెక్షన్ల కింద మరణ శిక్ష వేసాడు. అయితే హైకోర్టు జడ్జి నిర్ధారించే వరకు ఇది అమల్లోకి రాదు. హైకోర్టు ఒప్పుకోవడం అంటే హైకోర్టు న్యాయమూర్తి కూడా మీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నారని చెప్పడం.
నా ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యక్తులు ఇప్పటికే 13 సంవత్సరాలు జైలులో గడిపారనే విషయాన్ని అప్పుడే మర్చిపోయారా?
13 సంవత్సరాలు అంటే జీవిత ఖైదుతో సమానం. అవును, దానికి ఒక పరిమితి ఉంటుంది. సాధారణంగా 14 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఇప్పటికే 13 సంవత్సరాలయ్యాయని మీరు మర్చిపోయారా?
నా అభిప్రాయంలో, ఈ వ్యక్తులు నిర్దోషులు. కాబట్టి, వారిని 13 సంవత్సరాలపాటు నిర్బంధంలో ఉంచినందుకు పరిహారం చెల్లించాలి. వారిని నిర్దోషులుగా విడుదల చేసి ఉండాల్సింది. “మిమ్మల్ని అరెస్టు చేసిన ఘటన ఒక సామూహిక ఘటన; వారిలో ఎవరినైనా గుర్తించడం అసాధ్యం” అని చెప్పాల్సింది. వీరి పక్షాన వాదించిన న్యాయవాది చాలా సీనియర్ న్యాయవాది: అరవింద్ చౌదరి గారు సాక్ష్యాలేవీ వెలుగులోకి రాలేదని, ఎటువంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. దేనిని సాక్ష్యం అంటారు? మిమ్మల్ని ఎవరో చూసారు; మీ చేతిలో పిస్టల్ చూసారు లేదా మీరు ఒకరిని కొట్టడం చూసారు; ఇలాంటి దాన్ని రుజువు అంటారు. ఒక్క వ్యక్తి కాదు, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దీనిని ధృవీకరించారు. అది సాక్ష్యం అవుతుంది.
మీ దగ్గర అలాంటి సాక్ష్యాధారాలేవీ లేవు. కాబట్టి మీరు అన్యాయం చేశారు, కదా? మీరు అబద్ధాన్ని ఆధారంగా తీసుకున్నారు. కొన్నిసందర్భాల్లో మీకు అనుమానం వస్తుంది. అప్పుడు మీరు “ఇది అనుమానాస్పదమైన విషయం” అని అనవచ్చు.
కానీ ఇందులో అనుమానానికి ఆస్కారమే లేదు. కాబట్టి, నాకు ఏమనిపిస్తుందంటే, సాక్ష్యాధారాలు లేనప్పుడు, ఒక సామూహిక కేసులో, ఎవరికీ ఏమీ తెలియదు, సాక్షులు ఉండరు. ఎక్కడెక్కడి నుంచో పట్టుకుని వచ్చారు.
సరైన దర్యాప్తు జరగలేదు. 13 సంవత్సరాలు గడిచిపోయాయి, వారి జీవితాలను నాశనం చేసినందుకు మీరు ఆదివాసులకు క్షమాపణ చెప్పాలి. వారు సంవత్సరాల తరబడి జైలులో గడిపారు. వారికి క్షమాపణ చెప్పాల్సింది పోయి, మీరు వారికి మరణశిక్ష విధిస్తున్నారు.
ఇక మరణశిక్ష విషయానికి వస్తే, మరణశిక్ష హేయమైనది. ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా న్యాయవ్యవస్థ ద్వారా ఏ వ్యక్తికీ మరణశిక్ష విధించకూడదని ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నారు.
మరణశిక్షకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం జరుగుతోంది. ఇది భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. భారతదేశంలో మనం మరణశిక్ష ఇందిరా గాంధీని చంపినవారికి మరణశిక్ష విధించినప్పుడు; మనం అలాంటి సంచలనాత్మక కేసుల గురించి మాత్రమే విన్నాము. పక్కా రుజువులు ఉండేవి; కాల్పులు జరిపింది ఈ వ్యక్తే అని మీకు ఖచ్చితంగా తెలిసేది. అటువంటి కేసులలో కూడా, మరణశిక్ష విధించకూడదు.
నేను మరణశిక్ష విధించడానికి వ్యతిరేకిని. అది విధించి ఉండకూడదని నేను చెబుతాను. యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరేదైనా విధించి ఉండవచ్చు.
మరణశిక్ష విధించిన జిల్లా కోర్టు, హైకోర్టు న్యాయమూర్తి నిర్థారిస్తారని చెప్పింది. ఒక విధంగా, మీ భుజాలపై ఉన్న బాధ్యతను మీరు హైకోర్టు న్యాయమూర్తిపైకి నెట్టేశారు. మీ గురించి ఎవరూ ఏమీ అనకుండా ఉండేందుకు మీకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
మొదటి నుంచీ రాజకీయ సమస్యగానే ఉన్నది. ఇప్పుడు ఇది కాంగ్రెస్, బీజేపీ మొదలైన వారందరి మీదకు వచ్చింది.
కానీ అసలు విషయం ఏమిటంటే, ఇది ఏ దేశంలోనైనా జరగడం సహజం. అనేక రాజకీయ సంబంధిత విషయాలు ఉంటాయి. కానీ న్యాయవ్యవస్థ ఎవరి కోసం ఉన్నది? న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ కోసమే ఉంది. అది ఒక స్వతంత్ర వ్యవస్థ. న్యాయవ్యవస్థ ఎవరి అధీనంలోనూ ఉండదు.
మీరు ప్రజలకు మేలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఏమాత్రం మేలు చేయడం లేదు. వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలన్నింటినీ మీరు తార్కికంగా పరిశీలించి, “చూడండి, నా కోర్టుకు అందిన సాక్ష్యాధారాల ప్రకారం, మనకు కనిపిస్తున్నది ఇదే. రెండవ విషయం, న్యాయవ్యవస్థ ఒక రాజకీయ సందర్భంలో పనిచేస్తుంది. బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు.”
ఈ రోజు నక్సలిజాన్ని నిర్మూలించామని అంటున్నారు. నక్సలిజం కాదు, మావోయిజం. ఎందుకంటే ఎన్నికలలో పోటీ చేస్తున్న అనేక ఇతర నక్సలైట్ గ్రూపులు, పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి, మనం నక్సలిజం అని కాకుండా, మావోయిజం అనాలి. మన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమూ, కేంద్ర ప్రభుత్వమూ కూడా అదే చెబుతున్నాయి. వారు ఈ మాటను ఎంతో సంతోషంతో చెబుతున్నారు. మీరు లొంగుబాటు పాలసీ ద్వారా చేయగలిగారు. చాలా మంది మావోయిస్టులు బయటకు వచ్చారు. తమ ఆయుధాలను వదిలేసారు.
అయితే, ఆ సమయంలో కూడా ఒక ప్రశ్న తలెత్తింది: ఇంకా జైలులో ఉన్నవారి సంగతేంటి?
ఈ రోజుకి, గడ్ చిరోలీలో లొంగిపోవడాన్ని లెక్కిస్తే, లొంగిపోయి ఒక సంవత్సరం గడిచింది. వీరంతా ఎప్పటినుంచో జైలులో ఉన్నారు. వారిని అదనంగా మరో సంవత్సరం జైలులో ఉండేలా చేసారు. ఇంకా అరెస్టులు సాగుతూనే ఉన్నాయి; అదీ ఇప్పటికే కేసు విచారణ జరిగి, తీర్పు కూడా ఇచ్చిన కేసులలో అరెస్టు చేస్తున్నారు. అది సామూహిక కేసు కావడం వల్ల ఎవరూ చూడలేదు, కాబట్టి ఈ రోజు కూడా ఈ కేసులో ప్రమేయం ఉందని చెప్పి ఎవరినైనా అరెస్టు చేయచ్చు. ఎవరినైనా జైల్లో పెట్టొచ్చు. ఎందుకంటే ఇది గుర్తుతెలియని వ్యక్తులపై ఉన్న కేసు; అందులో ఎవరి పేరూ లేదు, కాబట్టి అందులో బేలాను, ఎవరినైనా పెట్టొచ్చు. అందుకే ఈ రోజుకీ నేను అలాంటి ఎన్నో కేసులు చూస్తున్నాను, అలాంటి కేసులు ఇంకా కోర్టుకు వస్తూనే ఉన్నాయి. కేసు విచారణ అయిపోతుంది. ఆ కేసులో అరెస్టు అయినవారు నిర్దోషులుగా విడుదల అయిపోయారు. అయినా కూడా ఆ కేసులో ఇంకా కొత్త పేర్లు చేరుతూనే ఉంటాయి. అరెస్టులు సాగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది?
ఒక కేసులో పది మంది ఉన్నారనుకోండి. రెండు, మూడు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు; విచారణలో సాక్షుల సాక్ష్యం అయిపోయింది. ఇంక కేసు ముగిసిపోతుంది అని అనుకున్నారు.
అకస్మాత్తుగా ఇద్దరిని తీసుకువచ్చారు; అదే కేసులో; అదే ఎఫ్ఐఆర్‌లో. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఆ ఇద్దరి సాక్షుల వాంగ్మూలాలు పూర్తయ్యే వరకు ఆ పదిమందిని విడుదల చేయలేరట. అవును, ఇదేం న్యాయం? ఇప్పుడు కూడా ఇలా జరుగుతోంది. కేవలం ధంతేవాడలోనే కాదు, ప్రతిచోటా, అన్నిచోట్లా జరుగుతోంది. ఇలాంటి వాటిని ప్రశ్నించాలి. మీరే స్వయంగా చెబుతున్నారు. ఈ జీరం ఘటన కేసును ఒక ఉదాహరణగా తీసుకొని, మీరేం ఆలోచిస్తున్నారు? అని ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాను. వీలైనంత త్వరగా ప్రజలందరికీ సమాధానం కావాలి. ముందు సమాధానం చెప్పండి, జైలు నిర్బంధంలో ఉన్నవారికి మీరు ఎలా న్యాయం అందించబోతున్నారు? జీరంఘాటి విషయంలో జరిగింది, న్యాయం చేసినట్లు కాదు.
మీకు రాజకీయంగా అనుకూలమైన న్యాయాన్ని మీరు అందిస్తారు. న్యాయమూర్తి గారూ, నేను మీకు స్పష్టంగా ఇదే చెప్తాను. ఒక న్యాయమూర్తి నుండి, ఒక కోర్టు నుండి, ఒక న్యాయ వ్యవస్థ నుండి యావత్ దేశానికి ఉండే చివరి ఆశ న్యాయం జరుగుతుందని. కాబట్టి, ఏ న్యాయమూర్తికైనా ఇలాంటి కేసు, అంటే రాజకీయంగా మారిపోయిన ఒక సవాలుతో కూడిన కేసు ఎదురైనప్పుడు, మీరు సులభమైన మార్గాన్ని ఎంచుకోకూడదు. మీరు మీ బాధ్యతను నెరవేర్చాలి. ఇప్పటికే 13 సంవత్సరాల జైలు శిక్ష అయిపోయింది. ఎలాంటి సాక్ష్యమూ దొరకలేదు. కాబట్టి వారిని నిర్దోషులుగా భావించి విడుదల చేస్తామని మీరు చెప్పి ఉండవచ్చు. 14 సంవత్సరాలు పూర్తి అవడానికి కాస్త సమయం మిగిలి వారికి జరిమానా విధించవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల బస్తర్ లో అనేకమంది హృదయం బద్దలైంది.
ఇప్పుడు చాలా మంది లొంగిపోయారు. వాళ్ళని “వీళ్ళు పెద్దవాళ్ళు”, అందుకే ఏమీ కాలేదు అని తిడుతున్నారు. వారు ఎలాంటి తప్పు పని చేయలేదు. ఎందుకంటే వారికి లొంగుబాటు పాలసీ కింద వారికి ఆ అవకాశం ఇచ్చారు. వారి పాత కేసులన్నీ క్షమిస్తామని చెప్పారు. కాబట్టి, ఆ షరతులు కేవలం ఒక వ్యక్తికి కాదు; అవి అందరికీ వర్తిస్తాయి. కాబట్టి వారిని “మీరు తప్పించుకున్నారని” అనడం సరియైనది కాదు. నేను ప్రజలకు కూడా ఇదే విషయం చెప్పాలనుకుంటున్నాను. వారిపై కోపగించుకునే బదులు, మీరు ప్రభుత్వానికి చెప్పాలి. మీరు అలాంటి పాలసీని ఎలా రూపొందించారు? మీరు అసంపూర్ణమైన విధానాన్ని రూపొందించారు. మీరు కేవలం మావోయిస్టులకు మాత్రమే లొంగిపోవాలని పిలుపునిస్తే కనక, నేడు నక్సలైట్ ఆరోపణలపై ప్రస్తుతం బస్తర్ డివిజన్ జైళ్లలో ఖైదులో ఉన్న సుమారు నాలుగు వేల మంది ఆదివాసుల కోసం మీరు ఎందుకు విధానాన్ని రూపొందించలేదు?
అదే సమయంలో, మీరు ఒక సమాంతర విధానాన్ని రూపొందించి ఉండాల్సింది.
ఈ రోజు లొంగిపోయిన వారికి కూడా నేను అదే చెబుతాను. చాలా మంది వివిధ పరిస్థితులలో లొంగిపోయారు. మీరు నిన్నటివరకు అందులో ఉన్నారు. ఈ రోజు మీ సహచరులకు శిక్ష విధిస్తుంటే మీరు కూడా సామూహికంగా, ఒక్కొక్కల్లు విడి విడిగా కాదు, మీ గొంతెత్తాలి.
మీరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడాలి; మీరు మాట్లాడక తప్పదు. మీరు మీ ఆయుధాలను వదిలేశారు కానీ పోరాటాన్ని వదులుకోలేదు అంటున్నారు. ఒక సంవత్సరం గడిచిపోయింది. వారు కూడా తమ సొంత బహిరంగ సంస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్యం కోసం, న్యాయం కోసం, వారు ఆయుధాలు లేని ఒక బహిరంగ సంస్థను ఏర్పాటు చేయాలని నేను భావిస్తున్నాను. ఈరోజు లొంగిపోయిన వారందరూ అందులో చేరాలి. గ్రామ, గ్రామాన ఉండిన వారి సంఘాలు ప్రజాస్వామిక పద్ధతిలో న్యాయం కోసం పోరాడాలి, నిస్సందేహంగా.
https://www.youtube.com/watch?v=mVjVPfyDMoY
తెలుగు: పద్మ కొండిపర్తి




