వి. గార్గి రచించిన ‘ నో విమెన్, నో హిస్టరీ’ (మహిళ లేనిదే చరిత్ర లేదు ) పుస్తకంలో మొదటగా మనకు ఆసక్తి కలిగించే విషయం దాని ముఖచిత్రమే. విరసం బుక్స్ ప్రచురించిన ఈ ముఖచిత్రంలో, తుపాకులు పట్టుకున్న, గొడ్డళ్లతో కవాతు చేస్తున్న, అలాగే చెట్లను కౌగిలించుకుంటున్న మహిళలు కనిపిస్తారు. ఈ చిత్రంలో వైరుధ్యాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, కవాతుదారులుగా, యోధులుగా మహిళలందరిలో ఒక ఉమ్మడి లక్షణం కనిపిస్తుంది. పాఠకులతో మమేకమై, ఈ పుస్తకం చెప్పదలుచుకున్న ప్రధాన వాదనను తెలియజేస్తుంది. విప్లవ కార్యకర్త అయిన వి. గార్గి, మొదటగా రాసుకున్న నోట్స్ రాసుకుని ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఆమె ఈ పుస్తకాన్ని “అసాధారణమైన ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడి, మనందరి కోసం ఈ ప్రపంచాన్ని మెరుగుపరచడానికి తమ ప్రాణాలను సైతం అర్పించేంత గొప్ప త్యాగాలు చేసిన మహిళలందరికీ…” అంకితం చేశారు.

‘నో విమెన్ నో హిస్టరీ: విమెన్ ఇన్ ఇండియన్ మూవ్‌మెంట్స్ (19వ శతాబ్దం – 2004) ’ మొదటి సంచిక గతేడాది ఆగస్టులో ప్రచురించబడింది. భారతదేశంలోనూ, విదేశాలలోనూ ప్రధాన స్రవంతి స్త్రీవాద చర్చలు స్త్రీలను ఎక్కువగా మేధస్సుతో, కలం శక్తితో ముడిపెడుతున్న కీలక తరుణంలో ఈ పుస్తకం వెలువడింది. వీటన్నింటిన్నీ ఒకరకమైన ప్రత్యేక హక్కులుగా పరిగణిస్తూ, కొన్నిసార్లు రాజకీయంగా వాటిని బలహీనపరిచేవిగా కూడా ఉంటాయి. అలాంటి నేపథ్యంలో, ‘మహిళ లేనిదే చరిత్ర లేదు’ చదవడం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఎందుకంటే, భారతీయ మహిళలు ఎల్లప్పుడూ నిలబడిన పోరాట స్ఫూర్తి వెనుక ఉన్న నిజాన్ని కనుగొనేందుకు, ఈ పుస్తకం మనల్ని మహిళల పోరాట చరిత్ర మార్గంలోకి ఒక ఉధృతమైన యాత్రలా తీసుకువెళుతుంది.

రాజకీయ చరిత్రల అసాధారణ శ్రేణి
ఈ పుస్తకం 19వ శతాబ్దం నుండి 2004 సంవత్సరం వరకు ఉన్న అసాధారణమైన రాజకీయ చరిత్రలను, భౌగోళిక సందర్భాలను వివరిస్తుంది. ఇందులో రైతాంగ, ఆదివాసీ తిరుగుబాట్లు, కుల వ్యతిరేక పోరాటాలు, కార్మిక ఉద్యమాలు, విప్లవ రాజకీయాలు, స్వయంప్రతిపత్తి గల మహిళా సంఘాలు, పర్యావరణ ఉద్యమాలు, ఈశాన్య ప్రాంత పోరాటాలు, సాంస్కృతిక సంస్థలు, సమకాలీన ఉద్యమాల చరిత్రలు ఉన్నాయి. దీని దృక్పథం విస్తృతమైనది; చాలా వరకు మతాతీతమైనది. గార్గి “మహిళల సమస్యలను” ఒక ప్రత్యేక రాజకీయ వర్గంగా చూడకుండా, మహిళలను రైతులుగా, కార్మికులుగా, చేతివృత్తులవారుగా, దళితులుగా, ఆదివాసీలుగా, మైనారిటీ సముదాయాల సభ్యులుగా సామాజిక, రాజకీయ పోరాటాల విస్తృత నిర్మాణంలో భాగంగా నిలుపుతుంది.

ఈ రచనా పద్ధతి జెండర్ వివక్షను ఒక విడి వ్యవస్థగా కాకుండా, కులం, వర్గం, భూస్వామ్య సంబంధాలు, ఆర్థిక దోపిడీ, రాజకీయ అధికారాలతో ముడిపడి ఉన్నదిగా చూపిస్తుంది. మహిళా విముక్తి చరిత్రను సంస్థల చరిత్రగా కాకుండా ఉద్యమాల చరిత్రగా చదవడానికి వీలు కల్పించే అత్యంత ముఖ్యమైన అధ్యయన విధాన సహకారాన్ని ఈ పుస్తకం అందిస్తుంది. భూమి, వేతనాలు, శ్రమ, కుల శ్రేణి, ఆహారం, నిర్వాసిత్వం, అడవులు, రాజకీయ ప్రాతినిధ్యం; రాజ్యాధికారం కోసం మహిళలు పోరాడిన ఉద్యమాల చరిత్ర ఇది. అందువల్ల, మహిళల చరిత్ర సాంప్రదాయ సరిహద్దులను దాటి అన్వేషించడానికి ఈ చారిత్రక విస్తృతి చాలా ముఖ్యమైనది.

ఆదివాసీ, రైతాంగ తిరుగుబాట్లలో మహిళల భాగస్వామ్యంతో మొదలుపెట్టి, రాణులు, బేగంల చరిత్రలకూ, పంతొమ్మిదవ- ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశలోని రాజకీయ అలజడిలో పాల్గొన్న సాధారణ మహిళల చరిత్రల వరకు గార్గి సమన్వయం చేస్తూ ముందుకు సాగారు. ఈ విధమైన వైవిధ్యభరితమైన పోల్చి చూపే విధానం వల్ల మహిళా చరిత్ర అనేది కేవలం కొద్దిమంది ‘అసాధారణ మహిళామూర్తుల ప్రదర్శన శాల’గా మారిపోకుండా నివారిస్తుంది. ఇది రాజకీయ చరిత్రలోని ప్రధాన స్రవంతి కథనాలకు దూరంగా ఉండిపోయిన సాధారణ మహిళల—ముఖ్యంగా రైతాంగ, శ్రామిక, దళిత, ఆదివాసీ, ఇతర వెనుకబడిన వర్గాల మహిళల—రాజకీయ శ్రమ, పోరాటాల్లోకి లోతుగా తొంగి చూస్తుంది.

ప్రసిద్ధ మహిళా మార్గదర్శకుల గురించి తరచుగా ప్రస్తావించడం ఉద్యమాల గురించిన చర్చలలో ఒక ముఖ్యమైన లక్షణం. ఉదాహరణకు, ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎక్కువగా పెరియార్‌తో ముడిపెడతారు, కానీ పెరియార్ మరణానంతరం కజగంకు నాయకత్వం వహించిన మణియమ్మై గురించి ప్రస్తావించడాన్ని తరచుగా మర్చిపోతారు. కానీ, గార్గి అంబేద్కర్, దళిత ఉద్యమాలలో మహిళలు పోషించిన పాత్ర గురించి కూడా విస్తృతంగా చర్చిస్తారు. 1960-65 నాటి జైలు భరో సత్యాగ్రహం వంటి ఉద్యమాలలో మహిళల భాగస్వామ్యానికి ఉండిన విలక్షణమైన రూపాలు కూడా ఇలాంటి ఇతర ప్రస్తావనలలో ఉన్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల చరిత్రలు, మహిళా విప్లవకారులు, కమ్యూనిస్టుల చరిత్రలను కూడా, ప్రధాన కథనాలలో అంతగా పరిచయం లేని సంస్థాగత చరిత్రలతో పాటుగా ఇదే విధంగా పొందుపరుస్తారు.

అదేవిధంగా, ఈ పుస్తకం అంతగా ప్రస్తావనకు రాని సమూహాల గురించి కూడా చర్చిస్తుంది. ఉదాహరణకు, విభజనకు ముందు మహిళా సమీకరణకు ఒక ముఖ్యమైన రూపంగా ఆవిర్భవించిన మహిళా ఆత్మరక్ష సమితులు.
తర్వాతి అధ్యాయాలు దేశ విభజన సమయంలోనూ, ఆ తర్వాత మహిళల అనుభవాలను అన్వేషిస్తాయి. రాజకీయ అస్థిరతలు ఉన్నప్పటికీ, మహిళా విముక్తి పోరాటాలలో పాల్గొన్న మహిళలు జెండర్-ఆధారిత సామూహిక కార్యాచరణ రూపాల ద్వారా చర్చలు జరిపి, వాటిని ప్రతిఘటించిన చరిత్రలోని ఒక దశను ఈ పుస్తకం వెలికితీస్తుంది.

వ్యవస్థీకృత మహిళా మిలీషియా (సాయుధ దళాల) విషయంలో, మహిళలను ఒక మిలీషియాగా సంఘటితం చేయడానికి చేసిన తొలి ప్రయత్నాలలో ఒకటైన ‘నారీ బాహిని’ ఏర్పాటు ద్వారా తెభాగా పోరాట కాలం నాటి చరిత్రను ఈ పుస్తకం లోతుగా పరిశీలిస్తుంది. వ్యవసాయ రాజకీయాలలో మహిళల భాగస్వామ్యానికి ఇది పాఠకులకు మరో అద్భుతమైన ఉదాహరణను అందిస్తుంది. ఆ తర్వాత ఈ చరిత్ర వలస పాలనలోని కార్మిక వర్గ ఉద్యమాలకు; తమిళనాడు నుండి ఛత్తీస్‌గఢ్ వరకు వివిధ ప్రాంతాలలో జరిగిన మహిళా కార్మికుల పోరాటాలకు విస్తరిస్తుంది.
ఈ చరిత్రలన్నింటిలో జరిగిన భౌగోళిక విస్తరణే ఒక ముఖ్యమైన జోక్యం. మహిళల రాజకీయ చరిత్ర కేవలం మహానగర కేంద్రాలకో, లేదా స్త్రీవాదంతో స్పష్టంగా ముడిపడి ఉన్న సంస్థలకో మాత్రమే పరిమితం కాదు. అది ఫ్యాక్టరీలు, గ్రామాలు, అడవులు, వ్యవసాయ క్షేత్రాలు, కార్మిక వర్గ నివాస ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలలో కూడా ఉంది. తమిళనాడు, బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్‌లలో జరిగిన ఈ విస్తరణ, జెండర్, భూమి, శ్రమ, కులం, సమాజం, పర్యావరణం, జీవనోపాధి నుండి వేరు చేయలేని ఒక రాజకీయ భౌగోళిక స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది.

పాల్గొనడం అధికారంతో సమానం కాదు:
నక్సల్బరీ, తదనంతర విప్లవ ఉద్యమాలపైన ఉన్న అధ్యాయాలు, ఈ పుస్తకాన్ని భారత రాజకీయ చరిత్రలోని అత్యంత వివాదాస్పద రంగాలలో ఒకదానిలోకి విస్తరింపజేస్తున్నాయి. పురుష విప్లవ నాయకత్వానికి సంబంధించిన సుపరిచితమైన చరిత్రల నీడలో తరచుగా మరుగునపడిపోయిన మహిళల భాగస్వామ్యాన్ని గార్గి ఇక్కడ వెలుగులోకి తెచ్చారు. మహిళలు ఆర్గనైజర్లుగా, కొరియర్లుగా, రాజకీయ కార్యకర్తలుగా, కొన్ని సందర్భాల్లో పోరాట యోధులుగా కనిపిస్తారు. విప్లవ రాజకీయాలు ప్రధానంగా పురుషులకే పరిమితమైన రంగం అనే భావనను వారి ఉనికి సవాలు చేస్తుంది.

కానీ, ఈ పుస్తకంలో సేకరించిన చరిత్రలు మరింత క్లిష్టమైన సైద్ధాంతిక ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నాయి. ఒక రాడికల్ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం, ఆ ఉద్యమంలోని జెండర్ పరమైన అధికార పంపిణీని తప్పనిసరిగా మారుస్తుందా? అని మనల్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి.

ఇక్కడ భాగస్వామ్యానికీ, రాజకీయ అధికారానికీ మధ్య ఉన్న వ్యత్యాసం చాలా కీలకం. ఒక ఉద్యమానికి మహిళలు అనివార్యమైనప్పటికీ, దాని వ్యూహాత్మక నిర్ణయ ప్రక్రియలో వారికి తగిన ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. వారు సంఘటితం కావచ్చు, సమీకరించవచ్చు, సందేశాలను చేరవేయవచ్చు, రహస్య నెట్‌వర్క్‌ లను కొనసాగించవచ్చు, అణచివేతను సహించవచ్చు, కానీ రాజకీయ అధికారం మాత్రం వేరేచోట కేంద్రీకృతమై ఉంటుంది. అందువల్ల, విప్లవ ఉద్యమాల చరిత్ర కేవలం మహిళల ధైర్యాన్ని, స్వీయ నిర్ణయాధికారాన్ని ప్రదర్శించడానికే కాకుండా, సంస్థాగత నిర్మాణాలు స్వయంగా పితృస్వామ్యాన్ని ఎలా పునరుత్పత్తి చేస్తాయి లేదా సవాలు చేస్తాయి అనే ప్రశ్నను లేవనెత్తడానికి కూడా ప్రాసంగికంగా మారుతుంది.

గార్గి పునర్నిర్మించిన విస్తృత చరిత్ర అంతటా ఈ ప్రశ్న అంతర్లీనంగా ఉంటుంది. ఉదాహరణకు, తెభాగా ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం, రాడికల్ సమీకరణలోని అవకాశాలను, అలాగే వాటిలోని వైరుధ్యాలను రెండింటినీ స్పష్టంగా చూపిస్తుంది.. శారీరక బలహీనత, గృహ బాధ్యతలు, మహిళల రాజకీయ భాగస్వామ్యం వల్ల కుటుంబాలలో, సముదాయాలలో ఏర్పడే అలజడుల గురించిన అపోహలు ఎదురైనప్పటికీ… మహిళలు రైతాంగ పోరాటాలలో కీలక పాత్ర పోషించగలిగారు..

ప్రగతిశీల రాజకీయాలు తప్పనిసరిగా పితృస్వామ్యమైనవని దీని అంతరార్థం కాదు; కానీ కేవలం ప్రగతిశీల రాజకీయ భావజాలం మాత్రమే పితృస్వామ్యాన్ని నిర్మూలించగలదని భావించలేము. రాజకీయ ఉద్యమాలకు వాటి స్వంత సంస్థాగత సంస్కృతులు, శ్రేణులు, శ్రమ విభజనలు ఉంటాయి. అందువల్ల, మహిళా విముక్తి అనే ప్రశ్నలో, అలాంటి విముక్తి ఉద్యమాల పరిధిలో రాజకీయ అధికారాన్ని ఎవరు చెలాయిస్తారనే ప్రశ్నను కూడా చేర్చాల్సి ఉంటుంది.

గాంధీవాద రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం:
గాంధీజీ రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం, వారికి అందుబాటులో ఉన్న రాజకీయ కార్యాచరణ పరిధిని నిస్సందేహంగా విస్తరించింది. అయినప్పటికీ, ఆ భాగస్వామ్యానికి సంబంధించిన నిబంధనలు చర్చనీయాంశం కావచ్చు.

ఉదాహరణకు, రాట్నం వడకడం, ఖాదీ వంటివి రాజకీయ కార్యకలాపాలను గృహ పరిధిలోకి తీసుకురాగలిగాయి; అలాగే బహిరంగ రాజకీయ రంగాలలో సమాన హోదాలో ప్రవేశించలేని మహిళలకు భాగస్వామ్యాన్ని సాధ్యం చేయగలిగాయి. కానీ, ఇంటి నుండి మాత్రమే రాజకీయాల్లో పాల్గొనే అవకాశం ఉండటమనేది ఒక ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది: రాజకీయ జీవితంలో మహిళలను భాగస్వాములను చేయడం అనేది జెండర్ ఆధారిత శ్రమ విభజనను ఎప్పుడు మారుస్తుంది; మహిళలు అప్పటికే చేయవలసి ఉంటుందని భావించే శ్రమకు అది రాజకీయ అర్థాన్ని ఎప్పుడు ఆపాదిస్తుంది? అటువంటి వైరుధ్యాలు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది కాబట్టి గార్గీకి ఉన్న చారిత్రక దృక్పథం విశిష్టమైనది.

60; 70ల దశాబ్దాలు:
1960ల చివర, 1970ల నాటి రాజకీయ పరివర్తనల గురించిన ఈ పుస్తకపు వివరణ మరో ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. నవ నిర్మాణ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం, ఎమర్జెన్సీకి వ్యతిరేకత, అత్యాచారం, వరకట్నం, లింగ నిర్ధారణ వంటి అంశాలపైన స్వయంప్రతిపత్తిగల మహిళా ఉద్యమాల ఆవిర్భావాన్ని గార్గి పరిశీలిస్తారు.

ఈ కాలం మహిళలు తమ అనుభవాలను వ్యక్తపరిచే పదజాలాన్ని మార్చివేసింది. కుటుంబ హింస, లైంగిక హింస, కట్నం, పునరుత్పత్తి నియంత్రణ వంటివి వ్యక్తిగత లేదా ద్వితీయ ప్రాధాన్యత గల సమస్యలుగా కాకుండా, చట్టం, సంస్థ, సామాజిక అధికారం, రాజ్యంతో ముడిపడి ఉన్న రాజకీయ ప్రశ్నలుగా అర్థం చేసుకోవడం అనేది క్రమంగా పెరిగింది.

అందువల్ల, స్వయంప్రతిపత్తిగల మహిళా సంఘాల ఆవిర్భావం కేవలం ఒక కొత్త సంస్థాగత పరిణామం మాత్రమే కాదు. అది రాజకీయ వ్యవస్థకే ఒక పునర్నిర్వచనాన్ని సూచించింది. ఆర్థిక వ్యవస్థ, రాజ్యం లేదా వర్గ సంబంధాలు వంటి ఇతర రంగాలలో మరింత మౌలికమైన మార్పులు జరిగే వరకు మహిళా విముక్తి ప్రశ్నను ఇకపై వాయిదా వేయలేము. వ్యక్తిగత జీవితం, లైంగికత, పునరుత్పత్తి, కుటుంబ సంబంధాలను నియంత్రించే నిర్మాణాలే రాజకీయ అధికారానికి నిలయాలని మహిళలు నొక్కిచెప్పారు.

అదే సమయంలో, ఈ ఉద్యమాలు వర్గం, కులం, మతతత్వం, శ్రమ; రాజ్యాధికారాల పై జరిగిన విస్తృత పోరాటాలతో నిరంతరం ముడిపడి ఉన్నాయి. తత్ఫలితంగా, గార్గి పునర్నిర్మించిన చరిత్ర “వర్గ రాజకీయాలు”-“స్త్రీ రాజకీయాల” మధ్య సులభమైన వ్యతిరేకత లేదా విభజనను ప్రతిఘటిస్తుంది. దానికి బదులుగా, ఇది విభిన్న రాజకీయ ప్రాధాన్యతలు; విముక్తికి సంబంధించిన విభిన్న అవగాహనల మధ్య కొనసాగుతున్న సంప్రదింపులను వెల్లడిస్తుంది.

విప్లవోద్యమాలు: విముక్తి సమస్య:
ఈ సందర్భంలో కమ్యూనిస్ట్, మావోయిస్ట్ ఉద్యమాలతో ఈ పుస్తకానికి నిరంతరంగా కొనసాగిన సంబంధం ప్రత్యేకంగా ముఖ్యమైనది. విప్లవ పోరాటాలలో, వారి సంస్థాగత, రాజకీయ, కొన్ని సందర్భాల్లో సాయుధ పాత్రలతో సహా మహిళల అసాధారణ భాగస్వామ్యాన్ని గార్గీ నమోదు చేశారు. ఈ చరిత్రలు ముఖ్యమైనవి, ఎందుకంటే విప్లవ రాజకీయాలలో మహిళలను కేవలం పురుష విప్లవకారుల మద్దతుదారులుగా మాత్రమే చిత్రీకరించే నిరంతర ధోరణిని ఇవి సవాలు చేస్తాయి.

అయినప్పటికీ, ఒక విప్లవోద్యమంలో మహిళలకు విముక్తి అంటే ఏమిటి? విస్తృత రాజకీయ లక్ష్యాల నేపథ్యంలో స్వయంప్రతిపత్తి డిమాండ్లను ఎలా సమన్వయం చేస్తారు? వర్గ సంబంధాలను మార్చడానికి కట్టుబడి ఉన్న ఉద్యమంలో మహిళలు పాల్గొన్నంత మాత్రాన, ఆ ఉద్యమంలోని జెండర్ సంబంధాలను తప్పనిసరిగా మారుస్తుందా? లాంటి చారిత్రక సమాచారం ప్రాతినిధ్య ప్రశ్నను మించి మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది.

ఆ ఉద్యమాల్లో పాల్గొన్న మహిళల సంఖ్యను కొలవడం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేము. అవి రాజకీయ చొరవకు, రాజకీయ అధికారానికి మధ్య; అధికారిక నిబద్ధతలకు, రోజువారీ సంస్థాగత పద్ధతులకు మధ్య; మహిళల స్వయంప్రతిపత్తి డిమాండ్లకు, విస్తృత ఉద్యమాల ప్రాధాన్యతలకు మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించినవి.
గార్గి చేసిన చారిత్రక పునరుద్ధరణ ప్రాముఖ్యత ఏమిటంటే, అది ఈ ప్రశ్నలను సాధ్యం చేస్తుంది, ఇది తనంతట తానుగా ఒక అరుదైన విషయం.

మహిళా ఉద్యమాల పరిచిత పరిధులను దాటి…:
తర్వాతి అధ్యాయాలు భౌగోళిక, భావనాత్మక పరిధిని మరింత విస్తరింపజేస్తాయి. షా బానో కేసు గురించిన చర్చ, మహిళల రాజకీయ సమీకరణ చరిత్రలోకి జెండర్, చట్టం, మతం, పౌరసత్వం వంటి ప్రశ్నలను తీసుకువస్తుంది. ఈశాన్య ప్రాంతంలోని మహిళా ఉద్యమాలు, ఉత్తరాఖండ్‌లోని పర్యావరణ పోరాటాల గురించి ఉన్న అధ్యాయాలు, భూమి, పర్యావరణం, సమాజం, జీవనోపాధికి సంబంధించిన ప్రశ్నలు జెండర్ సంబంధిత రాజకీయ ప్రశ్నలుగా ఎలా మారతాయో వివరిస్తాయి.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల ప్రభావితమైన మహిళల చరిత్ర ఈ విషయంలో మరో ముఖ్యమైన ఉదాహరణను అందిస్తుంది. ఇందులో ప్రాణాలతో బయటపడిన మహిళలు వైద్య సహాయాన్ని, సహాయక చర్యలను, సమాచారాన్ని పొందడం కోసం ‘భోపాల్ గ్యాస్ పీడిత్ మహిళా ఉద్యోగ్ సంఘటన్’ను ఏర్పాటు చేసుకున్నారు. మహిళల పోరాటం గురించి వచ్చే పుస్తకాలలో ఇటువంటి ఉదంతాలను అరుదుగా చర్చిస్తారు. ఆ విషాదం గురించిన చాలా కథనాలలో, మహిళలను ఒక పారిశ్రామిక విపత్తు బాధితులుగా చిత్రీకరించారు, కానీ వాస్తవానికి, వారు కేవలం బాధితుల రాజకీయ గుర్తింపుకే పరిమితం కాలేదు. వారు నిర్వాహకులుగా, హక్కుల సమర్ధకులుగా మారి, ఆ విపత్తు అనుభవాన్ని సహాయక చర్యలకోసం, తమ హక్కుల కోసం ఒక నిరంతర పోరాటంగా మలిచారు.

భారతీయ మహిళా ఉద్యమాల గమనాన్ని ఒకే విధంగా చెప్పడం కష్టతరం అవుతుంది. ఒక ఫ్యాక్టరీ కార్మికురాలు, నిర్వాసిత సమస్యను ప్రతిఘటిస్తున్న ఒక ఆదివాసీ మహిళ, కుల వివక్షను ఎదుర్కొంటున్న ఒక దళిత మహిళ, లైంగిక హింసను ఎదుర్కొంటున్న ఒక పట్టణ స్త్రీవాది; ఒక రహస్య విప్లవ సంస్థలో పాల్గొంటున్న మహిళ – వీరందరి రాజకీయ అనుభవాలను కేవలం ఒకే శ్రేణిలో చేర్చలేము. కానీ ఈ పుస్తకం వాటన్నింటినీ విడివిడిగా అర్థం చేసుకోవడానికి బదులుగా, అధికార స్వరూపాలలోని ఉమ్మడి అంశాల ద్వారా ఒకరి పోరాటాన్ని పోరాటంతో అనుసంధానించడానికి కృషి చేస్తుంది.

ఆర్థిక ఉదారీకరణ తదనంతర కాలం:
గార్గి రూపొందించిన చారిత్రక ప్రస్థానం, ఆర్థిక ఉదారీకరణ తర్వాత మహిళల రాజకీయ జీవితంలో వచ్చిన మార్పుల వైపు కూడా దృష్టిని ఆకర్షిస్తుంది. అసంఘటిత, కాంట్రాక్టు కార్మికరంగ విస్తరణ; వలసలు, సేవ, ఆర్థిక వ్యవస్థ వృద్ధి; పనిప్రాంతాల విచ్ఛిన్నం, వేతనం లేని, సంరక్షణ పనుల ప్రాముఖ్యత పెరుగుదల; కొత్త రూపాల్లో సరుకులుగా మార్చడం, సామాజిక అభద్రత వంటివి పెరగడంతో పోరాటాల రూపాలు గణనీయంగా మారిపోయాయి.

ఈ పరివర్తనలు మునుపటి పోరాటాలను అప్రస్తుతం చేయవు. పైగా, మహిళలు సామూహిక రాజకీయ ప్రాతినిధ్యాన్ని వినియోగించుకోగల సంస్థాగత రూపాలను ఇవి సంక్లిష్టం చేస్తాయి. ఫ్యాక్టరీ ప్రాంగణాలు, పంట పొలాలు, నివాస ప్రాంతాలు ముఖ్యమైన పోరాట క్షేత్రాలుగా మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి విచ్ఛిన్నమైన కార్యాలయాలు, అసంఘటిత ఉపాధి, గృహ కార్మిక వ్యవస్థ, వేదికల ద్వారా జరిగే పని; అంతకంతకూ వ్యక్తిగతీకరించబడుతున్న ఆర్థిక అభద్రతా రూపాలతో కలిసి ఉన్నాయి.

ఈ సుదీర్ఘ చారిత్రక దృక్కోణం నుండి చూసినప్పుడు, మహిళా విముక్తి అనేది సంస్థాగత నిర్మాణం అనే అంశంతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. మహిళలు నిరసన గళాన్ని సమిష్టిగా వినిపించే రూపాలు తమ చుట్టూ ఉన్న ఆర్థిక, రాజకీయ నిర్మాణాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ మారుతూ వచ్చాయి. ఆ మారుతున్న క్షేత్రాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన సుదీర్ఘ చారిత్రక పరిణామక్రమాన్ని గార్గీ రచించిన చరిత్ర అందిస్తుంది.

చరిత్ర కేంద్రబిందువుగా మహిళలు :
ఫుట్‌నోట్‌లు లేకపోవడం అనే ఒక పరిశోధనాత్మక పరిమితి ఈ పుస్తకంలో ఉన్నది. దీనివల్ల పాఠకులు పుస్తకంలోని చారిత్రక ఆధారాలను గుర్తించడం లేదా సరిచూసుకోవడం కాస్త కష్టమవుతుంది.. అజ్ఞాత జీవితంలో ఉండి రాయడం అనే పుస్తక ఆవిర్భావ నేపథ్యాన్ని బట్టి ఇది అర్థం చేసుకోదగినదే అయినప్పటికీ, మంచి విషయమేమిటంటే—ఈ లోపం కూడా ఆ పుస్తక ఉద్దేశాన్ని గానీ, ఇప్పటివరకు మనకు బోధించిన రాజకీయ చరిత్ర రూపకల్పనను పునఃపరిశీలించమని కోరే దాని శక్తివంతమైన జోక్యాన్ని గానీ కొంచెం కూడా తగ్గించలేదు.

చరిత్రలో మహిళలకు స్థానం కల్పించడం అంటే, రాజకీయ చరిత్రను అర్థం చేసుకునే అర్థం చేసుకునే వర్గీకరణలను మార్చడం అని గార్గి తన కృషి ద్వారా నిరూపించారు. గార్గి మన ముందుకు తీసుకువచ్చిన మహిళలు సందేశాలను చేరవేసారు; కార్మికులను సంఘటితం చేశారు; భూస్వాములను ఎదుర్కొన్నారు; కుల శ్రేణులను సవాలు చేసారు; రహస్య నెట్‌వర్క్‌ లను నడిపారు; భూమి, వేతనాల కోసం పోరాడారు, మహిళా సంఘాలను నిర్మించారు, ప్రభుత్వ అణచివేతను ప్రతిఘటించారు; కొన్ని పోరాటాలలో సాయుధులయ్యారు. చరిత్రకు మహిళలు చేసిన ఇంతటి విస్తృతమైన కృషిని దృష్టిలో పెట్టుకుంటే, ‘ నో విమెన్, నో హిస్టరీ’ సాధించిన ప్రధాన విజయం, చరిత్ర రచననే సవాలు చేయడంలో ఉంది.

ఒక చరిత్ర వ్యాకరణాన్ని సవాలు చేసి, మనందరినీ దాని నిర్మాణం నుండి పునరుద్ధరించడానికి చేసిన ఈ ప్రయత్నానికి ఒక పాఠకురాలిగా నేను గార్గికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను.

వర్టికా మణి ఒక స్త్రీవాద రచయిత్రి, భారత సుప్రీంకోర్టులో న్యాయవాది, ప్రస్తుతం పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) కు ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

https://www.groundxero.in/2026/11/03/where-women-make-history-reclaiming-agency-in-history-and-in-movements

Leave a Reply