కేంద్రంలోని కూటమి ప్రభుత్వం 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు- 2026 ను ఏప్రిల్ 18వ తేదీన లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో లోక్ సభ, శాసనసభల స్థానాల పునర్విభజన, అందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల గూర్చి పేర్కొన్నారు. ఈ బిల్లు 2 /3 వ వంతు మెజారిటీతో గెలుపొందవలసి ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వానికి లోక్ సభలో అంత మెజారిటీ లేకపోవడం వలన వీగిపోయింది. అనంతరం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అధికార పక్ష నాయకులు ప్రతిపక్షానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదంటే, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. వాస్తవానికి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మహిళ రిజర్వేషన్ల బిల్లు కాదు. ఇది కేవలం నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మాత్రమే. ఇందులో మరోసారి మహిళా రిజర్వేషన్ల కోసం ప్రస్తావన చేశారు. పై విషయాలు మనకు అర్థం కావాలంటే 2023 లో 128 వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధమైన మహిళ రిజర్వేషన్ల బిల్లు గూర్చిమనం సమగ్రంగా తెలుసుకోవాలి.


2023 లో 128వ రాజ్యాంగ సవరణ” నారీ శక్తి వందన్ అధినియం” పేరుతో లోక్ సభ, రాజ్యసభ ఆమోదించి, తదుపరి రాష్ట్రపతి ఆమోదం తో చట్టం చేశారు. ఫలితంగా రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్స్ 330-A, 332-A, 334-A లు చేర్చబడ్డాయి. ఈ చట్టం ప్రాప్తికి లోక్ సభ, రాష్ట్ర శాసనసభలలో sc,st మహిళలకు 33 % సీట్లు కేటాయించబడతాయి. ఇది ప్రతీ ఎన్నికల సందర్భంగా రొటేషన్ పద్ధతిలో వారికి నియోజకవర్గాలు మారుతూ ఉంటాయి. కానీ ఈ మహిళా రిజర్వేషన్లు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మాత్రమే తదుపరి ఎన్నికల నుంచి అమలు చేయబడతాయని చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టం లింగ సమానత్వం, చట్టసభలలో మహిళల శాతం పెరుగుదల ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ చట్టంలో లోపం ఏమిటంటే, ” ఓబీసీ, మైనారిటీ మహిళలకు రిజర్వేషన్లు వర్తింప చేయక, జనరల్ కోటా లోనే వారిని కలిపివేయడం జరిగింది”. ఈ అంశం అప్పుడు ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ చట్టం కావడం జరిగింది.
మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం జనగణన పూర్తి చేయకుండానే, నియోజకవర్గ పునర్విభజన జరగకుండానే మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో 131వ రాజ్యాంగ సవరణ చేయడానికి ప్రయత్నించింది. అసలు మహిళా రిజర్వేషన్లు అమలు కావాలన్నా, నియోజకవర్గ పునర్విభజన జరగాలన్న, ముందుగా జనగణన జరగాలి. ఇది పూర్తి కావడానికి మరో సంవత్సరకాలం పడుతుంది. కానీ అంతవరకు కూటమి నాయకత్వం వేచి చూడకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాన్ని అభాసుపాలు చేయడానికి లోక్ సభలో తగినంత మెజారిటీ లేకుండానే ఈ బిల్లును హడావుడిగా ప్రవేశ పెట్టారు. ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లు వీగిపోయింది.


13 సంవత్సరాలు నలిగి నలిగి 2023 లో చట్టం కాబడిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిజానికి కూటమి నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే అప్పుడే 543 లోక్ సభ స్థానాలలోను, ఆయా రాష్ట్ర శాసనసభ స్థానాలలోను sc,ఎస్టీ, ఓబీసీ,మైనారిటీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి, 2024 లోక్ సభ ఎన్నికలు నుంచే అమలు చేసి ఉండేవారు. ప్రతిసారి ఏదో ఒక వివాదం సృష్టించి ఓట్ల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మా తలు ఆశించినట్లుగా స్వేచ్ఛ, సమానత్వం ప్రజలందరికీ అందడం లేదు. మరలా ఇప్పుడు డీ లిమిటేషన్ కోసం మహిళ రిజర్వేషన్ అంశాన్ని అడ్డుపెట్టుకొని కూటమి నాయకత్వం లబ్ది పొందాలని చూస్తున్నారు. చట్టసభలలో ఏ వర్గం మహిళలకు ప్రవేశం కల్పించబడుతుంది? ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు లబ్ధి పొందుతున్నారు తప్ప శ్రామిక వర్గం మహిళలకు వీటిలో ప్రవేశం శూన్యం. 1952 నుంచి జరుగుతున్న ఎన్నికలు ఉన్నత వర్గాల వారికే ప్రయోజనం చేకూర్చ బడుతుంది. తీరా ఈ ఉన్నత వర్గ మహిళలు చట్టసభలకు ఎన్నిక కాబడిన తర్వాత భార్య పేరుతో భర్త, తల్లి పేరుతో కుమారులు, కుమార్తెల పేరుతో తండ్రి, అన్నదమ్ములు అధికారం చలా ఇస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. పేరు కే పదవులు తప్ప మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం ఆచరణలో జరగడం లేదు. గత 10- 15 సంవత్సరాల నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలకు జీతభత్యాలు పెంపుదలతో ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రజాధనం వృధా కాబడుతోంది. ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలకు జీతం, నాతం ఎక్కువగానే ముడుతున్నాయి. మరి ఇప్పుడు డీ లిమిటేషన్ తో ఎంపీ,ఎమ్మెల్యే స్థానాల సంఖ్య విపరీతంగా పెరిగితే ప్రజాధనం ఇంకా వృధా కాబడి, ప్రజల సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు కుంటుపడతాయి. కావున దేశంలో గల ప్రస్తుత లోక్ సభ, రాష్ట్ర శాసనసభల స్థానాల సంఖ్య ప్రాప్తికే 33 % మహిళా రిజర్వేషన్లు అమలు కోసం వామపక్ష,ప్రజాతంత్ర వాదులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ, 128వ రాజ్యాంగ సవరణ చట్టంలోని లోపాలను సరి చేయాలని, ఎస్సీ, ఎస్టి, ఓబిసి, మైనారిటీ మహిళలందరికీ చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పోరాడినప్పుడే, చట్టసభలలో మహిళ రిజర్వేషన్లు అమలు కావడం జరుగుతుందని ఆశిద్దాం.

Leave a Reply