ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆశించిన స్థాయిలోనే దిగుబడి ఇచ్చినప్పటికీ, మార్కెట్ మాయాజాలంలో మామిడి కౌలు రైతుకు తీరని చేదు అనుభవమే ఎదురైంది.

    ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 84 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోందని చెబుతున్నప్పటికి, అనధికారికంగా 1లక్ష ఎకరాల కు పైనే ఉంటుందని మరికొన్ని స్వచ్ఛంద సంస్థల సర్వేలు తెలియజేస్తున్నాయి.

  మామిడిలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ అందులో బెనిష రకాన్ని మన రాయలసీమలో రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ రకం మామిడి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో పండించినప్పటికీ మన రాయలసీమలోని అనంతపురం, మదనపల్లి ప్రాంతాలకు ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ మొదలగు మధ్య,  ఉత్తర భారతం నుంచి వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.  ఈ ప్రాంత వాతావరణం, నేల స్వభావం కారణంగా మంచి సువాసన తోపాటు అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.  ఇది దేశంలో మరి ఏ ప్రాంతంలోనూ ఇలాంటి ప్రత్యేకత కనిపించదు. అందుకే వీటికి భారతదేశంతో పాటు విదేశాలలోనూ మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండే మామిడికు గల్ఫ్ అమెరికా యూరప్ లాంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది.

  ఉమ్మడి అనంతపురం జిల్లాలో మామిడి కౌలు రైతులు సుమారు 10 నుంచి 15 వేల మంది ఉన్నట్లు రైతు సంఘాల నివేదికలు తెలియజేస్తున్నాయి. అందులోనూ ఎక్కువ శాతం  కళ్యాణదుర్గం, కంబదూరు,కుందుర్పి, శెట్టూరు, బెలుగుప్ప మండలాలలోనే ఎక్కువగా మామిడి కౌలు రైతులు సాగు చేస్తున్నారు.

  కళ్యాణదుర్గం మండలంలోనే నివాసముంటున్న అనిల్ కుమార్ అనే డిగ్రీ పూర్తి చేసుకొని  23 ఏళ్ల యువకుడు గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకొని అందులోనూ 5 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. కౌలు పద్ధతి అన్ని పంటలకు ఒకే విధంగా వర్తించదనే విషయం మామిడి కౌలు రైతులను చూసిన తర్వాతే మనకు అర్థమవుతుంది. సాధారణంగా కౌలు రైతులు అనగానే కొంత భూమిని రైతు లేదా భూ యజమాని దగ్గర ఒక ఏడాదికి కొంత డబ్బు చెల్లిస్తామనే ఒక ఒప్పందం మీద భూమిని కౌలుకు తీసుకొని ఆయా సీజన్ కు అనుకూలంగా పంటలను చేస్తారు. ఒక ఏడాదికి భూమిని కౌలుకు తీసుకుంటే ఒక పంటలో నష్టం వచ్చినా, రెండో పంటలో అయినా ఆ నష్టాన్ని పూడ్చుకునే ఒక వెసులుబాటు కౌలు రైతుకు ఉంటుంది. కానీ మామిడి కౌలు రైతుల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా మనకు కనిపిస్తుంది. ఇందులో ఒకసారి నష్టం వస్తే తిరిగి పుడుచుకోవడానికి అవకాశం ఉండదు. ఇది ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే పంట. మామిడి తోటల యజమానుల నుంచి జూన్, జులై నెలలోని కౌలుకు తీసుకొని సాగు మొదలుపెడతారు. ఎనిమిది నుంచి పది సంవత్సరాలు కన్నా ఎక్కువ వయసు గల ఒక్కో మామిడి చెట్టుకు నీటి సౌకర్యం, నేల స్వభావం, మామిడి రకంతో పాటు ఆ ప్రాంత స్వభావాన్ని బట్టి కూడా 800 నుంచి 1200 వందల రూపాయలు కవులు చెల్లించే పద్ధతి ఉమ్మడి అనంతపురం జిల్లా పశ్చిమ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది.

   అనిల్ కుమార్ అనే ఒక యువరైతు కళ్యాణదుర్గం మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల ఒక గ్రామం లో 5 ఎకరాలలో ఉన్న 300 మామిడి చెట్లను ఒక్కొ చెట్టుకు 850 రూపాయల చొప్పున మొత్తం 300 చెట్లకుకాను 2.55 లక్షలు కౌలు చెల్లించే విధంగా గత సంవత్సరం జూలైలో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

   ఒప్పందం కుదుర్చుకున్న రోజు నుంచే మామిడి సాగును దశలవారీగా మొదలుపెట్టాడు. ఇందులో ప్రధానంగా 5 దశలు ఉంటాయి.

  1. చెట్టు కట్టింగ్ & ప్రారంభ సాగు ధశ
  2. పూత దశ
  3. పిందె దశ
  4. కాయ ఎదుగుదల దశ
  5. పక్వ దశ

 ఈ ఐదు  రైతుకు ఎంతో కీలకమైన దశలు. ఇందులోనే ప్రతి దశ రైతుకు ఎంతో కీలకమైనది. ఎక్కువ శాతం మామిడి రైతులు నష్టపోయేది మూడవ దశ అయిన పిందె దశ లోనే అని రైతులు తమ అనుభవాలను మాతో పంచుకున్నారు.

  1. చెట్టు కటింగ్ & సాగు ప్రారంభ దశ : ఈ దశ సాధారణంగా జూన్ నుంచి నవంబర్ వరకు కొనసాగుతుంది. మే నెలలో పంట సీజన్ పూర్తి కాగానే జూన్ నుంచి జూలై చివరి వారంలోపు చెట్టుకు ఉన్న అనవసరపు కొమ్మలను కత్తిరిస్తూ ఈ దశను పూర్తి చేస్తారు. మామిడి చెట్ల కటింగ్ చేయడానికి ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు. ఇది ఎంతో నైపుణ్యం తో పాటు అనుభవంతో కూడుకున్న ప్రక్రియ. కటింగ్ పూర్తయిన తర్వాత చెట్టుకు కొత్త చిగుర్లు రావడానికి వాటికి నీళ్లు, వివిధ రకాల పోషకాలతో కూడిన ఎరువులను అందిస్తూ చెట్టును పూత దశకు సిద్ధం చేస్తారు. మన యువ రైతు ఈ దశలో 50 వేల వరకు ఖర్చు చేశాడు.
  2. పూత దశ : ఈ దశ డిసెంబర్ నుంచి జనవరి మొదటి, రెండు వరాల వరకు కొనసాగుతుంది. ఈ పూత దశ చెట్టు మొత్తం ఆకులు కూడా కనిపించినంతగా పూత కమ్మేస్తుంది. సాధారణంగా ఈ దశలో ఎలాంటి క్రిమిసంహారక మందులను ఎక్కువగా ఉపయోగించరు. ఈ దశలో ఎక్కువగా శ్రామిక పనులే ఎక్కువగా ఉంటాయి. దశలో అనిల్ కుమార్ పది నుంచి 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చేశాడు.
  3. పిందె దశ : ఈ దశ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. రైతుకు అత్యంత కీలకమైన దశ ఇది. పూత పిందే రా మారిన క్షణం నుంచి వీటికి అనేక రకాల తెగుళ్లతో పాటు ఎన్నో రకాల కీటకాలు తీవ్ర నష్టం కలిగిస్తుంటాయి. వీటిని ఎదుర్కోవడానికి రైతులు ముందుగానే నివారణ చర్యలకు సిద్ధంగా ఉంటారు. కాని ప్రకృతి వైపరీత్యాలే రైతుని నిలువునా ముంచేస్తుంటాయి. ఈ ఏడాది పిందదశ సమృద్ధిగా ఉన్నా కూడా జనవరి లో తీవ్రమైన గాలులు, వడగళ్ల తో కూడిన అకాల వర్షాల కారణంగా మామిడి రైతుకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ వడగళ్ల అకాల వర్షాల కారణంగా పిందె దశలో ఉన్న మామిడి 50 నుంచి 60 శాతం మేర రాలిపోయింది. సాధారణంగా పిందె దశ నుంచి 30 రోజులు వరకు చెట్టుకు నీరు అందించకూడదు. ఒకవేళ నీరు అందిస్తే పిల్లలు కాయ రూపంలో దాల్చకుండా రాలిపోతాయి. జనవరిలో కురిసిన అకాల వర్షాలు తీవ్రమైన గాలులు వడగళ్ల కారణంగా రైతులకు ఈ నష్ట తీవ్రత చాలానే ఉంది. ఈ సీజన్లో మామిడి ఎక్కువ దిగుబడి రాకపోవడానికి ఈ ప్రకృతి వైపరీత్యమే ప్రధాన కారణం. ఈ దశకు మన యువ రైతు 20వేల వరకు పెట్టుబడి ఖర్చు చేశాడు.
  4. కాయ ఎదుగుదలదశ : ఈ దశ పింద గోలి సైజు నుంచి కోడిగుడ్డు సైజు వచ్చేంత వరకు ఉంటుంది. ఇది ఫిబ్రవరి నుంచి మార్చి రెండవ వారం వరకు కొనసాగుతుంది. ఈ దశలో ను అనేక క్రిమిసంహారక మరియు పోషక ఎరువులను చెట్టుకు ఎక్కువగా ఇస్తారు. ఈ దశలో మన రైతు 20వేల వరకు ఖర్చు చేశాడు.
  5. పక్వ దశ : కాయ పండుగా మారే ముందు దశ ఇది. ఈ దశ మార్చి చివరి వారం నుంచి మే చివరి వరకు కొనసాగుతుంది. కాయ పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంటుంది. ఈ దశలో మన యువ రైతు దాదాపు 15 వేలకు పైగా ఖర్చు చేశాడు.

   ఇక్కడితో ఈ ఐదు దశలు పూర్తయ్యి మామిడికాయ కోతకు సిద్ధంగా ఉన్న క్షణం నుంచి రైతు అసలైన మార్కెట్ మాయాజాల సవాళ్లును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ మార్కెట్ మాయాజాలం ఎలా ఉంటుందని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

   మామిడికాయలను కోయడానికే కొంతమంది కొన్ని ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తూ వాటిని జాగ్రత్తగా కోస్తారు. అలాంటి ప్రత్యేక పద్ధతులను అనుసరించకపోతే కాయ చెట్టు మీద నుంచి నేరుగా నేలను తాకినప్పుడు ఎక్కువగా దెబ్బతింటుంది. కారణంగా కాయ క్వాలిటీ తగ్గి ధర తగ్గిపోతుంది. వాటిని జాగ్రత్తగా కోసి, అంతే జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తూ వాహనాలకు లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ శ్రమలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుంది. మామిడికాయలను కోతకు 5 వేల రూపాయలు మరియు రవాణా కోసం ఉపయోగించిన వాహనం బాడుగ 15 వేలు కలిపి మొత్తం 20 వేల రూపాయలు ఖర్చయింది. ఇది ఒక వాహనానికి అయినా కాయ కోత, లోడింగ్ మరియు రవాణా ఖర్చుకు సంబంధించిన లెక్క మాత్రమే. మన యువ రైతు ఈ 300 చెట్ల ఉన్న తోటలో ముక్కు కోతకు మూడు టన్నుల లెక్కన మూడుసార్లు కోతలు జరిగాయి.

  అనంతపురం లోని కక్కలపల్లి దగ్గర ఉన్న టమోటా మార్కెట్ లోనే ఈ సీజన్లో మామిడి కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తులు మామిడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే ఆ మార్కెట్లో మన మామిడి పంటను అమ్ముకోవడానికి మార్కెట్ యజమానులకు పది శాతం కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.  అక్కడికి వచ్చిన దళారులు కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి పంటను అతి తక్కువగా ధరకుకొంటూ రైతులను నిలువున మోసగిస్తుంటారు. ఈ మే నెలలో జరిగిన ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను. కళ్యాణదుర్గంలోని ఒక దళారి గత పది సంవత్సరాలుగా రైతుల నుంచి మామిడి ని కొనుగోలు చేస్తూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటాడు. ఒక్కో సీజన్లో దాదాపుగా వెయ్యి టన్నుల వరకు చుట్టుపక్కల ప్రాంతాల రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తూ ఉంటాడు. రైతుల దగ్గర నుంచి తీసుకున్న మామిడిని లారీలలో లోడ్ చేసిన తర్వాత వాటి బరువు ఎంతో చూసి దాని ఆధారంగా రైతుకు కిలోకి అప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు చెల్లించాలి. లారీలు లాంటి భారీ వాహనాల బరువులను చూడటానికి వీటికి  ప్రత్యేకమైన వెయిట్ బ్రిడ్జి వాటిని తెలుగులో ముఖ్యంగా మా అనంతపురం వ్యాసాలు ‘కాటా’ అంటారు. ఇక్కడే ఆ దళారి తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. తనే ఒక వెయిట్ బ్రిడ్జి ను ప్రారంభించాడు. రైతుల దగ్గర కొన్న సరుకు మొత్తం నా దగ్గరే తూకాలు వేసేవాడు. అయితే అందులో తను 100 కిలోకి 10 కిలోలు తక్కువ చూపించే విధంగా  మిషన్ లో సాఫ్ట్ వేర్ మార్చారు. ఈ లెక్కన ఒక టన్ను మామిడికి 100 కిలోలు చొప్పున మొత్తం సీజన్లో తను చేసే 1000 టన్నుల టన్నులకు గాను దాదాపు 100 టన్నుల భారీ మోసాన్ని గత రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చాడు. అయితే ఇది అనుకోకుండా వేరే ఒక సందర్భంలో బయటపడింది. రైతులను ఇంత భారీ ఎత్తున మోసం చేస్తున్న ఆ దళారిపైన మొదట ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. తర్వాత రైతుల నుంచి, పౌర సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.  ఇందులో చాలామంది ఉన్నారని మనకు అర్థమవుతుంది.

    ఇక మనం మన కవులు రైతు దగ్గరకు వద్దాం.  మొదటి దశ కోతలో మార్కెట్లో మామిడి సప్లై తక్కువగా ఉన్న కారణంగా ధర కొంచెం ఎక్కువగానే పలికింది. అప్పుడు గరిష్టంగా కిలోకు 70 రూపాయల లెక్కన 3.2 టన్నుల దిగుబడికి 2.4 లక్షలు ఆదాయం. రెండవ కోతకు కిలో 60 రూపాయలు లెక్కన 3.3 టన్నుల దిగుబడికి 1.90 లక్షలు, మూడవ కోతకు కిలో 30 రూపాయల లెక్కన 3 టన్నుల దిగుబడికి గాను 90 వేల రూపాయల ఆదాయం వచ్చింది. వీటిని కొంత లెక్కల ప్రకారంగా విశ్లేషించుకుందాం.

  1. 2,55,000/- మామిడి తోట యజమానికి చెల్లించిన కౌలు మొత్తం.
  2. 1,25,000/- ఐదు దశలలో పంట సాగు కోసం ఖర్చు చేసిన మొత్తం.
  3. 60,000/- కాయకోత, లోడింగ్ మరియు రవాణా చార్జీలు.
  4. 46000/- పంటను అమ్ముకోవడానికి మార్కెట్లో దళారులకు చెల్లించిన కమిషన్.
  5. 15,000/- పంట సాగు మొదలు నుంచి రైతుకు ఇతర అదనపు ఖర్చులు.
  1. 2,40,000/- మొదటి కోత కిలో 70/- రూ. 3.2 టన్నులు.
  2. 1,90,000/- రెండవ కోత కిలో 60/- రూ. 3.3 టన్నులు.
  3. 30,000/- మూడవ కోత కిలో 30/- రూ. 3 టన్నులు.

   అనిల్ కుమార్ యువ రైతు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మామిడిని కౌలుకు సాగు చేయగా తనకు వచ్చిన ఆదాయం లో నుంచి పెట్టుబడి తీసేయగా ఇంకా రెండు 2.19లక్షల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

  ఇవన్నీ ఒకటైతే నకిలీ మందులు, ఎరువుల రైతును నిలువునా ముంచేస్తున్నాయి. 40 వేల జనాభా కలిగిన కళ్యాణదుర్గం ఒక చిన్న పట్టణంలో రసాయనిక ఎరువుల మరియు మందుల దుకాణాలు దాదాపు 50 నుంచి 60 వరకు ఉంటాయి. ఈ ఫర్టీ లైజర్ ఈ మార్కెట్ లో దాదాపు 70% పైగా  అగ్రకుల అందులోనూ కమ్మ సామాజిక వర్గ కబంధహస్తాల్లోనే ఉంది. వీరంతా ఏదో ఒక రాజకీయ పార్టీ కింద తమ మార్కెట్ చక్రం తిప్పుతుంటారు. ఒక పంటకు ఏదైనా రోగం లేదా ఎరువుల అవసరమని రైతులు వీరు వద్దకు వచ్చినప్పుడు వీరిచ్చే ఎరువులు లేదా మందులు అసలువా లేదా నకిలీవ అని తెలుసుకునే లోపే రైతు నిండా మునిగిపోయి ఉంటాడు. ‘మీరిచ్చిన మందులు పంటకు పని చేయలేద’ని ఆవేదనతో రైతు వీరి వద్దకు వస్తే, మీ వాతావరణానికి,  నేలకు ఆ మందు సరిపోదు అంటూ ఎన్నో మాయ మాటలు చెబుతూ ఇంకొక రకాన్ని రైతులకు అంట గడుతుంటారు. రైతు కూడా వీటి మీద మాట్లాడే ఒక పరిస్థితి కూడా దాదాపుగా ఉండదు. తన పంటకు అది సరిపోలేదు, కాబట్టి ఇంకో రకాన్ని తీసుకుందాంలే అనే ఒక సర్దుకుపోయే తత్వం ఎక్కువగా కనిపిస్తుంది.

  రసాయనిక ఎరువుల మార్కెట్ దోపిడి, దళారుల దోపిడీ, మోసాలు రైతును నిలువునా దోచేస్తున్నాయి. అందులోనూ మామిడి కౌలు రైతు పరిస్థితి మరి దారుణంగా మన కళ్ళు ముందు కనిపిస్తోంది. కౌలు రైతులకు ఎన్నో రాయితీలను సౌకర్యాలను కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం శూన్యం. కాబట్టి రైతు నేడు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వ్యవసాయాన్ని వృత్తిగా మలుచుకుని ఈ రంగంలోకి రావాలనుకుంటున్న యువతకు ప్రారంభంలోనే తీవ్ర నష్టాలు, మార్కెట్ మోసాలతో ఇలాంటి చేదు అనుభవాలు, ఆటంకాలు ఎదురైనప్పుడు యువత ఏ విధంగా వ్యవసాయం వైపు మొగ్గు చూపగలదు. భవిష్యత్తులో అతిపెద్ద ఆహార సంక్షోభం, సామాజిక సంక్షోభం ఉంటుందనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ.

  ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని మార్కెట్ మోసాలను అరికడుతూ, ఉద్యాన పంటలతో పాటు, వ్యవసాయ రంగానికి సరైన ప్రోత్సాహకాలు మార్కెట్ సౌలభ్యాలు అందించాలి. వచ్చే మామిడి సీజన్లో ప్రభుత్వం  మామిడి తో పాటు ఇతర పంటలను కూడా సరైన గిట్టుబాటు ధరను కల్పిస్తూ ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. అప్పుడే ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలను ఆపగలం. లేదంటే మనకు భవిష్యత్తు ఉండదు.

                                                     –   మొండి వెంకటేష్

                                              రాయలసీమ విద్యావంతుల వేదిక

Leave a Reply