ఎప్పటికప్పుడు
చెరలు చెరసాలలు దాటుకుని మరీ
పోరాటం పునరావృతమవుతూనే ఉంది..
మళ్లీ మళ్లీ కొత్త జ్ఞానం వికసిస్తూనే ఉంది..
పరిణామక్రమమంతా యుద్ధాలమయమే కదా!
విశ్వాంతరాళాల్లో
ప్రకృతి మొదలుపెట్టిన సహజ యుద్ధాన్ని
దేశాల మధ్యకు బదిలీ చేసి
ఒకడెవడో సంతోషిస్తున్నాడు గానీ
మనిషిలో అంతర్లీనంగా
ఈ యుద్ధమేనాడో మొదలైంది..
సంపద మొదలైననాడు
అది పోగుపడడం మొదలైననాడు
గుంపు నుండి ఒక్కడి వైపు
మనిషి ప్రయాణం మొదలైన నాడు
ప్రకృతి పచ్చదనం
నోట్ల పరపరలకు అమ్ముడు పోవడం మొదలైన నాడు
ఉనికి అస్తిత్వం గుర్తింపు
అన్నిటికీ
విపణి ముట్టడిలోనే
నిర్వచనాలు తయారవుతూపోతుంటే
యుద్ధం ఇప్పుడు కొత్తగా మొదలవడమేంటి..
కింద పడిన ప్రతిసారీ
పైకి లేసేందుకు
జరగాల్సిన యుద్ధాన్ని వదిలేసి
పడిపోవడంలోనే
పడుకోవడంలోనే
రాజీని వెతుక్కుంటున్న
ప్రతి సందిగ్ధ సమయంలోనూ
మళ్లీ మళ్లీ యుద్ధం పుడుతూనే ఉంది
యుద్ధంలో మనిషి
మనిషిలో యుద్ధం
కలగలిపి చేసే
సమాంతర ప్రయాణమే కదా చరిత్ర!
మరిప్పుడు మళ్ళీ కొత్తగా మొదలవడమేంటి..?

అందుకే వాడిలాగే
మనకూ యుద్ధం అవసరమే..
ప్రతి యుద్ధం మీద మరో యుద్ధమే
మానవ చలనానికి ప్రాతిపదిక..
మరో పరిణామానికి పురోగతినిచ్చేది యుద్ధమే ..
అందుకే రేపటి కొత్త మనిషి కోసం
మరిన్ని యుద్ధాలే నేటి కర్తవ్యాలు..

Leave a Reply