అనామక ప్రాంతంలో అత్యంత అనామకంగా పుట్టిపెరిగి… తన రచనల ద్వారా కిర్గిస్తాన్ దేశానికి వన్నె తెచ్చిన రచయిత ఐత్మాతోవ్. అతడి రచనలు తల్లి భూదేవి, తొలి ఉపాధ్యాయుడు, జమీల్యా వంటివి ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించాయి. చింగీజ్ ఐత్మాతోవ్ 1928 డిసెంబరు 12 న నగియా, తోరకుల్ ఐత్మాతోవ్‌లకు జన్మించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో యుద్ధం ద్వారా బాగా ప్రభావితమయిన సోవియట్ రష్యా గూర్చి… యుద్ధ విధ్వంసాలా గురించి, అక్కడి విప్లవానంతరం వచ్చిన పరిణామాలను రచించినాడు ఐత్మాతోవ్. ఈయన రచనల్లో అసాధారణమయిన సున్నితత్వం కనిపిస్తుంది.. సమకాలీన దృక్పథమూ కనిపిస్తుంది. ఆ రచనా శైలినే భిన్నమైనది ఈయన రచనలను తెలుగులోకి అనువాదం చేసినది ‘ఉప్పల లక్ష్మణరావు’ 

ఇక తల్లి భూదేవి పుస్తకంలోకి అడుగుపెడితే నాటి 2వ ప్రపంచ యుద్ధకాలంలో సోవియట్ రష్యాలో ప్రజలు యుద్ధం వల్ల ఎలా ప్రభావితమవుతారన్నది చూడవచ్చు. ఇంట్లోని మగవారు, తమ తల్లిదండ్రులను, భార్యా బిడ్డలను, గ్రామాలను వదిలి యుద్ధానికి వెళ్తారు, అలా వారు వెళ్ళిన తర్వాత ఇంట్లోని వారు పడే కష్టాలు, బాధలు, వేదనల కలబోతనే ఈ పుస్తకం. అయితే ప్రకృతితో నేల తల్లితో తన బాధనంతా చెప్పుకొనగా మనిషికి ఎంత తేలికగా వుంటుందనేది మనం దీంట్లో చూడవచ్చు. దీంట్లో ముఖ్యపాత్రలు తోల్గొనాయ్ [తల్లి], భూదేవి [చేను]. అయితే తోల్గొనాయ్ చెప్పే విషయాలను ఆ చేను కూడా శ్రద్ధగా వినేది. భూమి మనిషి బాధను వినడం అనే కల్పన వాస్తవికతకు దూరమైనా..

 ఆ సంభాషణలోని అవేదన వాస్తవ జీవిత పరిణామాలు మనల్ని కదిలిస్తాయి. భూదేవి అన్నట్టు “కష్టాలు అనుభవిస్తున్నది… మీరే కాదు నేను కూడా…. నాటి కాలం నుండి కూడా ఒకొక్కటిగా చూస్తూ వస్తున్న.. ఈ యుద్ధాలు, మరణాలు, … ఇలా అన్ని చరిత్రలో మీకంటే ఎక్కువ నాకే తెలుసు, అన్ని కడుపులో దాచుకొని భరిస్తున్నాను, తొల్గొనాయ్ ఇది మర్చిపోవడం అసాధ్యం… అంటూ తోల్గొనాయ్ ని ని ఓదార్చి, సముదాయించి, ధైర్యాన్ని నూరిపోసేది ఆ చేను [భూదేవి].

ఈ విధంగా వారి ఇరువురి మధ్య జరిగిన ఈ సంభాషణ పాఠకుల మనస్సులను కలచివేస్తుంది ఏడిపిస్తుంది. 

నాటి సోవియట్ పరిస్థితుల్లో, సంస్కృతిలో భాగంగానే గ్రామంలోని ఆడ, మగ, పిల్లలు అందరూ కలిసి సమిష్టి క్షేత్రంలో పంటలు పండించుకునే ఆనవాయితీ ఉండింది. దాని ప్రకారమే ఆ గ్రామంలో కూడా అందరూ తమ ఒళ్లు దాచుకోకుండా పనిచేసి సమిష్టి క్షేత్రంలో పనులు చేస్తారు. గోధుమలు వంటివి పండించుకుంటూ వాళ్లకు, వారికోసం యుద్ధానికి వెళ్ళిన మనుషులకు ఆహారాన్ని అందిస్తున్నారు. దాంట్లో భాగంగానే తోల్గొనాయ్ మరియు సువానకూల్ కు పరిచయం ఏర్పడుతుంది. కలిసి పనిచేస్తున్న వారు పెళ్ళిచేసుకుని భార్యాభర్తలు అవుతారు. ఈ విధంగా ఆ క్షేత్రంలో గ్రామంలోని, కుటుంబాలన్నీ కూడా కలిసి పంటలు పండించేవి వచ్చిన దాంట్లో అందరికీ ఆ గింజలు అందేవి. ఇలా కాలం సాగిపోతుంది. తోల్గొనాయ్ మరియు సువానకూల్ కు పిల్లలు పుడతారు. కాసిమ్, మాసిల్‌బెక్, జైనాక్, పెరిగిన పెద్దవారవుతారు. నాటి పరిస్థితుల్లో భాగంగానే కాసిమ్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ట్రాక్టర్ నడుపుతాడు ఆ సమిష్టి క్షేత్రంలో. మరి మసల్ బెక్ మాత్రం చదువుతూ, బడిపంతులు కావాలని పట్నానికి వెళ్తాడు. జైనాక్ మాత్రం కమ్యూనిస్టు లీగ్ కార్యదర్శిగాని కార్యదర్శిగా పనిచేస్తూ ఉంటాడు. అది ఎంత కష్టకాలమంటే పొద్దస్తమానం ఎడతెరిపి లేకుండా క్షేత్రంలో పనిచేసినా, తినడానికి కడుపునిండా ఆహారం కూడా దొరికేది కాదు. అయినా సరే ఆ ప్రజలు కేవలం ఆశపడింది ఒకటి ఎనాటికో ఒకనాటికో తప్పకుండా ఎవ్వరి భూములు వాళ్లకు వస్తాయి, వాళ్ళు దాంట్లోనే పంటలు పండించుకునే, తిని సుఖంగా బతికేరోజు ఒకరోజు తప్పకుండా వస్తుందని. పనులు చేస్తూ, పంటలు పండిస్తూండేవారు. అయితే ఆ గ్రామానికి సువానకూల్ చైర్మన్‌గా పనిచేసేవాడు అంటే ఆ క్షేత్రంలో పంటలు పండించడం, పనులు జరుగుతున్న తీరు పరిశీలించడం, వచ్చిన పంటను అందరికీ న్యాయంగా పంచడం వాటి న్యాయా అధికారాలు కలిగిన వ్యక్తి అతను. ఈ సమయంలోనే , హఠాత్తుగా యుద్ధం వారి జీవితాల్లోకి ప్రవేశించింది ఇక ఒక్కొక్కరుగా ఆ గ్రామం నుండి మగవారు దేశం కోసం సైన్యంలోకి వెళ్లి చేరాలి. ఈ విధంగా యుద్ధానికి వెళ్ళినవారికోసం గ్రామంలోని ఆ మగవారు క్షేత్రంలో వెళ్ళినా కుటుంబం కోసం అంతా పండించుకుని తినేది ఆ సమిష్టి క్షేత్రంలోనే.

దాంట్లో భాగంగానే అందరూ సమిష్టి క్షేత్రంలో ఎవరి పనుల్లో వారు మునిగిపోయివుంటారు. ఇక కాసిమ్ ట్రాక్టర్ నడుపుతూ అందరి పనులకు తను ఆసరవుతాడు. అట్లే ‘అలీమన్’ ను వివాహం చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు కాసిమ్. అలీమన్ ప్రేమ, పనితనం, స్వచ్ఛమైన మనస్సు, ఆమె రూపం, తెలివితేటలు ఇవన్నీ చూసి, ఆశ్చర్యపోయి, ఎంతో ఆనందంతో ఇంట్లోకి ఆహ్వానిస్తుంది తోల్గొనాయ్

ఆ కోడలును. అయితే వాళ్లిద్దరూ అత్త, కోడళ్ల లాగా కాకుండా తల్లి, కూతుళ్ల లాగా కలిసి, అన్యోన్యంగా జీవనం సాగిస్తారు. ఇక ఆ సమిష్టి క్షేత్రంలో అందరూ కలిసి పనిచేస్తున్న సమయంలోనే ఒక పోస్ట్మన్ ఉత్తరం తెస్తాడు కాసిమ్‌ను యుద్ధ అవసరాల కోసం సైన్యంలోకి పిలువమన్నారని, ఈ వార్త విని ఆ తల్లి, ఆ భార్య (అలీమన్) చాలా ఏడుస్తారు. పెళ్లి ముచ్చట కూడా తీరని ఆ జంటకు అంతకన్నా బాధ ఏముంటుంది!? ఆ తల్లి, భార్య, తండ్రి బాధ వర్ణించలేము, అయినా గాని తోల్గొనాయ్ తన బాధను దిగమింగుకుని తన కొడుకుకి ధైర్యం చెప్పుతుంది. ఇక ఆమె పెద్దకొడుకు యుద్ధంలోకి అడుగుపెట్టాడు. ఇలా కాసిమ్‌తో పాటు చాలామంది కూడా యుద్ధానికి వెళ్తారు అయినా గాని సువన్కూల్ అందరికీ ధైర్యం చెప్తాడు. ఎప్పటికైనా అందరం యుద్ధానికి వెళ్లి తీరాల్సిందే అంటూ గుండె నిబ్బరం చేసుకొని తన దళవాయి సేవలను ప్రజలకు అందిస్తూ ఉంటాడు. ఓ రోజు సువానకూల్‌కి కూడా యుద్ధంలోకి రావాలని పిలుపొస్తుంది. ఆయన కూడా యుద్ధంలోకి వెళ్ళాడు. ఇక తోల్గొనాయ్ నెత్తి, నోరు కొట్టుకుంటుంది. గుండె ఆగిపోయేలా ఏడుస్తుంది అందరూ యుద్ధంలోకి వెళ్తే ఎలా అని సువానకూల్ చెప్పిన మాటలకనుగుణంగా తన బాధను కడుపులోనే దాచుకుంటూ తన భర్త స్థానంలో తను దళవాయిగా సేవలను ప్రజలకూ అందిస్తూంటుంది. ఇలా ఒకొక్కరుగా మగవాళ్లు యుద్ధానికి వెళ్తే, గ్రామంలోని మహిళలంతా ఆ సమిష్టి క్షేత్రంలోనే పగలు రేయి శ్రమించాల్సి వచ్చింది. ఇంతలో ఓ రోజు మసల్ ‌బెక్‌ నుండి కూడా ఉత్తరం వస్తుంది ‘నన్ను యుద్ధానికి రమ్మన్నారని’ ఇక ఆ తల్లి వదిన అలీమన్ దుఃఖానికి అవధులు లేవు కుమిలి కుమిలి ఏడుస్తారు, కాని కొడుకు కోరిక మేరకు దుఃఖాన్ని బయటకు కనపడనివ్వరు. అయితే చివరిసారిగా వీడ్కోలు కోసం అని రైల్వేస్టేషన్ లోని వెళ్తారు. రమ్మన్నా రానట్టు వెళ్తున్న ఆ ట్రైన్ లో కేవలం క్షణమాత్రమైనా తన కన్నకొడుకును కళ్ళారా చూసుకోవడానికి నోచుకోలేదు. ఆ తల్లి… ఆ తల్లి బాధను మాటల్లో చెప్పలేము దుఃఖం నిండిన గుండెతో విచారంతో అమ్మా ఒకే ఒక్క కేకతో అతడు వీడ్కోలు చెబుతాడు మాసిల్‌బెక్. వారికి తన జ్ఞాపకంగా ఒక టోపీని విసురుతాడు. ఆ తల్లి జీవితం మరింత దుఃఖంతో నిండిపోయింది. ఇంతటి దురదృష్టం కేవలం యుద్ధం వల్లే ముమ్మాటికీ యుద్ధం వల్లే ఆ తల్లికి. ఇలా బాధపడుతూ ఇంటికి వస్తారు. అత్త, కోడళ్లు 

ఇదే తరుణంలో చిన్న కొడుకు జైనాక్ కూడా యుద్ధంలో చేరతాడు . అయితే జైనాక్ చిన్నప్పటి నుండి సభలు, సమావేశాలు, పత్రికలు అంటూ తిరుగుతూ కమ్యూనిస్టు పార్టీ పనులలో మునిగిపోయిన వాడు .ఇప్పుడిక యుద్ధం రంగం నుంచి  పిలుపొచ్చింది. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా మగదిక్కుగా తను చేయాల్సినా పనులన్ని చక్కబెట్టి అన్ని సర్దుకొని యుద్ధానికి వెళ్ళిపోతాడు వెళ్ళిన తరువాయి ఉత్తరంలో “అమ్మ! నన్ను క్షమించండి నేను మీ బాధను తగ్గించడానికి మాత్రమే ఇలా చేశాను, మరేమి అనుకోవద్దు మీరు ధైర్యంగా ఉండండి యుద్ధంలో గెలిచి వస్తాను, ఏడవకండి అంటూ ఓదార్పుకు కొన్ని మాటలు చెప్తాడు’. ఇదంతా చూసి తోల్గొనాయ్ నిశ్చేష్టులై పోయింది గుండె రాయి అయిపోయింది, దుఃఖ సముద్రంలో మునిగిపోయింది, తన మనస్సులో అనుకుంది ఎందుకు బిడ్డకు ఇన్ని కష్టాలు.  18 ఎళ్లయినా నిండని వాడి మనస్సు ఇంత గొప్పగా ఎట్లా ఆలోచించింది! నాయనా… నువ్వు క్షేమంగా వుండాలి అని తలుస్తుంది.

యుద్ధంలో గెలిచివస్తాడని నమ్మకంతో ఉంటుంది. ఓ వైపు తొల్గోనాయి, మరోవైపు అలిమన్ ఏ తల్లి కూడా ఏ ఇల్లాలు కూడా ఈ దారుణ స్థితిని కోరుకోరు. ఇంత దురదృష్టాన్ని అనుభవించివుండరు. యుద్ధంలో సువానకూల్ మరియు మాసిల్‌బెక్ చనిపోయారు అనే వార్త విని తోల్గొనాయ్ గుండెలు బాదుకుంటుంది, అలీమన్ దుఃఖం అంతకన్నా ఎక్కువే గ్రామస్థులు కూడా చాలా బాధపడతారు. ఆ తల్లి ఎలా భరిస్తుంది, అంత బాధను, కేవలం ఆ తల్లికే సాధ్యం అది. భర్త మరణపు స్థితిని ఆ ఎడబాటును తట్టుకోలేక అలీమన్ కూడా ఏడుస్తుంది, పిచ్చిదానిలా ఏడుస్తూ, ఏడుస్తూ కుమిలిపోతుంది.

ఇక మిగిలింది కేవలం అత్తాకోడళ్లు! అలీమన్ కూడా తన దుఃఖాన్ని దాస్తూ, తోల్గొనాయిని సంతోష పెట్టేవిధంగా తను ప్రయత్నించేది, ఈ అలీమన్‌కు ఒక గొర్రెల కాపరితో పరిచయం ఏర్పడుతుంది, ఇలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి౦ది. ఇదంతా కూడా తోల్గొనాయ్‌కు తెలుసు. అయినా గాని ఏమీ అనలేదు. ఎందుకనగా పెళ్ళి అయ్యి ఏడాది తిరక్కుండానే భర్త యుద్ధంలో మరణించాడు , అచ్చట ముచ్చట తీరలేదు. ఇలా ఒక తల్లిగా, భార్యగా, ఆడపిల్లగా నిండు ఆడపిల్లను అర్థం చేసుకునే మనస్సు ఆ తోల్గొనాయ్‌కు వుంది. ఈ విధంగా అలీమన్ ఆయనతో పరిచయం వలనే గర్భం ధరిస్తుంది. ఇక అలీమన్‌ను తోల్గొనాయ్ కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. అలా చూస్తుండగానే ఆ అలీమన్‌కు నెలలు నిండుతాయి. ఇక ఒకరోజు పురుడుపోసుకునే సమయం వచ్చింది, అలా ఎంతో కష్టం మీద మగబిడ్డకు జన్మనిస్తుంది, విషాదంగా అలీమన్ కూడా చనిపోయింది. ఆ మగబిడ్డ పోషణ, పెంపకం, తోల్గొనాయ్ మీద పడుతుంది. తోల్గొనాయ్ ఆ పిల్లాడికి తన తల్లి, తండ్రి, వదినలు ప్రాణాలు కోల్పోవడo , ఆ చరిత్రమొత్తాన్ని ఎలాగైనా చెప్పాలని తనలో తాను మదనపడుతూ, విషయమంత భూదేవి [ఆ చేనుతో] తో చెప్పే ఆ విధానమే ఈ పుస్తకం, సంభాషణ మాత్రం మన గుండెను విడవక, వెంటాడుతూనే వుంటుంది చదువుతున్నంత సేపు మనస్సంతా దుఃఖంతో నిండిపోతుంది..

అయితే ముఖ్యంగా ‘యుద్ధం’ ఒక సాధారణ మహిళ జీవితంలో ఎంతటి బలమైన ముద్రను వేస్తుంది. ఒక సాధారణ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కూడా యుద్ధరంగంలోకి వెళితే ఎలా వుంటుంది. ముగ్గురు కొడుకులను భర్తను తన కళ్ళముందే కోల్పోతే ఆ తల్లి శోకం ఎంత భరింపరానిది. యుద్ధానికి మగవాళ్ళందరూ పోతే ఒక మహిళ ఎన్ని కష్టాలు పడి, ఆ కుటుంబాన్ని నెట్టుకు వస్తుంది, అనేది కళ్ళకు కట్టినట్లు చిత్రించారు రచయిత. యుద్ధం కోసం సర్వం కోల్పోయారు ఆ ప్రజలు కేవలం వారు కోరుకునేది, భూమి, భుక్తి, ప్రజాస్వామ్యము అయినా వాటికోసం సాధారణ ప్రజల జీవితాలు ఎన్ని బలైపాయో, ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధం అనేది సామాన్య ప్రజలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతోంది చెప్తుంది. యుద్ధం వల్ల కష్టాలు తీరుతాయి అనుకునే జనులకు కష్టాలు పెరిగితే ఎలా వుంటుందో ఆలోచించాలి. యుద్ధం వల్ల జనులకు ఎంత నష్టం జరుగుతుందో ఇందులో చూడొచ్చు .అయితే ఈ పుస్తకంలోభూదేవి తోల్గొనాయ్ ల మధ్య సంభాషణలో భాగంగానే తోల్గొనాయ్ ఆ చేనును అడుగుతుంది; “యుద్ధం లేకుండా మనుషులు బతకలేరా తల్లి!” భూదేవి ఇలా అంటుంది, తోల్గొనాయ్ అది మీ చేతుల్లోనే వుంటుంది, మీకు ఏమి తక్కువైందని ఇలా ఒకరిని ఎందుకు కొట్టుకుంటున్నారు, మీరందరూ నాకు బిడ్డలతో సమానం, అందరూ అన్నదమ్ముల వలె వుండాలి, మీ ప్రేమే, మీ సాన్నిహిత్యమే నేను కోరేది అంటుంది, నేను అనాదిగా, నన్ను ఉపయోగించుకోండి, ఒక్క విత్తు వేయండి, వేయి విత్తులు ఇస్తాను, ఒక్క పుడక పాతండి, మహావృక్షం మొలిపిస్తాను అంటూ ఇలా ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తూ సమాధానం చెప్తుంది, భూదేవి తోల్గొనాయ్‌కి.

ఇంకో సమయాల్లో ఓ చేనా.. నా ముగ్గురు కొడుకులు, భర్త, కోడలిని ఈ యుద్ధంలో పోగొట్టుకున్నాను, వాళ్ళను స్మృతించుకోవడం తప్ప నేనేమి చేయగలను అంటూ తొల్గోనాయీ ఏడిస్తే… నువ్వొక్కరివే బాధపడుతున్నా అనుకోకు తోల్గొనాయ్, నీకన్నా ముందునుండి ఇలాంటి ఎన్నో మరణాలు చూస్తున్నా, చరిత్రలో ఎన్ని సంఘటనలు చూశానో, ఎంతమంది యుద్ధవీరులను నా కడుపులో దాచుకున్నానో ఒక్కటి మాత్రం గుర్తుంచుకో తోల్గొనాయ్, సమాజం కోసం యుద్ధం చేసిన వారిని కాలం మరిచిపోదు. ప్రజలు వారి గురించి గొప్పగా చెప్పుకుంటారు, చరిత్రలో వారికంటూ ఒక ప్రత్యేక స్థానం వుంటుందని తోల్గొనాయ్ నీది ఉత్తమ మనిషి జన్మ, అన్నింటికన్నా ఉత్కృష్టమైన బుద్ధిమంతమైన మనస్సు నీది, ఇన్ని కష్టాలు అనుభవించి, జనులకు సేవచేసిన నీది మనిషి జన్మ! నువ్వు గొప్పదానివి అంటూ మాట్లాడుతుంది, భూదేవి, ఆ వృద్ధ మహిళతో. 

ఆ మాటలు ఆ జీవితాలు ఈ యుద్ధోన్మాద కాలంలో మరింత అవసరంగా అనిపిస్తాయి.

Leave a Reply