దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరిస్థితులు మారాయని, ప్రజలు విప్లవాన్ని కోరుకోవడం లేదని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు గదా, కొనసాగుతున్న పరిస్థితి ఏమిటో వెల్లడించిన రెండు తాజా నివేదికల గురించి మాట్లాడుకుందాం.
మొదటిది, మొత్తంగా దేశానికి సంబంధించినది. వరల్డ్ ఇనీక్వాలిటీ లాబ్ అనే సుప్రసిద్ధ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఏప్రిల్ మొదటి వారంలో వెలువరించిన ‘లాండ్ ఇనీక్వాలిటీ ఇన్ ఇండియా: నేచర్, హిస్టరీ అండ్ మార్కెట్స్’ (భారతదేశంలో భూ అసమానతలు: స్వభావం, చరిత్ర, మార్కెట్లు) అనే పత్రం. ప్రతి సంవత్సరమూ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ ప్రచురించే ఈ సంస్థ పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ ల సారథ్యంలో నడుస్తుంది. ఇప్పుడు ఆ సంస్థ విడుదల చేసిన పత్రం నితిన్ కుమార్ భారతి, డేవిడ్ బ్లాకెస్లీ, సమ్రీన్ మాలిక్ అనే ముగ్గురు పరిశోధకులు రాసిన వర్కింగ్ పేపర్. పరిశోధకులు ఈ పత్రం కోసం దేశంలోని పది రాష్ట్రాల్లో 2,70,000 గ్రామాలకు చెందిన 65 కోట్ల మంది గ్రామీణ ప్రజల భూవివరాలను అధ్యయనం చేశామని చెపుతున్నారు.
గ్రామీణ భారతదేశంలో ఇప్పటికీ అత్యంత తీవ్రమైన భూయాజమాన్య అసమానతలు ఉన్నాయని ఈ పత్రం తేల్చింది. గ్రామీణ కుటుంబాలలో 46 శాతం భూమిలేని నిరుపేదలుగా ఉన్నారు. గ్రామంలో అతి ఎక్కువ భూమి ఉన్న 10 శాతం కుటుంబాల దగ్గర 44 శాతం భూమి, ఐదు శాతం కుటుంబాల దగ్గర 32 శాతం భూమి, ఒక్క శాతం కుటుంబాల దగ్గర 18 శాతం భూమి కేంద్రీకృతమై ఉంది.
సాధారణంగా వ్యవసాయ ఆధునీకరణ జరిగితే, భూఉత్పాదకత పెరిగితే, మొత్తంగా ఆ వ్యవసాయ ఆర్థికవ్యవస్థలో వెనుకబాటుతనం తగ్గుతుందని, అంటే భూయాజమాన్య అసమానత తగ్గుతుందని ఒక అభిప్రాయం ఉండేది. ఈ పత్రం భూఉత్పాదకత ఎక్కువగా ఉన్న చోట కూడా భూయాజమాన్య అసమానత ఎక్కువగానే ఉందని చెపుతున్నది. మరొక భాషలో చెప్పాలంటే కొత్త ఉత్పత్తి సాధనాలు ప్రవేశించిన చోట, ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగిన చోట కూడా ఈ మార్పులు ఉత్పత్తి సంబంధాల మీద, ప్రధాన ఉత్పత్తి సాధనమైన భూమి యాజమాన్యం మీద ప్రభావం వేయడం లేదు అని అర్థం.
భూ యాజమాన్య పంపిణీ మీద చారిత్రక ప్రభావాల పాత్ర చాలా ఎక్కువగా ఉందని, అంటే భూయాజమాన్య అసమానతలో సామాజిక అంతరాల పాత్ర చాలా ఎక్కువగా ఉందని ఈ పత్రం చెపుతున్నది. షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో భూమిలేని నిరుపేదల నిష్పత్తి ఎక్కువగా ఉందని, ఉత్పాదక ఆస్తుల పంపిణీలో సామాజిక అంతరాల పాత్ర, కులం పాత్ర గణనీయంగా ఉందని ఈ పత్రం చెపుతున్నది. మొత్తంగా ఆధునికతా చిహ్నాలు ప్రవేశించిన చోట, మార్కెట్ ప్రవేశించిన చోట కూడా చారిత్రక అసమానతలు తగ్గడం లేదని ఈ పత్రం చూపింది. పట్టణాలకు, రహదారులకు, మార్కెట్లకు దగ్గరగా ఉన్నప్పటికీ ఆయా గ్రామాల్లో భూ అసమానతలు తగ్గుతున్న దాఖలాలు లేవని ఈ పత్రం రాసింది.
పెద్ద భూకమతాలు తగ్గిపోయాయనీ, దాదాపుగా లేవనీ చాలా మంది భావిస్తుండగా, చాలా గ్రామాల్లో భూయాజమాన్యం పైన పెద్ద భూకమతాలదే పైచేయిగా ఉందని ఈ పత్రం చెపుతున్నది. సగటున అతి పెద్ద భూకమతదారు గ్రామ భూమిలో 12 శాతం మీద అదుపు కలిగి ఉంటున్నాడని, కొన్ని గ్రామాల్లోనైతే ఒకే ఒక్క యజమాని గ్రామంలోని వ్యవసాయ భూమిలో సగం మీద అధికారం కలిగి ఉన్నాడని ఈ పత్రం రాసింది.
రెండోది, తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 15న విడుదల చేసిన ‘తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024’ నివేదిక. ‘స్వతంత్ర నిపుణుల కార్యాచరణ బృందం’ నివేదిక రెండు సంపుటాలు (322 పేజీలు), ఆ నివేదికకు ఆధారమైన సమగ్ర ఇంటింటి సర్వే పట్టికలు నాలుగు సంపుటాలు (1096 పేజీలు) కలిసి, పద్నాలుగు వందల పేజీలలో ఉన్న సమాచారాన్నీ, నిర్ధారణలనూ వివరంగా, నిశితంగా అధ్యయనం చేస్తే తెలంగాణ సమాజం గురించి చాలా విషయాలు బైటపడతాయి. కనీసం కొన్ని స్థూలమైన అంశాల గురించి అయినా మాట్లాడుకోవాలి.
ఈ సర్వే ప్రధాన లక్ష్యం వెనుకబాటుతనాన్ని నిర్ధారించడం, వెనుకబాటుతనానికీ కులానికీ మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టడం. అందులో భాగంగా వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి 42 ప్రాతిపదికలతో సంకీర్ణ వెనుకబాటుతనం సూచిక (కాంపోజిట్ బ్యాక్వర్డ్ నెస్ ఇండెక్స్ – సిబిఐ) అనేది తయారు చేశారు. ఆ ప్రాతిపదికల శాస్త్రీయత ఎంత, ఇంటింటి సర్వే సమగ్రంగా చేశారా, సమాచార సేకరణలో లోపాలు లేవా, వచ్చిన సమాచారాన్ని వడకట్టి నిర్ధారణలు తీయడంలో స్వీయ అభిప్రాయ, దురభిప్రాయాల పాత్ర ఎంత వంటి సర్వే సంబంధిత సందేహాలు ఉండే అవకాశం ఉంది గాని, వాటిని అలా ఉంచి, మొత్తంగా ఈ సర్వే తెలంగాణ సమాజ చిత్రాన్ని ఎలా ప్రదర్శిస్తున్నదో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది.
రాష్ట్రంలో 242 కులాలకు చెందిన మూడు కోట్ల యాబై ఐదు లక్షల మందిని సర్వే చేశామని అంటున్నారు. పరిశోధకుల ప్రశ్నలకు వచ్చిన జవాబుల ఆధారంగా, ఆ కుటుంబం, ఆ కులం ఎంత వెనుకబాటుతనంలో ఉందో పాయింట్లు ఇచ్చారు. ఆ స్కోర్ 0 నుంచి 126 వరకూ ఉంది. అంటే ఒక కులం అత్యంత వెనుకబాటుతనంతో ఉంటే దాని స్కోర్ 126 అవుతుంది. అతి తక్కువ వెనుకబాటుతనం ఉంటే స్కోర్ 0 అవుతుంది. అలా కొలిచినప్పుడు, తెలంగాణలో డక్కలి (షెడ్యూల్డ్ కులం) 116 స్కోర్ తో అతి ఎక్కువ వెనుకబాటుతనంలో ఉంది. కాపు కులం 12 స్కోర్ తో అతి తక్కువ వెనుకబాటుతనంలో ఉంది.
మొత్తం 242 కులాల సగటు వెనుకబాటుతనం స్కోర్ 81 కాగా, 135 కులాలు ఆ సగటు కన్నా ఎక్కువ స్కోర్ తో, అంటే ఎక్కువ వెనుకబాటుతనంతో ఉన్నాయి. ఆ 135లో 69 బీసీ, 41 ఎస్సీ, 25 ఎస్టీ సమూహాలు. ఇక తక్కువ వెనుకబాటుతనం ఉన్న 107 కులాల్లో, జనరల్ కాటగరీ 18 కులాలు, బీసీ 67 కులాలు, ఎస్సీ 18 కులాలు, ఎస్టీ ఏడు తెగలు ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే వెనుకబాటుతనం ఎక్కువ తక్కువలుగా అన్ని కులాల్లోనూ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సమూహాల్లో కూడా వెనుకబాటుతనం తక్కువ ఉన్న కులాలు ఉన్నాయని అనిపిస్తున్నప్పటికీ, ఈ లెక్కలను జాగ్రత్తగా చూడాలి. అలా చూస్తే, ఎస్టీల్లో 99 శాతం, ఎస్సీల్లో 97 శాతం, బీసీల్లో 71 శాతం వెనుకబాటుతనంలో ఉన్నారని తేలింది. అలాగే, ఎస్సీల్లో సగం మంది రోజు కూలీలుగా ఉన్న స్థితి ఉండగా, జనరల్ కాటగరీ కులాల్లో అది పది శాతం కన్నా తక్కువ. ప్రైవేట్ రంగ ఉద్యోగుల్లో జనరల్ కాటగరీ 30 శాతం ఉండగా, ఎస్టీలు కేవలం 5 శాతం మంది మాత్రమే ఉన్నారు.
తెలంగాణ సమాజం ఎలా ఉన్నదో అర్థం చేసుకోవడానికి ఈ నివేదిక నుంచి గ్రహించగలిగిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని:
ఒకటి, భూయాజమాన్యం, సంపద: కులానికీ భూయాజమాన్యానికీ దగ్గరి సంబంధం ఉంది. మొత్తం జనాభాలో 4.8 శాతం మాత్రమే ఉన్న రెడ్డి కులస్తులకు మొత్తం భూమిలో తమ జనాభా నిష్పత్తి కన్నా అతి ఎక్కువగా 13.5 శాతం ఉంది. చాలా కులాలకు భూమిలో తమ జనాభాకు సమానమైన వాటా లేకపోగా, ఏడు కులాల చేతిలోనే 51.4 శాతం భూములున్నాయి. ఎస్సీలలో 90.5 శాతం మందివి చిన్న కమతాలు కాగా, బీసీలలో 85 శాతం మందివి చిన్న కమతాలే. భూమిలేని నిరుపేదలు ఎంత మంది ఉన్నారో చెప్పడం ఈ సర్వే పరిధిలో లేదు గనుక ఆ గణాంకం లేదు గాని, మొత్తంగా 242 కులాల జాబితాలో కేవలం 56 కులాల భూయాజమాన్యం గురించి వివరాలు మాత్రమే ఉన్నాయి. మరొకవైపు నుంచి రాష్ట్రంలో వార్షికాదాయం ఒక లక్ష రూపాయల కన్నా తక్కువ ఉన్న కుటుంబాల సంఖ్య 1.1 కోట్లు అని ఈ నివేదిక చెపుతుంది. మొత్తం రాష్ట్రంలో ఈ సర్వేలో పాల్గొన్న ఒక కోటీ పన్నెండు లక్షల కుటుంబాలలో ఒక కోటీ పది లక్షల కుటుంబాలు ఒక లక్ష రూపాయల కన్నా తక్కువ వార్షికాదాయంతో ఉన్నాయంటే రాష్ట్ర ఆర్థిక స్థితి అర్థమవుతుంది.
రెండు, విడివిడిగా ఏ ఒక్క కులమూ జనసంఖ్య ఒక్కటే చూస్తే బలమైనది కాదని ఈ నివేదిక చూస్తే అర్థమవుతుంది. దు. మొత్తం 242 కులాల్లో జనాభాలో ఒక్కశాతం కన్నా ఎక్కువ ఉన్న కులాలు కేవలం 22 మాత్రమే. వాటిలో కూడా ఐదు శాతం కన్నా ఎక్కువ ఉన్న కులాలు నాలుగు కన్నా ఎక్కువ లేవు. ఎక్కువ జనసంఖ్య ఉన్న కులాలు మాదిగ (10.3 శాతం), ముదిరాజ్ (7.4 శాతం), లంబాడీ (6.8 శాతం), యాదవ (5.7 శాతం), రెడ్డి (4.8 శాతం), గౌడ్ (4.6 శాతం), మాల (4.1 శాతం), మున్నూరు కాపు (3.9 శాతం), పద్మశాలి (3.3 శాతం), రజక (2.8 శాతం). తమ కులం చెప్పుకోని వారి జనాభానే ఇటువంటి హెచ్చు జనసంఖ్య ఉన్న కులాలతో సమానంగా 3.4 శాతంగా ఉంది. అంటే కులాల ప్రత్యేక అస్తిత్వమూ గుర్తింపూ ఎంత ముఖ్యమైనది అయినప్పటికీ, ఆ పేరు మీదనే సమీకరణలు జరుగుతున్నప్పటికీ, సమాజం మొత్తంగా చూస్తే సంఖ్యాపరంగా ఏ ఒక్క కులమూ బలమైనది కాదు. అంటే పీడిత కులాల హక్కుల సాధనకు విడివిడిపోరాటాలు బలంగా మారే అవకాశం లేదనీ, కులాల మధ్య ఐక్యత ఇంకా ఎక్కువ అవసరమనీ తేలుతుంది. జనసంఖ్యలో మూడు నాలుగు శాతం మించని ఒకటి రెండు కులాలే ఆధిపత్య కులాలుగా అధికారాన్నీ, సంపదనూ అనుభవిస్తుండడానికి కారణాలు చారిత్రకమైనవీ, రాజకీయార్థికమైనవీ తప్ప జనసంఖ్య కాదనే వాస్తవాన్ని ఈ గణాంకాలు చూపుతున్నాయి.
సర్వే ప్రశ్నల్లో, ప్రాతిపదికల్లో అటువంటి చారిత్రక, రాజకీయార్థిక, వ్యవస్థాగత అంశాలను వెలికితీసే ప్రశ్నలు లేవు. ఒక్కటి కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. మామూలుగానే ఇటువంటి ఇంటింటి సర్వేలలో, ప్రభుత్వ గణాంకాల్లో చాలా అవకతవకలు ఉంటాయి. సమాజ స్థితిని కేవలం ప్రశ్న జవాబులతో, అంకెలతో తేల్చడం సాధ్యం కాదు. ఆ సమయానికి సర్వే చేయడానికి వెళ్లిన వ్యక్తి వేసే ప్రశ్నలకు ఎదుటి వ్యక్తి చెప్పే జవాబు సర్వ సమగ్రమైన సరైన జవాబు కావాలని ఏమీ లేదు. ఆ జవాబుల్లో నిర్లక్ష్యం, దురభిప్రాయాలు, ఎక్కువ చేసి చెప్పడం, తక్కువ చేసి చెప్పడం, అంకెల్లో చెప్పలేకపోవడం ఉండవచ్చు. వారు గుణాత్మకంగా చెప్పినది ప్రశ్నాపత్రంలోని పరిమాణాత్మక అంశాలలో దేనితో సరిపోతుందో సర్వేయర్ తేల్చుకోలేక, తనకు తోచినదానికి టిక్ కొట్టవచ్చు. ఇటువంటి అనేక సమస్యలు సర్వే పద్ధతిలో ఉన్నాయని గతంలో ఎందరో గుర్తించారు. అసలు గుణాత్మకమైన సామాజిక అంశాలను పరిమాణాత్మకంగా అంకెల్లోకి, గణాంకాల్లోకి మార్చడం అన్ని సందర్భాల్లోనూ, సక్రమంగా సాధ్యం కాదు. ఈ సమస్యలను అధిగమించడానికి, వచ్చిన జవాబులను అప్పటికే ఉన్న ఇతర సమాచారంతో సరిపోల్చడం, ప్రశ్నపత్రంలోనే సరిపోల్చడానికి అవకాశం ఇచ్చే ఎదురుబొదురు ప్రశ్నలు సంధించడం వంటి పద్ధతులు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఉదాహరణకు ఇక్కడ భూమి గురించి వచ్చిన జవాబులను, ప్రభుత్వ రెవెన్యూ గణాంకాలతో సరిపోలిస్తే, ఇప్పుడు నివేదికలో ఉన్న కొన్ని పొరపాటు నిర్ధారణలకు అవకాశం ఉండేది కాదు.
అటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, తెలంగాణ సమాజంలో చాలా పెద్ద ఎత్తున వెనుకబాటుతనం ఉందనీ, వెనుకబాటుతనానికీ కులానికీ ఇంత సంబంధం ఉందనీ ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఈ వెనుకబాటుతనం, అభివృద్ధి రాహిత్యం, ప్రజా సమూహాలకు అందవలసిన వనరులు అందకపోవడం తప్పనిసరిగా అసంతృప్తికి దారి తీస్తాయి. అటువంటి అసంతృప్తులను ఇతర కులాల మీదికి, మతాల మీదికి, విడివిడి ఘటనల, సందర్భాల మీదికి మళ్లించడానికి పాలకవర్గాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ అసంతృప్తులన్నిటికీ మూలం వర్గ పాలన అని, ఒక ప్రత్యేకమైన అభివృద్ధి నమూనా అని గుర్తింపజేసి, ఆ మూలాన్ని మార్చే, వ్యవస్థను మార్చే పోరాటంలో ప్రజలను భాగం చేయడం కష్టతరం కావచ్చు గాని, అసాధ్యం కాదు.
సమాజంలో విప్లవావసరం లేదని, ప్రజలు విప్లవం అవసరం లేనంతగా మారిపోయారని, పరిస్థితులు విప్లవానికి అననుకూలంగా మారిపోయాయని, ఇంతకాలమూ విప్లవం చేద్దామనుకున్నవాళ్లు కూడా ఇక ఆ పనికి రాజీనామా పెట్టవచ్చునని మహామహులు ప్రవచిస్తున్న వేళ, సమాజం అందిస్తున్న సంకేతాలు పూర్తిగా భిన్నంగా ఉండడం ఒక విరోధాభాస. చూడదలచుకుంటే, వినదలచుకుంటే ఆ సంకేతాలు అనేకం అనేక రూపాలలో, స్పష్టంగానో, అస్పష్టంగానో వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ప్రజలు ఎక్కడికక్కడ తమంతట తామో, దొరికిన ఏదో ఒక నాయకత్వం కిందనో తమ అసంతృప్తి ప్రకటిస్తున్నారు. సమాజంలో అసమానతలు క్షణక్షణానికీ ఇంకా తీవ్రం అవుతుండడం మాత్రమే కాదు, విస్ఫోటకంగా దృశ్యమానమవుతున్నాయి. నూట నలబై ఏళ్ల కింద సాధించిన ఎనిమిది గంటల పని దినం ఇప్పుడు అటు కొసన ఏసీ గదుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన శ్రమల్లోనూ, ఇటు కొసన నోయిడా, మానేసర్ యంత్రభూతముల కోరలు తోమే పనుల్లోనూ ఒక అపహాస్య వస్తువు అయిపోయింది. కుల పీడన, కుల వివక్ష, కుల హత్యలు సర్వ సాధారణ వార్తలుగా మారిపోతున్నాయి. మనుషుల మధ్య సంబంధాలు సమాజం ఎదిగినకొద్దీ ప్రజాస్వామ్యంలోకీ పరస్పర గౌరవంలోకీ ప్రవహించవలసింది, అసహనంలోకీ, హత్యలోకీ, ఆత్మహత్యలోకీ, ఆధిక్యతలోకీ, న్యూనతలోకీ అతి వేగంగా దిగజారిపోతున్నాయి. సమానత్వం, సామాజిక న్యాయం అనే అత్యంత సహజమైన, మానవీయమైన భావనలు నిషిద్ధ పదార్థాలు అయిపోతున్నాయి. దోపిడీ పీడన అవిద్య అనారోగ్యం అసహనం నిరంకుశత్వం రాజ్యమేలుతున్న ఈ సమాజ స్థితిని మించిన విప్లవ పరిస్థితి ఏమిటి?
అయితే భౌతిక పరిస్థితి దానంతట అదే ఆ స్థితిని శాస్త్రీయ దృష్టితో, నిర్మాణాత్మకంగా, పురోగామి దిశగా మార్చే స్వీయాత్మక శక్తులను సృష్టించదు. ఆక్రోశాన్ని, ఆవేదనను, నిరాశను, నిస్సహాయతను, ఎక్కువలో ఎక్కువ ఒంటరి తిరుగుబాటును మాత్రమే సృష్టిస్తుంది. దాన్ని ఆత్మవిశ్వాసంగా, మార్పుకు చోదకశక్తిగా, పురోగామి దృక్పథ వాహికగా మార్చేది విప్లవ చైతన్యమే. ఆ చైతన్యాన్ని సమాజంలో ఎల్లెడలా వ్యాపింపజేసే అగ్రగామి విప్లవ శక్తులే. అది వేరే కథ.
– ఎన్ వేణుగోపాల్





మాంచాల అచ్యుత సత్యనారాయణ రావు
నెల్లుట్ల వేణుగోపాలరావు గారు తన రాసిన వ్యాసం” విప్లవా వసరానికి ఎన్నెన్నో సూచికలు ” ప్రస్తుత భారతదేశ వ్యాప్తంగా సమస్యలతో పాటు విప్లవ పరిస్థితిని కూడా విశ్లేషణాత్మకంగా వివరించారు.
“ఆత్మవిశ్వాసంగా, మార్పుకు చోదకశక్తిగా, పురోగామి దృక్పథ వాహికగా మార్చేది విప్లవ చైతన్యమే. ఆ చైతన్యాన్ని సమాజంలో ఎల్లెడలా వ్యాపింపజేసే అగ్రగామి విప్లవ శక్తులే. అది వేరే కథ.’ అంటూ ముగించడం
అసంతృప్తిగా ఉంది. ఏనాడైతే
బ్రిటిష్ -ఇండియా పాలకులు భగత్ సింగ్ ను ఉరితీశారో ఆరోజే భారతదేశంలో కమ్యూనిస్టు నాయకత్వం వైఫల్యం
చెందింది. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల్లో విప్లవ చైతన్యం ఏర్పరచడంలో వైఫల్యం పొందాము. ఆ మూల వైఫల్యమే ఈనాటి మావోయిస్టు పార్టీ లోని నాయకత్వం కేడర్ లొంగుబాటుకి ప్రధాన కారణమని నేను భావిస్తున్నా.
వ్యాసంలో రచయిత పేరు ‘ఎన్ వేణుగోపాల్’ అని ఉంది. ఈ వ్యాఖ్య రాసినవారు రచయిత పేరు మార్చినట్టున్నారు!!
మాంచాల అచ్యుత సత్యనారాయణ రావు
సార్ వాయిస్ టైపింగ్ లో పొరపాటు జరిగింది అది నేను తొందరపాటులో చూసుకోలేదు. మన్నించగలరు.
నిజమే
ఎన్ వేణుగోపాల్
నెల్లుట్ల వేణుగోపాల్ రావు రావు అనే పదము వైస్ టైపింగ్ లో పొరపాటున జంప్ అయింది అందుకు మన్నించగలరు.
మాంచాల అచ్యుత సత్యనారాయణ రావు
నెల్లుట్ల వేణుగోపాలరావు గారు తన రాసిన వ్యాసం” విప్లవా వసరానికి ఎన్నెన్నో సూచికలు ” ప్రస్తుత భారతదేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలతో పాటు విప్లవ పరిస్థితిని కూడా విశ్లేషణాత్మకంగా వివరించారు.
“ఆత్మవిశ్వాసంగా, మార్పుకు చోదకశక్తిగా, పురోగామి దృక్పథ వాహికగా మార్చేది విప్లవ చైతన్యమే. ఆ చైతన్యాన్ని సమాజంలో ఎల్లెడలా వ్యాపింపజేసే అగ్రగామి విప్లవ శక్తులే. అది వేరే కథ.’ అంటూ ముగించడం
అసంతృప్తిగా ఉంది. ఏనాడైతే
బ్రిటిష్ -ఇండియా పాలకులు భగత్ సింగ్ ను ఉరితీశారో ఆరోజే భారతదేశంలో కమ్యూనిస్టు నాయకత్వం వైఫల్యం
చెందింది. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల్లో విప్లవ చైతన్యం ఏర్పరచడంలో వైఫల్యం పొందాము. ఆ మూల వైఫల్యమే ఈనాటి మావోయిస్టు పార్టీ లోని నాయకత్వం కేడర్ లొంగుబాటుకి ప్రధాన కారణమని నేను భావిస్తున్నా.
నిజమే
ఎన్ వేణుగోపాల్ బదులు వేణుగోపాల్ రావు అని వాయిస్ టైపింగ్ లో రావు అనే పదం జంపు అయ్యింది అందుకు మన్నించగలరు.
రివైజ్డ్
నిజమే
ఎన్ వేణుగోపాల్ గా పేర్కొన వలసింది నేను
నెల్లుట్ల వేణుగోపాల్ రావు గా వాయిస్ టైపింగ్ లో చెప్పడం జరిగింది, తొందరపాటుకు మన్నించగలరు.
మాంచాల అచ్యుత సత్యనారాయణ రావు
ఎన్ వేణుగోపాల్
గారు తను రాసిన వ్యాసం
”విప్లవావసరానికి ఎన్నెన్నో సూచికలు ” ప్రస్తుత భారతదేశ వ్యాప్తంగా సమస్యలతో పాటు విప్లవ పరిస్థితిని కూడా విశ్లేషణాత్మకంగా వివరించారు.
“ఆత్మవిశ్వాసంగా, మార్పుకు చోదకశక్తిగా, పురోగామి దృక్పథ వాహికగా మార్చేది విప్లవ చైతన్యమే. ఆ చైతన్యాన్ని సమాజంలో ఎల్లెడలా వ్యాపింపజేసే అగ్రగామి విప్లవ శక్తులే. అది వేరే కథ.’ అంటూ ముగించడం
అసంతృప్తిగా ఉంది. ఏనాడైతే
బ్రిటిష్ -ఇండియా పాలకులు భగత్ సింగ్ ను ఉరితీశారో ఆరోజే భారతదేశంలో కమ్యూనిస్టు నాయకత్వం వైఫల్యం
చెందింది. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల్లో విప్లవ చైతన్యం ఏర్పరచడంలో వైఫల్యం పొందాము. ఆ మూల వైఫల్యమే ఈనాటి మావోయిస్టు పార్టీ లోని నాయకత్వం కేడర్ లొంగుబాటుకి ప్రధాన కారణమని నేను భావిస్తున్నా.
INCOMPLETED ONE
60 YEARS CONGRESS PARTY RULED INDIA —DORALU -AGRAKULALU THEY ARE IN CONGRESS
AND RULED THE STATES-CORRUPTION,CHEATING ,KUMBHAKONALU -DOCHUKOVADAM -DHACHUKOVADAM IS HIGH IN THAT PERIOD —EVERYONE KNOWS IN ALL VILLAGES LANDS ARE OWENED. BY DORALU —BOODHANAM -LAND REFORMS -ARE ALL BOGUS –
12 CHIEF MINISTERS ARE REDDYS RULED ANDRAPRADESH —STILL TO DAY ALSO SAME AGRAKULALU RULING THE STATES -NEHRU PLANTED FAMILY RULE -IT SPREAD ALL OVER THE COUNTRY -FAMILIES ARE RULING THE STATES -FATHER /SON /DAUGHTHER -NO CHANGE IN DEMOCRACY—NO REAL LEADER IN THE COUNTRY —LIKE J.P -LB. NANDA . LOHIA –
NO CHANGE IN ECONOMIC STATUS
NO POWER TO DALITHS AND MUSLIMS
HINDU RELIGION PLAYING. BIG POLITICS
INDIA NEEDS. TRUE LEADER
VIPLAVAM. IS NOT THE SOLUTION
========BUCHIREDDY GANGULA