“మార్క్స్ గురించి చెప్పకుండా ఎంగెల్స్ గురించి మాట్లాడటం అసాధ్యం. వారి జీవితాలు ఒక అల్లికలా ఎంతగా కలగలిసిపోయాయంటే , అది ఒకే జీవితమా అన్నంతగా .” – పాల్ లాఫార్గ్
ఫెడ్రిక్ ఎంగెల్స్ మరణంపై రాస్తూ లెనిన్ – “ఎంతటి జ్ఞానజ్యోతి ఆరిపోయింది! ఎంతటి గొప్ప హృదయ స్పందన ఆగిపోయింది”. ఆయన మరణించి 131 సంవత్సరాలు గడిచినా, ఆయన ఆలోచనల రూపంలో ఆ జ్ఞానజ్యోతి నేటికీ ప్రకాశిస్తూనే ఉంది.
ఫెడ్రిక్ ఎంగెల్స్ 1820 నవంబర్ 28న నేటి జర్మనీలోని వుప్పెర్టాల్ (అప్పటి ప్రష్యా) లో జన్మించాడు. విద్యార్థి రోజుల నుంచే తను రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. మార్క్స్ లాగే, ఎంగెల్స్ కూడా ‘యంగ్ హెగెలియన్’ (లెఫ్ట్ హెగెలియన్) బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ కాలంలో కార్ల్ మార్క్స్ ఎడిట్ చేసిన ‘రైనిష్ జైటుంగ్’ (Rheinische Zeitung) పత్రికకు ఆయన అనేక వ్యాసాలు రాశాడు. అప్పటికి ఎంగెల్స్ ఇంకా మార్క్స్‌ను కలవలేదు.
ఎంగెల్స్ ఒక సంపన్న మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రికి టెక్స్‌టైల్ మిల్లులు ఉండేవి. సహజంగానే ఆయన తన కుమారుడి రాజకీయ కార్యకలాపాలను వ్యతిరేకించాడు. చివరికి, తండ్రి ఒత్తిడి మేరకు ఎంగెల్స్ 1842లో తన తండ్రి భాగస్వామ్యంలో ఉన్న ఒక కర్మాగార నిర్వాహణ పని చూడడానికి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌కు వెళ్లాడు.
అక్కడే ఆయనకు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఐరిష్ కార్మిక వర్గానికి చెందిన మేరీ బర్న్స్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా, జీవితకాల భాగస్వామ్యంగా మారింది. అయితే వారు అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. వారిద్దరికీ బూర్జువా వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు.
మేరీ బర్న్స్ ఎంగెల్స్ జీవితంపై నిర్ణయాత్మకమైన ప్రభావాన్ని చూపింది. ఆమె రాజకీయ చైతన్యం ఉన్న మహిళ. కార్మికుల ‘ఛార్టిస్ట్ ఉద్యమం’లో (Chartist Movement) క్రియాశీల కార్యకర్త. మేరీ బర్న్స్ ఎంగెల్స్‌ను ఛార్టిస్ట్ ఉద్యమ నాయకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత, ఎంగెల్స్ ఛార్టిస్ట్ పత్రిక ‘ది నార్తర్న్ స్టార్’ కు వ్యాసాలు రాయడం ప్రారంభించాడు.
అంతేకాదు మేరీ బర్న్స్ కార్మికులు నివసిస్తున్న మురికి, కిక్కిరిసిన మురికివాడలను, వారి దైనందిన పోరాటాల కఠినమైన జీవన వాస్తవికతను ఎంగెల్స్‌కు పరిచయం చేసింది. ఈ అంశాన్ని రావుల్ పెక్ తీసిన ‘ది యంగ్ కార్ల్ మార్క్స్’ అనే సినిమాలో అద్భుతంగా చిత్రీకరించాడు. కార్మికుల నివాస ప్రాంతాల్లో ఎంగెల్స్‌పై దాడి జరగకుండా మేరీ బర్న్స్ చాలా సందర్భాల్లో ఆయనను కాపాడారు. ఒక సంపన్నుడిలా కనిపించే బయటి వ్యక్తి ఏదో స్వార్థపూరిత కారణంతోనే తమ ప్రాంతంలోకి వచ్చి ఉంటాడని ప్రారంభంలో కార్మికులు అనుమానించేవారు.
1845లో ప్రచురితమైన ఎంగెల్స్ క్లాసిక్ రచన, ‘ఇంగ్లాండ్ లో కార్మికవర్గ పరిస్థితులు’ (The Condition of the Working Class in England), ఈ ప్రత్యక్ష అనుభవాల ఆధారంగానే రూపొందింది. ఆయనను ఆ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మేరీ బర్న్స్‌కే దక్కుతుంది. ఎంగెల్స్ మేరీ బర్న్స్‌తో కలిసి ఐర్లాండ్‌ను కూడా సందర్శించాడు. ఐరిష్ జాతి సమస్యను అర్థం చేసుకోవడంలో ఆ ప్రయాణం ఆయనకు ఎంతగానో ఉపయోగపడింది.
ఎంగెల్స్ మొదటిసారి 1842లో మార్క్స్‌ను కలిశాడు. 1844లో వారిద్దరూ ప్యారిస్‌లో పది రోజులు కలిసి గడిపారు. అప్పుడు మార్క్స్ అక్కడ ప్రవాస జీవితంలో ఉన్నాడు. పది పగళ్లు, రాత్రుల తీవ్రమైన చర్చలు, సంభాషణల తర్వాత వారు నేడు మనం మార్క్సిజంగా చెప్పుకుంటున్న సిద్ధాంతానికి పునాది అయిన లోతైన భావజాల ఐక్యతకు చేరుకున్నారు.
ఎంగెల్స్ స్వభావరీత్యా ఎంతో వినయశీలి అయినప్పటికీ, రాజకీయార్థశాస్త్రం (Political Economy) లోని పలు ముఖ్యమైన అంశాలను మార్క్స్‌కు పరిచయం చేసింది ఎంగెల్సేనని ప్రముఖ జర్మన్ సోషలిస్ట్ ఫ్రాంజ్ మెహరింగ్ రాశారు.
ఆ రకంగా ప్రపంచ శ్రామికవర్గానికి మార్క్స్, ఎంగెల్స్ రూపంలో గొప్ప దిశానిర్దేశకులు, సేనాపతులు లభించారు.
మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరూ కలిసి తమ మొదటి పుస్తకం ‘ది హోలీ ఫ్యామిలీ’ (1845) రాశారు. ఆ తర్వాత 1846లో ‘ది జర్మన్ ఐడియాలజీ’ గ్రంథాన్ని రచించారు. విప్లవ గతితార్కిక భౌతికవాదాన్ని ఒక పద్ధతి ప్రకారం సమగ్రంగా సమర్పించిన మొదటి పుస్తకం ‘ది జర్మన్ ఐడియాలజీ’. పెట్టుబడిదారీ విధానంలో శ్రామికవర్గాన్ని బంధించే ‘మిథ్యా చైతన్యం’ (False Consciousness) అనే భావనను కూడా మొదటిసారిగా ఈ గ్రంథంలోనే పరిచయం చేశారు.
“మానవ జీవితపు భౌతిక పరిస్థితులే చైతన్యాన్ని నిర్ణయిస్తాయి తప్ప, చైతన్యం భౌతిక పరిస్థితులను నిర్దేశించదు.”అన్ని రకాల భావవాద అపోహలను, భ్రమలను పటాపంచలు చేసిన విప్లవాత్మక ప్రతిపాదన ఈ పుస్తకం లోనిదే.
మరొక అద్భుతమైన గతితార్కిక నియమం కూడా మొదటిసారిగా ఇందులోనే సూత్రీకరించారు- “పరిస్థితులు మనుషులను ఎలా తీర్చిదిద్దుతాయో, మనుషులు కూడా పరిస్థితులను అంతే స్థాయిలో తీర్చిదిద్దుతారు.”
ఈ గ్రంథంలోనే ఎంగెల్స్ ఇలా ప్రకటించాడు: “విముక్తి ఒక చారిత్రకతే తప్ప, మానసిక చర్య కాదు.”
ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ విప్లవాత్మక పుస్తక ప్రచురణకు రష్యన్ విప్లవం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. మొదటిసారిగా 1935లో సోవియట్ రష్యాలో ముద్రితమై సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
భావ సారూప్యత కలిగిన వారి మధ్య ఐక్యతను పెంపొందించడానికి మార్క్స్ , ఎంగెల్స్ లు 1846లో ‘కమ్యూనిస్ట్ కరస్పాండెన్స్ కమిటీ’ని స్థాపించారు.
మొదట ‘లీగ్ ఆఫ్ ది జస్ట్’గా ఉన్న సంస్థ తర్వాత ‘కమ్యూనిస్ట్ లీగ్’ గా పరిణమించింది. వారు ఇరువురూ సభ్యులుగా మారారు. ఆ లీగ్ ప్రణాళికను (మ్యానిఫెస్టో) రూపొందించే బాధ్యత మార్క్స్, ఎంగెల్స్‌లపై పడింది. ఈ పత్రం 1848 ఫిబ్రవరిలో ప్రచురితమైంది.
‘ది కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో’ (కమ్యునిస్ట్ ప్రణాళిక) ప్రచురణ తర్వాత ప్రపంచం ఇక ఎంతమాత్రం మునుపటిలా లేదు అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
మానవాళి చరిత్రలోనే అత్యంత అందమైన, విప్లవాత్మకమైన నినాదం – “ప్రపంచ కార్మికులారా, ఏకం కండి! పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. మీరు గెలవాల్సింది ఈ ప్రపంచాన్ని!” ఈ నినాదం ఆ మ్యానిఫెస్టో నుంచే ఉద్భవించింది.
కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో తత్వశాస్త్రాన్ని తత్వవేత్తల ఊహాలోకాల నుంచి దించి కార్మికుల పోరాటాల నడిబొడ్డున నిలబెట్టింది.
“తత్వవేత్తలు ప్రపంచాన్ని వివిధ రీతుల్లో వ్యాఖ్యానించడం మాత్రమే చేశారు కానీ, అసలు విషయమేమిటంటే దానిని మార్చడం.” [ఈ పదాలు మార్క్స్ సమాధిపై కూడా చెక్కారు ] అని బిగ్గరగా చాటిచెప్పింది:
దాదాపు రెండు వేల సంవత్సరాల తత్వశాస్త్ర చరిత్రలో మొదటిసారిగా ప్రపంచాన్ని మార్చడం అనే అంశమే తత్వశాస్త్ర కేంద్రబిందువుగా మారింది.
మొదటిసారిగా, మానవ సమాజాల సమగ్ర చరిత్ర (ఆ సమయానికి ఆదిమ కమ్యూనిజం భావన రూపొంద లేదు) వర్గపోరాటాల చరిత్రగా సూత్రీకరించారు.
సామాజిక శాస్త్రాలలో ఈ ప్రతిపాదన ప్రాముఖ్యత, భౌతికశాస్త్రంలో ఐన్‌స్టీన్ E = mc^2 తో పోల్చదగినది.
కమ్యూనిజం సిద్ధాంతాలను వివరించే కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో భాగాన్ని ఎంగెల్స్ ఒక్కరే రాశారు. ఈ భాగంలో, ఎంగెల్స్ కమ్యూనిజం సూత్రాలను అత్యంత సరళంగా, స్పష్టంగా వివరించారు. మొదటిసారిగా, భవిష్యత్తు వర్గరహిత సమాజ స్థూల రూపురేఖలను అందించారు.
ఎంగెల్స్ శ్రామికవర్గాన్ని ఒక స్వతంత్ర వర్గంగా గుర్తించి, దాని విముక్తికి శాస్త్రీయ పునాదిని అందించారు. ఆయన మరొక ముఖ్యమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చారు – మొత్తం సమాజాన్ని విముక్తం చేయకుండా, శ్రామికవర్గం తనను తాను విముక్తం చేసుకోలేదు.
కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో ప్రచురితమైన వెనువెంటనే, రాచరికం, భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా దాదాపు యూరప్ అంతటా విప్లవాత్మక తిరుగుబాట్లు ప్రజ్వరిల్లడం చెప్పుకోదగిన చారిత్రక యాదృచ్ఛికత. ఈ తిరుగుబాట్ల ప్రభంజనాన్ని మార్క్స్ “ఖండాల విప్లవం” (Continental Revolution) అని అభివర్ణించాడు.
సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే సమయం వచ్చింది. తత్వశాస్త్రాన్ని యథార్థ జీవితంలోకి తీసుకురావాల్సిన ఘట్టం ఆసన్నమైంది. ఇక్కడ కూడా మార్క్స్, ఎంగెల్స్ ముందువరసలో నిలిచారు. ఇద్దరూ వెంటనే విప్లవోద్యమంలోకి దూకారు.
కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టోలో ప్రతిపాదనకు అనుగుణంగా శ్రామికవర్గం మొదటిసారిగా ఒక స్వతంత్ర రాజకీయ వర్గంగా పోరాటంలోకి ప్రవేశించింది.
1848 నుండి 1850 వరకు ఫ్రాన్స్‌లో జరిగిన వర్గపోరాటాలపై మార్క్స్ రాసిన ‘ది క్లాస్ స్ట్రగుల్స్ ఇన్ ఫ్రాన్స్’ గ్రంథానికి పీఠిక రాస్తూ ఎంగెల్స్ “అన్ని చోట్లా విప్లవం అనేది శ్రామికవర్గం చేసిన పోరాట ఫలితమే. బారికేడ్లను నిలబెట్టింది కార్మికులే. విప్లవంలో తమ ప్రాణాలను అర్పించింది కూడా కార్మికులేన “ ని అన్నాడు.
జర్మనీలోని కొలోన్ నగరాన్ని మార్క్స్, ఎంగెల్స్ తమ విప్లవ కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నారు.ఆ తర్వాత, ఎంగెల్స్ రైన్ ప్రాంతానికి వెళ్ళి, స్వయంగా చేత తుపాకీ పట్టుకుని సాయుధ బారికేడ్ల పోరాటాల్లో పాల్గొన్నాడు.
సైనిక వ్యవహారాలకు సంబంధించిన సిద్ధాంతం ,ఆచరణ రెండింటిపై ఎంగెల్స్‌కు అసాధారణమైన పట్టు ఉండేదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 1841లో ఆయన కొంతకాలం ప్రష్యన్ సైన్యంలో సేవలు అందించారు. మార్క్స్ కుటుంబంలో ఎంగెల్స్‌ను ఆప్యాయంగా “మిస్టర్ జనరల్” గా సంబోధించే వారు.
అయితే, శ్రామికవర్గం ప్రదర్శించిన స్వతంత్ర రాజకీయ చొరవను చూసి బూర్జువా (పెట్టుబడిదారీ) వర్గం కుదుపుకు గురైంది. బూర్జువా వర్గం విప్లవాన్ని మధ్యలోనే విడిచిపెట్టి, భూస్వామ్య శక్తులతో చేతులు కలిపి, అంత వరకు తనతో కలిసి పోరాడిన శ్రామికవర్గం వైపే తుపాకులను గురి పెట్టింది. జూన్ నాటికి, విప్లవ గమనం పూర్తిగా మారిపోయింది. ద్రోహియైన బూర్జువా వర్గం, భూస్వామ్య శక్తులతో కలిసి కార్మికులను ఊచకోత కోసింది.
ఈ పరిణామంపై మార్క్స్ పదునైన వ్యాఖ్య చేశాడు – “బూర్జువా రిపబ్లిక్ అనేది ఫిబ్రవరి విప్లవంలో కాకుండా, జూన్ ప్రతిఘాత విప్లవం (Counter-Revolution) లో పునాది వేసుకుంది.” ఐరోపా ఇప్పుడు తిరోగామి శకంలోకి (Period of Reaction) ప్రవేశించింది.తమ విప్లవాత్మక ఆలోచనలు, కార్యకలాపాల కారణంగా మార్క్స్, ఎంగెల్స్ యూరప్ అంతటా ప్రమాదకారులుగా ముద్ర వేయబడ్డారు. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.తప్పని పరిస్థితుల్లో, తిరోగామి శక్తుల పట్టు బలహీనంగా ఉన్న ఇంగ్లాండ్‌కు పయనమయ్యారు .
ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత, ఎంగెల్స్ మాంచెస్టర్‌లోని తన తండ్రి పత్తి మిల్లులో ఉద్యోగానికి తిరిగి వెళ్ళడమనే బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన ప్రియ మిత్రుడు, సహచరుడు కార్ల్ మార్క్స్, ఆయన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడం అనే ఏకైక కారణంతో ఆయన ఈ పనిని ఒప్పుకున్నాడు. ఎంగెల్స్ ఆర్థిక సహకారం వల్లే మార్క్స్ తన చారిత్రక గ్రంథం ‘కాపిటల్’ (Capital) రచనను పూర్తి చేయగలిగాడు. మార్క్స్ స్వయంగా ఎంగెల్స్‌కు రాసిన ఒక లేఖలో ” కాపిటల్’ పని పూర్తయింది. ఇది కేవలం నీ త్యాగం వల్లే సాధ్యమైంద “ని తెలియజేశాడు.
మార్క్స్ మరణానంతరం తను అసంపూర్ణంగా , అస్తవ్యస్తంగా వదిలివెళ్లిన రాతప్రతుల నుండి కాపిటల్’ రెండవ, మూడవ సంపుటాలను సరిదిద్ది, పూర్తి చేయడానికి ఎంగెల్స్ పూర్తిగా తనను తాను అంకితం చేసుకున్నాడు. ఎంగెల్స్ ఈ సంపుటాలను పూర్తి చేసిన విధానాన్ని పరిశీలించి వీటిని మార్క్స్, ఎంగెల్స్ ల ఇద్దరి ఉమ్మడి రచనగా పరిగణించాలని లెనిన్ తేల్చిచెప్పాడు.
మార్క్స్, ఆయన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడడమే కాకుండా, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌లలో ప్రతిఘాతుక శక్తుల దాడి నుంచి తప్పించుకోవడానికి పారిపోయి వచ్చిన ఎంతోమంది ప్రవాస రాజకీయ కార్యకర్తలకు కూడా ఎంగెల్స్ సహాయం అందించాడు.
బహుశా ఆయన వ్యక్తిత్వంలోని ఈ మానవీయ కోణమే లెనిన్‌ను – “అందరి కోసం స్పందించిన ఒక సాటిలేని మహోన్నత హృదయం.” అని అనేలా ప్రేరేపించింది.
ఈ బాధ్యతలన్నింటి మధ్యే ఎంగెల్స్ 1850లో మరొక అద్భుతమైన గ్రంథం “ది పీజెంట్ వార్ ఇన్ జర్మనీ” మనకు అందించాడు .
ఈ పుస్తకంలో, ఆయన ప్రొటెస్టంట్ మత సంస్కరణల వెనుక ఉన్న సామాజిక – ఆర్థిక శక్తులను గుర్తించాడు. దాని మతపరమైన ముసుగు వెనుక, ప్రొటెస్టంట్ ఉద్యమం ప్రాథమికంగా ఒక బూర్జువా ఉద్యమమని నిరూపించాడు. అయినప్పటికీ, ఈ పుస్తక అత్యంత ముఖ్యమైన నిర్ధారణ ఏమిటంటే — శ్రామికవర్గం తన విజయాన్ని ఖాయం చేసుకోవాలనుకుంటే, అది రైతులతో ఐక్య సంఘటనతోనే సాధ్యం. ఎంగెల్స్ ఈ నిర్ధారణకు రావడానికి నిస్సందేహంగా 1848 నాటి విప్లవ వైఫల్యం ఆయన మనస్సులో ఉండి తీరాలి.
ఈ కాలంలో మార్క్స్ కేవలం ‘కాపిటల్’ రాయడంలోనే నిమగ్నమైపోయాడని, ఎంగెల్స్ ఫ్యాక్టరీ పనిలోనే బిజీగా ఉన్నాడని ఊహించుకోవడం పొరపాటే అవుతుంది. దానికి భిన్నంగా, ఇద్దరూ కార్మికోద్యమాన్ని పునర్నిర్మించడానికి నిరంతరం శ్రమించారు. వారు ఇంగ్లాండ్‌లోని ప్రవాస రాజకీయ కార్యకర్తలతో, వృత్తి సంఘాలతో నిరంతరం సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ, వారికి మార్గదర్శకత్వం, సంస్థాగత మద్దతును అందించారు.
ఈ కాలంలోనే మార్క్స్ , ఎంగెల్స్ అణగారిన జాతులు, తమ విముక్తి కోసం పోరాడుతున్న వారితో — ముఖ్యంగా పోలిష్ , ఐరిష్ ప్రజలతో సన్నిహిత సంబంధాలను నెరపారు. జాతి విముక్తి పోరాటాలను విశాలమైన అంతర్జాతీయ కార్మికోద్యమంలో భాగం చేయడానికి ప్రయత్నించారు.
వారు అమెరికన్ అంతర్యుద్ధంలో జరుగుతున్న పరిణామాలను ఎంతో శ్రద్ధతో గమనిస్తూ, దానిపై విస్తృతంగా రాశారు. ముఖ్యంగా అంతర్యుద్ధపు సైనిక కోణాలపై ఎంగెల్స్ రాసిన విశ్లేషణలకు ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ ప్రయత్నాలన్నీ ఫలించి, 1864లో ప్రపంచంలోనే మొదటి శ్రామికవర్గ అంతర్జాతీయ సంస్థ ఆవిర్భవించింది. అదే ‘ఇంటర్నేషనల్ వర్కింగ్‌మెన్స్ అసోసియేషన్’, దీనినే ‘ఫస్ట్ ఇంటర్నేషనల్’ (First International) గా పిలుస్తారు.
ఈ ‘ఫస్ట్ ఇంటర్నేషనల్’ వేదికగానే ప్రౌధోనిజం (Proudhonism), లస్సాలెయిజం (Lassalleanism), ఎకనామిజం (Economism), బ్లాంకిజం (Blanquism), అరాచకవాదం (Anarchism) వంటి రకరకాల శ్రామికవర్గేతర ధోరణులపై సైద్ధాంతిక పోరాటాలు చేసి, నేడు మనం పిలుస్తున్న ‘మార్క్సిజం’ గా నిలిచింది.
ఈ సైద్ధాంతిక పోరాటమంతటా ఎంగెల్స్ మార్క్స్ సరసన గట్టిగా నిలిచాడు.
ఇంటర్నేషనల్ రోజువారీ సంస్థాగత వ్యవహారాల్లో ఎంగెల్స్ జోక్యం తక్కువే అయినప్పటికీ, నిర్ణయాత్మక కాంగ్రెస్ (సమావేశం) లలో ఆయన పాత్ర చాలా కీలకం.
ఆయన గొప్ప వ్యూహాత్మక చతురతతో వ్యవహరించి ఇంటర్నేషనల్ సంస్థను మిఖాయిల్ బాకునిన్ అనుయాయులైన అరాచకవాదుల (Anarchists) చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించాడు.
వాస్తవానికి, ఎంగెల్స్ 1876లో ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయాన్ని విజయవంతంగా అమెరికాకు మార్చడం ద్వారా దానిని బాకునిన్ వాదుల నియంత్రణ నుండి కాపాడాడు.
అమెరికాకు మారిన తర్వాత సంస్థ నిష్క్రియాపరమైనప్పటికీ, ఆ వ్యూహాత్మక నిర్ణయం వల్ల సంస్థ తన మూల లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉన్న శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించగలిగాడు.
ఇంటర్నేషనల్ బలం ఎంతగా ఉందంటే — ఇంగ్లీష్ బూర్జువా వర్గానికి బలమైన కోరిక ఉన్నప్పటికీ, అమెరికన్ అంతర్యుద్ధ కాలంలో దక్షిణ రాష్ట్రాల తరఫున జోక్యం చేసుకోలేకపోయింది.
అలాగే, యూరప్ అంతటా ఉన్న బూర్జువా వర్గం ఇంటర్నేషనల్ ఆవిర్భావానికి ముందు సాధారణంగా ఇతర దేశాల నుంచి కార్మికులను తీసుకువచ్చి సమ్మెలను భగ్నం చేసే (Strike-breakers) కుట్రలను కూడా ఇది సమర్థవంతంగా అడ్డుకుంది.
ఫస్ట్ ఇంటర్నేషనల్ కాలంలోనే, ప్రపంచంలోనే మొదటి శ్రామికవర్గ రాజ్యం ‘పారిస్ కమ్యూన్’ (Paris Commune) 1871లో ఆవిర్భవించింది. పారిస్ కమ్యూన్‌ను ఎంగెల్స్ “ఫస్ట్ ఇంటర్నేషనల్ సంతానం” గా అభివర్ణించాడు. ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు పీటర్ వాట్కిన్స్ ఈ చారిత్రక ఘట్టం ఆధారంగా ‘లా కమ్యూన్’ (La Commune) అనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన చిత్రాన్ని నిర్మించాడు.
పారిస్ కమ్యూన్ ఓటమి తర్వాత, యూరప్ అంతటా మరొకసారి తీవ్ర అణచివేత కొనసాగింది. ఒక్క ఇంగ్లాండ్‌లో తప్ప, మిగిలిన యూరప్ ఖండమంతటా ఇంటర్నేషనల్ సంస్థను నిషేధించారు. దాదాపు ప్రతి యూరప్ దేశపు పోలీసులు ఇంటర్నేషనల్ సభ్యులను నిరంతరం వెంటాడారు. మరొకసారి, యూరప్ వ్యాప్తంగా ఉన్న విప్లవ కార్మికులు ఈ నిరంతర దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇంగ్లాండ్‌లో ఆశ్రయం పొందారు.
ఎంగెల్స్ ప్రవాసంలో ఉన్నవారికి వసతి, ఆహారం ఏర్పాటు చేయడానికి అలుపెరగకుండా శ్రమించాడు. అదే సమయంలో వారితో దృఢమైన రాజకీయ సంబంధాలను కొనసాగించాడు. ఎంగెల్స్ వ్యక్తిత్వంలోని ఈ లోతైన మానవీయ కోణానికి దక్కాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ, నాటి కఠినమైన తిరోగామీ పరిస్థితుల్లో ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం. శరణార్థి కార్మికులలో కొందరికి ఎంగెల్స్ జీవితాంతం ఆర్థిక సాయం అందించాడు — సరిగ్గా మార్క్స్ తన జీవితాంతం ఇతరులకు అండగా నిలిచినట్లే.
ఈ సమయంలోనే, ఎంగెల్స్‌కు తన తల్లి నుండి ఎంతో భావోద్వేగంతో కూడిన ఒక లేఖ వచ్చింది – “నువ్వు ఎప్పుడూ పరాయి వారి, బయటి వారి మాటలే వింటావు, కానీ నీ కన్న తల్లి మాట ఎన్నడూ వినవు. ఈ రోజుల్లో నా పరిస్థితి ఎలా ఉందో ఆ దేవుడికే తెలియాలి. నేను వార్తాపత్రిక చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ నా చేతులు వణుకుతాయి…ఎక్కడ నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ వచ్చిందనే వార్త చూస్తానో అని భయపడిపోతుంటాను.”ఈ లేఖ ఎంగెల్స్ స్వభావం, ఆయన విప్లవాత్మక అంకితభావం ఆయన కుటుంబంలో ఎలాంటి ఆందోళనను కలగాజేసిందో తెలియజేస్తుంది.
1863లో మేరీ బర్న్స్ మరణానంతరం, ఎంగెల్స్ ఆమె చెల్లెలు లిడియా బర్న్స్‌తో జీవితకాల అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. 1878లో లిడియా మరణించడానికి కొన్ని గంటల ముందు, ఆమె బలంగా కోరడం వల్ల ఎంగెల్స్ ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. లిడియా బర్న్స్ కన్నుమూసిన తర్వాత.. “నా భార్య ఒక నిజాయితీ గల ఐరిష్ శ్రామికుడి కుమార్తె. ఆమె హృదయస్పందన ఎప్పుడూ తాను జన్మించిన వర్గం కోసమే కొట్టుకునేది. నా దృష్టిలో చదువుకున్న, సున్నితమైన, ఆకర్షణీయమైన మధ్యతరగతి మహిళలందరి కంటే ఆమె అనంతానంత గౌరవానికి అర్హురాలు. కష్ట సమయాల్లో ఈ ఆలోచనే నాకు ఎల్లప్పుడూ ఓదార్పునిచ్చేది.” అంటూ ప్రముఖ జర్మన్ సోషలిస్ట్ ఆగస్ట్ బెబెల్ భార్యకు ఎంగెల్స్ రాశాడు.
మార్క్స్ చిన్న కుమార్తె ఎలినార్ మార్క్స్‌కు లిడియా బర్న్స్‌తో మంచి స్నేహం ఉండేది.ఎలినార్ మార్క్స్ లిడియా గురించి – “లిడియా చదువుకోలేదు. ఆమెకు చదవడం గానీ, రాయడం గానీ రాదు. కానీ ఆమె ఎంతో నిజాయితీ, సత్యసంధత కల మనిషి. ఆమె ఒక రుషితుల్య మహిళ ” అని రాసుకుంది.
ఎంగెల్స్ జీవిత చరిత్రను రాసిన పలువురు బూర్జువా రచయితలు మేరీ బర్న్స్ లేదా లిడియా బర్న్స్‌లను ఆయన సమానమైన భాగస్వాములుగా అంగీకరించ నిరాకరించారు. వారి అభిప్రాయం ప్రకారం, ఈ ఇద్దరు మహిళలు ఎంగెల్స్ ఇంట్లో పనిచేసే పనిమనుషులు మాత్రమే, అయితే ఇతరుల కంటే కాస్త మంచిగా చూసుకునేవాడని రాశారు. ఇలాంటి వ్యాఖ్యానాలు వారి బూర్జువా దృక్పథం నుంచే ఉత్పన్నమయ్యాయి. ఉన్నత మధ్యతరగతికి చెందిన ఒక విద్యావంతుడు, సంస్కారవంతుడైన మేధావి నిరక్షరాస్యురాలైన ఒక శ్రామికవర్గ మహిళను తన జీవిత భాగస్వామిగా ఎంచుకోవడాన్ని వారు అసలు అంగీకరించలేకపోయారు. ఎంగెల్స్ భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహించాడనే విషయాన్ని వారు అర్థం చేసుకోవడంలోనే విఫలమయ్యారు.
1883లో, తన ఆప్తమిత్రుడు, మేధావి కార్ల్ మార్క్స్ మరణంతో ఎంగెల్స్ మరొక కోలుకోలేని దెబ్బను తిన్నాడు. మార్క్స్ మరణంపై ఎంగెల్స్- “జీవించి ఉన్న అతి గొప్ప మేధావి ఆలోచించడం ఆపేశాడు ” అని అన్నాడు
లిడియా, ఆ తర్వాత మార్క్స్ మరణాలు ఎంగెల్స్‌ను లోలోపల తీవ్రంగా కలిచివేశాయి. అయినా ఆయన శ్రామికవర్గానికి చెందిన ఒక నిజమైన సైనికుడు. బాధ పడడానికి కూడా ఆయనకు సమయం లేదు. తిరిగివచ్చి వెంటనే పోరాటంలో ముందువరసలో నిలుచున్నాడు. మార్క్స్ వదిలివెళ్లిన అమూల్యమైన అసంపూర్ణ కార్యం ‘ కాపిటల్’ రెండవ, మూడవ సంపుటాలను పూర్తి చేయడమే. ఎంగెల్స్ కృషి, నిరంతర శ్రమ ఫలితంగా ఈ సంపుటాలు వరుసగా 1885 , 1894లలో ప్రచురితమయ్యాయి.
ఈలోగా జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఇంకా ఇతర దేశాలలో జాతీయ శ్రామికవర్గ రాజకీయ పార్టీలను స్థాపించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
జర్మన్ కార్మిక పార్టీ వ్యవస్థాపకులైన ఆగస్ట్ బెబెల్, విల్హెల్మ్ లీబ్‌క్నెట్ లతో సహా అందరూ ఎంగెల్స్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, క్రమం తప్పకుండా ఆయన సలహాలు, మార్గదర్శకత్వం తీసుకునేవారు. జర్మన్ కార్మిక పార్టీ ఆవిర్భావం నుంచే అవకాశంవాదంతో కుదేలవడం చరిత్రలోని విషాదాల్లో ఒకటి.
1875లో మార్క్స్ రాసిన ప్రసిద్ధ గ్రంథం ‘క్రిటిక్ ఆఫ్ ది గోథా ప్రోగ్రామ్’ జర్మనీ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ (SAPD) ప్రణాళికను విమర్శిస్తూ, దాని అవకాశంవాదంపై ఎక్కుపెట్టినదే. ఎంగెల్స్ 1878లో రాసిన తన అద్భుత రచన ‘ఆంటి-డ్యూరింగ్’ (Anti-Dühring) ద్వారా ఈ పోరాటాన్ని మరింత పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లారు.
మొదటిసారిగా, ఎంగెల్స్ సాధారణ పాఠకులకు కూడా అర్థమయ్యే రీతిలో మార్క్సిజాన్ని మూడు ప్రధాన అంగాలుగా సమగ్రంగా వివరించాడు – గతితార్కిక, చారిత్రక భౌతికవాదం (Dialectical and Historical Materialism),రాజకీయార్థ శాస్త్రం (Political Economy), శాస్త్రీయ సోషలిజం (Scientific Socialism).
ఆయన రాసిన ప్రసిద్ధ కరపత్రం ‘సోషలిజం: యుటోపియన్ అండ్ సైంటిఫిక్’ అనేది వాస్తవానికి ‘ఆంటి-డ్యూరింగ్’ పుస్తకంలోని ఒక భాగమే. 1889 జూలై 14న, ఫ్రెంచ్ విప్లవంలో బాస్టిల్లె కోటను కూల్చివేసిన శతాబ్ది ఉత్సవాల సందర్భంలో ప్యారిస్‌లో ‘సెకండ్ ఇంటర్నేషనల్’ను స్థాపించారు. అప్పటికి ఎంగెల్స్ వయోవృద్ధుడైనప్పటికీ, తన అమూల్యమైన భావజాల మార్గదర్శకత్వాన్ని, సలహాలను అందించడం ఎన్నడూ ఆపలేదు. అయితే, ఎంగెల్స్ సాధించిన అతి గొప్ప విజయం ఇంకా ముందుంది. ఆ మహత్తర సాధన 1884లో ఆయన రచించిన “కుటుంబం , సొంతాస్తి , రాజ్యాల పుట్టుక ” (The Origin of the Family, Private Property and the State) అనే గ్రంథం.
చరిత్రకారులు పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన రెండు పుస్తకాలు తమ తమ రంగాలలో ఆలోచనా విధానాన్ని మౌలికంగా మార్చివేసినవిగా చెప్పుకునేవి..
మొదటిది, చార్లెస్ డార్విన్ రాసిన “ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్”, రెండవది, కార్ల్ మార్క్స్ రాసిన “కాపిటల్”. అయితే, నా దృష్టిలో, పంతొమ్మిదో శతాబ్దపు మూడవ అత్యుత్తమ మేధో విజయం ఎంగెల్స్ రాసిన “ది ఆరిజిన్ ఆఫ్ ది ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ది స్టేట్”.
మార్క్స్ రాసిన ‘ కాపిటల్’ వేతన బానిసత్వానికి గల కారణాలను శాస్త్రీయంగా పరిశోధించి, దాన్ని నిర్మూలించగల అవకాశాన్ని ఏ విధంగా నిరూపించిందో… ఎంగెల్స్ రాసిన ఈ ప్రసిద్ధ గ్రంథం కూడా మహిళలపై అమలవుతున్న అణచివేత మూలాలను శోధించి, వారి విముక్తికి శాస్త్రీయ పునాదిని అందించింది.
స్వయంగా లెనిన్ ఈ గ్రంథాన్ని ఆధునిక సోషలిజం ప్రాథమిక ఆధార గ్రంథాలలో ఒకటిగా పరిగణించాడు. ఈ పుస్తకం మహిళలకు గుర్తింపును, గొంతును రెండిటినీ ఇచ్చింది.
ఎంగెల్స్ స్వయంగా దీని ప్రాముఖ్యతను ఇలా వివరించాడు-
“ఆదిమ సమాజ చరిత్రకు పితృస్వామ్య హక్కు కంటే ముందే మాతృస్వామ్య హక్కు ఉనికిలో ఉందనే ఆవిష్కరణ కు ఎంతటి ప్రాముఖ్యత ఉందో … జీవశాస్త్రానికి డార్విన్ పరిణామ సిద్ధాంతం, రాజకీయార్థ శాస్త్రానికి మార్క్స్ మిగులు విలువ సిద్ధాంతాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది.
ఎంగెల్స్‌కు ప్రకృతి విజ్ఞాన శాస్త్రాలపై లోతైన ఆసక్తి ఉండేది. మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరూ తమ కాలంలో విజ్ఞాన శాస్త్రంలోని ప్రతి రంగంలో వస్తున్న తాజా పరిణామాల గురించి సమగ్రంగా తెలుసుకునేవారు. ఆ జ్ఞాన పిపాసకు ఒక నిదర్శనం -1859 నవంబర్ 24న చార్లెస్ డార్విన్ రాసిన “ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్” ప్రచురితమై విడుదలైన రోజే ఆ పుస్తక కొనుగోలుకు క్యూలో నిలబడిన వ్యక్తి ఎంగెల్స్. కొద్ది రోజుల్లోనే ఎంగెల్స్ ఆ పుస్తకాన్ని చదివి, దానిపై విస్తృతంగా తన వ్యాఖ్యలు రాసి, ఆ పుస్తకాన్ని తన అభిప్రాయాలను మార్క్స్‌కు పంపాడు.
1872-73 కాలంలో ఎంగెల్స్ “డయలెక్టిక్స్ ఆఫ్ నేచర్” (Dialectics of Nature) అనే ఒక ముఖ్యమైన మేధో ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. గతితార్కిక (Dialectical) పద్ధతిని కేవలం సమాజం, చరిత్రకే కాకుండా ప్రకృతికి విస్తరించడమే ఆయన ఉద్దేశం. దురదృష్టవశాత్తు, ఈ బృహత్తర ప్రాజెక్ట్ అసంపూర్ణంగానే నిలిచిపోయింది.
దానికి ప్రధాన కారణం ఎంగెల్స్ తన ప్రియ మిత్రుడు, సహచరుడు కార్ల్ మార్క్స్ అసంపూర్ణంగా వదిలేసిన రచనలను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడమే. ‘కాపిటల్’ రెండవ, మూడవ సంపుటాలను ఎడిట్ చేసి, ప్రచురణకు సిద్ధం చేయడం కోసం ఆయన తన స్వంత రచనను పక్కన పెట్టాడు.
ఎంగెల్స్ మరణానంతరం ఆయన ‘డయలెక్టిక్స్ ఆఫ్ నేచర్’ కోసం సిద్ధం చేసిన నోట్స్ జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎడ్వర్డ్ బెర్న్‌స్టీన్ కు అందింది.. బెర్న్‌స్టీన్ ఆ రాతప్రతులను శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు చూపించాడు. ఆ రచనలో కొన్ని లోపాలు గుర్తించినప్పటికీ, అందులోని లోతైన మేధో విశ్లేషణలకు ఐన్‌స్టీన్ ఎంతో ముగ్ధుడయ్యాడు. దానిని ఉన్నది ఉన్నట్లుగానే ప్రచురించాలని సిఫార్సు చేశాడు. ఎట్టకేలకు ‘డయలెక్టిక్స్ ఆఫ్ నేచర్’ మొదటిసారిగా 1925లో సోవియట్ రష్యాలో ప్రచురితమైంది. ప్రసిద్ధ జీవశాస్త్రవేత్తలు రిచర్డ్ లెవిన్స్, రిచర్డ్ లెవోంటిన్ 1985 లో ప్రచురించిన తమ గ్రంథం “ది డయలెక్టికల్ బయాలజిస్ట్”ను ఫ్రెడరిక్ ఎంగెల్స్‌కు అంకితం చేస్తూ – ” అనేక సార్లు అంచనాలు తప్పినప్పటికీ… ఎక్కడైతే అత్యంత అవసరమో, అత్యంత కీలకమో అక్కడ ఖచ్చితమైన సత్యాన్ని ఆవిష్కరించిన ఫ్రెడరిక్ ఎంగెల్స్‌కు సమర్పణ.” అని రాసుకున్నారు. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు తమ శాస్త్రీయ పరిశోధనలు ‘డయలెక్టిక్స్ ఆఫ్ నేచర్’లో ఎంగెల్స్ ప్రతిపాదించిన సూత్రాల నుంచే ప్రారంభమయ్యాయని తెలిపారు. మరొక ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ జే గౌల్డ్, 1875లో ‘నేచురల్ హిస్టరీ’ పత్రికలో రాస్తూ — “కోతి మనిషిగా మారే పరిణామక్రమంలో శ్రమ పాత్ర ” అధ్యాయం ఆధునిక జీవశాస్త్రానికి ఎంతో కీలకమైనదని అన్నారు.
నేడు విజ్ఞాన శాస్త్రాల చుట్టూ ఒక రకమైన మేధో పొగమంచు కమ్ముకుంది. భౌతికశాస్త్రం రోజురోజుకు గణితానికి పరిమితమవుతుండగా, జీవశాస్త్రం , మనస్తత్వశాస్త్రాలు కేవలం జన్యువుల (Genes) కు పరిమితమయ్యాయి . ఈ గందరగోళాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, ‘డయలెక్టిక్స్ ఆఫ్ నేచర్’ గ్రంథం ఇవ్వాల్టికీ ఒక అనివార్యమైన, అమూల్యమైన రచనగా నిలుస్తోంది. వాస్తవానికి ఇవ్వాల్టి ఈ మేధో దుమారాన్ని ఛేదించాలంటే ఈ గ్రంథం నుంచే అధ్యయనం ప్రారంభించాలి.
అదేవిధంగా, సామాజిక శాస్త్రాలలో పోస్ట్ మోడర్నిజం గందరగోళ పొగమంచు అలుముకుంది . దీనికి ఎంగెల్స్ సూత్రీకరణ “వాదనల కంటే ముందే ఆచరణ ఉనికిలో ఉంది” గట్టి జవాబు.
వాస్తవం ఏమిటంటే ఎంగెల్స్ – మార్క్స్ ల విప్లవాత్మక ఆలోచనలతొ ప్రభావితం కాని శాస్త్ర విజ్ఞానాలు దాదాపు లేవు.
ఎంగెల్స్ డెబ్బైయవ జన్మదినం సందర్భంగా, మార్క్స్ కుమార్తె ఎలినార్ మార్క్స్ ఎంగెల్స్ ఎప్పుడూ వయసు మీద పడనట్లు కనిపిస్తాడని ఆప్యాయంగా అన్నది . “గత ఇరవై ఏళ్లుగా ఆయన రోజు రోజుకు మరింత యువకునిలా మారుతున్నారు.” అని అంది.
ఇది అభిమానంతో సరదాగా అన్న మాటే అయినప్పటికీ, ఇందులో ఒక శాశ్వత సత్యం దాగి ఉంది. ఎంగెల్స్ – మార్క్స్ ల ఆలోచనలు ఒక తరం నుంచి మరొక తరానికి మరింత యవ్వన తేజంతో, మరింత శక్తివంతంగా, మరింత ప్రాసంగికత సంతరించుకుంటునే ఉన్నాయి.
క్షీణిస్తున్న సామ్రాజ్యవాద, ఫాసిస్టు దశలో ఒక భావజాలం తర్వాత మరొక భావజాలం కుప్ప కూలిపోతున్న ఈ తరుణంలో మార్క్సిజం కాగడా ఒక ఆశాదీపమై మరింత దేదీప్య కాంతితో ప్రకాశిస్తూనే ఉంది.
అనువాదం – రాంకి




