వేదాంత బాక్సైట్ గని కోసం ఒడిశాలో ఆదివాసుల పేరుతో రోడ్డు

2026 మే 31

[ఎడిటర్ గమనిక: ఒడిశా ప్రభుత్వం తమ కోసమే నిర్మిస్తోందని చెప్తున్న ఒక రోడ్డుకు వ్యతిరేకంగా ఆదివాసులు, దళితులు నిరసనలు తెలుపుతున్న వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. కొంతమందిని అరెస్టు చేశారు; బెయిల్ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్‌ను శుభ్రం చేయమని కూడా కోర్టు ఆదేశమిచ్చింది. నిరసన తెలుపుతున్న వారు అభివృద్ధికి వ్యతిరేకమా? లేదా మిగతా భారతదేశానికి తెలియని విషయం ఏదైనా వారికి తెలుసా? ఈ సిరీస్ రెండవ భాగంలో, ఒడిశా ప్రభుత్వం ఆదివాసీ ప్రజల పేరుతో, వేదాంత సంస్థకు పర్యావరణ చట్టాల అమలును దాటవేయడానికి ఎలా సహాయపడిందో బహిర్గతం చేస్తున్నాం.]

గత నెల ఒడిశాలోని సిజిమాలి కొండపైన ఉద్రిక్తత నెలకొంది. భారీ పారామిలటరీ బలగాల మధ్య, మూడు కిలోమీటర్ల మేర అడవిని నరికివేయడానికి బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఈ కొండ రాష్ట్రంలోనే అతిపెద్ద బాక్సైట్ నిల్వలు ఉన్న ప్రాంతాలలో ఒకటిగా ఉంది. ప్రభుత్వం కొన్నేళ్లుగా ఈ నిల్వలపైన కన్నేసింది.

బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకుంది. మైనింగ్ దిగ్గజం ‘వేదాంత లిమిటెడ్’తో కలిసి పనిచేస్తూ, ఒకే మైనింగ్ ప్రాజెక్ట్‌‌ను రెండు వేర్వేరు ప్రాజెక్టులుగా విభజించింది, తద్వారా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిజిమాలికి సులభంగా అందుబాటులోకి వెళ్ళగలిగింది.

సిజిమాలి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన స్థానిక దళిత, ఆదివాసీ సముదాయాలు ఈ కొండను ‘తిజ్మాలి’ అని పిలుస్తాయి; ఎంతో పవిత్రమైనవిగా భావిస్తాయి. తమ దేవుడైన ‘తిజ్ రాజా’ నివాసంగా పూజిస్తాయి.

దక్షిణ ఒడిశాలోని బాక్సైట్ బెల్ట్ (నిల్వల ప్రాంతం) గురించి వచ్చిన రెండు కథనాలలో ఇది రెండవది. మొదటి భాగంలో, ఒడిశా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలా కుమ్మక్కై పనిచేసాయో, ఎలా వాస్తవాలను వక్రీకరించాయో, అలాగే ఎన్నో ఏళ్లుగా వేదాంత సంస్థకు ప్రయోజనాన్ని కలిగించే బాక్సైట్ బెల్ట్‌‌లోని వన్యప్రాణుల అభయారణ్యంలోని, ఏనుగుల కారిడార్‌లోని కొంత భాగాన్ని తొలగించి, బాక్సైట్ మైనింగ్‌ను ఎలా సాధ్యం చేశాయో ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ వెల్లడించింది. వేదాంత సంస్థ గత అనేక సంవత్సరాలుగా ఆసక్తి చూపుతున్న బాక్సైట్ మైనింగ్ కోసమే ఇదంతా జరిగింది.

బాక్సైట్ గనిని ఏర్పాటు చేయడానికి; అడవులను నరికివేయడానికి ఉన్న నియంత్రణ అడ్డంకులను ఒక మైనింగ్ సంస్థ త్వరగతిన దాటడానికి రాజ్యం ఎలా సహాయపడిందో ఈ రెండవ ఈ కథనం వివరిస్తుంది.

‘ది కలెక్టివ్’ సేకరించిన పత్రాల ప్రకారం, నియంత్రణ అనుమతి కోసం దాఖలు చేసిన పత్రాలలో వేదాంత సంస్థ స్వయంగా ఆ గనిని; దానికి వెళ్లే రహదారిని ఒకే సమీకృత ప్రాజెక్ట్‌‌గా వివరించింది. కానీ అటవీ అనుమతులను ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి, ఒడిశా రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ ఈ ప్రాజెక్ట్‌‌ను రెండుగా విభజించడంలో వేదాంతకు సహాయం చేసింది. తక్కువ నిఘా, తేలికపాటి నిబంధనలు ఉండేలా ఆ రహదారిని ఒక “స్వతంత్ర సరళ ప్రాజెక్ట్”గా మార్చి తన ఆధీనంలోకి తీసుకుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ వాదన వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని గమనించినప్పటికీ, దానికి ఆమోదాన్ని తెలిపింది. కొన్ని నెలల తర్వాత, బుల్డోజర్లు రంగంలోకి దిగాయి.

కొత్త ప్రణాళిక ప్రకారం, ఒడిశా ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ అయిన ‘ఒడిశా ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (ఐడిసిఓ), అసలు మైనింగ్ ప్రణాళికకు భిన్నంగా, ఈ రహదారి అటవీ అనుమతి కోసం ఒక ప్రత్యేక ప్రాజెక్ట్‌‌గా పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసింది. ఐదు గ్రామాలను అనుసంధానించే “విస్తృత ప్రయోజనం” కోసం దీనిని నిర్మిస్తున్నామని, ఇది గనియేతర ప్రాజెక్ట్ అని ఐడిసిఓ తర్వాత పేర్కొంది.

ఈ సమర్థనను ఎవరూ నమ్మలేదు. ఇందులో ఒక గ్రామంలో అసలు జనాభా లేరని తేలింది; మరొక గ్రామంలోని నివాసితులను త్వరలోనే ఖాళీ చేయించనున్నారు. అటవీ అనుమతుల గురించి చర్చిస్తున్నప్పుడు, మంత్రిత్వ శాఖ కూడా ఈ “విస్తృత ప్రయోజన” వివరణను అంగీకరించలేదు. అయినప్పటికీ, వేదాంత కంపెనీ గని ప్రాజెక్ట్‌‌కు లభించిన స్టేజ్-1 అటవీ అనుమతితో పాటే, ఈ చిన్న ‘ఐడిసిఓ రోడ్డు ప్రాజెక్ట్’కు కూడా మంత్రిత్వ శాఖ కొన్ని షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది.

మైనింగేతర ప్రాజెక్ట్‌‌గా వర్గీకరణ కావడటంతో ఐడిసిఓ రోడ్డు వేయడం కోసం వెంటనే అడవులను నరికివేయడం ప్రారంభించగలిగింది. చట్టపరంగా మైనింగ్ ప్రాజెక్టులకు నిరాకరించే ఒక వేగవంతమైన ప్రత్యేక హక్కు ఈ ప్రాజెక్ట్‌‌కు దక్కింది.

వేదాంత సంస్థ 2023లో సిజిమాలి మైనింగ్ లీజును దక్కించుకుంది. దీని ద్వారా దాదాపు 311 మిలియన్ మెట్రిక్ టన్నుల బాక్సైట్ ఖనిజాన్ని పొందే మార్గం సుగమమైంది. కానీ ఆ గని వైపు వెళ్లే రహదారి నిర్మాణం, అక్షరాలా ప్రతి అడుగులోనూ వివాదాస్పదంగానే మారింది.

వేదాంత తమ గ్రామసభలలో కంపెనీ తప్పుడు పద్ధతిలో సమ్మతి పత్రాలను సృష్టించిందని ఆరోపిస్తూ, స్థానిక గ్రామస్థులు వెంటనే 2023 డిసెంబర్‌లో ఒడిశా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ కోర్టు ఆ కేసును ముగించింది.

ఆ తర్వాత గత నెలలో ప్రభుత్వం అడవులను నరికివేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆగ్రహించిన గ్రామస్థులు నిరసనలు తెలిపారు. ఇందులో చాలా మందిని నిర్బంధించారు; ఇది హైకోర్టు ఇచ్చిన బెయిలు ఉత్తర్వుపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. నిర్బంధించిన గ్రామస్తులను స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణను శుభ్రం చేయాలని ఆ ఉత్తర్వులో బెయిల్ షరతుగా కోర్టు ఆదేశించింది.

అకస్మాత్తుగా మారిన ప్రణాళికలు

కార్లపట్ వన్యప్రాణుల అభయారణ్యానికి దక్షిణంగా సుమారు 13 కిలోమీటర్ల దూరంలో, అభయారణ్య పర్యావరణ సున్నిత ప్రాంతం (ఇకో-సెన్సిటివ్ జోన్ – ఇఎస్‌జెడ్) అంచున సిజిమాలి కొండ ఉంది. పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం, అభయారణ్యానికి చెందిన ఇఎస్‌జెడ్ పరిధిలో గనుల తవ్వకం చేయడాన్ని నిషేధించారు.

మైనింగ్ పరంగా ఎంతో కీలకమైన అనేక బాక్సైట్ బ్లాకులు ఈ ఇకో-సెన్సిటివ్ జోన్ పరిధిలోనే ఉన్నప్పటికీ, ఈ రక్షిత ప్రాంత తుది సరిహద్దులను (కోఆర్డినేట్స్) విడుదల చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. బాక్సైట్ నిల్వలను మైనింగ్ పరిధిలోకి తీసుకురావడానికి సరిహద్దులను ఎలా తిరిగి మార్చారో, అలాగే ఇకో-సెన్సిటివ్ జోన్‌కు కూడా మార్పులను ప్రతిపాదించేలా ఒడిశా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రేరేపించింది అనే అంశాలను మొదటి భాగంలో వివరించాం.

కనీసం 2012 నుండి, వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్ బాక్సైట్ నిల్వలను మైనింగ్ కోసం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు. పొరుగున ఉన్న కలహండి జిల్లాలోని లాంజిగఢ్‌లో దేశంలోనే అతిపెద్ద అల్యూమినా రిఫైనరీని వేదాంత సంస్థ నడుపుతోంది. ఇది కార్లాపట్, సిజిమాలి రెండింటినీ కలిగి ఉన్న బాక్సైట్ బెల్ట్‌‌కు దగ్గరగా ఉంది. ఈ రిఫైనరీకి ముడి ఖనిజాన్ని సరఫరా చేయడానికి ఈ బ్లాకులు వ్యూహాత్మకంగా అనుకూలమైన ప్రదేశంలో ఉన్నాయి.

2023 ఫిబ్రవరిలో సిజిమాలి మైనింగ్ లీజుకు సంబంధించి వేదాంత సంస్థను అధికారికంగా “అత్యధిక ప్రాధాన్యత కలిగిన వేలంపాటదారుగా” గా ప్రకటించారు.

అయితే, వేలంపాటను గెలుచుకున్నంత మాత్రాన వేదాంత సంస్థ వెంటనే మైనింగ్ ప్రారంభించవచ్చని కాదు. అడవులను నరికివేయడం ప్రారంభించడానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. ఇందుకోసం అనేక నియంత్రణ తనిఖీలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. మైనింగ్ సంస్థ తన కార్యకలాపాల వల్ల పర్యావరణంపైన కలిగే ప్రభావాలను మంత్రిత్వ శాఖకు, ప్రజలకు వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే పర్యావరణానికి జరిగే నష్టాన్ని తగ్గించడానికి, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి వివరణాత్మక ప్రతిపాదనలను ఇవ్వాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ ప్రాజెక్ట్‌‌కు అటవీ అనుమతులను మంజూరు చేస్తుంది.

ఈ అడ్డంకులను అధిగమించడానికి వేదాంత కంపెనీకి ప్రభుత్వం ఎలా సహాయపడిందో అర్థం చేసుకోవడానికి, అటవీ అనుమతులను ఎలా ఇస్తారో తెలుసుకోవడం ఉపయోగపడుతుంది. ఇది రెండు దశల్లో జరుగుతుంది. దరఖాస్తుదారు కఠినమైన పరిహార షరతులను పూర్తి చేసినప్పుడు షరతులతో కూడిన ‘స్టేజ్ 1 అనుమతి’ ఇవ్వబడుతుంది. తనిఖీ తర్వాత, మంత్రిత్వ శాఖ ‘స్టేజ్ 2 అనుమతి’ అనే సంపూర్ణ అనుమతిని ఇస్తుంది.

అటవీ సంరక్షణ నిబంధనల ప్రకారం, మైనింగ్ కోసం చెట్లను నరికే ప్రక్రియను మంత్రిత్వ శాఖ నుండి రెండు దశల అనుమతులు లభించిన తర్వాతనే ప్రారంభించాలి. అయితే, రోడ్ల వంటి మైనింగ్-యేతర ప్రాజెక్టుల విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేస్తే, కేవలం ‘షరతులతో కూడిన మొదటి దశ అనుమతి’తోనే చెట్లను నరకడానికి అనుమతి ఉంటుంది.

అయితే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కొత్త గని కోసం నిర్మించే ఏ ప్రాథమిక అనుసంధాన రహదారి అయినా, దానిని మైనింగ్ ప్రాజెక్టులో భాగంగానే పరిగణించాలి. దరఖాస్తుదారుడు చట్ట ప్రకారం రహదారి, గని అనుమతుల కోసం కలిపి, ఒకే ప్యాకేజీగా దరఖాస్తు చేసుకోవాలి.

ఇక్కడే వేదాంత ప్రణాళికలు ఒక మలుపు తిరిగాయి. 2023 సెప్టెంబర్‌లో బహిరంగపరిచిన ప్రారంభ ప్రణాళికలో, కొత్త గని, అనుసంధాన రహదారి – రెండింటికీ కలిపి అటవీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించింది.

కానీ 2024 జూన్‌లో, గని కోసం 700 హెక్టార్లకు పైగా అటవీ భూమిని మళ్లించడం కోసం వేదాంత కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పుడు, అనుసంధాన రహదారి అనుమతికి సంబంధించిన అభ్యర్థన అందులో లేదు.

ఏడు నెలల తర్వాత, 3.4 కిలోమీటర్ల రోడ్డు కోసం దాదాపు ఐదు హెక్టార్ల అటవీ భూమిని మళ్లించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐడిసిఓ మంత్రిత్వ శాఖకు ప్రత్యేకంగా ఒక దరఖాస్తును ఇచ్చింది.

2023 సెప్టెంబర్‌లో సమర్పించిన ముసాయిదా పర్యావరణ ప్రభావ అంచనా (ఇఐఎ) నివేదికలో, తమ ‘ప్రాజెక్ట్’ అనేది గని, దానికి వెళ్లే రహదారి – రెండింటినీ కలిపి ఉన్న ఒక సమీకృత ఉమ్మడి ప్రాజెక్ట్ అని వేదాంత సంస్థ మూడు వేర్వేరు సందర్భాలలో పేర్కొంది. ఆ రోడ్డు కోసం తామే భూమిని సేకరిస్తామని; దానిని నిర్మించే ప్రధాన బాధ్యత కూడా తమదేనని వేదాంత స్పష్టంగా తెలిపింది.

 ఆ ప్రతిపాదనలో, రాయగడ జిల్లా గుండా వెళ్లే ఆ రహదారి 7.5 కిలోమీటర్ల పొడవుతో ఉంది. ఇది మైనింగ్ ప్రాంతానికి వాయువ్య దిశ నుండి రాయగడ జిల్లా గుండా వెళ్తూ రాష్ట్ర రహదారి ఎస్.హెచ్-44కు అనుసంధానిస్తారు. బాక్సైట్ ఖనిజాన్ని రవాణా చేయడానికి ఇదే ప్రధాన మార్గంగా ఉంటుంది.

కానీ డిసెంబర్ 2025 నాటికి, వేదాంత సంస్థ తన తుది పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించే సమయానికి ఆ ప్రణాళికలు పూర్తిగా మారిపోయాయి. ఆ రోడ్డు పొడవు ఇప్పుడు 3.4 కిలోమీటర్లుగా మారింది, ఇది అంతకుముందు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల రహదారి కంటే మరింత దక్షిణం వైపు నుండి ప్రారంభమవుతుంది. ఈసారి, దీని అటవీ అనుమతి కోసం ఐడిసిఓ దరఖాస్తు చేయాల్సి ఉంది.

“మైనింగ్ ప్రాంతానికి వాయువ్య దిశ నుండి 3.4 కిలోమీటర్ల రోడ్డును వేదాంత కంపెనీ నిర్మిస్తుంది; దీన్ని ఎస్.హెచ్-44 రోడ్డుకి అనుసంధానిస్తారు. (ఈ రోడ్డు యాజమాన్యం ప్రజాపనుల శాఖ (పిడబ్ల్యూడి) ఆధీనంలో ఉంటుంది). దీని కోసం 4.911 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూమిని మళ్లించే ప్రతిపాదనను ఐడిసిఓ సమర్పించింది” అని ఆ నివేదికలో ఉన్నది.

ఈ ప్రతిపాదనను విడదీయడం ద్వారా, ఆ రోడ్డు నిర్మాణంతో తనకు ప్రత్యక్ష సంబంధం లేనట్లుగా చూపించుకునేలా వేదాంత సంస్థ ఒక వ్యూహాన్ని అమలు చేసింది. ఒకే ప్రక్రియను మూడు వేర్వేరు భాగాలుగా మార్చారు: రహదారి యాజమాన్యాన్ని ప్రజా పనుల శాఖ (పిడబ్ల్యూడి) తీసుకుంది; అటవీ అనుమతిని పొందడంలో ఒడిశా పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఐడిసిఒ) మధ్యవర్తిగా వ్యవహరించింది; గని సంస్థ అయిన వేదాంత, ఐడిసిఒ అనుమతితో రహదారిని నిర్మించే బాధ్యతను చేపట్టింది.

తుది పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక సమర్పించడానికి దాదాపు నాలుగు నెలల ముందే, కొత్త రోడ్డును నిర్మించడానికి వేదాంతకు ఐడిసిఒ ఇప్పటికే అనుమతి ఇచ్చేసింది. 2026 జనవరిలో, అడవిని నరకడానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి ఐడిసిఒ షరతులతో కూడిన అనుమతిని పొందింది. అదే నెలలో, ఐడిసిఒ తరపున పరిహార అటవీకరణ కోసం వేదాంత రూ. 1.6 కోట్లను రాష్ట్ర నిధులలో జమ చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి., అడవిని నరకడం ప్రారంభించడానికి భద్రతా బలగాలు, బుల్డోజర్లు ఏప్రిల్‌లో సిజిమాలి కొండలపైకి చేరుకున్నాయి.

ప్రజా ప్రయోజనార్థం

అటవీ పరిరక్షణ చట్టాల ప్రకారం, పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ అనుమతి వ్యవహారాలను భారతీయ అడవులకు సంరక్షకుడిగా వ్యవహరించే ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్‌ఎసి)  ముందు ఉంచవచ్చు.

ఈ రెండు ప్రాజెక్టులు ఒకదానికొకటి సంబంధం ఉన్నవి కావడంతో, వేదాంత, ఐడిసిఒల అటవీ అనుమతి అభ్యర్థనలను ఎఫ్‌ఎసి కలిసే పరిశీలించింది. ఎఫ్‌ఎసి చర్చలు ప్రారంభమైనప్పుడు, ఆ రెండింటిని కలిపి అంచనా వేయడానికి “సిజిమాలి బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుతో కలిపి యాక్సెస్ రోడ్డును కూడా” పరిగణనలోకి తీసుకోవాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క సైట్ పరిశీలన నివేదిక సిఫార్సు చేసింది.

జూలై 2025 నుండి జనవరి 2026 వరకు జరిగిన సిజిమాలికి సంబంధించిన ఈ ఎఫ్‌ఎసి సమావేశాల వివరాలను ‘ది కలెక్టివ్’ సమీక్షించింది.

వేదాంత, ఐడిసిఒల అటవీ అనుమతి అభ్యర్థనలు పరస్పరం సంబంధం ఉన్న ప్రాజెక్టులకు సంబంధించినవి కావడంతో, ఎఫ్‌ఎసి వాటిని కలిపి పరిశీలించింది. ఎఫ్‌ఎసి చర్చలు ప్రారంభమైనప్పుడు, ఈ రెండు ప్రాజెక్టులను సమగ్రంగా అంచనా వేసేందుకు “సిజిమాలి బాక్సైట్ గని ప్రాజెక్టుతో పాటు అనుసంధాన రహదారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని”  పర్యావరణ మంత్రిత్వ శాఖ సమర్పించిన క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక సిఫార్సు చేసింది.

2025 జూలై నుండి 2026 జనవరి వరకు సిజిమాలికి సంబంధించి జరిగిన ఎఫ్‌ఎసి సమావేశాల వివరాలను ఆ బృందం సమీక్షించింది.

అటవీ పరిరక్షణ నిబంధనల ప్రకారం, ఐడిసిఒ నిర్మించే రోడ్డును వేదాంత సంస్థ మైనింగ్ ప్రాజెక్టులో భాగంగానే పరిగణించాల్సి ఉంటుంది కాబట్టి 2025 జూలై30 జరిగిన మొదటి సమావేశంలో ఒడిశా ప్రభుత్వం తన ప్రతిపాదనను పునఃసమీక్షించాలని  ఒడిశా ప్రభుత్వానికి ఎఫ్‌ఎసి విజ్ఞప్తి చేసింది.

దీనికి ప్రతిస్పందనగా, ప్రజలకు మౌలిక సదుపాయాలను  కల్పించే బాధ్యత కలిగిన ‘పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్’ తరపున ఐడిసిఒ ఈ భూమిని సేకరించిందని రాయగడ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కమిటీకి వివరించారు. ఈ రహదారి కేవలం మైనింగ్ అవసరాల కోసమే కాకుండా, విస్తృత ప్రయోజనాల కోసం ఉద్దేశించబడిందని ఆయన వాదించారు. రహదారి యాజమాన్యం పిడబ్ల్యూడి చేతిలో ఉండటంతో, ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేపట్టిన ప్రాజెక్ట్ అని ఒడిశా ప్రభుత్వం తన వాదనను వినిపించింది.

“ఈ పిడబ్ల్యూడి రోడ్డు నిర్మాణం వల్ల ప్రస్తుతం లోయకు, ప్రధాన భూభాగానికి ఎలాంటి రోడ్డు మార్గం లేని ఐదు మారుమూల గ్రామాలైన – డుమెర్‌పదర్, పోర్లాంగ్, సాగబారి, బిచాపింద, మాలిపదర్‌లకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుంది. దాదాపు 1,500 మంది జనాభా ఉన్న ఈ గ్రామాలు, రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల ముఖ్యంగా వైద్యం, మార్కెట్లు, అవసరమైన ఇతర సేవలను పొందడంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి” అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వివరించారు.

స్థానిక కార్యకర్తల సహాయంతో ‘ది కలెక్టివ్’ ఆ ఐదు గ్రామాలను గుర్తించింది. అయితే వాటిలో ఏ ఒక్క గ్రామం కూడా ఈ రోడ్డుకు సమీపంలో లేదు.

ఆ గ్రామాలలో ఒకటైన ‘మాలిపదర్’ గ్రామం, వేదాంత మైనింగ్ చేయబోయే సిజిమాలి మైనింగ్ బ్లాక్ పరిధిలోకి వస్తుంది. అందువల్ల, మైనింగ్ ప్రారంభమైన తర్వాత గ్రామస్తులను ఖాళీ చేయిస్తారు కాబట్టి, త్వరలోనే ఈ గ్రామం ఉనికిలో లేకుండా పోతుంది.

మిగిలిన నాలుగు గ్రామాలైన పోర్లాంగ్, బిచాపింద, సాగబారి, డుమెర్‌పదర్… ఐడిసిఒ ప్రతిపాదించిన రోడ్డు కంటే రాష్ట్ర హై వేకి చాలా దగ్గరగా ఉన్నాయి. వాటిలో సాగబారి, డుమెర్‌పదర్ అనే రెండు గ్రామాలకు నేరుగా రాష్ట్ర రహదారి 44కు కనెక్ట్ అయ్యే పక్కా రోడ్లు ఉన్నాయి; అలాగే పోర్లాంగ్ గ్రామం హైవే నుండి నడిచే దూరంలో ఉంది. ఇక స్థానిక కార్యకర్తల ప్రకారం, 2011 జనాభా లెక్కల నాటికే ‘బిచాపింద’ గ్రామంలో జనాభా ఎవరూ లేరు. ‘ది కలెక్టివ్’ వారి ప్రస్తుత స్థితిని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.

“రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు” ఎదుర్కొంటున్న గ్రామస్తులకు ఈ రోడ్డు సహాయపడుతుందనే ప్రభుత్వ వాదన నిలబడదు.

పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా దీనిపై పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఎఫ్‌ఎసి సమావేశాల సమయంలో, ప్రతిపాదిత రహదారిలో ఉన్న భారీ వెడల్పును మంత్రిత్వ శాఖ ఎత్తిచూపింది. “ప్రతిపాదిత రోడ్డు లెక్కలు (వెడల్పు) చూస్తుంటే, ఇది ప్రాథమికంగా భారీ వాహనాల రాకపోకలను తట్టుకునేలా రూపొందించినట్లు స్పష్టమవుతోంది” అని పేర్కొంది. ఇది కేవలం ఖనిజాల రవాణా కోసమే చేస్తున్నారని వారు నిర్ధారించారు; అందువల్ల షరతులతో కూడిన ప్రాథమిక అనుమతి ఇవ్వాలన్నా కూడా, వేదాంత మైనింగ్ ప్రతిపాదనకు షరతులతో కూడిన లేదా ‘స్టేజ్ 1’ అనుమతి లభించిన తర్వాతే ఐడిసిఒ ప్రతిపాదనను ఆమోదించాలని స్పష్టం చేశారు.

2025 డిసెంబర్ 31న, వేదాంత మైనింగ్ ప్రాజెక్టుకు స్టేజ్ 1 అటవీ అనుమతి లభించింది. అధికారిక ధృవీకరణ త్వరలోనే వస్తుందని ఊహిస్తూ, తనకు మైనింగ్ కోసం షరతులతో కూడిన అనుమతి లభించిందని వేదాంత డిసెంబర్ 12నే ఐడిసిఒకు లేఖ రాసింది. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి “తమ వంతుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని” వేదాంత ఐడిసిఒను ఆ లేఖలో కోరింది. ఆ తర్వాత, 2026 జనవరి 5న ఐడిసిఒ రోడ్డు ప్రాజెక్టుకు స్టేజ్ 1 అనుమతి లభించింది.

రోడ్డుకు సంబంధించిన షరతులతో కూడిన అనుమతి చేతికి రావడంతో, రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఫిబ్రవరి 27న డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వర్కింగ్ పర్మిషన్ (పని చేయడానికి అనుమతి) ఇచ్చారు. అదే కార్యాలయం మార్చి 26న చెట్లను నరకడానికి కూడా అనుమతి జారీ చేసింది.

మేము వేదాంత, రాయగడ జిల్లా అటవీశాఖాధికారి, ఐడిసిఒ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలకు వివరణాత్మక ప్రశ్నలను పంపాము – అయితే ఈ కథనం ప్రచురితమయ్యే సమయానికి వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

సిజిమాలిలో ఏం జరిగింది

గని, రోడ్డు – రెండింటికీ స్టేజ్ 1 అనుమతులు లభించిన వెంటనే, రోడ్డు నిర్మాణం ఖాయం కావడంతో సిజిమాలిలో హింస చెలరేగింది.

మార్చి ప్రారంభం నాటికి, గనికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నాయని స్థానిక పోలీసులు నివేదించారు. మార్చి 8న, పెద్ద సంఖ్యలో మహిళలు సాంప్రదాయ ఆయుధాలతో మైనింగ్ సైట్ వైపు దూసుకెళ్లారని, “మేము పోలీసుల దౌర్జన్యాలను సహించబోము, ఒకవేళ వారు అలా చేస్తే, మేము తిరగబడతాము” అని నినాదాలు చేశారని పోలీసులు పేర్కొన్నారు.

కొన్ని రోజుల తర్వాత, కాశీపూర్ స్థానిక పోలీసులు ఇద్దరు కార్యకర్తలు “స్థానిక యంత్రాంగాన్ని స్తంభింపజేయడానికి” జైల్ భరో ఉద్యమంతో మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవడానికి వ్యూహాలను చర్చిస్తున్నట్లు రిపోర్టు చేసారు.

ఏప్రిల్ 3న, స్థానిక పోలీసులు, ఒడిశా స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్,  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సభ్యులతో సహా 150 మంది సిబ్బంది గ్రామాలకు వచ్చి, అప్రోచ్ రోడ్డు నిర్మాణం తక్షణమే ప్రారంభమవుతుందని ప్రకటించారని స్థానికులు చెబుతున్నారు.

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – 2023 లోని సెక్షన్ 163 ప్రకారం ఒక నెల పాటు నిషేధాజ్ఞలు విధించారు; దీనివల్ల రోడ్డు వెంబడి 100 మీటర్ల కర్ఫ్యూ జోన్ ఏర్పడింది. ఈ కాలంలో వేదాంత అధికారులు, అధీకృత కాంట్రాక్టర్లు, కార్మికులు, ప్రభుత్వ అధికారులు తప్ప మరెవరినీ ఈ పరిమిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు.

ఈ జోన్‌లో సమావేశాలు, నిరసనలను కూడా నిషేధించారు.

ఏప్రిల్ 6 రాత్రి, ఈ ప్రాంతం ఒక ఘర్షణ ప్రాంతంగా మారింది. నివేదికల ప్రకారం, సాయుధ పోలీసు బలగాలు కాంతమాల్ గ్రామాన్ని ముట్టడించి, విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఇళ్ళతలుపులు బద్దలు కొట్టి, లాఠీఛార్జ్ చేశాయి, అలాగే టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులపైన కాల్పులు జరిపాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో స్థానిక, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. 23 మందికి పైగా గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు, పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. అప్పటి నుండి రోడ్డు నిర్మాణ పనులు ఆపేసారు.

2026 మే 5నాడు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఐడిసిఒ రోడ్డుకు తుది ‘స్టేజ్ 2’ అనుమతిని మంజూరు చేసింది. ఇంతలో, మే 27న, వేదాంత సిజిమాలి బాక్సైట్ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక మైనింగ్ లీజు, పర్యావరణ అనుమతి  కొరకు ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ సిఫార్సును పొందడంతో మరొక కీలకమైన నియంత్రణ అడ్డంకిని అధిగమించింది. ఇది 700 హెక్టార్ల కంటే ఎక్కువ అటవీ భూమిని మళ్లించాలనే వేదాంత ప్రతిపాదనను వాస్తవానికి మరింత దగ్గర చేసింది.

పెద్ద సిజిమాలి మైనింగ్ ప్రాజెక్ట్ నుండి రోడ్డు ప్రాజెక్ట్‌ను వేరు చేయడం గురించిన అంశాన్ని  2026 ఫిబ్రవరి 27న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ఉంచారు. ఈ విషయమై ఇప్పటివరకు నాలుగు విచారణలు జరిగాయి. ఈ కేసుపై ఎన్‌జిటి ఇంకా తన తీర్పును ఇవ్వాల్సి ఉంది.

2026 మే 31

తెలుగు: పద్మ కొండిపర్తి

https://www.reporters-collective.in/trc/odishas-road-for-vedantas-bauxite-mine

Leave a Reply