18 నెలల క్రితం అదానీ గ్రూప్ ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మరోసారి ‘సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా’ అంటూ ‘ఎక్స్’లో ఆగష్టు 10న పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్స్, షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్  ఫండ్స్ లో, బెర్ముడా (బ్రిటిష్), సింగపూర్లో లో గౌతమి ఆదానీ అన్న వినోద్ అదానీ నెలకొల్పిన కంపెనీలో ‘సెబి చైర్ పర్సన్’ మాధవి పూరి బుచ్’ తో పాటు ఆమె భర్త ‘ధవళ్ బుచ్’ రహస్య వాటాలు కలిగి ఉన్నారని హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అందుకే అదానీ వ్యాపార లొసుగులు, చట్టవ్యతిరేక లావాదేవీలు వెలుగు చూడటం లేదని హిండెన్ బర్గ్  ఆగష్టు 11న తన వెబ్సైట్ లో  తీవ్రంగా ఆరోపించింది. అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సిన సెబీ చైర్ పర్సన్ కు  వాటిల్లో వ్యక్తిగత పెట్టుబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయని.. ఇది విరుద్ద ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. అందువల్ల అదానీ అక్రమాలు, అరాచకాలు, నేరాలు విచారణలో వెలుగులోకి రాకపోవడానికి మూలం సెబీలో ఉందా అని ప్రశ్నించింది.

ఆర్థిక వ్యవస్థలో అక్రమ లావాదేవీలు, స్టాక్ మార్కెట్ వ్యాపారాన్ని తారుమారు చేసే, అక్రమాలతో నింపే అవకాశం ఉందని, అందువల్ల ఆ లావాదేవీలను, అక్రమాలను నియంత్రించడానికి అడ్డుకోవడానికి, ఆంక్షలు విధించడానికి స్వతంత్ర సంస్థ అవసరమనే ప్రభుత్వ భావనతో 30 జనవరి 1992న స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా సెబీ అవతరించింది. సెబీ చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించడంతో చట్టబద్ధమైన అధికారాలు పొందింది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని బాంద్రా కణ్ణా కాంప్లెక్స్ లో ఉంది. అలాగే న్యూఢిల్లీ, కలకత్తా, చెన్నై, అహ్మదాబాద్లలో ఉత్తర, తూర్పు, దక్షిణ, పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాలను కలిగి ఉంది. సెబీ ఏర్పడక ముందు ఏప్రిల్ 12, 1988లో సెక్యూరిటీల మార్కెట్ ను  నియంత్రించడానికి చట్టబద్దత లేని సంస్థగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనేది భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిపాలన డోమైన్ కింద ఉండేది. ఇది సెక్యూరిటీలు, కమోడిటి మార్కెట్ నియంత్రణ సంస్థగా ఏర్పడింది. ఇది ఉనికిలోకి రాకముందు, క్యాపిటల్ ఇష్యూస్ కంట్రోలర్ మార్కెట్ నియంత్రణ అధికారం, క్యాపిటల్ ఇష్యూస్ (నియంత్రణ) చట్టం, 1947 నుండి అధికారాన్ని పొందింది. సెబీ భారతదేశ నియంత్రణ సంస్థ. ఇది పారదర్శకత, జవాబుదారీ తనంతో స్టాక్ ఎక్స్ఛేంజీలు, బ్రోకర్లు, లిస్టెడ్ కంపెనీలు, ఇతర భాగస్వాముల పనితీరును పర్యవేక్షిస్తుంది. నియంత్రిస్తుంది.

దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆగష్టు 11న హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ ఆమె భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నుండి వచ్చిన తాజా నివేదిక, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టును ఒక ఆశాజనక ఆస్తిగా ప్రమోట్ చేయడం పై సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ సంబంధాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. భారతదేశంలోని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఆర్ఐటి) సెక్టార్ లో  ప్రధాన సూత్రధారి బ్లాక్ స్టోన్  ఇంక్ లో ఆమె భర్త ధవళ్ బుచ్ పాత్రతో మాధవి బుచ్ పాత్ర ముడిపడి ఉంది అని నివేదిక ప్రశ్నించింది. అదానీ గ్రూప్ ఆఫ్ షోర్  ఫండ్స్ లో  మాధవి, ఆమె భర్త ధవళ్ బుచ్ ప్రమేయం ఉందని నివేదిక పేర్కొంది. ఈ అస్పష్టమైన ఆర్థిక వ్యవస్థలను “మనీ స్వాహా కుంభకోణం” తో పోల్చవచ్చని హిండెన్ బర్గ్ నివేదిక పేర్కొంది.

మాధవి బుచ్ 2017లో సెబీ హోల్ టైం సభ్యురాలిగా చేరినప్పటి నుంచి రెగ్యులేటరీ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఓ కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఆదాయాలను ఆర్జిస్తున్నట్టు వెల్లడయ్యింది. సెబీలో డైరెక్టర్లు, చైర్మన్ గా  ఎంపికయ్యేవారు తాము సొంతగా ఎలాంటి కన్సల్టెన్సీలు కలిగి ఉండరాదు. దీనికి భిన్నంగా 2022 లో సెబీ చైర్ పర్సన్ గా  నియమితులైన తర్వాత కూడా మాధవి పూరి బుచ్ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి ఆదాయాలను పొందుతున్నారని పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆధారంగా రాయిటర్స్ ఓ రిపోర్ట్ ను  వెల్లడించింది. సెబీ చైర్ పర్సన్ గా కొనసాగుతూనే మాధవి కన్సల్టింగ్ సంస్థలను నడుపుతున్నారని… ఈ నిజాలను నిగ్గు తేల్చాలని హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ తరుణంలో రాయిటర్స్ తాజా రిపోర్ట్ హిండెన్ బర్గ్ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది.

 సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న విద్యుత్త్ ఉత్పత్తికి సంబంధించిన లాజిస్టిక్స్ సరఫరా చేసే అగోరా పార్టనర్స్, భారత్ కేంద్రంగా పనిచేస్తున్న అగోరా అడ్వైజరీ లిమిటెడ్ ఇండియా సంస్థలను మాధవి పూరి బుచ్ దంపతులు నిర్వహిస్తున్నారని హిండెన్ బర్గ్ ఆరోపించింది. రాయిటర్స్ ప్రకారం… గడిచిన ఏడేండ్ల కాలంలో అగోరా అడ్వైజరీ సంస్థలో 99 శాతం వాటాలు బుచ్ దంపతులవే. దీని ద్వారా రూ.3.71 కోట్ల ఆదాయం సంపాదించారని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల వద్ద నమోదైన సమాచారం వెల్లడిస్తుంది. సెబీ పూర్తికాల సభ్యులుగా నియమితులైన తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రొఫిట్ గానీ, వేతనం గానీ, ఇతర వృత్తి నైపుణ్య కార్యక్రమాల ద్వారా ప్రొఫెషనల్ ఫీజులు పొందడం 2008 సెబీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. సెబీ చైర్మన్ ఇతర ఆదాయాలు ఆర్జించడంపైనిషేధం ఉంది. సింగపూర్ కంపెనీ రికార్డులను పరిశీలిస్తే మాధవి బుచ్ మార్చి 2022లో అగోరా పార్టనర్స్ లోని తన షేర్లన్నింటినీ తన భర్తకు బదిలీ చేసినట్లు హిండెన్బర్గ్ పేర్కొంది. అయితే 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ రికార్డుల ప్రకారం… మాధవి ఇప్పటికీ భారతీయ కన్సల్టింగ్ సంస్థలో వాటాలను కలిగి ఉన్నారు. ఈ ఆదాయాలకు అదానీ గ్రూప్తో ఏదైనా సంబంధం ఉందో… లేదో తేలాల్సి ఉందని హిండెన్ బర్గ్ పేర్కొంది.

హిండెన్ బర్గ్ ఆగష్టు 11న తన బ్లాగ్ పోస్ట్లో, మారిషన్- రిజిస్టర్డ్ ఫండ్ అయిన ఐపిఇ ప్లస్ ఫండ్ 1, బెర్ముడా (బ్రిటిష్) ఆధారిత ఫండ్ అయిన గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్ లో  మాధవి పూరి బుచ్, ఆమె భర్త ధవళ్ బుచ్ పెట్టుబడి పెట్టారని ఆరోపించింది. గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ నియంత్రణలో ఉన్న కంపెనీ గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్ లో  పెట్టుబడి పెట్టిందని, ఆ పెట్టుబడిని గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ తిరిగి ఐపిఇ ప్లస్ ఫండ్ 1లో పెట్టుబడి పెట్టిందని, దీని వ్యవస్థాపకుడు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అనిల్ అహుజా అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ గా  పనిచేశారు. ఆదానీ గ్రూప్ వివిధ నిబంధనల ఉల్లంఘనకు, షేర్ల రేట్ల విషయంలో మాయాజాలానికి పాల్పడిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఆ నియంత్రణ సంస్థకి మాధవి బాధ్యత వహిస్తున్నారు. బుచ్ పదవీకాలంలో సెబీ బోర్డు సభ్యుడుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ మాజీ కీలక అధికారి సుభాష్ చంద్ర గార్గ్ సెబీ చీఫ్ మాధవి చర్యలను తీవ్రంగా విమర్శించారు. మాధవి వ్యాపార కార్యకలాపాలను చాలా తీవ్రమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. సెబీ బోర్డులో చేరిన తర్వాత ఆమె బయటి సంస్థను కొనసాగించడానికి ఎటువంటి సమర్ధన లేదు. విషయం బయటికి వచ్చిన తర్వాత ఆమెను కొనసాగించడాన్ని అనుమతించకూడదని అన్నారు. ఆమె తన వ్యాపార ప్రయోజనాలను బోర్డుకు తెలుపలేదన్నారు. కాగా… రాయిటర్స్ రిపోర్ట్ పై  సెబీ గాని, బుచ్ కుటుంబం కానీ ఇంతవరకూ స్పందించలేదు.

 హిండెన్ బర్గ్ విడుదల చేసిన తాజా నివేదిక సెబీ ప్రధాన అధికారి మాధవి పూరి బుచ్ పాత్ర గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. హిండెన్ బర్గ్ నివేదిక స్టాక్ ఎక్సేంజ్ మార్కెట్లో తుపాన్ రేపింది. అదానీ గ్రూపు కంపెనీల పునాదులను కదిలించింది. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణ ప్రభావం ఇన్వెస్టర్ల పైన ప్రభావం చూపింది. స్టాక్స్ లో  ఇన్వెస్టర్లు రూ.87 వేల కోట్ల రూపాయలు కోల్పోయారు. కనుక మాధవి పూరి బుచ్ ని  సెబీ బాధ్యతల నుంచి తొలగించాలి. సెబీ విశ్వసనీయత పైన ప్రభావం చూపుతుంది కనుక తక్షణం విచారణ జరుపాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇది విదేశీ కుట్ర అని చేతులు దులిపేసుకోవడం అంటే అవినీతి, అక్రమాలను పరోక్షంగా సమర్థించడం తప్ప మరోటి కాదు. వాస్తవాలను నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచాల్సిన నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది.

హిండెన్ బర్గ్ మొదటి రిపోర్టు వచ్చి 2024 జనవరి 24 నాటికి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సరం జనవరి 24న స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి అదానీ గ్రూప్ విలువ రూ.14.5 లక్షల కోట్లుగా ఉంది. ఈసారి విడుదలైన రెండవ రిపోర్టులో అదానీ గ్రూపు వెనుక స్టాక్ మార్కెట్ అధిపతులే కీలక పాత్ర వహించడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. అదానీ, ఆదానీ బంధువులకు, సెబీ డైరెక్టర్ మాధవి బుచ్, ఆమె భర్త ధవళ్ బుచ్ తో సంబంధం కలిగి ఉన్న సింగపూర్, భారతీయ సంస్థల ఉనికిని కూడా నివేదిక ప్రశ్నిస్తుంది. ఇటీవలి సెబీ నిబంధనల నుండి లబ్ది పొందిన గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్లోస్టోన్ తో  ధవళ్ బుచ్ ప్రమేయం ఉంది. ప్రాథమిక వాస్తవాలన్నీ రుజువైనప్పుడు హిండెన్ బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలను బుచ్ కుటుంబం, సెబీ ‘ద్వేషపూరితమైనవని కొట్టిపారేయడం సరిపోదు. వాస్తవానికి, సెబీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ను పునఃసమీక్షించాలి. సెబీ దర్యాప్తు చేసిన ఇరవై రెండు కేసులను సుప్రీంకోర్టు తిరిగి తెరవాలి. ఎస్సీ మొత్తం విచారణలో సెబీని అంతిమ అధికారంగా పరిగణించింది, అయినప్పటికీ ఎస్సీ మంజూరు చేసిన కాలపరిమితి దాటిన విచారణ అసంపూర్తిగా ఉంది.

అదానీ గ్రూపు చట్ట ఉల్లంఘనల పట్ల తగు విధంగా వ్యవహరించడంలో సెబీ వైఫల్యం ఉందేమో దర్యాప్తు చేయడానికి 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో నిపుణుల బృందాన్ని నియమించింది. అంతేకాక ప్రభుత్వ రంగ సంస్థల తరపున ఉన్న వాటాలకు సంబంధించిన వ్యవహారాలలో ఏమైనా ఉల్లంఘనలు జరిగాయేమో నిర్దిష్టంగా విచారించాలని ఆదేశించింది. అదానీ కంపెనీలకు సంబంధిత పక్షాలు నడిపిన లావాదేవీల సమాచారం వెల్లడించడంలో సెబీ వైఫల్యాలు, షేర్ల రేట్లలో కుంభకోణాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలని ఆదేశించింది. ఈ ఉల్లంఘనల పైన, అదానీ కంపెనీకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పైన జరిపిన సెబీ దర్యాప్తులో ఏ తప్పు కనుగొనలేకపోయిందని 2023 మే లో కోర్టుకు నిపుణుల కమిటీ తెలియజేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే అదానీ గ్రూపునకు సంబంధించిన వివిధ ఉల్లంఘనల ఆరోపణలపై సెబీ అంతకన్నా ముందే దర్యాప్తు జరుపుతున్నది. ఈ విషయంలో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు నిరూపించడంలో విఫలం కావడం బట్టి చూస్తే సెబీ వైఫల్యం అనుమానాస్పదమని, ప్రశ్నార్థకమని హిండెన్ బర్గ్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. బుచ్ స్వయానా వినోద్ అదానీకి సంబంధించిన విదేశీ సంస్థలో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం అవుతుంది.

అదానీ గ్రుపుపై వచ్చిన 24 ఆరోపణలలో 22 విషయాలను దర్యాప్తు ముగించినట్లు మాత్రమే సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. మిగిలిన వాటి దర్యాప్తును మరో రెండు మూడు నెలల్లో ముగించనున్నట్టు తెలియజేసింది. అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరికినట్టు చెప్పనేలేదు. చైర్ పర్సన్ గా  బుచ్ ఆ కంపెనీలపై దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే రెండుసార్లు అదానీతో సమావేశమైన విషయాన్ని కూడా వెల్లడించలేదు. దీన్ని బట్టి చూస్తే ఆమెపై వచ్చిన తీవ్ర ఆరోపణలకు

ప్రాధాన్యత లభిస్తున్నది. సెబీ చీఫ్ వ్యక్తిగత అంతఃకరణ, అలాగే ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ అధిపతి నుంచి ఆశించే ఉన్నత స్థాయి ప్రమాణాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ రెండు కోణాలరీత్యా మాధవి బుచ్ తన స్థానం నుంచి తక్షణం తప్పుకోవాల్సి ఉంటుంది. అదానీ అక్రమాలతో పాటు మాధవి పూరి బుచ్ అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరుగాల్సి ఉంది.  

అదానీతో మాధవి పూరి బుచ్ 2022లో తరచుగా సమావేశమవ్వడం ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ గందరగోళం నేపథ్యంలో సెబీ చైర్ పర్సన్ మరియు ఆమె భర్త ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఒక సాధారణ విషయం దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి అదే ఫండ్స్ పెట్టుబడి పెట్టిన చైర్పర్సన్, ఫండ్ ఇతర యజమానులను కనుగొనే విశ్వసనీయ బాధ్యతను అప్పగించిన ప్రముఖ సంస్థ, సుప్రీంకోర్ట్ దాని 6 మంది సభ్యుల కమిటీని అపహాస్యం చేసేదిగా ఉంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ద్వారా ఆదానీ గ్రూప్ ఇన్సైడర్ ట్రేడింగ్, ఇతర స్టాక్ మార్కెట్ ఉల్లంఘనలపై కొనసాగుతున్న దర్యాప్తును రుజువు చేసేందుకు న్యూయార్కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ కొత్త పత్రాలను ఆగష్టు 11న విడుదల చేసింది, హిండెన్ బర్గ్ తన తాజా విడతలో, అదానికి సహాయం చేసిన ప్రయోజనాల సంఘర్షణను ఆరోపించడానికి అంతగా తెలియని ఆఫ్ షోర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ద్వారా ఆదానీ గ్రూప్- సంబంధిత సంస్థలలో సెబీ చైర్మన్ మాధవి పూరి బుచ్, ఆమె భర్త ధవళ్ బుచ్ కలిగి ఉన్న ఇ మెయిల్ లు  అందరికి అందుబాటులో ఉన్న వాటాల రికార్డులను చేర్చింది. మాధవి బుచ్ అదానీ గ్రూప్ పట్ల పక్షపాతంతో ఉందని ఆరోపించారు. భారత క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ చైర్మన్ పై  హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజా ఆరోపణలు అదానీ గ్రూపుపై విచారణను త్వరగా ముగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ ను  ప్రేరేపించింది.

హిండెన్ బర్గ్ నివేదిక ప్రకారం సెబీ చైర్పర్సన్ బుచ్ 2015లో ‘గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీ ఫండ్’లో పెట్టుబడులు పెట్టారు. సరిగ్గా ఆమె సెబీ పూర్తి కాలపు సభ్యురాలిగా బాధ్యత స్వీకరించడానికి ముందే 2017లో ఆమె వాటిని తన భర్త ఖాతాకు బదలాయించారు. 2019లో యూనీ లివర్ నుంచి రిటైరైన తర్వాత తన భర్త ధవళ్ బుచ్ సదరు కంపెనీలను తన కన్సల్టెన్సీ వ్యాపార లావాదేవీలకు వాడుకుంటున్నారని సెబీకి తెలిపినట్లు మాధవి పూరి బుచ్ తెలిపారు. సెబీ నిబంధనల నుండి లబ్ది పొందిన గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్తో దవళ్ బుచ్ ప్రమేయం ఉందని హిండెన్ బర్గ్ స్పష్టం చేసింది. వీటి పై సెబీ అధికార ప్రతినిధి స్పందించలేదు.

విదేశాల్లోని ఈ సంస్థలో బుచ్ పెట్టుబడులు పెట్టినట్టు ఒక సమాచార వేగు ఇచ్చిన ప్రకటన ఆధారంగా హిండెన్ బర్గ్ నిర్ధారించింది. గౌతమ్ అదానీ సోదరుడైన వినోద్ అదానీ నిర్వహిస్తున్న ‘బెర్ముడా మారిషస్ ఫండ్’ లో అధి భాగంగా ఉంది. అప్పటికే గౌతమ్ అదానీపై సెబీ దర్యాప్తు సాగుతున్నా పెట్టుబడులు పెట్టారు. తొలి నివేదిక హిండెన్ బర్గ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదిక సంచలనం కలిగించిన సంగతి గుర్తు చేసుకోవాలి. అదానీ గ్రూప్ చాలా బాహాటంగా దశాబ్దాల తరబడి స్టాక్ మార్కెట్ మాయాజాలానికి పాల్పడిందని, లెక్కలు తారుమారు చేసిందని ఆ నివేదిక ఆరోపించింది. హిండెన్ బర్గ్ ఫోరెన్సిక్ విశ్లేషణ అదానీ గ్రూప్ అనేక విదేశీ సంస్థల పేరుతో తన స్వంత నిధులనే అటూ ఇటూ తిప్పి తమ కంపెనీలలో పెట్టుబడి పెట్టిందీ కళ్లకు కట్టినట్లు వివరాలు నమోదు చేసింది.

ఆర్ఎస్ఎస్, మోడీ ప్రభుత్వం రెండూ గౌతమి అదానీ నిర్దోషి అన్నట్లుగానే వ్యవహరించారు. అలాగే ఆదానీపై చేసిన ఆరోపణలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి విదేశీ కుట్ర అని అందరిని దబాయించారు. హిండెన్ బర్గ్ తాజా నివేదికలోని ఆరోపణలను అసంబద్ధమైనవని, వ్యక్తిగత శీలహననమేనని చైర్ పర్సన్ బుచ్, అలాగే సెబీ ఖండించాయి. ఈ ఫండ్స్ ను  నెలకొల్పిన అనిల్ అహుజా తన భర్తకు బాల్యమిత్రుడు కావడం వల్లనే పెట్టుబడులు పెట్టామని బుద్ ఒక ప్రకటనలో చెబుతున్నారు. పెట్టుబడులు పెట్టిన విషయం తమకు సరైన సమయంలోనే తెలియచేశారని, అలాగే అవసరమైనప్పుడు ఆమె ఆ వ్యవహారాలకు దూరంగా ఉన్నారని సెబీ అంటున్నది. అయితే ఆమె ఆధానికి సంబంధించిన దర్యాప్తులలో దూరంగా ఉన్నారని చెప్పగల నిర్దిష్టమైన సమాధానం లేదు. బుచ్ విదేశీ నిధులకు సంబంధించి తన భాగస్వామ్యాన్ని సుప్రీంకోర్టుకు గాని ఆరుగురు నిపుణుల బృందానికి కానీ 2023 మార్చిలో కోర్టు నియమించిన బృందానికి గానీ ఆమె తెలియజేసినట్లు సమాచారం లేదు.

అదానీపై ప్రస్తుతం సెబి ధర్యాప్తు జరపడం అంటే కంచే చేసుని మింగిన చందంగా అన్న నానుడి గుర్తుకు రాక తప్పదు. ఆ దర్యాప్తునకు సారథ్యం వహిస్తోంది ఎవరో కాదు సాక్షాత్తు మాధవి బుచ్ యే . దర్యాప్తు సాగుతున్న సమయంలోనే ఆమె రెండుసార్లు గౌతమీ అదానీతో సమావేశమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. దర్యాప్తుపై సుప్రీంకోర్టుకు కానీ, అది నియమించిన నిపుణుల కమిటీకి కానీ సెబీ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. అదానీ గ్రూపు వాటాల విలువ ఒక్కసారిగా పెరిగిపోవడంపై సెబీ దర్యాప్తు జరిపింది, కానీ ఇలా ఎందుకు పెరిగిందో సెబీ అసలు పరిగణనలోకి తీసుకోనేలేదు. ప్రాథమికంగా షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలపై మాత్రమే దర్యాప్తు జరిపింది. రాజకీయ ఒత్తిడుల కారణంగానే సెబీ తన దర్యాప్తులో ఉదాసీనత వహించినట్లు విమర్శలు వస్తున్నాయి. మాధవికి అదానీ గ్రూప్కు చెందిన విదేశీ నిధుల్లో వాటాలు ఉండవచ్చని, అందుకే ఉదాశీనంగా వ్యవహరించారని అనుమానించింది.

సెబి చైర్ పర్సన్ కాకముందు మాధవి పూరి బుచ్ ఓ కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే దాని ఆడిటింగ్ కంపెనీ ఏ చిరునామాలో ఉందో, కన్సల్టెన్సీ సంస్థ చిరునామా కూడా అదే కావడం అనుమానాలకు దారి తీస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ, దాని ఆడిటర్ మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయేమోనన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గత ఏడాది హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ షేర్ మార్కెట్లో ఆదానీ తెర వెనుక బాగోతాన్ని బయటపెట్టింది. విదేశాల్లో డొల్ల కంపెనీలు పెట్టి వాటి పేరిట డబ్బును స్వదేశంలోని తన సంస్థలకు మళ్లించడం ద్వారా షేర్ల విలువను విపరీతంగా పెంచుకున్నాడని, ఆ విధంగా తన కంపెనీలకు లేని, రాని వ్యాపార లాభాలు షేర్ మార్కెట్లో చూపించుకొని కృత్రిమ మార్గంలో సంపదను అత్యంత ఉన్నత స్థాయికి చేర్చుకొన్నాడనేది హిండెన్ బర్గ్ నివేదిక బయటపెట్టిన కీలకాంశాలు, మాధవి, ఆమె భర్త ధవళ్ బుచ్ కు  బెర్ముడా, మారిషస్ తదితర దేశాల్లో అదానీ గ్రూప్ సంస్థల్లో ఉన్న నిధుల్లో వాటా ఉందని, బహిర్గతం చేయని పెట్టుబడులు కూడా ఉన్నాయని హిండెన్ బర్గ్ తన నివేదికలో పేర్కొంది.

అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడుల తీరును సమీక్షించాల్సిన సెబీ చైర్మన్కు వాటిల్లో వ్యక్తిగత పెట్టుబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయి. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుంది’ అని హిండెన్ బర్గ్ ఆరోపించింది. సెబీ చైర్ పర్సన్ గా  కొనసాగుతూనే మాధవి కన్సల్టింగ్ సంస్థలను ఏలా నడుపుతుందని హిండెన్ బర్గ్ ప్రశ్నించింది. సింగపూర్లో నివసిస్తున్నప్పుడు ఏర్పాటు చేసిన కంపెనీల్లో అగోరా అడ్వైజరీ లిమిటెడ్ (ఇండియా)లో 99 శాతం వాటా బుచ్లదేనని తెలిపింది. ఈ కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆదాయం పొందుతూ మరోవైపు ఆదానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు చేశారని పేర్కొంది. సెబీ పూర్తికాల సభ్యురాలిగా చేరినప్పటి నుంచి ఆమె తన భర్త పేరిట ఉన్న ఇ-మెయిల్స్ ద్వారా వ్యాపార లావాదేవీల వివరాలు తెలుసుకున్నారని కూడా ఆరోపించింది. ‘పూర్తి పారదర్శకత, నిబద్ధతతో పని చేస్తామని ప్రకటన ద్వారా హామీ ఇచ్చిన మాధవి తమ కన్సల్టింగ్ కంపెనీలను ఏ ప్రయోజనం కోసం ఆమె వాటిని నిర్వహిస్తున్నారు. అదానీ అక్రమాల కంటే, సెబీ  విశ్వసనీయతను, షేర్ మార్కెట్ మదుపుదారుల నమ్మకాన్ని ప్రభావితం చేసింది. ఈ వ్యవహారంపై సెబీ చైర్పర్సన్ పూర్తిగా పొరదర్శకంగా, బహిరంగ విచారణ జరిపిస్తారా?’ అని హిండెన్ బర్గ్ ప్రశ్నించింది.

Leave a Reply