ఛత్తీస్‌ఘడ్ ఆదివాసీ ప్రాంతాలలో ఉద్యమాన్ని అణచివేయడం కోసం 1990 నుండి ప్రారంభమైనటువంటి జన్‌జాగరణ్ అభియాన్ రెండుమÖడు దఫాలుగా ఆదివాసీలపై అత్యంత పాశవికంగా దాడులు చేసింది. కాని ఆదివాసీ ఉద్యమం ఆ దాడులకు ఎదురు నిలిచి నిలబడగలగడమే కాక ఎదురు దాడులకు కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ల పెట్టుబడులు, అటవీ ప్రాంతంలో పెట్టడం కోసం సాయుధ అరాచక దాడులను నిర్మించడంలో భాగంగా మహేంద్రకర్మ ఆధŠ్వర్యంలో సల్వా జుడుం 2005లో ప్రకటించారు. ఈ సల్వాజుడుంలో 4000 వరకు బలగాలు ఉంటాయి, అంతకు రెండింతలు వారి చేతుల్లో ప్రభుత్వం ఇచ్చిన బందూకులు కూడా ఉంటాయి. ఈ బందూకులతో ఆదివాసీలను అడవిలో నుంచి వెళ్ళగొడుతూ ఆదివాసీ గూడాలను సుమారు 644 గూడాలను నిరంతరం ధ్వంసం చేస్తూ కాల్చివేస్తూ అడ్డొచ్చిన వారందరిని అత్యంత కిరాతకంగా నిరికి చంపుతూ, అత్యాచారాలకు అడ్డే లేకుండా విపరీతమైన విధ్వంసాన్ని కొనసాగించారు. చివరికి లోతట్టు అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలు జీవించకుండా వారి గూడాలను ధ్వంసం చేస్తూ వారందరిని రహదారుల వైపు తరలించారు. ఈ తరలింపులో భాగంగానే నాలుగు సల్వాజుడుం బేస్ క్యాంపులను కుంట, ఎర్రబోరు, డోర్నపాల్ లాంటి చోట్ల ఏర్పాటు చేసి ఒకొక్క క్యాంపులో 50వేలకు పైగా ఆదివాసీలను బహిరంగంగా నిర్బంధించి ఉంచేవారు. ఎవరైనా క్యాంపులను దాటి పారిపోవటానికి ప్రయత్నం చేస్తే చంపేసేవారు. మహిళలను అత్యంత పాశవికంగా అత్యాచారాలకు గురి చేసి హత్య చేసేవారు. ఇలాంటి స్థితి ఒకవైపు కొనసాగుతున్నప్పటికి 2009 వచ్చే సరికి ఆదివాసీలపై అత్యంత అమానవీయ దాడులను అన్నింటిని సేకరించి ప్రముఖ గాంధేయ వాది హిమాంష్ కుమార్ సుప్రీం కోర్టులో 519 కేసులను నమోదు చేయించాడు. కాని ఏ ఒక్క కేసు మీద విచారణ జరగకుండానే కేసులను విచారించడం వలన ఉద్యమకారుల బలం పెరుగుతుందనే సాకుతో నమోదు చేసిన హిమాంష్ కుమార్‌నే దోషిగా ప్రకటిస్తూ 5 లక్షల పెనాల్టీ విధించడం జరిగింది. ఎన్.ఐ.ఎ. కోర్టు 10 మంది ఆదివాసీలకు 29 మంది కాంగ్రెస్ నాయకులను హత్య చేసినందుకు 13 ఏళ్ళుగా జైలు నిర్బంధానికి గురిచేశారు. వారికి ఇప్ప్పుడు మరణశిక్షను ఎన్.ఐ.ఎ. కోర్టు విధించింది. దీన్ని ప్రజాస్వామికవాదులందరూ తీవ్రంగా ఖండించి ఆదివాసీల పక్షాన నిలబడి మరణశిక్షలు రద్దయ్యేంత వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ఆదివాసీ సమాజం నుంచి వచ్చిన మహేంద్రకర్మ ఆదివాసీల పక్షాన కాకుండా కార్పొరేట్ల పక్షాన నిలబడి అడవిలోని సకల సంపదలను కార్పొరేట్లకు అప్పగించడం కోసం ఆదివాసీలు పేర్కొన్నట్లుగా అడవిపై హక్కు ఆదివాసులదే అనేదానికి విభేదిస్తూ ఉద్యమించే ఆదివాసీలను ఉద్యమకారుల పేరిట వెతికి వెతికి వారి ఇండ్లను వారిని ద్వంసం చేయడం నిర్మూలించడం ఐదేళ్ళుగా బలంగా కొనసాగించాడు. అందులో భాగంగానే వందల్లో ఆదివాసీ హత్యలు జరిగాయి. ఆదివాసీ మహళలపై అత్యాచారాలు లేక్కకు అందవు. ఇంతటి అణచివేతను ఆదివాసీలపై కొనసాగించిన నేపధ్యంలో ప్రభుత్వం ఎక్కడా కూడా చట్టబద్దంగా వ్యవహరించి మహేంద్ర కర్మ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆదివాసీలు తిరగబడి జీరంగాడి ఘటనను చేసి ఉండవచ్చు. అంత మాత్రాన 13 ఏళ్ళుగా వాళ్ళను జైలు నిర్బంధాల్లో ఉంచి నేడు ఉరిశిక్ష విధించడాన్ని మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది.
ప్రాథమికంగానే హక్కుల సంఘాలన్ని కూడా ఉరిశిక్షకు వ్యతిరేకంగా మాట్లాడుతాయి, స్పందిస్తాయి. నాగరిక సమాజంలో ఉరి శిక్ష అనేది అనాగరికమైనదిగా గుర్తిస్తూ ఇప్పటికే సుమారు 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 113 దేశాలు వారి శిక్షాస్మృతి నుండి మరణ శిక్షను తొలగించాయి. మరణ శిక్ష అనేది ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమైన క్రూరమైన అనాగరికమైన శిక్ష. ఈ శిక్ష ఎప్ప్పుడూ నేరాలను అరికట్టదు. కాని ప్రజల జీవించే హక్కును ప్రధానంగా గౌరవంగా జీవించే హక్కును ఉల్లంఘిస్తుంది. సమాజంలో ప్రపంచంలో మరణ శిక్ష కన్నా జీవిత ఖైదు లాంటి శిక్షలకు ప్రాధాన్యతనిచ్చాయి తప్ప ఒకరి జీవించే హక్కును రాజ్యమైన ఎవరైనా సరే బలవంతంగా అణచివేసే అధికారం ఎవరికి ఉండదని ప్రజాస్వామిక సూత్రాలు చెబుతున్నాయి. మన తెలంగాణలో ఎమర్జెన్సీ కాలంలో భూమయ్య కిష్టాగౌడ్‌లను అకస్మాత్తుగా ఉరితీసేసారు. కాని అంతకు ముందే రెండుసార్లు ఆ ఉరిశిక్షను రద్దు చేయగలిగిన ప్రజాస్వామిక ఉద్యమాలు నడిచాయి. అందుకోసం ప్రభుత్వమే రహస్యంగా ఉరిశిక్షను అమలు చేసింది.
అంతేకాకుండా 1993 మార్చి 8వ తేదీన గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఒక లగ్జరీ ట్రావెల్స్ బస్సును దోచుకోవాలనే ఉద్దేశంతో గెంతెల విజయవర్ధన్ రావు మరియు అతని సహచరుడు చలపతిరావు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘోర దురంతంలో బస్సులో ఉన్న ప్రయాణికులలో 23 మంది సజీవ దహనమయ్యారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 1995 లో స్థానిక సెషన్స్ కోర్టు ఈ కేసును విచారించి, ఈ దారుణమైన నేరానికి గాను ఇద్దరు ప్రధాన నిందితులు విజయవర్ధన్ రావు, చలపతిరావులకు మరణశిక్ష విధించింది. కాని నేరం నేపథ్యంను పరిగణలోనికి తీసుకోవాలని తెలుగు ప్రజలు ప్రజా సంఘాలు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఉద్యమించేసరికి ఆ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు.
ఇలా సమాజంలో అనేక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే మహేంద్రకర్మ హత్య, జీరంగాటి ఘటనను ప్రధానం చేసుకొని న్యాయస్థానాలు మాట్లాడుతున్నాయి కాని, ఐదేళ్ళ కాలంలో సల్వాజుడుం చేసిన అరాచకాలు, హత్యల గురించి ఏ న్యాయస్థానం బాధ్యతగా స్పందించలేదు. దానితో ఢిల్లీ యÖనివర్సిటికి చెందిన ప్రొ. నందిని సుందర్ ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టులో సవాలు చేయగా, 2011లో ఇదే సల్వాజుడుంను చట్టవిరుద్ధమని నిషేదించింది. ఎంత చట్టవిరుద్ధమంటే ఆదివాసీల జీవితాలను వారికి కాకుండా చేసి, వారిని భయపెడుతూ, పారిపోయి విస్తాపనకు గురయ్యే విధంగా దాడులు చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు, మహారాష్ట్రకు, ఒరిస్సాకు, సుమారు 1,50,000 మంది ఆదివాసీలు విస్తాపనకు గురయ్యారు. వారి సంబంధ బాంధవ్యాలు, భూమితో ఉన్న వారి సంబంధం, అన్నీ కూడా తెగదెంపులు చేసుకొని అనామకులుగా వేరు వేరు రాష్ట్రాల్లో ఆదివాసీలు నిత్యం రాజ్యహింసను ఎదుర్కొంటూ జీవించే తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీనిపట్ల కేంద్ర ప్రభుత్వం గాని, సుప్రీం కోర్టు గాని ఎప్ప్పుడూ బాధ్యతగా వ్యవహరించలేదు. కాకపోగా వారిపై చేసిన దాడులను హత్యలను సమర్ధించుకోవడానికి వారిని నిషేద పార్టీ వారుగా పరిగణించడం, గుర్తించడం, ఆరోపించడం చేస్తూ వచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో తోబుట్టువులను కోల్పోయిన, రక్తసంబంధీకులను కోల్పోయిన ఆదివాసీలు జీరంఘాటి ఘటనలో పాల్గొని ఉండవచ్చు. అంత మాత్రాన వారిని నేరస్తులుగా ఎలా పరిగణించాలి. ఎప్ప్పుడైనా న్యాయస్థానాలు ఏ నేరం వెనకనైన ఉన్న నేపథ్యాన్ని పారదర్శకంగా ఆలోచించి తీర్పులు చెప్పాల్సిన అవసరం ఉంది. కాని నేడు న్యాయ వ్యవస్థ కూడా పాలక వర్గాల చేతి కిందికి వెళ్ళిపోయి స్వయం ప్రతిపత్తిని కోల్పోయాయి. అందుకే పాలకుల ఆలోచనలే న్యాయస్థానాల శిక్షగా అమలవుతున్నాయి. అమలులోకి వచ్చిన గొప్ప మార్పు కేంద్ర హోంశాఖా మంత్రి ఉద్యమాన్ని నిర్మూలించినట్లుగా స్పష్టంగా ప్రకటించాడు. అందులో భాగంగా రాజకీయ ఖైదీలుగా ఉన్న వారందరికి విడుదల చేయాలనే డిమాండ్ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. నాయకత్వ లొంగుబాట ప్రక్రియలో ప్రభుత్వం వాదా చేసినట్లుగా కేసులను రద్దు చేసి అందరిని నిర్ధోషులుగా విడుదల చేస్తామనే ఒక మాట బహిరంగంగా వచ్చింది. అందులో భాగంగానే ఛత్తీస్‌గడ్‌లో గాని, గడ్చిరోలిలో గాని, తెలంగాణలో గాని అనేక మంది ఉద్యమ నాయకత్వం ప్రభుత్వాల కనుసన్నల్లోనే వారి వారి సరెండర్ ప్రకియలో భాగమై ఉన్నారు. ఇప్పటికే అలా వచ్చిన వాళ్ళందరు కూడా ప్రభుత్వాలతో సంభాషిస్తూ జైల్లో ఉన్న ఆరోపితులందరిని విడుదల చేయాలని కేసులను రద్దు చేయాలని పలు దఫాలుగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వమే ముందుగా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండే నమోదైన కేసులను సమీక్షించి విడుదల ప్రక్రియను ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే జీరంఘాటి ఘటనను కూడా దాని పరిధిలోనే చూడాలని అది ఒక రాజకీయ ప్రక్రియగా గుర్తించాలని ఆదివాసీలందరు తమ స్వార్థం కోసం కాకుండా ఆదివాసీ సమాజంపై జరిగిన బలమైన అణచివేతను ప్రశ్నించడానికి నిలువరించడానికి ప్రభుత్వం విఫలమైనందున తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి ఘటనలో పాల్గొనాల్సి వచ్చిందనేది ఆ ఘటనా నేపథ్యం చూస్తే అర్థమవుతుంది.
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం మావోయిస్టు ప్రభావం ఉన్న పరిస్థితులను ఆలోచిస్తే అన్ని రాష్ట్రాలలో ఆ ఉద్యమం ఆనవాళ్ళు కూడా లేకుండా పోయిందనేది ప్రభుత్వాలు పార్టీలు అంగీకరిస్తున్న సత్యం. ఇది దశాబ్దాలుగా మధ్య ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగించిన అణచివేత. ఈ అణచివేతకు లక్షలాది సాయుధ బలగాలతో పాటు అంతర్గత సంక్షోభాన్ని కూడా బలంగా వాడుకొని ఆ ఉద్యమమే ఆదివాసీలకు అండగా లేకుండా చేయగలిగింది. అలాగని ఆదివాసీ ప్రాంతాలు మౌళిక వసతులకు నిలయంగా మారాయా అనేది ప్రశ్నార్థకమే. కాని జీరంఘాటి ఘటన నేపథ్యంలో వచ్చిన తీర్పు పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది. ఎందుకంటే దీని నాయకత్వం కొంత మంది ప్రధానంగా బిజెపి ప్రభుత్వాల కనుసన్నల్లోనే చాలా దగ్గరగా ఉన్నారు. ఆదివాసీలు వారిపై కొనసాగిన దౌర్జన్యాలకు అణచివేతకు పరిష్కారంగా భావించడంలో తప్ప్పులేదు. అంత మాత్రాన వారికి మరణ శిక్షలు విధంచకూడదు. ఆ ఉద్యమమే లేకుండా వారితోనే ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్న ప్రక్రియను కూడా న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికైనా జైళ్ళలో అనేక కేసులలో మగ్గుతున్న ఉద్యమకారులను గాని ఆదివాసీలను గాని వెంటనే విడుదల చేసి ప్రజాస్వామ్యాన్ని కనీసంగానైనా నిలబెట్టాల్సిన కర్తవ్యాన్ని ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది.
గత ఐదు దశాబ్దాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమంపై అనేక రకాల నిర్బంధాలను కాంగ్రెస్, బిజెపి పార్టీలు, ప్రభుత్వాలు సంయుక్తంగానే అణచివేతను కొనసాగించాయి. అందులో భాగంగా ఆదివాసీ హత్యలను ఎన్‌కౌంటర్లుగా ప్రకటించడం ఆ ఎన్‌కౌంటర్లపై నిజనిర్ధారణ చేయకుండా హక్కుల సంఘాలను కూడా నిర్బంధాలకు గురి చేసి ఆదివాసీ ప్రాంతాల నుంచి వాస్తవాలను బయటికి రానీయకుండా కేవలం ప్రభుత్వ ప్రకటించిన మాటలే నిజాలుగా మీడియా ప్రకటిస్తూ వచ్చింది. దానిలో భాగంగా ప్రధాన మీడియా, బిబిసి లాంటి వాళ్ళు కూడా తీవ్ర నిర్బంధాలకు గురై ఆ ప్రాంతాలను విడిచిపెట్టాల్సి వచ్చింది. అందులో భాగంగా 2015లో జగదల్‌పూర్ న్యాయ సలహా బృందం ఆదివాసీలకు సహాయంగా నిలబడుతుందని ఆ గ్రూపును కూడా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుంచి ప్రభుత్వాలు వెళ్ళగొట్టాయి. ఇంతటి స్థితిలో ఆదివాసీల ప్రాధమిక హక్కులు ప్రధానంగా జీవించే హక్కు నిరంతరం వేటాడబడుతూనే ఉన్నాయి. దీనిని ప్రభుత్వాలు విఫలతగా మనం అర్థం చేసుకొని ఈ కేసులను కూడా ఆదివాసీ సమాజంపై కార్పొరేట్లతో మిలాఖత్ అయిన ఒక గ్రూపు దాడి చేస్తే ఆ దాడిని ఎదుర్కోవడంలో భాగంగా ఘటనగా గుర్తించి, అరెస్టు చేసిన ఆదివాసీలందరిని బేషరతుగా విడుదల చేయాలని ఇదొక రాజకీయ ప్రక్రియగా గుర్తించాలని పౌర హక్కుల సంఘం కోరుతున్నది.
ఎన్. నారాయణ రావు
ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం.

Leave a Reply