దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలలో బుసకొడుతున్న కుల వివక్ష విషసర్పానికి మరో విద్యార్థి బలయ్యాడు. సెప్టెంబర్ 18 వ, తేదిన ఐఐటీ బాంబేలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న దళిత విద్యార్థి సాహిల్ వాకోడె ఒక వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
2020-21 నుంచి 2024-25 మధ్య ఐదేళ్ల కాలంలో దేశంలోని 23 ఐఐటీలలో మొత్తం 45 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 28 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులున్నారు. ఈ ఏడాది‌ కాలంలో ఉన్నత విద్యా సంస్థలలో కుల వివక్షత, ఇతర అణచివేత చర్యలతో 18 మంది విద్యార్థులు చనిపోగా ఒక ఐఐటి బాంబే లోనే ఏడుగురు విద్యార్థులు‌ చనిపోయారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడె ముంబై ఐఐటి ప్రొఫెసర్ల నుండి తీవ్రమైన కుల వివక్ష, మానసిక వేధింపులు ఎదుర్కొన్నాడని అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు చనిపోయే మూడు రోజుల ముందు తమకు ఫోన్ చేసి అదే యూనివర్సిటీలో‌ 15 ఏళ్ళుగా డీన్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ తనను (జాతి) కులం పేరుతో వేదిస్తున్నాడని తెలిపాడని అన్నారు. ఇంకో రెండేళ్లయితే కోర్సు పూర్తి అవుతుందని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో మనం ఏదో విధంగా చదివి బయటపడాలని, ఓపికతో ఉండాలని సముదాయించినట్లు వారి తండ్రి తెలిపారు. కుటుంబ సభ్యుల ఆరోపణలకు బలం చేకూరుస్తూ, సాహిల్ మృతి అనంతరం‌ ఐఐటి యాజమాన్యం ఎలాంటి ఆధారాలు లేకపోయినా… పరీక్షల సమయంలో సాహిల్ వాకోడే మొబైల్ ఫోన్ ఉపయోగించి చీటింగ్ ఆరోపణలతో ప్రకటన విడుదల చేసి, రెండు రోజుల అనంతరం ఆయన దానికి పాల్పడినట్లు పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజులు గడవకముందే ఆ ప్రకటనలో వాస్తవం లేదని, సాహిల్ వాకోడె కాపీయింగ్ చేసినట్లు తప్పుగా ప్రకటన చేశామని, అది తమదే తప్పిదంగా భావిస్తూ ఈ ఘటన పై విచారణ చేసేందుకు 10 మందితో కమిటీ నియమిస్తున్నట్లు ఐఐటి బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ బి. కేదారే ప్రకటన విడుదల చేశారు. అదే సమయంలో యూనివర్సిటీకి చెందిన‌ స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ దూళ్ళ సూర్యనారాయణను‌ డీన్ బాధ్యత నుండి తొలగించి సెలవుపై పంపారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విద్యార్థి‌ సాహిల్ పట్ల గత మూడు నెలలుగా కుల వివక్ష ప్రదర్శిస్తూ వేధించినటువంటి ప్రొఫెసర్ సూర్యనారాయణను కాపాడడంలో భాగంగానే ముంబై ఐఐటి యాజమాన్యం మొదట ప్రకటన చేసింది. ఆ తర్వాత అక్కడి విద్యార్థుల ఆందోళనలకు తలొగ్గి మొదట‌ విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకొంది. విద్యార్థులు చిన్న చిన్న అకడమిక్ తప్పులు చేస్తే సర్ది చెప్పాల్సిన యాజమాన్యం ఆ విద్యార్థులను నేరస్తులుగా చూపుతూ భయభ్రాంతులకు గురిచేయడం, కుల, మత, ప్రాంతీయ, భాషల పేరుతో దూషించడం, వివక్షత చూపడం, అందరిముందూ తిట్టడం, దుర్భాషలాడటం, కెరీర్ ను నాశనం చేస్తామని భయపెట్టడం, మానసికంగా వెంటాడటం చేస్తున్నారు. సర్ది చెప్పాల్సిన ప్రొఫెసర్లే ప్రాసిక్యూటర్లుగా, యాజమాన్యం న్యాయమూర్తిగా మారి శిక్షలు అమలు చేస్తున్నారు. సాహిల్ అంశంలో విద్యార్థుల పట్ల అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ సూర్యనారాయణ ఆ విద్యార్థిని వ్యక్తిగతంగా దూషించడంతోనే చనిపోయాడు. ఈ విషయంలో సమగ్రమైన, స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది.
కేంద్రంలో సంఘ్ పరివార్ భావజాలం కలిగిన భాజపా సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యా సంస్థలలో దళిత బహుజన ఆదివాసీ విద్యార్థుల సంస్థాగత హత్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. విశ్వ విద్యాలయాలలో అత్యున్నత పదవుల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల సభ్యులు, మనువాద భావజాలం కలిగి ఉన్న వ్యక్తులను నియమిస్తున్నారు. ఇక ఎబివిపి లో ఐదేళ్లు పనిచేసిన వారందరినీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించారు. ఆ వ్యక్తులే నేడు ఉన్నత విద్యా సంస్థలలో తమ భావజాలాన్ని అధికారికంగా ప్రచారం చేస్తూ భిన్నాభిప్రాయాలు కలిగిన, వ్యక్తం చేసిన విద్యార్థులను, అంబేద్కర్ భావజాలం కలిగిన విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు.
రిజర్వేషన్ లో సీటు పొందిన యస్సీ, యస్టీ, బీసీ విద్యార్థులను చదువురాని వారిగా, క్రిమినల్స్ గా,దేశ ద్రోహులుగా, సంఘ ద్రోహులుగా ప్రచారం చేస్తూ భావజాల పరమైన అణచివేతకు పాల్పడేందుకు అధికారిక పదవులను వాడుకుంటున్నారు. తమను కాపాడేందుకు పాలకులు ఉన్నారనే ధీమాతో అంతర్గత ఎజెండాతో ఇదంతా జరుగుతోంది.
2014 మోడీ నేతృత్యంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చాక మొట్టమొదట సెంట్రల్ యూనివర్సిటీలలో, రాష్ట్ర యూనివర్సిటీలలో నాన్ నెట్ ఫెలోషిప్ లను నిలిపివేశారు. దీంట్లో దళిత బహుజన విద్యార్థులు విశ్వవిద్యాలయాలలో చేరే అవకాశం లేకుండా పోయింది. అనంతరం 2015లో సంఘ్ పరివార్ తన పథకం అమలులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కు చెందిన దళిత విద్యార్థులను టార్గెట్ చేసి, ఉరిశిక్షను రద్దు చేయాలని అడిగినందుకు వారిని ఉగ్రవాదులకు మద్దతుగా ఉన్నారని చెబుతూ సంఘ వ్యతిరేకులుగా ప్రచారం ప్రారంభించి ఈ ప్రచారంలో స్థానిక బిజెపి నాయకత్వం స్థానిక ప్రజాప్రతినిధులు, ఎబివిపి సభ్యులు అందరూ కలిసి, కట్టగట్టుకొని‌ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులైన విద్యార్థులను సస్పెండ్ చేయాలని కోరుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు పలుమార్లు లేఖలు రాయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాసి వారిని సస్పెండ్ చేయించారు. తాము దళిత విద్యార్థులైనందుకే ఎలాంటి తప్పు చేయకుండానే శిక్ష అనుభవించాల్సి వచ్చిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ అనంతరం న్యాయ పోరాటంలో విసిగి తీవ్ర నైరాశ్యం పాలై రోహిత్ వేముల అనే పరిశోధక విద్యార్థి కుల వివక్షను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్త సంచలనంగా మారి అనేకమంది విద్యార్థులు యువజనలు వివిధ పార్టీలు ఉద్యమించాయి అయినా కూడా నేటికీ న్యాయం జరగలేదు. రోహిత్ కులోన్మాద హత్యలో భాగస్వామ్యమైన ఏబీవీపీ నేతలు నేడు ప్రొఫెసర్లుగా నియమించబడ్డారు.
రాజకీయ నాయకులుగా అత్యున్నత పదవులు పొందారు.
రోహిత్ వేముల సంస్థాగత హత్య అనంతరం ఈ యూనివర్సిటీ యాజమాన్యం ప్రవర్తించినట్లుగానే సాహిల్ మరణానంతరం ఐఐటి బాంబే యాజమాన్యం కూడా ప్రవర్తిస్తోంది. రోహిత్ వేముల దళిత సామాజిక వర్గం కాదని ప్రచారం చేసిన యూనివర్సిటీ యాజమాన్యం నేడు సాహిల్ వాకడే కుల వివక్షతకు గురి కాలేదని అతనొక తప్పుడు దారిలో ప్రయాణించిన విద్యార్థిగా ప్రచారం చేస్తోంది. అందుకుగానూ మిడ్ పరీక్షలలో సెల్ ఫోన్ ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు అని చెప్పి పదేపదే వాదిస్తోంది. ఆ వాదనలను నిజమైనవిగా గోదీ మీడియా విపరీతంగా ప్రచారంలో పెడుతుంది. పరీక్షలలో చూసి రాస్తూ పట్టుబడితే యూనివర్సిటీలో చట్టబద్ధంగా క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు కానీ ఆ రోజు పరీక్ష హాల్లో విధులు నిర్వహిస్తున్న స్టూడెంట్స్ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ సూర్యనారాయణ వ్యక్తిగతంగా కుల పరంగా దూషించడంతోనే సాహిల్ వాకడే మనసు వికలమై, ఇక అతని భవిష్యత్తు ముందుకు పోదని భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరించడం తోనే అతను చనిపోయాడని తోటి విద్యార్థులు, అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పరీక్ష హాల్లో ప్రొఫెసర్ సూర్యనారాయణ ప్రవర్తించిన తీరుపై సమగ్రంగా దర్యాప్తు జరిపితే అక్కడ అతను విద్యార్థిని అవమానించిన తీరు బయటికి వస్తుంది. ఆ తర్వాత ఆ విద్యార్థిని సూర్యనారాయణ ఎన్నిసార్లు కలిశాడు, తన చాంబర్లో ఎన్నిసార్లు పిలిపించి భయపెట్టాడు అనే విషయాలు బయటికి రావాలి. విద్యార్థికి లీగల్ గా నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా హరాష్ మెంట్ కు పాల్పడ్డ ప్రొఫెసర్ సూర్యనారాయణ అతనికి సహకరించిన ఐఐటి డైరెక్టర్ మరియు యాజమాన్యం అందరూ కూడా నేరస్తులే. వారందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాల్సిందే.
యూనివర్సిటీలలో ఉన్నత విద్యా సంస్థలలో కుల వివక్షను రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదు. ఆయా వర్శిటీలలో కుల వివక్షత బయటపడినప్పుడు విచారించేందుకు కనీస వ్యవస్థ లేకపోవడం బాధాకరం. యూనివర్సిటీలలో కుల వివక్షను నిర్మూలించేందుకు 2025 పూర్వం వరకు ఉన్నట్టి ఈక్విటీ కమిటీలు ఎలాంటి ప్రభావం చూపక పోవడంతో 13 జనవరి, 2026 నాడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యా సంస్థల సమానత్వ నిబంధనలు -2026 పేరుతో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలలో మతం, జాతి, లింగం, జన్మస్థలం, కులం, వైకల్యం ఆధారంగా జరుగుతున్న వివక్షను నిర్మూలించడానికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాలను అమలు చేయకుండా సుప్రీంకోర్టు నిలుపుదల చేయడం జరిగింది. ఇవి కుల వివక్షకు వ్యతిరేకంగా, ఉన్నత విద్యాలయాలలో కుల వివక్షను కట్టడి చేయడానికి అవసరమైన విధి విధానాల కోసం దళిత బహుజనులు చేసిన పోరాటాల ఫలితంగా రూపొందినవి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ జారీ చేసిన నియమాలు పరిశీలిస్తే ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వ్యక్తులు, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, ఆర్ధికంగా బలహీన వర్గాలు, వైకల్యాలున్న వ్యక్తుల పట్ల కళాశాలలో, హాస్టళ్లలో ఎవరైనా దౌర్జన్యం చేసిన, అంటరానితనం, కుల పరమైన వివక్షత పాటించినప్పుడు ఈ మార్గదర్శకాలను అమలు చేస్తూ సమాన అవకాశాల కేంద్రం, ఈక్విటీ హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసి న్యాయం చేసేందుకు కృషిచేయాలని స్పష్టం అవుతోంది. అందులో భాగంగా విద్యా సంస్థలలో సమానత్వ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆ కమిటీలలో ప్రొఫెసర్లు, టీచర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉండాలని మరీ ముఖ్యంగా బాధిత సమూహాలైన వెనుకబడిన తరగతులు, వికలాంగులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మహిళల ప్రాతినిధ్యం తప్పకుండా ఉండాలని మార్గదర్శకాలలో ఉంది. ప్రాతినిథ్యం విషయాన్ని సాకుగా చూపుతూ మనువాద భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు రాజకీయపార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఈ నిబంధనలను వ్యతిరేకించారు. బహుజనుల మీద వివక్షతా ఘటనలు జరిగినప్పుడు ఎవరు విచారించాలో కూడా మనువాద భావజాలం కలిగిన వ్యక్తులు చెప్పడం ఏమిటి? ఇది అత్యంత హేయమైనచర్య. మనువాద ఫాసిస్టుల వత్తిడితో చివరికి ఈక్విటీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అందుకు పర్యవసానంగా దళిత బహుజన విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. నేడు వర్శిటీలలో ఈ ఘటనలను నివారించే, విచారించే విధానం ఇంకా రూపొందలేదు. జాతీయ విద్యా సంస్థలలో, యూనివర్శిటీలలో కుల వివక్షత నానాటికీ తీవ్రంగా పెరుగుతున్న సందర్భంలో వివక్షతను అదుపు చేసేందుకు ఈక్విటీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేసి దళిత బహుజన విద్యార్థుల రక్షణకై చర్యలు తీసుకోవాలి. ఎంతో ఆశతో వర్శిటీలో అడుగుపెట్టే విద్యార్థులకు ఆత్మహత్యే అంతిమ లక్ష్యం, చావే పరిష్కారం కాకూడదు.

Leave a Reply