నేను కథలు చదువుతూ ఆ కథల్లో నన్ను నేను ఊహించుకోవడం నాకొక సరదా అలవాటు అలా అయితే కథ బాగా అర్థమవుతుందని అనుకుంటాను. నేను చదివిన చాలా కథల్లో రచయితలు నన్నూ వారితో పాటుగా తీసుకెళ్లిన వారే. ఎక్కువ మొత్తంలో నేను చదివిన కథలన్నీ పాత రచయితలవే. అక్కడి నుంచి మొదలైతే తప్ప ఇప్పటి కథలని పట్టుకోలేమని నా అంతఃరార్దం.


అయితే రచన చేసేటప్పుడు రచయిత ఏమనుకుంటారో కానీ చదివేటప్పుడు, చదివిన తరువాత నాకొక విషయం అర్దమవుతుంది. అది నా దృక్కోణం. ఇంత మంది మనుషులం, ఇన్ని మెదళ్లు ఉన్నాయి అందరికీ ఒకే రకమైన  ఆలోచనలు ఉంటాయని అసలు అనుకొను. ఇలా అనుకుంటూనే నిన్ననే ఒక కథ చదివిన. అరుణతార లో వచ్చింది. కథ పేరు స్టాండర్స్.
 
కథ పేరు వినగానే కొంత విచిత్రంగా అనిపించింది. తెలుగు మాగజీన్ లో ఇంగ్షీషు కథ కావొచ్చు అనుకున్నాను కానీ కాదు. పుస్తకాల మీద కథల మీద  విపరీతంగా చర్చ చేయడం దాని లోతుపాతుల నుంచి చూసి మంచి, చెడు చెప్పడం నాకు ఇంకా పట్టుబడలేదు. ఇప్పటికైతే నాకున్నా అభిప్రాయలే చెప్తాను.

కథ అకౌంట్స్ దగ్గర మొదలై, ఆడిట్ దగ్గర ముగిసింది. యీ మధ్యలో ఉండేదే కథ. నేనూ కథలో లీనమయ్యాను. కథ చెప్పే విధానమే ఆ బాష కథకి ప్రత్యేక ఆకర్షణ. నిజానికి ఇలాంటి బాషలతో కథలు నేను ఇదివరకి చదవలేదు. కథ కంటే అందులోని చిన్న చిన్న డైలాగులు బాగున్నాయి. ఒక్కోసారి కథ కంటే వాటికే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. సినిమాలోలాగా.  కథంతా చదివాక మళ్ళీ ఆ డైలాగులు చదివాను. వాటిని ఇక్కడ చెప్పదలచుకోలేదు, కాని ఒక విషయాన్ని చెప్పడానికి మనకు దొరికే పరికరాలే శైలి కావొచ్చు అని నాకుంది. చుట్టూ ఉండే వాతావరణాన్ని కథలో పెట్టడం వల్ల పాఠకులు చాలా ఈజీ గా కథలోకి వెళతారు.

 కథ ఎంత సింపుల్ గా ఉందంటే, ‘కట్టే కొట్టే తెచ్చే’ లాగా. కథంతా పరుగెత్తించింది. అటు ఇటు, అది ఇది ఏమైంది ఏమై ఉంటుంది అనే కుతూహలం కథ మధ్యలో కలిగింది. కానీ పూర్తి చేశాక ఒక అసహనం, అసంతృప్తి. అయ్యో అయిపోయిందా! అనే ప్రశ్న. ఇంతేనా అనే ఆశ్చర్యం. ఇదే కథనా అనే ముక్తాయింపు. నాకనిపించింది. నిజానికి ఇదే కథనా అని కూడా నాకుంది.

 
కథ చెప్పే మొదటి వ్యక్తి, రెండో పాత్ర రత్నమధ్య సంబాషణ తక్కువ చెప్పి కథని ఇంకా చెప్తే బాగుండేదేమో!
కథలకి ఉండే పరిమితి నాకు తెలీదు కాని కొన్ని కథల్లో చెప్పాల్సిన విషయం కొండంత ఉంటే కథలో ఉండే విషయం రవ్వంత ఉంటుంది. ఇందులో కొండకి తక్కువ రవ్వకి ఎక్కువే ఉంది కానీ ఇంకా చెప్పవలసి ఉంది. కథ చదివిన తరువాత పాఠకులకి ఒక ప్రశ్న మొదలవుతుంది, సమాజం నిజంగా ఇలా ఉందా? అని. నాకు అదే అనిపించింది. కానీ సూటిగా చెప్పలేదు రచయిత. కథని అకడెమిక్ దార్లో చెప్పినట్టుంది.

 
ప్రత్యేకించి యీ కథ దేశంలో ఫాసిజం ఎలా ఉంది అని చూపించే కథ. ఇంతటి మహా ప్రజాస్వామిక దేశంలో పాలకులు వారి తీర్లూ, అధికారులు వారి అధికారాలు, పరిపాలించే విధానాలు, నడుచుకునే తీరు తెన్నులు రాజ్యాంగ పరంగా ప్రజల పౌర హక్కులు ఉన్నాయా అసలు ఉంటే ఎలా ఉండాలి? ఒకవేళ లేకపోతే ఉన్నట్టుగానే కనిపించి కనిపించలేని విధం ఏంటి అది యే రూపంలో ఉంది అనే విషయాన్ని దాని రూపాన్ని యీ కథ చిత్రించే విదంగా ఉంది, కానీ చివరిలో ముగింపు దగ్గర ఇంకా చెప్పవలసిన విషయం ఉంది కథ ఇంకా అయిపోలేదు కానీ బలవంతంగా కథను ముగించారెమో అన్నట్టుగా ఉంది.

గుడి చుట్టూ తిప్పి తిరుపతిలో పద్దెనిమిది గంటలు, ఇరవైనాలుగు గంటలు లైన్ లో నిలబడి కనీసం నిమిషం కూడా దేవుడిని చూసే అవకాశం దక్కదు కదా అదేందుకో ఇంకా నాకర్ధం కాదు. అలాంటి దేవుడ్ని మాత్రం చూడకపోతే ఏంటి? అదేదో వేరే పని చేసుకున్నా కూడా రోజుకి వెయ్యి వస్తాయి. బయట పచ్చి బూతులు మాట్లాడే వ్యక్తులు అక్కడికి వెళ్ళగానే పరమ భక్తులు అయిపోతారు అలాంటి అంధ భక్తి ఎందుకు? ఒక ఆలోచన లేని విషయాన్ని అర్దం చేసుకోని అంధత్వంలో చాలా మంది ఉన్నారని నాకు మొన్నే తెలిసింది.

వారందరూ ఇలాంటి కథలు కొద్దిగానైనా చదవితే ఎంతో కొంత కథని విమర్శించడానికైనా ఆలోచిస్తారు. ఆలోచించే క్రమంలో వారు ఒక ధాటికి వచ్చి ఇంకో విదంగా అయినా ఆలోచించక మానరు.
కాబట్టి కథలన్నీ వచ్చే తరం కోసం ఇంకా విషయ సూటిగా, ఇంకా సంఘర్షణగా, ఇంతే రాజకీయంగా రావాలి.  
అందుకే రచయిత యే దృష్టి నుంచి రాసి ఉంటారో నాకు తెలీదు. ఇది నా కన్ను, నా మెదడు.
 

  • జనని

Leave a Reply