భగత్ సింగ్
నీ ముందు మృత్యువు నిలబడి
నీకోసం నిరీక్షిస్తున్నపుడు,
నువ్వప్పుడు లెనిన్ తో మాట్లాడుతున్నావు
“రాజ్యం – విప్లవం” 71వ పేజీలో
(నువ్వు వదిలిపోయిన) బుక్ మార్క్ ను
నీ సహచరులు తొలగించారు
వాళ్లు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివారు
అంతేకాదు, నువ్వు చదువాలనుకున్న
మరిన్ని పుస్తకాలు కూడ చదువుతున్నారు

నీ అమరత్వం తర్వాత
నదిలో ఎంత నెత్తురు ప్రవహించిందో చెప్పలేం
కాని రాజ్యం దమన నీతి మారలేదు
విప్లవ అవసరం కూడా మారలేదు
భూమి మీద చిందిన
నీ రక్తంలో
ఎంత ధూళి కలిసిపోయిందో …

ధాత్రి పైన రాలింది
ఏదీ వృథా కాదు
రక్తమైతే అసలే (వృథా) కాదు
ధరాగర్భంలో కూడుకున్న ఈ రక్తం
ఒకరోజు ఉష్ణమై ఉబికి వస్తుంది
ఒక జ్వాలాముఖి విస్ఫోటనమవుతుంది
నీ సహచరులు
ఈ జ్వాలాముఖి శిఖలపైన చాయ్ కెటిల్ పెట్టి,
నిన్ను చాయ్ కోసం ఆహ్వానిస్తారు

(నవారుణ్ భట్టాచార్య కవితా ప్రేరణతో… ఆయన దగ్గర ఒక చరణం కూడా అరువు తెచ్చుకున్నాను)

1.స్టేట్ అండ్ రెవల్యూషన్ : వి.ఐ. లెనిన్
2.’జ్వాలాముఖి శిఖలపైన’ : నవారుణ్ భట్టాచార్య

(ఉరిశిక్ష పడిన జీరామ్ ఘాట్ మావోయిస్టు ఆదివాసీ ఖైదీల కోసం…)

షహీద్ భగత్ సింగ్‌ జయంతి
28 సెప్టెంబర్ 2026

Leave a Reply