దేశంలో నిరుద్యోగం తగ్గుతోందంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గణాంకాలను ప్రచారం చేసుకుంటు న్నది. ఆ సంఖ్యల వెనుక భారత కార్మిక మార్కెట్ అసలు వాస్తవం క‌నిపించ‌కుండాపోయే ప్రమాదం కనిపిస్తున్న‌ది. వారంలో ఏడు రోజుల ఉపాధి పరిస్థితిని ఆధారంగా తీసుకొని నిరుద్యోగాన్ని కొలిచే విధానం ఉద్యోగం దొరికిందా లేదా అన్నదే చెబుతుంది తప్ప, ఆ పని ఎంత కాలం ఉంటుంది? ఎంత వేతనం వస్తుంది ? క్రమం తప్పకుండా జీతం అందుతుందా? ఆ ఉద్యోగం జీవన భద్రత కల్పిస్తుందా ? వంటి కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. అసంఘటిత రంగమే ఆధారంగా కోట్లాది మంది బతుకుతున్న భారత్ లో కేవలం నిరుద్యోగ శాతం తగ్గిందని చూపించడం దేశంలోని ఉపాధి సంక్షోభాన్ని సంఖ్యలతో కప్పిపుచ్చడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

భారత్ కార్మిక మార్కెట్లో అత్యధిక భాగం అసంఘటిత రంగంపైనే ఆధారపడి ఉంది. వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలోని దాదాపు 90శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. ఈ రంగంలో పని దొరికిన రోజునే ఆదాయం ఉంటుంది. మరుసటి రోజు పని ఉంటుందో లేదో తెలియదు. వేతనం ఎంత వస్తుందో, ఎప్పుడు అందుతుందో కూడా స్పష్టత ఉండదు. నిరుద్యోగం తగ్గిందా లేదా అనే అంశంతో పాటు వేతనాలు పెరుగుతున్నాయా? కార్మికులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? ఉద్యోగ భద్రత ఉందా? ఏ రంగం నుంచి ఏ రంగానికి కార్మికులు మారుతున్నారు, కొత్త ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తున్నాయి? అనే విష‌యాలు కూడా కీలకం. కానీ ప్రస్తుత నెలవారి నిరుద్యోగ గణాంకాల్లో ఈ స్థాయి సమగ్ర సమాచారం కనిపించక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

దేశంలో నిరుద్యోగం అనేది దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిన తీవ్రమైన సమస్య. అర్హత, నైపుణ్యం ఉండి కూడా సరైన ఉపాధి దొరకని పరిస్థితి నేడు దేశంలో నెలకొని ఉంది. ఇందుకు ప్రధాన కారణాలు 1. లోప భూయిష్టమైన విద్య, 2. వ్యవసాయ రంగంలో అవసరానికి మించి ఎక్కువమంది పనిచేయడం వలన ఉన్న‌ ప్రచ్చన్న నిరుద్యోగం, 3. మందగించిన పారిశ్రామిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో వృద్ధి చెందకపోవడం వల్ల అత్యధికులకు ఉపాధి అందించలేక పోవ‌టం, 4. ఆటోమేషన్, కృత్రిమ మేధ వంటి సాంకేతికాలను అధికంగా వాడడం వల్ల మానవశ్రమకు త‌గ్గిన‌ డిమాండ్, 5. వ్యాపారాలు మందగిం చడం, పెట్టుబడులు తగ్గడం వల్ల కంపెనీలు ఉన్న ఉద్యోగులనే తొలగించ‌టం, 6. ఆర్థిక వృద్ధి కంటే ఉపాధి అభివృద్ధి తక్కువగా ఉండ‌టం, అంటే మనది ఉపాధి రహిత వృద్ధి , 7. కుల వర్గ అడ్డంకులు కొన్ని వర్గాల వారికి విద్య ఉద్యోగం అవకాశాలను పరిమితం చేస్తూ ఉండ‌టం వంటి కార‌ణాలు నిరుద్యోగాన్ని శాశ్వతం చేస్తాయి.

దేశానికి యువతే అత్యంత పెద్ద వనరు. జనాభాలో యువత వాటా ఎక్కువగా (27శాతం) ఉండటం భారత దేశానికి ఉన్న గొప్ప బలంగా చెప్పుకుంటున్నాం. ఆ యువతే ఇప్పుడు సరైన అవకాశాలు దొరక్క తీవ్ర నిరాశలో ఉంది. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగం లభించడం లేదు. సొంతంగా ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకునేందుకు స్థిరమైన పెట్టుబడి రుణ సదుపాయాలు కరువయ్యాయి. యువత ఉపాధి పరిస్థితిపై కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ( పి ఎల్ ఎఫ్ ఎస్) నివేదిక ఇదే విషయాన్ని గణాంకాల రూపంలో స్పష్టం చేసింది. 2025 వార్షిక నివేదిక ప్రకారం దేశంలో 15 నుంచి 29 ఏళ్ల యువత నిరుద్యోగిత రేటు 9.9 శాతం. అంటే ప్రతి 100 మంది యువ కార్మికుల్లో దాదాపు పదిమంది పని కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత నిరుద్యోగిత రేటు 8.2 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత పురుషులది 11.8 శాతం. మహిళలకు 18.9 శాతంగా నమోదయింది. యువశక్తిని సరైన దిశలో వినియోగించడంలో ప్రస్తుత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పడానికి లెక్కలే నిదర్శనం.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది పట్టభద్రులు ఉద్యోగ మార్కెట్ లోకి వస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరాక యువతకు ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. ఇప్పటికే మంజూరైన పోస్టుల ను సైతం భర్తీ చేయటం లేదు. 10 ఏళ్ల యూపీఏ హయాంలో యువతకు అన్యాయం చేసిందన్న మోడీ, తాము కనుక అధికారంలోకొస్తే ఏడాదికి రెండు కోట్ల కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వాగ్దానం చేశాడు. ఆయన చెప్పినట్టుగా 12 ఏళ్ల బిజెపి ప్రభుత్వంలో 24 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. వాస్తవానికి అసలు ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించామన్నది చెప్పడానికి కేంద్రం సాహసించడం లేదు. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అంటే విదేశీ, స్వదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడితే వస్తాయి. కానీ అదేమీ ఆశించిన స్థాయిలో ఉద్యోగ క‌ల్ప‌న‌కు తోడ్ప‌డుతున్న దాఖ‌లాలు లేవు. కానీ విదేశీ-స్వ‌దేశీ పెట్టుబ‌డుల‌నే తమ ఘనతగా మోడీ చెప్పుకోవడం సిగ్గుచేటు.

ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ పూర్తిగా తన చేతుల్లోనే ఉన్నా.. వాటిపైన ప్రధాని మనసు పెట్టింది లేదు. ప్రతిసారి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం యువతకు ఉద్యోగాల హామీ ఇవ్వడం అలవాటుగా మారింది. ఉద్యోగ క‌ల్ప‌న అనేది ఎండ‌మావిగానే ఉంటున్న‌ది. ఇది కచ్చితంగా ఏరు దాటాక తెప్ప తగలేయడమే. ప్రభుత్వ రంగంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి నెలకు 10 లక్షల మంది నిరుద్యోగ సైన్యంలో చేరుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలే ఉటంకిస్తున్నాయి.

నిరుద్యోగిత పెరగడానికి సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ ఆర్థిక విధానాలే కారణం. దీని ఫలితంగా యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నది. దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మరిన్ని ఉపాధి అవకాశా లు సృష్టించాల్సిన అవసరం ఉంది. లేకపోతే నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై యువత ఏ రకంగా సమరశంఖం పూరించిందో అదే రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన యువత భవిష్యత్తులో పాలకులను నిలదీయక తప్పదు.

అవకాశాలు కల్పిస్తే ఉపాధి, సంప‌ద‌ను సృష్టించట‌మే కాదు, ఉద్యోగాలను సృష్టించగల శక్తి యువతలో ఉంది. స్టార్టప్ లు, చిన్న పరిశ్రమలు డిజిటల్ సేవలు సృజనాత్మక రంగాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషన్, గేమింగ్, మీడియా, పర్యాటకం వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించవచ్చు. వాటికోసం అట్టహాసంగా మోడీ ప్రభుత్వం ప్రారంభించిన మేకిన్ ఇండియా పథకం ఎంతమందికి పెట్టుబడులు కల్పించిందో తెలిసిందే. దాని గురించి కేంద్రమే ఊసెత్తడం లేదు. స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ యోజన (పి ఎం కే వై), ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా, ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు అందించేందుకు స్టాండ్ అప్‌ ఇండియా అంటూ హడావిడి చేసినా వాటి ప్రస్తుత పరిస్థితి ఒక నోటిఫికేషన్ కోసం వేలాది మంది ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడటం కూడా ఉపాధి సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. ఇంకా డిజిటల్ ఇండియా అంటూ యువతకు గాలం వేస్తూ గాలిలో మేడలు కట్టేందుకు ప్రయత్నం చేయడం విడ్డూరం.

నిరుద్యోగం భారత అధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉపాధి అవకాశాల లేమివల్ల అత్యధికలు పేదరికం, అసమానతలలో కూరుకుపోతారు. సమాజంలో సమానత్వ ఆదర్శం దెబ్బతిని ధనిక, పేద తేడాలు విపరీతంగా పెరుగుతాయి. నిరుద్యోగం వల్ల సమాజంలో అశాంతి పెరిగి, దేశంలో నేరాలు పెరిగి శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఉపాధి లేకపోవడం వల్ల కుటుంబాలు మరింత పేదరికంలోకి నెట్టబడతాయి. వస్తువుల డిమాండ్ పడిపోవడం వల్ల మార్కెట్లో వ్యాపారాలు నష్టపోతాయి. ఇది మరింత నిరుద్యోగాన్ని పెంచుతుంది. మానవ వనరులను ఉత్పాదక రంగంలో సరిగా ఉపయోగించు కోలేక పోవడం వల్ల జాతీయ ఉత్పత్తి నష్టపోతుంది. మరోవైపు పన్నుల రూపంలో ఆదాయం తగ్గి సంక్షేమ పథకాలపై వ్యయం పెరగడంతో ప్రభుత్వ బడ్జెట్ పై భారం పెరుగుతుంది. మొత్తంగా జిడిపి వృద్ధి క్షీణిస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గి మార్కెట్ డీలా పడుతుంది.

పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి ఎల్ ఎఫ్ ఎస్) తరచుగా నిర్వహించడం ఒక ముఖ్యమైన పురోగతే. అయితే సర్వేను నెలవారీగా నిర్వహించడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు. గణాంకాలు ఎంత తరచుగా విడుదల అవుతున్నాయి అన్నది కాదు.. అవి భారత కార్మిక మార్కెట్ లోని అసలు పరిస్థితిని ఎంత నిజాయితీగా ప్రతిబింబిస్తున్నాయన్నదే అసలు ప్రశ్న. ఒక వారం పని దొరికితే ఉపాధి ఉన్నట్టు చెప్పడం, నిరుద్యోగం తగ్గి ఉద్యోగ సంక్షోభం తగ్గిపోయిందని ప్రచారం చేయడం వల్ల కోట్లాదిమంది యువత వలస కార్మికులు, రోజువారి కూలీలు ఎదుర్కొంటున్న వాస్తవం మారదు. అయితే భారత్ కు ఇప్పుడు అవసరమైంది కేవలం తరచుగా విడుదల అయ్యే నిరుద్యోగ గణాంకాలు కాదు. ఉద్యోగాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత, వేతనాలు, పని భద్రత, పని గంటలు, వలసలు, దాగి ఉన్న నిరుద్యోగాన్ని కూడా పట్టుకునే విశ్వసనీయమైన కార్మిక మార్కెట్ సూచిక అని నిపుణులు అంటున్నారు.

Leave a Reply