ప్రపంచ సాహిత్యంలో వేటది ప్రత్యేకస్థానం.  ప్రఖ్యాతి పొందిన ‘ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘ నవలా రచయిత ఎర్నేస్ట్ హెమింగ్వే స్వయంగా సాహసి, పెద్ద జంతువుల వేటగాడు.  ఆయన మరో రచన ‘గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా’ ది వేట సాహిత్యంలో మొదటి స్థానమని చెబుతారు. విల్సన్ రాల్స్  ‘వేర్ ది రెడ్ ఫెర్న్ గ్రోస్’ పిల్లల కోణంలో రాసిన వేట నవల.  జాక్ లండన్ రాసిన ‘కాల్ ఆఫ్ ది వైల్డ్’ నవల, ‘ది సీ వుల్ఫ్’ కథలు  మన తెలుగు పాఠకులకు బాగా పరిచయం అయినవి. ప్రమాదకరంగా మారిన హిమాలయ చిరుతల, పులుల వేట గురించి జిమ్ కార్బెట్  రాసిన ‘మ్యాన్ ఈటర్స్ ఆఫ్ కుమాన్’  భారతీయ నేపధ్యం ఉన్న వేట నవల.

బిగ్ గేమ్ హంటింగ్ గా పిలవబడే ఆఫ్రికన్ జంతువులైన  ఏనుగు, చిరుత, సింహం, అడవి దున్న, ఖడ్గమృగాల వేట గురించి వచ్చిన గొప్ప నవల పీటర్ హాత్వే రాసిన  ‘డెత్ ఇన్ ది లాంగ్ గ్రాస్’. 1950ల్లో జె. ఏ. హంటర్ రాసిన  ‘ది హంటర్’  ఎక్కువగా ప్రస్తావించబడే వేట నవల. జె ఎ హంటర్ స్వయంగా సాహసి, నిపుణుడైన వేటగాడు. ప్రమాదకరమైన ఖడ్గమృగాలను  డజన్లకొద్దీ చంపడానికి టాంజానియన్ ప్రభుత్వంచే అధికారికంగా నియమింప బడ్డవాడు. అతనికి  ఆఫ్రికా ఖండం అంతటా వేటాడిన అనుభవం ఉంది. ఇంగ్లీషులో వేట గురించి ఇలా వందలకొద్దీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కానీ తెలుగులో వేట సాహిత్యం బహు అరుదు. కొంతలో కొంతగానైనా ఎక్కువగా వచ్చింది కథా సాహిత్యమే.

తెలుగు సృజనాత్మక సాహిత్యంలో ‘వేట’ ఇంత అరుదైన వస్తువు ఎందుకైంది? తెలుగు సాహిత్యకారులు వేటగాళ్ళు కాకపోవడమా? సృజనకారులైన మేధోవర్గం తొలినాళ్ల నుంచే వేటకు దూరంగా ఉండిపోయిందా? దివాణం సేరీ వేట (పూసపాటి కృష్ణంరాజు), అరణ్యఘోష (అల్లం శేషగిరిరావు), సినిమా నటుడు ఎస్.వి.రంగారావు వేట కథలుకొన్ని,  ‘వేటకథలు’ టైటిల్ తోనే వచ్చిన  కె.ఎన్.వై. పతంజలి కథలు ఆ కాసిని కథల్లోనూ ముఖ్యమైనవి.

ప్రతి వేటగాడు తన జీవితంలో మూడు దశలను చూస్తాడు. అనిశ్చితి, మితిమీరిన ఆత్మవిశ్వాసం, స్థితప్రజ్ఞత.

తొలినాళ్ళ వేట కథల్లో రాజుల/ జమీందార్ల కాలంనాటి వేట అనుభవాలు, అడవి ప్రయాణాల నేపథ్యం,  ఆయా గ్రామాల/ గూడేల వాతావరణ చిత్రణ వుంది. ఆ తరువాత

నెమ్మదిగా  వేట పద్ధతులు, వేట సాంప్రదాయాలు, మనుషుల్లో, జంతువుల్లోనూ ఉన్న మృగస్వభావ చిత్రణ వైపు మళ్ళాయి.  అటవీప్రాంతపు ఆదివాసుల జీవితం, పేదరికం, అమాయకత్వం, మోసపోయేతనం తెలుగు కథల్లో  కనిపించే సాధారణ అంశం.

కథలు కొద్దిపాటి వున్నా వేట ఇతివృత్తంగా తెలుగు నవలలు దాదాపు లేవనే అనుకుంటాను. జిమ్ కార్బెట్ – చౌగర్ పులులు (ఆక్స్ ఫర్డ్ ప్రెస్),  ప్రజల్ని వేటాడే బెబ్బులులు ( గుండి మెడాస్, ఏలూరు) కెన్నెత్ఆండర్సన్ 

నవలలు హైదరాబాద్ నరభక్షకి, శివనిపల్లి నల్లచిరుత ( సాహితీ కేంద్రం, తెనాలి) తెలుగులో వచ్చిన కొన్ని అనువాద నవలలు.

                                     *****

ఇంతకు ముందు ఇతర భాషల్లోనూ, తెలుగులోనూ వచ్చిన  వేటసాహిత్యం కంటే చాలా భిన్నమైన రచన ఇటీవల తెలుగులోకి అనువాదం అయ్యింది. గేయ స్కోటర్స్ రాసిన ‘ట్రోఫీ’ నవలని ఎస్.కుమార్ తెలుగులోకి

‘వేట’ గా అనువాదం చేయగా ఛాయ ప్రచురించింది. భిన్నమైనదని ఎందుకంటే వాటి లాగా కేవలం వేట వివరాలకు, ఘటనలకు పరిమితం కాకుండా వేట నేపధ్యంలో ఆఫ్రికా లేదా మూడో ప్రపంచదేశాల గురించి  పాశ్చాత్యులకు (శ్వేతజాతి దేశాల) ఉన్న అభిప్రాయాలను చర్చలోకి తెచ్చింది. ఆ దేశాలు పెట్టుబడిదారులకు నయా వలసలుగా మారి ఎట్లా దరిద్రంలోకి నెట్టబడుతున్నాయో చూపింది. చివరకు ఆ దేశ మూలవాసులను  వేట జంతువులుగా మారుస్తున్న పేదరికాన్ని, అక్కడి వన్యప్రాణి చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న శ్వేతజాతి తెలివితేటలను, వాళ్లకు లొంగిపనిచేస్తున్న అక్కడి తొత్తు రాజ్యాంగ యంత్రాన్ని, గిరిజన తెగల నిస్సహాయతను మనముందు పెట్టింది.

గేయ స్కోటర్స్ బెల్జియం దేశానికి చెందిన రచయిత్రి. ( నెదర్లాండ్స్ పక్కనే వున్న యూరోపియన్ దేశం బెల్జియం) ఆమె  తన ప్రాంతీయ భాష అయిన ఫ్లెమిష్ లో రచనలు చేసింది.  ఫ్లెమిష్ అనేది బెల్జియం ఉత్తర ప్రాంతమైన ‘ఫ్లాండర్స్’లో మాట్లాడే డచ్ భాషకున్న ఒక ప్రాంతీయ రూపం. సుమారు 55 నుండి 60 లక్షల మంది ప్రజలు ఫ్లెమిష్ భాష  మాట్లాడతారు . ఇది బెల్జియం జనాభాలో సుమారు 55 శాతం.

కథ విషయానికి వస్తే  కథానాయకుడు హంటర్ వైట్ వేటకోసమే జీవిస్తాడేమో అనిపించేంతటి ‘పెద్ద జంతువుల’ వేటగాడు. అపారమైన సంపద కలిగిన అమెరికన్ షేర్ ట్రేడర్ కూడా. పాశ్చాత్య కులీన ప్రపంచం దృష్టిలో ‘బిగ్ ఫైవ్ ‘ను కొట్టగలిగినవాడు మాత్రమే మొనగాడైన మహావేటగాడి కింద లెక్క. ఇటువంటి పెద్ద వేటలు (బ్రిటిష్ పరిపాలన కాలంలో మనదేశంలో కూడా జరిగేవి.) ఆఫ్రికాఖండంలోని అనేక  దేశాల్లో ఇప్పటికీ జరుగుతున్నాయి. ‘ట్రోఫీ హంటింగ్’ అనబడే యీ బిగ్ గేమ్ హంటింగ్ కు అక్కడి ప్రభుత్వాలే లైసెన్స్ ఇస్తాయి. వేట అయ్యాక జంతువు తల కత్తిరించి  ట్రోఫీగా వేటగాడికి ఇస్తారు. వాటిని శుభ్రం చేసి గడ్డి కూర్చి తమ సాహసపు మగటిమిని, హోదాను సూచిస్తూ ఇళ్లల్లో అలంకారంగా తగిలించుకుంటారు.

జాన్ హంటర్ వైట్  ఇంతవరకు తను వేటాడని ‘బిగ్ ఫైవ్’లో చివరిదైన  ఖడ్గమృగాన్ని (రైనో) వేటాడడానికి ఆఫ్రికాకు వెళ్లడంతో నవల మొదలవుతుంది. ఆ వేట అతనికి అన్నిటికంటే ఎక్కువగా తాను బ్రతికి ఉన్నాననే భావనను ఇస్తుంది.  ట్రోఫీ హంటింగ్ కొంతమంది స్థానికులకు  ఉద్యోగ అవకాశాలను మాత్రమే కాకుండా, అక్రమ వేటను ఎదుర్కోవడానికి స్థానిక ప్రజలకు అవసరమైన ఆదాయాన్ని కూడా కల్పిస్తుందని నమ్మే  పాశ్చాత్యులలో హంటర్ వైట్  ఒకడు.

యీ వేట క్రమంలో జంతువుల స్మగ్లింగ్ చేసే పోచర్లు కథా నాయకుడు వైట్ ఎరగా ఎంచుకున్న  రైనోతో పాటు మరొక రైనో కూడా చంపేస్తారు.

 “పోచర్ల చేతిలో చనిపోయిన రైనోను చూసిన క్షణం నుంచి అతనిలో ఏదో మార్పు జరుగుతోంది. వేటలో ఉడుకెక్కిన రక్తం, కైపెక్కించిన ఉద్వేగం వేటాడగలిగితేనే నెమ్మదిస్తాయి.”

ఆ కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు వైట్ తమ దేశందాటి పోకూడదని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. తను తలుచుకుంటే డబ్బు వెదజల్లి బైటపడేవాడే కానీ  ఆ సంఘటన  వైట్ అహాన్ని దెబ్బతీసింది. అంతకంటే కూడా విఫలమైన ఖడ్గమృగపు వేట అతడిలోని  మగతనాన్ని ( masculinity) తీవ్రంగా నిరాశపరుస్తుంది. బిగ్ హంటింగ్ ను ఆర్గనైజ్ చేసే ఒక వ్యాపార వ్యవస్థ కూడా ఆఫ్రికా దేశాల్లో ఉంది. వేటగాళ్లకు హంటింగ్ లైసెన్సులు ఇప్పించడం దగ్గరనుంచి వేటకాలంలో  అవసరమయిన సదుపాయాలను, జంతువుల అనుపాసులు పట్టగల స్థానిక ట్రాకర్లను సమకూర్చడం  వరకు అన్ని పనులూ ఆ వ్యవస్థ చేసిపెడుతుంది. వాటిని ‘సఫారీ కంపెనీ’లంటారు. వాన్ హీరేన్ అటువంటి ఒక కంపెనీ యజమాని, వైట్ హంటర్  స్నేహితుడు, సన్నిహితుడు. వేటగాడి మనసు నెరిగినవాడు. ఎరను కోల్పోయి నిరాశలో ఉన్న వైట్ హంటర్ కు  ‘బిగ్ సిక్స్’ అని పిలవబడే జంతువులు కూడా వేటకు సిద్దంగా వున్నాయని చూపిస్తాడు. ఆ విధంగా తన  కస్టమర్ ను ఎన్నడూ నిరాశపరచని వ్యాపారి వాన్ హీరేన్. అది తను ఇదివరకెన్నడూ చూడని, వినని ‘మనుషుల వేట’ గురించి ఆలోచిస్తూ  వైట్ ఉద్విగ్నతకు లోనవుతాడు. అక్కడి నుంచి అతని వేట ప్రయాణం  అనుకోకుండా ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది.

బలిష్టమైన ఎలాన్ జాతి దుప్పిని కేవలం విల్లు-బాణంతో వేటాడి తెగలో మగవాడనిపించుకున్న‘ఇంకెట్’ ఒక ఆదివాసీ. అతడిని వేటాడాలన్నది ఒప్పందం. అందుకోసం  హంటర్ వైట్ చేసే వేట ప్రయాణంలో ఇదివరకెన్నడూ కలగని భావాలు కలుగుతాయి. అతడి విశ్వాసాలు డోలాయమాన స్థితిలోకి నెట్టబడతాయి. ఆత్మవిశ్వాసాన్ని ధ్వంసం చేసే అపనమ్మకం, క్రమంగా నిర్వీర్యమవుతున్న వేటగాడి మగతనం, ఓటమి గురించిన భయం దాన్ని వెన్నంటిన నిరాశ, ఓటమిని  హుందాగా అంగీకరించలేని అహం ఇలా ఒకటొకటి వెంట వెంటనే. మరణపు అంచుకు చేరేవరకూ  తీవ్ర మానసిక సంఘర్షణ. ఆ ప్రాంత భౌగోళికత గురించి హంటర్ వైట్ కు తెలియదు కాబట్టి ఇంకెట్ ను వేటాడటానికి అదే తెగలోని దావీదు ట్రాకర్ గా వైట్ కు సహకరించాలనేది వేట ఒప్పందం. వేటకు గాను ఇచ్చే రుసుముతో గూడెం ప్రజలంతా బాగుపడాలి. ఇంకెట్ ప్రాణ స్నేహితుడు దావీదు అమెరికాకు ప్రయాణమవ్వాలి.

అంతరించిపోతున్న జంతువును (లేదా చివరికి ఒక మనిషిని కూడా) వేటాడటానికి లక్షలాది డాలర్లు చెల్లించడం ఒక మొత్తం సమాజాన్ని ఆకలి నుండి కాపాడితే, ఆ ఫలితం మంచిదైపోయి, ఆ ఘోరమైన చర్యను సమర్థిస్తుందా? ఇది కేవలం ప్రశ్న కాదు. ఆధునిక పాశ్చాత్య సమాజపు  నైతిక ప్రమాణాల ద్వంద్వ స్వభావాన్ని బోనులో నిలబెట్టే మాట. పెట్టుబడిదారీ విధానం తన  దోపిడీని, నయా వలసవాదాన్ని సమర్థించుకోవడానికి మానవ నైతికతను కూడా  ఎలా వక్రీకరించగలదో మీరు చూడవచ్చు.

“నైతికత అనే కరెన్సీ ప్రపంచమంతా ఒకటే రంగులో ఉంటుంది  – డాలర్ రంగులో!”

చంపడం అనేది హంటర్ కు చిన్నప్పుడే స్వాభావికంగా అలవడింది. ఎంతగానంటే అది అతనికి అతి మాములు విషయమైంది.  వేటలో తను మృగాన్ని చంపడం అనేది ప్రకృతి ధర్మం అనుకునేంతగా… అటువంటి తను

ఇంకెట్ ను వేటాడడానికి బయలుదేరివచ్చి ట్రాకర్ దావీదు చేతిలో పడ్డాడు. వాడి మీద అపనమ్మకం మొదలైంది. ఆ తరువాత  తన మిత్రుడు హీరేన్ ను సైతం అనుమానించాడు.  హంటర్ అనుమానం దావీదును గాయపరచింది. “ఇంకెట్ పరుగెత్తాలి, మీరు వేటాడాలి, నేను మీకు సాయపడాలి. ఇది దేవుళ్ళ ఆన.” దావీదు స్పష్టపరిచాడు

ఖాళీ మైదానాలు, లోయలు, కొండలు దాటుతూ ఎరను అన్వేషించాలి. మునుపు వేటలో  తిండి, నీరు సమకూర్చే మనుషులుండేవారు. ఇప్పుడు దావీదు తప్ప మరొక దిక్కులేదు. దాహం, ఆకలి, ఒళ్ళు నీరసించిపోయేంత నడక, దారిలో ఇంకెట్ పెట్టిన ఉచ్చులు, ప్రమాదకరమైన విషపు తేళ్లు. ఇది వేటలా లేదు మృత్యువుకు ఎదురెక్కిపోతున్న అనుభూతి. జీవితంలో మొదటిసారి హంటర్ వైట్ కు రాత్రి అడవిలో గడిపేందుకు భయమైంది.  తానే వేటాడబడుతున్నానేమో అనిపించింది. ఒకప్పుడు తన మగతనపు సిరిగా భావించిన 0577 నైట్రో ఎక్స్ ప్రెస్ పెద్ద తుపాకీ చేతిలో వున్నా అది తనను కాపాడలేదేమో అనే అపనమ్మకమూ కలిగింది.  గతంలోని తన వేటలలో వేటగాడు దాడి చేస్తాడన్న విషయం మృగానికి ముందుగా తెలియదు. ఇప్పటి  వేటలో ఎరకు కూడా తన మీద దాడి జరుగుతుందని తెలుసు అంటే ఇంకెట్ కూడా తనమీద దాడి చెయ్యవచ్చు. అతని భయాన్ని చూసి నవ్వి  “మేము మీలా కాదు. సరదా తీర్చుకోడానికి చంపం. మాకోసం దేవుడు ఎంపికచేసిన మృగాలను మాత్రమే చంపుతాం. మీరుగా  దాడి చేసేంతవరకు ఇంకెట్ మీ మీదికి రాడు” అని దావీదు చెప్పేంతవరకు కడుపుకు స్థిమితంగా తిండిలేదు, కంటికి నిద్రలేదు. నడక నడక అంతులేని నడక. 

వైట్ పాశ్చాత్య మనస్థితి స్థానిక విశ్వాసాలతో, నమ్మకాలతో తలపడినప్పుడు అతని ప్రపంచం కూలిపోనారంభించింది.

తెల్లవాళ్ళు కనిపెట్టకముందు వుండిన ఆఫ్రికాకు తీసుకుపోయాడు ఇంకెట్. మనిషి వాసనంటూ లేని ఆ అద్భుత సౌందర్యం హంటర్ ను ఎంత ముగ్ధుణ్ణి చేసినా ప్రకృతిపట్ల అతడిలో వినమ్రత కలగలేదు అందుకు విరుద్ధంగా అక్కడికి అడుగుపెట్టిన తొలి మనిషి తానే  అయినందుకు (తమకంటే ముందుగా ఆ ప్రాంతాన్ని దాటివెళ్లిన  ఇంకెట్ ను, తన ముందు నడుస్తున్న దావీదును హంటర్ మనుషులుగా లెక్కించలేదు చూడండి) అంతులేని ఉత్సాహం కలిగింది. పదే పదే కన్యల పొందుకోసం తహతహలాడే మగవాడి ఉత్సాహంవంటిది అది. అంత చావు భయంలోనూ హంటర్ కు కలిగిన ఈ అనుభూతి చూశాక అతను మాములు మనిషి కాదని, సాధారణ మనస్తత్వం కాదని మీకు అనిపిస్తుంది.  హంటర్ వ్యక్తిత్వ నిర్మాణం ఇలా ఉండడం వెనుక కారణాలేమై వుంటాయి?

తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. ఎలుగుబంటిలా వుండే తండ్రి వేటలో చనిపోవడంతో తల్లికి వేట అయిష్టం. హంటర్ ని వేటకు దూరం చేయాలని ఆమె  ప్రయత్నించింది. అందుకు విరుద్ధంగా వేటగాడైన తాత తనను  దగ్గరతీసి వేటవైపు దృష్టి మరల్చడంతో క్రమంగా తల్లికి దూరమయ్యాడు. తనకు బాగా తెలిసిన నెమ్మది మనిషైన  పాత తల్లి, క్రమంగా తనకు దూరమై పూర్తి మౌనమై పోయిన ఆమె కొత్తరూపం. యీ రెండు ప్రతిబింబాలమధ్య వైరుధ్యం అతడిని గందరగోళానికి గురిచేసింది, నిరంతర మానసిక సందిగ్దతను లక్షణంగా ఇచ్చింది?

ఇంతకూ ఇంకెట్ ను చంపాడా?

గుబురు పొదల్లోంచి మృగాన్ని గుర్తుపట్టినట్టు ఇంకెట్ ను గుర్తుపట్టాడు. చూడు, ఊపిరి బిగబట్టు, తుపాకీ గురిపెట్టు, గురి సరిచూడు, కాల్చు, ఊపిరి వదిలేయ్… శరీరం బుర్రకంటే వేగంగా పనిచేసింది. సాధారణంగా ట్రిగ్గర్ నొక్కే ముందు మృగం కళ్ళలో తనకు వర్తమానం కనిపించేది, మృత్యువు ముంచుకొస్తోందన్న భావన కనిపించేది. ఇంకెట్ లో అదిలేదు, తప్పించుకునే ప్రయత్నమూ లేదు, వర్తమానం బదులు తెగ భవిష్యత్తు కనిపించింది.

“వాడు తొందరగా యీ లోకం వదలి వెళ్ళడానికి మీరు సాయం చెయ్యాలి. వేటగాడుగా అది మీ ధర్మం” దావీదు బ్రతిమాలుతున్నాడు….

చివరి వందపేజీల నవల చదువుతూ తీవ్ర ఉత్కంఠలో భాగమయ్యే పాఠకులు కూడా యీ భౌతికమైన ప్రమాద భావనను నిజంగా అనుభవిస్తారు.

అమెరికానో, మరో పాశ్చాత్యదేశమో పోవడం అనే గమ్యాన్ని చేరడం దావీదుకు ఎన్నో ఏళ్ల కల. ‘అది నెరవేరింది కానీ ఆ వూరట అతనిలో కనపడడం లేదు. ఈ మార్గంలో అతనేం కోల్పోయాడు?  ప్రాణ స్నేహితుడు ఇంకెట్ ప్రాణాన్ని వేటకు ఫణంగా పెట్టాడు. అది పెనుభారంగా మారి అతడిని కుంగదీస్తోంది.’ ఈ ముగింపు సన్నివేశంతోనే  నవల మొదలవడం ఒక వైచిత్రి.

ఇంతకూ హంటర్ వేట చేసి ఇంకెట్ ను చంపాడా?

ట్రోఫీని భార్యకు కానుకగా తీసుకువెళ్లాడా?

లేక తానే ట్రోఫీ గా మారాడా? నవల చదవాల్సిందే.

                   ***    ****   **** 

నవలలో రచయిత ఎం చెప్పింది?

హంటర్ వైట్  నైతిక సందిగ్ధత కలిగిన వ్యక్తి. తాను నైతిక విలువలను పాటించే వ్యక్తినని నమ్ముతూనే  ‘పొందాల్సిన లక్ష్యం కోసం ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు’ అనే ఉపయోగితావాదాన్ని  అనుసరించేంత ఆధునికుడు. బిగ్ హంటింగ్  ద్వారా వచ్చే భారీ ఆర్థిక రుసుములు నేరుగా స్థానిక పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు తద్వారా  ఆఫ్రికన్ గ్రామాలకు నిధులు సమకూరుస్తాయని  సమర్థిస్తాడు కూడా. ఆ పాత్ర  పాఠకుడిని కూడా ఒక భయంకరమైన నైతిక సందిగ్ధతను ఎదుర్కొనేలా చేస్తుంది

ఎందుకంటే మనం కూడా అటువంటి సందిగ్దతలో బతుకుతున్న వాళ్ళమే కదా.

ఇంకెట్ ను చంపడానికి చేసే  వేట ప్రయాణం ఒక భయంకరమైన మనస్థితితో  చదరంగం ఆటను మించిన ఉద్విగ్నతతో  సాగుతుంది. నిజానికి వాళ్ళు ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడింది కూడా లేదు. ఏమి జరగాలో ముందే  వాళ్ళు నిర్ణయించేసుకున్నట్టు చివరకు గానీ వైట్ కు అర్థం కాలేదు. ఏక పక్షంగా తనను గెలిపించేట్టు సాగిన  ఈ వేట  తన మిత్రుడు వాన్ హీరేన్ ప్రణాళికనేమో అని అనుమానిస్తాడు. నవల చదువుతున్నప్పుడు నాకు మాటిమాటికీ ఏమిలీ జోలా ‘భూమి’ నవల గుర్తుకు వచ్చింది. మొదట ఎందుకో గ్రహించలేకపోయాను. నవల  పూర్తి అయ్యాక అర్థమైంది ఏమంటే యీ రెండూ  అస్తిత్వవాద (existentialist ) నవలలు.

పాశ్చాత్య మగ దురహంకారాన్ని ఈ నవల ఎండగట్టింది అన్నారు విమర్శకులు. అంటే ఏమిటి? ఏ అర్థంలో…

నవలలోని కొన్ని వాక్యాలు, కొన్ని పాత్రల అంతరంగం దాన్ని విశదపరుస్తుంది మీరే చూడండి.

“0577 నైట్రో ఎక్స్ ప్రెస్ పెద్దతుపాకీ వాడకం మగతనానికి సంకేతం అని భావిస్తాడు హంటర్. అతని శరీరమంతా దాడిచేసేందుకు సిద్ధమైంది. పంచేంద్రియాలలోని చేతన తారాస్థాయికి చేరింది. చుట్టూ వున్న ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. ప్రమాదం అతి దగ్గరలో పొంచి వున్నప్పుడు తన అసలైన అస్తిత్వం ఏదో బయట పడుతుంది. తాను నిజమైన మగాడు.”

“ప్రమాదకరమైన ప్రాచీనమైన శక్తివంతమైన భారీ క్రూరమృగం ఎదురుగా నిలబడి నీకంటే నేనే శక్తివంతుణ్ణి అంటూ దానికళ్లలోకి చూస్తాడు. ట్రిగ్గర్ మీద వేలుకదిలించి దాని జీవితం అంతం చేసే శక్తి తనచేతిలో ఉంది. భూమ్మీద సంచరించే అన్ని జీవజాలాలకి పై ఎత్తున తాను నిలబడతాడు.”

వేటగాడుగా హంటర్ కు తన తాత ద్వారా అందిన కొన్ని  విశ్వాసాలు, పాటించే నియమాలు ఉన్నాయి. మృగాని కుండే ప్రత్యేక అస్తిత్వాన్ని గౌరవించడం, ఓర్పుతో వేచి చూడడం. నిర్దేశించుకున్న లక్ష్యం నుంచి దృష్టి మరల్చకుండా నిగ్రహంగా ఉండడం వంటివి ఆ నియమాలు. వేటలో గొప్ప అనుభూతి కలగాలంటే వేటగాడు-మృగం ఒకరికొకరు సమఉజ్జీలు అయి వుండాలన్నది హంటర్ వైట్ నిశ్చితాభిప్రాయం.

వేటకు పోతున్నప్పుడు రైనో కోసం వెతికితే జాడ దొరకలేదు. సింహాల గుంపు కనిపించింది అందులో వయసుకొచ్చిన అందమైన ఒక మగసింహం కనిపిస్తుంది. ‘ఈ సంవత్సరం నా సింహాల లైసెన్స్ కోటా ఇంకా మిగిలుంది. వేట చేస్తావా?” అని వారెన్ అడుగుతాడు.

అప్పుడు హంటర్ జవాబు. “కావాలంటే ఆ సింహం సంగతి రెండేళ్ల తరువాత చూద్దాం. నా కోసం పక్కన పెట్టు ఇంకా అందంగా తయారౌతుంది.”

సరిగ్గా స్త్రీల గురించి  సాధారణ మగవాడి నోటినుంచి  వ్యక్తమయ్యే భాష ఇది. అనేక సందర్భాల్లో పదే పదే ఆ భావన అతడి మాటల్లో  వ్యక్తమౌతూ వుంటుంది.

“ఒకానొక ఆఫ్రికా ట్రిప్ లో జిరాఫీని వేటాడి దాని తలను భార్యకు ట్రోఫీగా తెచ్చాడు. తన గొప్ప మగతనానికి సాక్ష్యంగా జిరాఫీతో పాటు అమెను కూడా వేటాడి సొంతం చేసుకోబోతున్నట్టు, వేటలో వాంఛ కూడా కలిసున్నట్టు ఆమెకు తెలిసేలా ఆ బహుమతినిచ్చాడు. ఆ జిరాఫీని వేటాడుతున్నంత సేపూ ఆరోజంతా తెలీని కోరికతో ఒళ్ళంతా మగతనం నిద్రలేచి నిలబడినట్టుండింది.”

“రైనోలకు వినికిడి శక్తి, వాసన శక్తి అమోఘం. అందుకనే వేటగాళ్ళు గాలి ఎదురుదిశలో నడుస్తారు. ఒకసారి మనిషి వాసన రైనోకు తగిలితే ఇంకా వేట ముగిసిపోయినట్లే. మీదికి వచ్చిందంటే ఆ భారీ మృగాన్ని ఆపడం సాధ్యం కాదు. మృతువు మీద పడినట్లే. తుపాకీ వాడినప్పటికీ చాలా దూరం నుంచి ఎన్నడూ వేట చేయడు. హంటర్ వేట ప్రత్యకత ఏమంటే జంతువుకు వీలయినంత  దగ్గరగా పోతాడు. చివరి క్షణంలో దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూసేందుకు తహ తహలాడతాడు.

తన మీదకు దాడిచేసేలా రెచ్చగొడతాడు. ప్రమాదాన్ని పసిగట్టే శక్తి దానికి ఎంతవుందో తెలుసుకోవాలను కుంటాడు. తుపాకీ ట్రిగ్గర్ నొక్కే ముందు కామవాంఛ లాంటి అనుభూతి ఏదో అతనికి కలుగుతుంది. అది అతనికి అమితానందాన్ని ఇస్తుంది.”

ట్రోఫీ వేట వన్యప్రాణుల సంరక్షణకు, మనుషులవేట సంపద సృష్టించేందుకు!

హంటర్ వైట్ వ్యక్తిత్వం:

హంటర్ వైట్ రెండు వ్యతిరేక భావనల మధ్య ఊగిసలాడే వ్యక్తి. నిజానికి అతనికి వాస్తవాలు స్పష్టంగా తెలుసు.  మొదటిది ప్రవృత్తికి సంబంధించినది, రెండవది అతని వృత్తికి. వేటలో తనేదో గొప్పగా చేస్తాననుకుంటున్న సాహసం  మిధ్య అన్న విషయం హంటర్ కూ తెలుసు. పురాతన ఆటవికుల్లాగా తానేమీ కష్టపడి, శ్రమపడి వేటాడడం లేదు. వాన్ హీరేన్ సఫారీ కంపెనీ అన్నీ అమర్చి పెడుతుంది. ట్రాకర్లు వెంటవచ్చి మృగం ఎక్కడవుందో చూపెడతారు. వేట దినాలకు సరిపడా తిండి జీపులో ఉంటుంది. కాఫీ, విస్కీతో సహా అన్నీ అడవిలో సమకూర్చి పెడతారు. మిధ్య అని తెలిసినా  కానీ అందులో వాస్తవాన్ని మించిన ఆకర్షణయేదో ఉంది. షేర్ బజార్ అనబడే అడవి సృష్టించిన మిధ్యా ప్రపంచాన్ని ఆసరా చేసుకుని డబ్బు సంపాదించడం హంటర్ వృత్తి. డబ్బుతో జాగ్రత్తగా గాలిలో కోటలు కట్టించి అమ్మడం అతని పని. సింహాలు దాడిచేసే ముందు తోక చివరను గాల్లో ఊపినట్టు షేర్లు కూడా  అలా సంకేతాలు ఇవ్వడం మొదలుపెడితే మరుక్షణం మార్కెట్లు కుప్పకూలతాయి. ఎప్పుడు ఏం జరగబోతోందో అతను  ఊహించగలడు. అందుకనే విజయవంతమైన వ్యాపారవేత్త అయ్యాడు. వేటలోనైనా, వ్యాపారంలోనైనా పరిశీలన, ఏకాగ్రత ఎంత అవసరమో తెలిసినవాడు హంటర్. రచయిత్రి చూపిన అద్భుతమైన యీ పోలికను పట్టి పట్టి చూడండి. రెండుచోట్లా వేటగాళ్ల వేటకు బలి అయ్యేది నోరులేని జంతువులో, బలహీనులైన మనుషులో.

పెట్టుబడిదారులకు మొన్నటి దాకా భూమి మాత్రమే సరుకు ఇప్పుడు వన్యప్రాణులు / పర్యావరణం/ అడవులు కూడా సరుకే. అది గ్రహించిన హంటర్ ఇప్పుడు దేశ దేశాల్లో ప్రకృతి వనాలు, నేచర్ పార్కులు కొని ‘ప్రకృతిని సేకరిస్తున్నాడు’. రాబోయే రోజుల్లో కొత్త కరెన్సీ అంటే అదే. ప్రకృతితో నిండిన నిర్జనప్రదేశాలు భవిష్యత్తులో బంగారం కింద మారబోతున్నాయి.

“దుప్పిని బాణంతో కొడుతున్నప్పుడు ఇంకెట్ మనిషిలా కాకుండా చేజిక్కించుకోవాల్సిన గొప్ప ట్రోఫీలా కనిపించాడు.”

హంటర్ వైట్ చేసే వేటకు ఎరగా, వేట మృగంగా

మారడానికి ఇంకెట్ ఎందుకు ఒప్పుకున్నాడు? మరణం అక్కడ ఎందుకంత చవకైంది?

వాస్తవ కారణాన్ని హీరేన్ పాత్ర చెబుతోంది “కనీసం ఇరవై వేల ఏళ్లుగా వాళ్ళ జాతి ఈ నేలమీద బతుకుతోంది. ఈ నేల వాళ్ళ స్వంతం. మన పూర్వీకులు వాళ్ళను ఇక్కడినుంచి తరిమారు. వాళ్ల భూమిని లాక్కున్నాము. వాళ్ళను నగరాలకు, పట్టణాలకు తరిమాం. మూడు తరాలుగా ఇక్కడి గొప్ప వేటగాళ్లందరూ పట్టణాల్లో బతకడం తెలీక తాగుబోతులై, మాదకద్రవ్యాలకు బానిసలై సర్వనాశనం అవుతున్నారు. ఎయిడ్స్ బారిన పడ్డారు”

ఆధునిక వలస రాజ్యాలుగా మారిన ఆఫ్రికాలో యీ విస్తాపన వల్ల కొంతమంది మూలవాసులు నగరాలకు తరలిపోగా మిగిలిన పల్లెలు, కాలనీలు  ‘సెటిల్మెంట్లు లేదా క్యాంపులు’ అయ్యాయి. అందులోని నల్లవాళ్ళు  బుష్ మెన్ లు అయ్యారు. వాళ్ల నేలను ఆక్రమించి, వాళ్ళ వనరులను గుంజుకుని, వాళ్ళను అడవుల నుంచి తరిమేసి తిరిగి వాళ్లనే సెటిలర్లుగా పిలిచే సామ్రాజ్యవాదపు బరితెగింపును గమనించారా? (మీకు పాలస్తీనా గుర్తుకు రావడంలేదూ?) మనుషులుగా వాళ్లకు  ఏ హక్కులూ వుండవు. పేదరికం తప్ప ఏ సదుపాయాలు వుండవు, అవకాశాలూ వుండవు. ఆ ప్రాంతంలో ఏ క్రిమినల్  చర్య జరిగినా ప్రభుత్వం/ పోలీసుల మొదటి టార్గెట్ బుష్ మెన్ లే. పోచర్లతో / జంతు స్మగ్లర్లతో అక్రమ ఒప్పందం పెట్టుకొని ఆ కేసుల్లో కూడా బుష్ మెన్ లనే  అరెస్టు చేసి జైళ్లకు తోస్తారు. ఆకలి, కేసులు,, జైళ్లు..ఇలా  అన్ని విధాలుగా చావుకు సిద్ధమైన జీవితం సెటిల్మెంటు మూలవాసులది. అందుకనే ఇంకెట్ లాగా వేటకు ఎరగా మారి ‘బిగ్ సిక్స్ హంట్ ‘ లో చావుకు సిద్ధమౌతారు. తద్వారా తెగలో మిగతా వాళ్ళయినా బాగుపడతారన్న ఆశ వాళ్ళను ఒప్పిస్తుంది.

సగటు ఆఫ్రికా వాడి లక్ష్యం  బీద దేశం నుంచి యూరప్ కో, అమెరికాకో… దూరం వెళ్లిపోవడం. తేళ్లు, పాములు దూరని ఇళ్ళు, పిల్లలకు సరియైన చదువులు వుండే దేశానికి. అది డ్రైవర్ జీన్స్ కయినా, మూలవాసి దావీదు కయినా “ఒక్కసారి ఓడెక్కి సముద్రం దాటేస్తే… ఇక డబ్బులే డబ్బులు “ అన్నది వాళ్ళ కల. ఇంతకాలం యూరోపియన్ శ్వేతసమాజం  ఆఫ్రికన్ల  శరీరాలను  కేవలం శృంగార వస్తువులుగా ( sex toys) మాత్రమే చూసే ఒక దృష్టిని  స్థిరీకరించి ఉన్నది. అందుకు భిన్నమైన జీవితాన్ని  యీ నవల మనముందు పెడుతుంది. మొత్తం నవలలో  నాలుగే ప్రధాన పాత్రలు. హంటర్ వైట్, వాన్ హీరేన్, ఇంకెట్, దావీదు. కేవలం పరోక్ష ప్రస్తావనగా వచ్చే హంటర్ వైట్ భార్య తప్ప మరొక  స్త్రీ పాత్ర లేదు.

హంటర్ భూస్వామ్య కాలపు వేటగాడు కాదు,  ఆధునికుడు. వ్యక్తిగత సాహసంగా భావిస్తూ అతడు చేసే వన్యప్రాణి హననానికి సామాజిక నైతికత అడ్డుపడుతున్నది. తన్నుతాను సమర్థించుకోడానికి అతనికో వాదన అవసరం.  “వేటకు వయసుపైబడిన రైనోను ఎంచుకున్నాను. దాని జన్యువులు ఏ మాత్రం పనికిరావు. బతికివుండడం వల్ల మందకు ఏ ప్రయోజనం లేదు, పైగా తలనొప్పిగా తయారౌతుంది. ఆడ రైనోలు దానితో కూడడానికి ఇష్టపడవు. అది చికాకుతో మిగతా మగరైనోలమీద ఊరుకురికే యుద్దానికి వెళుతుంది. దీన్ని చంపేస్తే మొత్తమ్మీద మంచే జరుగుతుంది.” తనకు తాను సర్దిచెప్పుకునే  వాదన ఇది.

“చాలా కాలం తరువాత మంచి అనువాదం చదివానన్న ఫీల్ ఇచ్చింది ఈ పుస్తకం. చాలా సరళమైన అనువాదం. నా ఫెవరేట్ సహవాసిని గుర్తుకు తెచ్చింది”

ఇలా హంటర్ వైట్ ప్రపంచం ఎప్పుడూ అనేక  సందిగ్ధాల మధ్య నడుస్తూ వుంటుంది. పోచర్లు చంపబోతున్న తన రైనోను రక్షించాలనుకుంటాడు. “ నీ ఎరగా ఉన్న  రైనోను వాళ్లనుంచి దాన్ని  కాపాడడం దేనికి  ఆ తరువాత  దాన్ని నువ్వు చంపడం కోసమేగా? అని డ్రైవర్ జీన్స్ అడుగుతాడని అనిపించింది. వేట, అక్రమంగా చంపడం మధ్య తేడా ఎంత వుంది? మీదికి ఉరికివచ్చే మృగాన్ని ఫారెస్టు రేంజర్లు చంపితే ఆత్మరక్షణ! అదే పని  పోచర్లు చేస్తే  నేరం. పోచర్లు రేంజర్లను కాల్చిచంపితే హత్య, రేంజర్లు పోచర్లను కాల్చిచంపితే ఆత్మరక్షణ! కాల్చిన బుల్లెట్లు అన్నీ ఒకటికాదు. ప్రపంచం అంతా అటువంటి సిద్ధాంతాలమీదే నడుస్తోంది.

ఆఫ్రికా అంటే కేవలం వేటస్థలం మాత్రమే అనుకునే శ్వేత జాతి మనో వైఖరే హంటర్ వైట్. వాళ్ళది కేవలం జంతువుల వేట కాదు, ఖనిజాలవేట, మానవ వనరులవేట. నయా వలసవాదుల పెట్టుబడి వేట అంతిమంగా లాభాల వేట.

“వీళ్ళని గనక మృగాల కింద లెక్కకడితే అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ తాను ఏటా ప్రచురించే అత్యంత వేగంగా క్షీణించిపోతున్న జంతుజాతుల కింద ఇంకెట్ జాతిని కూడా చేర్చాలి. అప్పుడు వీళ్ళను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకునేవాళ్ళు. కానీ వీళ్ళు మనుషులు కాబట్టి ఎవరికీ లెక్క లేకుండాపోయింది.  పోలీసుల చేతుల్లో పడే హింస, వాళ్ళ చేతుల్లో చావడం, వాళ్ళను ఎత్తుకెళ్ళి బెదిరించడం రోజువారీ వ్యవహారాలు. మానవ హక్కుల సంస్థలు పదే పదే అత్యున్నత న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసినా బుట్ట దాఖలు అయ్యాయి. ఫిర్యాదు చేసినవాళ్ళు బెదిరరింపులకో, హత్యకో గురయ్యారు. అంతర్జాతీయ న్యాయవాదులు ఎవరైనా కేసువాదించడానికి వస్తే  మళ్లీ దేశంలోకి రాకుండా బహిష్కరించారు. మూలవాసుల  భూములు లాక్కునే ప్రక్రియలో విపరీతంగా డబ్బు చేతులుమారింది. వాళ్ళ జీవనవిధానం అభివృద్ధి చర్యలకు అడ్డొచ్చింది, మరీ ముఖ్యంగా ఖనిజాలను వెలికి తీసేందుకు.” స్కోటర్స్ ఆఫ్రికన్ మూలవాసుల గురించి రాసిన ఈ వాక్యాలు మనదేశపు ఆదివాసుల గురించి రాసిందేమో అనిపిస్తున్నది కదూ. ఒకప్పుడు అడవులతో పచ్చగా శ్వాసించిన భారతదేశపు ఊపిరితిత్తులైన దండకారణ్యం యిప్పుడు  ఖనిజాలవేటలో మట్టిగొట్టుకొని పోయి రోడ్లను వంపు వంపు నాలుకలుగా చాచిన మహారాక్షసి వలె కనిపిస్తున్నది. మనం కూడా  ఆఫ్రికావలె మారడానికి ఎంతో దూరంలో లేమని చెబుతున్నది.

మరి!  ఏం చేద్దాం మనం.

Leave a Reply