దేశమంతా ఓట్ చోరీతో అట్టుడికిపోతోంది. ఊహించని శిబిరాల నుంచి ప్రతిస్పందన వస్తోంది. విద్యార్థి యువజనం దేశాన్ని కొత్త చరిత్రలోకి నడిపిస్తోంది. దేశమంతా వీధుల్లోకి వచ్చేస్తోంది. ప్రతి కూడలీ చైతన్య శిక్షణా శిబిరంలా మారిపోతోంది. ఇదంతా నిస్సందేహంగా గొప్ప హామీ. భయంలో కూరుకపోయిన దేశం నిర్భయంగా నిటారుగా లేచి నిలబడింది. ఫర్వాలేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం అనే భరోసా కలుగుతోంది.
ప్రజాస్వామ్యమంటే రాజకీయ ప్రజాస్వామేనా? అందునా ఓటు ప్రజాస్వామ్యమేనా? అనే ప్రశ్న దాకా వెళ్లకుండా, ఓటరు జాబితా పునరుద్ధరణ, ఓట్ చోరీకి పాల్పడ్డ ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా వగైరా తక్షణ డిమాండ్లతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిరక్షణ అత్యవసరంగా మారింది.
ఈ సంరంభానికి ఆవల ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో సన్నివేశం నడిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల గల్లంతు ఉధృతంగా సాగింది. ప్రతిపక్ష పార్టీ నాయకులను, గత మంత్రులను, ఎంపీలను సహితం ఇండ్లలోంచి బైటికి రాకుండా అడ్డుకున్నారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన అభ్యర్థుల మీద దాడులు చేశారు. దాఖలైన నామినేషన్ పత్రాలను అధికారుల నుంచి లాక్కొని చించేశారు. ఇవన్నీ అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులో, అభిమానులో చేసిన చిల్లర పనులు కావు. పోలీసులు కూడా ముమ్మరంగా పాల్గొన్నారు. యూనిఫాంలోనే, నడి వీధుల్లోనే ఇవన్నీ చేశారు. లేదా టీడీపీ వాళ్లు చేస్తోంటే మురిపెంగా చూస్తుండిపోయారు.
ఇంతా జరుగుతోంటే అధికారపార్టీ అనుంగు పత్రికల వాళ్లు, టీవీ చానళ్ల వాళ్లు, ఆ పార్టీ పెంపుడు పాత్రికేయులు మరో కథనాన్ని వైన వైనాలుగా ప్రచారంలో పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేస్తోంటే, పరమ పవిత్రమైన ఎన్నికల ప్రక్రియలను అపహాస్యం చేస్తోంటే టీడీపీ శ్రేణులు ప్రాణాలకొడ్డి అడ్డుకున్నాయని దాని సారాంశం.
దేశంలో బీజేపీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ఇదొక ఆభాస అనుకుందామా?
కానీ నరేంద్రమోదీలాగే చంద్రబాబు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టాడనే ప్రచారానికి లోటు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ రాజ్యం నడుస్తోందని గిట్టని వాళ్లు ఆరోపిస్తున్నప్పటికీ, పార్లమెంటరీ రాజకీయాలను ఓట్ చోరీ దగ్గరే ఆపకుండా ఇంకా ముందుకు తీసుకపోయిన ఘనత మాత్రం చంద్రబాబుదే.
పై వాక్యంలోని ‘పార్లమెంటరీ రాజకీయాలు’ అనే మాట చాలా మంది మనోభావాలను దెబ్బతీయవచ్చు. సమయ సందర్భాలు లేని బండ వాదన అని ఎగతాళి చేయవచ్చు. ఫాసిస్టు వ్యతిరేక సందర్భం తెలియదని ఆరోపించవచ్చు. ఇట్లా అనబోయేది ఓట్ చోరీ చేసిన సంఘ్ బ్యాచ్ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్లను అడ్డుకుంటున్న టీడీపీ బృందాలు కాదు. గౌరవనీయ పెద్దమనుషులే ఆ మాట అనవచ్చు. ఓట్ చోరీకీ, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలకూ పోలిక ఏమిటి? అనే తర్కానికి దిగవచ్చు. జ్ఞానేష్కుమార్కూ, అనిల్ చంద్ర పునేఠాకూ పోటీ ఏమిటి? అనవచ్చు. ఓట్ చోరీ వ్యతిరేక ప్రజాస్వామ్య ఉద్యమానికి తూట్లు పొడవడంగా భావించవచ్చు.
ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందే. ఇవ్వవలసిన వాళ్లకు మినహాయింపులు ఇవ్వాల్సిందే. అంతెందుకు? చంద్రబాబు వెనుక మోదీ ఉన్నాడుగాని, మోదీ వెనుక ఉండే ఆరఎసఎస్ అయితే లేదు కదా? అని తేడాల రాయితీలు కూడా ఇవ్వండి.
కానీ 13 కోట్ల మందిని గల్లంతు చేసిన ఓట్ చోరీలో, ఏపీలోని నామినేషన్ల గల్లంతులో ఉన్న ముఖ్యమైన పోలికలను మాత్రం విస్మరించలేం. అదైనా, ఇదైనా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని పెడ ధోరణి కాదు. వ్యవస్థీకృతమైన సహజ లక్షణం. కార్పొరేట్ హిందుత్వ ఫాసిజంగా మారడానికి ముందు నుంచే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ సహజ లక్షణంతో వర్థిల్లుతోంది. ఇప్పుడు భారీ స్థాయిలో జరుగుతున్నవన్నీ కోటానుకోట్ల సూక్ష్మ రూపాల్లో ప్రతి ఊళ్లో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో జరుగుతున్నవే.
వార్డు స్థాయిలో నచ్చని ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించడం, అవతలి పార్టీకి ఓటు వేసేవాళ్లను పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లకుండా అటకాయించడం, పోలింగ్ ఏజెంట్లను ఎత్తుకపోవడం, ఓడిపోతామేమో అనే భయంతో బ్యాలెట్ బాక్స్‌లను చోరీ చేయడం, ఇష్టమైన ఎన్నికల అధికారులనే విధుల్లో పెట్టుకోవడం, వాళ్లను మాలిమి చేసుకొని పనులు చక్కబెట్టుకోవడం, వీటన్నిటికంటే ముందే ప్రత్యర్థి నామినేషన్దారు తుప్పల్లో, వాగుల్లో శవమై తేలడం..ఒకటేమిటి? ఇప్పుడు హిందుత్వ ఫాసిస్టుల వల్ల ఎన్నికల ప్రజాస్వామ్యానికి వచ్చిన ముప్పు ఎన్ని దశాబ్దాల కిందటిది? ఎన్నెన్ని రూపాల్లో అది వెంటాడుతోంది? ఇదేదో పుట్టుమచ్చల్లాంటి అపవాదు కానేకాదు. పుట్టడమే మన ఎన్నికల ప్రజాస్వామ్యం ఇట్లా పుట్టింది. అది బతికి బట్ట కట్టగల పర్యావరాణాన్ని చరిత్ర, సంస్కృతి అందించాయి. దానికి మన ఉదారవాదం ఎంత వైద్యం చేయాలో అంతా చేసింది. దాన్ని బాగు చేయడానికి నానా తంటాలు పడింది. చెయ్యరాని ప్రయోగాలు చేసింది. చరిత్ర వల్ల మనకు ఇదే ‘ప్రాప్తం’ కాబట్టి దీన్నే బాగు చేసుకుందాం! ఇంతకంటే ఇంకేం చేయగలం? అనుకుంది. కానీ దాని బై ప్రొడక్ట్‌గా ఫాసిజం అవతరించింది. ఇప్పుడు అంతా అదే అయిపోయింది. చోరీ అనేది ఈ కాలపు రాజకీయ నుడికారం. అది గాలిలోంచి రాలేదు. ఆదాటున రాలేదు. చోరీ లేకుంటే మన ప్రజాస్వామ్యమే లేదు. నరేంద్రమోదీ, అమిత్‌షా, చంద్రబాబునాయుడు, జగన్మోహన్రెడ్డి, పవన్‌కళ్యాణ్.. ఇట్లా ఎందరో అక్కడి నుంచి పుట్టుకొచ్చారు. తెలిసిన వాళ్లయితే ఈ జాబితాను ఇంకా పొడిగించవచ్చు. అదొక విపరిణామం కానే కాదు. మిగతా పార్టీలకూ ఆరఎసఎస్కూ ఉన్న తేడా వల్ల ఇప్పుడు అదొక తీవ్ర విపత్తుగా మారింది. మహా విధ్వంసంగా మారింది.
గతంలో ఎన్ని జరిగినా, ఏకంగా పదమÖడు కోట్ల మంది ఓటర్లను గల్లంతు చేయడం కనీవినీ పరిణామం. సాధారణ ఎన్నికల రాజకీయ నాయకులకు ఇది సాధ్యం కాదు. ఫాసిస్టులే ఈ పని చేయగలరు. నరేంద్రమోదీ తనకు ఇష్టం లేని వాళ్లను, ముఖ్యంగా ముస్లింలను ఓటరు జాబితా నుంచి తొలగించడం తాను శాశ్వతంగా పదవిలో ఉండటానిని మాత్రమే కాదు. మరే పార్టీ అధికారంలోకి వచ్చినా సమాజాన్నీ, రాజ్యాన్నీ హైందవీకరించే పని గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోడానికి.
దీనికి బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలం పునాది. ముస్లిం వ్యతిరేక మెజారిటీ ఫాసిస్టు రాజకీయాలు ఆధారం. అంతకంటే భారత పార్లమెంటరీ స్వభావమే కారణం. ఇంత కాలం పల్లెల్లో జరిగిన పనులను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్‌లోనే చేసింది. ఇవిఎంలతో చేస్తోంది. ఆ రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు ఇంకా పాత పద్ధతుల్లో ఉన్నట్లే. స్థానిక సంస్థల నామినేషన్లలో కండబలాన్ని, కాకీ బలాన్ని మాత్రమే ఉపయోగించాడు. కాకపోతే ఇప్పుడు దేశంలో జరుగుతున్న వాటిల్లో చాలా వరకు చంద్రబాబు నాయుడే మొదలు పెట్టాడు. అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజల అనుభవంలోకి చాలా ముందే వచ్చాయి. ఆ తర్వాతే దేశమంతా విస్తరించాయి.
అందుకే ఇదంతా రాజకీయ గూండాల ‘భ్రష్ట’ రాయలసీమలోనో, బీహార్లోనో, పశ్చిమ బెంగాల్లోనో, ఉత్తరప్రదేశ్‌లోనో తప్ప దేశంలో ఇంకెక్కడా లేదని.. వివరాల మీద, అంకెల మీద ఎక్కువగా ఆధారపడే వాళ్లు అసలే చెప్పలేరు.
‘ఎన్నికల నామినేషన్ల సమయంలోనే ఇంత దుర్మార్గానికి పాల్పడతారా?’ అని టీడీపీని ప్రశ్నిస్తే, ఆ పార్టీ పాత్రికేయుల దగ్గరి నుంచి గతంలో వైసీపీ చేసిన పనులు మీకు కనపడటం లేదా? ఆ పార్టీ తరపున మాటాడుతున్నారా?’ అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు.
ఇదీ అసలు విషయం.
వీళ్లు వేలెత్తి చూపిస్తున్నది వైసీపీనో, ఇంకో పార్టీనో కాదు. భారత ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని. ఆ రోజు వాళ్లూ ఈ ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్యం తరపున అన్ని పనులు చేశారు. వాళ్లు చేశారు కాబట్టి ఈరోజు వీళ్లూ అవన్నీ చేయవచ్చు. చేతనైతే ఇంకొన్ని ఎక్కువ కూడా చేయవచ్చు. బైటికి వీర ప్రత్యర్థుల్లా ఇంతగా కొట్లాడుకుంటారు కదా? చేసే పనులన్నీ ఒకటే. చక్కగా ఒకే తరహా పనులు వంతుల వారీ చేస్తుంటారు.
మన ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఓట్ చోరీ, నామినేషన్ల చోరీ మాత్రమే లేవు. అసలు పోటీయే చోరీ. అంతగా నిత్యం కీచులాడుకొనే పార్టీల మధ్య లెక్కలేనన్ని ‘ఏకగ్రీవాలు’ ఉన్నాయి. ‘చోరీ’ అనేది ఒక చర్య మాత్రమే కాదు. విస్తృత రాజకీయార్థిక సాంస్కృతిక భావన. ఏకగ్రీవం కూడా అంతే. స్థానిక సంస్ధల ఎన్నికల్లో మంత్రులు, మాజీ మంత్రులు.. అటూ ఇటూ పెద్దమనుషులంతా కలిసి చేసుకొనే ఒప్పందం మాత్రమే కాదు. ‘ప్రచారమనీ, ఓటుకు ఇంత అని ఇద్దరం ఖర్చు పెట్టుకోవడం దేనికి? ఆ డబ్బేదో మనమే పంచుకుందాం!’ అనేంత చిన్న విషయం కాదు.
‘ఏకగ్రీవం’ అనే భావనే లేకుంటే భారత పార్లమెంటరీ రాజకీయాలు ఇంత సజావుగా నడిచేవే కాదు. ఇంకెన్ని విపరీతాలు జరిగేవో? అసలు ఎన్నడో బద్దలైపోయేవి. ఏకగ్రీవమే లేకుంటే, అందులో దారప్పోగు మందాన ఉండే ‘ప్రజాస్వామ్యం’ పుటుక్కున తెగిపోయేది. లేదా ఈ పార్టీలన్నీ కలిసి తెగిపోయేదాకా లాగేవి. కానీ అది విజ్ఞుత కాదని ఆ పార్టీల నాయకులకు తెలుసు. అందరికంటే మోదీకి మాబాగా తెలుసు. అందుకే తెగిపోయినట్లు కనిపించినా ఎప్పటికప్పుడు ముడేస్తూ ప్రజాస్వామ్యాన్ని లాక్కెళుతున్నారు. అది ఎంత అవసరమో, అది లేకపోతే ఎంత ప్రమాదమో మనకంటే వాళ్లకే బాగా తెలుసు మరి!.




