దేశ వ్యాప్తంగా ఒకవైపు సర్ వ్యతిరేక ఆందోళనల్లో భాగమవుతున్న ఆయా యూనివర్సిటీల విద్యార్థులు మరోవైపు వారి క్యాంపసుల్లో పెట్రేగుతున్న కాషాయికరణ, ఆర్ ఎస్ ఎస్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు.విద్యార్ధుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలతో మరోసారి వర్శిటీలను ఉద్యమాలకు వేదికలు చేశారు.విద్యార్థి సంఘం ఎన్నికలు జరపాలని, క్యాంపస్ లలో ప్రజాస్వామ్య వాతావరణంకై,అడ్మిషన్ లలో రిజర్వేషన్ రోస్టర్ కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై చర్యలు చేపట్టాలని,కులోన్మాద హత్యలు ఆపాలని, యూనివర్సిటీలను  నిర్బంధ క్యాంపులుగా మారుస్తున్న వర్శిటీ యాజమాన్యాల నియంతృత్వ పోకడలను నిరసిస్తూ, దేశ రాజధానితో పాటు వివిధ రాష్ట్రాలలోని యూనివర్సిటీల విద్యార్థులు తమ  హక్కులకై , క్యాంపస్ లలో సంఘ్ పరివార్ జోక్యాన్ని నిరసిస్తూ ఏక కాలంలో పోరాటాలు చేపట్టడం స్వాగతించాల్సిన విషయం.

విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్రాలు.ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం ఆక్షేపణీయం.కానీ ఎన్డిఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్శిటీలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైస్ ఛాన్సలర్  నుండి బోధనా సిబ్బంది వరకు సంఘ్ పరివార్ కు సంబంధించిన వ్యక్తుల నియామకం జరిగింది. కాషాయికరణకు మూలమైన నూతన జాతీయ విద్యా విధానం అమలుతో తీవ్ర వైరుధ్యాలు ఏర్పడి నిత్యం విద్యార్థులు ఏదో విధంగా  కష్ట నష్టాలకు గురవుతున్నారు.

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో గుర్తింపు విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆధ్వర్యంలో 17 మంది విద్యార్థులు అక్టోబర్ మూడవ తేదీ నుండి నిరాహారదీక్ష చేశారు. వర్శిటీలో CPO మాన్యువల్‌ను వెనక్కి తీసుకుని, జేఎన్‌యూఎస్‌యూ కార్యవర్గ సభ్యుల బహిష్కరణను రద్దు చేయాలని,వసతిగృహాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని,హాస్టళ్ల ను పునరుద్ధరించాలని, లైబ్రరీలో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలని, వర్శిటీలలో కుల వివక్షత రూపుమాపేందుకు రోహిత్ చట్టం చేయాలని , జేఎన్‌యూఎస్‌యూ నిధిని పునరుద్ధరించి, అకడమిక్ కౌన్సిల్‌లలో ప్రాతినిధ్యం కల్పించాలని ,హాస్టల్ కేటాయింపుల్లో రిజర్వేషన్‌ను సక్రమంగా వర్తింపజేస్తూ, పీహెచ్‌డీ సమర్పించే వరకు అందరికీ హాస్టల్ వసతిని కల్పించాలని , ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు వసతి సౌకర్యం తదితర డిమాండ్ల సాధన కొరకు 17 రోజులు సాగిన ఈ నిరాహారదీక్ష అనంతరం యాజమాన్యం దిగివచ్చి డిమాండ్లను అంగీకరించింది.

   ఈ దీక్ష ముగిసి వారం రోజులు గడవకముందే బిర్సా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరో నిరసన ప్రారంభమైంది.వర్శిటీ ఇటీవల పిహెచ్ డి అడ్మిషన్ లలో యస్సీ ,యస్టీ రిజర్వేషన్ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులు దీక్షా శిబిరాన్ని ప్రారంభించి నేటికి ఆందోళనకొనసాగిస్తున్నారు.ఈ ఆందోళనలకు వివిధ వర్శిటీల విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు.

దేశ రాజధానిలో మరో ప్రతిష్టాత్మకమైన జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం (Students’ Union) ఎన్నికల పునరుద్ధరణ కోసం అక్టోబర్ 12, 2026 నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి సంఘాన్ని (JMISU)పునరుద్ధరించాలని, యూనివర్సిటీ చీఫ్ ప్రాక్టర్ తొలగింపు, విద్యార్థులపై పెట్టిన సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్లతో 14 రోజులకు పైగా  విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అక్టోబర్ 24న, నిరసన శిబిరాలను తొలగించడానికి భద్రతా సిబ్బంది ప్రయత్నించడంతో విద్యార్థులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది.విశ్వవిద్యాలయ యాజమాన్యం కావాలని అన్ని కోర్సుల తరగతులను ఆన్‌లైన్‌లోకి మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. లైబ్రరీ, క్యాంటీన్ సదుపాయాలను తాత్కాలికంగా మూసివేసింది. యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు విద్యార్థుల మధ్య జరిగిన చర్చల తర్వాత, విద్యార్థి సంఘం రాజ్యాంగం ఆమోదించిన 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించుకున్నారు.అయినా హామీల అమలు కొరకు తమ పోరాటం నిత్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (SRFTI) క్యాంపస్‌లో ఆర్ ఎస్ ఎస్ జోక్యాన్ని వ్యతిరేకించిన విద్యార్థి సంఘం నాయకులను బహిష్కరించడం దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది.ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రత, వర్శిటీలో రాజకీయ జోక్యం , యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణా చర్యలపై తీవ్రస్థాయిలో ఆందోళనలు  జరుగు తున్నాయి.సెప్టెంబర్ 27న క్యాంపస్ మెయిన్ ఆడిటోరియంలో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ గ్రాహక్ పంచాయితీ (ABGP) ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.క్యాంపస్‌లో హిందుత్వ మత రాజకీయ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంపై విద్యార్థి సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విద్యార్థులపై, బయటి నుంచి వచ్చిన సంఘ్ పరివార్ కు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తమపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారని, కొందరు విద్యార్థులు గాయపడ్డారని విద్యార్థి సంఘం ఆరోపించగా,  ఆందోళనల సందర్భంగా వైస్ ఛాన్సలర్ (VC) సంతోష్ అజ్మీరా కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆరుగురు విద్యార్థులను ఏడాది పాటు ఇన్‌స్టిట్యూట్ నుండి బహిష్కరించడం (Rusticated) జరిగింది . దీంతో విద్యార్థులు వరుస ఆందోళనలకు పిలుపునిచ్చారు.విద్యార్థుల బహిష్కరణను రద్దు చేయాలి.క్యాంపస్ ప్రాంగణాలు మరియు విద్యా సంస్థలలో కాషాయీకరణను ఆపాలని, విద్యార్థులు మరియు విద్యాసంస్థలపై ఆర్‌ఎస్‌ఎస్/సంఘ్ పరివార్ అనుబంధ శక్తుల దాడులు, బెదిరింపులు మరియు హింసను అరికట్టాలి, వర్శిటీలను భావప్రకటనా స్వేచ్ఛకు ప్రజాస్వామ్య వేదికలుగా పరిరక్షించాలి, విద్యాసంస్థలలో అధికార పదవులకు సంఘ్ పరివార్/RSS-అనుబంధ అధికారుల నియామకాలను నిలిపివేయండి, దేశంలో ఎన్నికలు జరగని అన్ని క్యాంపస్‌లలో విద్యార్థి సంఘ ఎన్నికలను నిర్వహించండి. వికసిత్ భారత్ విద్యా అధికార్ బిల్లు, 2025ను ఉపసంహరించుకోవాలి.

జాతీయ విద్యా విధానం (NEP) 2020ని ఉపసంహరించుకోవాలి.క్యాంపస్‌లలో సైనికీకరణ మరియు నిఘాను ఆపండి. విద్యా సంస్థల ప్రైవేటీకరణను ఆపండి! వంటి డిమాండ్ లతో ఉద్యమిస్తున్న విద్యార్థులు అక్టోబర్ 27 నాడు దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడంతో అనేక వర్శిటీలలో సంఘీభావ కార్యక్రమాలు జరిగాయి.

అదేవిధంగా సెప్టెంబర్ లో ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటి బాంబే విద్యార్థి సాహిల్ మృతికి కారణమైన ప్రొఫెసర్ సూర్యనారాయణ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఐఐటి బాంబే డైరెక్టర్ ను విచారించాలని డిమాండ్ చేస్తూ అతని తల్లిదండ్రులు, దళిత హక్కుల కార్యకర్తల ఆధ్వర్యంలో ముంబైలోని ఆజాద్ మైదానంలో 21 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనలకు దళిత బహుజన సంఘాలు, విద్యార్థులు మద్దతు తెలిపారు.ఆ తర్వాత తమ నిరసనను ఐఐటీ బాంబే గేట్ వెలుపలికి మార్చారు. అక్టోబర్ 25న ముంబైలోని చైత్యభూమి వద్ద సాహిల్‌కు న్యాయం చేయాలని క్యాండిల్ మార్చ్ చేపట్టిన సుమారు 140 మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్తలను ముంబై పోలీసులు అనుమతి లేదనే నెపంతో అదుపులోకి తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో విద్యార్థులు హక్కులు భావ ప్రకటనా స్వేచ్ఛ కనీసం అమలుగాక పోవడంతోనే ఈ ఆందోళనను కొన సాగిస్తున్నారు. ఈ పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.విద్యార్థులు రాజ్యాంగ బద్ధంగా నిరసన తెలిపితే దేశ వ్యతిరేక చర్యలుగా భావిస్తూ విద్యార్థులపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న ఎన్డీఏ సర్కారు, బల ప్రయోగంతో విద్యార్థులను అణచివెయ్యాలని  చూస్తున్నప్పుడల్లా విద్యార్థులు ఉద్యమాలతో మరింత ముందుకు వస్తున్నారు. ఈ ఆందోళనలకు మద్దతు తెలుపుతూ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను మేధో చర్చా కేంద్రాలుగా- సమాజాన్ని మార్చే విద్యాలయాలు గా, సమస్యలు లేని స్వేచ్ఛాయుత వాతావరణం అక్కడ విలసిల్లేలా మనం అందరం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

– కోట ఆనంద్, విద్యార్థి నాయకులు.

– ఫోన్: 8712352122

Leave a Reply